విత్తన ఉత్సవాలు – విత్తన భద్రతకు ఊతం

తరతరాలుగా వస్తున్న విత్తన సంపత్తిని సురక్షితంగా కాపాడుకోవాలనే ఆలోచన దక్షిణ భారత దేశంలో చాలా బలంగా వ్యాపిస్తోంది. రైతుల్లో సంప్రదాయక వరి వంగడాలను కాపాడుకోవాలనే కోరిక బలపడుతోంది. ఇందుకు ఏడాదికి ఒకసారి నిర్వహించే నిర్వహించే ఉత్సవాలు వేదికలుగా మారుతున్నాయి. ఇందుకు సేవ్ అవర్ రైస్ (మన వరి వంగడాన్ని కాపాడుకుందాం) పేరుతో ప్రారంభమైన కార్యక్రమం ఒక ఉద్యమంలా రైతన్నలను ఆకట్టుకుంటోది. వరి సాగులో జీవవైవిధ్యానికి చోటు కల్పిస్తోంది. సామాన్య ప్రజల నోటికి తుష్టిని, పుష్టిని అందించగల వరి అన్నం అందిస్తోంది. వాతావరన అనుకూల వరి వంగడాల అభివృద్ధిని (జెర్మ్ ప్లాజమ్) ప్రోత్సహిస్తోంది.

తమిళనాడు రాష్ట్రంలోని వ్యవసాయదారులకు మే 25, 2013 మరపురాని రోజు. వరి సాగులో జీవవైవిధ్యం గురించిన సమగ్రమైన అవగాహన వారిలో పెంపొందించిన ఘడియలు అవి. రాష్ట్రంలోని  32 జిల్లాల నుంచి సుమారు 3000 మంది రైతు సోదరులు ఈ వేడుకల్లో అత్యుత్సాహంగా పాల్గొన్నారు. వాళ్లంతా వరి సాగు చేసే సాధారన రైతన్నలే. రెండు రోజుల కార్యక్రమం వారిలో అపూర్వమైన ఉత్సాహాన్ని నింపింది. కొత్త సమాచారం తెలుసుకున్నారు. ఒకరి అనుభవాలను, విధానాలను మరొకరు తెలుసుకున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన 61 రకాల సంప్రదాయక వరి వంగడాలను వారికి అక్కడ పరిచయం చేయడం జరిగింది. వాటి విశిష్టతలను, ప్రత్యేకతలను తెలుసుకున్న తరువాత వాళ్లంతా ఎంతో ఆసక్తి చూపించారు. వాటిని తమ పంట పొలాల్లో సాగు చేసేందుకు తమ వెంట తీసుకెళ్లేందుకు ముందుకు వచ్చారు. విత్తనాలను సేంద్రీయ వ్యవసాయ పద్ధతులలోనే ఉత్పత్తి చేసేందుకు వారంతా ఏకాభిప్రాయం వ్యక్తంచేసారు. ఒక విధంగా ఈ విషయంలో వాళ్లంతా శపథం చేసారు. దీక్ష చేపట్టారు. అలా సేంద్రీయ పద్ధతిలోనే సాగుచేసిన వంగడాల విషయంలో వారికి ఎలాంటి అనుమానాలు కలగలేదు. ఆ విత్తనాలు తమకు అన్ని విధాలా ప్రయోజనం కలిగిస్తాయనే గట్టి నమ్మకంతో వాళ్లంతా తమ వెంట తీసుకెళ్లేందుకు సిద్ధపడ్డారు. మరుసటి సంవత్సరంలో జరిగే ఉత్సవాల సమయానికి రెట్టింపు విత్తన సంపదను సిద్ధం చేయాలని తీర్మానించుకున్నారు.

