హరిత భారత్ కు హరిత నీరాజనాలు

స్థానిక సామాజిక భాగస్వామ్యంతో చెట్ల పెంపకం సంస్కృతి గ్రామ ప్రాంతాల జీవనశైలిలో తీసుకువస్తున్న మార్పులలో ముఖ్యమైనది – హరిరుహబా వేడుకల నిర్వహణ.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 123 రోజులను ఏవో ఒక ప్రత్యేక కారణాలతో వేడుకలుగా జరుపుకోవడం సర్వసాధారణం. వాటిలో మూడు రోజులను భూసారాన్ని, మొక్కల పెంపకం లక్ష్యాలుగా కేటాయించారు. వాటిని ప్రపంచ అటవీ సంరక్షణ దినం (మార్చి 21), విశ్వ భూగోళ పరిరక్షణ దినం (ఏప్రిల్ 22), ప్రపంచ పర్యావరణ రక్షణ దినం (జూన్ 5). ఇలా మూడు రోజులు మాత్రమే కాకుండా, ఇతర సందర్భాలలో సాధారణ ప్రజల మధ్య మొక్కల ప్రాధాన్యత గురించి కానీ, మానవాళికి వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి కానీ చర్చల మాట దేవుడెరుగు, ఆలోచనల్లో కి కూడా రావడం లేదు.

నిజానికి మొక్కల పెంపకాన్ని ప్రతి పౌరుడు విధిగా చేపట్టి తీరవలసిన ముఖ్యమైన కార్యక్రమం. పచ్చటి మొక్కల వల్లనే మనకు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. మన చుట్టూ ఉన్న పర్యావరణం అందరికీ ఆరోగ్యం అందించగలుగుతుంది. ఏదో మొక్కుబడిగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం పేరుతోనో మరో పేరుతోనో ఏటా మొక్కలను నాటే కార్యక్రమం నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. భూమిపై జీవించే ప్రాణులన్నిటికీ ఆహారం అందించే బృహత్ కార్యక్రమాన్ని మొక్కలు నిరంతరం కొనసాగిస్తున్నాయి. జీవులకు హానికరమైన వాయువులను అవి స్వీకరించి, ఆరోగ్యదాయకమైన వాయువులతో వాతావరణాన్ని శుద్ధి చేస్తున్నాయి. ఏ దేశంలోనైనా సరే కనీసం 33 శాతం భూభాగంలో అడవులు విస్తరించి ఉండాలి. కానీ తాజాగా లెక్కించిన ప్రకారం, మన దేశంలో అడవుల కోసం ఉపయోగిస్తున్న భూభాగం గట్టిగా 20 శాతం కూడా లేదు. ఇంకా తక్కువే కూడా. అందువల్లనే మొక్కల పెంపకం, చెట్లను నాటడం విరివిగా పెంచడం అత్యంత ప్రాధాన్యత కల అంశంగా మారింది.

హరిత వనాల కోసం హసీరు హబ్బా వేడుక

ఆయకట్టు (వాటర్ షెడ్) అభివృద్ధి, వ్యవసాయ అనుబంధ అడవుల పెంపకం, వ్యవసాయంతో తోటల పెంపకాన్ని అడవుల పెంపకాన్ని కూడా అనుసంధానం చేసే అభివృద్ధి చేసే లక్ష్యంతో బెయిఫ్ సంస్థ కొన్ని దశాబ్దాలుగా కృషిచేస్తోంది. ఈ సంస్థ చేపట్టిన అధ్యయనం ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తించింది. చెట్లను నాటడం అనే కార్యక్రమాన్ని కేవలం వ్యవసాయదారులు మాత్రమే కాకుండా సామాన్య ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున చేపట్టేలా ప్రోత్సహించడమే సరైన పరిష్కార మార్గమని నిర్ధారణకు వచ్చింది. సామాజిక భాగస్వామ్యంతో చెట్ల పెంపకం కార్యక్రమాన్ని వారి జీవిత నిత్యకృత్యాలలో ఒక అంతర్భాగంగా అమలు చేయాలని ఆలోచనకు వచ్చింది. అందుకు మారు మూల గ్రామాలలో మాత్రమే కాకుండా పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఇతర పండగలలాంటి సంబరాలతో పాటు ఈ అంశంపై కూడా ప్రచారానికి, అవగాహన పెంచడానికి నిర్వహించడం చాలా అవసరమని నిర్ణయానికి వచ్చింది.

