వ్యర్థాల నుంచి విలువైన వనరుల లభ్యత సేంద్రీయ పెరటి తోటల ఆధారిత ప్రయోగాలు

పెరటి తోటల పెంపకం రూపంలో ఆహార పదార్థాల ఉత్పత్తి, మరిన్ని జీవనోపాధుల కల్పనపై ఇటీవలి కాలంలో నిపుణుల దృష్టి మళ్లింది. సేద్య రంగంలో పర్యావరణానికి సంబంధించిన అంశాలపై అధ్యయనాలు, అభిప్రాయాల మార్పిడి కారణంగా పెరుగుతున్న ఆలోచనల కారణంగా సరి కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఆ క్రమంలో అందుబాటులో ఉండే పరిమిత వనరులను పునరుజ్జీవింపజేసే విషయంలోనూ, వాటిని సరైన మెరుగైన పద్ధతుల్లో ఉపయోగించుకునే విషయంలోనూ ఈ కొత్త ఆలోచనలు వ్యవసాయదారులలో తలెత్తుతున్నాయి.  ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాలలో పేరుకుపోయే వ్యర్థాలను రీసైకిల్ చేసి ఉపయోగించుకునే విషయంలో పెరటి తోటల పెంపకం ప్రాథాన్యత సంతరించుకుంది. 

వ్యర్థాలు అంటే ఎందుకూ పనికిరావనే అభిప్రాయం సర్వసాధారణం. అయితే అలాంటి వ్యర్థాలనే వాటిని సరైన పద్ధతిలో ఉపయోగించగలిగితే మరో ఉత్పాదనకు మూల పదార్థాలు కాగలవు. సేద్య నిర్వహణ అనే అంశంలో వ్యర్థాలను కూడా ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చేలా సద్వినియోగం చేసుకోవడం ఒక ముఖ్యమైనది. ముఖ్యంగా పర్యావరణపరంగా నిర్దేశించిన ప్రమాణాల మేరకు వ్యర్థాలను సక్రమంగా ఉపయోగించుకోవడం చాలా కీలకమైన అంశం. అయితే అందుకు అనుసరించే విధానం రైతులకు ఆర్థికంగా భారం కాకూడదు. తేలికగా అనుసరణీయంగా ఉండాలి. ఒక విషయంలో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించే సమయంలో సరైన విధానాలు అనుసరించని పక్షంలో ఉపరితలంపై ఉండే జల వనరులను  మాత్రమే కాకుండా భూగర్భ జలాలను కూడా కలుషితం చేసే ప్రమాదం ఉంది. అంతేకాదు పర్యావరణంలోని గాలిని కూడా కలుషితం చేసే అవకాశాలున్నాయి. అయినప్పటికీ, పర్యావరణ అనుకూల సేద్య విధానంలో వ్యవసాయ వ్యర్థాలను కూడా ముఖ్యమైన వనరుల్లో ఒకటిగా గుర్తిస్తున్నారు.

విశ్వవ్యాపితంగా విస్తరిస్తున్న ఆలోచనల్లో వ్యవసాయ క్షేత్రాలలో పేరుకుపోయే సేంద్రీయ వ్యర్థాలను ఆధారం చేసుకుని సద్వియోగం చేసుకోవాలసిన ఆవశ్యకతపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. సేంద్రీయ వ్యర్థాలను రీసైకిల్ చేయడం అనే కార్యక్రమాన్ని వ్యవసాయంలో అంతర్భాగంగానే ప్రోత్సహించాలని, అందుకు సమర్థవంతమైన విధానాలు అనుసరించాలని ఆలోచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పంటలు ఏపుగా ఎదగడానికి అవసరమైన ఖనిజాలు, ఎరువులు వంటి పోషకాలు పుష్కలంగా లభించడమే కాకుండా పొలం భూమిల కార్బన్ లోపాన్ని సరిచేసుకోవచ్చునని గుర్తింస్తున్నారు. పంట సాగులో కానీ, పశువుల పోషణలో కానీ మిగిలిపోయే వ్యర్థాలన్నీ కూడా సేకరించి, నిల్వ చేసుకోవడం ద్వారా వాటిని పొలంలోనే మరిన్ని ప్రయోజనాలు సాధించే విధంగా తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల భూసారం మెరుగుపడి ఉధృత స్థ్యిలో చేపట్టే సాగు కార్యక్రమాలలో మరింత ఉత్పాదక సామర్థ్యాన్ని సమకూర్చుకోవచ్చు. ఇలా నిల్వచేస్కున్న వ్యర్థాలను ఖనిజాలతో కూడిన ఎరువుల కొరత ఏర్పడినప్పుడు భరోసానిస్తుంది. రీసైకిల్ చేసిన వనరులు వ్యవసాయ రంగాన్ని పర్యావరణకు అనుకూలంగా తీర్చిదిద్దుతుంది. అదే సమయంలో వ్యవసాయంలో వైరుధ్యాన్ని పెంపొందిస్తుంది.