విత్తన ఉత్సవాలు – ఆవిర్భావం

తమిళనాడులోని రైతు సోదరులకు అపూర్వమైన ప్రయోజనాలను చేకూర్చి పెట్టే ఈ వార్షిక ఉత్సవాలు 2006లో ప్రారంభమయ్యాయి. మన వరి వంగడాలను కాపాడుకుందాం (సేవ్ అవర్ రైస్ – ఎస్ఓఆర్) ప్రచారం ఒక ఉద్యమంలా మన దేశంలో ప్రారంభమై అప్పటికి రెండేళ్ళు అయింది.

తమిళనాడులో ఈ కార్యక్రమాన్ని క్రియేట్ అనే స్వచ్ఛంద సంస్థ  నిర్వహిస్తోంది. విత్తన సంరక్షణ కోసం కృషి చేస్తోంది. ఈ సంస్థ కార్యకలాపాలను తమిళనాడు విభాగం సారధి శ్రీ జయరామన్ పర్యవేక్షిస్తుంటారు. క్రియేట్ బృందం తొలి దశలో కేవలం సంప్రదాయకమైన/ స్థానికంగా వాడుకలో ఉన్న దేశీయ వరి వంగడాలను సేకరించడంపైనే దృష్టి కేంద్రీకరించింది. వివిధ ప్రాంతాలలో ఉపయోగంలో ఉన్న వంగడాలను ఆ విధంగా సేకరించి ఆదిరంగంలోని తమ శిక్షణ కేంద్రంలో పండించి, వాటి ఫలితాలను అధ్యయనం చేసేందుకు ప్రయోగాలు చేపట్టింది. ఆరంభంలో రాష్ట్రంలో విస్తృతంగా వాడుకలో ఉన సుప్రసిద్ధ జీరక సాంబా విత్తనాలతో సహా మూడు రకాల విత్తులను మాత్రమే క్రియేట్ పరిశోధనలకు తీసుకుంది. అప్పటికి ఈ సంస్థకు విత్తనాలను శుద్ధి చేసే ప్రక్రియ కానీ, వాటిని ఎంపిక చేసుకునే విధానాలు కాని తెలియవు. అప్పటికి వారి ఆశయం విత్తనాలను పెద్ద ఎత్తున సాగుచేయడం, వాటిని కాపాడడం వరకే పరిమితంగా ఉండేది.

వరి సాగు చేసే రైతన్నలందరినీ ఒక చోట చేర్చడం చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ఆలోచన వారికి 2006లో కలిగింది. దానిని ఒక వేడుకగా జరిపితే ఇంకా బాగుంటుందని వారు ఆలోచించారు. ఆ ఆలోచన ఫలితమే వరి రైతన్నల ఉత్సవం (తమిళంలో నెల్ తిరువిజా అంటారు). ఏటా మే నెలలో నిర్వహించాలన్న ఆలోచనతో మొట్టమొదటి సారి 2006లో జరిగిన ఉత్సవాల్లో 425 మంది రైతులు పాల్గొన్నారు. వాళ్లు 16 రకాల సంప్రదాయక వరి వంగడాల సాగు వైపు ఆసక్తి చూపించారు. ఒకొక్కరికి 2 కిలోల వరి విత్తులను పంపిణీ చేసారు.

