విప్ప పూవులు – రైతుకు కాసులు – కోవిడ్ వేళ మరిన్ని విలువలతో …

విప్ప (మాహువా) పూలు, పండ్లు ఇటీవలి కాలంలో రైతులకు కాసులు కురిపిస్తోంది. సరైన ప్రణాళికతో, వాణిజ్య పరంగా సాగుచేస్తే గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయదారులకు లాభదాయకంగా ఉంటుంది. అయితే అందుకు సాగుచేసిన విప్ప పూలు, లేక పండ్లకు మరి కొన్ని అదనపు విలువలు సమకూర్చవలసి ఉంటుంది. ఇతర వీటి వినియోగాల గురించిన ఎంతో కొంత అవగాహన ఉన్న రైతులు ఇటీవలి కోవిడ్ ముప్పు సమయంలో వాటిని ఉపయోగించి శానిటైజర్స్ తయారు చేయవచ్చని గుర్తించారు, విప్ప సాగు కోవిడ్ వేళ వారి స్వయంసమృద్ధి సాధనకు ఎంతగానో తోడ్పడింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని టికమ్ గఢ్ జిల్లా దట్టమైన అడవులకు చేరువగా ఉంటుంది. కానీ, ప్రధాన రహదారుల  చేరువలోని భూముల ఆక్రమణలు, అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న పట్టణీకరణ పనులు అక్కడి జీవనచిత్రాన్ని సమూలంగా మార్చివేసింది. ఈ ప్రాంతంలో సాధారణ ప్రజల జీవనం, మనుగడ కూడా కొంతవరకు అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడినప్పటికీ క్రమంగా ఈ జీవన సౌందర్యం కనుమరుగవుతోంది. కారణంగా చాలా మంది గ్రామీణ ప్రజలు సంప్రదాయక ఉపాధులను విడిచిపెట్టి కొత్త కొత్త మార్గాలలో జీవనం  సాగించేందుకు ఆరాటపడుతుండడమే ఇందుకు కారణం. మళ్లీ మళ్లీ ముంచుకొస్తున్న కరువుకాటకాల వల్ల ఉపాధికి సమస్యగా మారడంతో చాలా మంది పెద్ద పెద్ద నగరాలకు వలసబాట పట్టక తప్పడం లేదు.

అటవీ సంస్కృతి పునరుద్ధరణ

జిల్లా మొత్తం ఎన్నో తరాలుగా అడవులతో నిండిఉంటోంది. ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే చెట్లు విరివిగా ఉండేవి. వాటిలో మహువా (విప్ప చెట్టు), పలాస్ (మోదుగ చెట్లు), టేకు చెట్లు, టెండు (బీడీ ఆకు) చెట్లు ముఖ్యమైనవి. వీటిలో విప్ప చెట్ల పెంపకం పల్లె సీమలలోని రైతులకు ఒక ఆదాయ మార్గం. దీని నుంచి ఆల్కహాల్ తయారుచేస్తారు. ఇక టెండు ఆకులతో బీడీలు తయారుచేస్తారు.

విప్ప పూల విషయంలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎల్. ఎం. బాల్ తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తంచేశారు. ‘నిజానికి ఇవి విరివిగా లభిస్తాయి. అయితే పూవులను లేదా పండలను సేకరించే పద్ధతిలో పరిశుభ్రత అనేది కనిపించదు. వాటిని ఎండబెట్టే తీరు సరైనది కాదు. వాటి నిల్వ చేసే విధానం శాస్త్రీయమైనది కాదు.’ అశాస్త్ర్రీయ పద్ధతిలో నిల్వ చేస్తున్న కారణంగా, వాచిలో సూక్ష్మజీవులు చేరిపోతున్నాయి. ఫలితంగా వాటిని ఆల్కహాల్ తయారీకి తప్ప మరెందుకు ఉపయోగించడానికి సాధ్యం కావడంలేదని ఆయన తెలిపారు. పశువుల మేతగా మాత్రమే ఉపయోగంలో ఉంటోందని చెప్పారు. ప్రాసెసింగ్ పద్ధతులు తెలియకపోవడంతో విప్ప పూలను అతి తక్కువ ధరలకే అమ్ముకోవలసిన పరిస్థితి వస్తోంది. ఈ సమస్యలకు పరిష్కారం  గుర్తించేందుకు టికమ్ గఢ్ జిల్లాలోని వ్యవసాయ కళాశాల ముందుకు వచ్చింది. దీనికి మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధీనంలోని బయో డైవర్సిటీ బోర్డు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ కళాశాల చేపట్టిన ఒక కార్యక్రమం విప్ప పండలను ఎండబెట్టే విధానాన్ని ప్రమాణీకరించి మేలైన మార్గాలను సూచించింది. ఎండబెట్టడానికి మైక్రోవేవ్ వినియోగం లేదా సూర్యరశ్మిలో ఎండబెట్టే విధానాలు ఉత్తమమని వరు సచిస్తున్నారు. అదే విధంగా నిల్వ చేసే విషయంలో కూడా కొన్ని ప్రమాణాల పరిధిలో డీహైడ్రేషన్ చేసే పద్ధతి ప్రతిపాదించింది.