ఈ రకంగా పెరటి తోటల పెంపకం లేదా వ్యవసాయ రంగంలో పేరుకుపోయే వ్యర్థాలను సద్వినియోగం చేసుకునే విషయంలో సరైన అవగాహన కలిగించేందుకు, సరైన విధానాలు తెలియజేసేందుకు శ్రీలంకలో ఒక కార్యక్రమం చేపట్టారు. పర్యావరణ అనుకూల సేద్యంలో యువత పాత్ర పేరుతో మలేసియా కేంద్రంగా పనిచేస్తున్న పెస్టిసైడ్ యాక్షన్ నెట్ వర్క్ ఏసియా అండ్ పసిఫిక్ – పాన్ ఏపీ సంస్థ చేపట్టింది. ఈ కార్యక్రమం దక్షిణాసియాలోని భాగస్వాములకు ప్రయోజనకరమైనది. ఈ కార్యక్రమాల ఫలితంగా పర్యావరణ జీవ వైవిధ్యం, ఆహార భద్రతలో సార్వభౌమత్వ రక్షణ, పర్యావరణ అనుకూల సేద్యం గురించి ఈ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పిస్తాయి.  ఒకరి అనుభవాలను ఇతరులకు తెలియజేసేందుకు మాత్రమే కాకుండా వ్యవసాయదారుల సామర్థ్యం పెంపొందించడం దీని లక్ష్యం. మార్చి 2018లో పాన్ ఏపీ భాగస్వామ్య పక్షాలు సమైక్యంగా ఇండోనేసియాలోని జకార్తాలో “ఆచరణలో పర్యావరణ అనుకూల సేద్యం” అనే అంశంపై ప్రచార కార్యక్రమం చేపట్టాయి. ఈ సందర్భంగా ఇతరుల అనుభవాలను పరస్పరం తెలియజేసుకునేందుకు అవకాశం కల్పించడం ద్వారా మాత్రమే ఈ ఆశయ సాధనకు అనుకూలమైన విధానమనే అభిప్రాయం ఏర్పడింది. భాగస్వామ్య పక్షాలలో ఒకటైన కుదుంబం అనే సంస్థ రెండు దశాబ్దాలకు పైగా ఈ తరహా కార్యక్రమాలలో పాలుపంచుకుంటోంది.

పర్యావరణ-సేద్యంపై అభిప్రాయ మార్పిడి

అనుభవాల మార్పిడి ఆవశ్యకతపై తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఫిబ్రవరి, 2019లో శ్రీలంకలోపర్యావరణ సేద్యంపై యువకులకు అవగాహన కల్పించేందుకు నాలుగు రోజుల పాటు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియా, బంగ్లాదేశ్, కంబోడియా, మలేసియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక దేశాల రైతు సోదరులు పర్యావరణ సేద్యంపై పరస్పరం తమ అనుభవాలను పంచుకున్నారు. వాటి ఫలితాలను బేరీజు వేసేందుకు, సమస్యలను గుర్తించేందుకు అధ్యయనం చేపట్టారు. పర్యావరణ సేద్యం, హార సౌర్వభౌమత్వం వంటి అంశాలపై చర్చలు, గోష్టులు జరిగాయి. స్థానిక స్వచ్ఛంద సంస్థ వికల్పని జాతీయ మహిళల ఫెడరేషన్ ఈ అభిప్రాయ మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహించింది. క్షేత్ర స్థాయిలోనూ, సంస్థాపరంగాను అవగాహన కల్పించేందుకు అనుకూలమైన కార్యక్రమాలను రూపొందించింది.