“ఈ విత్తన వేడుకలు ముందుగా చాలా కాలంగా రూపొందించుకున్న ప్రతిపాదన కాదు. ఒక ప్రణాళిక ప్రకారం ఆలోచించినదీ కాదు. కేవలం ఎస్ఓఆర్ బృందం మనసులో వచ్చిన ఒక చిన్న ఆలోచన అందుకు కారణం. సంప్రదాయక వరి సాగు కృషిలో స్థానికంగా ఆయా గ్రామాలు రైతులను, చుట్టుపక్కల ఉన్న గ్రామీణ వ్యవసాయదారులను కూడా భాగస్వాములను చేస్తే ఎలా ఉంటుందనేదే ఆ ఆలోచన. దాన్ని ఆచరణలోకి తెచ్చే ప్రయత్నంలోనే వరి సేద్యగాళ్లతో సమావేశం ఏర్పాటు చేయాలనే సంకల్పానికి దారి తీసింది. కేవలం సమావేశంలా ఉంటే ఫలితం ఉండదు, కనుక, దానిని ఓ మోస్తరు ఉత్సవాలుగా నిర్వహించాలనే ప్రతిపాదన రూపుదిద్దుకుంది. అలాంటి ఆలోచన ఒక్కసారి ఆచరణలోకి వచ్చిన తరువాత ఇక వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. ఏడాదికేడాది రైతన్నల ఉత్సాహం, ఆసక్తి పెరిగిపోతూ వచ్చింది. ఉత్సవాలు అద్భుత ఫలితాలకు వేదికగా మారిపోయాయి. ” అని వివరించారు క్రియేట్ సంస్థ ట్రస్టీ శ్రీ పొన్నంబళం. తమిళనాడు రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయానికి పితామహుడుగా గుర్తింపు పొందిన కీర్తిశేషులు డాక్టర్ నమ్మళ్వార్ ప్రతీ ఏడాది ఎప్పుడు ఎక్కడ ఈ ఉత్సవాలు నిర్వహించినా స్వయంగా వాటికి వచ్చి రైతు సోదరులకు మన సంప్రదాయక వరి వంగడాలను కాపాడుకోవలసిన అవసరం గురించి వివరించేవారు. ఆయన కృషి కారణంగానే ఇది ఒక మహా ఉద్యమంగా గ్రామగ్రామానికి విస్తరించింది అని చెప్పారు పొన్నంబళం. విత్తన ఉత్సవాలు, విత్తన సంరక్షణ, సేంద్రీయ సాగు విధానం గురించి అనేక మంది నుంచి అందిన సహాయ సహకారాలతో శ్రీ జయరామన్ రాష్ట్రమంతటా వ్యాప్తి చేయగలిగారు.

విత్తన ఉత్సవాలకు రాష్ట్రంలోని మీడియా నుంచి అందిన మద్దతు ఎంతో ఉపయోగపడింది. అరువదం కురవాయి అంటే కేవలం 60 రోజులలోనే పంట చేతికి అందించే వరి వంగడం గురించిన సమాచారాన్ని అక్కడి పత్రికలు విస్తృతంగా ప్రచారం చేసాయి. విత్తన ఉత్సవాల సమయంలో ఒక రైతన్న ఈ విత్తనాలను ఎస్ఓఆర్ బృందానికి అందించారు. ఇది విపరీతంగా రైతన్నలను ఆకట్టుకుంది. ముఖ్యంగా తమిళనాడు వ్యవసాయ ప్రాధాన్యత కల అంశాలతో వెలువడే పసుమై వికటన్ ప్రతిక ఈ విషయాన్ని కవర్ స్టోరీ చేయడంతో విస్తృత ప్రచారం లభించింది. ఈ మేగజైన్ కృషి కారణంగా, సంప్రదాయక వరి వంగడాలను ప్రోత్సహించవలసిన అవసరాన్ని, వాటి ఉపయోగాలను రైతన్నలకు అర్థమైంది. తిరిగి దేశీయంగా తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న వరి వంగడాలను ఆశ్రయించడంలో రైతన్నల మనసులలో మారుప తీసుకురావడం సాధ్యమైంది. ఫలితంగా, ఈ రోజున దాదాపు 2 వేల నుంచి 3 వేల మంది అన్నదాతలు అరువదం కురువై విత్తనాలను ఆధారం చేసుకునే వరి సాగు చేస్తున్నారు. ఇదే విధంగా, కట్టుయానం. మప్పిలై చెంబ వంగడాలు కూడా విస్తృత ప్రచారం కారణంగా రైతన్నల చేలను సస్యశ్యామలం చేస్తున్నాయి.

