వీడియోల ద్వారా పర్యావరణ అనుకూల సేద్యంపై శిక్షణ —రైతుల చేతుల్లోకి అధ్యయన సాధికారత

పర్యావరణ అనుకూల సేద్యం, సేంద్రీయ సాగు విధానాల గురించిన పరిజ్ఞానాన్ని, ఉత్తమ సేద్య పద్ధతుల గురించి సమగ్రమైన సమాచారాన్ని వ్యవసాయ దారులకు అందుబాటులో తీసుకురావాలంటే అలాంటి సలహా సూచనలు అందించే సేవా సదుపాయాల ప్రాధాన్యం చాలా ఉంటుంది. ఈ సేవలను అందించడంలో డిజిటల్ అధ్యయన పరికరాలు చాలా ఉపయోగకరం. కారణం వాటిని తక్కువ ఖర్చుతోనే రైతులకు చేరువ చేయవచ్చు. పర్యావరణ అనుకూల సేద్యంలో ఉత్తమ పద్ధతులు వివరించడంతో పాటు రైతులు ఎవరిమటుకు వారు తమ తమ వ్యవసాయ క్షేత్రాలలో ప్రయోగాలు చేసి స్థానికంగానే మరింత మెరుగైన పద్ధతులను ఆవిష్కరించేందుకు ప్రోత్సహించడంలో ఈ డిజిటల్ సాధనాలు చాలా ప్రయోజనకరంగా నిలుస్తాయి. పర్యావరణ అనుకూల సేద్యాన్ని ప్రోత్సహించడంలో తోడ్పడతాయి.

పర్యావరణ అనుకూల సేద్యం అంటేనే సంక్లిష్టమైన విషయ పరిజ్ఞానంపై ఆధారపడినది. ఈ పరిజ్ఞానాన్ని చిన్న, సన్నకారు రైతులు లేదా అంతగా అనుభవం లేని యువకులు, మహిళా రైతులు పరస్పరం అర్థమయ్యేలా వ్యాప్తి చేయడం కష్టసాధ్యమనే చెప్పాలి. అందుకు కారణం వారికి ఎదురయ్యే విభిన్నమైన సవాళ్లే. అంతేకాకుండా వారికి వ్యవసాయ పద్ధతులపై పూర్తి అవగాహన ఉండదు. సరైన అనుభవం ఉండదు. అంతేకాక వారికి వారి భాషలోనే తెలుసుకునే సదుపాయాలు అంతంత మాత్రమే. ఈ కారణాల వల్ల వారు తమకు ప్రయోజనకరమైన సమాచారం కోసం దిక్కులు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నారు. స్థానిక ఆహారపు వ్యవస్థలను కాపాడేందుకు అలాంటి పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను అందించే సౌకర్యాలను మెరుగుపరచడం అత్యంత ఆవశ్యకం.

