సంప్రదాయ సేద్య-పశు పోషణ విధానాలు

 పశు పోషణ – వ్యవసాయ కార్యకలాపాలకు మధ్య అనుసంధానం ద్వారా పచ్చటి, పర్యావరణ అనుకూలమైన సుస్థిర వ్యవసాయంతో పాటు అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు సురక్షితమైన మార్గం ఏర్పడుతుంది. దేశవ్యాప్తంగా పశుపోషణలో సంప్రదాయికంగా అనుసరిస్తున్న విభిన్నమైన విధానాలు గమనిస్తే ఎన్నో ఆసక్తికరమైన అంశాలు గమనించవచ్చు. ముఖ్యంగా ప్రృతి వనరులను సక్రమంగా వినియోగించుకోవడం, స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విధానాలను మార్చుకోవడం, ఆర్థికంగా  మాత్రమే కాక పర్యావరణ పరంగా కలిగే ప్రయోజనాలను అందిపుచ్చుకోవడం, భూసారాన్ని కాపాడుకోవడంలో పశు సంతతి నలమూత్రాల రూపంలో అందించే సమర్థవంతమైన ఎరువుల ప్రయోజనాలను అర్థం చేసుకోవచ్చు.

వ్యవసాయం – పశుపోషణ అన్న రెండు రంగాలు తరతరాలుగా మన దేశంలో పెనవేసుకుని పర్యావరణాన్ని కాపాడడంలోనూ, పశు సంపదను పెంచడంలోనూ విశేషంగా ప్రయోజనకరంగా ఉంటున్నాయి. వ్యవసాయంతో పాటు పశుపోషణ చేపట్టడం వల్ల రైతుకు అదనపు ఆదాయం అందుతున్నదని వేరే చెప్పనక్కరలేదు. ఒకప్పుడు సంచార పశుపోషకుల వర్గం ఉండేది. వారు అటు రైతులకు మేలు చేస్తూనే, పశు సంపద వృద్ధికి తోడ్పడేవారు. పశు పాలకులు, వ్యవసాయదారులు కలిసిమెలిసి జీవిస్కూ స్థానిక సామాజిక వర్గా ఆర్థిక ఉన్నతికి అండగా ఉండేవారు. అటు పశు పోషకులకు, ఇటు వ్యవసాయదారులకు కూడా మరిన్ని ఉపాధి అవకాశాలు అందుతూ ఉండేవి. వీరి మధ్య ఉన్న సయోధ్య అప్పట్లో అందరికీ మేలు చేసేదిగా ఉండేది.

పరస్పర ఆధారిత జీవనం

విశాలంగా విస్తరించి ఉన్న గడ్డి మైదానాలు, వాటిలో సమృద్ధిగా పశువులకు ఉపయోగపడే మేత లభిస్తూ ఉండడం వల్ల పశుపోషణ సౌలభ్యంగానే ఉన్నా వాతావరణపరంగా ఎదురయ్యే చిక్కుల కారణంగా వారు పశువులను వెంటబెట్టుకుని సంచార జీవనం సాగించేవారు. ఇలా సంచార పశు పోషకుల ప్రస్తావన దేశమంతటా కనిపిస్తూనే ఉంటుంది. అదే సమయంలో వారి మనుగడకు వ్యవసాయదారులతో ఏర్పడే సత్సంబంధాలు మరెంతగానో ఉభయులకు ప్రయోజనాలు అందించేది. అయితే కాలం గడిస్తున్న కొద్దీ, ఈ సంచార పశుపోషణ జీవితాలలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అందుకు ప్రధాన కారణం – వ్యవసాయ రంగంలో వాణిజ్య ప్రయోజనాలకు పెద్ద పీట  వెయ్యడమే.