ఇందులో భాగంగా భాగస్వామ్య పక్షాలన్నీ వికల్పనీ మహిళా ఫెడరేషన్ అధీనంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాలను సందర్శించాయి. కొలంబో పట్టణానికి పశ్చిమంగా 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోనర్వగాలా ప్రాంతంలో ఈ భూములున్నాయి. శ్రీలంకలోనిమహిళా రైతులతో కలిసి ఈ సంస్థ రెండు దశాబ్దాలుగా పనిచేస్తోంది. సమాఖ్యలుగా రైతు బృందాలుగా వారిని సంఘటితపరచి సేంద్రీయ పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఇండ్ల పెరటి భాగాల్లో మహిళా రైతులు సాగుచేస్తున్న తోటలను వారు పరిశీలించారు. వారికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని వికల్పనీ సంస్థ అందజేస్తోంది. ఈ విధంగా వారు పండిస్తున్న పెరటి ఉత్పాదనలన్నీ కూడా ఇండ్లలో సభ్యుల ఆహార అవసరాలకే వినియోగమవుతున్నాయి. తోటల పెంపకంలో కుటుంబ సభ్యులే పూర్తి సమయాన్ని, శ్రమను కేటాయిస్తున్నారు. ఒక్కొక్కటి ఒక్కో తీరులో ఆ పెరటి తోటలు చూడముచ్చటగా ఉన్నాయి. వాటి రూపకల్పనలో వైరుద్ కనిపిస్తుంది. అందుబాటులో ఉన్న కొద్దిపాటి విస్తీర్ణాన్ని వినియోగించుకున్న తీరు కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంది. తోటలు నేలబారునే కాకుండా అంతస్థుల వారీగా కూడా పెరిగేందుకు ఏర్పాట్లున్నాయి. మొత్తం మీద అవి ఆయా కుటుంబాల అవసరాలను పూర్తిగా తీరుస్తున్నాయి.

విభిన్నమైన పంటలు, వివిధ రకాలైన కూరగాయలు పెరళ్లలోనే ఒక క్రమ పద్ధతిలో సాగు అవుతుండడం ఆకర్షణీయంగా ఉంది. రకరకాలైన కాయగూరలు, ఔషదీ మొక్కలు, పచ్చటి చెట్లు అక్కడ కనిపించాయి. కూరగాయల్లో వంకాయ, ఓక్రా, మిర్చి, ఉల్లి, ఆకు కూరలు, బీన్స్ తరహా మొక్కలు, మిరియాలు, కాకరకాయలు, పొట్లకాయలు, పుదీనా, ముల్లంగి, పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచే సరస్వతీ ఆకులు లేదా బ్రాహ్మీ ఆకుల మొక్కలు (వెళ్లరాయ్), అలోవెరా, కొత్తిమీర, పసుపు, వెల్లుల్లి, అరటి తోటలు మాత్రమే కాకుండా టేకు, గ్లైసిరిడియాగా ప్రసిద్ధి ఉన్న మాద్రి చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు ఎక్కువగా కనిపించాయి. పంటల ఎంపిక, అవసరమైన ముడి సరుకుల సేకరణ, సాగు చేయడం, నిర్వహణ వంటివి కుటుంబపరంగానే సాగుతుంది. ఈ రకమైన కుటుంబ అవసరాలను తీర్చడమే కాకుండా కొద్దిపాటి ఆదాయం కూడా లభిస్తున్నది. వీటి ఎంపికలో కుటుంబ అవసరాలను కనీసం 80 శాతం మేరకు తీర్చేవిగా ఉంటుంది. పోషక ఆహారం పుష్కలంగా లభిస్తూ ఉంటుంది.

