సేద్య విధానాలు – శ్రేష్టమైన విధానాలు – నిర్ధారించే కొలమానాలు ఏమిటి ?

దిగుబడి, పోషక విలువలు, ఆదాయంతో పాటు వ్యవసాయాధారిత రైతు కుటుంబం మరెన్నో విధాలుగా లబ్ధి పొందడానికి పర్యావరణ అనుకూల వ్యవసాయ విధానాలు తోడ్పడతాయి. అందువల్ల పర్యావరణ హితమైన సేద్య విధానాలను ఖరారు చేసే సమయంలో మనం విభిన్నమైన కొలమానాలను పరిశీలించాల్సి ఉంటుంది. అలాంటి విభిన్నమైన కొలమానాల ప్రాతిపదికగా ఆలోచిస్తే పర్యావరణానికి శ్రేయస్సు కలిగించే విధానాలు రైతులకు కూడా ఉపయోగపడతాయని గుర్తించినందుననే భారత దేశంలోనూ, పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్ లలో ఇలాంటి పర్యావరణహితకరమైన సేద్య విధానాలనే రైతన్నలు అనుసరిస్తున్నారు.

వ్యవసాయ-పర్యావరణం అన్నది చాలా సంక్లిష్టమైనది. చెట్టూచేమలతో దట్టంగా ఉన్న కీకారణ్యంలోకి చూసినప్పుడు అక్కడ లభించే అంతులేని ఆహార పదార్థాల సమృద్ధి, వైవిధ్యం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే దాని వెనుక చాలా సరళమైన మౌలిక సూత్రం దాగి ఉంది. ఆ సూత్రం మరేదో గొప్ప విషయం కాదు. జీవజాలం మధ్య కాలప్రభావం లేకుండా నిరంతరం కొనసాగుతున్న సహకార భావనలే. విభిన్నమైన జీవ జాలం మధ్య పరస్పరం అవిభేద్యమైన సహకార భావనలు నిలిచి ఉన్నాయి. ఆ కారణంగానే జనాభాకు అవసరమైన ఆహార లబ్ధి, ఉత్పత్తి లభిస్తున్నది. అందుకు కీలకమైన సహకారం కారణంగానే అడవుల్లో పెరిగే ఆహారం పొరలు పొరలుగా అంచెలంచెలుగా అన్ని జీవాలకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగేందుకు బయటి శక్తుల ప్రభావం కానీ, బాహ్య ప్రపంచంలో జరిగే మార్పుల ప్రభావం కానీ ఏ విధంగానూ కారణం కాదు. ఇక్కడ గమనించవల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం చాలా పటిష్టంగా చేసుకున్న వ్యవసాయ విధానాలు మొత్తం సాధించలేని దిగుబడి ఫలితాలను అడవులు ప్రసాదిస్తున్నాయి.

వ్యవసాయ-పర్యావరణ విధానం పూర్తిగా ప్రకృతి సహజమైనది. ప్రకృతి అనుసరించే పరస్పర సహకారం, పునర్నిర్మాణం, బహుళ అంతస్థులలో రూపుదిద్దుకున్న సమన్వయ స్వరూపం, మరెన్నో జీవ సంతతుల మధ్య, వైవిధ్యాల మధ్య నిలిచి ఉండే సమీకృత వ్యవస్థ అది. ఆ   సూత్రంపైనే ఆధారపడి అది సురక్షితంగా ముందుకు కదులుతూ ఉంటుంది.

సుస్థిర సమీకృత వ్యవసాయ వ్యవస్థ (సస్టెయినబుల్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్) కింద బయోఫార్మ్ ప్రాజెక్టును దేశవ్యాప్తంగా మాత్రమే కాక నేపాల్, బంగ్లాదేశ్ సహా 9500 వ్యవసాయ క్షేత్రాలలో అమలు చేయటం జరిగింది. వ్యవసాయాన్ని సుస్థిర జీవనోపాధిగా తీర్చిదిద్దేందుకు దిగువ వివరించిన మూడు ప్రాథమిక సూత్రాలను ప్రాతిపదికగా  తీసుకుని అమలు చేయడం జరిగింది.

ఎ. పంట మార్పిడి విధానం అనుసరిస్తూ మిశ్రమ/అంతర/విరామ పంటల సాగును సమ్మిళితమూ, సమన్వయపూరితమూ అయిన సాగు విధానం పాటించడం. క్రమానుసారంగా సమన్వయంతో పంటల సాగు ఇందులోని కీలక అంశం.

బి. ఉత్పాదక సామర్థ్యం ఉన్న సేద్య వ్యవస్థలో బహుళ అంచెలలో సహకార సూత్రం పరిధిలో రీసైక్లింగ్ ప్రక్రియ అనుసరణ.

సి. వ్యవసాయ క్షేత్రంలో వైవిధ్యం ప్రోత్సహిస్తూ ఇంధనాన్ని రీసైక్లింగ్ చేయటంలోనూ, సహకార సూత్రం సక్రమంగా పాటించటం అన్నది అప్రయత్నంగానే జరగటం.