అయితే మన దేశంలో రైతుల సంఖ్యకూ, వారికి సహాయసహకారాలు అందించవలసిన విస్తరణ కార్యకర్తల సంఖ్యకూ మధ్య ఉన్న వ్యత్యాసం చాలా ఎక్కువ. (మన దేశంలో 1162 మంది రైతులకు ఒక్కరే విస్తరణ అధికారి అందుబాటులో ఉంటున్నారు) ఈ కారణంగా కూడా చాలా మంది రైతులకు వారి సహాయం చేరువ కావడంలేదు. విస్తరణ కార్యకర్తలతో ముఖాముఖీ సంప్రదింపులు దాదాపు అసాధ్యంగా తయారైంది. చాలా దశాబ్దాలుగా, వాడుకలో ఉన్న విస్తరణ అధికారుల సేవలు సరైన దిశగా సాగడం లేదు. కేవలం రీసెర్చి క్రమంలో భాగంగా మాత్రమే కొద్ది మేరకు సమాచార మార్పిడి సాగుతూ వచ్చింది. అది కూడా గ్రీన్ రివల్యూషన్ (హరిత విప్లవం)లో భాగంగా, మాత్రమే పరిమిత స్థాయిలో సంబంధిత విజ్ఞానం, లేదా నైపుణ్యాలు క్షేత్ర స్థాయిలో వ్యవసాయదారులకు చేరుతూ ఉండేది. అది కేవలం రైతుల అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో, పర్యావరణ అనుకూల సేద్య రంగానికి ఏ మాత్రం ఉపయోగకరంగా ఉండేది కాదు. ప్రత్యేకించి పర్యావరణ అనుకూల సేద్య రంగం విషయంలో రైతులకు శిక్షణ ఇచ్చేందుకు అప్పుడప్పుడు అక్కడక్కడ శిబిరాలు నిర్వహిస్తూ ఉండేవారు. అయితే  సదుపాయం కూడా చాలా కొద్ది మంది రైతులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ పరిస్థితులలో పర్యావరణ పరంగా శ్రేయోదాయకమైన సేద్య విధానాల గురించి రైతులకు తగినంత సమాచారాన్ని పంపిణీ చేసేందుకు, ఉత్తమ పద్ధతులను గుర్తించి వాటిని వ్యవసాయ దారులకు, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతుల వరకు చేర్చడం అనేది ఇప్పటికీ ఇంకా పెద్ద సమస్యగానే మిగిలిపోయింది.

ప్రస్తుత కాలంలో నూతన ఇన్ ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలు (ఐసీటీ) అనేకం వెలుగు చూస్తున్నాయి. వాటిని రైతుల క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లవలసిన అవసరం మరింత పెరిగింది. ఈ విధంగా కీలకమైన సమాచారాన్నిసకాలంలో వ్యవసాయదారులకు చేర్చాలి అంటే అందుకు అనుగుణంగా డిజిటల్ పరికరాల రూపకల్పనలో కూడా ఆధునిక సదుపాయాల కూర్పుచేర్పుల ప్రాధాన్యత మరింత కీలకంగా మారింది. వాటిని అందుబాటులోకి తీసుకురావాలి. అప్పుడే రైతులు అనుసరించే సేద్య విధానాలలో పర్యావరణ అనుకూల విధానాలను ప్రవేశపెట్టడం సాధ్యం అవుతుంది.  సేద్య రంగంలో సేంద్రీయ విధానాలను ప్రోత్సహించడం సాధ్యమవుతుంది. ఈ దిశగా చేపట్టే కృషిలో వీడియోల ద్వారా విజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను విస్తృతంగా ప్రచారం చేయడం సులభమార్గంగా కనిపిస్తోంది. పైగా ఈ పద్ధతి అమలుకు అంతగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ విధంగా తాము తెలుసుకున్న విజ్ఞానం ఆధారంగా రైతులు తమ తమ పొలం భూముల్లో వాటిని ప్రయోగించ గలుగుతాకు. స్థానిక అవసరాలకు అనుగుణంగా నూతన ఆవిష్కరణలు గుర్తించగలుగుతారు. పర్యావరణ అనుకూల సేద్య విధానాలను మరింతగా ఆచరణలోకి తీసుకురాగలుగుతారు.

వీడియో ఆధారిత అభ్యాసం ప్రభావం

యాక్సెస్ అగ్రికల్చర్ పేరుతో ఏర్పడిన ప్రభుత్వేతర, లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ రంగంలోకి అడుగు పెట్టింది. ఇది పర్యావరణ అనుకూల సేద్యం, సేంద్రీయ వ్యవసాయం ప్రోత్సాహక కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతోంది. ముఖ్యంగా వీడియోల ద్వారా సమాచార మార్పిడి ప్రక్రియ చాలా సమర్థవంతంగా, ప్రయోజనకరంగా ఉంటుందని ఈ సంస్థ కృషి నిరూపించింది. అంతేకాకుండా, పర్యావరణ అనుకూల సేద్య  సంబంధిత సమాచారం మార్పిడికి, వారిలో అభ్యసన సామర్థ్యం పెంపునకు వీడియో ఆధారిత సమాచార మార్పిడి అనుకూలమైన విధానమని స్పష్టమయింది. వీడియో ప్రచారం –  రైతుల మధ్య సాగే (విస్తరణ కార్యకర్తల సహాయంతో) ముఖాముఖీ విషయ మార్పిడి కన్నా- ఎక్కువ ప్రభావవంతమైనదని తేలింది.

