వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది ఔత్సాహిక పట్టణ తోటల పెంపకందారులకు  ఆదర్శంగా నిలిపింది.

ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, డా. రత్తన్ లాల్, అతని చర్చలలో వివిధ అధ్యయనాల ద్వారా దక్షిణాసియాను ఆహార అభద్రత హాట్ స్పాట్‌లలో ఒకటిగా ఎలా పరిగణించారు అనే విషయం గురించి మాట్లాడారు. 57% లేదా అంతకంటే ఎక్కువ దక్షిణాసియా జనాభా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోతున్నారు అని కూడా ఈ అధ్యయనాలలో నివేదించబడింది. నానాటికీ పెరుగుతున్న జనాభాతో ఆహార అభద్రత భారం రోజురోజుకీ పెరుగుతోంది.

ఆహార వ్యవస్థలను మరింత దృఢపరచడం, పట్టణ ఆహార సరఫరా గొలుసులను మెరుగుపరచడం, పెరటి తోటల  పెంపకాన్ని ప్రోత్సహించడం మరియు పట్టణ వ్యవసాయం అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టణ గృహ తోటలు ఇంటి చుట్టూ మెరుగైన సూక్ష్మ వాతావరణాన్ని అందించడమే కాక ఇంటి వినియోగానికి ఆరోగ్యకరమైన కూరగాయలను కూడా అందిస్తాయి. వాటిని పరిమిత స్థలాలలో సమర్థవంతంగా పెంచవచ్చు.

మిస్టర్ వర్గీస్ కేరళకు చెందిన వాయనాడు, పుల్పల్లి అను చిన్న పట్టణంలో ప్రముఖ వ్యక్తి. అతని ఆసక్తి మరియు ఉత్సాహం వలన వర్టికల్ గార్డెనింగ్ రంగంలో అతను ముందున్నారు.

Mr. వర్గీస్ కు 60సంవత్సరాల వయసు. వినయం మరియు  సృజనాత్మకత గల రైతు. తన ఇంటి ముందు మరియు వెనుక పెరటి భాగాలను ఉపయోగించి, అతను ప్రత్యేకమైన ఆచరణాత్మక నమూనాలను  విజయవంతంగా సృష్టించారు. అతని రేడియో మెకానిక్‌ సేవలు ఇరవై ఏళ్ల క్రితం ముగిసినప్పటినుంచి వ్యవసాయంలో ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం అతను క్యారెట్, క్యాబేజీ, బంగాళదుంప, కర్రపెండలం, సోపు, స్ట్రాబెర్రీ, మిరపకాయలు, చిలగడదుంప వంటి విభిన్న పంటలను వర్టికల్ గార్డెనింగ్ మరియు ఇతర ఆవిష్కరణల ద్వారా సాగు చేస్తున్నారు. Mr. వర్గీస్, మొదట్లో అతని పెరట్లో కొన్ని అలంకార మొక్కల్ని పెంచేవారు. కానీ అవి వారి కుటుంబానికి ఆహారం అందించలేకపోతున్నాయి అని భావించి  అతను కూరగాయలు పండించాలని నిర్ణయించుకున్నారు.

అతను వంటగది వ్యర్థాలను, ఎండిన ఆకులను మరియు వరి గడ్డితో పాటు ఎరువులను ఉపయోగించి మొక్కలు నాటుటకు అనువైన , సమర్థవంతమైన స్థలం వినియోగించి , పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించే వ్యవస్థలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు.

వర్టికల్ గార్డెనింగ్‌ నిర్మాణాలు

Mr.వర్గీస్ అనేక రకాలైన పెరటి మొక్కల పెంపక విధానాలను వినూత్నమైన పద్దతులలో అభివృద్ధి  చేశారు.

GI నెట్ మరియు PVC పైప్ నిర్మాణ వ్యవస్థ:

అతను ఇంటి ముందు ప్రాంగణంలో క్యారెట్, క్యాబేజీ, మిరప, క్యాప్సికమ్,  చిలకడదుంప, వంగ  వంటి కూరగాయలు మరియు  స్ట్రాబెర్రీను  ఈ నిర్మాణాన్ని ఉపయోగించి పండించారు. దాదాపు 24 మొక్కలను ఒక నిర్మాణంలో నాటవచ్చు. ఈ నిర్మాణం ఒక స్థూపాకార టవర్ వ్యవస్థ వంటిది. స్థూపాకార టవర్ వ్యవస్థకు చక్కటి ధృడమైన ఫైబర్/వస్త్రం లేదా షేడ్ నెట్‌ వాడబడినది , ఇది GI నెట్ (2 అంగుళాల ఖాళీలు) ద్వారా కప్పబడి ఉంటుంది. ఈ స్థూపాకార నిర్మాణం మొక్కలు పెరుగుటకు అనువయిన మట్టి మరియు ఇతర సేంద్రియ మిశ్రమముతో పొరలుగా నింపబడి ఉంటుంది మరియు దిగువన నీటి లీకేజీని నివారించడానికి వరి గడ్డి లేదా ఎండిన ఆకులు వేయబడతాయి.