విత్తన వైవిధ్యం – నిరంతర కృషి

సంప్రదాయక వంగడాలను నిత్య నూతనంగా అభివృద్ధి చేయడానికి, వాటిని పరిరక్షించడానికి నిరంతర కృషి అవసరం. అందుకు విత్తన ఉత్సవాలు ఒక వేదికగా నిలుస్తున్నాయి. ఈ వేదికల మధ్య వ్యవసాయదారులు వైవిధ్యంతో కూడిన  వంగడాలను పరస్పరం అందించుకునేందుకు, మరిన్ని మేలైన రకాలను అభివృద్ధి చేసేందుకు స్ఫూర్తినిస్తున్నాయి. ప్రారంభంలో కొద్ది మంది రైతులు మాత్రమే ఈ విత్తన వేదికలపై లభించిన విత్తులను తమ గ్రామాలకు తీసుకెళ్లి తమ పఁట పొలాల్లో సాగు చేసారు. కానీ, ఇప్పుడు, అలా తీసుకెళ్లి సాగు చేసే రైతన్నల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలా ఈ విత్తన ఉత్సవాల్లో పాల్గొని విత్తనాలను ఎంపిక చేసుకుని తీసుకెళ్లే రైతుల సంఖ్య ఏటా పెరిగిపోతోంది.

ఇప్పటివరకు రైతులకు అందుబాటులో ఉంచిన 61 రకాల వంగడాల్లో కొన్ని ఎక్కువ రైతుల అభిమానాన్ని సంపాదించుకుంటున్నాయి. ఎస్ఓఆర్ పరిశీలన ప్రకారం, వాటిలో 19 రకాలు ఎక్కువ ఆదరణ నోచుకుంటున్నాయి. వాటిలో మప్పిలై సాంబ, జీరక సాంబ, కట్టుయానం, కట్టు పొన్ని, అరువదం కురువై వంటివి ముఖ్యమైనవి. రైతుల నుంచి వాళ్లు పండించిన సంప్రదాయక విత్తనాల నుంచి వచ్చిన దిగుబటి విషయంలో పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా, వాతావరణం అనుకూలంగా లేని సమయంలో కూడా వారికి మంచి పంటనే చేతికి అందించాయి.

కొన్ని సందర్భాలలో, విత్తనాల దిగుబడిని అధికం చేసేందుకు ఎస్ఓఆర్ చాలా కష్టపడవలసి వచ్చింది. ఉదాహరణకు, గడచిన రెండేళ్ల కాలంలో తమిళనాడులోని కావేరీ పరీవాహక ప్రాంతాల్లో కరువు తీవ్రంగా ఏర్పడింది. విత్తన ఉత్సవాల వేళకు తగినన్ని విత్తన సంపదను సిద్ధం చేసేందుకు భూములను లీజు పద్ధతిపై అదెదకు తీసుకోవలసిన పరిస్థితి ఎదురైంది.

2006 నాటికి విత్తన ఉత్సవాల్లో పాల్గొనే వారి సంఖ్య కేవలం 400 మంది రైతన్నలు మాత్రమే. ఇప్పుడు ఆ సంఖ్య 3000 దాటిపోయింది.

టేబుల్ నెం. 1 విత్తన ఉత్సవాల సందర్భాలలో వంగడాలను స్వీకరించిన రైతన్నల సంఖ్య.

సంవత్సరం  వంగడాల సంఖ్య         రైతన్నల సంఖ్య
2005-06                                    16  425
2006-07                                  26  1176
2007-08                                     28  1629
2008-09                                    47  2016
2009-10                                      51  2320
2010-11                                     53  2860
2011-12
(నవంబర్, 2011) 
 61   2900 +
2013                                                              63  3000 +
     

 సేకరణ : పాడీ, జూలై 2013

పెరుగుతున్న ఆదరణ                     

విత్తన ఉత్సవాలు రైతన్నలను చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. 2013లో నిర్వహించిన ఉత్సవాలకు తమిళనాడుకు దక్షిణ దిశగా ఒక చివర ఉన్న కన్యాకుమారి జిల్లా నుంచి మరో కొసన ఉత్తరాన ఉన్న తిరువళ్లూరు జిల్లాల నుంచి రైతన్నలు ఎంతో ఉత్సాహంతో వచ్చి పాల్గొన్నారు. 2006లో కేవలం 400 మంది మాత్రమే ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. ఆ సంఖ్య 2013 నాటికి 3000 దాటిపోయింది.