యాక్సెస్ అగ్రికల్చర్ సంస్థ కృషి ఫలితంగా రైతుల అనుభవాలు, వారు రూపొందించిన ఉత్తమ పద్ధతులను ఒక ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు చేరవేయడం సాఫీగా సాగుతోంది. పైగా ఆ సమాచారం మొత్తాన్ని స్థానిక భాషలలోనే లభిస్తోంది. ఈ సంస్థ గురించినపూర్తి వివరాలను (www.accessagriculture.org) వేదికపై 225 వీడియోలు అందుబాటులో ఉన్నాయి.  దాదాపు 90 భాషల్లో లభిస్తున్నాయి. పైగా వాటిని అన్నిటినీ ఉచితంగానే డౌన్ లోడ్ చేసుకోవచ్చును.

ఒకరి అనుభవాలను ఆధారం చేసుకుని ఇతర రైతులు కూడా కొత్త కొత్త విధానాలను ఆచరణలో పెట్టేందుకు ఆసక్తితో ఉంటారనే అభిప్రాయమే ఈ మొత్తం ప్రక్రియకు కీలకం. యాక్సెస్ అగ్రికల్చర్ సంస్థ రూపొందించిన వీడియోలు అన్నీ కూడా సగటు వ్యవసాయదారులు ఎదుర్కునే సవాళ్లనే ప్రతిబింబిస్తుంటాయి. వాటి పరిష్కారానికి తీసుకోవలసిన పరిహార మార్గాలను కూడా నిర్దేశిస్తున్నాయి. వాటిలో సమాజంలోని ఇతర వర్గాలతో కలిపి చేపట్టవలసినవి మాత్రమే కాకుండా వ్యవస్థాపరంగా నూతన ఆవిష్కరణలకు చోటు ఉంటుంది. భాషాపరంగా సులభశైలిలో భావ వ్యక్తీకరణ ఉంటుంది. ఆ కారణంగా గ్రామాలలోని వారికి కూడా చాలా తేలికగా అర్థం చేసుకునేందుకు అనువుగా ఆ వీడియోలు రూపొందుతున్నాయి.

వ్యవసాయదారుల అనుభవాలు, శాస్త్రవేత్తల అధ్యయనం సారాంశాల కలగలుపుతో సేద్య రంగ ప్రయోజనాలకు అనుగుణంగా ఈ వీడియోలను తయారుచేస్తున్నారు. ఆచరణాత్మకమైన శైలిని అనుసరిస్తూ ఒక క్రమపద్ధతిలో వ్యవసాయ ప్రక్రియలను చేపట్టే విధివిధానాలను, అప్పటికే ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టి మేలైన ఫలితాలు సాధించిన ఆదర్శనీయమైన రైతుల సూచనలు పొందుపరుస్తూ, వ్యవసాయ రంగాన్ని  సుస్థిర లాభదాయక కార్యకలాపంగా రూపొందించడం కోసం వీడియోల రూపకల్పన జరుగుతోంది. వీడియోలలో ఏ పని ఎప్పుడు ఎందుకు చేపట్టాలో కూడా వివరిస్తూ అందులో అంతర్లీనంగా ఉన్న బయోలాజికల్, ఫిజికల్ ప్రక్రియలను కూడా చేర్చి నూతన ఆవిష్కరణలకు తోడ్పడేందుకు శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది. అదే క్రమంలో నిర్దేశించిన ఒక కార్యక్రమాన్ని అదే పద్ధతిలో ఎందుకు చేపట్టాలో కూడా అందులో రైతులకు అర్థమయ్యేలా వివరించడం జరుగుతోంది.