సవాలుగా మారిన కొలమానాలు

ఉత్పాదనకు సంబంధించి ఆర్థిక అంశాలకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వరి సాగు విషయంలో ఉత్పత్తి, ఉత్పాదకతలను అంచనా వేసేందుకు కేవలం దిగుబడిని మాత్రమే లాభాలకు ప్రాతిపదికగా పరిగణించినట్లయితే తేలికగానే కనిపించవచ్చు. అయితే పర్యావరణ వ్యవసాయంలో వరి దిగుబడిని ఒక కొలమానంగా  తీసుకోవడం సరికాదు. ఎందుకంటే వరి గడ్డి, వరి పొట్టు, ఆకు పెంట, నీటి వాడకం కారణంగా ఉత్పత్తి అయ్యే రకరకాల క్రిమికాటకాలు (ఇవి సేద్యగాళ్లకు చాలా ఉపయోగకరం.) ఇంకా పశువులకు మేతగా ఉపయోగపడే మరికొన్ని కూడా ఉత్పత్తి అవుతాయి. వరి పొట్టు వంట చెరకుగా ఉపయోగపడుతుంది. ఇంక భూసారం కాపాడేందుకు అనువైన ఆకు పెంట తయారుచేయవచ్చు. అనుబంధ ఆహారంగా ఉపయోగపడే చేపలు వరి సాగులో ఉపయోగించే నీళ్లలో పెరుగుతాయి. అంతేకాక వరి సాగు చేసిన పంట పొలాల్లో భూ గర్భ జలాలను పెంపొందించడంలో కీలక పాత్ర వహిస్తాయి. అందువల్ల పర్యావరణ సేద్యం గురించి మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి.

అందువల్ల మనం ఉత్పాదకతను లెక్క కట్టడం ఎలా? వరి సాగు ప్రభావంతో నీటి వనరుల సంరక్షణ, జీవ వైవిధ్యం కాపాడటంలో కలిగే ప్రయోజనాలు గుర్తించడం ఎలా ? విశ్లేషణాత్మకమైన మన మన పరిమితులలో ఒక తోటలో చేపట్టే అంతర్ పంటల ప్రయోజనాలను లెక్కకట్టలేం. అంతర్ పంటల పేరుతో 40 రకాల పంటలను పండిచడం సాధ్యమవుతుంది. ప్రతీ రోజూ అవసరమైన ఆహార పదార్ధాలను ఏడాది పొడవునా సమకూర్చడం సాధ్యమవుతుంది. మన సూచికలు ఎన్. పీ, కే అన్న పరిధులను కానీ, సేంద్రీయ కర్బనం లెక్కల్లో మాత్రమే భూ సారాన్ని లెక్కకట్టగలుగుతాయి. అంతేకాని మొత్తం వ్యవసాయం మొత్తాన్ని ఒక వ్యవస్థగా తీసుకుని దాని పూర్ణారోగ్యం గురించి అంచనా వేయటానికి ఉపకరించవచ్చు. ఎందుకంటే వ్యవసాయం అనేది ఒక సంక్లిష్టమైన లెక్కలకు అందని  వ్యవస్థ.

సజీవ వ్యవసాయ ప్రయత్నాలు (బయో ఫార్మ్ ప్రాజెక్టు) వ్యవసాయానికి అనుబంధంగా సాగే వివిధ ఉత్పత్తుల గురించి, సామాజిక, పర్యావరణపరంగా, ఆర్థిక పరంగా వాటి ప్రభావాలను ఏక కాలంలో అంచనా వేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కచ్ఛితమైన నిర్ణయాలకు రావడానికి మూడేళ్ల పాటు నిర్వహించిన ప్రయోగాలు చాలా స్వల్పమే అనిపించవచ్చు. కానీ, ఫలితాలు ఏ దిశగా సాగుతున్నదీ గుర్తించేందుకు ఇవి చాలు. కమ్యూనిటీ పర్యవేక్షణలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఫలితాల తీరును లెక్కకట్టడం జరిగింది.

ప్రతిఫలం లెక్కించే విధానం

ఏ కార్యక్రమం అమలు తీరును నిర్ధారించాలన్నా కమ్యూనిటీ పర్యవేక్షణ అన్నది సరైన విధానం. ఈ విధానంలోనే అవసరమైన సమయంలో అవసరమైన మార్పులను మధ్య మార్గంలోనే ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాక, చక్రాకృతిలోని డయాగ్రామ్ సిద్ధం చేసి రైతుల భాగస్వామ్యంతో చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలకు తగినట్టుగా సిద్ధంచేయడం జరిగింది. ఇందుకోసం పర్యావరణ సేద్య సూత్రాలను అనుసరిస్తూ, రైతులు తమ లక్ష్యాలను తామే నిర్ణయించుకునేందుకు, వాటిని స్వయంగా అధ్యయనం చేసేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ చక్రాకృతిలోని డయాగ్రామ్ ఆధారంగా రేటింగ్ / స్కోరింగ్ ను తమకు తామే గుర్తించడం సాధ్యమవుతుంది. ఇందుకు గానూ, పది కొలమానాలను నిర్దేశించడం జరిగింది. అవి …

