సమష్టిగా విజ్ఞాన సముపార్జన

రెండు దశాబ్దాల క్రితం అంటే 1990 దశకం ప్రారంభంలో, దేశ జనాభాలో దాదాపు 70 శాతం మంది వ్యవసాయం, పశుపోషణ జీవనాధారంగా ఉండేవారు. పెద్ద సంఖ్యలో పశు సంపద లక్షలాది మంది చిన్న కమతాల రైతుల అధీనంలోనే సురక్షితంగా వృద్ధి చెందేవి. ఉపఖండం మొత్తం పాడిపశువులతో కళకళలాడేది. అప్పట్లో పశువులకు సంక్రమించే వ్యాధులకు తగిన వైద్య సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండేవి కావు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పశుపోషకులకు తమ పశువులను వైద్యశాలలకు తరలించేందుకు సరైన రోడ్డు సదుపాయం ఉండేది కాదు. గంటల తరబడి శ్రమించి నాటు పడవల ద్వారా కాని, కాలి నడకన కాని వాటిని తరలించవలసి వచ్చేది. పల్లె ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం ఉండేది కాదు. అందువల్ల అత్యవసరమైన మందులను నిల్వ ఉంచుకునేందుకు రిఫ్రిజిరేటర్లు అసలే లేవు. ఎప్పటికప్పుడు అవసరమైన మందులను సరైన సమయంలో కొనాలన్నా – కొన్ని కిలోమీటర్ల సమీపంలో పశు వైద్యం – కనీసం మందుల దుకాణం కూడా ఉండేది కాదు. ఇక పరిశుద్ధమైన నీటి సదుపాయం లేకపోవడంతో వైద్య పరికరాల స్టెరిలైజేషన్ విషయం ఆలోచించే అవకాశం కూడా లేదు.

ఇన్ని సమస్యలున్నా అప్పట్లో మనం ఊహించిన స్థాయిలో పశువులు చనిపోయేవి కావు. రిండర్ పెస్ట్, పాక్స్ వంటి అంటువ్యాధులు ప్రబలడం సాధారణమే. కాని మొత్తంగా చూస్తే చాలా గ్రామాలలో పశువులు చలాకీగా, ఆరోగ్యవంతంగా ఉంటూ తమ యజమానుల జీవితాలకు అండగా నిలుస్తూ వారికి జీవనోపాధిగా ఉపయోగపడేవి. అప్పటి పరిస్థితులపై మరింత లోతుగా అధ్యయనం చేయడంలో అనేక మార్గాలలో అనేక ఆసక్తికరమైన వివరాలు తెలిశాయి. వాటిలో కొన్ని బాహాటంగా అందరికీ పుస్తకాల రూపంలో తెలిసినవి కాగా, మరి కొన్ని సంకేతిక పదాల సంక్లిష్టతతో కూడిన ఆయుర్వేద, యూనానీ, సిద్ధ వైద్య ప్ర్రక్రియలో వెలుగులోకి వచ్చాయి. ఈ సమాచారం అంతా స్థానికంగా నివసించే నాటు వైద్యుల దగ్గర నిక్షిప్తమై ఉండేది. గిరిజన తెగలకు చెందిన మహిళలకు కూడా అంతో ఇంత పశు సంరక్షణ పరిజ్ఞానం ఉండేదని తెలిసింది. వారు తమకు తెలిసిన పరిజ్ఞానం ఆధారంగానే తమ పాడి పశువులను ఎంతో ప్రేమతో, శ్రద్ధగా కాపాడుకునేవారు. ఎయిర్ కండిషన్ చేసిన లైబ్రరీ గదులలోని పుస్తకాల దొంతరల్లోనే కాకుండా పశు పోషణపైనే ఆధారపడి జీవించే వాళ్లు తమ నిత్య జీవితంలో పాటించే సూత్రాల్లో కూడా ఈ పరిజ్ఞానం భద్రంగా ఉండేది.

అధ్యయనంలో భాగంగా దాదాపు 500 రకాల ఔషధ మొక్కల గురించి, దాదాపు వంద రకాలైన పశువులకు సోకే వ్యాధుల లక్షణాల గురించిన సమాచారాన్ని సేకరించగలిగాం.

