వ్యవసాయ క్షేత్రంలోనే విజ్ఞాన సముపార్జన

వ్యవసాయమే జీవనోపాధిగా ఉన్న రైతన్నలకు, వారికి చేయూతనిచ్చేందుకు కృషి చేస్తున్న రిసోర్స్ పర్సన్ లకు సరైన విషయ పరిజ్ఞానం పరస్పరం అందించుకునేందుకు, వాటి గురించిన మెళకువలను నేర్చుకునేందుకు క్షేత్ర స్థాయి రైతు శిక్షణ స్కూల్స్ ఉపయోగకరమైన వేదికలుగా నిలుస్తున్నాయి. సమాచార మార్పిడి, ఇష్టాగోష్టి చర్చలు, పరస్పర సహకారం ద్వారా సంప్రదాయక నైపుణ్యాలను తిరిగి ఉపయోగంలోకి తీసుకురావడానికి, వాటిని ముందు తరాల వారికి సురక్షితంగా అందించేందుకు జరుగుతున్న ఈ కృషికి ఆధునిక శాస్త్రీయ వైజ్ఞానిక పరిజ్ఞానం తన వంతు చేయూతనిస్తోంది.

భారత దేశంలోని ఒడిశా రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో ఎక్కువగా ఉన్న కొండ ప్రాంతాల్లో వర్షాధారిత సాగు మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ ఏడాదికి కురిసే సగటు వర్షపాతం కేవలం 1200 నుంచి 1400 మిల్లీమీటర్లు. ఈ ప్రాంతాలలోని గిరిజనులు అడవుల్లో లభించే ఉత్పత్తులను ఆధారం చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటారు. మధ్య మధ్యలో ఆహార ధాన్యాల కోసం మార్పిడి సేద్యం లేదా బదిలీ సేద్యం పద్ధతిలో సాగు చేస్తుంటారు. వాళ్లు పండించే వాటిలో పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, కందుల వంటి కాయధాన్యాలు, నూనె గింజలు, మొక్క జొన్నలు వంటివి ముఖ్యమైనవి. అయితే గడచిన రెండు దశాబ్దాల కాలంలో అనేక వాణిజ్య ప్రయోజనాల కోసం అడవులను ఇష్టం వచ్చినట్టు నరికివేయడంతో వారి జీవనోపాధులు దెబ్బతిన్నాయి. వర్షాలు నిలకడగా లేకపోవడం తెలిసినా వారు నిత్యం బదిలీ సేద్య విధానానికి కట్టుబడి ఉండడం వల్ల భూసారం త్వరితగతిన క్షీణించిపోయింది. పల్లపు నేలల్లో మట్టి పేరుకుపోయి సమస్యగా తయారైంది.

వీటికి తోడు విచ్చలవిడిగా సింథటిక్ ఎరువులు, క్రిమి సంహారకాలు ఉపయోగించడం మట్టిలోని సహజమైన భూసారం తగ్గిపోతూ వచ్చింది. సస్య ఫలితాలు సరిగా అందకపోవడంతో ఈ గిరిజన రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అదే సమయంలో ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వ్యవసాయ అభివృద్ధి ప్రాజెక్టులు వాణిజ్య పంటల సాగునే ప్రోత్సహించాయి. అందువల్ల వారి ఆహార ధాన్యాల సాగు తగ్గిపోయింది. ఆహార ధాన్యాలపై శ్రద్ధ తగ్గడంతో వారి ఆర్థిక స్థితిగతులు మరింత అధ్వానంగా తయారయ్యాయి. వారికి పోషకాహార భద్రత అన్నది అందకుండా పోయింది. ఇప్పటి వరకూ వారు వ్యవసాయం చేయడంలోనూ, విత్తన వనరులను కాపాడుకోవడంలోనూ తమ సంప్రదాయ విధానాలనే అనుసరించేవారు. అలాంటిది ఇటీవల కాలంలో వారు కూడా సంకర జాతీ విత్తనాలను ఉపయోగించడం, ఏక పంట సాగు చేయడం ప్రారంభించారు. ఫలితంగా వారికి ఇంతకాలం భద్రతనిచ్చిన ఈ దేశీయ పరిజ్ఞానం క్రమేపీ అంతరించిపోయింది.