  1. గ్రూప్ / సహాకార పద్ధతి … బృందాలుగా లేక క్లస్టర్ గ్రూపులుగా, ఏర్పడిన రైతన్నలు ఆయా సమష్టి కార్యకలాపాలలో ఏ మేరకు చురుగ్గా పాల్గొంటున్నారన్న అంశం మొదటి ప్రాతిపదిక. దీని ప్రకారం, ఉమ్మడి భూములలో సాగు కార్యకలాపాలలో వారి ఉత్సాహాన్ని గమనిస్తారు. ఒక గ్రూపు మొత్తం పనితీరును సమష్టిగా వారు చేపడుతున్న కార్యకలాపాలను బట్టి అంచనా వేస్తారు.
  2. పంట పొలంలో నీటి తేమను కాపాడేందుకు తీసుకుంటున్న సమష్టి కార్యక్రమాలు. ఉమ్మడి భూములలో నీటి తేమను కాపాడేందుకు వారు కలిసికట్టుగా తీసుకుంటున్న చర్యలు – పొలం గట్లు నిర్మించడం, వర్షపు నీటిని నిల్వచేయడం, చేలల్లో పేరుకున్న చేత్తా చెదారం, కుళ్లిన ఆకులు వగైరా వ్యర్థ పదార్థాలను ఉపయోగించుకుంటున్న తీరుతెన్నులు, కంపోస్ట్ ఎరువుల వినియోగం – తయారీ, అర్థచంద్రాకారంలో పొలంగట్టు నిర్మించడం, దుక్కి దున్నవలసిన అవసరం లేకుండా సేద్యం చేయడం, డైమండ్ ఆకారంలో భూమిని చదును చేయడం, నేలను ఒకటికి రెండు సార్లు తవ్వి అనువైనదిగా చదును చేయడం, కీటకాలను నాశనం చేయగల మొక్కలను పెంచడం, వలయాకారంలో భూమిని సిద్ధం చేయడం వంటివి పరిశీలించడం జరుగుతుంది.
  3. అనుబంధ వ్యవస్థల సంఖ్య … సేద్యపు పనులలో అనుసరించే వివిధ రకాలైన అనుబంధ వ్యవస్థల సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు బయో డైజెస్టర్, కోళ్ల పరిశ్రమ నిర్వహణ, పశుపోషణ, చెట్లు పెంచడం, పంటల ఎంపిక, చేపల పెంపకం వంటివి రైతన్నలు ఎంతవరకు అనుబంధంగా చేపడుతున్నారనే అంశం కూడా పరిశీలిస్తారు.
  4. అనుబంధ వ్యవస్థల ఆధారంగా సేద్యం పనుల్లోకి మళ్లిస్తున్న ఇతర వనరులు ఏమిటి, ఎంత వరకూ అన్న అంశాల అధ్యయనం. వివిధ అనుబంధ వ్యవస్థలను సమన్వయపరుస్తూ, వాటి మధ్య ఒక సరైన అనుసంధానం ఏర్పడిందా లేదా అనే అంశం.
  5. బయో డైజెస్టర్ల సంఖ్య … ఇందులో ముందుగా చెప్పుకోవలసిన అంశాలు – బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు, వెర్మి కంపోస్ట్ ఎరువుల తయారీ విభాగాలు, కంపోస్ట్ తయారీకి తగిన ఏర్పాట్లు, ద్రవరూపంలో ఎరువుల ఉపయోగం, పెరటి ఎరువుల వినియోగం, ఇంకా ఆకులు, అలములను ఎరువులుగా ఉపయోగిస్తున్న తీరు.
  6. పంటల సాగులో వైవిధ్యం – పంటలను పండించేందుకు అనుసరిస్తున్న టెక్నిక్ లు… పండించేందుకు ఎంపిక చేసిన పంటలలో ఉన్న వైరుధ్యాలను గమనించడం అంటే వారు సాగు చేయ తలపెట్టిన పంటల్లో పండ్లు, కాయగూరలు, దుంపలు, చిరు ధాన్యాలు, ఔషధ మొక్కలు, ఆకు కూరలు, ట్యూబర్ తరహా మొక్కలు, సుగంధ ద్రవ్యపు మొక్కలు మొదలైన వాటిలో ఏయే వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. ఇక పంటలను పండించేందుకు అనుసరిస్తున్న తీరు విషయంలో మిశ్రమ పంటలు, అంతర్ పంటలు, పంటల రొటేషన్, విరామ పంటలు మొదలైనవి పరిశీలనకు వస్తాయి.
  7. సంపాదించుకున్న శిక్షణ, నైపుణ్యం … ఒక రైతుకు శిక్షణ ఇవ్వడంలో ఏడాది కాలంలో ఏయే అంశాలపై వారికి అవగాహన కల్పించారనేది పరిశీలనకు వచ్చే వాటిలో మరో ముఖ్యమైన అంశం. సాధారణంగా రైతుల క్షేత్ర స్థాయి పాఠశాలల్లో వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. వాటిలో ముఖ్యమైన కొన్ని అంశాలు … ఒత్తిడిని జయించడం, జీవనోపాధులను ఎప్పటికప్పుడు మార్చుకోవడం, వనరుల సేకరణ, సామర్థ్యం పెంపు విధానాలు. అందుకు అనుగుణంగా – 1. వ్యవసాయ ప్రణాళికలను సిద్ధం చేసుకునే నేర్పు, 2. భూసార రక్షణకు అవసరమైన పోషకాల గురించిన అవగాహన, 3. నీటి వనరుల సక్రమ వినియోగం, 4. ఇండ్లలో లభించే కొద్దిపాటి స్థలంలోనూ, పొలంలోనే కొంత స్థలంలో తోటల పెంపకం, 5. పెరళ్లలోనే కోళ్ల పరిశ్రమను చేపట్టడం, అక్కడే వాటికి అవసరమైన మేతను సిద్ధం చేసుకోవడం, 6. పశు పోషణ, అందుకు అవసరమైన మేత లేదా దాణాను సమకూర్చుకోవడం, 7. పంట పెరిగే దశలో చీడపీడలు, వ్యాధుల నుంచి రక్షణకు అనుసరించే మార్గాలు, 8. మొత్తం గ్రూపులోని అందరి ప్రయోజనాల కోసం చేపడుతున్న చర్యలు.
  1. మార్కెట్ నుంచి రైతు కుటుంబానికి అవసరమైన కూరగాయలు, ప్రోటీన్ పదార్థాలు, ఇంకా వారికి కావసిన సమతుల్య ఆహారం కోసం కొనుగోలు చేస్తున్న వాటి వివరాలు.
  2. మార్కెట్ నుంచి వారు తమ వ్యవసాయ అవసరాల కోసం సమకూర్చుకుంటున్న ముడి సరుకుల వివరాలు
  3. ఆర్థిక అవసరాల కోసం వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకుంటున్నట్లయితే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు.

