సుస్థిర సేద్యం —- ఒక్క ఎకరా నమూనా

ఒక్క ఎకరా పొలంలో కూడా వ్యవసాయాన్ని లాభసాటిగా నిర్వహించుకోవచ్చు. అయితే అందుకు మనం చేయవలసినదల్లా, ప్రకృతి సిద్ధమైన సేద్య విధానాలు అనుసరించాలి. అందుబాటులో ఉన్న సహజ వనరులను సక్రమంగా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్రానికి చెందిన తమ్మయ్య అనే సామాన్య రైతు అనుమానానికి ఆస్కారం లేకుండా నిరూపిస్తున్నాడు. బహు ముఖ పంటల సేద్య విధానం అనుసరించి, కేవలం తనకున్న ఎకరా పొలంలో ఉత్తమ జీవన ప్రమాణాలతో జీవనం సాగించవచ్చని ఆయన ఆచరించి చూపించాడు.

మైసూరు జిల్లా హున్సూర్ బ్లాక్ లోని చౌడికట్టె గ్రామానికి చెందిన తమ్మయ్య అనే రైతు ఇప్పటికి నాలుగు దశాబ్దాలుగా ప్రకృతి సిద్ధమైన సేద్య విధానాలను అవలంబిస్తూ పరిసరాలలోని ఇతర రైతులకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నాడు. నిరంతరం కొత్త కొత్త సేద్య విధానాలను అనుసరించేందుకు ముందుకు వస్తూ ఆవిష్కరణలకు సారధిగా నిలుస్తున్నాడు. తండ్రి నుంచి వారసత్వంగా లభించిన కొద్ది పాటి పొలం ఆయనకున్న ఆస్తి.  కొద్ది జాగాలో ఆయన తండ్రి రసాయనాలను విరివిగా ఉపయోగించి సేద్యం చేసేవాడు. అయితే గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించిన తిమ్మయ్య కు రసాయనాలతో సేద్యం చేయడం వల్ల కలిగే అనర్థాల గురించిన స్పష్టమైన అవగాహన ఉండడంతో ఆ దారిని వదిలేశాడు. ప్రకృతి సహజమైన సేద్యపు విధానాలనే అనుసరించేందుకు నడుం బిగించాడు.

మొత్తం మీద తిమ్మయ్య కు వారసత్వంగా వచ్చిన భూ విస్తీర్ణం దాదాపు 24 ఎకరాలు. అందులో 16 ఎకరాలలో తోటల పెంపకం చేపట్టేవారు. అందులో సుమారుగా 800 కొబ్బరి చెట్లు ఉండేవి. వాటి మధ్య జాగాలో అంతర పంటలుగా సపోటా, వంకాయ, మామిడి, అల్లం. పసుపు, ఇంకా ఇతర సీజనల్ పంటల సాగును చేపట్టేవాడు. వాటిని పండించేందుకు ఆయన పూర్తిగా సేంద్రీయ పద్ధతులలో సంప్రదాయక పంటల మార్పిడి విధానాలనే అనుసరించేవాడు. మొక్కల పెంపకాన్ని చేపట్టి ఎకరా భాగంలో నర్సరీని నిర్వహించడం ప్రారంభించాడు. అందులోనే అడవుల్లో పెరిగే కొన్నిటిని, పండ్ల మొక్కలను,  కలప సంబంధిత చెట్లను కూడా పెంచడం మొదలుపెట్టాడు. ఆ రకంగా పెంచిన ఆ మొక్కలను కొనడానికి ఆ ప్రాంత రైతులు బారులు తీరేవారు. ఈ విధంగా తిమ్మయ్యకు మరింత ఆదాయం లభించేది.