 గ్రామ ప్రాంతాల సామాజిక భాగస్వామ్యంతో పెద్ద ఎత్తునన చెట్లను నాటే కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు బెయిఫ్ సంస్థ కృషి చేస్తోంది. సుస్థిర జీవనోపాధుల కల్పన మరియు అభివృద్ధి కోసం ఏర్పాటైన బెయిఫ్ సంస్థ (బెయిఫ్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్టయినబుల్ లైవ్లీ హుడ్స్ అండ్ డెవలప్ మెంట్, కర్నాటక) 2001 నుంచి హసీరు హబ్బా గ్రీన్ ఫెస్టివల్స్ నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఈ సంస్థ కార్యకలాపాలు చేపడుతున్న ప్రాజెక్టు కేంద్రాలలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. చెట్ల పెంపకానికి మత విశ్వాసాలను జోడించి, సామాజిక బాధ్యతగా చేపట్టేలా జనసామాన్యాన్ని పురికొల్పడం ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశ్యం. అందుకోసం మత పెద్దలు, రాజకీయ నేతలు, సంఘ సేవకులు, ప్రభుత్వ విభాగాలను సమన్వయపరచి ముందుకు సాగుతోంది. గతంలో జరిగిన కార్యక్రమాలలో అడిచుంచనగరి మఠాధిపతి, కీర్తిశేషులు శ్రీ బాలగంగాధరనాథ్ స్వామి, తొంతదార్య మఠాధిపతి, కీర్తిశేషులు శ్రీ శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి,  దంబల్ స్థానిక ఎమ్మెల్యేలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు ఈ ఉత్సవాల్లో పాలు పంచుకున్నారు. స్థానికులకు స్ఫూర్తినిచ్చారు. మరి కొన్ని స్వచ్ఛంద సంస్థలు, రైతుల సంఘాలు, స్వయం సహాయక బృందాలు, గ్రామస్థాయి సంస్థలు చెట్ల నాటే కార్యక్రమాలలో చురుగ్గా పాలు పంచుకున్నాయి.

బాక్సు 1 

“చెట్ల పెంపకం వ్యవసాయంలో ఒక భాగమే. పల్లెవాసులమైన మేము మా గ్రామదేవత సాక్షిగా హసీరు హబ్బా ఉత్సవాలను ఏటా శ్రద్ధాభక్తులతో నిర్వహించుకుంటామని శపథం చేస్తున్నాము. మొక్కల పెంపకాన్ని నిరివరామంగా కొనసాగించడంతో పాటు సాధ్యమైనంత అధిక సంఖ్యలో చెట్లను నాటేందుకు కృషి చేస్తాము. ఈ కార్యక్రమాలలో మేము, మా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధవులు, పొరుగు గ్రామాల వారిని సైతం పాల్గొనేలా చూస్తాము.“

సర్వసాధారణంగా ఈ ఉత్సవాలను జూన్ – జూలై మాసాలలో నిర్వహిస్తారు. స్థానికులతో సంప్రదించిన తరువాత ఉత్సవ తేదీలను ఖరారు చేస్తారు. పరిసర గ్రామాలకు చెందిన ప్రాజెక్టు భాగస్వాములు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, మత పెద్దలను ఆహ్వానిస్తారు. నారు మొక్కలను, త్వరితగతిన పెరిగే విత్తనాలను, ఎంపిక చేసిన పొలాల నుంచి పిట్ సేకరణ వంటి పనులను ముందు రోజే పూర్తి చేసి సిద్ధం చేస్తారు. ఉదయాన్నే సమావేశమైన వారంతా మొక్కలను నాటవలసిన భూములను చేరుకుంటారు. విత్తనాలకు, మొక్కలకు పూజాదికాలు అయిన తరువాత హసీరు హబ్బా దీక్ష స్వీకరిస్తారు. (బాక్సు 1 చూడండి.) ఆ తరువాత వాటిని నాటే పని జోరుగా చేపడతారు.

