నగరాల్లో పెరటి తోటలు – మిగులు భూముల సద్వినియోగం

పట్టణ ప్రాంతాలు ఇప్పుడు కాంక్రీట్ కారడవులుగా మారిపోతున్నాయి. అందరి దృష్టి పూర్తిగా ఆధునీకరణపైనే కేంద్రీకృతమైపోయింది. ఈ క్రమంలో సంప్రదాయక, సాంస్కృతిక సుందర నందన వనాలు పరిరక్షించాలనే ఆలోచనే కనుమరుగైపోతోంది. చివరికి బెంగళూరు కూడా ఆ బాటలోనే సాగుతోంది. ఆ వెర్రి ఇక్కడ కూడా పెరిగిపోయింది. వాస్తవానికి ఇతర పట్టణాలతో పోలిస్తే చాలా వేగంగా విస్తరిస్తోంది. అందుకు ఇక్కడి వాతావరణం చాలా జనజీవనానికి అనుకూలంగా ఉండడం ఒక కారణం. ఇదికాక, ఇక్కడ లభించే మౌలిక వసతులు ఆకట్టుకుంటున్నాయి. నగరం నాలుగు వైపులా కూడా విస్తరణకు చాలా అవకాశాలు ఉండడం మరో కారణం. అయినా కూడా ఇంకా బెంగళూరు మహా నగరానికి సుందర బృందావన నందన వనాల నగరంగా పేరు నిలబెట్టుకుంటూనే ఉంది. కనులకు విందుచేసే విధంగా నగరం నడిబొడ్డున కూడా సురక్షితమైన తోటలతో విలసిల్లుతూ ఉంటుంది. ప్రణాలికా బద్ధంగా నివాస ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో ఆహ్లాదకరమైన పార్కులకు తప్పనిసరిగా చోటు ఉంటుంది.

తోటల పెంపకం సంస్కృతిని కాపాడడంతో పాటు పెంచి పోషించేందుకు కొన్ని ప్రాంతాలలో కృషి ఇంకా కొనసాగుతోంది. ఆ రకంగా ఆరోగ్యానికి రక్షణ ఇచ్చే కాయగూరలను పెంచుకునేందుకు నగర పౌరులకు ప్రోత్సాహం అందుతోంది. పర్యావరణ హితకరమైన వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న ఎఎంఇ ఫౌండేషన్ ఈ కృషిలో చురుకుగా తన వంతు పాత్ర నిర్వహిస్తోంది.

డాక్టర్ విశ్వనాథ్ మద్దతుతో నగరంలో కూరగాయల పెంపకం, హరిత వనాలను పెంచడంలో, పర్యావరణ ప్రయోజనాలకు అనుగుణమైన విధంగా,  2007 నుంచి,  ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఎఎంఇ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. అది కూడా తమకు అందుబాటులో ఉన్న ఎంత కొద్ది పాటి స్థలమైనా ఉపయోగించుకోవచ్చునని సూచించింది. ఫలితంగా చాలా కుటుంబాలు తమ ఇంటి పెరటి స్థలంలోను, ఇంటి పై డాబాలపైనా, ఇళ్ల ముందు ఉన్న స్థలాలను, చివరకి బాల్కనీలను కూడా  తోటలుగా మార్చివేసుకున్నారు. కేవలం ఒక్క రోజు పాటు నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమాలు ఆచరణాత్మకమైన పద్ధతుల్లో కాయగూరల పెంపకంలో మెళుకువలను పౌరులకు వివరించడం జరిగింది. ఈ విధంగా ఇప్పటి వరకు 500 మంది తోటల పెంపకంలో సుశిక్షితులయ్యారు. వాళ్లంతా సేంద్రీయ పద్ధతుల్లో టెర్రేస్ గార్డెన్ లను పెంచడం ప్రారంభించారు. వారిలో ఎంతో మంది యువతీయువకులు కూడా ఉన్నారు. వారంతా ఐటి రంగంలో విరామం లేని జీవనశైలి ఉన్నవారే. అయినా సరే, తోటల పెంపకాన్ని వారు ఒక హాబీగా చేపట్టారు.

పట్టణ ప్రాంతాలలో, పరిసరాల్లో వ్యవసాయ కార్యకలాపాల ప్రోత్సాహం కోసం చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ ఫౌండేషన్ టెర్రేస్ తోటల పెంపకంవైపు తన కృషిని ప్రారంభించింది. 2006లో బెంగుళూరులో తోటలు, పట్టణ ప్రాంత తోటల పెంపకంలో ప్రధానమైన సహకార సంస్థగా ఈ ఫౌండేషన్ రంగంలోకి దిగింది. ఈ విషయంలో అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన స్వచ్ఛం సంస్థ ఆర్.యు.ఎ.ఎఫ్ సంస్థ ప్రతిపాదించిన నగరాల భవిష్యత్తు స్వరూపం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. ఈ లక్ష్యాలకు అనుగుణంగా ఐ.డబ్ల్యు.ఎం.ఐ సహకారం తీసుకుంది. ఈ రెండు సంస్థలు బహుళ సంఖ్యాక భాగస్వాముల ప్రోత్సాహక ప్రక్రియలో భాగంగా సంయుక్తంగా అధ్యయనాల్లో పాల్గొన్నది. కేవలం అధ్యయనాలతో, సర్వేలతో ఫలితాలు రావని గుర్తించి, దూరదృష్టితో ప్రగతిశీల దృక్పథంతో పెరటి తోటల పెంపకానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది.

