వ్యవసాయానికి మరో రూపం మధ్య భారత్ లో గిరిజనుల సాధికారికత

వ్యవసాయానికి మరో రూపం. అది వ్యవసాయానికి కొత్త రూపం ఇస్తోంది. రైతుకు అదనపు ఆదాయం అందిస్తోంది. వారిలో పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తోంది. అదనపు విలువల జోడింపు ప్రక్రియను కూడా పాటిస్తూ, మధ్య ప్రదేశ్ లోని సహరియా గిరిజనుల జీవితాలలో నూతన వెలుగు చేరేందుకు శ్రీజన్ సంస్థ తోడ్పడుతోంది.  ఈ సంస్థ అందిస్తున్న సలహా సూచనల ప్రభావం, ఆచరణీయమైన శిక్షణ విధానాలు, మార్కెట్ తో అనుసంధానం వంటివి వారికి సమృద్ధిగా ఆదాయం సంపాదించేందుకు కారణమవుతున్నాయి.

సేద్య రంగంలో వస్తున్న కొన్ని మార్పులు వ్యవసాయం ఆధారంగా జీవించే రైతులకు అదనపు ఆదాయం చేకూర్చిపెడుతున్నాయి. అదే సమయంలో సేద్యమే జీవనాధారమైన దేశంలో పోటీ తత్వం పెరగడానికి తోడ్పడుతున్నాయి. ఇప్పటి వరకు సంప్రదాయం పరిధిలోనే చేపడుతున్న సేద్య విస్తరణ చిన్న, సన్నకారు రైతులకు, ముఖ్యంగా భూమి లేని కౌలు రైతులకు, ఇంకా ప్రకృతి ప్రసాదించే సహజ వనరులపైనే – అంటే అడవులు వంటివి – జీవితాలు సాగించే పేద కుటుంబాలకు ఆశాజ్యోతిగా మారుతోంది. ఇంకా చేతి నిండా పనిలేక, ఎక్కువ సమయం అందుబాటులో ఉండే కుటుంబాలకు ఇది చాలా పెద్ద ఆసరాగా ఉంది. ప్రత్యామ్నాయ ఉపాధిగా కనిపించే ఈ విధానంలో గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయేతర కార్యకలాపాలకు కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా అందుబాటులో ఉన్న మానవ వనరులు, సాంకేతిక నైపుణ్యాలు, శక్తిసామర్థ్యాల సద్వినియోగానికి తోడ్పడుతోంది. లాభదాయక ఉపాధి అవకాశాల కల్పనకు ఉపకరిస్తోంది. అదే సమయంలో భాగస్వామ్య పక్షాలకు అదనపు రాబడి అందిస్తోంది.

సెల్ఫ్ రిలయెంట్ ఇనీషియేటివ్స్ త్రూ జాయింట్ యాక్షన్ (శ్రీజన్) – సమష్టి కృషితో స్వయం సమృద్ధి సాధన లక్ష్యంతో ఏర్పడిన సంస్థ అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది. మధ్య భారతంలోని చాలా రాష్ట్రాలలో ఈ సంస్థ కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యంగా స్థానిక నిరుపేద సహరియా గిరిజన ప్రజలకు మెరుగైన జీవనోపాధులను చూపిస్తోంది. వారికి మెరుగైన ఆదాయ మార్గాలను చూపిస్తోంది. మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలోని అడవుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. సహరియా గిరిజనులు ఎక్కువగా మోరీనా, షోపూర్, భింద్, గ్వాలియర్, దతియా, శివపురి, విదిశ, గుణ జిల్లాలలోనూ, పొరుగున రాజస్తాన్ లోని బరాన్ జిల్లాలోను నివసిస్తుంటారు. వారిని భారత ప్రభుత్వం ప్రత్యేకంగా వెనుకబడిన గిరిజన వర్గం (పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ – పివిటిజి) గా గుర్తించింది. సహరియాలు ప్రధానంగా అడవులపై ఆధారపడి అడవుల్లో లభించే వివిధ రకాలైన వనరులను సేకరిస్తూ జీవించే అడవి జీవాలుగా మనుగడ సాగిస్తుంటారు. సాధారణంగా వారిలో చాలా మంది వేటనే జీవనాధారంగా చేసుకుని జీవిస్తుంటారు. మరి కొందరు అడవుల్లో లభించే వివిధ రకాలైన జిగురు, కాచు (catechu) పేరుతో లభించే వివిధ రకాలైన ఔషధ మూలికలు, తెండు ఆకులు, తేనె, విప్ప పువ్వులు, ఇంకా మరెన్నిటినో సేకరించి విక్రయించుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వారిలో చాలా మంది వ్యవసాయమే ఆధారంగా స్థిరనివాసం ఏర్పాటుచేసుకుంటున్నారు కూడా. వారు ఎక్కువగా, గోధుమ, పెరల్ (మిల్లెట్) జొన్న, మొక్క జొన్న (మైజ్), మినుములు, కందులు, ఉలవలు (పీజియన్ పీ) వంటివి పండిస్తుంటారు.

