సమీకృత సేద్యానికి మంచి రోజులు

సమీకృత వ్యవసాయ విధానాలు (ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ – ఐఎఫ్ఎస్) అంటే సేద్య రంగానికి సంబంధించిన విభిన్నమైన విభాగాలను సమన్వయంతో అనుసరించడమే. సాధారణంగా, సేద్యానికి అవసరమైన వనరులన్నీ వాటి అన్నిటి మధ్య నెలకొనే సయోధ్యపైనే ఆధారపడి ఉంటుంది. ఒక విభాగం నుంచి వెలువడే త్పాదనలు మరో విభాగానికి ఇన్ పుట్ లుగా మారుతుంటాయి. ఈ సమీకృత విధానం విస్తరిస్తుండడానికి ప్రధాన కారణాలలో వనరులను అధికంగా సమకూర్చుకోవడం, వాటి నుంచి గరిష్ట ప్రయోజనాలను సాధించడంతో పాటు సుస్థిరమైన అధిక దిగుబడులను సాధించడం, వ్యవసాయ ఆధారిత జీవనోపాధులను పెంపొందించుకోవడం అత్యంత కీలకమైనవి. ఇంకా సాగు ద్వారా పోషక విలువలతో కూడిన, ఆరోగ్యప్రదమైన వైవిధ్యంతో కూడిన ఆహారాన్ని కుటుంబానికి మాత్రమే కాకుండా పెరడులో పెంచుకునే పశు సంపదకు కూడా సమకూర్చడం చాలా ప్రధానమైన అంశం. వాటన్నిటితో పాటు గ్రామీణ ప్రాంతాలలో అవసరమయ్యే వాటిని అన్నిటినీ సమకూర్చుకోవడం కూడా ఒక ప్రయోజనం.

కొడియాలి గ్రామం తమిళనాడులోని ధర్మపురి జిల్లా పెన్నగరం బ్లాకులోని సాదా సీదా గ్రామం. చుట్టూ రిజర్వు ఫారెస్టు విస్తరించి ఉంటుందిి. ఇక్కడి సేద్యగాళ్లలో చాలా మంది చిన్న కమతాల ఆసామీలే. వారికి నిత్యం ఎదురయ్యే సమస్య అనూహ్యంగా ఏర్పడే వాతావరణ మార్పులే. వారికి జీవనాధారం తమకున్న కొద్దిపాటి బీడు భూముల్లో వివిధ కాలాలకు తగినట్లుగా ఏక పంటను సాగుచేసుకోవడమే. భూసారం ఏ మాత్రం లేని ఆ భూముల్లో పెద్ద మొత్తాలను ఖర్చు చేస్తూ చీడపీడలను నివారించేందుకు రసాయనిక ఎరువులను ఉపయోగించి నానా కష్టాలు పడుతుంటారు. వారిలో చాలా మందికి చీడపీడల సమస్య సర్వసాధారణం. అలాగే అక్కడి భూసారం క్షీణించిపోయి ఉండడం, చేపట్టిన ఏక పంట కూడా వాతావరణంలో మార్పులపైనే ఆధారపడి ఉండడం.

అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొడియాలి ప్రాంతంలోని చిరు  రైతులను ఆదుకునేందుకు – వారిని పర్యావరణ అనుకూల సేద్యం వైపు మళ్లించి, వారికి ఎదురవుతున్న ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు పంటలను పండించి అధిక దిగుబడులను సాధించేందుకు ఏఎంఈ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. అది 2021లో రంగంలోకి అడుగు పెట్టింది. ముందుగా, వ్యవసాయదారులకు సమగ్రమైన శిక్షణ ఇచ్చారు. తరువాత వారికి క్షేత్రస్థాయిలో అవసరమైన సలహా సూచనలను అందించారు.  ఆచరణయోగ్యమైన, అందుబాటులో ఉండే సహజ వనరుల నిర్వహణలోను, సమీకృత వ్యవసాయ పద్ధతులపైనా వారికి పూర్తి అవగాహన కలిగించారు. అలా సుశిక్షితులైన రైతులలో తమిళ్అరసి (27 సంవత్సరాల) అనే మహిళ ఒకరు.

తమిళ్అరసికి ఉన్న ఎకరాన్నర వ్యవసాయ బీడు భూమిలో వేరుశెనగ లేక రాగి పంటలు సాగుచేసేవారు. ఆమె రెండు ఆవులనూ పెంచుకుంటూ ఉండేది. వాటికి ఖరీదైన మేత అందించేది. పచ్చ గడ్డి, ఎండు గడ్డి, ఇతర కాన్ సెన్ ట్రేషన్లను కూడా పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి మేపుతూ ఉండేది. ఏఎంఈ ఫౌండేషన్ శిక్షణ అనంతరం, సమీకృత సేద్య విధానాలను చేపట్టింది. కొన్ని అదనపు హంగులు, అంటే పెరటి తోటలు, అజోలా, మష్రూమ్ పెంపకాన్ని కూడా చేపట్టింది.