వీడియోలలో విభిన్నమైన ప్రాముఖ్యం ఉన్న అంశాలను పొందుపరుస్తున్నారు. స్థానిక వ్యవసాయదారుల ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకుని వాటిని ఎంపిక చేస్తారు. పంట కోతల తరువాత చేపట్టవలసిన అంశాలతో పాటు మార్కెట్ కు చేర్చడం, ఉత్పత్తులను ప్రాసెస్ చేయవలసిన ప్రాముఖ్యతను కూడా వివరించేందుకు కృషి చేస్తున్నారు. ప్రాసెస్ చేసినందవల్ల వచ్చే అదనపు విలువలను కూడా తెలియజేస్తున్నారు. ఫలితంగా రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్న వాస్తవాన్ని నిరూపించేందుకు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. అదే సమయంలో రైతు కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యం, దానిని కాపాడుకునేందుకు సమకూర్చుకోవలసిన పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలు, రైతు పెంచి పోషిస్తున్న పశు సంపద ఆరోగ్య రక్షణ, ఆ ప్రయోజనాల సాధనలో సంప్రదాయక పద్ధతులతో పాటు ఆధునిక విధానాలను వివరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా పేద రైతులకు అందుబాటులో ఉండడంతో పాటు వాతావరణ మార్పులకు అనువుగా ఉండడం గమనించవలసిన ముఖ్యమైన అంశం.

———— 2012 నుంచి అందుబాటులోకి వస్తున్న వీడియో ఆధారిత రైతు చైతన్య కార్యక్రమం ఇప్పటికి 100 దేశాలలోని 9 కోట్ల మంది రైతులకు చేరువ అయింది. ——–

వీడియోల ద్వారా పశు పోషణ విజ్ఞానం

యాక్సెస్ అగ్రికల్చర్ సంస్థ  మహారాష్ట్రలోని పూనే పరిసరాలలో ఆంత్ర అనే మరో స్వచ్ఛంద సంస్థతో కలిసి పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మూలికా వైద్య విధానాలను రైతులకు వివరించి చెప్పేలా వీడియోలను ప్రవేశపెట్టింది. వాటిని యాక్సెస్ అగ్రికల్చర్ సంస్థకు అనుబంధంగా ఉన్న వీడియో రూపకర్తల బృందం పర్యవేక్షణలో రూపొందిస్తున్నారు.

పశువుల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నంలో వినియోగించే బ్యాక్టీరియా – దానిని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ – ఏఎంఆర్ గా వ్యవహరిస్తారు) – ప్రభావం వల్ల మానవులకు హాని కలుగుతుందనే వాస్తవం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మూలికా వైద్యం ఆధారంగా పశువుల ఆరోగ్యాన్ని కాపాడే విధానాలను వివరించే వీడియోల ప్రాధాన్యం మరింత పెరిగింది. యాంటీ బయాటిక్స్ ను వెచ్చల విడిగా, విచక్షణారహితంగా ఉపయోగిస్తే ఎదురయ్యే హానికర పరిణామాలను ఈ వీడియోలలో వివరిస్తున్నట్లు ఆంత్ర సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ నిత్య ఘోట్గే తెలిపారు.

పశు ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు వేల సంఖ్యలో ముఖాముఖి శిక్షణ ఇచ్చినప్పటికీ, ప్రత్యేకంగా వేర్వేరు పశు జాతులకు వర్తించే వైద్య విధానాలపై సమగ్రంగా వారికి తర్ఫీదు ఇచ్చే విషయంలో ప్రగతి ఆశించిన స్థాయిలో లేదని డాక్టర్ ఘోట్గే అభిప్రాయపడుతున్నారు. అందువల్లనే ఆంత్ర సంస్థ యాక్సెస్ అగ్రికల్చర్ సంస్థతో కలిసి పశు వైద్యానికి సంబంధించిన హెర్బల్ మందులు, సహజసిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన వైద్య పద్ధతులను వివరిస్తూ వీడియోల తయారీకి సిద్ధమైనట్లు ఆమె తెలిపారు.