దీని తర్వాత వంటగది వ్యర్థాలను, కొంత మట్టి మరియు పేడతో ప్రతి పొరను కుదించి వేయాలి . నీటిని సరఫరా చేయడానికి దీని నిర్మాణం మధ్యలో 3.5 అంగుళాల దూరంలో రంధ్రాలతో కూడిన ఒక సన్నని స్థూపాకార పైపును కలిగి ఉంటుంది.  ప్రస్తుతం, Mr. వర్గీస్ బిందు సేద్యం ద్వారా నిర్మాణంలోని వివిధ భాగాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని నిర్మాణాలను తెరవడానికి మరియు మూసివేయడానికి జిప్ లను  కూడా జోడించారు. తద్వారా ఇది దాదాపు 10-15 సంవత్సరాల వరకు ఉపయోగించవచ్చు.

కూరగాయల నారు నాటడానికి PVC పైపుపై  తగిన దూరంలో అమర్చబడి ఉంటాయి. మొక్కలు పరిమాణం పెరిగేకొద్దీ అదనపు పైపులు మొక్కలు పెరుగుదలకు అనుకూలంగా అమర్చబడతాయి. పైపులలో మట్టి మరియు సేంద్రియ ఎరువుల మిశ్రమం (ఆవుపేడ), వేప పిండితో నిండి ఉంటాయి . మొక్కలు  నీరు మరియు పోషకాలను సులభంగా గ్రహించడంలో ఈ మిశ్రమం సహాయపడుతుంది.

ఈ విధానంలో  PVC పైపును అటాచ్ చేయకుండా సమర్ధవంతంగా  స్ట్రాబెర్రీని పండించవచ్చు. ఈ నిర్మాణంలో తగినంత దూరంలో రంధ్రాలను పెట్టటం వలన దీని తీగలను నిర్మాణం అంతటా పాకించవచ్చు.

ఈ విధంగా  స్థలాన్ని సమర్థవంతముగా వినియోగించడం వలన  చీడ పీడలే  కాకుండా, తగినంత దూరం పాటించడం కారణంగా తెగుల వ్యాప్తి మరియు కలుపు సమస్యకు అవకాశం  ఉండదని మిస్టర్ వర్గీస్ గర్వంగా చెబుతారు.

తమలపాకు కలప నిర్మాణ వ్యవస్థ: మునుపటి విధానం మాదిరిగానే ఈ విధానం కూడా పర్యావరణానికి అనుకూల మరియు చవకైనది.మునుపటి విధానానికి ప్రత్యామ్నాయంగా పరిగణించవచ్చు. ఈ విధానంలో తమలపాకు (అరెకా గింజ) చెక్క మరియు ఎండిన ఆకులను , వస్త్రం మరియు GI నెట్ కు బదులుగా వాడుతారు . ఈ నిర్మాణం పలచని  చెక్క పలకల ద్వారా అభివృద్ధి చేయబడింది. ఒక స్థూపాకార ఆకారాన్ని ఏర్పరచడానికి ఒకదానితో ఒకటి జతచేయబడి ఉంటాయి. ఒక వైపు  గడ్డి, ఎండిన ఆకుల తో నింపాలి. తర్వాత ఇదే పద్ధతిలో, మట్టితో పాటు వంటగది వ్యర్థాలు మరియు సేంద్రియ ఎరువు, వేపపిండి మొదలైనవి లోపల నింపిన  తర్వాత ఉపరితలంపై రంధ్రాలు  చేసి బంగాళాదుంప కళ్ళు (10 టవర్లలో సుమారు 120 కళ్ళు నాటవచ్చు) మొలకెత్తడానికి అనువుగా నాటడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ విధమయిన  నిర్మాణంలో ఎక్కువ బంగాళదుంప మొక్కలు మరియు మంచి దుంప దిగుబడికి సౌకర్యవంతముగా ఉంటుంది.   పోషణ కోసం సకాలంలో అతను మొక్కలకు సేంద్రియ ఎరువును, జీవామృతం మరియు వేపపిండి సరఫరా చేస్తారు. మిస్టర్ వర్గీస్  ఆసక్తికరంగా నిర్మాణం పై భాగంలో  మిరప మరియు టమోటాల మిశ్రమపంటలను విజయవంతంగా ప్రయత్నించారు. అతని యొక్క ఈ  ప్రయత్నం మొక్కల మరియు పంట దిగుబడులపై  ప్రతికూల  ప్రభావయం చూపలేదు.