పర్యావరణ సేద్యం అంటే వాతావరణంలో మార్పులకు తగినట్టుగా సాగు చేపట్టడం ముఖ్యమైనది. ఈ విధానంలో రైతులకు వాతావరణంలో మార్పులకు తగినట్లుగా ఆదాయం సంపాదించే ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకులాట సమస్య తప్పుతుంది.  ఆ విధంగా వారి జీవితంలో ఒడిదుడుకులు తగ్గిపోతాయి

పైన ప్రస్తావించిన 10 అంశాలలో (వాటిని పది పిక్చర్ రూపంలోని కార్డులుగా రూపొందించారు) వాటిని పరిశీలిస్తూ రైతులు సున్నా నుంచి 5 వరకూ  (అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకూ) మార్కులు వేసే అవకాశం కల్పిస్తారు. దానిని పైన ఇచ్చిన డయాగ్రామ్ తో పోల్చి చూస్తారు. ఆరు నెలల తర్వాత మరోసారి ఇదే రకంగా మార్కులు వేసేందుకు అవకాశం ఇస్తారు. ఈ విధంగా మార్కులు వేయడంలో జరిగే చర్చకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఆ సమయంలో ప్రస్తావనకు వచ్చే అంశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. దానికి చాలా ప్రాధాన్యత కూడా ఉంది. జరిగిన లోటుపాట్లు, సాధించిన సత్ఫలితాలు వెలుగులోకి వస్తాయి. వాటికి కారణాలను గురించి లోతైన అవగాహనకు దారితీస్తుంది. ఒక రకంగా ప్రణాళికలో చేసుకోవలసిన మార్పులను ఆ క్రమంలో గుర్తించవచ్చు.  వాటిని భవిష్యత్తులో అనుసరించవలసిన చాలా అంశాలు గమనానికి వస్తాయి. ఈ ప్రయత్నం రెండు స్థాయిలలో జరుగుతుంది. మొత్తం గ్రూపు పరిధిలోనూ, వ్యక్తిగతంగానూ చేపట్టవలసి ఉంటుంది.

అంతేకాదు, రోజువారీ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను నమోదు చేసే విధానం కూడా వారికి నేర్పడం వల్ల ఆ వివరాలు ఎప్పటికప్పుడు రికార్డు రూపంలో భద్రపరచడం సాధ్యమవుతోంది. ఆ తర్వాత వాటిని సమగ్రంగా పరిశీలించి విశ్లేషించడం సాధ్యం అవుతోంది. వారి ఆదాయ వివరాలు, వారి జీవనశైలికి సంబంధించిన వాస్తవాలు గుర్తించవచ్చు. ఆ విధంగా పర్యావరణ సేద్యం ప్రయోజనకరంగా ఉండేందుకు వీలుగా పైన పేర్కొన్న కొలమానాల పరిధిలో లెక్కకట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జార్ఖండ్లోని దేవగఢ్, రాంచీ జిల్లాల్లో అమలులో ఉన్న విధానాల గురించి, పశ్చిమ బెంగాల్ లోని బీర్భమ్, బంకూరా, పురులియా, కొండ ప్రాంతాల రైతులు నేపాల్ లోని చిత్వాన్, చిట్టగాంగ్ కొండ ప్రాంతాలలోని విధానాల గురించి, బంగ్లాదేశ్ లోని కొండ ప్రాంతాల గురించి అధ్యయనం చేస్తూ ఉంటారు. అధ్యయన ఫలితాలను దిగువ టేబుల్ లో చూడవచ్చు.

