సురక్షిత వ్యవసాయ విధానాల ద్వారా పేదరికం నిర్మూలన

తమిళనాడు రాష్రంలో చిన్న కమతాల రైతులతో కలిసికట్టుగా వ్యవస్థాగత పద్ధతుల్లో మూడు అంచెల్లో చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఒక్కో స్థాయిలో పనిచేసే సంస్థలకు స్పష్టమైన బాధ్యతలను అప్పగించడం జరిగింది. వారిని సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించడంతో రెండు ప్రయోజనాలను సాధించగలిగారు. ముఖ్యంగా సేద్యపరంగా వారు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు లభించాయి. వనరులకు, సేవలకు చేరువ కావడం వల్ల రాష్ట్ర రైతాంగం సంపదను సమకూర్చుకోవడం సాధ్యమైంది.

తమిళనాడులోని మూడు జిల్లాల్లోని – నాగపట్నం, తిరువన్నామలై, కాంచీపురం- జనాభాలో అత్యధికులు వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. వారంతా నిరుపేద కుటుంబాల వారే. ఇటీవలి కాలంలో వ్యవసాయం గిట్టుబాటు కాని జీవనాధారంగా మారింది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. దిగుబడి తగ్గిపోతూ వచ్చింది. సేద్య వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. మార్కెట్ ఒడిదుడుకులు తట్టుకోవడానికి, ఇతర సేవలకు వారు దూరంగానే ఉండిపోయారు. వారి స్థితిగతుల గురించి అట్టడుగు స్థాయిలో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం వేరుశెనగ, మినుముల వంటి ముఖ్యమైన పంటల దిగుబడి చాలా తగ్గిపోయింది. వాటిని పండించడానికి చాలా ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టవలసిన స్థితి. వ్యవసాయ సంబంధంమైన సేవలు ఏవీ వారికి అందడంలేదు. రుణ సదుపాయం అనేది చాలా తక్కువగా ఉంటోంది.

అలాంటి పరిస్థితుల్లో సెంటర్ ఫర్ ఇండియన్ నాలెడ్జి సిస్టమ్స్ (CIKS) ముందుకు వచ్చింది. వృత్తి జీవనోపాధుల రిసోర్స్ సెంటర్ (బెంగళూరు) తో చేతులు కలిపింది. స్థానికులతో సమన్వయం చేసుకుంటూ చిన్న కమతాలు ఉన్న పేద కుటుంబాల ఆదాయం పెంపొందించేందుకు ఒక ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయంగా అభివృద్ధి కార్యక్రమాలకు చేయూత ఇచ్చే బ్రిటిష్ సంస్థ (DFID Global Poverty Action Fund (GPAF)) అనుబంధ సంస్థ విశ్వవ్యాప్త పేదరికం నిర్మూలన నిధి తోడ్పాటు లభించింది. దీనికి నెదర్లాండ్స్ కు చెందిన మరో అంతర్జాతీయ సంస్థ హైవోస్ నుంచి కూడా ఆర్థిక సహకారం అందింది. ఈ ప్రాజెక్టు కింద వ్యవసాయదారుల సారథ్యంలోనే సామాజిక ప్రాయోజిత కార్యక్రమంగా వ్యవసాయం లాభసాటిగా నిర్వహించేందుకు, మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి జరిగింది. ప్రస్తుతం ఈ మూడు జిల్లాల్లోను 79 గ్రామ పంచాయతీల పరిధిలోని 9218 రైతు కుటుంబాలకు ప్రాజెక్టు ప్రయోజనాలు అందుతున్నాయి.