మారిన పంథా

ఒరిస్సాలోని వివిధ జిల్లాల్లోని గిరిజన కుటుంబాలకు కొత్త బాటలను అగ్రగామి అనే సంస్థ చూపిస్తోంది. గిరిజనులు, అట్టడుగు వర్గాల సమాజాలలోని అణగారిన ప్రజలకు పర్యావరణ సేద్య విధానాలు నేర్పడంతో పాటు వారి జీవనోపాధులను మెరుగుపరచి,  పోషక విలువలతో కూడిన ఆహార భద్రత అందించేందుకు, జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ఈ సంస్థ కృషిచేస్తోంది. ఇందుకోసం కాశీపూర్స తౌములరాంపూర్ బ్లాకు ప్రాంతాలలో వ్యవసాయ క్షేత్ర పాఠశాలలను నిర్వహిస్తోంది.

స్థానిక రైతన్నలతో సన్నిహితంగా చర్చలు జరపడం ద్వారా వారి సమస్యలకు సంబంధించిన వివిధ అంశాలను గురించి ముందుగా ఒక అవగాహనకు వచ్చింది. వారికి నేర్పిన పర్యావరణ సేద్య విధానాలను అనుసరించడం వల్ల సాధించిన సత్ఫలితాల ఆధారంగా అనేక డాక్యుమంటరీ చిత్రాలను కూడా సంస్థ రూపొందించింది. క్షేత్ర స్థాయిలో రైతులను పర్యటనలకు తీసుకెళ్లి వారిలో పరస్పర సాన్నిహిత్యాన్ని పెంపొందించింది. రైతుల్లో ఇతర ప్రాంతాలలో అమలులో ఉన్న విధానాలను గురించి వారికి పూర్తి అవగాహన కలిగించేందుకు చేయూత అందించింది. ఇందుకోసం పరస్పరం సమావేశాలు, సంప్రదింపులు, చర్చలు ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో సంప్రదాయక విత్తనాలు, వాటి ఎంపిక తీరుతెన్నులు, వ్యవసాయ విధానాలు, విభిన్నమైన ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలలో సామీప్యత, వైరుధ్యాల గురించి వారిలో స్పష్టత కలిగించింది.

రైతుల క్షేత్ర పాఠశాలలలోనే సమష్టిగా – నూతన విధానాలకు  శ్రీకారం

గ్రామాస్థాయిలో ఏర్పాటు చేసిన రైతుల క్షేత్ర పాఠశాలలు ఇందుకు వేదికలుగా నిలిచాయి. పరిసరాలలోని 4 లేదా 7 గ్రామాల రైతులు ఒక చోట సమావేశమై, పరస్పరం చర్చించుకోవడం ద్వారా ఉమ్మడి సమస్యలకు పరిష్కారాలను గుర్తించేందుకు అవకాశం కల్పించింది. అనుభవపూర్వకమైన శిక్షణలో దేశీయ భూసార రక్షణ విధానాలు, నీటిని పొదుపుగా ఉపయోగించడం, వేర్వేరు రకాలైన విత్తనాలు, వాటి పోషక విలువలు, పంట మార్పిడి విధానాలు, క్రిమి సంహారకాల వినియోగం గురించి పశువుల దాణా పెంపకం గురించి అవగాహన పెంచుకున్నారు. అదే సమయంలో జీవవైవిధ్యాన్ని కాపాడే విధానాలను గురించి మాత్రమే కాక అందుకు తమ వ్యవసాయ కార్యక్రమాలలో సముచిత ప్రాధాన్యం ఇవ్వడం గురించి అవగాహన పెంపొందించుకున్నారు.

ఇలా రైతన్నల మధ్య చర్చలకు అవకాశం ఇవ్వడం ద్వారా, పూర్వం నుంచి వాడుకలో ఉన్న సంప్రదాయక పద్ధతులను గుర్తించడంతో పాటు వాటిలో ఆచరణాత్మకమైన ఉత్తమ విధానాలను ఎంపిక చేయడం సాధ్యమైంది. అందు కోసం క్షేత్ర స్థాయి పర్యటనలను నిర్వహించారు. పర్యటనల సమయంలో ఒకరి అనుభవాలను ఇతరులకు తెలియజేసుకున్నారు. ఫలితాలను బేరీజు వేసుకున్నారు. సంప్రదాయక పద్ధతులను అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనాలను, వాటి కోసం సాగు పద్ధతుల్లో చేపట్టవలసిన మార్పులను గురించి వారు అవగాహన సంపాదించుకున్నారు. ఉదాహరణకు – నిల్వ చేసిన విత్తనాలకువేప ఆకులను చేర్చడం వల్ల అవి చెడిపోకుండా ఉంటాయనేది ఇక్కడి రైతులు చాలా సంవత్సరాలుగా గమనించిన విషయమే. ఇప్పుడు క్షేత్ర స్థాయి రైతుల శిక్షణలో మరి కొన్ని రకాలు – కర్నాజ్, అమరి వంటివి –  ఆకులను చేర్చడం వల్ల ఫంగస్ సోకకుండా ఉండడమే కాక, చీమల నుంచి కూడా రక్షణ లభిస్తుందని వారు గుర్తించారు. ఈ సేద్య సమాచారం ఏ విధంగా ఒకరి నుంచి మరొకరికి చేరవేయబడినదీ ఫిగర్ 1 లో సోదాహరణంగా వివరించడం జరిగింది.

