పంటపొలాలను 2024 నాటికి `డీజల్ ఫ్రీ’ చెయ్యడానికి మైక్రో సోలార్ పంపుల పెంపు

వ్యవసాయ పంపుసెట్లు ఉన్న సన్నకారు రైతులలో దాదపు 2/3 వంతుల మంది రైతులు ఇంకా డీజల్ / కిరోసిన్ పంపుల మీదే ఆధారపడుతున్నారు

ఈ సంవత్సరం మొదట్లో భారత దేశ ప్రభుత్వం, శక్తి మంత్రిత్వ శాఖ, 2024 నాటికి వ్యవసాయ రంగాన్ని డీజల్ ఫ్రీ (డీజల్ వినియోగం లేకుండా) చేయాలన్న ఒక మహా లక్ష్యాన్ని ప్రకటించింది. 2070 నాటికి `నెట్ జీరో ‘ లక్ష్యాన్ని సాధించాలన్న భారత దేశ సంకల్పంలో భాగంగా ఈ ప్రకటన చెయ్యడం జరిగింది. దీనికి తోడు భారత దేశం దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు కి అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఈ ఖర్చు దాదాపు రెట్టింపు అయ్యి 119 బిలియన్ యు. ఎస్. డాలర్లకు చేరుకుంది.

భారత దేశంలో డీజల్ వాడకంలో రవాణా రంగం తరువాత రెండవ స్థానం వ్యవసాయ రంగానిదే. భారత దేశంలో ఉన్న 30 మిలియన్ల సాంప్రదాయిక వ్యవసాయ పంపుల్లో 10 మిలియన్ల పంపులు డీజల్ మీదే నడుస్తున్నాయి. కాబట్టి డీజల్ వాడకం అవసరం లేని డీజల్ ఫ్రీ పొలాలు కావాలంటే నీటి పారుదలకు సౌర శక్తిని వినియోగించుకోవాలి.

ఇప్పటివరకూ అయితే సోలార్ పంపుల వాడకం చాలా తక్కువనే చెప్పాలి. కేవలం 3,80,000 యూనిట్లు మాత్రమే పనిచేస్తున్నాయి. అంతేకాక, ప్రస్తుతం వాడకంలో ఉన్న సోలార్ పంపులు ఎక్కువ కెపాసిటీ (2 హార్స్ పవర్ మరియు ఆ పైన) ఉన్న చిన్న రైతులవి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ అధిక కెపాసిటీ కల పంపులు కేవలం 32 శాతం రైతుల నీటి పారుదల అవసరాలను సమర్థవంతంగా తీరుస్తున్నాయి. ఈ రైతులందరూ హెక్టారుకన్నా ఎక్కువ భూమి ఉన్నవారే. అయితే మైక్రో సోలార్ పంపులు, 1 హెచ్.పి. కన్నా తక్కువ కెపాసిటీ కలిగి ఉండి, హెక్టారు భూమికన్నా తక్కువ భూమి ఉన్న సన్నకారు రైతుల యొక్క నీటి పారుదల అవసరాలను 68 శాతం వరకూ తీరుస్తాయి. కానీ ఇప్పటివరకూ, ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు ఏవీ మైక్రో సోలార్ పంపుల మీద దృష్టి పెట్టలేదు.

కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (సి.ఇ.ఇ.డబ్ల్యు.)  వారి నివేదిక ప్రకారం నీటి పారుదల డిమాండ్ మేరకు అవసరమైన మైక్రో సోలార్ పంపులకు  రూ. 48,000 కోట్ల రూపాయల మార్కెట్ అవకాశం ఉన్నట్లు అంచనా. అదనంగా, పశుపోషణ రంగంలో కూడా, పశువులకు నీటి అందుబాటు పెంచడంలో ఇంకొక 10,000 కోట్ల రూపాయల మార్కెట్ అవకాశం ఉంది.