దాదాపు 6 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయపు బావి తవ్వించాడు. వాటి గట్లపై కలప వెదురు చెట్లను, క్లస్టర్ ఫిగ్ చెట్లను, పశువుల దాణాగా ఉపయోగపడే వాటిని పండించేవాడు. ఆయన పొలం ఉన్న ప్రాంతంలో ఏడాదికి సగటున 770 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవుతోంది. కనీసం 56 రోజుల పాటు వర్షాలు కురుస్తుంటాయి. సాధారణంగా నైరుతీ రుతుపవనాల సమయంలోనే ఎక్కువగా వర్షాలు కురుస్తుంటాయి. చెరువులోని నీటిని పొలానికి నీరు పెట్టడానికి ఉపయోగించేవాడు. అలాంటి అవసరం ఏమీ లేనప్పుడు చెరువులోని నీరు భూగర్భ జలాల నిల్వలను పెంచడానికి ఉపయోగపడేది. భూగర్భంలోని జలాలను బయిటకి తోడిపోసేందుకు ఆయన మానసికంగా ఎప్పుడూ ఇష్టపడేవాడు కాదు. కానీ, వేసవి కాలంలో 5 హెచ్ పి మోటారును ఉపయోగించి పొలాన్ని తడిపెట్టక తప్పేది కాదు.

ఆయన పొలంలో తవ్వించిన 6 చెరువులలో ఒకటి పూర్తిగా చేపల పెంపకానికి కేటాయించాడు. ఇలా చేపల పెంపకం కూడా ఆయనకు మరింత ఆదాయం తెచ్చిపెట్టేది. అదే విధంగా తిమ్మయ్య స్వయంగా కొన్ని పశువులను పెంచుతూ ఉండేవాడు. అలా పశు పోషణ ద్వారా సేంద్రీయ ఎరువుల తయారీకి, సేద్యానికి, క్రిమిసంహారకాల తయారీకి కూడా ప్రయోజనకరమని ఆయనకున్న గట్టి విశ్వాసం. సరే ఎలాగూ మరి కొంత ఆదాయం కూడా వస్తుంది. ఈ కారణాల వల్ల 11 ఆవులు, (వాటిలో 8 మలనాడు గిద, 3 హాలికర్ జాతివి) 4 దూడలు, 3 గొర్రెలు, 12 మేకలు, 2 టర్కీ కోళ్లు, 4 స్థానిక జాతి కోళ్లు ఆయన పశువుల కొట్టం నిండుగా పశు సంపదతో కలకలలాడేది. ఆయన పెంచుతున్న వాటిలో టర్కీ కోళ్లు పాముల వేటాడి వాటి సమస్యకు పరిష్కారం చూపించేవి.

ఒక ఎకరా నమూనా

ఒక పక్క జనాభా పెరిగిపోతూ ఉండడం, మరో వైపు చిన్న కమతాల సంఖ్య పెరిగిపోతున్న కారణంగా చిన్న సన్నకారు రైతులకు ఎదురవుతున్న అనేక సమస్యల గురించిన స్పష్టమైన అవగాహన ఆయనకు ఉండేది. సేద్యం మీదే ఆధారపడి మెరుగైన జీవన ప్రమాణాలతో రోజులు దడపడం కష్టసాధ్యమైన పని అని గుర్తించాడు. పైగా ఏక పంట సాగు విధానం అనుసరించి సంప్రదాయక విధానాలలో సేద్యం మరింత సమస్యాత్మకమని ఆయన తెలుసుకున్నారు. అనుకోకుండా 2019 లో ఆయన కొల్హాపూర్ సమీపంలోని కన్నేరి వద్ద ఉన్న శ్రీ సిద్ధగిరి మఠం సందర్శించడం జరిగింది. అక్కడే ఆయనకు ఈ ఒక ఎకరా నమూనా సేద్యం గురించి తెలిసి వచ్చింది. ఈ పద్థతిని తాను అనుసరించి మార్గం చూపిస్తే కేవలం ఎకరా భూములున్న చిన్న రైతులకు కూడా ఒక మార్గం చూపినట్లు అవుతుందని ఆయన స్పష్టమైన అభిప్రాయానికి వచ్చాడు. ఆ రకంగా రైతులకు మరింత ఆదాయం వస్తుంది. వారు స్వయం సమృద్ధి సాధించగలుగుతారని విశ్వాసం ఏర్పడింది. పరిమిత వనరులున్న రైతులు సేద్యంపై ఆధారపడి మెరుగైన జీవన ప్రమాణాలు సాధించవచ్చని ఆయన భావించారు. వాటి పర్యవసానమే ఆయన ఒక ఎకరా పొలం నమూనాను స్యవంగా చేపట్టడానికి ప్రేరణ అయింది.

