పట్టణ శివారుల్లో ప్రాంతాలలో … ఆహార భద్రత – జీవనోపాధులకు భరోసా

అజయ్ కుమార్ సింగ్ & అర్చనా శ్రీవాత్సవ

పెద్ద పెద్ద పట్టణాలకు చేరువుగా ఉండి అప్పుడప్పుడే నగరీకరణ దిశగా అడుగులు వేస్తున్న శివారు ప్రాంతాలను కేవలం పట్టణాలుగా వృద్ధి పొందేందుకు సిద్దంగా ‘ఎదురుచూస్తున్నఏరియాలు’ గా పరిగణించడం సరైన ఆలోచన కానేకాదు. అలా మార్పు చెందడానికి ముందు ఆయా ప్రాంతాలలో నివసించే ప్రజల ఆలోచనా సరళిలో మౌలికమైన మార్పులు రావడం అన్నిటికన్నా ముఖ్యం. అప్పుడే అలాంటి ప్రాంతాలలో ఉన్న భూ వనరుల వినియోగంలో అవాంఛనీయమైన మార్పులను అడ్డుకోవచ్చు. పరిమితి లేకుండా ఇష్టానుసారం జరిగే భవన నిర్మాణ కార్యక్రమాలను నియంత్రించవచ్చు. పట్టణ శివారుల్లో హరిత వనాలను కాపాడంతో పాటు ఆ పరిసరాలలో ఆయా ప్రాంత అవసరాలకు అనుగుణంగా వ్యవసాయం పనులు కొనసాగించడం సాధ్యమవుతుంది. అక్కడి అవసరాలను బట్టి బహుముఖ కార్యక్రమాలను చేపట్టడానికి అనుగుణంగా వాతావరణం పూర్తిగా సానుకూలంగా రూపు దిద్దుకుంటుంది. ఈ వాస్తవాన్ని గోరఖ్ పూర్ పరిసరాలలోని శివారు ప్రాంతాలలో శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం మేళవింపుతో చేపట్టిన కార్యక్రమాల ఫలితాలను అంతా ఇంతా అని చెప్పలేం. చుట్టూ ఉన్న పేద ప్రజలకు ఆహార భద్రతకు భరోసా ఇచ్చాయి. అంతేకాకుండా అక్కడి పరిసరాలు పచ్చదనంతో కళకళలాడేలా కాపాడడం సాధ్యమైంది. అన్నిటికన్నా ప్రాధాన్యత ఉన్న మరో అంశం ఏమిటంటే – పట్టణానికి చేరువగానే ఉన్నప్పటికీ గ్రామ వాతావరణంలో జీవిస్తున్న అక్కడి పేద ప్రజలకు మరిన్ని జీవనోపాధులను సమకూర్చడంలో అద్భుతమైన ఫలితాలను అందించింది.

మన దేశంలోని గోరఖ్ పూర్ పరిసరాలలో చేపట్టిన వ్యవసాయ కార్యకలాపాలు ఆయా పట్టణాలకు సమీపంలో నివసించే ప్రజల జీవనోపాధులలో వైవిధ్యాన్ని సాధించడంలో కీలక పాత్ర నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన నిరుపేద వర్గాలకు స్థానికంగా పండించే ఆహారం పుష్కలంగా అందించడంలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నాయి. రోజువారీ ఆహారంలో ప్రధాన భాగమైన కూరగాయలు, పండ్లు వంటివి సమృద్ధిగా అందించడం సాధ్యమవుతోంది. అదే సమయంలో వరద ప్రమాదం ముంచుకు వచ్చినప్పుడు వాటి ప్రభావాన్ని నియంత్రించేందుకు తోడ్పడే విధంగా సువిశాలమైన మైదాన ప్రాంతాలు అందుబాటులోకి వస్తున్నాయి. అందుబాటులో ఉన్న భూవనరులను సద్వినియోగం చేసుకునేందుకు, పర్యావరణ రక్షణకు అండగా నిలుస్తున్నాయి. ఆ క్రమంలో కొత్త కొత్త సాగు విధానాలు ఆవిష్కరించడం సాధ్యమవుతోంది.

ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా ఇష్టారాజ్యంగా సాగుతున్న పట్టణీకరణ, పర్యవసానంగా పర్యావరణంపై పడుతున్న చెడు ప్రభావాలు సుస్థిర అభివృద్ధికి పెద్ద అడ్డంకులుగా నిలుస్తున్నాయి. విచ్చలవిడిగా ఎలాంటి క్రమబద్ధమైన ప్రణాళికలు లేకుండా అనుమతులిస్తున్న పట్టణీకరణ విధానాల వల్ల విశాలంగా ఉండా మైదాన ప్రాంతాలనేవి పట్టణాల్లో మచ్చుకైన మిగలడం లేదు. ఎక్కడ ఏ కొద్ది జాగా అయినా ఉంటే ఆ కాస్తా కూడా ప్రజలకు గూడు ఇవ్వడానికే వినియోగించడం జరుగుతోంది. ఈ గృహ అవసరాల సమస్య పరిసరాలలో ఉన్న వ్యవసాయ భూములపై పడుతోంది. అవన్నీ మెల్లిగా సేద్య కార్యకలాపాలకు కేంద్రాలుగా కాకుండా ఆవాస కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఫలితంగా చుట్టూ ఉండవలసిన పచ్చదనం కనుమరుగైపోతోంది. భూవినియోగం పంటలను పండించేందుకు అనువుగా లేకపోవడంతో పట్టణాల్లో నివసించే ప్రజలకు కాయకూరలు, పండ్లు వంటివి కరువైపోతున్నాయి. చివరికి ఆ పట్టణ పరిసరాలకు చేరువలో ఉన్న గ్రామాలలోని వారికి తమదైన సంప్రదాయక జీవనోపాధులు దెబ్బతింటున్నాయి.

ఈ సమస్యల పరిష్కారం దిశగా గోరఖ్ పూర్ పర్యావరణ కార్యాచరణ బృందం (గోరఖ్ పూర్ ఎన్విరాన్ మెంటల్ ఆక్షన్ గ్రూప్ – జీపిఏజీ) ప్రోత్సాహంతో చేపట్టిన వివిధ నూతన ఆవిష్కరణలను ఇతరులందరికీ తెలియజేసి, వారిలో చైతన్యం పెంపొందించేందుకు సదరు సమాచారాన్ని ఇక్కడ పొందుపరచడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ చేపట్టిన ప్రధాన కార్యక్రమం నుంచి పూర్తి సహకారం అందుతోంది. ఈ కార్యక్రమం కింద వరదల నియంత్రణ, నీిటి ముంపు నివారణ చర్యలను గోరఖ్ పూర్ పట్టణ పరిసరాలలో చేపడుతున్నారు.ఆ రకంగా పట్టణంలోపచ్చదనం కాపాడేందుకు, శివారుల్లో సేద్య కార్యక్రమాలను సాఫీగా కొనసాగించేందుకు గోరఖ్ పూర్ ఆక్షన్ ప్రోగ్రామ్ చర్యలు తీసుకుంటోంది. అంతేకాకుండా పర్యావరణ వ్యవస్థను కాపాడే అనుబంధ సేవా కార్యక్రమాలకు కూడా ప్రోత్సాహం అందుతోంది. పట్టణంపై వాతావరణ మార్పుల కారణంగా ఎలాంటి చెడు ప్రభావాలు పడకుండా కాపాడేందుకు అనుకూలమైన రీతిలో వ్యవసాయ కార్యక్రమాల నిర్వహణకు ఈ కార్యక్రమం తోడ్పడుతోంది.

సునీల్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం కింద గోరఖ్ పూర్ ఎన్విరాన్ మెంట్ ఆక్షన్ గ్రూప్ శివారు ప్రాంతాలలో సుస్థర సేద్యాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ ప్రోత్సాహం గత మూడేళ్లుగా అంటే 2018 నుంచి 2013 మధ్య కాలంలో అక్కడి పేదలకు అందుబాటులోకి వస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఇద్దరు చిన్న, సన్న తరహా రైతులు సుగ్రీవ్ ప్రసాద్ (బాక్సు 1) రామచందర్ (బాక్సు 2) లబ్ధి పొందారు. ఇప్పుడు ఈ కార్యక్రమం మొత్తం మీద 117 మంది పరిసర ప్రాత రైతులకు బాసటగా నిలుస్తోంది. వారికి ఈ ఇద్దరు రైతులు ఆదర్శప్రాయంగా మార్గదర్శకులుగా నిలుస్తున్నారు.