విప్ప పూలను ఎండబెట్టడంలో ఉండాల్సిన ఉత్తమ లక్షణాలను, వాటిలో ఉండవలసిన తేమ స్థాయిని, వాటి రంగు ప్రమాణాలను ఈ కళాశాలలోని బయో కెమిస్ట్రీ లాబరెటరీలో చేపట్టిన అధ్యయనాలలో తుదిరూపు సంతరించుకున్నాయి. అదే విధంగా ఎండబెట్టే పద్ధతులను కూడా (మైక్రో వేవ్ లేదా సౌరశక్తి ఆధారంగా) ప్రతిపాదించింది.          అదే విధంగా ఎండబెట్టిన విప్ప పూల విషయంలో వాటి ఫిజియో-కెమికల్ (చూడడానికి, రసాయన పరమైన) లక్షణాలను పరిశీలించారు. వాటి ద్వారా ఎండబెట్టిన విప్ప పూలలో ఉండవలసిన తేమ స్థాయి, ఆకట్టుకునే స్థాయిలో రంగును, రీహైడ్రేషన్ రేషియో, ప్రోటీన్లు, ఇంకా వాటిలో ఉండవలసిన తియ్యదనం వంటివి ఖరారు చేశారు. విప్ప పూల సాయంతో స్థానికంగా అనేక రకాలైన తీపి పదార్ధాలను తయారుచేస్తారు. అలాంటి వాటిలో పుడ్డింగ్ (ఉడకబెట్టిన తినుబండారం), ఖీర్ (పాలతో తీపి ద్రావకం), పూరి, బర్ఫి వంటివి చేసుకోవచ్చు. ఎండబెటట్టిన విప్ప పూలతో ఎన్నో రకాలైన ఆహార పదార్థాలను కూడా తయారుచేసుకోవచ్చు. ఎండబెట్టిన విప్ప పూలు, వాటిని యథారూపంలోనూ, విప్ప పూల  బార్, ఇంకా అప్పటికప్పుడు తీసుకోదగిన ద్రవ రూపాలు, స్క్వాష్. జామ్, లడ్డూ, కేక్, టోఫీ వంటివి తయారు చేయవచ్చని గ్రామీణులకు వారి ెదుట ప్రదర్శింటి వివరించారు. లాబొరేటరీలో రెండు సార్లు డిస్టిల్ చేయడం ద్వారా ఆల్కహాల్ తయారీ విధానం కూడా వివరించారు. తులసీ ఆకులు, నిమ్మ గడ్డి, అలోవెరా వంటివి ఉపయోగించినట్లయితే విప్ప పూలకు ఉండే సహజమైన, ఇబ్బందికరమైన వాసన పోగొట్టవచ్చు.

కోవిడ్ 19 వేళ – పెరిగిన అవకాశాలు

కరోనా కోవిడ్ 19 పెను భూతం, దాని పర్యవసానంగా ముంచుకొచ్చిన లాక్ డౌన్ సమస్యలు కారణంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన జనమంతా స్వస్థలాలకు తిరిగి రాక తప్పలేదు. ఆదాయం వచ్చే మార్గాలు కనిపించక, స్వగ్రామం చేరుకున్నవాళ్ల జీవితాలు దుర్భరంగా మారాయి. ఉన్నవే చిన్న చిన్న కమతాలు, వాటిలో సేద్యపు పనులు చేసేందుకు యువతలో నెలకొన్న అయిష్టత, సాగు నీటితో సహా అన్ని వనరులు కొరతగా ఉండడంతో వారపరిస్థితి మరింత దారుణంగా మారింది.

అలాంటి సమయంలో కొంత మంది శాస్త్రవేత్తలు, టికమ్ గఢ్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఆ గ్రామం సందర్శించారు. దేశవ్యాప్తంగా నెలకొన్న కోవిడ్ భయానక వాతావరణంతో పాటు, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలన్న కనీస పరిజ్జ్ఞానం కూడా అక్కడి గ్రామీణుల్లో వారికి కనిపించలేదు. ఆసక్తి కనిపించలేదు. కానీ వాటన్నిటికన్నా చాలా ఎక్కువ రెట్లు నిరాశా నిస్పృహ, అసంతృప్తి మాత్రం చాలా స్పష్టంగా కనిపించాయి. అందరి సమస్యా ఆదాయ మార్గాలు లేకపోవడమే. అలాంటి క్లిష్ట సమయంలో కళాశాల వారికో జీవనోపాధి మార్గాన్ని సూచించింది. ఆ మార్గం ఏమిటంటే చుట్టూ ఇబ్బడిముబ్బడిగా లభించే విప్ప పూవులకు అదనపు విలువలు సమకూర్చడమే అది. పరిసరాలలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్న విప్ప చెట్లు చూసిన తరువాత వాటినే అక్కడి వారికి జీవనాధారం అని వివరించారు. అదే సమయంలో విప్ప పువ్వుల ఆధారంగా ఆల్కహాల్, దానితో చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్ తయారీ మార్గాలను వివరించి చెప్పారు. శానిటైజర్ తయారీ వల్ల వారికి కోవిడ్ భయం ఉండదని భరోసా ఇచ్చారు.