ఇక అడవులలో లభ్యమయ్యే అమూల్యమైన మరో ముఖ్యమైన వనరు – మోదుగ చెట్లు. నిజానికి చాలా విస్తృతంగా ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుంది. కానీ అడవులలో ఎక్కువగా పెరిగే లక్షణం ఉన్న చెట్లు ఇవి. ఒక అంచనా ప్రకారం, అడవీ ప్రాంతాలలో ఒక హెక్టార్ విస్తృతిలో 17 మోదుగ చెట్లు కనిపిస్తుంటాయి. ఈ చెట్టు ఆధారంగా గ్రామీణ పేద ప్రజలు వాటి పువులు, ఆకులు, విత్తనాలు, బెరడు, బంక వంటి వాటిని ఆదాయ వనరులుగా ఉపయోగించుకుంటూ ఉంటారు. మోదుగ నుంచి సేకరించే జిగురు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. వైద్య రంగంలో కూడా ప్రాధాన్యత సంతరించుకున్నది. క్రిమిసంహారకంగానూ, మూర్చ నివారకంగానూ, మధుమేహ నివారిణిగానూ, విరేచనాలను నిలుపు చేసే ఔషధంగానూ, ఈస్ట్రోజిన్ నియంత్రణకు, గర్భధారణ నియంత్రణకు, సూక్ష్మక్రిమి నాశకంగానూ, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు, రసాయనాల దుష్ప్రభావ నివారణలోనూ, థైరాయిడ్ చికిత్సలోనూ, గాయాలను మాన్చడంలోనూ దీనిని ఉపయోగిస్తుంటారు. ఈ మోదుగ బంక సేకరణకు ఒక ప్రత్యేకమైన నైపుణ్యం అవసరం. వాటిలో సహరియా గిరిజనులది అందె వేసిన చేయిగా ప్రసిద్ధి.

ఈ ప్రాంతంలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారితమే. అందువల్ల వారికి నిత్యం ఎలాంటి పని ఒత్తిడి ఉండదు. ముఖ్యంగా ఖరీఫ్ పంటకాలం ముగిసిన తరువాత వారికి కాలసినంత తీరిక లభిస్తుంది. ఆ సమయంలోనే వారు ఎక్కువగా మోదుగ జిగురు, పువ్వుల సేకరణపై దృష్టి పెడతారు. సాధారణంగా కుటుంబంలోని సభ్యులంతా ఆ కృషిలో పాలుపంచుకుంటారు. కాని మహిళల పాత్ర ఎక్కువ. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలం ఇందుకు అనుకూలం. మోదుగ జిగురు, పువ్వుల సేకరణ ప్రక్రియ చాలా శ్రమతో కూడిన వ్యవహారం. కార్మిక శక్తి అధికంగా అవసరం. తగినంత వ్యవధి, నైపుణ్యం రెండూ ఉండాలి. సరైన వాటిని గుర్తించాలి. వాటి బెరడు విడదీయాలి. ఆ సమయంలో ప్రవహించే జిగురు సేకరించాలి. అయితే ఈ కష్టపూరిత ఉపాధి వల్ల పెద్దగా ఆదాయం లభించదు. అంటే ఇలా అటవీ ఉత్పత్తుల సేకరణ వారికి ఎక్కువగా రాబడి నివ్వదు. అందుకే వారు ఆ సమయంలో ఎక్కువ మంది పరిసరాలలోని పట్టణాలకు ఉపాధి కోసం వలస పోతుంటారు.