పశువులలోని వివిధ రకాలైన వైవిధ్యాల గురించి, ఉత్తమ జాతి పశువులను గుర్తించే విధానాల గురించి వారికి అనుభవంతో కూడిన నేర్పు, నైపుణ్యం పరంపరగా సంక్రమించేది. అనుభవం ఉన్న రైతులు లేదా పశు పోషకులు వివిధ జాతులకు చెందిన వాటిలో ఏది మేలు రకమో, ఏది మంచిదికాదో తేడాలతో సహా అంచనా వేయగలిగేవారు. అలాగే పశువులకు ఆహారంగా అందించే వివిధ రకాలైన దాణా, లేదా పశువుల మేత గురించి, ఎక్కడ అలాంటి మేత అందుబాటులో ఉంటుందో, పశువుల దాణాను పెంచి పోషించే పద్ధతుల గురించి కూడా వారికి స్పష్టమైన అవగాహన ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే పశువుల ఆరోగ్యం గురించి, వాటికి సంక్రమించే అవకాశం ఉన్న వ్యాధుల గురించి, వాటికి సరైన నివారణ విధానాల గురించి వారి వద్ద ఉన్న విజ్ఞానం అంతులేనిది. ఆనాటి నాటు పశు వైద్యులకు ఏ రకమైన ఔషధ మొక్కలను పెంచాలో, వాటిని ఎలా శుద్ధి చేయాలో స్పష్టంగా తెలుసు. ప్రాంతాన్ని బట్టి పశువుల పెంపకంలో తేడాలు ఉన్నాయి. వివిధ రకాలైన సామాజిక వర్గాల వారికి వేర్వేపు వాతావరణ పరిస్థితులు, వేడి గాలులు, తుపానుల రాక, ఇంకా వాతావరణంలో చోటు చేసుకునే వివిధ రకాలైన మార్పుల గురించి ఎదురయ్యే వివిధ రకాల సమస్యలకు రకరకాలైన పరిష్కారాలు కూడా తెలుసునని మా పరిశీలనలో తెలిసింది. ఇండ్ల పైకప్పులకు ఏ రకమైన వస్తువులు ఉపయోగించాలో, గోడలకు ఎలాంటివి వాడాలో, నేలను ఎలా చదునుచేసుకోవాలో వారికి పూర్తి అవగాహన ఉంది. పశువుల మార్కెట్లలో వివిధ రకాలైన మూగజీవాలతో, సంప్రదాయక ఉత్పత్తులతో నిత్యం సందడి కనిపించేది.

ఇక్కడే సామాన్య జన జీవనంలో భ్రదంగా నిలిచిన విజ్ఞానానికీ, విశ్వవిద్యాలయాల్లో నేర్పే పరిజ్ఞానానికి మధ్య ఏ మాత్రం పోలిక కనిపించదు. దానిని భర్తీ చేసే ప్రయత్నంలో భాగంగానే, దేశీయ పశువైద్య విద్య విజ్ఞాన వేదిక (IKAH) ఆవిర్భవించింది. చాలా సంవత్సరాల శ్రమ తర్వాత పశు వైద్య విధానాల గురించి పశు సంతతి ఆరోగ్య రక్షణ గురించి ప్రజల నుంచి సేకరించిన సమాచారంతో పెద్ద సమాచార భాండాగారాన్నే ఈ వేదిక సిద్ధం చేయగలిగింది. తరువాతి కాలంలో  కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ  (సీబీడీ) తో పాటు మరెన్నో సంస్థలు వివిధ ప్రాంతాలలోని పశు సంపదలోని వైవిధ్యాలను నిల్వ చేసే బాధ్యతలను స్వీకరించాయి.

వాస్తవ పరిస్థితి

పశు సంపద గురించి, జీవవైవిధ్యం గురించి, ప్రజల జీవనోపాధుల గురించి అధ్యయనం చేస్తున్న అంత్రా (ANTHRA) సంస్థ నుంచి పశువైద్యంలో సుశిక్షితులైన యువ శాస్త్రవేత్తలు సమిష్టిగా ఈ అంతరాన్ని తగ్గించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ముందుగా పశువైద్య రంగంలో పారా ప్రొఫెషనల్స్ అంటే ప్రత్యేకంగా శిక్షణ పొంది పల్లె సీమలకు వెళ్లి అక్కడి పశు పాలకులకు అండగా నిలువడానికి ఉద్దేశించిన వారిని తయారు చేయడంపై వారు దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో గిరిజన తెగలు, పశు పోషణపై జీవించేవారు, భూమి లేని నిరుపేద సామాజిక వర్గాల వారు, పెద్ద ప్రాజెక్టుల కారణంగా నిర్వాసితులైన వారు లక్ష్యంగా ఈ సంస్థ కృషి చేపట్టింది. ముఖ్యంగా ఆయా సమాజాలలోని మహిళలకు ఈ విజ్ఞానాన్ని అందించి వారికి పూర్తి మెళకువలు నేర్పడం కోసం ప్రయత్నిస్తోంది.