 ఇలా వ్యవసాయదారుల్లో ఆదరన పెరిగిపోవడంతో పాటు ఇతర రంగాలకు చెందిన సంస్థలు, వ్యక్తులు కూడా ఎంతో ఆసక్తి చూపించడం ఎక్కువయింది. కొండంత అండగా నిలుస్తూ వచ్చారు. రెండు రోజుల పాటు నిర్వహించే వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు వాళ్లే కాక ఎంతో మంది ప్రముఖులు కూడా ఉత్సాహం చూపిస్తూ వచ్చారు. చాలా సంవత్సరాలుగా నాబార్డ్ వంటి ఆర్థిక సంస్థలు, ఇంకా వాణిజ్య బ్యాంకులు ఈ రెండు రోజుల వేడుకలకు తమ మద్దతు అందిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆసక్తి చూపిస్తోంది. గత ఏడాది వ్యవసాయ శాఖ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని రైతన్నలకు ఆహ్వాన పత్రికలను అందజేసే బాధ్యతను స్వీకరించింది. ఫలితంగా దక్షిణాన కన్యాకుమారి నుంచి ఉత్తరాన తిరువళ్లూరు వరకు రైతన్నలు వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు.

 ఈ ఉత్సవాలను నిర్వహించడంలో రైతన్నలు నిర్వహించిన పాత్ర కూడా ఏ మాత్రం తక్కువ చేసి చూపడానికి లేదు. ఆరంభంలో రైతన్నలు నిర్వహణ ఖర్చుల భారం స్వీకరించలేదు. కాని మెల్లిగా వాళ్లు ప్రవేశ రుసుము చెల్లించేందుకు ముందుకు వచ్చారు. ఆరంభంలో కేవలం రు. 10 లు ఉన్న ప్రవేశ రుసుము క్రమంగా రు. 50కి తరువాత గత ఏడాది రు. 100 కి చేరింది. అయినా వారిలో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఈ విత్తన ఉత్సవాలకు రైతన్నల్లో ఎంత గిరాకీ ఉన్నదంటే

మన వరి వంగడాన్ని కాపాడుకుందాం – ఉద్యమం

మన వరి వండగాన్ని కాపాడుకుందాం ఉద్యమం రూపంలో మన దేశంలో కేరళలోని థానాల్ లో ప్రారంభమైంది. తమిళనాడులో దీనిని క్రియేట్ సంస్థ చేపట్టింది. ఒడిశాలో లివింగ్ ఫార్మ్స్ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఆ తరువాత ఇది పశ్చిమ బెంగాల్ లో 2009 నాటికి విస్తరించింది. ఈ ఉద్యమం అయిదు ప్రధానమైన ఆశయాలతో ప్రారంభమైంది. 1. వరి అనుకూల పర్యావరణ వ్యవస్థలను కాపాడడం 2. వరి సాగు సంప్రదాయం, వైవిధ్యం పరిరక్షించడం 3. సంప్రదాయక విజ్ఞానాన్ని సంరక్షించడం 4. జిఎంఓలను, టాక్సిక్ లను నిరోధించడం 5. ప్రజలకు సురక్షితమైన, పోషకాహారం అందించడం. వివిధ రాష్ట్రాలలో ఆయా సంస్థలు నిర్విరామంగా కృషిచేస్తున్నాయి.