2019 శీతాకాలం వచ్చే నాటికి ఆ ప్రాంతానికి శ్రీజన్ కార్యకలాపాలు ప్రారంభించి అప్పటికి ఇంకా ఆరునెలలు కూడా పూర్తి కాలేదు. ముందుగా అక్కడ సమృద్ధిగా లభించే మోదుగ ఉత్పత్తులకు అదనపు విలువలను సేకరిస్తే కలిగే ప్రయోజనాలపై సమగ్రమైన అధ్యయనం చేపట్టింది. ఆ రకంగా అక్కడి పేద ప్రజలకు మరింత ఆదాయం చేకూర్చే విధానాలను అన్వేషించింది. అవకాశాలు మెండుగా ఉన్నాయని గుర్తించింది. మార్కెట్ అవసరాలు కూడా చాలా హెచ్చుగానే ఉన్నట్లు నిర్ధారించుకుంది. దాదాపు 40 కోట్ల రుపాయల మేరకు మార్కెట్ అవసరాలున్నట్లు అంచనా వేసింది. దళారుల ప్రాబల్యం అధికంగా ఉండే స్థానిక మార్కెట్ లోనే కాకుండా ఇండోర్, నీముచ్, ఢిల్లీ, జోధ్ పూర్, వడోదర వంటి నగరాలలో కూడా మార్కెట్ ఉన్నదని గమనించింది. వారి కష్టాన్ని మధ్య దళారులు నిలువునా దోచుకుంటున్నారన్న వాస్తవాన్ని గమనించింది. తూకాల్లో మోసాలు, ధరల ఖరారులో దగా, ఇలా అన్ని విధాలా అక్కడి గిరిజనులు దోపిడీకి గురవుతున్న సత్యం నిర్ధారించుకుంది. వ్యవస్థీకృత మార్కెట్ కు చేర్చినట్లయితే వారికి కనీసం ఇరవై నుంచి 30 శాతం అదనపు ఆదాయం లభిస్తుందని లెక్కలు కట్టింది. జిగురు సేకరణలో కొన్ని మార్పులు చేసినట్లయితే దిగుబడి మరింతగా పెరుగుతుందని భావించింది.

అనుగుణంగా అడుగులు

ముందుగా శ్రీజన్ సంస్థ మహిళల స్వయంసహాయక బృందాలతో కలిసి పనిచేయడం ప్రారంభించింది. ఈ స్వయం సహాయక బృందాలను మధ్యప్రదేశ్ ప్రభుత్వమే గ్రామీణ జీవనోపాధుల ప్రేరణ పథకంలో భాగంగా ఏర్పాటు చేసింది. శివపురి జిల్లాలోని ఖెరీరా బ్లాకులోని రెండు గ్రామాలలో ఈ పఛకం అమలు చేపట్టింది. ఇలాంటి బృందాలలో ఇదివరకే జిగురు సేకరణలో అనుభవం ఉన్న మహిళలను గుర్తించడంలో పెద్దగా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. వారికి భిన్నంగా, ఒక్కో గ్రామంలో విడిగా మహిళా ఉత్పత్తిదారుల గ్రూపులను ప్రోత్సహించడం జరిగింది. సెంట్రల్ అగ్రో ఫారెస్ట్రీ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (సీఏఎఫ్ఆర్ఐ) శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయి లోనూ, మహిళా బృందాల సభ్యులకు శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడంలోనూ చేయూత అందించారు. ముఖ్యంగా జిగురు సేకరణ, దానిని ఎండబెట్టడం, శుద్ధి చేయడం వంటి అంశాలలో వారికి సరైన శిక్షణ ఇచ్చారు. వారందించిన సూచనల్లో కొన్ని చాలా కీలకమైనవే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి – మరింత లోతుగా, మరిన్ని ఎక్కువ సంఖ్యలో బెరడు ముక్కలను కోయడం. వాటిని బెరడును కొయడానికి ముందే వాటిని సరైన పద్ధతిలో శుద్ధి చేయడం వంటివి జిగురు ఉత్పత్తిలోనూ, దాని నాణ్యతలోను కూడా గణనీయమైన మార్పులకు తోడ్పడ్డాయి. అదే సమయంలో మహిళలకు బుక్ కీపింగ్, రికార్డుల నిర్వహణ, బరువు తూచడం, ధరల వ్యత్యాసాలను అంచనా వేయడం వంటి అంశాలలో కూడా తర్ఫీదునిచ్చారు. ఆ శిక్షణ ఆధారంగా, వారు జిగురు ఉత్పత్తిలో సాధించిన సుస్థిరమైన ఫలితాలు దిగుబడి దాదాపు 30 శాతం వరకు అదనంగా సమకూర్చడం సాధ్యమైంది. నాణ్యత కూడా అందరి మెప్పును పొందగలిగింది.