వ్యవసాయ క్షేత్రంలో వైవిధ్యం లెక్కించే విధానం

పర్యావరణ సేద్యంలో వైవిధ్యం అనే అంశానికి చాలా ప్రాధాన్యత ఉంది. పైన ప్రస్తావించిన వైవిధ్యం గురించిన అనుబంధ వ్యవస్థ ప్రాధాన్యత ఏమిటంటే ఏడాది మొత్తంలో వైవిధ్యంతో పాటు రైతుకు వచ్చే ఆదాయంలో కూడా వైవిధ్యం చోటు చేసుకుంటుంది. అదే ఏక పంట సాగు విధానంలో ఆదాయం ఆ ఒక్క పంటపైనే ఆధారపడుతుంది. అనుబంధ వ్యవస్థలలో పంట భూమి, తోటలకు కేటాయించిన భూమి, పౌల్ట్రీకి, పశుపోషణకు, చేపల పెంపకానికి  ఉద్దేశించిన భూమి, బయో డైజెస్టర్, అడవులు, ఉమ్మడి నేలలు, చెట్లు, విలువలను పెంపొందించే అనేక సమష్టి వ్యాపారలకు ప్రాధాన్యత ఉంటుంది. అనుబంధ వ్యవస్థలలో వైవిధ్యం (సున్నా నుంచి 4.5 వరకు లెక్కకడితే)సగటున 3.5 ఉంటుంది. ఇది ఇటీవల పశ్చిమ బెంగాల్ కు సంబంధించి 8 కి చేరింది. ఈ రాష్ట్రంలో నీటి వనరులు కీలక పాత్ర పోషించాయి. అదే విధంగా ఝార్ఖండ్, కొండ ప్రాంతాలలో నీటి వనరుల ప్రభావంతోనే అయిదు అనుబంధ వ్యవస్థల మధ్య స్థిరత్వానికి అవకాశం ఏర్పడింది. రబీ పంట కాలంలోనూ, నీటి కొరత ఉండే వేసవిలోనూ బయోమాస్ ఉత్పత్తి 2.54 వ్యవస్థల నుంచి సాధ్యమైంది. ఈ మార్పు దాదాపు 2014 నుంచి స్పష్టమవుతోంది. ఈ మార్పు ప్రభావం కారణంగా పంట కాలంతో సంబంధం లేకుండా ఝార్ఖండ్ లో 45 శాతం పంట పొలాల్లో దిగుబడి 1 నుంచి 3కు పెరిగింది. కొండ ప్రాంతాలలో ఇది 80 శాతం, పశ్చిమ బెంగాల్ లో 60 శాతం అదనంగా సంక్రమించింది. అన్ని చోట్లా రెండు అనుబంధ వ్యవస్థల పరిధిలో మార్కెట్ కు అవసరమైన బయోమాస్ లభించింది.

ఆదాయ పంపిణీ

ఒకటి కన్నా ఎక్కువగా అనుబంధ వ్యవస్థల ప్రభావం ఆదాయ మార్గాల పంపిణీకి దారితీసింది. పంటలు, కాయగూరల సాగు రూపంలో రైతు కుటుంబానికి 65 శాతం నుంచి 85 శాతం వరకూ పెరిగింది. ఇంతవరకూ ఆ రైతుల భూములన్నీ రుతువులపై ఆధారపడి ఉండేవి. కేవలం మూడేళ్ల వ్యవధిలో వివిధ కార్యక్రమాల ద్వారా ఆ రైతు కుటుంబాలు వాతావరణం మార్పులపై ఆధారపడి జీవించవలసిన అవసరం లేకుండా పోయింది. పశుపోషణకు, పౌల్ట్ర పరిశ్రమకు, చేపల పెంపకానికి ఇంకా ఇతర రకాలైన ఆదాయ మార్గాలు వారికి తోడుగా నిలిచాయి. ఉదాహరణకు, కొండ ప్రాంతాలలో 2012లో ఖరీఫ్ సీజన్ సమయంలో వారి ఆదాయం పంపిణీ దిగువ వివరించిన తీరులో ఉంది. పంటల ద్వారా 32.26 శాతం, 13.12 శాతం కాయగూరల ద్వారా, 19.77 శాతం పశుపోషణ ద్వారా, 1.32 శాతం పౌల్ట్రీ ద్వారా, 14.91 శాతం చేపల పెంపకం ద్వారా, ఇంకా 18.60 శాతం అదనపు విలువలను ఇచ్చే ఉత్పాదనలు రైతులకు ఆదాయం చేకూర్చిపెట్టాయి. కాలంతో పాటు పశువుల పోషణ, పౌల్ట్రీ పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ లో చేపల పెంపకానికి హెచ్చు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 34 శాతం వరకూ రైతులకు అదనంగా ఆదాయం లభిస్తోంది. ఈ కారణాల వల్లనే పర్యావరణ అనుకూల సేద్యం అనుసరించినప్పుడు వాతావరణ మార్పుల ప్రభావం స్వల్పంగా ఉంటుందని నిర్ధారణ అయింది. వాతావరణ అనుకూలపై ఆధారపడవలసిన పరిస్థితిని ఇది చాలా వరకూ తగ్గిస్తుంది. అయినా ఆదాయానికి లోటు ఉండదు. ఆ రకంగా రైతుల జీవనోపాధులకు కొరత రాకుండా ఆదాయం సమకూర్చడానికి పర్యావరణ సేద్యం తోడ్పడుతుంది.