అదే ఏడాదిలో మల్టీ లేయరింగ్ సేద్య విధానం గురించి కూడా తిమ్మయ్యకు అవగాహన ఏర్పడింది. ఈ విధానంలో వేర్వేరు ఎత్తు పెరిగే మొక్కలను ఒకే చోట సాగు చేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఈ పద్ధతిలో ప్రకృతి పరంగా లభించే వనరులు – భూమి, నీరు, సూర్య రశ్మి, వంటివి – పూర్తిగా ఉపయోగించుకునేందుకు సాధ్యమవుతుంది. ఒక రకంగా దీనిని స్వయంసమృద్ధికి అనువైన సాంకేతికత అని చెప్పవచ్చు. ఈ విధానంలో మొదటి పంట దిగుబడి చేతికి అందే సరికి రెండో పంట కూడా కోతకు సిద్ధమవుతుంది. ఒక దానికి మరొకటి చేరువగా మొక్కలు పెరుగుతుంటాయి. ఒక పంటకు అందించే నీరు రెండు పంటలకూ సరిపోతుంది. ఒకొక్కప్పుడు మరో ఒకటి రెండు పంటలకు కూడా సరిపోవచ్చు. ఆ రకంగా నీటి వినియోగాన్ని ఆదా చేసుకోవచ్చు.

తిమ్మయ్య కొబ్బరి చెట్ల పెంపకాన్ని తన మొదటి పంటగా ప్రారంభించాడు. చాలా ఎత్తుగా పెరిగే ఈ చెట్లను తూర్పు, పడమర దిశల్లో పెంచడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇవి దాదాపు 30 అడుగుల ఎడం ఉండేలా నాటాడు. ప్రతి రెండు కొబ్బరి చెట్ల మధ్య సపోటా పెంపకం చేపట్టాడు. వీటి ఎత్తు కొద్దిగా తక్కువగానే ఉంటుంది. పైగా కొమ్మలు దట్టంగా అలముకుంటాయి కదా. ఈ రెండు చెట్లకు మధ్య ఉన్న ప్రదేశంలో మరీ ఎత్తు పెరగని అరటి పెంచేవాడు. దీనిని రెండోవ లేయర్ అనవచ్చు. కొబ్బరి చెట్లకు చేరువగా దిగువన మిరియాలు, తమలపాకుల తోట చేపట్టాడు. వాటి మధ్యలో అల్లం, పసుపు సాగు చేపట్టాడు. ఇక మూడో లేయర్ గా ఉత్తర, దక్షిణ దిశల్లో మామిడి, జామ, బొప్పాయి, పనస, నేరేడు పెంపకం చేపట్టాడు.. వాటికి దిగువగా, తరువాతి లేయర్ లో నోని మొక్కలు (తెగడు లేక మద్ది), ప్యాషన్ ఫ్రూట్ )తపన ఫలం లేక కృష్ణ ఫలం), రామ్ ఫల్, లక్ష్ణణ్ ఫల్, నిమ్మ, ఇతర పండ్ల రకాల పెంపకం చేస్తాడు.

ఇంకా ఆకు కూరలు, సీజనల్ కూరగాయలు, చిరు ధాన్యాలు కూడా పండించేవాడు. వాటిని పెంచడం వల్ల కలుపు పెరగకుండా నివారించవచ్చు. అదే సమయంలో భూసారాన్ని కాపాడుకోవచ్చు. అంతేకాక, భూమిలో అల్లం, పసుపు, కొన్ని రకాల దుంపలు, కర్ర పెండలం (కసావా), స్వీట్ బంగాళా దుంపలు సాగు చేపట్టేవాడు. బంగాళా దుంపల సాగు చేపట్టడంలో ప్రధాన ఉద్దేశం ఎలుకలను అవి ఆకట్టుకుంటాయి. ఆ రకంగా ఇతర పంటలకు ఎలుకల బెడద తగ్గిపోతుంది. ఇలా వివిధ రకాల పంటలను చేపట్టడం వల్ల అవి ఒక దానికి మరొకటి సహాయకారిగా ఉంటుంది. పసుపు వల్ల దానికి ఉన్న యాంటీ మైక్రోబియల్ స్వభావం కారణంగా హానికర క్రిముల సమస్యకు చెక్ పెట్టవచ్చు. కూరగాయల పెంపకం వల్ల కలుపు పెరుగుదలను నివారించవచ్చు. సుగంధ ద్రవ్యాల సాగు కు సూర్య రశ్మి అవసరం అంతగా ఉండదు.