ప్రాజెక్టు స్వరూపం

ఈ ప్రాజెక్టు స్వరూపంలో గ్రామ స్థాయిలో ఒక రైతు సంఘం ఉంటుంది. జిల్లా స్థాయిలో సమాఖ్య ఉంటుంది. జిల్లా స్థాయి సమాఖ్యను వ్యవసాయ ఉత్పత్తిదారుల కంపెనీ (Agriculture Producer Company) గా వ్యవహరిస్తారు.  వారికి కావలసిన సేవలను ప్రగతిశీల వ్యవసాయదారులు కొందరు గ్రామీణ వ్యవసాయ వ్యాపార సేవలను (Village Agricultural Business Development Service Providers – VABDSP) అందిస్తూ ఉంటారు.  ఇలాంటి వ్యవస్థ ప్రతి గ్రామానికి ఒకటి ఉంటుంది. దానిలోకి సభ్యులను స్థానిక రైతులే ఎంపిక చేస్తారు. రైతులకు అవసరమైన సేవలు వారికి అందుబాటులోకి తేవడానికి వారు కృషి చేయవలసి ఉంటుంది. ఒక రకంగా రైతులకు, ఈ ప్రాజెక్టు నిర్వాహకులకు లేదా ఉత్పత్తిదారు కంపెనీకి మధ్య సంధానకర్తగా చెప్పవచ్చు.

గ్రామ స్థాయిలోని మహిళల స్వయంసహాయక బృందాల మాదిరిగానే గ్రామ స్థాయి రైతులు సభ్యులుగా ఉండే బృందాలు ఏర్పాటు చేస్తారు. ఆ బృందంలో కేవలం పురుషులు మాత్రమే కాక, స్త్రీలకు విడిగాను, మిశ్రమ బృందాలుగాను, సమష్టి బాధ్యత కల బృందాలుగాను రైతుల క్లబ్ లుగాను రకరకాలుగా ఉండవచ్చు. ఈ తరహా బృందాలను సురక్షిత వ్యవసాయ స్వయంసహాయక బృందాలుగా (SASHGs) వ్యవహరిస్తారు. ఒక్కో బృందంలో 20 నుంచి 25 మంది సభ్యులుగా ఉంటారు.

ఒక పంచాయతీ పరిధిలోని రైతుల బృందాల నుంచి పంచాయతీ స్థాయి వ్యవసాయ అభివృద్ధి కమిటీ (Panchayat Agriculture Development Committee (PADC)లను ఎంపిక చేసుకుంటారు. ఇందులో 10 నుంచి 12 మంది వివిధ బృందాల ప్రతినిధులుగా ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. వీరు కాక, పంచాయతీ స్థాయి సభ్యులుగా కూడా కొందరిని ఎంపికచేసుకుంటారు. ఈ కమిటీల ముఖ్య కర్తవ్యం – ఈ రైతు సంఘాల మధ్య సమన్వయం సాధించడంతో పాటు వాటి కార్యకలాపాలపై పర్యవేక్షణ చేయవలసి ఉంటుంది.

ఇలా ఏర్పడిన పంచాయతీ స్థాయి కమిటీలపై మరో కమిటీ క్లస్టర్ స్థాయి కమిటీలు (Cluster Agriculture Development Committees (CADC) ఉంటాయి. ఇందులోకి పిఎడిసి ల నుంచి ఎంపికైన ప్రతినిధులుగా 20 నుంచి 30 మంది వ్యవహరిస్తారు. ఒక్కో క్లస్టరం కమిటీలో 15 నుంచి 20 పిఎడిసి లకు ప్రాతినిధ్యం ఉంటుంది. ఈ కమిటీ పంచాయతీ స్థాయి కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది.