పరిమితమైన సమాచారం కారణంగా ఆదాయం పెరుగుదలకు, అనుబంధ వ్యవస్థల సంఖ్యకు ఉన్న లింక్ ను అంచనా వేయడం సాధ్యం కాకపోయినా, ఆదాయం పంపినీ విషయంలో మాత్రం ఏడాది పొడవునా సరిసమానంగా లభిస్తుందని తేలింది. ఫలితంగా నగదు కొరత కనిపించడం లేదు.

పంటల మార్పిడి కారణంగా ఆదాయంలో పెరుగుదల  నాలుగైదు పంటలను సాగుచేసినట్లయితే గరిష్టంగా 2 నుంచి 3 రెట్లు అదనపు ఆదాయం వస్తుంది. అదే ఇండ్లలోనే పెరళ్లలో కాయగూరలు సాగుచేసినట్లయితే సగటున ఈ పెరుగుదల 6 నుంచి 7 రెట్లు ఉంటోంది. వరి, గోధుమ, జొన్న, మినుములు వంటి పప్పుధాన్యాల , లెంటిల్ నూనె గింజలను (నైజర్, ఆవ, ఫ్లాక్ సీడ్ వంటివి), కాయగురల్లో బంగాళాదుంప, ఇతర రకాలను పంటల మార్పిడి విధానం లో సాగు చేయడం సాధ్యమవుతుంది. ఈ మొత్తం సాగు ఫలితంగా రైతు కుటుంబానికి వివిధ రకాలైన వైవిధ్యంతో కూడిన ఆహారం సమకూరుతోంది. ఈ తేడా కొండ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో కూడా తగినంత తేడా కనిపిస్తోంది. ఆహారంలో మెరుగైన పోషకాలతో పాటు సమృద్ధి చోటు చేసుకుంటోంది. ఎందుకంటే ఈ రకంగా మిశ్రమ సాగును నీటి వనరులు తగినంత లేని ప్రదేశాల్లో కూడా నిరంతరం ఎలాంటి విరామం లేకుండా సాగు చేయగలుగుతుండడమే కారణం. ఈ విధానంలో దాదాపు నీటి వసతి అంతగా లేని దాదాపు 650 హెక్టార్ల బీడు భూములను పంటల సాగుకు అనుకూల మయ్యేలా సారవంతం చేయడం సాధ్యమైంది. మరో 850 హెక్టార్లలో ఏక పంట సాగుకు వీలుగా మార్చడం జరిగింది. భూసారాన్ని ఇలా మార్చివేయడంలో పప్పు ధాన్యాల సాగు ఎక్కువగా తోడ్పడింది.

ఆహారంలో వైవిధ్యం

ఝార్ఖండ్ రాష్ట్రంలో 2014లో ఈ ఆహార వైవిధ్యం గురించిన ప్రయోజనం బాగా కనిపించింది. దాదాపు 70 శాతం మంది మహిళలు అయిదు వర్గాలకు చెందిన – బీన్స్, ఇతర గింజలు, వేరుశెనగ వంటి పప్పులు, పాడి పరిశ్రమ నుంచి లభించే పాలు, పెరుగు వంటివి, పౌల్ట్రీ ఆధారిత కోడిగుడ్లు, పండ్లు, కాయగూరలు వారి ఆహారం ఎక్కువ స్థానం సంపాదించుకుంటున్న విషయం స్పష్టమైంది. 2011 ప్రారంభంలో చాలా కుటుంబాలు కేవలం పిండి పదార్థాలు అధికంగా తీసుకునేవారు. ప్రధానంగా శాకాహారం అలవాటున్న ఈ రాష్ట్రంలో సాధించిన పురోగతిలో తేడా చాలా ఎక్కువగా మారిపోయింది.

అనుబంధ వ్యవస్థలలో పరస్పరం మిశ్రమ కృషి కారణంగా మరింత శక్తినిచ్చే పదార్థాలు, బయోమాస్ లభించడంతో ఈ పద్ధతిలో చేపట్టిన మొత్తం వ్యవసాయం ప్రయోజనకరమేనన్న వాస్తవం నిర్ధారణ అవుతోంది.

సాధారణంగా అనుబంధ వ్యవస్థల సంఖ్య పెరగినప్పుడే మొత్తం వ్యవస్థ పటిష్టంగా రూపుదిద్దుకోగలుగుతుంది. సగటున ఈ వివిధ వ్యవస్థల మధ్య అనుసంధానం 2011లో కేవలం 1 మారతమే కాగా, మూడేళ్ల వ్యవధిలో అది గరిష్టంగా 12కు చేరింది. పశ్చిమ బెంగాల్లో ఈ మార్పు అధికంగా ఉంది. అందుకు అక్కడి సమష్టి కుటుంబ సేద్యం కారణం అని చెప్పాలి. కొండ ప్రాంతాల్లో ఫలితాలు ఓ మోస్తరుగా ఉన్నాయి. అందుకు అక్కడ సమృద్ధిగా లభించే బయోమాస్ కారణం కావచ్చు. దీని కోసం అక్కడ రైతులు అదనంగా ఎలాంటి లింకేజీలను పాటించవలసిన అవసరం ఉండదు. అయితే బయోమాస్ రీసైకిల్ చేయడంలో అనుకోకుండా ఈ లింకేజీలకు చోటు లభిస్తోంది. సగటున ఇక్కడ రీసైకిల్ చేసే బయోమాస్ పరిమాణం – 2015 ఖరీఫ్ సీజన్ లో 7738 కిలోలు. బయో ఫార్మ్ అంటే జీవ సంబంధ వ్యవసాయంలో లభించే శకితనని కేలరీస్ లో లెక్కగట్టడం జరిగేది. కానీ ఈ సారి దానిని, సామాన్యులకు కూడా అర్థమయ్యేలా పూర్తిగా సరళతరం చేయడం జరిగింది.