“ఈ వీడియోలకు రైతుల నుంచి మెరుగైన స్పందన, ఆసక్తి వస్తున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలోని పశు పోషకులు స్వాగతిస్తున్నారు. వీడియోలను ఉపయోగించి రైతులు అవసరమైన మందులను స్వయంగా తయారు చేసుకోగలుగుతున్నారు. వీడియోల తయారీలో ఇలాంటి రైతుల సలహా సూచనలకు చాలా ప్రధానమైన పాత్ర ఉంటుంది. ఈ రకంగా చూసినట్లయితే వీడియోల తయారీ అనే కార్యక్రమం పరస్పర భాగస్వామ్యానికి ప్రతీక. ఇప్పుడు ఆంత్ర సంస్థ అందించే శిక్షణ కార్యక్రమాలలో ఈ వీడియోలు కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి ” అంటున్నారు డాక్టర్ ఘోట్గే.

“ ప్రస్తుతానికి మహారాష్ట్రలో దాదాపు 20,000 మంది రైతులు – వారిలో సంచార పశు పోషకులు – కూడా పాలు పంచుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలలో కూడా దాదాపు అదే సంఖ్యలో పశు పోషకులు మాతో కలిసి పనిచేస్తున్నారు. అంతేకాదు, ఇవాళ్టి రోజున మహారాష్ట్ర ప్రభుత్వ పశు సంవర్ధక శాఖ వారి భాగస్వామ్యం కూడా అందుతోంది. ప్రకృతి సహజ పశు వైద్య విధానాలను ప్రోత్సహించడంపైనే మేమంతా దృష్టి పెడుతున్నాం. ” అని కూడా ఆమె తెలిపారు.

దేశమంతటా సేంద్రీయ సేద్య విస్తరణకు కృషి

దేశవ్యాప్తంగా సేంద్రీయ సేద్య విధానాలను వ్యాప్తి చేసేందుకు యాక్సెస్ అగ్రికల్చర్ సంస్థ తన అనుబంధ సంస్థలతో కలిసి పథకం సిద్ధం చేస్తోంది. ఎక్కడికక్కడ స్థానిక భాషలోనికి ఈ వీడియోలను అనువదించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రకంగా రైతులకు మాత్రమే కాకుండా సమాజంలోని ఇతర ఔత్సాహిక వర్గాలకు సరైన అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

‘ప్రకృతి సహజమైన సేంద్రీయ సేద్యాన్ని పోత్సహించేందుకు భారత ప్రభుత్వం నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తోంది. ఆ విధంగా పర్యావరణ అనుకూల సేంద్రీయ పద్ధతులలో ఉత్పత్తి చేసిన ఉత్పాదనలకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు కూడా ప్రభుత్వం ముందుకు వస్తోంది. ఈ లక్ష్యాల సాధనలో యాక్సెస్ అగ్రికల్చర్ సిద్ధం చేసిన వీడియోలకు ఎంతైనా ప్రాధాన్యత ఉంది.’ అని తెలియజేశారు డాక్టర్ మహేశ్ చందర్. ఆయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐసీఏఆర్)కు అనుబంధంగా ఉన్న ఇండియన్ వెటర్నరీ రీసెర్చి ఇనిస్టిట్యూట్ లోని ఎక్స్ టెన్షన్ ఎడ్యుకేషన్ విభాగానికి అధిపతి.

‘రైతులు, విస్తరణ అధికారులు కూడా అనుభవజ్ఞులైన వాళ్లే. అయితే వారంతా పూర్తిగా సంప్రదాయ సేద్య విధానాలపైనే అవగాహనతో ఉంటున్నారు. వారి ఆలోచనా సరళిలో మార్పు రావలసి ఉంది. ముఖ్యంగా పర్యావరణ అనుకూల సేద్య విధానాలు, సేంద్రీయ సాగు పద్ధతుల విషయంలో అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను వారు సమకూర్చుకోవాలి. ఈ సందర్భంలోనే యాక్సెస్ అగ్రికల్చర్ వీడియోలు చాలా విలువైనవిగా కనిపిస్తాయి.’ అని చెబుతున్నారు డాక్టర్ మహేశ్ చందర్.