తరతరాల విజ్ఞానాన్ని పునరుద్ధరించవలసిన అవసరాన్ని గుర్తించిన తర్వాత రైతులు తమ పంట పొలాల్లో వరి, జొన్న, పప్పు ధాన్యాలు, వేర్వేరు రకాల కూరగాయల సాగును చేపట్టారు. వివిధ రకాల పంటల విత్తనాలలో విభిన్నమైన వాటిని వారు రూపొందించగలిగారు. వాటిలో కొన్ని దాదాపు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. వాటిని పునరుద్ధరించేందుకు ఏ రకమైన నేలల్లో అవి మెరుగైన ఫలితాలు ఇస్తాయో పరిశీలించారు. అందులో భాగంగా పర్యావరణ వైవిధ్యాలను మాపుల రూపంలో గుర్తించి, మెరుగైన విధానాలను అనుసరించడం జరిగింది.

వ్యవసాయదారులు, శాస్త్రవేత్తలు సమష్టిగా కృషిచేసే క్రమంలో పొలాల్లో అనుభవాలను ప్రయోగశాలల్లో పరీక్షిస్తూ, వాటి మంచి చెడుల ఆధారంగా వాటిలో మేలైన విధానాలను తిరిగి పంట చేలల్లో ఆచరణలో ఫలితాలను గురించి అధ్యయనం చేసినప్పుడే సత్ఫలితాలను సాధించడం సాధ్యమవుతుంది.

పర్యావరణ హితమైన సేద్య విధానాల గురించిన విజ్ఞానం మార్పిడి ప్రయోగాలకు రైతు ప్రదర్శనశాలలు వేదికలుగా (ఫార్మర్స్ ఫెయిర్స్) ఉపయోగపడ్డాయి. ఇలాంటి సమావేశాలు జరుగుతున్న సమయంలోనే రైతులు తమకు ఎదురైన సమస్యలను, ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి పరస్పరం మాట్లాడుకుని పరిష్కారాలను కూడా కనుగొనగలిగారు. వారి సంభాషణలను అధ్యయనం చేసిన వ్యవసాయ నిపుణులకు వారు సాధించిన ఫలితాలకు, ఎదుర్కొన్న వైఫల్యాలకు కారణాలను విశ్లేషించడం సాధ్యమైంది. వాటి ఆధారంగా క్షేత్ర స్థాయి పరిశోధనలకు తగిన మార్పులు చేసేందుకు అవకాశం లభించింది. ఈ ప్రయోగాత్మక పరిశోధనల్లో స్థానికంగా అందుబాటులో ఉండే వనరులను, రైతుల శక్తిసామర్థ్యాలను, వారి ఆర్థిక స్థితిగతులను నిపుణులు పరిగణనలోకి తీసుకున్నారు.

మెట్ట ప్రాంతాలలో సాధారణంగా సాగుచేసే వివిధ రకాలైన వరి రకాలు – మతిధాన్, బోధిధాన్, ప్రధాన్, తిప్పధాన్  – వంటి దాదాపు 150 విత్తనాల గురించి ప్రయోగాలు జరిగాయి. తక్కువ సమయంలోనే అధిక దిగుబడి ఇవ్వడంలోనూ, చీడపీడలను తట్టుకునే సామర్థ్యంలోనూ మతిధాన్ ఉత్తమ రకం అని చెప్పాలి. అదే విధంగా మతిధాన్ సాగును అర్హార్ రకంతో జతచేసినట్లయితే మిగిలిన అన్ని రకాలకన్నా ఇది చాలా మేలైనది. అదే విధంగా, వివిధ రకాలైన కాయగూరలతో మిశ్రమపంటలుగా సాగు చేసినప్పుడు, ముఖ్యంగా సోలానేసియస్, లెగుమినేసియా వంటి వాటితో మిశ్రమ పంలుగా ఉపయోగించినప్పుడు ఉత్తమ ఫలితాలు వస్తాయని తేలింది. ఇంకా, మొక్క జొన్న, పప్పుధాన్యాలను మిశ్రమ పంటలుగా సాగుచేసినప్పుడు రెండో పంటగా ఆవ సాగు చేస్తే నేలలోని మిగిలి ఉన్న తేమ సాయంతోనే మంచి ఫలితాలు రాబట్టవచ్చని గుర్తించారు. క్షేత్ర స్థాయి ప్రయోగాలలో రైతులను కూడా భాగస్వాములను చేయడం వల్ల వారికి ఆ ప్రయోగాల పట్ల నమ్మకాన్ని కలిగించవచ్చునని శాస్త్రవేత్తలు కూడా తెలుసుకున్నారు.