కొద్ది కాలంలోనే విద్యాలయాల్లో నేర్పిన పాఠాలకు, వాస్తవ ప్రపంచంలో సామాన్య ప్రజానీకం అనుసరించే విధివిధానాలకు మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్న విషయాన్ని వారు గుర్తించడం ఇక్కడ గమనించవల్సిన విషయం. చేతిలో పట్టా పట్టుకుని ప్రపంచంలోకి అడుగు పెట్టిన వాళ్లకి ప్రారంభంలో ఈ వ్యత్యాసాలు ఆందోళనకరంగా, అర్థం లేనివిగా కనిపించి నిరాశను కలిగిస్తాయి. గ్రామ ప్రాంతాల్లో పనిచేయడానికి వెళ్లినప్పుడు మా అందరి అనుభవం కూడా అదే.

ఆధునిక విజ్ఞానం అందిపుచ్చుకుని వచ్చిన విద్యావంతులకు సంప్రదాయక విధానాలు మూఢనమ్మకాలుగా, గుడ్డి విశ్వాసాలుగా కనిపిస్తాయి. వాటికి ఏ మాత్రం విలువ లేదనిపిస్తుంది. కానీ వారి విధానాలను జాగ్రత్తగా పరిశీలించే కొద్దీ, వాటిలోని ప్రత్యేకతలతో పాటు అవి ఇంతకాలం అప్పటికీ జనజీవనంలో వాడుకలోనే ఉండడం వెనుక ఉన్న కారణాలు, వాటి ప్రాధాన్యతలు ఏమిటో అర్థమవుతాయి.

ప్రారంభంలో ఆరు జిల్లాల నుంచి ముగ్గురు చొప్పున 18 మందిని శిక్షణకు ఎంపిక చేయడం జరిగింది. వారికి పశు ఆరోగ్య కార్యకర్తలుగా శిక్షణ ఇచ్చి, వివిధ రకాలైన అంశాలపై అమలులో ఉన్న విధివిధానాలను సేకరించి సమాచారాన్ని రాబట్టేందుకు రంగంలోకి పంపించారు. నెల నెలా ఈ వివరాలను సేకరించడంలోనూ, వాటిని డాక్యుమెంటుగా సమన్వయపరచడంలోను వారికి అవసరమైన శిక్షణను ఆంత్రా అందించింది. అన్ని సందర్భాలలోనూ ఈ వివరాలను ఇలా సేకరించడం, డాక్యుమెంటుగా భద్రపరచడం అంత తేలికైన విషయం కాదని త్వరలోనే స్పష్టమైంది. అయితే పదేపదే వారితో సమావేశం కావడం, పశువైద్యులతో సంప్రదింపులు జరపడం, బృందాలవారీగా చర్చలు నిర్వహించడం ద్వారా వారి విశ్వాసాన్ని సంపాదించుకున్న తర్వాత మాత్రమే మెల్లిగా వారి నుంచి అవసరమైన సమాచారం సేకరించడం సాధ్యమైంది.

చాలాకాలం వారు అనుసరించే విధానాలను దగ్గర నుంచి పరిశీలించిన తర్వాత మాత్రమే వివరాలను సమన్వయంచేసి డాక్యుమెంటుగా సమాచారాన్ని భద్రపరచడం సాధ్యమైంది. అంతవరకు తాము విద్యాలయాల్లోనేర్చిన వాటి గురించి గొప్పగా భావించే దృక్పథం మారి, వాడుకలోని విధానాల్లో ఉన్న విశిష్టతలను గౌరవించే స్థాయికి చేరింది.