గ్లిరిసెడియా (ఇది దుంప రకానికి చెందినది) సాగు భూసారానికి రక్షణ ఇస్తుంది. అలాగే మునగ కాడలు (డ్రమ్ స్టిక్), సెస్బేనియా (అవిసాకు) ఇంకా మిలియా దుబియా రకాలు పొలం గట్లపై సాగు చేస్తారు, వీటిలో గ్లిరిసెడియా అనేది నేలలో నత్రజని వృద్ధి చెందిస్తుంది. ఇక సె. స్బేనియా, మునగ కాడల ఆకులు, గింజలు ఆహార పదార్థాలకు సువాసనలనిస్తాయి. అంతే కాకుండా కొన్ని రకాల రుగ్మతలను నివారించేందుకు ఔషధ మూలికలుగా కూడా ఉపయోగపడతాయి. వీటి చెత్తా చెదారం వంటివి సేంద్రీయ ఎరువుల తయారీకి ఉపకరిస్తాయి. తనకున్న ఎకరా పొలం సందర్శించిన ప్రతి సారీ కూడా తిమ్మయ్య ఆకుల సేకరణకు, వాటిని రాల్చివేసేందుకు ఎంతో కొంత సమయం కేటాయిస్తాడు. అలాంటి వ్యర్థాలు హరిత పత్రాలతో ఎరువులు తయారుచేస్తాడు. నేలమీద రాలిపోయిన ఆకులు కుళ్లిపోయి, మెల్లిగా మట్టిలో కరిగిపోతాయి. ఆ విధంగా భూసారాన్ని మెరుగు పరుస్తాయి. గ్లిసుమారు ఒక కిలో సిరెడియా ఆకులను నేలమీద వదిలేసి కుళ్లిపోయేలా చేస్తే వాటి కారణంగా 120 లీటర్ల వర్షపు నీటిని నిల్వచేసుకోవచ్చు. ఆ రకంగా నీటి వనరులను పొదుపు చేసేందుకు తోడ్పడతాయి.

ఆయన పొలంలో పెరిగే ఇతర రకాలలో సుమారు 80 ఔషధ గుణాలున్నవి. కాఫీ తోట, ఇతర చిన్న చిన్న పండ్ల మొక్కలు కూడా ఉంటాయి. ఆ పొలం భాగంలో పుప్పొడి వ్యాప్తికి అనుకూలమైన వాతావరణం సమృద్ధిగా ఉంది. ఆ కారణంగా, తేనెటీగల పెంపకం యూనిట్లను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా జీవామృత్ అనే సేంద్రీయ క్రిమి నాశిని తయారు చేసి డ్రమ్ములలో నింపి నిల్వచేస్తుంటాడు. (బాక్సు 1 చూడవచ్చు) పంట వ్యర్థాలను కూడా ఆయన తన పొలంలో జాగ్రత్తగా నిల్వచేసి ఉంచుతాడు. కలుపు తీత, పొలం దున్నడం, అంతర పంటల సాగు వంటి విధానాలను ఆయన ఎంపిక చేసుకున్న నమూనా ఎకరా పొలంలో అనుసరించడు.

—————————————————————————————————————————————-

బాక్సు 1 : జీవామృత్ తయారీ విధానం

పెద్ద బ్యారెల్ లో 200 లీటర్ల నీటిని నింపాలి. అందులోకి 10 కిలోల ఆవు పేడ, 10 లీటర్ల గో మూత్రాన్ని, 2 కిలోల బెల్లం, 2 కిలోల పప్పు పిండి, కొద్దిగా అంటే ఒకటి రెండు గుప్పెళ్ల స్థానిక పొలం మట్టిని కూడా చేర్చాలి.

ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలియపెట్టాలి. తరువాత కనీసం 48 గంటల పాటు చల్లటి నీడలో నానపెట్టాలి. జీవామృతం సిద్ధమైపోయినట్లే. ఎకరా పొలానికి 200 లీటర్ల జీవామృత్ ఉత్తమ ఫలితాలను ఇవ్వగలుగుతుంది.

—————————————————————————————————————————————–

మరో విషయాన్ని కూడా ఆయన ఆచరణలో చూపించాడు. జీవ సంబంధిత విధానాలలోనే క్రిమి నాశక మార్గాలను ఆయన ఆచరించి అందరికీ వాటి ప్రాధాన్యతను వివరిస్తున్నడు. ఉదాహరణకు – టెర్మినలియా చెబులు అనే మొక్కల గింజలను 2 లీటర్ల సీసాలలో నిల్వచేస్తాడు. ఆ సీసాలను కొబ్బరి చెట్లకు వేలాడదీస్తాడు. అలా చేయడం వల్ల రైనోసరస్ బీటిల్ అనే చీడ నుంచి వాటికి రక్షణ లభిస్తుంది. అదే విధంగా, కోతుల బెడదను నివారించేందుకు తిమ్మయ్య తన పొలంలో రెండు సీసాలు ఏర్పాటుచేస్తాడు. వాటిలో చేపల ముక్కలను జతచేసిన చేపల పులుసును నింపుతాడు.

సరి కొత్త విధానాలను అవగాహన చేసుకుని, ఆచరించేందుకు ఎల్ల వేళలా సిద్ధంగా ఉండే తిమ్మయ్య తన వ్యవసాయ క్షేత్రంలో ఎన్నో ప్రయోగాలు చేపట్టి మంచి ఫలితాలు సాధించాడు. వాటిలో కొబ్బరి మొక్కల సేకరణ, అరటి చెట్ల పెంపకంలో గ్రూపు మెథడ్ (బాక్సు 2) వంటివి ముఖ్యమైనవి. వాటిని ఆయన పొలం సందర్శించే ఇతర రైతులకు కూడా వివరించి వారిని కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడు.

ప్రయోజనాలు – లాభాలు

మల్టీ లేయర్ సేద్య విధానం ద్వారా దాదాపు 200 రకాల మొక్కలను ఆయన పెంచుతున్నాడు. వాటిలో 80 ఔషధ ప్రాథాన్యత ఉన్నవి. ఇంకా కొబ్బరి, సపోటా, అరటి, జామ, పనస, చిరు ధాన్యాలు, ఆకు కూరలు, మామిడి, దుంపలు, ఇతర నేలలో పెరిగే వాటిని పెంచుతుంటాడు. మల్టీ లేయర్ పంటల సాగు వల్ల ఒక్క ఎకరా పొలంలోనే స్పూర్తివంతమైన, పరస్పర సహకార సేద్య విధానాలను అమలు చేయడానికి సాధ్యమవుతోంది. అలాంటి ఉత్తమ విధానాల ఫలితంగా నీరు, భూసారం, గాలి, పరిమిత విస్తీర్ణం, సూర్య రశ్మిని పరిమిత వనరులను గరిష్టంగా ఉపయోగించుకునేందుకు అవకాశాలు మెరుగవుతున్నాయి. ఆ రకంగా వనరులను మెరుగ్గా ఉపయోగించుకోగలుగుతున్నారు.

ఇక్కడ గమనించవలసిన అత్యంత కీలకమైన ప్రయోజనం ఏమిటంటే నీటి వినియోగం చాలా పరిమితంగా ఉంటుంది. అంటే నీటి కొరత ఎక్కువగా ఉన్న కరువు పీడిత ప్రాంతాలకు ఈ ఒక ఎకరా నమూనా చాలా మేలు చేస్తుంది. ఆ కొద్ది జాగాలో పెరిగే పొదలు (ష్రబ్స్)పండ్ల మొక్కలు, ఇంకా ఇతర కూరగాయలు – గుబురుగా పెరిగే అవకాశాలున్న మొక్కలు నీటి తేమని అత్యధికంగా కాపాడతాయి. అదే సమయంలో పొలంలోని పెద్ద చెట్ల ద్వారా లభించే చల్లని నీడ వల్ల తేమ సురక్షితంగా ఉంటుంది. ఆవిరి కాకుండా ఉంటుంది. ‘ఒక ఎకరాలో సంప్రదాయ సేద్య విధానం అనుసరిస్తే సుమారుగా 20,000 లీటర్ల కన్నా ఎక్కువ నీటిని  సాగు కాలంలో ఉపయోగించవలసి ఉంటుంది. అదే ఈ విధానంలో కేవలం 6000 లీటర్ల నీరు సరిపోతోంది ’ అని చెబుతున్నారు తిమ్మయ్య.

