సమీకృత డెయిరీ ఫార్మింగ్ దిశగా అడుగులు


ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో ఆమె అడుగులు దిశను మార్చుకున్నాయి. కొన్ని బాహ్య సంస్థల నుంచి అందిన శిక్షణ, మద్దతు స్ఫూర్తిగా అందడంతో ఆమె కల సాకారమైంది. అది లాభదాయకంగా కూడా మారింది. లిల్లీ మాథ్యూస్ ఉదాహరణ ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా ఎలా మార్చుకోవచ్చునో సూటిగా తెలియజేస్తుంది. ఇప్పటికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. డెయిరీ ఫార్మింగ్ రంగంలోకి ఆమె అడుగు పెట్టి. ఇప్పుడు ఆమె చుట్టూ ఉన్న మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.


జీవితంలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకుని తమదైన మార్గాన్ని నిర్దేశించుకుని ప్రగతి పథంలో ముందుకుసాగిన లిల్లీ మాథ్యూస్ మహిళాలోకానికే ఆదర్శంగా నిలుస్తోంది. వ్యవసాయం వారి కుటుంబాన్ని నష్టాల్లో పడేసింది. జీవనోపాధి కోసం ఆమె డెయిరీ ఫార్మింగ్ చేపట్టింది. కుదేలయిన వ్యవసాయం స్థానంలో డెయిరీ ఫార్మింగ్ ను ఆసరాగా తీసుకుంది. ఇప్పుడు లిల్లీ మాథ్యూస్ పర్యవేక్షణలో సర్వ సమర్థమైన దాదాపు 70 ఆవులున్నాయి. కేరళలోని వైనాడ్ సమీపంలోని మానంతవాడి గ్రామంలో ఆమె నిర్వహిస్తున్న డెయిరీ ఫార్మ్ విజయ మార్గంలో నడుస్తోంది. నిజానికి ఆమె ఈ దశకు చేరుకునే క్రమంలో ఎన్నో కడగండ్లను దాటి వెళ్లాల్సి వచ్చింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. డెయిరీ ఫార్మ్ నిర్వహణలో కష్టనష్టాలను తట్టుకోకతప్పలేదు.

ఇదివరలో ఆమె కుటుంబం వారికున్న 9 ఎకరాల పొలంలో ప్రధానంగా మిరియాల సాగును చేపట్టేది. ఇంకా కొబ్బరి చెట్లు, కాఫీ తోటలు, పోక చెట్లు, జీడి పప్పు చెట్లు, కూరగాయలు పండించేవారు. అయినప్పటికీ, మిరియాల ద్వారానే వారికి హెచ్చు భాగం ఆదాయం లభించేది. వారు సుమారుగా 40 క్వింటాళ్ల వరకు మిరియాల దిగుబడి లభించేది. ఇక కొబ్బరి, పోక, కాఫీ పెంపకం ద్వారా కూడా చెప్పుకోదగిన ఆదాయమే వచ్చేది. అది 26 ఏళ్ల క్రితం నాటి మాట. ఆ తరువాత చీడపీడల కారణంగా మిరియాల దిగుబడి దారుణంగా పడిపోయింది. మిరియాల మొక్కల పెంపకం మళ్లీ గిట్టుబాటు కాలేదు. అయితే ఇప్పటికీ, మిరియాలలోని కరిముండా, పన్నియూర్ 1 రకం మిరియాలను పండిస్తూనే ఉన్నారు. కానీ వైనాడ్ పరిసరాలలో మిరియాల సాగు పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది. అది వారికి చాలా కష్టకాలంగా మారింది. ఆర్థికంగా నష్టాలు వచ్చాయి. ఆ పరిస్థితులలో లిల్లీ ధైర్యం తెచ్చుకుంది. కుటుంబం మద్దతు కూడగట్టుకుంది. వారి కుటుంబంలోని వారికి పశుపోషణ అనేది సంప్రదాయకంగా వచ్చిన విద్యే. అందువల్ల వారి పూర్వ అనుభవం ఆమెకు అండగా నిలిచింది. డెయిరీ ఫార్మ్ ప్రారంభించింది.