ఈ గ్రూపు అందించే ప్రోత్సాహాల కింద స్థానిక పేద బడుగు వర్గాలకు చెందిన వారికి వైవిధ్యంతో కూడిన జీవనోపాధులను అందించడానికి కృషి జరుగుతోంది. అదే సమయంలో స్థానిక ఆహార పదార్థాల పంపిణీలో భాగంగా కూరగాయలు, పండ్లు వాటిని పండించడం, తరచుగా వరద నీటి ముంపునకు గురయ్యే మైదాన ప్రాంతాలను సంరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో వారికి చేయూతనిస్తోంది. ఈ క్రమంలో చేపట్టిన చర్యల వల్ల వ్యవసాయదారులు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. ముఖ్యంగా వరద ముప్పు నుంచి ఉపశమనం పొందగలిగారు. వారు తమ సేద్య కార్యక్రమాలను మరింత నమ్మకంతో పట్టుదలగా ఎలాంటి నష్టాల భయం లేకుండా కొనసాగించగలుగుతున్నారు. వ్యవసాయ సంబంధింత ఇతర అంశాలలో కూడా వారు పునరుపయోగ నైపుణ్యాలను వినియోగిస్తున్నారు. బయటి మార్కెట్ ఆధారిత వస్తు వినియోగం చాలా వరకు తగ్గించుకోగలిగారు. మార్కెట్ లో లభించే బయో ఇన్ పుట్ల వాడకాన్ని పరిమితం చేసుకుంటున్నారు. స్థానిక అవసరాలకు తగిన పంటలను పండించుకుంటున్నారు. అందుబాటులో ఉన్న జాగాను, సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు. విత్తనాలను నిల్వచేసుకుంటున్నారు. భూమిని చదును చేయడంతో పాటు ప్రయోజనకరమైన నర్సరీ విధానాలను అనుసరించగలుగుతున్నారు.

వ్యవసాయం-తోటల పెంపకం- పశుపోషణ అన్న  మూడు విభిన్నమైన జీవనోపాధులను సమన్వపరుస్తూ ఈ మొత్తం కార్యక్రమం రూపుదిద్దుకుంది. అలా సమన్వయ ప్రక్రియలో వైవిధ్యం-సంక్లిష్టతలతో పాటు సేద్య కార్యకలాపాలలో రీసైక్లింగ్ ప్రక్రియలను (ఫిగర్ 1) జోడించడం మౌలిక సూత్రంగా పొందుపరిచారు. వాస్తవానికి గడచిన మూడు దశాబ్దాల కాలంలో పేద వర్గాల వారితో కలిసి ఈ గ్రూపు ఈ విధానాలనే విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తోంది. ఈ విధానంలోని విశిష్టత ఏమిటంటే, స్థానిక అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగానే వాటిని రూపొందించిన కారణంగా దీని ప్రయోజనాలు నిత్య ఆచరణీయమైనవిగా గుర్తింపు పొందాయి. ఈ ప్రాంతాలలో వరదలు ముంచెత్తడం సర్వసాధారణం. అందువల్ల వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడు మొబైల్ ఫోన్ ఆధారిత ఎస్ఎంఎస్ సందేశాల రూపంలో రైతులకు హెచ్చరికలు అందించే ఏర్పాటు కూడా అమలులోకి వచ్చింది.