పశ్చిమ భారతంలో పూర్వాపరాలు :  పటిష్టపడిన అనుబంధం

గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతంలోని పశుపాలకులను స్థానిక భాషలో మాల్ధారీలు అని వ్యవహరిస్తారు. వీరిలో భర్వాడాలు, రబారీలు పశువులను పోషించుకుంటూ జీవితాలు సాగిస్తుంటారు. వారు తమ పశువులకు మేత కోసం అన్ని చోట్లకు వెడుతూ ఉంటారు. ఆ రకంగా సంచార జీవనం సాగిస్తుంటారు. అలా సంచరించే సమయంలో పొలంలో పెరిగిపోయిన గడ్డి, ఇతర పశువుల మేతగా పనికి వచ్చే వాటిని శ్రమ పడ్డనక్కరలేకుండా ఇలాంటి వారికి అనుమతినిచ్చి రైతులు కూడా లబ్ధి పొందుతుంటారు. అలాంటి సంచార జీవి రాజా భాయ్ (37 సంవత్సరాలు) గొర్రెలను, గాడిదలను పెంచుకుంటాడు. వాటి పోషణ కోసం ఆయన స్వస్థలమైన దేవ భూమి ద్వారక  దగ్గరి ఖంబలియా బ్లాకు నుంచి దిపావళి పండగ తరువాత రాజ్ కోట్ జిల్లాలోని ఉప్లెటా బ్లాకు వరకు పశువులను తోలుకుపోతూ ఉంటాడు. ఆయన తన అనుభవాలను ఇలా వివరిస్తున్నారు. ‘ఖరీఫ్ పంట కాలం ముగిసిన వెంటనే, పొలాన్ని శుభ్రం చేసేందుకు రైతులు లేబర్ ను నియమించుకోవలసి ఉంటుంది. అప్పటికి పత్తి సాగు ముగింపు దశకు చేరుకుంటుంది. అదే సమయంలో మా దగ్గర ఉన్న పశువులకు మేత అవసరం. అందువల్ల వారి పొలాలను శుభ్రం చేసేందుకు మేము ఒప్పందం కుదుర్చుకుంటాం. తదుపరి పంట సాగుకు అనుకూలంగా మార్చడం మా వంతు, ఆ సమయంలో పశువులకు మేత మేసేందుకు అనుమతి ఇవ్వడం వారి వంతు.’

ద్వారిక ప్రాంతం రాజ్ పరా గ్రామానికే చెందిన మరో పశు పోషణ చేపట్టే మాల్దారీ భూపతి భాయ్ బూందియా అక్టోబర్ – జూన్ మాసాల మధ్య 200 కిలోమీటర్ల దూరం వరకు సంచరిస్తుంటాడు. ఇతడు కూడా రైతులతో తమ అనుబంధాన్ని ఇలా వివరించాడు. ‘సాధారణంగా పత్తి సాగుచేసిన పొలం శుభ్రం చేసేందుకు వచ్చే కూలీ కనీసం రోజుకు రూ. 350 వరకు తీసుకుంటాడు. రోజుకు అయిదు గంటల సేపే పనిచేస్తాడు. అయిదెకరాలున్న ఆసామీ వారితో పది రోజులు పనిచేయించుకోవాలంటే రూ. 3500 వరకు ఖర్చు చేయకతప్పదు. అదే మా వద్ద ఉన్న పశువులు రోజంతా మేతమేస్తూ, పొలాన్ని శుభ్రం చేయడంలో ఉపయోగపడతాయి. మా కుటుంబాలలోని ఆడవాళ్లు మిగిలిపోయిన మొక్కలను పీకివేస్తారు. అందుకు వారు ఏ రకమైన కూలీ తీసుకోరు.’

——-వ్యవసాయదారులకు, పశు పోషకులకు మధ్య ఉండవలసిన సంబంధం ప్రాధాన్యతను మాత్రమే కాకుండా వాటి ప్రయోజనాల గురించిన పూర్తి అవగాహన పెంచుకోవడం చాలా చాలా అవసరం. –

ఇలా సంచార పశుపోషణ వర్గం ప్రాధాన్యం ఆర్థికంగా పరస్పరం ప్రయోజనకరమే కాకుండా, వారి సాన్నిహిత్యం పరోక్షంగా పర్యావరణానికి కూడా తోడ్పడుతోంది. జామ్ నగర్ కు సమీపంలోని సేత్ గ్రామానికి చెందిన భీమా భాయ్ అనే రైతు ఈ అంశాన్ని ఇలా వివరిస్తున్నారు. ‘మాకు ఉన్న వ్యవసాయ క్షేత్రంలో అయిదు మాల్దారీ కుటుంబాలకు అనుమతి ఉంటుంది. ఈ పద్ధతిని మా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ పాటిస్తుంటారు.’మా అధీనంలోని భూమిని అందరికీ ఉపయోగపడేందుకు అవకాశం ఇస్తాం. దానికి మాకు స్ఫూర్తినిచ్చే వాక్యం – ఈ భూమి అంతటికీ గోపాల కృష్ణుడే అధిపతి. అలా పశువులు మేత మేస్తూ పొలాన్ని సిద్ధం చేయడం మాత్రమే కాదు. వాటి మలమూత్రాల ప్రభావంతో భూసారం పెరగడానికి అవసరమైన పోషకాల రూపంలో ఎరువును కూడా అందజేస్తుందని ఆయన అంటున్నారు. అంతేకాకుండా వారు తమ పొలంలో ఉన్నంత కాలం వాటి పాలను కూడా మాకు సరఫరా చేస్తుంటారని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ – ఒక ఉదాహరణ