ఆయా ప్రాంతాలలోని స్వయంసహాయక బృందాలు కొత్తగా ఏర్పాటుచేసిన మహిళా ఉత్పత్తిదారుల బృందాలకు అండగా నిలిచాయి. ఫలితంగా గ్రామ స్థాయిలోనే సేకరణ కేంద్రాలు (విలేజ్ లెవెల్ కలెక్షన్ సెంటర్లు) రూపుదిద్దుకున్నాయి. మహిళా ఉత్పత్తిదారులు అన్నిటికన్నా ముందుగా తాము సేకరించిన జిగురును ప్రాథమికంగా శుద్ధి చేయడంపై దృష్టి సారించారు. ఆ తరువాత దానిని సరైన విధంగా ఎండబెట్టడం అలవరచుకున్నారు. అడవినుంచి సేకరించేందుకు మాత్రమే కాకుండా శుద్ధి, ఎండ బెట్టే కార్యకలాపాలను తమ తమ ఇండ్ల నుంచే నిర్వహించడం మొదలుపెట్టారు. ప్రాథమిక శుద్ధి, ఎండబెట్టే ప్రక్రియ ముగిసిన తరువాత        గ్రామ స్థాయిలోని సేకరణ కేంద్రాలలోనే విక్రయించుకునేవారు. మొదటి ఏడాదిలోనే ఆ విధంగా గ్రామీణ ప్రజలు సుమారుగా 732 కిలోల జిగురు అమ్మకాలను చేపట్టగలిగారు.

——————————————————————————————————————————————-

దయావతి విజయగాథ

శివపురి జిల్లా సిమ్రా గ్రామంలో దయావతి కుటుంబం నివసిస్తుంటుంది. ఆ కుటుంబంలో భర్తా, ఇద్దరు పిల్లలతో ఆమె జీవిస్తోంది. వారికి ఉన్న భూమి విస్తీర్ణం కేవలం అర ఎకరం మాత్రమే. అందులో పండించగలిగే అవకాశాలు చాల తక్కువగా ఉన్న కారణంగా, వారు అడవినే నమ్ముకుని, అటవుల్లో లభించే విలువైన వాటిని సేకరించి అమ్ముకోవడమే జీవనోపాధిగా చేసుకోకతప్పలేదు. ఇతర సమయాలలో కుటుంబ అవసరాల కోసం వారు ఇతరుల పొలాల్లో కూలి చేసుకుంటూ ఉండేవారు. దయావతి, ఆమె భర్తా అడవుల్లో తిరిగి జిగురు సేకరించేవారు. దానిని స్థానికంగా ఉండే కొనుగోలుదారులకే విక్రయించుకునేవారు. అయితే వారు నివసిస్తున్న ప్రాంతానికి అడవికీ మధ్య రెండు కిలోమీటర్ల దూరం ఉండడం ఇబ్బంది కలిగించేది. అయితే దయావతి అడవిలోనే మరింత  లోపలికి వెళ్లి జిగురు సేకరించేంది. తెల్లవారు జామునే లేచి, ఇంట్లో వంట పనులు పూర్తి చేసుకుని అడవి బాట పట్టేది. తిరిగి సాయంకాలానికే ఇంటికి చేరేది. అది ఆమె నిత్య వ్యవహారం. సగటున రోజుకు మూడు, నాలుగు కిలోమీటర్లు కాలినడక ప్రయాణం తప్పేది కాదు.