భారత దేశంలో, దేశవ్యాప్తంగా 9 మిలియన్ల పైన మైక్రో సోలార్ పంపులు ఏర్పాటు చేయవచ్చు. కనీసం అంత మంది సన్నకారు రైతుల జీవితాలు ప్రభావితం చెయ్యవచ్చు. అయితే, ఈ ప్రభావం చూపాలంటే దిగువ పేర్కొన్న ఈ అయిదు కీలకమైన అంశాలమీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

మొదటిగా, ప్రజలలో ఆసక్తి కలిగేలా మైక్రో సోలార్ పంపులను ప్రభుత్వ పధకాలలో చేర్చాలి. సబ్సిడీ పధకాలలో మైక్రో సోలార్ పంపులు చేర్చకపోవడం వలన ఈ రంగంలో అవి చాలా పెద్ద ఎత్తున సబ్సిడీ పొందిన (60-90 శాతం సబ్సిడీ) ఎక్కువ కెపాసిటీ పంపులతో పోటీ పడవలసి ఉంటోంది. ఫలితంగా చాలామంది రైతులు, సన్నకారు రైతులు కూడా, అవసరం లేకున్నా ఎక్కువ కెపాసిటీ పంపులను కొనడానికి మొగ్గు చూపుతున్నారు. కాబట్టి జాతీయ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఇప్పుడు అమలులో ఉన్న పధకాలలో మైక్రో సోలార్ పంపులను కూడా చేర్చుకుని, రైతుల అవసరానికి సరిపడే పంపు సైజులను సిఫార్సు చెయ్యాలి.

రెండవది, ప్రస్తుతం మైక్రో సోలార్ పంపుల కాటగిరీ కింద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ (ఎం.ఎన్.ఆర్.ఇ.) మంత్రిత్వ శాఖ 250 వాట్లు మరియు  500 వాట్ల పంపులకు మాత్రమే పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ (పనితీరు ప్రమాణాలు) ను సూచించింది. పంపు సైజుని బట్టి నిర్ణయించిన పనితీరు ప్రమాణాలకి బదులుగా, ఎం.ఎన్.ఆర్.ఇ. పనితీరు బెంచ్ మార్కులను ఒక వాట్ కి ఎంత అన్నది చూస్తే, ఇన్నొవేటర్లు (కొత్త పరికరాలను కనిపెట్టేవారు) వివిధ కెపాసిటీలు కలిగిన పంపులను రూపొందించి ప్రభుత్వ తోడ్పాటు పొందగలరు.

మూడవది, ఇన్ పుట్ బేస్డ్ బదులు అవుట్ పుట్ బేస్డ్ టెండరింగ్ ను ఆరంభించడం. ఇప్పుడు అమలులో ఉన్న పధ్ధతి లో సోలార్ పంపుల టెండర్లు వేసే ప్రక్రియ అవుట్ పుట్ బట్టి కాకుండా ఆ పంపుల ఇన్ పుట్ బట్టి జరుగుతోంది. ఉదాహరణకి, ఒక మైక్రో సోలార్ పంపుకి సంబంధించిన టెండర్ 500 వాట్ లకు పరిమితమైతే అంతకన్నా తక్కువ కెపాసిటీ ఉం డి, 500 వాట్ల అవుట్ పుట్ ఇచ్చే సమర్థవంతమైన పంపు లెక్కలోకి రాదు. అందువలన, జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సమర్ధవంతమైన పరిష్కారాలను ప్రోత్సహించడానికి, టెండరింగ్ విధానానికి నీటి అవుట్ పుట్ ఆధారంగా చెయ్యాలి.

నాల్గవది, ఈ మైక్రో సోలార్ పంపుల ఏర్పాటుకు సంబంధించిన వ్యక్తులలో, ఈ పంపుల మీద నమ్మకం పెంచడానికి, ప్రదర్శనల నిర్వహణకు తోడ్పాటు అందించడం. మైక్రో సోలార్ పంపులు ఎక్కువగా వాడకపోవడానికి కారణం రైతులలో, ఆర్ధిక సేవలందించే ఫైనాన్షియర్లలో మరియు ప్రభుత్వ అధికారులలో ఈ పంపుల పనితీరు పై అవగాహన లేకపోవడమే. కేంద్ర మంత్రిత్వ శాఖ రాష్ట్ర రాష్ట్ర నోడల్ ఏజెన్సీలతోనూ, గ్రామీణ జీవనోపాధి మిషన్లతోనూ మరియు ఇతర సంబంధిత శాఖలతోనూ కలిసి పని చేసి దేశంలోని ఒక్కొక్క అధిక ప్రాధాన్యత జిల్లా లోనూ 1000 మైక్రో సోలార్ పంపులకు తోడ్పాటునివ్వాలి.