మిశ్రమ పంటల సాగు దిశగా …

ప్రారంభంలో, తమిళ్అరసి ఏక పంట సాగు నుంచి బహుళ పంటల సాగు వైపు ఆమె అడుగులు వేసింది. ఆ రకంగా, కుటుంబానికి కావలసిన ఆహారం, పశువులకు దాణా, తగినంత ఆదాయం సంపాదన లక్ష్యంగా చేపట్టింది. అందుకు పర్యావరణ అనుకూల విధానాలను ఆశ్రయించింది. పంటల సాగులో లోతుగా పాతుకుపోయే వాటితో పాటు పైపైనే పెరిగే పంటలను అంటే, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు వంటివి చేపట్టింది. అదే సమయంలో ఆహారంలో వైవిధ్యం తన కుటుంబానికి మాత్రమే కాకుండా తాను పెంచే పశువులకు కూడా సాధించేందుకు దృష్టి పెట్టింది. అదే సమయంలో భూసారాన్ని పెంపొందించేందుకు, అధిక దిగుబడులను సాధించేందుకు చర్యలు తీసుకున్నది. చీడ పీడల సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంది. అందుకోసం చీడపీడలను వెంటాడి వేటాడే మొక్కలకు పొలంలో చోటు కల్పించింది. సేంద్రీయ ఎరువులను స్యవంగా తయారుచేసుకునేందుకు ఉపకరించే వ్యర్థాలను సమకూర్చుకునే ప్రయత్నాలను పెద్ద ఎత్తున చేపట్టింది.

వేరు శెనగతో పాటు కందులను ఆమె ఇంటర్ క్రాప్ గా సాగు చేసేది. ఈ రెండు ఉత్పత్తులు కుటుంబ అవసరాలకు ఏడాది మొత్తానికి సరిపోతాయి. వేరు శెనగ పంటకు రక్షణగా క్రిమి కీటకాల (లార్వా దశలో) దాడి నుంచి

ఆముదం పండిస్తుంది. ఇక కౌ పీ (అలసంద) పప్పుధాన్యాల సాగులో భాగంగా గట్లకు లోపలి వైపు పెంచుతుంది. ఆ రకంగా కుటుంబానికి అవసరమైన పప్పు ధాన్యాలు లభిస్తాయి. ఇక గట్ల వెంబడి పెంచే సొర్గమ్ (జొన్న) లేదా పండిస్తుంది. ఇవి కొన్ని క్రిమి కీటకాల నుంచి రక్షణ కవచంలా ఉపయోగపడతాయి. అలాంటి వాటిని ఇవి వెంటాడి నశింపచేస్తాయి. అంతేకాకుండా ఆహార ధాన్యం లభిస్తుంది. ఇంకా పశువులకు మేత చేకూరుతుంది. అర ఎకర పొలాన్ని వేరు శెనగకు కేటాయించి, మిగిలిన అర ఎకరంలో లబ్ లబ్, రెడ్ గ్రామ్ పంటలను ఇంటర్ క్రాప్ గా సాగుచేస్తుంది.

పంట వ్యర్థాలు, పశువుల మల మూత్రాల పునర్వినియోగం

ఇదివరలో వీటిని తమిళ్అరసి ఎన్నడూ తిరిగి ఉపయోగించేది కాదు. పొలంలోనే పది నుంచి 12 నెలల పాటు అలాగే వదిలేసేది. అవి ఎండా, వానలకు గురై, సరిగ్గా కుళ్లిపోయేవి కావు. ఆ రకంగా భూసారం పెంచడంలో ఏ మాత్రం ఉపయోగపడేవి కావు.

అయితే శిక్షణ తరువాత, సేంద్రీయ ఎరువులను తయారు చేసుకోవడంపై కూడా దృష్టి పెట్టింది. పది అడుగులు పొడవు, 15 అడుగుల లోతు ఉన్న గోతులను తీసి, వాటిలో పొలంలో పేరుకుపోయే వ్యర్థాలను, పశువుల మలమూత్రాలను నిల్వ చేయడం ప్రారంభించింది. దానిని రెండు వేర్వేరు గోతులుగా మార్చి, ఒక దానిలో ఆవు పేడను వేసి డీకంపోజిషన్ కు కేటాయించింది. మరో అర గోతిలో పంట వ్యర్థాలను పోగు చేసేది. వాటిని ప్రతిరోజు భర్తీ చేస్తూ వచ్చింది. ఆవు పేడ మిశ్రమాన్ని ప్రతి ఒకటి రెండు అడుగుల పొర ఏర్పడినప్పుడల్లా నింపుతూ వచ్చింది.