సేద్య విధానాలలో సరికొత్త విధానాలను రూపొందించడమే కాకుండా, వాతావరణ అనుకూల నగర పరిసరాల సేద్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ గ్రూపు లక్ష్యంగా పెట్టుకుంది. శివారుల్లో సేద్యం సవ్యంగా సాగేందుకు వీలుగా పర్యావరణ అనుకూల విధానాలను అక్కడి రైతులకు పరిచయం చేస్తున్నది. విస్తృతమైన ఈ ప్రక్రియలలో స్థానిక రైతులను సంఘటితపరచి, వారిని వ్యవస్థీకరించేందుకు కూడా దృష్టి కేంద్రీకరించారు. అందుకు అనుగుణంగా ఆదర్శప్రాయులైన రైతుల మద్దతుతో వ్యవసాయ సేవల కేంద్రాలను ఏర్పాటు చేసింది. జంగిల్ కౌడియా విభాగాలతో పాటు మొత్తం 16 మోడల్ రైతు సేవా కేంద్రాలను, 4 వ్యవసాయ సేవల కేంద్రాలను నిర్వహిస్తున్నారు.

శివారు సేద్య విధానంలోని కీలక అంశాలు

  1. ప్రయోజనకరమైన సేద్య విధానాలను రూపొందించడం, వాటి గురించి స్థానిక పేద రైతులకు పూర్తి అవగాహన కలిగించడం : ‘ ప్రత్యక్షంగా చూసినప్పుడే నమ్మకం కలుగుతుందనే ‘ ప్రాథమిక సూత్రం ఆధారంగానే అక్కడి ప్రజలలో వాటిపై పూర్తి అవగాహన కలిగించేందుకు కృషి జరుగుతోంది.
  2. పటిష్టమైన వ్యవస్థ నిర్మణం : వాతావరణ అనుకూల సేద్య విధానాలను అనుసరించడంతో పాటు, వాటికి అనుకూలమైన బయో ఇన్ పుట్ల వాడకాన్ని ప్రోత్సహించడం కోసం క్షేత్ర స్థాయిలో రైతు శిక్షణ శిబిరాలను, స్వయం సహాయక బృందాల నిర్వహణలో సేద్య సేవా కేంద్రాలను, వ్యవసాయ ఉత్పత్తి దారుల బృందాలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతోంది. రైతు శిక్షణ శిబిరాల ద్వారా, సేద్య సంబంధిత సమాచారాన్ని వారిలో చేరవేయడానికి, ఆ క్రమంలో వారిలో ఆయా విధానాలపై నమ్మకం కలిగించేందుకు కృషి జరుగుతోంది. ఇక సేద్య సేవా కేంద్రాల ద్వారా వారికి ఉపయోగకరమైన పరికరాలను, సాధనాలను, యంత్రాలను అందిస్తున్నారు. డీజిల్ తో నడిచే వాటర్ పంపులు, సాగు నీటి పంపులు, నర్సరీల నిర్వహణకు అనువైన ముడి సరుకులను, పోలీ హౌసుల నిర్మాణానికి కావలసిన పదార్థాలను రైతులకు చేరువ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అతితక్కువ అద్దెలకే రైతులకు అందిస్తున్నారు. ఈ అనుబంధ విభాగాలన్నీ కూడా రైతులను ప్రోత్సహించేందుకు తగిన నమూనాలను సిద్ధంచేయడంతోపాటు వారి మధ్య సమన్వయాన్ని, సమష్టి శక్తిని పెంపొందించేందుకు శ్రద్ధ తీసుకుంటున్నారు.
  3. ప్రయోజనకరమైన అనుసంధానం, సమాచార సంస్థలతో సమన్వయం: ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ రంగంలోని వారికి అన్ని విధాలా ప్రయోజనం కలిగించే లింకేజీలను సంధానం చేయడం, ఉపయుక్తమైన సమాచారం అందించ గలిగిన సంస్థలు, నైపుణ్యాలు ఉన్న వ్యవస్థలతో కలిసి పనిచేసే అవకాశం కల్పించడం కూడా చేపడుతున్నారు.  అలాంటి వ్యవస్థలలో ముఖ్యమైనవి – కృషి విజ్ఞాన్ కేంద్రాలు, నాబార్డ్, కాన్పూర్ లోని ఐఐటీ సంస్థ ఇంకా అనేక స్టార్ట్ అప్ సంస్థలు తోడ్పడుతున్నాయి. ఈ రకమైన అనుసంధాన ప్రక్రియ ద్వారా, నిపుణుల నుంచి కీలకమైన సమయాలలో సరైన సలహా సూచనలు అందుకోవడానికి, ప్రభుత్వం తరఫున వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న వివిధ రకాలైన సబ్సిడీ పథకాల గురించిన వివరాలు తెలుసుకోవడానికి రైతులకు సులభ సాధ్యమవుతుంది. అది గుర్తించిన కారణంగా రైతులకు ఈ రకమైన అనుసంధాన ప్రయోజనాల సాయంతో తమకు ఎదురవుతున్న అనేక రకాలైన సమస్యలను వారే స్వయంగా పరిష్కరించుకోగలుగుతున్నారు.