గ్రామస్తులను ప్రోత్సహించిన తరువాత అక్కడికక్కడ 300 క్వింటాళ్ల విప్ప పూలను సేకరించారు. దాదాపు 60 లీటర్ల విప్ప ఆధారిత శానిటైజర్ ను తయారుచేశారు. దానిని అక్కడి ప్రజలకే పంచిపెట్టారు. గ్రామీణ యువతకు వంద  మిల్లీ  లీటర్ల శానిటైజర్ ను సీసాల్లో అందించారు. తొలి దశలో విప్ప ఆధారిత వాణిజ్యం, దాని ప్రాచుర్యాలతో పాటు శానిటైజర్ పై దృష్టి కేంద్రీకరించారు. యువతకు తగిన శిక్షణ ఇచ్చారు. ఎండబెట్టిన విప్ప పూలను ఎక్కువ కాలం నిల్వచేయడంపై లాబొరెటరీ తోడ్పాటు అందించింది. ఆ రకంగా విప్ప పూలు కుళ్లిపోకుండా కాపాడగలిగారు. ఏడాది పొడవునా అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

సాధించిన ఫలితాలు

ఇప్పుడు ఆ గ్రామ ప్రజలకి శానిటైజర్ ప్రాధాన్యం అవగాహనకు వచ్చింది. అది ఆత్మరక్షక సాధనమన్న గుర్తింపు వచ్చింది. వారిలో విప్ప పూల వినియోగం గురించిన శ్రద్ధ మాత్రమే కాకుండా, మధుమేహం వ్యాధి సోకిన వారికి ఎంతో ఉపయోగపడే తిప్ప తీగ (గిలోయి), తులసి, ఇంకా నిమ్మ గడ్డి వంటివి పెంచడంపై వారిలో ఆసక్తి పెరుగుతోంది. ఇండ్లలోనే అందుబాటులో ఉన్న కొద్ది జాగాల్లో వాటి పెంపకం చేపడుతున్నారు. కర్మారాయ్ గ్రామానికి చెందిన అజయ్ యాదవ్ ఈ ప్రాజెక్టులో స్వచ్ఛందంగా కార్యకర్తగా పనిచేస్తున్నారు. అక్కడి ప్రజలకి విప్ప పూలతో తయారు చేసిన బర్ఫీ అన్నా, కాండీస్ అన్నా చాలా ఇష్టంగా తీసుకుంటారని ఆయన చెప్పారు. పెద్ద పట్టణాల నుంచి తిరిగి వచ్చిన యువత విప్ప పూలు, పండ్ల సేకరణపై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో వాటికి మరిన్ని విలువలను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారు.  ఇప్పుడు కోవిడ్ బెడద పరిష్కారమైనా సరే తిరిగి పెద్ద పట్టణాలకి వలస పోవాలన్న ఆలోచనే లేదని దయారామ్ అహిర్వార్ అనే యువకుడు స్పష్టం చేశాడు. అదనపు విలువల చేర్పు కారణంగా మంచి రాబడి ఉంటోందని ఆయన తెలిపారు. స్వయం సమృద్ధి సాధించగలుగుతున్నామని ఆయన చెప్పారు. ఆదాయం సంతృప్తికరంగా ఉండడంతో వలస జీవులు తిరిగి స్వగ్రామం చేరుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

యోగ్ రంజన్
సైంటిస్టు (బయో టెక్నాలజీ)
E-mail: yogranjan@gmail.com

దినేశ్ కుమార్
సైంటిస్టు, (పశు పోషణ నిపుణుడు)
E-mail: kr.dinesh7@gmail.com

వ్యవసాయ కళాశాల, టికమ్ గఢ్
మధ్యప్రదేశ్ - 472001, ఇండియా

ఆయుషీ సోనీ
రీసెర్చి స్కాలర్
E-mail: ayushisoni2351997@gmail.com
వ్యవసాయ కళాశాల, గ్వాలియర్
మధ్యప్రదేశ్ - 474011, ఇండియా

 

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...