ఇలా ఈ రెండు వర్గాల మధ్య ఎంతో కాలంగా నిరాఘాటంగా సాగుతున్న సత్సంబంధాలకు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఆదర్శప్రాయమైన ఉదాహరణగా నిలుస్తుంది.  కురుమలుగా పిలువబడే సంచార గోపోషకులు కుటుంబాలతో సహా ఈ ప్రాంతాన్ని అనునిత్యం సందర్శిస్తారు. పశువుల మేత కోసం గోపోషకులు వస్తుంటే వారికి అవసరమైన ఆహారం, బస సదుపాయాలతో పాటు బట్టలను కూడా అందిస్తూ స్వాగతం పలుకుతాయి అక్కడి రైతు కుటుంబాలు. అలా సంచార పశు జాతులు వారి గ్రామాలను సందర్శించడాన్ని మరో పెద్ద వేడుకగా నిర్వహించుకుంటారు అక్కడి ప్రజానీకం. ఆ సమయంలో కొర్రలతో సిద్ధం చేసిన పాయసం  ఇచ్చి ఆదరిస్తారు అక్కడి రైతన్నలు. అనంతపురం జిల్లా ఎల్లవేళలా అనిశ్చితమైన వాతావరణ పరమైన ఒడిదుడుకులను ఎదుర్కొటుంది.  అటువంటి ప్రాంతంలో వ్యవసాయదారులు, సంచార గోపోషకుల మధ్య తరతరాలుగా సాగుతున్న ఈ సాన్నిహిత్యం చిన్న కమతాల రైతులకూ, గోపాలకులకు కూడా ప్రయోజనం కల్పిస్తూ, వారికి జీవనోపాధిగా కూడా నిలుస్తోంది.

హిమాలయ ప్రాంతాలలోనూ అదే తీరు

జాన్సార్-బావర్ సంచార పశుపోషకులు వేసవిలోనూ, శీతాకాలంలోనూ తమ పశువులకు మేత సంపాదన కోసం దిగువ ప్రాతంతాలకు తరలిపోతూ ఉంటారు. అలా తమ పశువులను కాపాడుకోవడంతో పాటు ఆయా ప్రాంతాలలోని రైతులతోనూ, కళాకారులతోను సన్నిహితమైన జీవనం సాగిస్తుంటారు. హిమాలయాల పశ్చిమ ప్రాంతాలలో ఉత్తర ఖండ్ పరిసరాలలోని ఖాస్ సంచార జాతులు మేకలను గొర్రెలను పెంచుతూ జీవిస్తుంటారు. వారు తమ పశువుల మేత కోసం ఎక్కువగా ఆపిల్ తోటలు, అర్పికాట్ తోటలపై ఆధారపడుతుంటారు. ముఖ్యంగా సెప్టెంబర్ – అక్టోబరు మాసాల్లో కోతల పనులు జరుగుతాయి. సాధారణంగా ఈ రకంగా సంచార జాతి కుటుంబాలు ముందుగా రైతుల పొలాలకు తమ పశువులను తీసుకెళ్లి వాటిని అక్కడ మేతకు వదిలేస్తారు. అదే సమయంలో శీతాకాల సమయంలో ఉపయోగపడేందుకు తమ దగ్గర ఉన్న గొర్రెల వంటి వాటి బొచ్చు తొలగిస్తారు. అలా తీసిన బొచ్చును కొంత స్థానిక ఆర్టిజాన్ లకు ఇచ్చి మిగిలినది తమ వద్దే ఉంచుకుంటారు. ఆ విధంగా తమకు లభించిన బొచ్చుతో వారు ఉన్ని వస్త్రాలను తయారు చేసుకుంటారు. వాటిలో కొన్ని తమ కుటుంబ అవసరాలకు ఉంచుకని మిగిలిన వాటిని మార్కెట్ కు తరలిస్తారు.