——————————————————————————————————————————————–

బాక్సు 2 : పండ్ల మొక్కలు, తోటల పెంపకంలో నూతన ఆవిష్కరణలు

కొబ్బరి మొక్కల పెంపకం: ముందుగా 40 ఏండ్ల వయస్సుకన్న పెద్ద చెట్టు ను ఎంపిక చేసుకుని దాని చుట్టూ వలయాకారంలో కొబ్బరి మొక్కలను నాటుకోవాలి. ఈ పెద్ద చెట్టు నుంచి రాలిన విత్తులనే అక్కడ పాతిపెట్టేందుకు ఎంపిక చేసుకోవాలి. అలా పిక చేసుకున్న విత్తనాలను మూడు నెలల పాటు నానపెట్టాలి. వాటిలో సగం నీటిలో పైకి తేలుతాయి. మరి కొన్ని నీటిలోనే సగం వరకు మునిగి ఉంటాయి. అలాంటి వాటిని సేకరించి మొక్కలుగా నాటుకోవాలి. విత్తనాలను జీవామృత్ లో (బాక్సు 1లో సూచించినట్లుగా) నానపెట్టడం మంచిది. తరువాత వాటిని తగువిధంగా శుద్ధి చేసుకోవాలి. అప్పుడు వాటిని నర్సరీలలో ఉపయోగానికి వీలుగా నిల్వచేసుకోవాలి.

ఇక గ్రూప్ మెథడ్ లో అరటి చెట్ల పెంపకం: తిమ్మయ్య 1- రకాలను ఎంపిక చేసుకున్నాడు. అవి – రొబస్టు, నెండ్రన్, ఎల్లక్కి బాలే, రసబాలే, సాంబార్ బాలే, కాడ్ బాలే, మార బాలే, కెంపు లేదా రాజా బాలే ఇంకా జి 9. కోత తరువాత మొక్కల కాండాలను అలాగే నేలలో వదిలేస్తాడు. వాటిలోని పొటాషియం కొత్తగా ఎదుగుతున్న మొక్కలకు ఉపయోగపడుతుంది. ఆ రకంగా మళ్లీ పొటాష్ అందించే పని లేదు.

ఈ విధానం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. అది ఏమిటంటే ఏడాది పొడవునా దిగుబడి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన సాగు విధానంలో వేర్వేరు సమయాలలో పక్వమయ్యే పంటలకు ప్రాధాన్యం ఉంటుంది. అంటే నిత్యం ఏదో ఒక పంట దిగుబడినిస్తూనే ఉంటుంది. అంతేకాకుండా మొక్కలకు నిరంతరం పోషకాలు అందుతుంటాయి. తిమ్మయ్యకు ఆదాయం లభిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు, చిరు ధాన్యాల సాగును కుటుంబ అవసరాలకు చేపడతాడు. ఆ రకంగా  కుటుంబ సభ్యులకు నిత్యం పోషక విలువలతో కూడిన ఆహార భద్రత ఉంటుంది. మిగులు భాగానికి అదనపు విలువలు చేకూర్చి మార్కెట్ కు చేరుస్తాడు. అందుకోసం ఆ చిరు ధాన్యాల పొడరును 20 లేక 25 కిలోల ప్యాకెట్లుగా తయారుచేసి విక్రయిస్తాడు. వాటిని పౌడర్ చేసేందుకు సంప్రదాయక రాతి రోలునే ఉపయెగిస్తాడు. ఆ రకంగా వాటిలోని పోషకాలకు భరోసా ఉంటుంది. అలా సిద్ధం చేసిన ఆ ప్యాకెట్లను ఆరోగ్య స్ఫూర్తి బ్రాండ్ పేరు మీద విక్రయిస్తాడు. ఆ రకంగా ఏటా రూ. 50,000 వరకు ఆదాయం లభిస్తుంది. ఇక తోట పెంపకంలో భాగమైన కొబ్బరి, సపోటా, అరటి, మిరియాల వంటి వాటి ద్వారా ఏటా రూ. 10 లక్షలు సంపాదించగలుగుతున్నాడు .అది కాక, కఫ చూర్ణ పేరుతో తన తోటలోని ఔషధ మొక్కల తో తయారుచేసిన మందును విక్రయిస్తాడు. కొన్ని అరటి కాయలను విక్రయించిన తరువాత మిగిలిన వాటిని ఆరబెట్టి అమ్ముకుంటాడు. తాను ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను అంటే కూరగాయలు, మామిడి కాయలు, పనస కాయలను స్నేహితులకు, సందర్శకులకు పంచిపెట్టి అందరి మెప్పు సంపాదించుకుంటున్నాడు.