దేశీయ విజ్ఞానం సమీకరణ

జనజీవనంలో తరతరాలుగా నిలిచిపోయిన ఈ దేశీయ విజ్ఞానం పెద్ద పెద్ద పుస్తకాల్లో కూడా లభించదు. వాటిని అనుభవం ద్వారా ప్రత్యక్షంగా మాత్రమే తెలుసుకోగలం. ఈ విషయంలో వివిధ ప్రాంతాల పశు వైద్యులను ఒక చోటికి చేర్చి వారి వారి ప్రత్యేకమైన వైద్య విధానాలపై పరస్పరం సమాచార మార్పిడికి ప్రయత్నాలు జరిగాయి. ఇలాంటి రహస్యాలను వారు వెల్లడించరు అనే అపోహను ఈ కార్యక్రమాలలో వారు పూర్తిగా తొలగించివేశారు. వారు సంతోషంగా తమకు తెలిసిన వివరాలను, విధానాలను ఇతరులతో మార్పిడి చేసుకునేందుకు వారు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఈ రకమైన సమావేశాల్లో అప్పటివరకూ వారికి తెలియని అంశాలను తెలుసుకునే అవకాశం వారికి లభించడమే ఇందుకు కారణం. తమ అనుభవపూర్వకమైన విజ్ఞానానికి నేటి కాలంలో తగిన ప్రాధాన్యత లేకుండా పోతోందనే ఆందోళన వాళ్లలో కనిపించింది. తమకు తెలిసిన విజ్ఞానం తరువాతి తరాలకు కూడా అందించాలనే తపన వారిలో ఈ సమావేశాల నేపథ్యంలో బాగా పెరిగింది. అందువల్ల తమ దగ్గర నుంచి నేర్చుకున్న విజ్ఞానాన్ని ఇతరులు దుర్వినియోగం చేయకూడదనే ఆలోచన కారణంగా నమ్మకస్తులైన వారికి మాత్రమే ఈ వివరాలు వెల్లడించాలని వారు ఆశాభావం వ్యక్తంచేశారు. అందువల్ల అన్ని స్థాయిలలోనూ అలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలను తీసుకోవడం జరిగింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. పూర్తి సామాజిక వికాసం కోసం అన్న విశ్వాసాన్ని వారిలో కలిగించగలిగాం. ఇందుకు పల్లె ప్రాంతాలలోని యువకులను ఇందులో భాగస్వాములయ్యేందుకు ప్రోత్సహించడం తప్పనిసరి అయింది. వారు ఇప్పటికై పూర్తి పరిజ్ఞానం సంపాదించుకున్న నిపుణులైన వైద్యుల దగ్గర పనిచేస్తూ వారి నుంచి మెళకువలను నేర్చుకునేలా ప్రోత్సహించడం జరిగింది.

వివిధ పశు జాతులను గురించిన సమాచారాన్ని చాలా జాగ్రత్తగా సేకరించి భద్రపరిచాం. అలాగే మేత గురించి, వాటిలో రకాల గురించి, వాటి పెంపకం గురించి సమాచారం నిల్వచేసాం. దాదాపుగా 500 రకాల ఔషధ మొక్కలను గుర్తించాం. అవి దాదాపు వంద రకాలైన పశు ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి. స్థానికంగా మంచి గుర్తింపు పొందిన ఈ నాటు వైద్యులు తమ తమ ప్రాంతాలలో కొన్ని రకాలైన పశు సంబంధ వ్యాధులను పూర్తిగా నివారించగలరన్న ప్రాచుర్యం సంపాదించుకున్న వారే. వ్యాక్సినేషన్, ఇమ్యునైజేషన్ వంటివి వారికి అంతగా తెలియవు. అందువల్ల అలాంటి అంశాలపై మా నుంచి నేర్చుకునేందుకు వారు చాలా ఆసక్తి చూపించారు.

వివిధ రకాలైన వైద్య రంగాలలో నిపుణులైన పశువైద్యులు, జీవ శాస్త్ర నిపుణులు, ఆయుర్వేద వైద్యులు,  మానవ శాస్త్రజ్ఞులు, సామాజిక శాస్త్రవేత్తలతో కూడిన బృందాలతో విస్తృతంగా చర్చించిన తర్వాత ఉత్తమ విధానాలను ఎంపిక చేయడం జరిగింది. వాటిని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు వీలుగా రూపొందించడం జరిగింది. పశువైద్యంలో అనుసరిస్తున సంప్రదాయక విధానాలను ఫొటోలతో సహా సేకరించి భద్రం చేశాం.

మేము ఈ విధంగా సమీకరించిన పరిజ్ఞానం మరెక్కడా ఏ పుస్తకాలలోను లభించదు. కేవలం ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వంగా అందిన అమూల్యమైన సమాచార నిధి ఇది. పెద్దల బాటను అనుసరించడం ద్వారా తర్వాతి తరం వీటిపై పట్టు సంపాదించుకుంది.