ఈ విధంగా రీసైక్లింగ్ చేయడం వల్ల బాహ్య పరికరాల అవసరం చాలా మేరకు తగ్గిపోతుంది. బయోమాస్ రీసైక్లింగ్ ప్రక్రియ ఖరీఫ్ పంటకాలంలో మెరుగ్గా ఉంటుంది. పశ్చిమ బెంగాల్ లో ఈ లక్షణం కనిపించింది. సాధారణంగా రైతన్నలు బయోమాస్ ను రీసైక్లింగ్ చేయడం అంటే ఆవు పేడను సేకరించడం వరకే అనుసరించేవారు. బయో మాస్ ప్రాజెక్టు ఆచరణలోకి తీసుకువచ్చిన తర్వాత దాని అర్థమే మారిపోయింది. పంటల సాగు సమయంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలు, అన్ని పశువుల పేడ, మలమూత్రాలు, కోళ్ల ఫారమ్ లలో లభించే చెత్తచెదారం, పంట దిగుబడుల నుంచి లభించే వ్యర్థాలు, కలుపు తీసిన మొక్కలు మొదలైనవన్నీ బయో మాస్ గా గుర్తించడం జరిగింది. ఇక అలా సేకరించిన వ్యర్థాలను పోగుచేసి గుంతల్లో పిట్ కంపోస్టింగ్, బయో డంగ్ తయారీ, ఎన్ఏడిఈపీ కంపోస్టింగ్, వర్మీ కంపోస్టింగ్, ద్రవ రూప ఎరువుల తయారీ, కుళ్లబెట్టడం వంటి ప్రక్రియలను అనుసరిస్తున్నారు. ఈ రకంగా లభించే వ్యర్థాలను సద్వినియోగం చేసుకోని పక్షంలో వాటిని బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేయవల్సి వచ్చేది. లేదా పంట పొలాలకు అలాంటి ఉపయోగకరమైన ఎరువులకు కొరత ఏర్పడేది. పంట భూములు నిస్సారంగా మిగిలిపోయేవి.

ఝార్ఖండ్ లో 2012 నాటికి అక్కడి రైతులలో సుమారుగా 35 శాతం మందికి దాదాపు 50 శాతం వ్యవసాయ ముడి సరుకులు మార్కెట్ లలోనే కొనుగోలు చేయవలసిన పరిస్థితి  ఉండేది. ఇప్పుడు క్రమంగా పరిస్థితి మెరుగుపడడంతో వారిలో స్వయం సమృద్ధి ఏర్పడింది. ఇప్పుడు 5 శాతం మంది రైతులు 90 శాతం ముడిసరుకులను తమ సొంత వ్యవసాయ క్షేత్రాలలోనే సమకూర్చుకోగలుగుతున్నారు. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ లో మెరుగైన ఫలితాలు కనిపించాయి. వివిధ అనుబంధ వ్యవస్థల మధ్య ఈ రాష్ట్రంలో మెరుగైన లింకేజీ సాధ్యమైంది. దాంతోపాటే బయోమాస్ రీసైక్లింగ్ మెరుగుపడింది. కొంత వరకూ స్వయంసమృద్ధి కనిపిస్తున్నా ఇంకా చాలా చోట్ల అభివృద్ధి సాధించాల్సి ఉంది.

ఆహార రంగంలో స్వయంసమృద్ధి

ఆహార భద్రత పరంగా చూస్తే, ఇదివరకు చాలా రైతు కుటుంబాలు సమస్య ఎదుర్కొంటూ ఉండేవారు. వారికి అవసరమైన ఆహారం అందించడం పెద్ద సవాలుగా ఉండేది. దానిని ఎదుర్కొని వారికి మిగులు ఆహారం లభించేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 2013 నాటికి 48 శాతం మంది మిగులు స్థాయిని అందుకోగలిగారు.