విత్తనాలను నిల్వచేసే విషయంలో మహిళలకే ఎక్కువ అవగాహన, నైపుణ్యం ఉన్నట్టు నిర్ధారణ అయిన కారణంగా, 15 గ్రామాలలో విత్తన బ్యాంకులను, వరి నిల్వ కేంద్రాలను (గ్రెయిన్ కమ్ సీడ్ బ్యాంకులు) ఏర్పాటు చేయడంలోను, నిర్వహణలోను కూడా వారికే అప్పగించారు. ఎంత పరిమాణంలో విత్తనాలను నిల్వ చేయాలి, ఏయే రకాలను నిల్వ చేయాలి వంటి అంశాలను వారే నిర్ధారిస్తారు. వారి ఆధ్వర్యంలోనే వరి, పప్పు ధాన్యాలు, జొన్న, కూరగాయలు, దుంపల విత్తనాలను వారు ఎంపిక చేయడం కూడా జరుగుతుంది. మహిళల ఆధ్వర్యంలోని విత్తనబ్యాంకులను విత్తన పరిశోధన కేంద్రాలతో అనుసంధానం చేసే కృషి ఇప్పుడు చురుగ్గా సాగుతోంది.

రైతన్నలలో  కొత్త ఆలోచనలు

ఏక పంట సాగు విధానం కారణంగా చీడపీడలు, క్రిమికీటకాల బెడదతో పాటు రకరకాలైన వ్యాధులు పంటలకు చేటు కలిగిస్తాయనే వాస్తవాన్ని రైతన్నలు అవగాహన చేసుకున్నారు. అందుకు మరో కారణం కూడా వారు గుర్తించారు. అదేమిటంటే ఏక పంట విధానంలో సమృద్ధిగా వాటికి ఆహారం లభిస్తుంది. వాటికి తోటు ప్రకృతి సహజంగా పంటలకు హాని కలిగించే వాతావరణం లేదా ఇతర అంశాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. పంటలను సాగు చేయడంలో వైవిధ్యం, క్రిమికీటకాల సమస్యను పరిష్కారం చూపించే కొన్ని ఇతర పంటలను సాగు చేయడం చాలా మేలు చేస్తుందనే అంశం కూడా వారికి తెలిసింది. అగ్రగామి సంస్థకు తోటల పెంపకం వ్యవహారాలలో సలహాసూచనలు అందించే విధులు

నిర్వహిస్తున్న డాక్టర్ దేవేశ్ ప్రసాద్ పాధి మాటల్లో చెప్పాలంటే … ‘దేశీయంగా మొలకెత్తే సాధారణ గడ్డి, ఇంకా వైల్డ్ గ్రాస్ పేరుతో పెరిగే గడ్డి కారణంగా పంటలకు రక్షణ లభిస్తుంది.  గడ్డి ప్రభావంతో మొక్కల కాండాన్ని తొలిచే పురుగులు ఆకర్షితమవుతాయి. ఒకసారి ఆ గడ్డి వలలో చిక్కితే ఇక ఆ కాండం తొలిచే పురుగులతో ఎలాంటి భయం ఉండదు. అదే విధంగా జొన్న లేక సొర్గం సాగులో మొక్కల వరులకు మధ్యలో పొన్న ఆకు మొక్కలను (Desmodium) పెంచినట్లయితే ఈ కాండం తొలిచే పురుగును దగ్గరికి రాకుండా అడ్డుకోవచ్చును. అందుకు కారణం ఆ మొక్కల ఆకుల నుంచి వెలువడే ఒక రకమైన రసాయన వాయువులే. ’ శాస్త్రీయంగా వివరించినప్పుడు రైతులకు ఈ విషయాలపై మంచి అవగాహన కలిగింది. ఆ తరువాతే వారు తమకు అన్ని విధాలా ఉపయోగకరమైన విధానాలను పాటించేందుకు ముందుకు వచ్చారు. చేలకు మేలు చేసే క్రిమికీటకాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి కూడా రైతులకు అవగాహన కలిగించడంతో పాటు అవసరమైన శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మొక్కల్లో పరపరాగ సంపర్కం ప్రక్రియ (pollination) గురించి, దాని ప్రయోజనాల గురించి, క్రిమికీటకాలను నియంత్రించే విధానాల గురించి వారికి శిక్షణ ఇప్పించారు. ఉదాహరణకు మిడతల వంటి (lady bird beetles) కొన్ని పురుగులు మెత్తటి తెల్ల పురుగులు, ఎలుకలు, మరి కొన్ని రకాలైన వాటిని (aphids, whiteflies, mites, scale insects) ఆహారంగా తీసుకుని పంటకు రక్షణ ఇస్తాయి. పంట నష్టాలను తగ్గిస్తాయి.