మా ప్రయత్నాలు ఇలా ఒక పక్కన సాగుతుండగానే కొన్ని రకాలైన పశు జాతులు అంతరించిపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. పట్టణీకరణ, పారిశ్రామికీకరణతో పాటు వాకావరణంలో వస్తున్న మార్పులు కూడా ఇందుకు కారణాలుగా చెప్పవలసి ఉంటుంది. వీటికి తోడు తరతరాలుగా వస్తున్న విజ్ఞానం కొన్ని సందర్భాలలో పెద్దల కాల మరణాలతో తర్వాతి తరానికి చేరకుండా పోయింది. అందువల్ల తక్షణం ఈ రకమైన సంప్రదాయక వైద్య విజ్ఞానాన్ని సురక్షితంగా కాపాడుకోవలసిన అవసరం ఎక్కువయింది. సంప్రదాయక విధానాలలోని ఉత్తమమైన వాటిని ఆధునిక పరిజ్ఞానంతో మేళవించి అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకే ఆంత్రా కృషి చేస్తోంది. ఆంత్రా బృందాలలో పశువైద్యులు, నాటు వైద్యులు, జీవశాస్త్ర నిపుణులు, సామాజికవేత్తలు, మానవ శాస్త్ర నిపుణులు, కంప్యూటర్ ప్రోగ్రామ్ నిపుణులు కూడా ఉమ్మడిగా తమ వంతు సాయం అందిస్తున్నారు. పశువైద్యం, పశువుల మేత, పోషకాహారం, వాటి నిర్వహణ వంటి అంశాలపై వారంతా కలిసికట్టుగా కృషిచేస్తున్నారు.

అయితే మేధోహక్కుల పేరుతో ఏర్పడిన వాణిజ్య ప్రపంచంలో, దోపిడీకి అలవాటు పడిన సంస్థల కుయుక్తుల మధ్య ఈ సంప్రదాయక దేశీయ వైద్య విజ్ఞాన నిధిని సురక్షితంగా కాపాడుకోవటం అత్యవసరం. స్వార్థపరుల చేతిల్లో పడకుండా జాగ్రత్త పడాల్సి ఉంది. అందుకోసం స్థానిక భాషల్లో ఆయా ప్రాంతాలలోని రైతన్నలకు అర్థమయ్యే విధంగా ఈ సమాచారం

పశు ఆరోగ్య కార్యకర్త నాధు వాల్గుడే పెంచుతున్న పశువుల్లో ఒక గేదెకు ఆకస్మాత్తుగా ఏదో జబ్బు చేసింది. దాని గొంతులో వాచిపోయింది. దాని పరిస్థితి చూస్తే చాలా ఆందోళనకరంగా కనిపించింది. రాత్రి బాగా పొద్దుపోయిన కారణంగా వైద్యుడిని పిలిపించే అవకాశం లేదు. దాని బాధ చూడలేని స్థాయికి చేరింది. ముందుగా బాధను తగ్గిస్తే కానీ తెల్లవారిన తర్వాత అది పాలు ఇవ్వలేదు. కటిక చీకటి కారణంగా అవసరమైన మూలికలు సేకరించేందుకు కూడా అది సరైన సమయం కాదు. అప్పటికి నాధు కొన్ని రకాలైన పశు వ్యాధులకు పొడుల రూపంలో ఉన్న కొన్ని ఔషధాలపై పరిశోధనలు చేస్తున్నబృందంలో సభ్యుడుగా ఉంటున్నాడు. అందువల్ల ఎండబెట్టిన ఆకులతో తయారుచేసిన ఆ పొడులను ఉపయోగించాలని నిర్ణయించాడు. వాటిలో ఒక దానిని ఉపయోగించాలనుకున్నాడు. అందుకోసం నల్ల తేనె (Phyllanthus reticulatus) జతచేసి దానికి తినిపించాడు. కొద్ది సేపటికి అది కోలుకుంటుండడం గమనించాడు. అతడికి చాలా సంతోషం వేసింది. తెల్లారేసరికి అది సమృద్ధిగా పాలు ఇచ్చింది. ఆతని తండ్రి చాలా అనుభవం ఉన్న రైతు. ఆయన ఈ చికిత్స చూసి చాలా ఆనందించాడు. గతంలో చాలా పశువులు ఈ సమస్యతో గంటల తరబడి విపరీతంగా బాధ పడిన విషయం ఆయనకు తెలిసిందే.