పూరన్ సింగ్ చౌహాన్ జాన్సార్ సమీపంలోని గోర్చా గ్రామంలో నివసిస్తుంటాడు. ఆయన ఇలా తమ ఉపాధి గురించి వివరించారు. ‘మా కుటుంబాలలో కనీసం ఒకరిద్దరు ఇప్పటికీ పశుపోషణపైనా ఆధారపడి జీవిస్తున్నారు. అంతా నగదు ఆధారిత ఆర్థిక వ్యవహారాల కాలం కాబట్టి కొంత, సమీపంలోని డెహ్రాడూన్-వికాస్ నగర్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా చాలా మంది యువకులు పట్టణాలకు వెళ్లిపోతున్నారు. ఆ కారణంగా పశుపోషణ ఉపాధి క్రమంగా తగ్గిపోతోంది.’ ఫలితంగా కొంత వరకు పశు పోషకులకు, రైతులకు మాత్రమే కాకుండా సంప్రదాయికంగా అందుబాటులో ఉండే పశుపోషణ అనుబంధ ఉత్పత్తులకు కూడా కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా గొర్రెల ఉన్నితో తయారు చేసిన లాంగ్ కోటు, మేకల బొచ్చుతో చేసిన శీతాకాలపు పాదరక్షలు, చాపలు ఇప్పుడు ఎక్కడా ఉపయోగంలో ఉండడం లేదు.

ఇలా మార్పులు చోటు చేసుకుంటున్న కారణంగా, సంప్రదాయికంగా తరతరాలుగా నిలిచిన పశు పోషకులు, వ్యవసాయదారుల మధ్య అనుబంధం క్రమేపీ బలహీనమై పోతోంది. నిజానికి ఈ అనుబంధం స్థానిక పర్యావరణాన్ని ప్రయోజనకరంగా కాపాడుతూ ఉండేది. ఇప్పుడు రైతులు తమ పొలాలకు సేంద్రీయ ఎరువులను సమకూర్చుకోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రసాయనిక ఎరువులనే వినియోగించాల్సి వస్తోంది. దీని ఫలితాలు హిమాలయ పరిసరాల పర్యావరణకు దీర్ఘకాలం నష్టాలకు దారితీయవచ్చు.

చైతన్యం, పూర్వపు బంధాల కోసం కృషి అవసరం

ప్రకృతి సహజమైన సేద్యం చాలా రాష్ట్రాలలో విస్తరిస్తోంది. ఈ పరిస్థితులలో తిరిగి పశు పోషకులకు, రైతులకు మధ్య మళ్లీ పూర్వపు సాన్నిహిత్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది. అది సాధ్యమైతే రెండు వర్గాలకు లాభసాటిగా ఉంటుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది. వ్యవసాయదారులకు సేంద్రీయ ఎరువులు పుష్కలంగా లభిస్తాయి. గో పోషకులకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఈ రకంగా పశు పోషణను దేశవ్యాప్తంగా ప్రత్సహించినట్లయితే, ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పశు పోషకులకు ప్రకృతి వనరులను సక్రమంగా వినియోగించుకోవడంలో ఉన్న పరిజ్జ్ఞానం, స్థానికంగా ఉండే విభిన్న వాతావరణ స్థితులకు తట్టుకోవడంలో వారి అనుభవం, ఆర్థికంగా, పర్యావరణపరంగా కలిగే ప్రయోజనాలు అంతా ఇంతా అనడానికి వీలులేదు. రైతులకు, పశు పోషకులకు మధ్య సాన్నిహిత్యం కొనసాగితే, హరిత వనాలకు కొరత ఉండదు. పర్యావరణం ప్రయోజనకరంగా మారుతుంది. సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థకు పునాదులు పడతాయి. అందువల్ల వారికి పూర్తి ప్రోత్సాహం  ఇవ్వడం, అనుకూలమైన విధానాలు రూపొందించడం తక్షణ కర్తవ్యం.

-----------------------------------------------------------------------------------
రితుజా మిత్రా
రీసెర్చి అసోసియేట్, సహజీవం
E-mail: rituja@sahjeevan.org

సతీశ్ గోవర్ధనం
కన్సల్టెంట్,
ఎకనామిక్స్ సెంటర్ ఆఫ్ వరల్డ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, ఇండియా
E-mail: g.sahith17_mad@apu.edu.in

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి ౨౩, సంచిక ౪, డిసెంబర్ ౨౦౨౧

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...