PVC పైపుతో నిర్మాణ విధానం:  ఇది ఒక సాధారణ నిర్మాణం.  మిస్టర్ వర్గీస్ క్యారెట్, సోపు, మిరప మొదలైన పంటలకు PVC పైపు వియోగం ద్వారా వర్టికల్ గార్డెనింగ్‌ను సాగుచేశారు. సాగు కోసం 6 అంగుళాల వ్యాసం కలిగిన PVC పైప్ కు తగినంత దూరంలో  వేడిచేసిన ఇనుప కడ్డీ ద్వారా మొక్కలు నాటడం కోసం అనుకూలమైన రంద్రాలు చేస్తారు. దాదాపు 16 నుంచి 20 మొక్కలు నాటుటకు ఈ విధానం సౌకర్యవంతంగా ఉంటుంది. మొక్కల పరిమాణం పెరిగేకొద్దీ అదనపు పైపుల ద్వారా మొక్కల పెరుగుదలకు అవసరమైన వాతావరణం కల్పించబడుతుంది. నీటిపారుదల కొరకు (సహజంగా లేదా బిందు సేద్యం ద్వారా) ఈ నిర్మాణంలో ఒక ప్రధాన పైపుకు చిన్నచిన్న అవుట్‌లెట్‌ జోడించబడి ఉంటాయి.

Mr. వర్గీస్ కొంతకాలంగా వర్టికల్ గార్డెనింగ్‌లో PVC మరియు GI విధానంలో సాగుచేస్తున్నారు. అతను పాత PVC పైపులు మరియు GIనెట్ ను అవసరమైనపుడు ఒక వెల్డర్ సహాయంతో రీసైకిల్ చేస్తారు. అవసరాన్ని బట్టి అతను కూడా వర్టికల్ గార్డెనింగ్‌ నిర్మించడానికి కొత్త PVC పైపులు లేదా GI నెట్‌ని కొనుగోలు చేస్తారు.

ఈ విధానలన్నింటిలో ప్రశంసించదగిన అంశం ఏమిటంటే నిర్మాణాల లోపల నింపబడి వాడిన పదార్ధాలను  మరల  వర్మీ కంపోస్టు తో కలపడం ద్వారా తిరిగి మొక్కలు నాటడానికి ఉపయోగించవచ్చు.మిక్స్ చేసిన ఎరువును  గ్రోబ్యాగ్‌లలో నింపి తదుపరి పంటలు కూడా సాగు చేయవచ్చు. Mr. వర్గీస్ తన పొలంలో “తగ్గించండి-పునర్వినియోగం-రీసైకిల్సూత్రాన్ని అమలు చేయడం ద్వారా సమర్ధవంతమైన  రైతుగా నిలిచారు.

బయో-ఇన్‌పుట్‌ల తయారీ మరియు భవిష్యత్తు ప్రణాళికలు: వర్టికల్ గార్డెనింగ్‌ నిర్మాణాలే కాకుండా,  Mr. వర్గీస్ కు తన పెరటి స్థలంలో ఏదో కొత్త ఆవిష్కరణ చేయాలననే తపన మరియు సాధించాలనే పట్టుదల ఉండేది . అతను సొంతముగా  జీవన ఎరువులు మరియు మొక్కలకు అవసరమైన పోషకాలకోశం సహజ ఎరువులైన  జీవామృతం, బీజామృతం, మీనామృతం(చేపల ద్రావకం) వంటివి సిద్ధంచేస్తారు. అతను తన ఇంటి దగ్గరే ఓ నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలు విక్రయించడానికి, అలాగే వర్టికల్ గార్డెనింగ్‌లో అతను పండించిన కూరగాయల మిగులును లాభసాటి ధరలకు విక్రయించాలని తలచారు . ఇప్పటికే నిర్మించబడిన నర్సరీ షెడ్ లో రాబోయే నెలల్లో వ్యాపారంలోకి అడుగు పెట్టటానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే సంవత్సరంలో Mr. వర్గీస్ అతని కుటుంబంతో తన స్వంత నర్సరీని తెరవాలని యోచిస్తున్నాడు. వివిధ కూరగాయల నారు  మరియు మొక్కలు నాటడానికి అవసరమైన వస్తువులను  రైతుకు గిట్టుబాటు ధరలలో అందించాలనుకుంటున్నారు.