చెత్త నుంచి ఎరువుల తయారీ

ఈ ప్రయోగం విజయవంతం కావడానికి బలమైన హేతువు ఒక్కటే. కుటుంబ సభ్యులందరికీ రీసైక్లింగ్ ప్రాధాన్యతపై సరైన అవగాహన ఉండడమే. చెత్తను ఆధారం చేసుకుని విలువైన ముడి సరుకుగా మార్చుకోవడమే. అక్కడి మహిళా రైతుల నుంచి పెరటి తోటల పెంపకంపై తెలుసుకున్న పరిజ్ఞానం ఇతర ప్రాంతాల వారికి, ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని ఆయా ప్రాంతాలను సందర్శించిన భాగస్వామ్య రైతులకు వంటింట్లో పేరుకుపోయే చెత్తను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో స్పష్టంగా బోధపడింది. అలాగా ఇంటి వాడకంలో వృధా అయ్యే నీటిని తోటల పెంపకానికి ఎలా రీసైకిల్ చేసి ఉపయోగించుకోవచ్చో తెలిసివచ్చింది. వృధా అయ్యే నీటిని రీసైకిల్ చేయడంలో స్థానికంగా లభించే వస్తువులనే ఉపయోగించారు. గ్లైసిరిడియా కొమ్మలను ఉపయోగించి క్రీపర్లుగా ఉపయోగించారు. అంటే ఈ కొమ్మలను ఉపయోగించి తీగ మొక్కల పెంపకం చేపట్టారు. ఫలితంగా నేలలో తేమ స్థిరంగా నిలిచి ఉంటుంది. బయో చార్ కోల్ తయారు చేసి ఎరువుగా ఉపయోగించడం తోటలకు ఎంతో మేలు చేస్తోంది.

 ఈ సందర్భంలో ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహకాల గురించి కూడా భాగస్వాములకు తెలిసి వచ్చింది. ముఖ్యంగా శ్రీలంక వ్యవసాయ శాఖ సేంద్రీయ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఒక సెంటర్ ను ఏర్పాటుచేసింది. ఈ సెంటర్ లో వివిధ రకాలైన జీవ సంబంధ ముడి వనరులపై ప్రత్యేకంగా అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. వాటి ఫలితాలను పరిశీలించిన తరువాత మాత్రమే రైతులకు సిఫార్సు చేస్తున్నారు. చివరిగా వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేస్తున్న ఒక మహిళ పట్టణ సమీపంలోని తన నివాసంలోనే పెంచి పోషిస్తున్న పెరటి తోట చాలా ఆసక్తిని రేకెత్తించింది.

ముగింపు

సర్వత్రా సమస్యగా మారిన ఆహార సంక్షోభం, పెరిగిపోతున్న ఆహార పదార్థాల ధరవరల నేపధ్యంలో స్థానికంగా పోషక ఆహార వ్యవస్థలను ప్రోత్సహించడం చాలా అవసరం. ఈ సందర్భంలోనే ఆహారోత్పత్తి, జీవనోపాధుల పెంపు అవసరాలకు కూడా ఇలా పెరటి తోటల పెంపకం ఎంతగానో ప్రయోజనకరం. మొత్తం మీద ఈ ప్రయత్నం, పర్యటన కూడా పర్యావరణ సేద్యం విషయంలో సరికొత్త ఆలోచనలను రేకెత్తించాయి. పెరడులో పేరుకుపోయే వ్యర్థాలను సద్వినియోగం చేసుకునే మార్గాలను చూపించాయి.  పెరటి తోటల పెంపకంలో రీసైక్లింగ్, నిర్వహణ ఉత్తమ పద్ధతులను సూచించాయి.

సురేశ్ కన్నా కె
కుటుంబం
నెం. 113/118, సుందరరాజ్ నగర్, సుబ్రహ్మణ్యపురం
తిరుచ్చి – 620 020, తమిళనాడు
E-mail: sureshkanna_kudumbam@yahoo.in   

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి 21 , సంచిక 2 , జూన్ 2019

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...