అదే విధంగా పొలంలో మిగిలి ఉన్న కొద్ది పాటి తేమ ఆధారంగా జొన్న లేక పప్పు ధాన్యాల సాగు తర్వాత రెండో పంటగా ఆవ సాగు చేసే రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా నిర్ధారణ అయింది. ఈ విధంగా రైతులకు అవగాహన కల్పించే క్రమంలో తమ అవసరాలు, ప్రస్తుత మార్కెటింగ్ పరిస్థితులు ఆధారంగా రైతులు ఒక నిర్ణయాన్ని తీసుకునేందుకు పరిగణనలోకి తీసుకునే అంశాల గురించి శాస్త్రవేత్తలకు కూడా ఒక అవగాహన కలిగింది.

ఇప్పుడు వ్యవసాయదారులు తమ పంట పొలాలకు రక్షణ కల్పించేందుకు గానూ కొన్ని రకాలైన మొక్కలను (Simarouba glauca, Pinnata and Cassia tora వంటివి) పెంచటానికి ముందుకు వస్తున్నారు. ఫలితంగా జీవవైవిధ్యం కాపాడబడుతోంది. వంట చెరకుగానూ ఉపయోగపడుతోంది. అంతేకాక పెను గాలుల నుంచి చేనులోని మొక్కలకు ఎలాంటి నష్టం రాకుండా ఇవి అడ్డుకోగలుగుతున్నాయని రైతన్నలు గుర్తించి చాలా సంతోషిస్తున్నారు. పొలంలో నీటి తేమ సురక్షితంగా ఉంటోంది.

సమష్టి కృషి ప్రాధాన్యత

పర్యావరణ అనుకూల సేద్య విధానాలలో విజ్ఞాన ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అందుకు ముందుగా స్థానికి పరిస్థితుల గురించిన పూర్తి అవగాహన అవసరం. ఇప్పటికే సంప్రదాయకంగా వాడుకలో ఉన్న విజ్ఞానం మెరుగుపడేందుకు ఇది మరింత దోహదపడుతోంది.  ఇక్కడ అనుసరించిన ప్రధాన సూత్రం ఒక్కటే. పంట చేలలో అనుసరించే విధానాలను ఆధారం చేసుకుని పంట చేలకు మేలు చేసే విధానాలను రూపొందించేందుకు ల్యాండ్ టు ల్యాబ్ టు ల్యాండ్ పద్ధతిని అనుసరించడం జరిగింది. ఇది వ్యవసాయదారులకు, శాస్త్రవేత్తలకు మధ్య సరైన సమన్వయం, అవగాహన చాలా ముఖ్యం. పరిశోధనల్లో రైతులను భాగస్వామ్యం చేయడం ద్వారా శాస్త్రవేత్తలకు సంప్రదాయక విధానాలపై అవగాహన సాధ్యమవుతుంది. వాటిని ప్రాతిపదికగా తీసుకుని మెరుగైన విధానాలను రూపొందించడం సాధ్యమవుతోంది. ఈ పరస్పర సహకారమే రైతులకు తక్షణ ప్రయోజనం కలిగించడమే కాక, దీర్ఘకాలంలో ఎంతో ఉపకరిస్తుంది.

ధన్యవాదాలు

అగ్రగామి సంస్థలో సీనియర్ ప్రోగ్రామ్ అడ్వయిజర్ గా ఉన్న దేవేశ్ ప్రసాద్ పాధీకి రచయిత ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆయన అందించిన సమాచారం, సాంకేతిక వివరాలు ఆధారంగానే ఈ వ్యాసం రూపుదిద్దుకుంది.

అభిజిత్ మొహంతీ
అగ్రగామి
E-mail: abhijitmohanty10@yahoo.com
Blog: developmentalternativesblog.wordpress.com

రంజిత్ సాహూ
రీసెర్చి అసోసియేట్
యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా యూఎస్ఏ
E-mail: sahurk9@gmail.com

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి 18, సంచిక 1, మార్చ్ ౨౦౧౬

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...