తొలి అడుగులు

ప్రారంభంలో 15 సంకర జాతి ఆవులతో చిన్న స్థాయిలోనే ఆమె డెయిరీ ఏర్పాటు చేసింది. వాటిని కోయంబత్తూర్ నుంచి తీసుకువచ్చారు. ఆ తరువాత ఆమె విజయ గాథ అందరికీ తెలిసిందే. లిల్లీ భర్త మాథ్యూస్ మనంతవాడీలోని ఒక ప్రైవేటు కళాశాలలో లెక్చరర్ గా పనిచేసేవారు. ఆ తరువాత ఆయన కూడా లిల్లీతో కలిసి డెయిరీ నిర్వహణలో పాలు పంచుకున్నారు. మిరియాల పంటకు సోకిన చీడ కారణంగా వాటికి సహాయంగా పెంచిన కొన్ని చెట్లను కూడా వారు నరికివేయవలసి వచ్చింది. ఆ స్థలంలో పశువులకు అవసరమైన మేత పండిస్తూ వచ్చారు. డెయిరీ ఫార్మింగ్ లో ఆమెకు అప్పటికే అంతో ఇంతో అనుభవం ఉన్నది. అయితే దానిని ఒక పరిశ్రమగా చేపట్టడం అనేది ఒక సవాలుగా కనిపించింది. పూర్తి మెళకువలు నేర్చుకునేందుకు ఆమె అనేక శిక్షణ కార్యక్రమాలకు హాజరైంది. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి, ఇతర సంస్థల నుంచి అవసరమైన మద్దతు లభించింది. అది ఆమెకు బాగా తోడ్పడింది. 2008లో పశు సంవర్థక శాఖ నుంచి 10 ఆవుల పెంపకానికి మద్దతు లభించింది. ఆ తరువాత పాలు పితికే యంత్రం, పశువుల మేత పెంపకం వంటి వాటిలో కూడా సహాయసహకారాలు లభించాయి. తరువాత 2014లో ఆవుల పెంపకంలోనూ, రకరకాల పాల ఉత్పత్తుల తయారీలోనూ ఈరోడ్ పశు వైద్య శాల, పశు వైద్య కళాశాల నుంచి ఆమె అవసరమైన సమగ్రమైన శిక్షణ పొందింది. ఈ రకంగా వివిధ మార్గాల ద్వారా సమకూర్చుకున్న నైపుణ్యాలు ఆమె పురోగతికి సోపానలయ్యాయి.

ప్రస్తుతం ఆమె అధీనంలో సుమారుగా 70 సంకర జాతి ఆవులున్నాయి. గత పదేళ్లలో పాలు పితికే యంత్రాలను సమకూర్చుకున్నారు. అందువల్ల చాలా కొద్ది మంది కార్మికులతోనే ఆమె సమర్థవంతంగా తన డెయిరీని నిర్వహించగలుగుతున్నారు. వారంతా కూడా లిల్లీ పొందిన వివిధ రకాల శిక్షణ పొందినవారే కావడం విశేషం. పశువులకు నాణ్యమైన మేత అందిస్తారు. మేలు జాతి గడ్డి పెడతారు, అదంతా ఆమె తన ఫారమ్ లోనే సిద్ధం చేయడం మరో విశేషం. ఆమె స్వీయ పర్యవేక్షణలోనే పశువులకు అవసరమైన ఆహారం అన్ని విధాలా నాణ్యమైనది సిద్ధమవుతూ ఉంటుంది. ప్రామాణాల మేరకు పోషకాలను అందులో చేరుస్తారు. అవసరమైన సందర్భాలలో ఆమె ప్రభుత్వ పశు సంవర్థక శాఖ అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతూ సలహాసూచనలు తీసుకుంటారు. అవసరాన్ని బట్టి వారి నుంచి వైద్య సేవలు ఉపయోగించుకుంటారు.

2018లో ఆమె మరో అడుగు ముందుకేసింది. తన ఇంట్లోనే శీతల నిల్వ (కోల్డ్ స్టోరేజీ) సదుపాయాన్ని సమకూర్చుకున్నారు. అదనపు విలువలను చేకూర్చడం ప్రారంభించారు. అందులో పెరుగు, నెయ్యి, వెన్న, మజ్జిగ, పన్నీరు వంటి అనుబంధ పాల ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించారు. అంతకు ముందు వరకు పాల సొసైటీ వారికి అమ్ముకోవడం ద్వారా లీటరు పాలకు రు. 35 లు లభించేది. తన ఉత్పత్తులకు తానే అదనపు విలువల చేర్పు ప్రారంభించిన తరువాత, ఆమెకు వచ్చే ఆదాయం లీటరుకు రూ. 55 లకు చేరింది. ఆ రకంగా ప్రతీ నెలా అదనపు ఆదాయం లభించేది.  ప్రస్తుతం ఆమె ఫారమ్ లో రోజుకు 700 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతోంది. ఫారమ్ వనిర్వహణ లాభసాటిగా సాగాలాంటే కనీసం ఒక్కో ఆవు నుంచి కనీసం 20 లీటర్ల పాలు ఉత్పత్తి కావాలని ఆమె చెబుతున్నారు. అంతకన్నా తక్కువగా పాలు వస్తే నష్టమే అంటున్నారు. కారణం ఖర్చులు అధికంగా ఉండడమేనట. ప్రస్తుతం ఆమె తన ఫారమ్ పాలను వైనాడ్, కన్నూర్ పరిసరాలలో తన సొంత బ్రాండ్ ‘లిల్లీస్’ పేరుమీదే విక్రయిస్తున్నారు. సొంతంగా రవాణా వాహనాలను ఏర్పాటు చేసుకున్నారు. స్వయంగా రెండు షాపులను నిర్వహిస్తున్నారు. ఇరుగు పొరుగు మాత్రమే కాకుండా ఫారమ్ సందర్శనకు వచ్చిన వారు కూడా వాటిని కొనుగోలు చేస్తుంటారు. కేవలం ఆమె ఫారమ్ లో ఆవులు మాత్రమే కాకుండా కోళ్ల పెంపకం, బాతులను కూడా పెంచుతున్నారు. రానున్న రోజులలో గొర్రెల పెంపకం కూడా చేపట్టాలని ఆమె ఆలోచిస్తున్నారు.