———————————————————————————————————————————————

శ్రీజన్ గురించిన సమాచారం తెలియగానే, ఆమె మహిళా ఉత్పత్తిదారుల బృందంలో సభ్యత్వం తీసుకోవాలని నిర్ణయించుకుంది. అందులో చాలా చురుగ్గా అన్ని కార్యకలాపాలలోనూ పాల్గొనడం ప్రారంభించింది. ఆమెలోని ఆసక్తి, నాయకత్వ లక్షణాలు ఇతర ఉత్తమ లక్షణాలను గమనించి, సెంటర్ ఇన్ చార్జీ బాధ్యతలు అప్పగించారు. అంతే కాకుండా బుక్ కీపింగ్, రికార్డుల నిర్వహణ, ఈ-వెయింగ్ మెషీన్ నిర్వహణ, చెల్లింపులలో కూడా సుశిక్షితురాలైంది.

గత సీజన్ అంటే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో ఆమె 171 కిలోల మోదుగ జిగురును గ్రామస్థాయి కేంద్రానికి విక్రయించగలిగింది.  అది కూడా కిలోకు రూ. 105 లకు అమ్మడంతో ఆమెకు వచ్చిన ఆదాయం మొత్తం రూ. 18,847 లు. అది కూడా కేవలం మూడు నెలల వ్యవధిలో. స్థానికంగా అమ్ముకున్న రోజులతో పోలిస్తే, ఆమెకు అప్పట్లో కేవలం రూ. 4275 లు మాత్రమే లభించేది. ఇప్పుడు ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగింది. జీవితం ఆనందమయంగా మారింది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే – గతంలో నేను ఏం చేస్తున్నానో, ఇతరులు ఏం చేయగలుగుతున్నారో అర్థమయ్యేది కాదు. అయితే మహిళా ఉత్పత్తిదారుల బృందంలో చేరిన తరువాత మాత్రమే, నేను సేకరించిన ఉత్పాదనకు అధికంగా ధర పలుకుతోంది. సేకరణ క్రమంలో కూడా మోదుగ చెట్లకు కానీ, పరిసరాలలోని అడవికి కాని ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఎక్కువగానే జిగురు సేకరించగలుగుతున్నాను.

ఇలా గ్రామ స్థాయిలో సేకరణ తంతు ముగిసిన తరువాత, నాయకత్వ లక్షణాలున్న కొద్దిమంది అలా సేకరించిన ఉత్పత్తులను విక్రయించే బాధ్యతను చేపట్టారు. ముందుగా స్థానికంగా అంటే గ్రామ స్థాయి లేదా బ్లాక్ స్థాయి లేదా జిల్లా స్థాయి దళారులను వారు దూరం పెట్టాలని నిర్ణయించుకున్నారు. శ్రీజన్ సంస్థ ప్రోత్సాహం కారణంగానూ, వారందించిన వ్యాపార నిర్వహణలోనూ, బేరసారాల మంతనాలలో కూడా శిక్షణ పొందిన కారణంగా వారు  దూర ప్రాంతాలలోని అంటే ఇండోర్, నీముచ్, ఢిల్లీ, జోధ్ పూర్, వడోదర పట్టణాలలోని వ్యాపారులకు విక్రయించగలుగుతున్నారు. ఆ కారణంగా ఇప్పుడు వారికి కనీసం 20 శాతం అదనపు ధర గిట్టుబాటవుతోంది. ఉత్పత్తి కూడా పెరుగుతున్న కారణంగా, అధిక ధరలు, సమర్థవంతమైన నిర్వహణ దినదినాభివృద్ధి చెందుతున్నాయి. మరు సంవత్సరం వచ్చే సరికి ఈ మహిళా ఉత్పత్తిదారుల బృందం ఏకంగా 4500 కిలోల మేరకు మోదుగ జిగురును విక్రయించగలిగారు.

మహిళా ఉత్పత్తిదారుల బృందాల సమావేశాలలో సభ్యుల నుంచి సేకరించే జిగురు విషయంలో కనీస ధరను ఖరారు చేసుకున్నాయి. అలాగే నాణ్యత విషయంలో కూడా స్వయంగా కొన్ని ప్రామాణిక సూత్రాలను నిర్దేశించుకున్నాయి. అంతిమంగా వచ్చే లాభాలలో సగభాగాన్ని అందరూ పంచుకునేందుకు నిర్ణయించారు. మిగిలిన భాగాన్ని గ్రూపు అవసరాలకు పక్కన పెడుతూ వచ్చారు. అదే సమయంలో సభ్యులు తాము ఉత్పత్తి చేసిన జిగురును స్థానిక వ్యాపారులకు లేదా స్థానిక మార్కెట్ లలో కాని విక్రయించుకునే స్వేచ్ఛ కూడా ఉంటుంది. అంటే సభ్యులు ఎవరైనా బృందానికి విక్రయించే ఆసక్తి లేకపోయినా, నాణ్యత సరిగా లేకపోయినా ఈ విధంగా విడిగా విక్రయించుకోవచ్చు.