ఇక జిల్లా స్థాయిలో  మనం ఇంతకుముందు చెప్పుకున్న వ్యవసాయ ఉత్పత్తిదారుల కంపెనీ  – ఎపిసి – అత్యున్నత స్థాయిలో పిఎడిసిలన్నిటిపైనా ఉంటుంది. పిఎడిసిల కార్యవర్గం సభ్యుల నుంచి 20 నుంచి 30 మందిని ఎన్నికచేసుకుంటారు. ఈ అత్యున్నత స్థాయిలోని ఎపిసి రైతులకు అత్యవసరమైన బీమా సదుపాయం, సేంద్రీయ ధ్రవీకరన పత్రాల జారీ, శిక్షణ కార్యక్రమాల వంటి విధులను నిర్వహిస్తూ సేవా సంస్థగా తోడ్పాటును అందిస్తుంది. ఇంకా రైతులకు మేలైన విత్తనాలు, సేద్యపు పనులకు అవసరమైన వేప గింజల పౌడర్, వానపాముల ఎరువులు, బయో ఫెర్టిలైజర్స్, బయోపెస్టిసైడ్స్, గన్నీ బ్యాగ్స్, పశువుల దాణా వంటివాటిని సభ్యులకు అందిస్తుంది.

ప్రస్తుతానికి 552 స్వయం సహాయక బృందాలు, 71 పంచాయతీ స్థాయి కమిటీలు, 5 క్లస్టర్ స్థాయి కమిటీలు, 2 ఎపిసిలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఈ రెండు ఎపిసిలలో సభ్యత్వం ఉన్న రైతుల సంఖ్య దాదాపు 4000 వరకు ఉంటుంది. ప్రాజెక్టు కాల పరిమితి ముగిసే సమయానికి కనీసం 9000 మందికి  లబ్ది చేకూర్చగలమని అంచనా వేస్తున్నారు.

సాధించిన ఫలితాలు

పర్యావరణ అనుకూల వ్యవసాయ విధానాల అనుసరణ

సేంద్రీయేతర వ్యవసాయ కార్యకలాపాలనుంచి అత్యధిక సంఖ్యలో రైతులు ఇప్పుడు సురక్షితమైన సేంద్రీయ సాగు చేస్తున్నారు. సేంద్రీయేతర వ్యవసాయ విధానాల నుంచి ఇక్కడి రైతు కుటుంబాల్లో 15 శాతం మంది క్రిమినాశక మందులు లేని సాగు పద్ధతులను అనుసరిస్తున్నారు. మరో 10 శాతం మంది పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం ప్రారంభించారు. కనీసం 55 శాతం రైతు కుటుంబాలు ఈ ప్రాజెక్టు కింద అందుతున్న వ్యవసాయ విధానాలను / పద్ధతులను పాటిస్తున్నారు. ఫలితంగా అట్టడుగు నుంచి అన్ని ప్రధానమైన పంటల సాగులోను అధిక ఉత్పత్తిని సాధించగలిగారు.

వ్యయభారం తగ్గింది … ఆదాయం పెరిగింది

ఇలా పర్యవేక్షణలో ఉన్న రైతుల సాగును పరిశీలించినప్పుడు వ్యయం 7 శాతం వరకు తగ్గిన విషయం నిర్ధారణ అయింది. సుమారు 4500 కుటుంబాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం వారి ఆదాయం కనీసం 15 శాతం వరకు పెరిగినట్లు తెలిసింది. 143 ఎకరాలలో 107 మంది రైతులు శ్రీ వరి సాగు చేపట్టారు. వారికి ఎకరాకు ఈ విధానం అనుసరించినందువల్ల వారికి ఖర్చు దాదాపు రూ. 1250 వరకు తగ్గినట్లు స్పష్టమైంది. అంటే జిల్లా వ్యాప్తంగా మొత్తం మీద అందరికీ కలిపి రూ. 1,78,750 వరకు ఆదా అయినట్టు మనం గమనించవచ్చు. నాగపట్టణం జిల్లాలో 45 మంది రైతులు శ్రీ వరి సాగు చేపట్టారు. వారికి ఎకరా సాగుకు అయ్యే వ్యయం రూ. 1200 వరకు తగ్గిపోయింది. అంటే ఈ జిల్లాలో రైతులకు ఆదా అయిన మొత్తం రూ. 54000 అన్న మాట.