——————————————————————————————————————————————————————–

నిజం చెప్పాలంటే రామ్ చందర్ పూర్తి స్థాయి రైతు కానేకాదు. ఆయనకి ఉన్నదే కేవలం 0.6 ఎకరాల పొలం. అందులో గోధుమ పండించేవాడు. దానిని నామమాత్రం అని చెప్పాలి. ఆ చిన్న కమతంలో చేపట్టే ఆయన సేద్యం ఆశించిన స్థాయిలో ఆదాయం అందించేది కాదు. ఆ కొద్ది పొలంలో సేద్యం పై వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు ఎలాగూ ఉపయోగకరం కాదు. పైగా లోతట్టు ప్రాంతంలో ఉన్న కారణంగా ఆయన పొలం నిరంతరం వరద సమయాల్లో నీటి ముంపునకు గురయ్యేది. అందువల్ల ప్రత్యామ్నాయ జీవనోపాధిగా చిన్న కిరాణా దుకాణం కూడా నిర్వహించేవాడు. అలాంటి పరిస్థితులలో సమీపంలో నిర్వహించిన రైతు సేవా కేంద్రాలు, రైతు చైతన్య శిబిరాలకు ఆయన కూడా హాజరయ్యాడు. హాజరైనా వాటి కార్యకలాపాలపై అంతగా ఆసక్తి పెంచుకోలేకపోయాడు. కానీ ఆయా కేంద్రాలలో అవగాహన పెరుగుతూ రావడంతో ఏడాది తరువాత  అమలు చేసేందుకు నిర్ణయించుకున్నాడు.

ఇంతకీ ఆయనలో అలాంటి ఆసక్తి పెరగడానికి ప్రధాన కారణం – లో టన్నెల్ పులీ హౌస్ సాంకేతికత గురించిన సమాచారం. దీనినే గ్రీన్ హౌస్ సాంకేతికత అని కూడా వ్యవహరిస్తారు. ఇది లోతట్టు ప్రాంతాల వ్యవసాయ క్షేత్రాలకు మరింత ఉపయోగకరం అని ఆయన గుర్తించాడు. ఈ సాంకేతికత ప్రకారం, పగటి ఉష్ణోగ్రతలు ఎంత అత్యధిక స్థాయిలో ఉన్నప్పటికీ, వాటి వేడిమిని అడ్డుకుంటూనే, సూర్యకిరణాల కాంతి ప్రసారాన్ని సాఫీగా మొక్కలకు చేర్చడానికి వీలుగా పారదర్శకమైన గాజు అద్దాలతో పైకప్పును, చుట్టూ గోడలను కూడా నిర్మించవలసి ఉంటుంది. అయితే వాటిని పూర్తిగా గాజుతో తయారు చేయరు. తక్కువ ధరకే లభించే పొలిథీన్ లేదా ప్లాస్టిక్ ను వినియోగించడం జరుగుతుంది. ఈ పద్ధతిని ఆధారంచేసుకుని రామ్ చందర్ తన పొలంలోనే ఎత్తు ప్రదేశంలో అలాంటి తక్కువ ఎత్తు ఉండే టన్నెల్స్ లేదా బండ్స్ నిర్మించుకున్నాడు. వాటి కిందుగా కూరగాయల సాగు చేపట్టాడు. అలా చేయడం వల్ల మొక్కలకు వేడిమి ముప్పు లేకుండా, సూర్యరశ్మి సోకుతూ ఉండడం వల్ల అవి బాగా ఎదుగుతూ వచ్చాయి. కొన్ని కూరగాయల సాగును వాటికి యోగ్యమైన సీజన్ లలోనే కాకుండా ఇతర సమయాలలోనూ విజయవంతంగా చేపట్టగలిగేవాడు. ఆయన నిర్వహణ సామర్థ్యం కారణంగా మొక్కలు సవ్యంగా ఎదగకపోవడం అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటోంది. ఇవాళ్టి రోజున రామ్ చందర్ స్వయంగా ఒక నర్సరీని నిర్వహిస్తున్నాడు. అవసరమైన ఇతర రైతులకు మొక్కలను సరఫరా చేస్తున్నాడు. అంతేకాక పొరుగు రైతులకు తాను అనుసరిస్తున్న విధానాల గురించి అవగాహన కలిగిస్తున్నాడు. ఆయన పర్యవేక్షణలో ఇప్పుడు 12 మంది రైతులు ఈ పొలి హౌస్ సాంకేతికతను వినియోగించుకుని లభ్ది పొందుతున్నారు.