సాధించిన ఫలితాలు

శివపురి జిల్లాలోని కొందరు ఇలా మహిళా ఉత్పత్తిదారుల బృందంగా ఏర్పడి ఇప్పటికి రెండేళ్లే అయింది. కానీ సాధించిన ఫలితాలు మాత్రం చాలా ఎక్కువే. ఈ రకమైన మహిళా ఉత్పత్తిదారుల బృందం ఏర్పాటు అనేది కేవలం రెండు గ్రామాలలో ప్రారంభమైనప్పటికీ, ఇప్పుడు అది ఒక ఉద్యమం రూపంలో విస్తరించి ఇప్పుడు అయిదు గ్రామాలకు విస్తరించింది. మొదట్లో వీటిలో ఉన్న సభ్యుల సంఖ్య 70 మాత్రమే. ఇప్పుడు ఆ సంఖ్య 300 కు చేరింది. సగటు జిగురు సేకరణ ఒకొక్కరి విషయంలో 10 కిలోల నుంచి 20 కిలోలకు పెరిగింది. జిగురు సేకరణకు ముందుకు వస్తున్న మహిళల సంఖ్య పెరిగే కొద్దీ, ప్రారంభంలో అంతంత మాత్రంగా ఉన్న జిరుగు సేకరణ పరిమాణం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఒక్కో సభ్యుల సేకరణ సగటున 40 కిలోలకు చేరింది. ఈ మార్పునకు ప్రధాన కారణం వారు అనుసరించిన శాస్త్రీయ విధానాలే. ఇప్పుడు ఒక్కో మోదుగ చెట్టు నుంచి సేకరిస్తున్న జిగురు పరిమాణం కూడా ఎక్కువే అయింది. మధ్య దళారుల నుంచి విముక్తి పొంది మార్కెట్లతో నేరుగా అనుసంధానం విస్తరించిన కారణంగా మెరుగైన ధర లభిస్తోంది. (గతంలో కిలోకు 70 లేదా 80 రూపాయలు లభించేది. ఇప్పుడు వారికి 100 నుంచి 120 రూపాయల వరకు కిలోకు ధర పలుకుతోంది.) కొనుగోలుదారుకు నాణ్యమైన జిగురు లభిస్తోంది. ఫలితంగా, వారి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. గతంలో గట్టిగా 1000 రూపాయలు లేదా అంతకంటే తక్కువే వచ్చేది. ఇప్పుడు వారికి ఒకొక్కరికి 4000 నుంచి 4500 రూపాయలు వస్తోంది.

మహిళా ఉత్పత్తిదారుల పని తీరు

కార్యక్రమాలు  2019-20   2020-21
గ్రామాల సంఖ్య   2 7
సభ్యుల సంఖ్య 70 300
అమలులోని విస్తీర్ణం   45 హెక్టార్లు 280 హెక్టార్లు
సీజన్ లో ఒకొక్కరి సగటు సేకరణ 10 కిలోలు 15 – 20 కిలోలు
విక్రయ ధర (కిలోకు)   రూ. 70 – 80 రూ. 100 – 120
సీజన్ లో ఒకొక్కరి సగటు ఆదాయం రూ. 100 – 120 రూ. 4000 – 4500