ఆ ప్రాంతంలోని రైతులు కనీసం అయిదు రకాల ఇతర జీవాలను పెంచడం సర్వసాధారణం. పెరడులో పెంచే జీవాలలో కోళ్లు, రెండు గొర్రెలు ఉంటాయి. వాటి నుంచి వెలువడే వ్యర్థాలను కూడా ఆ గోతుల్లో వేస్తూ వచ్చింది తమిళరాసి. ఆ రకంగా ఈ జీవాల ద్వారా – రెండు ఆవుల నుంచి 265 కిలోల వరకు, 5 కోళ్ల నుంచి 600 గ్రాములు, రెండు గొర్రెల నుంచి కిలో చొప్పున – ప్రతి రోజూ 25 కిలోల వరకు వ్యర్థాలు వెలువడుతుంటాయి. కొద్ది కాలంలోనే ఉత్తమ నాణ్యత ఉన్న ఎరువులు సిద్ధమయ్యాయి.

ఇదివరలో ఆవు పేడను లేదా మొక్కల బయో వ్యర్థాలను నిల్వ చేయాలన్న ఆలోచనే ఉండేది కాదు …. అయితే శిక్షణ తరువాత, సరైన అవగాహన ఏర్పడిన తరువాత, కంపోస్టు కోసం కలుపును కూడా ఉపయోగిస్తున్నాను – తమిళ్అరసి 

 

మేత నిర్వహణ

రాగి గడ్డి (912కిలోలు), వేరు శెనగ వ్యర్థాలు (476 కిలోలు), సొర్గమ్ గడ్డి (122 కిలోలు) ఇలా  పెద్ద మొత్తం పశువులకు మేతగా లభిస్తూ వచ్చింది. అది పచ్చ గడ్డి లేదా ఎండు గడ్డి రూపంలో ఉంటుంది. పంటల కోత తరువాత,  వాటిని పశువులకు మేతగా ఇండ్లలోనే మార్చుకునేవారు. సొర్గమ్, మైజ్ ధాన్యాలు శక్తినిస్తాయి. వేరు శెనగ ఆయిల్ కేక్ పోషకాలను సమకూరుస్తుంది. 100 కిలోల వేరుశెనగ గింజలను నూనె ఆడిస్తే 47 కిలోల ఆయిల్ కేక్ లభిస్తుంది. రాగి, కందుల చెత్త రూపంలో 200 కిలోల కాన్సన్ట్రేట్ మేత లభిస్తుంది.

ఇలా పంట వ్యర్థాలను పశువులకు మేతగాను, కాన్సన్ట్రేషన్ తయారుచేసి ఉపయోగించిన తరువాత, తమిళ్అరసి రెండు రకాల ఖర్చులను తగ్గించుకోగలిగింది. పచ్చ గడ్డి లేదా ఇలాంటి కాన్సన్ట్రేషన్ ను బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేయవలసిన అవసరం లేకుండా పోయింది. వీటి కోసం గతంలో కాన్సన్ట్రేషన్ (210 కిలోలు) కొనుగోలు కోసం నెలకు రూ. 1650 వరకు, పచ్చ గడ్డి లేదా ఎండు గడ్డి కోసం (250 కిలోలు) రూ. 7500 వరకు ఆమె ఖర్చు చేయాల్సి వచ్చేది. ‘ఈ ఖర్చులు నా సంపాదనలో చాలా భాగాన్ని మిగేసేవి. అవి చాలా పెద్ద భారంగా ఉండేది. దాణా ఖర్చులను చూసి పశువులను పెంచడం పెద్ద తలనెప్పిగా భావించేదాన్ని’ ఆమె వివరించారు. ఆమె దగ్గర ఉన్న రెండు ఆవులు రోజుకు 10 నుంచి 15 లీటర్ల పాలు ఇచ్చేవి. ఆ రకంగా పాల విక్రయం ద్వారా సగటున నెలకు రూ. 16,500 నుంచి 20,000 సంపాందించేది.

ఐఎఫ్ఎస్ – బహుళ ప్రయోజనాలు

2019-20 నాటికి తనకున్న కేవలం అర ఎకర పొలంలో తమిళ్అరసి 280 కిలోల వేరు శెనగ, 670 కిలోల రాగి పండించేది. ఆ రకంగా ఎకరాకు రూ. 30,000 నుంచి రూ. 35,000 వరకు ఆదాయం సమకూరేది. అయితే ఆ తరువాత 2021-2022 సంవత్సరం వచ్చేసరికి, రకరకాల పంటలను సాగు చేయడం ద్వారా ఆదాయం పెంచుకోగలిగింది. ప్రధాన పంటలైన వేరు శెనగ (అర ఎకరా పొలంలోనే 436 కిలోలు), రాగి (అర ఎకరాలోనే 920 కిలోలు) పండించగలుగుతోంది. ఇప్పుడు ఆమె ఆదాయం రూ. 44,560 కి చేరింది.