ఇతరులతో పంచుకోవడం: Mr. వర్గీస్ వివిధ రైతు సంఘాలలో మరియు వాట్సాప్ గ్రూపులలో  భాగమై అతను తన జ్ఞానాన్ని మరియు పరిజ్ఞానాన్ని పంచుకుంటాడు. అతను శిక్షణా తరగతలకు రిసోర్స్ పర్సన్‌గా కూడా పనిచేస్తున్నాడు. అతను తన కొడుకు సహాయంతో స్వంత యూట్యూబ్ ఛానెల్ ను (https://www.youtube.com/c/VARGHESEPULPALLY) ప్రారంబించారు , అతను కూరగాయల తోటపనిలో అతని వినూత్న పద్ధతుల వివరాలు అప్లోడ్ చేసారు . కాల్స్ మరియు వాట్సాప్ ద్వారా ప్రతి ఒక్కరితో సమర్ధవంతంగా తన జ్ఞానాన్ని పంచుకోలేని కారణమే  తను సొంతంగా యూట్యూబ్ ఛానెల్ చేయడానికి దారితీసింది. ఈ వయసులో కూడా Mr. వర్గీస్ వ్యవసాయం అంటే చాలా మక్కువతో చేయడం, మరియు సేవలందించే కొత్త పద్ధతులను ఆసక్తిగా నేర్చుకోవడం తోటి రైతులకు మరియు యువతకు ఒక పెద్ద ప్రేరణ. అతన్ని గుర్తించి, గుర్తింపు పొందడానికి సహాయం చేసిన వివిధ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ తన ఆవిష్కరణలను మరింత అభివృద్ధి చేసి తోటి రైతులతో పంచుకుంటానని తెలిపారు. తన ఆవిష్కరణలను మెరుగుపరచడానికి మరెన్నో ఆలోచనలను కలిగి ఉన్నాసరిపడిన నిధులు అనుకూలించక అవి చేకూర్చలేకపోతున్నారు. మెరుగుపరిచిన వర్టికల్ గార్డెనింగ్ వ్యవస్థ నగరవాసులకు సమర్థవంతమైన నమూనా అవుతుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.

కర్ర పెండలం సాగుకు వినూత్న పద్ధతి

Mr.వర్గీస్ సాధారణ వర్టికల్ గార్డెనింగ్ కాకుండా, కర్ర పెండలంను పండించడానికి ఒక వినూత్న పద్ధతిని అభివృద్ధి చేసారు. అతను అధిక ఉత్పాదకతతో మంచి నాణ్యమైన కర్ర పెండలంను పండించాడు. అతని సృజనాత్మక పద్ధతి ద్వారా ఒకే కర్రపెండలం మొక్క మూడు ప్రాంతాల నుండి దుంపలను ఇస్తుంది. ఈ పద్ధతిలో, రెండు అదనపు నేల పొరలు సృష్టించబడతాయి. ఆ పొరల గుండా ప్రధాన కాండం అనుమతించ బడుతుంది. పొరలపై  గ్రో బ్యాగ్‌లను ఉంచడం ద్వారా గ్రౌండ్ రూట్ జోన్ లోనే కాకుండా మరో రెండు మొక్కలు పెరుగుతాయి. వేళ్ళు పెరిగుటను మరియు దుంపలు ఏర్పాటును సులభతరం చేయడానికి గ్రో బ్యాగ్‌లలోని మట్టితో అంటుకొనివున్న కాండం భాగంలో ముందుగానే చిన్న లోతైన రంద్రాలు చేయబడతాయి. ఈ పద్దతిలో మూడు ప్రాంతాల నుండి  ఒకే మొక్క నుంచి 25 కిలోల విలువ చేసే మంచి ఆకృతి గల కర్రపెండలం లభిస్తుందని Mr. వర్గీస్ గర్వంగా ధృవీకరించారు. ఇదే కాకుండా షేడ్ నెట్‌లో వెనీలాను, ప్లాస్టిక్ సీసాలలో పుదీనా అతను వినూత్నంగా పండిస్తున్నారు.

అర్చన భట్
శాస్త్రవేత్త

విపిందాస్ పి
అభివృద్ధి సమన్వయకర్త

అబ్దుల్లా హబీబ్
డెవలప్‌మెంట్ అసోసియేట్

MSSRF-కమ్యూనిటీ అగ్రోబయోడైవర్సిటీ సెంటర్
వాయనాడ్, కేరళ
ఈ-మెయిల్: archanabhatt1991@gmail.com

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి ౨౪ , సంచిక 1 , మార్చ్ ౨౦౨౨

 

Recent Posts

హాని-రహిత వ్యవసాయం – మహిళల నేతృత్వంలోని  వాతావరణ స్థితిస్థాపకత వ్యవసాయం (WCRF) నమూనా

హాని-రహిత వ్యవసాయం – మహిళల నేతృత్వంలోని వాతావరణ స్థితిస్థాపకత వ్యవసాయం (WCRF) నమూనా

మహిళలకు ఏమిపండించాలో, ఏ ఇన్పుట్లను ఉపయోగించాలో, ఎప్పుడు ఎక్కడ విక్రయించాలో నిర్ణయించుకునే అధికారం ఉన్నప్పుడు -...