మోదుగ చెట్ల నుంచి సేకరించే జిగురుకు మరిన్ని అదనపు విలువలు చేర్చడంపై ఇప్పుడు శ్రీజన్ దృష్టి పెట్టింది. దాని ప్రయోజనాలు అనేక రూపాలలో అందుతున్నాయి. ముఖ్యంగా ఉపాధి కోసం వలసలు పోవలసిన దుర్గతి తప్పింది. పంట సాగు కాలం కాకపోయినా, ఉత్పాదన కొనసాగుతూ ఆదాయం తెచ్చిపెడుతోంది. ఆ కారణంగా ఇప్పుడు మరెందరో తమ తమ గ్రామాలలోనే ఉంటూ ఈ జిగురు సేకరణకు ముందుకు వస్తున్నారు.  అయితే ఇప్పటికీ జిగురు సేకరణ ప్రధానంగా మహిళలే నిర్వహిస్తున్నారు. అందువల్ల పురుషులకు కూడా ఆ విషయాలపై శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా మగవారికి కూరగాయల సాగులో శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. అది కూడా ఆయా కూరగాయల సాగు అనుకూలమైన వేళల్లోనే చేపట్టేలా ప్రోత్సహిస్తున్నారు. శిక్షణలో భాగంగా కొన్ని అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి – వాతావరణ అనుకూల విధానాలు – అంటే బయో – ఇన్ పుట్స్ వినియోగం (ఇందులో బీజామృత్, జీవామృత్, ఘనజీవామృత్ వంటి వాడకం). వాతావరణ అనుకూల సేద్యం చేపట్టడంతో పాటు స్థానికంగా నీటి వనరులకు కొరవ లేకపోవడం, కుటుంబ సభ్యులంతా కలిసి కృషి చేస్తారు కాబట్టి, కూరగాయల పెంపకం మంచి రాబడినే అందించగలుగుతుంది. ‘మన భూమిలో మనమే కష్టపడడం ఎప్పుడూ ఉత్తమ విధానం. మా పొలంలో పండించిన వాటినే మా ఆహారంలో ఉపయోగించుకుంటున్నాము. రకరకాల కూరగాయలు మాకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇది మాకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటోంది.’ అంటున్నారు రాధారాణి మహిళా ఉత్పాదక్ సమూహ్ (రాయ్ గఢ్) సభ్యురాలు శారదా దేవి. ఆమె కుటుంబం గత ఏడాదిలో 35 కిలోల వరకు విక్రయించుకోగలిగింది.

మోదుగ చెట్ల నుంచి జిగురు సేకరణలోను, దాని నాణ్యత విషయంలోనూ శ్రీజన్ చేపట్టిన శాస్త్రీయబద్దమైన శాస్త్రవేత్తల సలహాసూచనలు చాలా ప్రభావమే చూపిస్తున్నాయి. ముఖ్యంగా, గ్రామాలలోని వ్యవసాయ పద్ధతుల్లో మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు రైతుల మధ్య విత్తనాల నాణ్యత గురించి, వివిధ పంటల సాగు అవకాశాల గురించి, భూసారం పెంపు చర్యల గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఉత్తమ సేద్య విధానాలను తెలుసుకోవాలన్న ఆసక్తి వారిలో పెరుగుతోంది. ‘మార్పు చాలా స్పష్టమే. మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. విధానాల్లో మార్పు వచ్చింది. అయితే ఆ మార్పులు ప్రధానంగా సన్నకారు, పేద రైతుల్లోనే అధికంగా కనిపిస్తోంది’ అంటున్నారు శ్రీజన్ సంస్థలో ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్న సందీప్.

వివిధ మార్కెట్లతో ఏర్పడిన అనుసంధానం, ధరవరలు, ఇతర వ్యాపార వ్యవహారాలలో భాగస్వామ్యం పెరగడంతో మహిళల్లో మరింత సాధికార ధోరణి బలపడింది. అలాటి సామర్థ్యం సంపాదించుకున్న వారి సంఖ్య స్వల్పమే అయినా, ఆ కొద్ది మంది చేయూత, స్వయంసహాయక బృందాలు, మహిళా ఉత్పత్తిదారుల బృందాల సమావేశాల్లో పాల్గొంటున్న అనుభవం కారణంగా వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులలో చెప్పుకోదగిన మార్పు కనిపిస్తోంది. సిమ్రా గ్రామానికి చెందిన దయావతి ఆదివాసీ ఈ విధంగా తన అభిప్రాయం వెల్లడించారు. ‘మా మహిళా ఉత్పత్తిదారుల బృందం కొత్తగా ఏర్పడింది. అయితే త్వరలోనే కొత్తగా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటున్నాము.’ ఈ రెండు గ్రామాలలో సాధించిన ఫలితాలు గమనించిన శ్రీజన్ సంస్థ శివపురి జిల్లాలోనే కాకుండా బుందేల్ ఖండ్ పరిసరాలలోని ఇతర జిల్లాలలోని బ్లాకులకు కూడా తన కార్యకలాపాలను విస్తరించేందుకు ఉత్సాహపడుతోంది. ఈ విస్తరణ కార్యక్రమాలకు ప్రభుత్వం  నుంచి కూడా తగినంత ప్రోత్సాహం లభిస్తుందని ఎదురుచూస్తోంది.