ఇక పెరటి తోటల రూపంలో కేవలం మూడు నెలల వ్యవధిలో ఆమె సగటున 1.5 కిలో మిర్చి, 3 కిలోల టమాటో, 3 కిలోల బెండ కాయలు, 2 కిలోల లబ్ లబ్, 25 కిలోల బీర కాయలు, 20 కిలోల కాకర కాయ, 10 కిలోల బీన్స్, 25 కిలోల పంప్ కిన్, 2.5 కిలోల వంకాయలు, నాలుగు రకాల ఆకుకూరలు పండించగలిగింది. ఆ రకంగా కుటుంబానికి అవసరమైన కూరగాయలను బయట కొనవలసిన సమస్య నుంచి బయటపడింది. ఆ రకంగా 2021 సంవత్సరంలోని సెప్టెంబర్ – నవంబర్ మాసాల మధ్యలో రూ. 4,500 ఆదా చేయగలిగింది. ఆ రకంగా కుటుంబ సభ్యులకు ఆరోగ్యప్రదమైన ఆహారం అందించగలిగింది.  ఆ కాలంలో కూరగాయల వ్యర్థాలను పశువులకు మేతగానూ, కంపోస్టు గోతులను నింపడానికి ఉపయోగించుకోగలిగింది.

సమీకృత సేద్య విధానాలలో మరో రెండు విభాగాలను అనుసరించిన కారణంగా ఆమె ఆదాయం మరింతగా పెరిగింది. ఎరువుల తయారీకి మరిన్ని వ్యర్థాలను సమకూర్చింది. అవి కోళ్ల పెంపకం, గొర్రెలు పెంపకం, అజోలా పెంపకం. గొర్రెల విలువ రూ. 16000 గా లెక్కించారు. ఇక కోళ్ల పెంపకం ద్వారా 40 గుడ్లు, 35 కోడి పిల్లలు సమకూరినాయి.  ఆ కోడి పిల్లల సగటు బరువు డిసెంబర్ 2021లో 250 గ్రాములు ఒక్కొక్కటి. వాటి బరువు పెరిగే కొద్దీ, దాదాపుగా రూ. 28,000 వరకు ఆదాయం రావచ్చని అంచనా. పెరడులోనే ఆమె నవంబర్ నుంచి ఆజోలా పెంపకం కూడా చేపట్టారు. 12 చదరపు మీటర్ల విస్తీర్ణంంలో చేపట్టిన అజోలా సాగు ప్రతి రెండో రోజు అర కిలో నుంచి కిలో వరకు అజోలా లభించేది. అజోలా పశువులకు సప్లిమంటరీ ఆహారంగా అందించేది.

ఇలా పరస్పరం ప్రయోజనకరమైన విభాగాలను చేపట్టడం ద్వారా, తమిళ్అరసికి లభిస్తున్న ఆదాయంతో పాటు ఆదా అయిన సొమ్ము విలువ కనీసం రూ. 1,00,560 వరకు ఉంటుందని అంచనా. సమీకృత సేద్య విధానాలను అనుసరించడం ద్వారా ఆదాయం పెరగడమే కాకుండా, కుటుంబానికి పోషకాలతో కూడిన ఆహారం సంకూర్చుకోగలిగింది. పర్యావరణహితమైన సేద్యం అనుసరించడంద్వారా చీడపీడల బెడద నుంచి రక్షణ పొందింది. పంట వ్యర్థాలు, పశువుల వ్యర్థాలను సద్వినియోగం చేసుకుని పశువులకు మేతను ఇంట్లోనే తయారు చేసుకోగలిగింది.  అన్నిటికన్నా తనకున్న కొద్దిపాటి జాగాలో దీర్ఘకాలం నిర్వహించడానికి అవకాశం ఉన్న కార్యకలాపాలు ఏర్పాటు చేసుకోగలిగింది.

ఆమె చివరిగా అంటున్న మాట ‘సొంతంగా వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలతో గడుపుతున్నందుకు గర్వంగా ఉంది.’

జె. కృష్ణన్
టీమ్ లీడర్
ఎఎంఈ ఫౌండేషన్.
ధర్మపురి, తమిళనాడు
E-mail: krishnan.j@amefound.org

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి ౨౩, సంచిక ౪, డిసెంబర్ ౨౦౨౧

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...