———————————————————————————————————————————————-

ఆయన పొలంలో పండించేవన్నీ రసాయనాల ప్రభావం లేనివే కావడం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. సేంద్రీయ సేద్య పద్ధతుల్లో పండించినవే. చాలా స్పష్టంగా చెప్పాలంటే ఒక ఎకరా నమూనా అనుసరించి కూడా వ్యవసాయాన్ని లాభసాటి కార్యంగా నిర్వహించవచ్చునని ఆయన నిరూపించాడు. అయితే అందుకు ప్రకృతి సహజమైన పద్ధతినే అనుసరించాలి. బాహ్య వనరుల వాడకాన్ని తగ్గించాలి. అవసరమైన సందర్భాలలో అదనపు విలువలు సమకూర్చాలి.

పండించడమే కాదు … ఇంకా ….

తిమ్మయ్య కృషి కేవలం సేద్యం చేసి పంటలు పండించడమే కాదు. దానిని సుస్థిరమైన జీవనోపాధిగా ఎలా మలచుకోవాలో కూడా ఆయన చాలా స్పష్టంగా ఆచరణలో సాధించి చూపించాడు. ఇప్పుడు దగ్గరిలోని 20 – 30 మంది ఆయన పొలాన్ని సందర్శించి ఆచరించేందుకు సిద్ధమై ఉన్నారు. ఇటీవల మైసూరులోని విద్యావర్ధన్ కాలేజీ విద్యార్థులు, ఇంకా వ్యవసాయ, తోటల పెంపకం యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి అధ్యయనం చేపట్టారు.

తిమ్మయ్య ఆచరిస్తున్న విధానాలనే అందరికీ వివరిస్తున్నాడు. నెలకో సారి శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటాడు. సాధారణంగా ఆ తరగతులకు 50 నుంచి 100 మంది హాజరవుతుంటారు. సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా, క్షేత నిర్వహణ విషయమై హున్సూర్ పరిసరాలలోని యువకులకు తగిన శిక్షణ ఇస్తున్నాడు. వారికి ఉచితంగానే వసతి, ఆహారం సమకూరుస్తున్నాడు. అది కాక రోజుకు రూ. 500 ఆర్థిక సాయం కూడా చేస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 70 మంది రైతులు ఆయన ప్రబోధించిన ఒక ఎకరా నమూనా విధానం అనుసరిస్తున్నారు. వారిలో కనకపురా, నానాజ గూడ, మైసూరు, చెన్నపట్న తాలూకాలలోని వారు ఉన్నారు.

 

బి.ఎం. సంజన
అసిస్టెంట్ ఎడిటర్, లీసా ఇండియా
ఏఎంఐ ఫౌండేషన్,
నెంబర్ 204, 100 ఫీట్ రోడ్డు
3వ ఫేజ్, బనశంకరి 2వ బ్లాక్, 3వ స్టేజి
బెంగళూరు – 560085, ఇండియా
E-mail: sanjana@amefound.org

ఆంగ్ల మూలం: 
లీసా ఇండియా సంపుటి ౨౪, సంచిక 3 , మార్చ్ ౨౦౨౨

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...