‘ఇప్పుడు ఎంతో మంది తోటి వ్యవసాయదారులు వేర్వేరు అంశాలపై తన దగ్గర సలహాసూచనలు తెలుసుకునేందుకు వస్తున్నారని’ ఆయన సగర్వంగా చెప్తారు. అధిక ఆదాయం అందుతున్నందున ఆయన కుటుంబం ఇప్పుడు మెరుగైన జీవన ప్రమాణాలతో రోజులు సాగిస్తున్నారు. ఒకప్పుడు సేద్యం అంటే అంతంత మాత్రంగా ఆసక్తి చూపించిన రామ్ చందర్ నేడు లీసా కార్యక్రమాలకు, ప్రత్యేకించి లో టన్నెల్ పులీ హౌస్ సాంకేతికతకు ప్రచారకుడిగా మారారు. ‘ప్రాజెక్టులో భాగస్వామిగా చేరిన తరువాత మా కుటుంబానికి వచ్చే ఆదాయం ఏడాదికి రూ. 6000 కు చేరింది. అంటే సీజన్ కు వచ్చే ఆదాయం దాదాపు రూ. 3500 మాత్రమే. ’ అని ఆయన తెలియజేశారు. ఇదివరకటి రోజులతో పోల్చి చూసినప్పుడు, ఇప్పుడు కూరగాయల సాగు ద్వారానే తమకు హెచ్చు భాగం ఆదాయం వస్తోందని, అదే సమయంలో తమ కుటుంబంలోని వారికి మరిన్ని పోషకాలతో కూడిన ఆహారం లభిస్తోందని ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు ఇదివరకటి కన్నా ఎక్కువగా కష్టపడవలసి వస్తోందని కూడా ఆయన చెప్పారు. అదే సమయంలో నూతన ఆవిష్కరణలతో కూడిన గ్రీన్ హౌస్ సాంకేతికతపై ఆయన విశ్వాసం కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితులలో తన కొద్ది పొలాన్ని పట్టణీకరణ అవసరాలకు వదిలేసుకునేందుకు ఆయన సిద్ధంగా లేరు. తన పిల్లల వరకు అయినా ఆ స్థలాన్ని ఇలాగే సేద్యం చేసేందుకే వినియోగిస్తారన్న ధీమాను ఆయన వ్యక్తంచేసారు. ఇప్పుడు ఆయన అనుసరిస్తున్న విధానాన్ని సుమారు 50 మంది రైతులు అనుసరిస్తున్నారు. నర్సరీలను నిర్వహిస్తున్నారు. సకాలంలో కూరగాయల దిగుబడిని అందుకోగలుగుతున్నారు.

——————– ———————————————————————————————————————————————–

ప్రోగ్రామ్ ప్రభావం: మొత్తం మీద ఈ కార్యక్రమం సాధించిన ఫలితాలను ఇలా గమనించవచ్చు.