విభిన్న జాతులు, వాటి ప్రయోజనాలు

పాఠశాలల ఆవరణల్లోనూ, విద్యా సంస్థల ఆవరణలోనూ చెట్లను పెంచడం  వల్ల పరిశుద్ధమైన గాలులు వచ్చి చిన్నారులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడవచ్చు. కదంబ వృక్షాలు, బిల్వ వృక్షాలను పట్టణాల్లో పెంచడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అలాగే చెత్త కుప్పలున్న పరిసరాల్లోను, మురికి కాలవల పక్కన పారిజాతం, ఆకాశ మల్లి వంటి వాటిని పెంచినట్లయితే చెడు వాసనలను తగ్గించి సుగంధంతో ఉండే గాలిని సమకూర్చవచ్చు. రావి చెట్లు, మేడి చెట్లు, మర్రి చెట్లు వంటి పెద్ద పెద్ద చెట్లను, పార్కుల వద్ద, ఆలయాల వద్ద పెంచడం వల్ల మంచి ఉపయోగాలుంటాయి. ఇవి చాలా ఏండ్ల పాటు చల్లని గాలులను అందిస్తాయి. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం బకరుచెక్క పూలుగా వ్యవహరించే సిసాల్పినియా సప్పన్, కలప జాతికి చెందిన దాల్బెర్గా సిస్సూ, గొయ్యా పండు పూలుగా వ్యవహరించే సీడియమ్ గువా, దిరిసెన చెట్టు వంటి వాటిని నగరాల్లో పెంచడం వల్ల వాయు కాలుష్యం ప్రభావం తగ్గుతుంది.

ప్రకృతిసిద్ధమైన పచ్చని చెట్లు లేదా మొక్కలతో సరిహద్దుల చుట్టూ రక్షణ ఏర్పాటు చేస్తే కార్బన్ వాయు ప్రభావం తగ్గుతుంది. వాతావరణ మార్పులను నియంత్రించవచ్చు. తోటల చుట్టూ, పొలాల చుట్టూ కూడా ఇలాంటి రక్షణ వలయం ఏర్పాటుచేసుకుంటే చాలా ప్రయోజనాలుంటాయి. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభంలోనే మద్ది (గ్లైరిసిడి.) కొమ్మలు, నేలగురిడి (ఎరిత్రినా) కొమ్మలు, తలంబ్రాలు (లాంటానా) చెట్టు కొమ్మలను పొలం గట్ల వెంబడి నాటితే అవి చిగురించి మంచి వాతావరణానికి సాయపడతాయి. తక్కువ కాలంలోనే బాగా ఎదిగే లక్షణాలున్న మరికొన్ని – అవిశ చెట్టు (సెస్బానియా), సుబాబుల్, మద్ది చెట్లు పెంచడం మంచి ఫలితాలకు దారితీస్తుంది. రెండో ఏడాదికే ఈ చెట్ల నుంచి రాలి ఆకులు అలముల వంటివి పేరుకుపోయి ఆ రకమైన చెత్త, ఇతర బయోమాస్ వ్యరాథల సాయంతో కంపోస్టు ఎరువుల తయారీకి ఉపయోగపడుతుంది. కాలం గడిచే కొద్దీ మరెన్నో దేశీయ జాతి మొక్కల పెరుగుదల సాధ్యమవుతుంది.

మద్ది, సుబాబుల్, నేలగురిడి (ఎరిత్రినా), అవిశ (సెస్బానియా) వంటి చెట్లు తక్కువ కాలంలోనే బాగా ఎదుగుతాయి. వర్షాకాలంలో అయితే వాటిని నేరుగా విత్తనాలు జల్లడం ద్వారా కూడా పెంచవచ్చు. ఇవి పశువులకు మేతగా కూడా ఉపయోగపడతాయి. అంతేకాక వాటి నుంచి పేరుకుపోయే బయో మాస్ పదార్థాలు నేరుగా పొలం మట్టిలోకి కరిగిపోగలవు. భూసారం పోషణకు ఉపయోగపడగలవు. అతి తక్కువ ఖర్చుతో సాధ్యమయ్యే ఈ విషయంలో రైతులకు విత్తనాలను చేరవేయడంతో పాటు వారికి సరైన మార్గదర్శకం, ప్రోత్సాహం అవసరం.

కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కొంత చొరవ తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రైవేటు వ్యక్తుల అధీనంలోని భూముల్లోను, ప్రభుత్వ భూముల్లోనూ బయో ఫ్యుయల్ గా ఉపయోగపడే చెట్ల పెంపకానికి చర్యలు తీసుకుంటోంది. ఈ కృషిలో రాష్ట్ర బయో ఫ్యుయల్ డెవలప్ మెంట్ బోర్డు ప్రధాన పాత్ర వహిస్తోంది. అలాంటి చెట్లలో చెప్పుకోవలసినవి – కానుగ (పొంగామియా), బాయిల్ గ్రీన్ లీఫ్ అని పిలిచే ఒక రకం కషాయం తయారీకి ఉపయోగించే లక్ష్మీ తరువు( సిమరూబా), జత్రోపా, మధుకా వంటివి రైతులకు అందచేస్తున్నారు. ప్రత్యేకంగా ఇందుకోసం హసిరు హొన్ను లేదా బరడు బంగార ప్రాజెక్టు పేరుతో కృషి సాగుతోంది. పొలం గట్లపై వీటిని పెంచేం విధంగా రైతులను ప్రోత్సహించడం అవసరం. సాగుయోగ్యం కాని ఇతర భూముల్లో కూడా వీటి పెంపకం చేపట్టవచ్చు. విత్తనాభివృద్ధితో పాటు వాటి నుంచి పేరుకునే వ్యర్థాలు బయో మాస్ తయారీకీ లీఫ్ లిట్టర్ తయారీకి ఉపయోగపడతాయి. వీటిని కంపోస్టు తయారీలో ఉపయోగించవచ్చు. పొలానికి ఎరువుగా వాడవచ్చు. ఆ రకంగా రసాయనాల వాడకం తగ్గుతుంది. వాతావరణ మార్పుల బెడదకు కారణమయ్యే రసాయనిక ఎరువులు వాడవలసిన అవసరం తగ్గుతుంది.

విస్తృత అవకాశాలు

ఉమ్మడి భూముల్లోను, పాఠశాలలు, ఇతర విద్యా సంస్థల ఆవరణాలలోనూ, ఆలయాలు, చౌడు నేలలు, రోడ్ల వెంబడి కూడా ఇలాంటి చెట్లు లేదా మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలి. మొక్కలను నాటడం అనే కార్యక్రమాన్ని సాంస్కృతిక జీవితంలో ఒక భాగంగా మార్చివేయాలి. అంతేకాని నిర్బంధంగా మార్చరాదు. ఇలా చేసి సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించాలి. పలల్లె ప్రాంతాలలో స్వయం సహాయక బృందాలు, యువజన సంఘాలు, విద్యార్థులు పాల్గొనేలా చూడాలి. మెట్ట భూముల్లో రైతులు వ్యవసాయ అనుబంధంగా అడవుల పెంపకంవైపు మళ్లేలా చూడాలి. అంతేకాకుండా చెట్ల ఆధారిత సేద్యం అనుసరించేలా ప్రేరేపించాలి. అందుబాటులో ఉన్న ఖాళీ జాగా ఆధారంగా పెరడి స్థలాల్లో కూడా ఒకటి రెండు మొక్కలు పెంచేలా అవగాహన కల్పించాలి. ఒక ఎకరా విస్తీర్ణంలో కనీసం 200 నుంచి 300 వరకు చెట్లు నాటితే మంచి ఫలితముంటుంది. ఇలా చెట్లను నాటడం ఆధారంగానే ప్రభుత్వం ప్రకటించిన సదుపాయాలకు అర్హత నిర్ణయించాలి. చిట్టచివరిగా, వాతావరణంలోని కార్బన్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు చెట్ల పెంపకం మాత్రమే ఏకైక పరిష్కారం. అప్పుడే వాతావరణంలో అసమానతల ప్రభావం తగ్గించడం సాధ్యమవుతుంది.

ఎం. ఎనె. కులకర్ణి
అడిషనల్ చీఫ్ ప్రాజెక్టు ఎక్జిక్యూటివ్
బెయిఫ్, కోనేరు లక్ష్మయ్య స్ట్రీట్
మొగల్రాజపురం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
E-mail: mnkulkarni65@gmail.com

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి ౨౧, సంచిక ౨, జూన్ ౨౦౧౯

 

 

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...