చివరిగా, పెద్ద ఎత్తున ఈ పంపులను వినియోగించడానికి, రైతులకి అందే ఆర్ధిక సేవలను మెరుగుపరచాలి. ఇంత వరకు, భారత దేశంలో సోలార్ పంపుల ఏర్పాటుకు పి.ఎం. కుసుం పధకం తోడ్పాటు అందించింది. అయితే, దేశంలో 100 మిలియన్ల సన్నకారు క్షేత్రాలు ఉన్నాయి. అన్నింటికీ సబ్సిడీ ద్వారా సోలార్ పంపులను అందించడం కష్టమైన పని. ఈ పంపులు సాధారణంగా రూ. 30,000 – 60,000 వరకూ ఖరీదు చేస్తాయి. ఈ పంపులు ఉపయోగించాలంటే ఆర్ధిక సహాయ అందుబాటు చాలా అవసరం. కాబట్టి, ఎం.ఎన్.ఆర్.ఇ. నబార్డ్ ( నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, వ్యవసాయ మరియు గ్రామీణాభివృధ్ధి కై  కృషి చేసే జాతీయ బ్యాంకు) వంటి ఆంకర్ సంస్థలతో కలిసి, ఆర్ధిక సంస్థలకు రిస్క్ గ్యారంటీ (నష్టం/ప్రమాద సమయాలలో ఇచ్చే పూచీ)లను కల్పించి మైక్రో సోలార్ పంపుల ఫైనాన్సింగ్ కు తెర తీయాలి.

అంతేకాక, మైక్రో సోలార్ పంపుల విషయంలో నాబార్డ్ వంటి సంస్థలు ప్రాంతీయ బ్యాంకుల సామర్ధ్యాన్ని పెంచి, ఈ సాంకేతికతపై వారి నమ్మకాన్ని పెంచాలి.

చివరి మాట, సన్నకారు రైతులు మైక్రో సోలార్ పంపులను ఉపయోగించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నీటి పారుదల ఖర్చులు తగ్గుతాయి. పంట మార్పిడులు పెరుగుతాయి, రైతుల నికర ఆదాయం పెరుగుతుంది. తద్వారా నష్టాలకు అతి దగ్గరలో ఉండే సన్నకారు రైతులలో నష్టాలనుండి కోలుకునే సామర్ధ్యం పెరుగుతుంది.

కానీ, సబ్సిడీలు లేకపోవడం, మరీ ఖచ్చితమైన పనితీరు ప్రమాణాలు, సమర్ధత లోపించిన టెండరింగ్ ప్రక్రియలు మైక్రో సోలార్ పంపులను పెద్ద ఎత్తున వినియోగంలోకి తేవడానికి అడ్డు పడుతున్నాయి. కాబట్టి ఆర్ధిక సేవల అందుబాటు, లక్ష్యసాధనకు దోహదపడె విధివిధానాలు, అవగాహన కల్పించడం మరియు సాంకేతిక ఆవిష్కరణలు వంటి అంశాలకు తోడ్పాటు అందించడానికి సమన్వయం కలిగిన ప్రయత్నాలు అవసరం. ఈ విధంగా, 2021 కల్లా పంటపొలాలు `డీజల్ ఫ్రీ’ కావాలి అన్న భారత దేశం యొక్క మహా లక్ష్యం చేరుకోవచ్చు. అంతేకాక, 2070 నాటికి నె`ట్ జీరో’ లక్ష్యాన్ని సాధించడానికి కూ డా కృషి జరుగుతుంది.

షేక్ వసె ఖలీద్

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి ౨౪, సంచిక ౪, డిసెంబర్ ౨౦౨౨

 

 

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...