బయోమాస్ ఉత్పత్తి

ఉత్పత్తి అంటే ఇదివరకు ఏక పంట నుంచి సాధించిన దిగుబడి అనే అర్థం వాడుకలో ఉండేది. సమీకృత వ్యవసాయ విధానం ప్రకారం రైతు పొలంలో పండిన అన్ని రకాల ఉత్పాదనలకు ప్రాధాన్యత లభిస్తుంది. పంట దిగుబడి రైతు కుటుంబానికి ఉపయోగపడడంతో పాటు మార్కెట్ లో విక్రయించి ఆదాయం రూపంలో లభిస్తుంది. అంతేకాక పశువులకు మేత అందిస్తుంది. వంట చెరకుగా ఉపయోగపడుతోంది. బయోమాస్ గా ఉపయోగపడుతోంది. కొండ ప్రాంతాలలో రబీ పంట కాలంలో (2013 నాటికి హెక్టారుకు 12000 కిలోలు), ఝార్ఖండ్ లో (హెక్టారుకు 9000 కిలోలు) బయోమాస్ రీసైక్లింగ్ జరుగుతోంది. ఖరీఫ్ కాలంలో పశ్చిమ బెంగాల్ లో ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇక్కడ హెక్టారుకు 8100 కిలోలు రీసైకిల్ చేయడం సాధ్యమవుతోంది. ఇక్కడ ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే భూమి నుంచి లభించే బయోమాస్ ఉత్పాదన 2012తో పోలిస్తే 2013లో తగ్గిపోయింది. అందుకు కారణం బహుశా భూసారం మెరుగుపడేకొద్దీ ఉపయోగించకుండా మిగిలిపోతున్న బయోమాస్ పెరుగడమే కావచ్చు.

కొన్ని పరిమితులు

కచ్ఛితమైన గణాంకాలు, సమాచారం లేకపోవడం వల్ల రైతు కుటుంబం తమ వ్యవసాయ క్షేత్రాలలో ఉత్పత్తి కోసం చేస్తున్న శ్రమశక్తికి విలువ కట్టడం సాధ్యం కావడం లేదు. అయితే ఒకొక్కరి శ్రమ గురించి వివరాలు సేకరించే కొద్దీ తెలుస్తున్న విషయం ఏమిటంటే పర్యావరణ అనుకూల సేద్యం చేయాలంటే శ్రమ శక్తిని చాలా ఎక్కువగా వినియోగించాల్సి ఉంటుంది. ఇది సహజంగా ఆ రైతు కుటుంబంలోని మహిళలపై  ఎక్కువ భారం, ఒత్తిడి ఉంటున్నాయి. ఎందుకంటే వ్యవసాయంలో భాగంగా పాడి పరిశ్రమ పనులు కూడా వారే చేయాల్సి ఉంటుంది. అందువల్ల మొత్తం కార్యక్రమంలో మహిళలపై పడే భారాన్ని దృష్టిలో ఉంచుకుని లింగవివక్షకు చోటు లేకుండా జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం కనిపిస్తోంది. అందులో భాగంగా కుటుంబంలోని సభ్యులందరికీ పని భారంలో సముచిత వాటా ఇవ్వడం కోసం ఆ కుటుంబ సభ్యులు తమ వ్యవసాయ పొలంలో తప్పితే మరెక్కడా వ్యవసాయ కూలీ పనులకు వెళ్లకుండా అడ్డుకోవడం అవసరం అనిపిస్తున్నది. ఇక్కడ గమనించిన విషయం ఒకటి ఉంది. ఈ తరహా వ్యవసాయం చేయడంలో అధిక మోతాదులో శ్రామిక శక్తి అవసరమవుతుందని చాలా మంది రైతులు అంగీకరించారు. వారు కూడా అదే ఆలోచన తెలియజేశారు.

ఆలోచనలో మార్పు తీసుకురావడం

ఆదాయానికి అతీతంగా పర్యావరణ సేద్యం ప్రభావం గురించి వివిధ కొలమానాల ప్రాతిపదికన లెక్కకట్టడం వల్ల రైతులు దాని ప్రయోజనాలను మెరుగ్గా అవగాహన చేసుకోగలిగారు. తమ వ్యవసాయ కార్యకలాపాలలో వైవిధ్యం ప్రవేశపెడితే కలిగే రపయోజనాలు వారు గుర్తించగలిగారు. వారి సామర్థ్యాన్ని పెంపొందించడంతో వారు విషయాలను అవగాహన చేసుకోవడంలో కూడా నేర్పు చూపించగలుగుతున్నారు. దానితో పాటే వారిలో  వారి ఆలోచనా ధోరణిలో కూడా మార్పు వచ్చింది. వైవిధ్యంతో కూడిన వ్యవసాయ విధానాలను అర్థంచేసుకుని ఆచరణలో పాటించగలుగుతున్నారు. అంతవరకూ వారు ఏక పంట కింద వరి సాగు చేసిన వాళ్లే కావడం గమనార్హం. రోజువారీ దినచర్యను డైరీల రూపంలో రాసి దాచుకునే వారు తాము సాధించిన పురోగతిని గుర్తించగలిగారు. సమాచార పంపిణీ కారణంగా వారికి సమాచార సేకరణలోనూ, విశ్లేషణలోనూ, అవగాహన చేసుకోవడంలోనూ భాగస్వామ్యం కలిగించడం సాధ్యమైంది. పంట చేనులో సంపాదించిన అనుభవ పరిజ్ఞానాన్ని తిరిగి ప్రయోజనకరంగా పంట పొలంలో ఉపయోగించడానికి ఇదే ప్రాతిపదికగా మారింది.

అన్షూమన్ దాస్
ప్రోగ్రామ్ మేనేజర్,
వెల్తుంగర్ లైఫ్ ఇండియా
e-mail : anshuman.das@welthungerhilife.de

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి 18, సంచిక 3, జూన్ ౨౦౧౬

 

 

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...