ఆదిరంగంలో జరిగే ప్రధానమైన ఉత్సవాలకు హాజరుకాలేని రైతన్నల కోసం ఎక్కడికక్కడ జిల్లాల్లో కూడా చిన్న స్థాయిలో విత్తన ఉత్సవాలు నిర్వహిస్తూ వచ్చారు.

ఇలా జిల్లాల స్థాయిలో జరిగే ఉత్సవాలకు అదనంగా వేలాది మంది రైతన్నలు  సేంద్రీయ వరి సాగు పనుల్లో పరోక్షంగా చురుగ్గా పాల్గొంటున్నారు. వారికి కావలసిన విత్తనాలను ఉత్తవాల్లో పాల్గొంటున్న రైతన్నలు వారికి సమకూరుస్తున్నారు. అంటే తమ వాటాతో పాటు ఉత్సవాల్లో పాల్గొనే రైతన్నలు తమ గ్రామాలలోని ఇతరుల కోసం కూడా విత్తనాలను సేకరించి వెంట తీసుకెళ్లి వాళ్లకి కూడా అందిస్తున్నారు. ఒక రకంగా దర ప్రాంతాల నుంచి వచ్చే రైతన్నలు మరెందరికో ప్రతినిధులుగా వస్తున్నారన్న మాట.

సాధించిన ఫలితాలు

సేంద్రీయ పద్ధతుల్లో సంప్రదాయక వరి సాగు చేస్తున్న రైతులకు ఆర్థికంగా కూడా ప్రయోజనాలు లభిస్తున్నాయి. “సాధారణ వ్యవసాయ పద్ధతిలో రైతులు దాదాపు రు. 15000 నుంచి రు. 20000 వరకు వివిధ అవసరాలకు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఫలితంగా వారికి 32 బ్యాగుల వరి ధాన్యం పండుతుంది. (ఒక్కో బ్యాగులో 60 కిలోల వరి ఉంటుంది) అంటే సగటున వారు రు. 5000 ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా కేవలం 24 కిలోల ధాన్యం పండిస్తున్నారు. అది కాక వారు పండించిన ధాన్యానికి బహిరంగ మార్కెట్లో ఒక బ్యాగుకు రు. 1200 సంపాదించిపెడుతుంది. అదే సాధారణ వరి ధాన్యం అమ్మితే వారికి లభించేది కేవలం రు. 800 మాత్రమే. ” అని వివరించారు శ్రీ జయరామన్. అయితే బాధాకరమైన వాస్తవం ఏమిటంటే, ఇలా పండించిన సంప్రదాయక ధాన్యం సేకరణకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. కేవలం అధిక దిగుబడినిచ్చే, లేదా, హైబ్రీడ్ ధాన్యం మాత్రమే ప్రభుత్వం సేకరించేందుకు ఆసక్తి చూపిస్తోంది.

చాలా కుటుంబాలు, ముఖ్యంగా చిన్న రైతులు, సంప్రదాయక ఎర్ర బియ్యం శుద్ధి చేయడం, దానిని విక్రయించడంపైనే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటాయి. తమిళనాటులోని వివిధ వర్గాల ప్రజలు ఇప్పుడు సంప్రదాయక ఎర్ర అన్నం గురించే మాట్లాడుకుంటున్నారు. దాని వల్ల కలిగే ప్రయోజనాలను అవగాహన చేసుకోగలుగుతున్నారు. తాజా పరిస్థితి ఏమిటంటే చాలా పట్టణాల్లో, ఓ మోస్తరు నగరాల్లో కూడా సూపర్ మార్కెట్లలో ఈ సంప్రదాయకమైన ఎర్ర ధాన్యం  ప్యాకెట్లు లభిస్తున్నాయి. ఇది అపూర్వమైన మార్పు. ఒకప్పుడు తెల్ల బియ్యం తప్ప మార్కెట్లో మరే రకం కనిపించేది కాదు. మరో ఆసక్తికరమైన మార్పు ఏమిటంటే విత్తన ఉత్సవాల్లో సేకరించిన వంగడాల సాయంతో సాగు చేసి ధాన్యం పండిస్తున్న రైతుల కుటుంబాలు వారి ఇండ్లలో నిత్యవాడకానికి ఈ ఎర్ర బియ్యాన్నే ఉపయోగిస్తున్నారు. కొంత ధాన్యాన్ని ప్రత్యేక అవసరాలకోసం అంటే పెండ్లిండ్లు, పండుగలు, పబ్బాలకు కూడా దాచిపెట్టుకుంటున్నారు. ఇదివరకటి రోజుల్లో ఈ రైతన్నల కుటుంబాలు తాము పండించిన ధాన్యం అమ్మివేసుకుని, తమ ఇండ్లలో అవసరాలకు తెల్ల బియ్యం మార్కెట్ నుంచి కొని తెచ్చుకునేవారు.