అంతటినీ సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ దిశగా కృషి చేశాము. ముఖ్యంగా పల్లె సీమల్లోని వ్యవసాయ రంగంలోని వారికి అందుబాటులో ఉంచాలనేది మా ఆలోచన. ప్రత్యేకమైన శిక్షణ తరగతులు నిర్వహించాము. సామాజిక ప్రాతిపదికన ఏర్పడి కృషి చేస్తున్న సంస్థల సహకారంతో ఇప్పటికీ అలాంటి కృషి కొనసాగుతోంది. ఈ సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉండేందుకు వీలుగా డిజిటలైజ్ చేసేందుకు ఒక పోర్టల్ ను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.

పశు పోషణలో అనుసరించడానికి అనువైన ఉత్తమ విధానాలను గత 25 సంవత్సరాలుగా ఎంపిక చేస్తూనే ఉన్నాము. ఇటీవల పశు పోషణ ఒక పరిశ్రమగా నెలకొల్పడం జరుగుతోంది. ఈ మార్పు చిన్న రైతు కుటుంబాలను, ఇంటి వెనకాల ఉన్న కొద్ది పాటి జాగాల్లో అంటే పెరళ్లలో పశువుల పెంపకం చేపడుతున్న పేద కుటుంబాలను దారుణంగా దెబ్బతీస్తున్నది. పశుపోషణ విషయంలో ఇప్పటివరకు వాడుకలో ఉన్న సంప్రదాయ పద్ధతులు, పాడి ఉత్పత్తుల, ఉప ఉత్పత్తుల నాణ్యత, ఔషధ మొక్కల పెంపకం, పశు దాణా పెంపకం వంటి కార్యక్రమాలు ఈ పరిశ్రమ రూపంలో పశు పోషణ కారణంగా కనుమరుగైపోతున్నాయి. అప్పటికీ పల్లె ప్రాంతాలలో నాటు వైద్యం చేస్తున్న వైద్యులు తమ అనుభవాలను, తమకు తెలిసిన మెళకువలను, విధానాలను తర్వాతి తరానికి అందించేందుకు సహకరించారు. పశువుల మేత కోసం ప్రత్యేకించిన మైదానాల్లో పెద్ద పెద్ద రోడ్లు, పరిశ్రమలు ఆక్రమించేస్తున్నాయి.

ఇప్పటి వరకూ మేము సమిష్టి ప్రయత్నాల ద్వారా సేకరించిన సమస్త విజ్ఞానాన్ని పుస్తకాల రూపంలోనూ, ఫొటోల రూపంలోనూ ప్రచురణల రూపంలోనూ భద్రపరచి ఉంచాం. దాన్ని ఆధారం చేసుకుని రైతులకు పశువులను కాపాడుకోవడంలో అవసరమైన శిక్షణను పశు పోషకులకు అందిస్తున్నాం. మా ఈ ప్రయత్నాలు ఒకప్పుడు మన దేశంలో తరతరాలుగా వస్తున్న వైద్య విధానాలను గుర్తు చేయడంతో పాటు వాటిని కాపాడేందుకు దోహదపడుతున్నాయి. బహుశా పరిస్థితులు అనుకూలంగా మారినట్లయితే వీటిలో చాలా వరకు మళ్లీ ఉపయోగంలోకి వస్తాయని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము. సమాజంలోనూ, పర్యావరణంలోనూ అందుకు తగిన మార్పులు వస్తాయని ఆశిస్తున్నాము.

పరిశీలించిన గ్రంథాలు

ఘోట్గే ఎన్. ఎస్., రాందాస్ ఎస్.ఆర్ – ఎ సోషల్ అప్రోచ్ టు ది వాలిడేషన్ ఆఫ్ ట్రెడీషనల్ వెటర్నరీ రెమెడీస్  – ఆంత్రా ప్రాజెక్టు 2002, ట్రాపికల్ ఆనిమల్ హెల్త్ అండ్ ప్రొడక్షన్ 34 (2002) పేజీ 121-143

ఆంత్రా – ఇండిజినస్ నాలెడ్జి అప్లికేషన్స్ ఫర్ లైవ్ స్టాక్ కేర్, 2004, ప్రొసీడింగ్స్ ఆఫ్ ఏ నేషనల్ వర్క్ షాప్, 14-17 సెప్టెంబర్ 2004

నిత్యా సాంబమూర్తి ఘోటగే
ఆంత్రా, మహారాష్ట్ర 

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి 18, సంచిక 1, మార్చ్ ౨౦౧౬

 

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...