వ్యాప్తి చేసేందుకు కృషి

యాక్సెస్ అగ్రికల్చర్ అందించే సేవలు చిట్టచివరి వ్యక్తి వరకు చేరవేసేందుకు అవసరమైన పూర్తి స్థాయి వ్యవస్థ సిద్ధంగా ఉంటోంది. స్వచ్ఛందంగా సేవలు అందించే యువ కార్యకర్తలు, గ్రామ ప్రాంతాలకు చెందిన మార్పును ఆశిస్తున్న వారు సంఘటితంగా చేతులు కలిపి ఈ కార్యక్రమాలను ముందుకు నడిపిస్తున్నారు. అలా సంఘటితమైన వ్యవస్థ పేరు ఎంటర్ ప్రెన్యూర్స్ ఫర్ రూరల్ యాక్సెస్ (ఈఆర్ఏ). యువ శక్తితో నిండి ఉన్న ఈఆర్ఏ వ్యవస్థ లో పనిచేసే ప్రతి ఒక్కరికీ  డిజిటల్ నైపుణ్యాలలో పూర్తి సత్తా ఉంది. వారు రైతుల కోసం సిద్ధం చేసిన వీడియోలను వారు రైతులకు ప్రదర్శించగలిగిన నైపుణ్యాలు ఉన్న వారే. ఆ విధంగా పల్లె సీమలకు వెళ్లి అక్కడి రైతులకు వీడియోలను ప్రదర్శించి, వారిలో వ్యవసాయ సంబంధిత విధానాలలోనూ, వారి జీవన ప్రమాణాలలోనూ కూడా మార్పు తీసుకురావడానికి వారు ప్రధాన సాధనంగా మారుతున్నారు.

రైతులకు సేద్య రంగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని వీడియో రూపంలో ప్రదర్శించడానికి ఉపయోగించే ప్రొజెక్టర్ పనిచేసేందుకు అవసరమైన విద్యుత్ కోసం సౌర శక్తి ఫలకాలను ఉపయోగించుకుంటున్నారు.  ఎందుకంటే మారు మూల ప్రాంతాలలో విద్యుత్ కానీ, ఇంటర్ నెట్ సదుపాయం కానీ, ఇతరత్రా సాకేంతికత కాని అందుబాటులో ఉండదు. యాక్సెస్ అగ్రికల్చర్ సంస్థ వీడియోలను ఈ కారణంగా ఎంతటి మారుమూల ప్రదేశాలలో అయినా రైతులకు చేరవేయడం సాధ్యమవుతోంది. ఇలా వీడియోల ద్వారా రైతులకు, వారి కుటుంబ సభ్యులకు సమృద్ధిగా విషయ పరిజ్ఞానాన్ని అందించడం సాధ్యమవుతోంది. విశ్వ వ్యాప్తంగా ఇలాటి వీడియోల ప్రయోగం రైతుల జీవితాలలో నూతన కాంతులు వెల్లివిరిసేందుకు కారణమవుతోంది.

పేద దేశాలలో ప్రభావం

యాక్సెస్ అగ్రికల్చర్ రూపొందించిన వీడియోల ప్రభావం గురించి తెలుసుకోడానికి  గతంలో మూడు సార్లు సర్వేలు  ఇప్పటివరకు నిర్వహించారు. ఈ సర్వేలు 2015లోనూ, 2018లోనూ, 2021లోను జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా సాగిన ఈ సర్వేలలో రీసెర్చి పరిశోధకులు, విస్తరణ అధికారులు, విద్యావేత్తలకు ప్రాతినిధ్యం వహించే సంస్థలు, అట్టడుగు స్థాయికి చెందిన చిన్న చిన్న సంస్థలు దాదాపు 5000 పాల్గొన్నాయి.