ఫారమ్ స్థాయి సమన్వయం

డెయిరీ ఫారమ్ నిర్వహణలో పూర్తి విజయం సాధించిన తరువాత లిల్లీ తన దృష్టిని సేద్యంపైకి కూడా మళ్లించింది. కాఫీ, మిరియాలు, కొబ్బరి మాత్రమే కాకుండా కూరగాయల సాగు కూడా ప్రారంభించింది. ఆమె చేపట్టిన సేద్యం పూర్తిగా సేంద్రీయ విధానంలోనే కొనసాగుతుండడం మరో విశేషం. ఆవు మలమూత్రాలను సేకరించి, సేంద్రీయ ఎరువులను తయారుచేసేది. అందుకోసం బయో గ్యాస్ ప్లాంట్ ను కూడా నెలకొల్పారు. క్రిమి సంహాకరంగా గోమూత్రాన్ని ఉపయోగిస్తూ మిగులు భాగాన్ని అవసరమైన వారికి విక్రయిస్తూ ఉండేది. జీవామృత్ వంటి సేంద్రీయ ఎరువుల ఉత్పత్తికి సన్నాహాలు చేస్తోంది. ముందుగా వ్యాపార విస్తరణలో భాగంగా ఇదివరలో వదిలేసిన మిరియాల సేద్యంపై ఆమె తన దృష్టిని కేంద్రీకరిస్తోంది.

డెయిరీ ఫారమ్ రజతోత్సవాలను వచ్చే ఏడాది నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె తన మనసులోని ఆకాంక్షలను వివరిస్తూ రోజుకు వెయ్యి లీటర్ల పాల ఉత్పత్తి, అందుకు వీలుగా ఆవుల సంఖ్యను 70 నుంచి 90 కి పెంచాలని ఆమె ఆలోచిస్తున్నారు. కొత్తగా ఈ రంగంలోకి అడుగు పెట్టే వారికి ఆమె ఇస్తున్న సలహా ఒకటే. ముందుగా సరైన శిక్షణ తీసుకోవాలి. ఆ తరువాతే లక్ష్యాలను నిర్దేశించుకుని అడుగులు వేయాలి. ఇప్పుడు లిల్లీ మాథ్యూస్ ను పరిసరాలలోని రైతు సంఘాలలో రిసోర్స్ పర్సన్ గా గుర్తిస్తున్నారు. రైతులు, విద్యార్థులు నిత్యం ఆమె డెయిరీని సందర్శిస్తూ ఉంటారు. రాష్ట్ర స్థాయిలోననే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఆమెకు ప్రశంసలు అందుతున్నాయి. డెయిరీ వుమన్ ఆఫ్ ది ఇయర్ గా ఎన్నో సార్లు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. మనంతవాడీలోని ద్వారక గ్రామ సమీపంలోని రేడియో మట్టోలీ కార్యక్రమాలలో ఆమె ప్రసంగాలు నిత్యం ప్రసారమవుతూ ఉంటాయి.

గతాన్ని గుర్తుచేసుకుంటూ లిల్లీ అప్పుల ఊబిలోంచి ఎలా బయటపడిదీ ఆమె పదే పదే వివరిస్తుంటారు. ఇప్పుడు మంచి సొంత ఇల్లు, విజయవంతంగా సాగుతున్న వ్యాపారంతో ఆమె జీవితం కళకళలాడుతోంది. సంప్రదాయక సేద్య రంగంలోకి పశు పోషణ రంగాన్ని సమన్వయ పరచడం వల్ల కలిగే ప్రయోజనాలకు ఆమె కృషి ఆదర్శంగా మారింది.


అర్చనా భట్, సైంటిస్టు
E-mail:archnabhatt1991@gmail.com

రవీంద్రన్, డెవలప్ మెంట్ అసిస్టెంట్
అబ్దుల్లా హబీబ్, డెవలప్ మెంట్ అసోసియేట్
ఎంఎస్ఎస్ఆర్ఎఫ్-కమ్యూనిటీ అగ్రో-బయో డైవర్సిటీ సెంటర్
వైనాడ్, కేరళ

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి ౨౦౨౩, సంచిక ౪, డిసెంబర్ ౨౦౨౧

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...