ఇందుకుగాను ముందుగా ఉత్సాహం, ఆసక్తి ఉన్న కొన్ని  నివాస ప్రాంతాల సంక్షేమ సంఘాలను సమీకరించింది. వారిలో చైతన్యం, అవగాహన కలిగించేందుకు కృషిచేసింది. ఫలితంగా కొన్ని సంఘాలు ముందుకు వచ్చాయి. ముందుగా ప్రకృతి సహజంగా సజీవ పదార్థాలలో అంతరించిపోయే బయో డిగ్రేడబుల్ చెత్తను, ఇతర వ్యర్థ పదార్థాలను ఎరువులలో ఉపయోగించడానికి ఉత్సాహం చూపించారు. అలాగే తమ అనుభవాలను ఇతరులతో పంచుకునేందుకు సిద్ధమయ్యారు. నర్సరీలను పెంచడంలో స్వయం సహాయక మహిళా బృందాలకు శిక్షణ ఇచ్చే ప్రయత్నం చురుగ్గా చేపట్టారు. ఆతరువాత, వాషింగ్టన్ లోని ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) సహకారంతో టెర్రేస్ గార్డెన్లను గురించిన ప్రచార కార్యక్రమాలకు నువైన మీడియా మాధ్యమాలకై అన్వేషించడం జరిగింది.

వేగమందుకన్న కృషి

పట్టణవాసులు ఇలా పెరటి తోటలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలను పట్టణ ప్లానింగ్ అధికారుల దృష్టికి కొన్ని సమావేశాల ద్వారా వెళ్లింది. దాంతో తోటల పెంపకం గురించిన అవగాహన కార్యక్రమాలు, ప్రదర్శనల్లో ఇంటి డాబాలపై తోటలను పెంచే విధానాలను గుర్తించిన సమాచారాన్ని అందిచడం జరిగింది. ఈ ప్రదర్శనను అధికారులు తమ కార్యాలయం డాబాపైనే ఏర్పాటు చేయడం జరిగింది.

ఇలా తోటల పెంపకం విషయంలో సుశిక్షితులైన యువత ఈ కార్యక్రమానికి మరింత స్ఫూర్తిని తీసుకువచ్చారు. వారిలో కొందరు ఇలాంటి ఎకో- దృక్పథం ఉన్న వారితో పరస్పరం అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నానికి, మరి కొంత మందికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకు వచ్చారు.

 డాక్టర్ విశ్వనాథ్ ప్రోద్బలంతో ఇలాంటి ఔత్సాహిక పౌరులు ఈ విషయంలో తమ ఆలోచనలకు చేరువగా ఉన్న వారితో కలిసి గార్డెన్ సిటీ ఫార్మర్స్ గ్రూప్ గా ఏర్పడ్డారు. తదుపరి వారంతా ఒక ట్రస్టుగా ఏర్పడ్డారు. నగరంలో ఇలా పెరటి తోటల పెంపకం గురించి అవగాహన కలిగించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ‘ఊట ఫ్రమ్ యువర్ తోట ’ అంటే మీ ఇంటి తోట నుంచి ఆహారం అనే బహిరంగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది అద్భుత విజయం సాధించింది. తరచు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా పరస్పర అభిప్రాయాలను వెల్లడించుకునేందుకు ఇదొక వేదికగా మారింది. పర్యావరణ హాతకరమైన ఉత్పాదనలకు ఇదో మార్కెట్ గా మార్పుచెందింది. తోటల పెంపకం విషయంలో ఆసక్తి ఉన్న వారి మధ్య అభిప్రాయాలను పంచుకునేందుకు సిటిజన్ మేటర్స్ పేరుతో మరో సమష్టి కృషికి తెర లేచింది.

కె.వి.ఎస్. ప్రసాద్
ఎక్జిక్యూటివ్ డైరెక్టర్, ఏఎంఈ ఫౌండేషన్,
మరియు చీఫ్ ఎడిటర్, ఎల్ఈఐఎస్ఎ ఇండియా
Email: leisaindia@yahoo.co.in

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి 16, సంచిక 3, సెప్టెంబర్ ౨౦౧౪

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...