యాక్సెస్ అగ్రికల్చర్ సంస్థ ఆధ్వర్యంలో 2012 నుంచి జరుగుతున్న వీడియోల ఆధారిత రైతుల చైతన్య కార్యక్రమాల వల్ల 100 దేశాలలోని దాదాపు 9 కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరిందని నిర్ధారణ అయింది. వారంతా కూడా వీడియోల ద్వారా ప్రసారం చేసిన వ్యవసాయ సంబంధిత సమాచారం. పర్యావరణ అనుకూల సేద్య విధానాలు, గ్రామీణ స్థాయి పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి ఉపయోగపడినట్లు తేలింది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాలలో జీవనోపాధులు ఎన్నో రెట్లు మేరుగుపడ్డాయి. ఆయా ప్రాంతాలలోని పల్లె రైతుల కుటుంబాలకు ఆహార భద్రత విషయంలో భరోసా ఇచ్చాయి.

వీడియోల ప్రభావంపై 2021లో ఆన్ లైన్ మాధ్యమం ద్వారా విశ్వవ్యాప్తంగా వెలుగు చూసిన వాస్తవాలు అద్భుతంగా ఉన్నాయి. దాదాపు సగం మంది వెల్లడించిన అభిప్రాయం ప్రకారం వీడియోల ద్వారా అందిన పరిజ్ఞానాన్ని ఉపయోగించి అధిక దిగుబడులను, ఆదాయాన్ని సంపాదించినట్లు తెలుస్తోంది. చీడపీడల నియంత్రణ మెరుగైంది. భూసారం మెరుగయింది. అధిక దిగుబడులు సంపాదిస్తున్నారు. అని తెలిపారు మరో 40 శాతం మంది. ఇక 30 శాతానికి మించిన స్పందనల ప్రకారం – స్థానిక పరిజ్ఞానానికి మంచి గుర్తింపు వచ్చింది. యువత చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. పోషకాలతో కూడిన ఆహారం లభించడం ప్రారంభమైంది. అధిక లాభాలు లభించాయి. మహిళలకు సాధికారికత పెరిగింది. సంఘటిత శక్తికి ప్రోత్సాహం లభించిది – అని తెలుస్తోంది.

యాక్సెస్ అగ్రికల్చర్ నమూనా తక్కువ ఖర్చుతో అంశంగా మాత్రమే కాకుండా సుస్థిర ఫలితాలను అందించగలుగుతున్నట్లు కూడా నిర్ధారణ అయింది. అంతేకాక వాటి ప్రభావం కూడా చాలా స్పష్టంగా తెలిసింది. వీటిని గమనించిన తరువాత, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను సాధించింది. అంతేకాక, సస్టయినబుల్ ఫుడ్ సిస్టమ్స్ రంగంలో అంతర్జాతీయ ఆవిష్కరణల అవార్డును సాధించింది. ఇది స్విస్ ప్రభుత్వం ప్రదానం చేసింది. అలాగే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) నుంచి కూడా అవార్డు దక్కించుకుంది. ఈ రెండు అవార్డులు కూడా 2021లోనే ఇవ్వడం జరిగింది. 2022లో లభించిన ఆరెల్ గ్రోబల్ ఫుడ్ ఇన్నోవేషన్ అవార్డు సామాజికంగా ఈ కార్యక్రమం చూపిన ప్రభావానికి గుర్తింపుగా ఇచ్చారు.

రిఫరెన్స్

వాన్ మెలే పి, ఓక్రే ఎఫ్, వాన్ వోక్ జె, ఫోసెనీ బార్స్ ఎన్, మలోన్ పి, రోగర్స్ జె, రహ్మాన్ ఈ, సలాహుద్దీన్ ఏ, 2018 – సంయుక్తంగా ప్రచురించిన పుస్తకం – క్వాలిటీ ఫార్మర్ ట్రైనింగ్ వీడియోస్ టు సపోర్ట్ సౌత్-సౌత్ లర్నింగ్, సిఎస్ఐ ట్రాన్సెక్షన్స్ ఆన్ ఐసీటీ 6 – పేజీ 245 – 255


సావిత్రి మొహాపాత్ర
మాస్ మీడియా ఆఫీసర్
యాక్సెస్ అగ్రికల్చర్
నం. 3, కొమరం స్ట్రీట్, పుదుచ్చేరి 605001, ఇండియా
E-mail: savitri@accessagriculture.org

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...