ఇక ఇంటి వెనుక ఉండే పెరట్లో ఇంటి అవసరాలకోసం మహిళలు చేపట్టిన తోటల పెంపకం ద్వారా సగటున నెలకు రూ. 300 ఆదాయం సమకూరింది. ఈ విధంగా సుమారు 2000 వరకు పెరటి తోటల పెంపకాన్ని మహిళలు చేపట్టారు. ఈ రకంగా వివిధ వినిమయ వస్తువుల పెంపకంలో 305 మంది లబ్దిదారులు అదనపు  విలువను చేకూర్చుకున్నారు.

కమ్యూనిటీ విభాగాలు

ఈ ప్రాజెక్టు పరిధిలో కమ్యూనిటీపరంగా, స్థానిక అవసరాలకు తగినట్లు కొన్ని కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఇలా ఈ మూడు జిల్లాల్లో – స్థానికుల అజమాయిషీలో వారి స్వీయ నిర్వహణలో – 13 వానపాముల ఎరువులను తయారుచేసే యూనిట్లు (vermicompost units), 7 బయో పెస్టిసైడ్ తయారీ యూనిట్లు (community biopesticide units), 7 కమ్యూనిటీ ప్రయోజనాలకు ఉపయోగపడే అదనపు ఆదాయం సమకూర్చే యూనిట్లు (community value added production units) ఏర్పడ్డాయి. వీటిలో కొన్ని వానపాముల ఎరువుల యూనిట్లను, విస్తృత సామాజిక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన యూనిట్లను మహిళలే నిర్వహిస్తున్నారు. వాటి నుంచి తయారవుతున్న ఉత్పాదనలు మేలు రకంగా ఉంటున్నాయి. రైతులకు సకాలంలో సరసమైన ధరలకే ఏడాది పొడవునా అందుబాటులో ఉంటున్నాయి. ఈ యూనిట్లలో పనిచేసే మహిళలు, ఇతరులు ఈ విధంగా అదనపు ఆదాయం సంపాదించుకోగలుగుతున్నారు. ఈ ఆదాయం వారు చేపట్టే వ్యవసాయ క్షేత్రాలలో శ్రమకు అదనంగా లభిస్తోంది.

అందుబాటులోకి వచ్చిన వ్యవసాయ యంత్రాలు

వ్యవసాయదారులకు అవసరమైన యంత్రాలను సమకూర్చేందుకు గాను ప్రత్యేకంగా వ్యవసాయ యంత్రాలను (Agriculture Machineries Facilitation Centres (AMFCs) సమకూర్చే కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగింది. ఇలాంటివి 14 పంచాయతీలలో తమ వంతు సాయం అందిస్తున్నాయి. ఇక్కడ భూమి దున్నడానికి అనువైన యాంత్రిక చోదిత నాగళ్లు (power tiller), మినీ ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజన్లు, ట్రాన్స్ ప్లాంటర్స్, యంత్ర చోదిత కొనోవీడర్ (power operated conoweeder),  విన్నోవర్ వంటివి రైతులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రకమైన కేంద్రాలలో అధిక భాగం లాభాల బాటలోనే నడుస్తున్నాయి. అవి అందించే సేవలకు రైతులే ఖర్చు భరిస్తుండడంతో వాణిజ్యపరంగా లాభదాయకంగా సాగుతున్నాయి. ఉదాహరణకు, పెరనమల్లూరు పంచాయతీలో విన్నోవర్ సాయంతో 1800 బ్యాగ్ లు అంటే 144 టన్నుల వరిని శుభ్రం చేయడం జరిగింది.

వ్యవసాయ-పర్యావరణ అంశాలపై ప్రభుత్వాలు దీర్ఘకాలిక విధానాలను అనుసరించడం అవసరం. ఆ సమయంలో పాలకులు వ్యవసాయ-పర్యావరణపరమైన అంశాలతో పాటు వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా ముందుకు నడిపించేందుకు జాతీయ స్థాయిలో కొన్ని నిర్దుష్టమైన లక్ష్యాల మేరకు వ్యూహాత్మకంగా కృషి చేయాలి. అప్పుడే దేశ ప్రజలందరి ఆహార హక్కును కాపాడగలుగుతారు. వాతావరణ మార్పులకు తగినట్లుగా జాతీయ స్థాయి ప్రణాళికలను రూపొందించగలుగుతారు.