ముగింపు వాక్యాలు

నిరుపేద చిన్న రైతులకు ఆదాయం స్థిరంగా చేకూర్చేందుకు మార్కెట్ విస్తరణ చాలా అవసరం. స్థానిక పరిమితి దాటి విభిన్నమైన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలి. అంతేకాకుండా, విభిన్నమైన రంగాలకు విస్తరించాలి. ప్రత్యామ్నాయ సేద్యం అనే అంశం సేద్యంలో అంతర్భాగంగానే గుర్తించాలి. ఇక్కడ కూడా రైతులకు అదనపు ఆదాయం చేకూరుస్తుంది. రైతుల్లో పోటీతత్వం పెరుగుతుంది. అదనపు విలువల కూర్పు అంశంపై దృష్టి పెట్టిన తరువాత, అక్కడి గ్రామీణ పేదల ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. శ్రీజన్ సంస్థ సలహాలు, మార్గదర్శకత్వం, మార్కెట్ అనుసంధాన ప్రక్రియలు వంటివి అక్కడి ప్రజల ఆలోచనల్లో మార్పును తెచ్చిపెట్టాయి. చిన్న కమతాలే ఉన్నప్పటికీ వారంతా వారికి మెరుగైన ఆదాయం లభిస్తోంది. ఆయా ప్రాంతాలలో నివసించే ప్రజల జీవనగతిని మార్చివేసింది. అంతేకాకుండా మహిళల సాధికారికతను మరింత పటిష్టం  చేసి, గ్రామస్థాయి ఆర్థిక వ్యవస్థలను పటిష్టంగా మార్చివేసింది. అందువల్ల వ్యవసాయంతో పాటు ప్రత్యామ్నాయ సేద్య రంగాలకు ప్రోత్సాహం ఇవ్వాలి.

రిఫరెన్స్ అంశాలు

అనుపమ, బూటియా (బూటియా మోనోస్పెర్మా), పలాశ్ (మోదుగ) ట్రీ హెల్త్ బెనిఫిట్స్ అండ్ మెడిసినల్ యూజెస్, 2019, బింబిమా, https://www.bimbima.com/herbs/buteamonosperma/4539 లో చూడవచ్చును.

దాల్వాయ్, ఎ. సెకండరీ అగ్రికల్చర్ ఈజ్ ఆఫ్ ప్రైమరీ ఇంపార్టెన్స్, 10, ఆగస్టు, 2020, ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్, పేజీ 8, https://www.financialexpress.com/opinion/secondary-agriculture-is-of-primary-importance/2049891 చూడవచ్చును

డే, కే. సెకండరీ అగ్రికల్చర్: ది షిఫ్ట్ ఇండియన్ ఫార్మింగ్ నీడ్స్, 20, డిసెంబర్ 2019, ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్. https://www.financialexpress.com/opinion/secondary-agriculture-the -shift-indian-farming-needs/1807044


నీరజ్ కుమార్
ప్రొఫెసర్, రూరల్ మేనేజిమెంట్, జిమ్ యూనివర్సిటీ భువనేశ్వర్, ఇండియా E-mail: prof.nkumar@gmail.com మహమ్మద్ జహీద్ టీమ్ లీడర్, శ్రీజన్ న్యూఢిల్లీ, ఇండియా E-mail: mohdzahid@srijanindia.org ప్రసన్న ఖేమరియా సీఈఓ, శ్రీజన్ న్యూఢిల్లీ, ఇండియా E-mail: prasanna@srijanindia.org ఆంగ్ల మూలం: లీసా ఇండియా సంపుటి 23, సంచిక 2 , జూన్ ౨౦౨౧

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...