సేవ్ అవర్ రైస్ ఉద్యమ జాతీయ కో-ఆర్డినేటర్ ఉష అభిప్రాయం ప్రకారం … “సంప్రదాయక వరి సాగుకు రైతన్నలు చూపిస్తున్న ఆసక్తి మాకు చాలా ప్రోత్సాహం ఇస్తోంది. వారి ఉత్సాహం చూస్తే సంప్రదాయక వ్యవసాయ జీవ వైవిధ్యానికి వారు ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టమవుతుంది. వారికి తగిన అవకాశాలు అందిస్తే వారు వాటిని అనుసరించేందుకు సిద్ధంగా ఉన్నారనే వాస్తవం మనకు తెలుస్తుంది. వారి అనుభవాలు తెలుసుకున్నపుడు ఈ రకమైన వంగడాలకు మంచి భవిష్యత్తు ఉన్నదని మనం గుర్తించవచ్చు. మంచి దిగుబడి, పోషకాల సమృద్ధి, వాతావరణ తేడాలను తట్టుకోగల వంగడాలను సంరక్షించడం సాధ్యమేనన్న నమ్మకం పెరుగుతోంది. ”

సంప్రదాయక విత్తన ఉత్సవాలు చాలా కీలకమైన లక్ష్యాన్ని సాధించగలిగింది. అదేమిటంటే సంప్రదాయక వరి వంగడాలను రైతుల్లో ప్రవేశపెట్టగలిగింది. అలాంటి విత్తులను సంరక్షించడంపై వారిలో శ్రద్ధ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పెంపొందించగలిగింది. ఇప్పుడు సంప్రదాయక సాగు పద్దతుల్లో వరి సాగుపై రైతన్నలు ఆసక్తి చూపిస్తున్నారు. విత్తనాలను కాపాడేందుకు వారు ముందుకు వస్తున్నారు. వరి సేద్యంలో వ్యవసాయ జీవ వైవిధ్యం కాపాడడంతో పాటు ఆరోగ్యదాయకమైన ఎర్ర బియ్యం ఆహారంలో భాగంగా చేర్చడం సాధ్యమవుతోంది. చిట్టచివరిగా వాతావరణ తేడాలను నిలదొక్కుకోగలిగిన వరి వంగడాలు సిద్ధం చేసుకోవడం సాధ్యమవుతోంది.

శ్రీదేవి లక్ష్మీ కుట్టి సేవ్ అవర్ రైస్ ఉద్యమ సలహాదారుగా పనిచేస్తున్నారు. సురక్షితమైన ఆహారం, సుస్థిరమైన వ్యవసాయ విధానం వంటి అంశాలపై వ్యాసాలు రాస్తూ ఉంటారు. ఆమెను slakshmikutty@rocketmail.com  లో సంప్రదించవచ్చు.

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి 16, సంచిక 1, మార్చ్ ౨౦౧౪

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...