ఇలా శుద్ధి చేసిన ధాన్యం రైతులకు ఒక్కో బ్యాగ్ కు అదనంగా మరో రూ. 50 నుంచి రూ. 100 వరకు ఆదాయం సంపాదించిపెడుతుంది. అందుకు కారణం – ఆ రకంగా శుభ్రంచేసిన ధాన్యం నాణ్యతలో మెరుగ్గా ఉంటుంది.  ఈ కేంద్రాల సేవలు ప్రాజెక్టులో భాగస్వాములైన రైతులకే కాక ఇతరులకు కూడా అందుబాటులో ఉంటున్నాయి.

ముగింపు వాక్యాలు

గ్రామస్థాయి సేవలను, సదుపాయాలను, వారి అవసరాలకు తగిన విధంగా వారి ఇంటి ముంగిటికే తీసుకెళ్లడం వల్ల వ్యవసాయదారులకు అన్ని విధాలా ప్రయోజనకరంగా మారింది. మూడు అంచెల్లో చేపట్టిన ఈ వ్యవస్థీకృత విధానం (పంచాయతీ-క్లస్టర్-జిల్లా స్థాయిలలో)సకాలంలో వారికి కావలసిన ముడిసరుకులను, పరికరాలను అందించడం సులభసాధ్యమైంది. దిగుబడిని సరైన సమయానికి మార్కెట్ కు చేర్చడానికి తోడ్పడింది. ఈ మొత్తం కార్యనిర్వహణలో (గ్రామీణ వ్యవసాయ వ్యాపార సేవలు అందించే వారు (Village Agricultural Business Development Service Providers – VABDSP) మధ్య సమన్వయం, సమాచార వ్యాప్తి, పర్యవేక్షణ) పిఏడిసీలు, సిఏడిసిలు నిర్వహించవలసిన విధులు స్పష్టంగా ఉండడం కీలకంగా తయారైంది. అంతేకాక, వివిధ బృందాల మధ్య వివాదాలను పరిష్కరించడం కూడా సామరస్యంగా కృషి కొనసాగించేందుకు తోడ్పడింది. ఇంకా వ్యాపారపరంగా లక్ష్యాలను సాధించడంలో వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీ (APC),  ఈ విభిన్నమైన వ్యవస్థల మధ్య సేంద్రీయ లింకేజీని ప్రోత్సహించేందుకు ఉపకరించింది. ఈ విధంగా వ్యవస్థీకృత ఏర్పాటు ఆయా ప్రాంతాలలోని వ్యవసాయదారుల సామాజిక, ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభించింది.

స్థానికంగా ఉన్న ప్రగతిశీల రైతుల ఆద్వర్యంలో వారికి చేరువైన సేవలు, అక్కడి సమాజానికి చాలా ఉపయోగపడ్డాయి. అందుకు కారణం – వారికి అక్కడి అవసరాలు, పరిస్థితులు, ప్రాధాన్యతా అంశాల గురించి పూర్తి అవగాహన ఉండడమే. తోటి రైతులకు ఎప్పుడు ఏది అవసరమో వారు ముందుగానే గుర్తించగలగడం ఈ ప్రయత్నం విజయవంతం కావడానికి దోహదపడింది. గ్రామ స్థాయి వ్యాపార సేవలను అందించే వారి ఉపయోగం వారికి అర్థమైంది. అందువల్లనే వారి నుంచి అందుతున్న సేవలకు అయ్యే ఖర్చుల భారాన్ని ఆనందంగా స్వీకరించారు. ప్రభుత్వ సేవలు, రుణాలు, బీమా సదుపాయం వంటి అదనపు ప్రత్యేక సేవలకు కూడా అవసరమైనంత చెల్లించేందుకు వారు ముందుకు వచ్చారు.

వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీ నిర్వహణ బాధ్యతలను చేపట్టడంలోను, మహిళా సంఘాల నిర్వహణను ఆమోదించడంలోను, గ్రామీణ వ్యవసాయ వ్యాపార సేవలను అందించే కేంద్రాలలో మహిళలకు చోటు కల్పించడంలోను, స్థానికులకే తగినంత ప్రాధాన్యం లభిస్తూ ఉండడంతో అక్కడి మహిళల సామాజిక ఆర్థిక సాధికారికతను పెంపొందించడం సాధ్యమైంది. కీలకమైన నిర్ణయాలను తీసుకోవడంలో మహిళల మాటకు విలువ ఇవ్వడం మొదలైంది. మహిళల ఆద్వర్యంలోని గ్రామీణ వ్యవసాయ వ్యాపార సేవల కేంద్రాలకు సామాజికంగా మంచి గుర్తింపు లభించింది. బృందాల ఏర్పాటులో మహిళలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వడం (భూమి లేని వర్గాలకు, భూ యజమానులకు చోటు కల్పిస్తూ) వాటి ఉన్నత స్థాయి నిర్వహణ వ్యవస్థలలో మహిళలకు ప్రమేయం ఇవ్వడం,  భూమి లేని వారి ఆర్థిక పురోగతి కార్యకలాపాలకు అధిక ప్రాముఖ్యం ఇవ్వడం వంటి ఇతర చర్యల ఫలితంగా సమష్టిగా సాధించిన విజయంలో అందరికీ వాటా కల్పించింది.

మొత్తం మీద, ప్రాజెక్టు సత్ఫలితాలను సాధించి చూపింది. అన్ని వర్గాలకు చెందిన రైతుల ఆదాయం పెరిగింది. దిగుబడులు పెరిగాయి. ఖర్చుల భారం తగ్గింది. మొత్తం మీద వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీకి అధిక ఆదాయం సమకూరింది. అలాంటి కంపెనీల నిర్వాహకుల సామర్థ్యం మరింత విస్తరించింది. కొత్త కార్యకలాపాలపైకి వారు తమ దృష్టి కేంద్రీకరించడానికి ప్రోత్సాహం ఇచ్చింది. చర్చల్లో పారదర్శకత చోటు చేసుకుంది. ప్రయోజనకరమైన సంప్రదింపులు ఎక్కువయ్యాయి. పని తీరులోను, నిర్వహణలోను, నాయకత్వ లక్షణాలలోను, చర్చల ప్రయోజనాలు వంటి వాటిలో సంతృప్తికరమైన మెరుగుదల కనిపించింది. మహిళల స్వయంసహాయక సంఘాలు ఎక్కువ మొత్తాలని పొదుపు చేయగలిగాయి. పెద్ద మొత్తాలను రుణంగా సంపాదించగలిగాయి. ఆ విధంగా వారి వ్యవసాయం సుస్థిరమైన సురక్షితమైన కార్యకలాపంగా రూపాంతరం చెందింది. అక్కడి వ్యవసాయ కుటుంబాలను పేదరికం నుంచి గట్టెక్కించి సుసంపన్నత దిశగా నడిపించడంలో ఈ ప్రాజెక్టు పూర్తిగా విజయవంతమైంది.

కె. సుబ్రమణియన్, ఎస్. జస్టిన్, టి.జాన్సన్, కె. విజయలక్ష్మి
సెంటర్ ఫర్ ఇండియన్ నాలెడ్జి సిస్టమ్స్,
నెం. 30, గాంధీ మండపం రోడ్డు,
కొత్తూరుపురం, చెన్నై 600 085
E-mail: cikskazhi@gmail.com

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి 16, సంచిక 2, జూన్ ౨౦౧౪

 

 

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...