  • పట్టణ శివారుల్లో సేద్య రంగానికి ఊపిరి ఇచ్చింది. అదే క్రమంలో పట్టణానికి తరచు ఎదురవుతున్న వరద నీటి ముంపు సమస్య నుంచి రక్షణ ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను, సదుపాయాలను మెరుగుపరిచింది.
  • వాతావరణ మార్పులకు అనుగుణంగా సుస్థిర సేద్యం చేపట్టే అవకాశాలను సుస్థిరం చేయగలిగింది. ముఖ్యంగా పట్టణ పరిసరాలలోని చిన్న కమతాలలో వ్యవసాయం – తోటల పెంపకం – పశుపోషణ రంగాలను సమన్వయపరచగలిగింది. అదే క్రమంలో బయో ఇన్ పుట్ల వినియోగానికి ప్రోత్సాహం ఇవ్వగలిగింది.
  • పేద కుటుంబాలకు మరింత ఆహార భద్రతను అందించగలిగింది. జీవనోపాధుల కోసం దూర ప్రాంతాలకు వలస వెళ్లవలసిన అవసరం చాలా వరకు తగ్గిపోయింది.
  • మార్కెట్ ఆధారిత ఇన్ పుట్ల వినియోగం చగ్గిపోయిన కారణంగా, చిన్న కమతాలున్న రైతులకు, మహిళా రైతులకు అదనపు లాభాలు అందించగలిగింది.
  • శివారు ప్రాంతాలలో బడుగు, బలహీన వర్గాల పేదలకు మరిన్ని జీవనోపాధి మార్గాలను చూపించగలిగింది. పట్టణ వాసులకు కూడా ఆరోగ్యదాయకమైన పోషక ఆహారం అందించి వారికి కూడా ఆహార భద్రత చేకూర్చింది.

ముగింపు వాక్యాలు

వ్యవసాయం లాభదాయకంగా లేని కారణంగా నిరాశానిస్పృహలకు గురైన రైతు కుటుంబాలు బతుకు తెరవు కోసం ఎక్కడికో వలస వెళ్ల వలసిన దుర్గతి నుంచి ఉపశమనం కలిగించడంలో గోరఖ్ పూర్ లో చేపట్టిన ఈ ప్రోగ్రామ్ అద్భుతమైన ఫలితాలను సాధించి చూపించింది. పర్యవసానంగా వ్యవసాయ రంగంపై శివారు ప్రజల్లో మళ్లీ ఆసక్తి, ఉత్సాహం పెంపొందడం సాధ్యమైంది. వాతావరణ అనుకూల సేద్య విధానాలు ఉత్పత్తి ఖర్చులను తగ్గించడమే కాకుండా అదనపు లాభాలను సాధించిపెట్టడంలో తోడ్పడుతోంది. జీవనోపాధులు మెరుగయ్యాయి. శివారు ప్రాంతంలోని వారికే కాకుండా పట్టణాలలో నివసించే ప్రజలకు కూడా ఆహార భద్రత లభించింది. ఇక్కడి ఫలితాలను గమనించి నట్లయితే, సేద్య రంగాన్ని, తోటల పెంపకాన్ని, పశు పోషణను సరైన తీరులో సమన్వయపరినట్లయితే, పల్లె సీమలలోని వ్యవసాయదారులు తమ ఉత్పత్తులకు మరింత మెరుగైన గిట్టుబాటు ధరలు లభిస్తాయి. సేద్యం లాభదాయకం అవడంతో గత్యంతరం లేని పరిస్థితులలో తమ పంట పొలాలను తెగనమ్ముకోవలసిన అవసరం తప్పిపోతుంది, పరిసరాలలో మైదాన ప్రాంతాల లభ్యత పెరుగుతుంది,

అజయ్ కుమార్ సింగ్ & అర్చనా శ్రీవాత్సవ, గోరఖ్ పూర్ ఎన్విరాన్ మెంటల్ ఆక్షన్ గ్రూప్ హెచ్ఐజీ – 1 / 4, సిద్ధార్థపురం తారామండల్ రోడ్డు గోరఖ్ పూర్ – 273 017, E-mail: geagindia@gmail.com

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి ౨౪, సంచిక 1 , మార్చ్ ౨౦౨౨

 

 

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...