వాడీ – మరిన్ని జీవనోపాధులు, పోషకాలు, పర్యావరణ అనుకూలతలు

వ్యవసాయం – తోటల పెంపకం – అడవుల పెంపకం అన్న మూడు అంశాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ బెయిఫ్ (భారతీయ అగ్రో-ఇండస్ట్రీస్ ఫౌండేషన్) సంస్థ చేపట్టిన గ్రామీణాభివృద్ధి పథకం పేరు వాడీ గా పేరుపొందింది. ఈ విధానంలో వ్యవసాయంలో అంతర్భాగంగా తోటల పెంపకాన్ని కూడా జతచేసి రైతులను ప్రోత్సహిస్తుంది. సుస్థిరమైన జీవనోపాధులు లభిస్తాయి. అందుకు వాతావరణ అనుకూల స్మార్ట్ విధానాలను రూపొందించారు. భూ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించడం ఒక అంశం. అదే సమయంలో స్థానికంగా లభించే వివిధ వనరుల సద్వినియోగాన్ని ప్రోత్సహించడం మరో అంశం. ఈ మోడల్ లో తోటల పెంపకం చాలా కీలకమైన అంశం. ఫలితంగా ఏడాది పొడవునా, ఆదాయం లభిస్తుంది. ముఖ్యంగా, ఆదాయం కొరత సమయంలో కొద్ది  కాలం పాటు – అధిక ఫలితం, స్వల్ప వ్యవధిలో – ఎక్కువ రాబడినిస్తుంది.

వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు మన దేశంలో అత్యధిక సంఖ్యాకులకు ప్రధాన జీవనాధారం. దాదాపు గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారిలో 70 శాతం మంది వ్యవసాయం ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. వారిలో 82 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినప్పటికీ, ప్రపంచంలో ఆకలి మంటలతో బాధ పడే వారిలో నాలుగో వంచు ఇండియాలోనే ఉన్నారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య మన దేశంలో ఏకంగా 19 కోట్ల మంది ఉన్నారు. (ప్రపంచ ఆహార సంస్థ – ఎఫ్ఏఓ నివేదిక) దేశంలోని గిరిజన తెగలు అత్యంత పేదరికంలోనే మగ్గుతున్నారు. సమాజంలో అట్టడుగున బతుకులీడుస్తున్నారు. 2018 నాటి సమాచారం ప్రకారం, మన దేశంలోని గిరిజన తెగల వారు అత్యంత పేదరికంలో జీవిస్తున్నట్లు తెలియజేస్తోంది.

ఇక మన దేశంలోని వ్యవసాయదారుల్లో చాలా మంది చిన్న చిన్న కమతాలే ఉన్న చిన్న, సన్నకారు రైతులే. వారు పూర్తిగా వర్షాధారంగానే సాగు పనులు చేసుకుంటారు. ఫలితంగా వారికి వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. అందువల్ల వారికి మరెన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిలో ముఖ్యమైనవి, సంప్రదాయక వనరుల క్షీణత, శారీరిక అనారోగ్యం, వివధ వర్గాల నుంచి అందే సేవలు పరిమితంగా ఉండడం అనేవి వారిని వేధిస్తున్నాయి. ఈ కారణాల వల్ల వారు జీవనోపాధుల కోసం వలసబాట పట్టక తప్పని పరిస్థితి. నిత్యం పేదరికంలోనే మగ్గిపోతూ ఉండడం వల్ల వారి కుటుంబంలోని వారి ఆరోగ్యంకూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. పిల్లల చదువు అవసరాలు మరో కారణం. వీటన్నిటి వల్ల వారికి వలస పోవడం తప్ప మరో బతుకుతెరువు ఉండడం లేదు. ఈ వాస్తవాల నేపథ్యంలోనే సుస్థిరమైన జీవనోపాధితో పాటు అందుబాటులో ఉన్న సహజ వనరులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. అందుకు వీలైన  పంటల సాగు విధానాలను వారికి అందించడం తక్షణ అవసరంగా మారింది. తోటల పెంపకం, అవి కాయగూరలైనా, పండ్లు, పూవులు వంటివి అయినా ఆ ఫలితాన్ని అందించదలవని గుర్తించాలి. ఇప్పుడు బెయిఫ్ ఆద్వర్యంలో వాడీ ప్రోగ్రామ్ రూపుదిద్దుకుంది. పండ్ల చెట్లతో పాటు ఇతర రూపాలలో తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. అదే సమయంలో వ్యవసాయంలో అంతర్భాగంగా అడవుల పెంపకాన్ని కూడా జతచేసింది. ప్రస్తుత వ్యాసం – ఒక గిరిజన కుటుంబం నిరుపేద స్థాయి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలిగిందో వివరిస్తున్నది. వాడీ ప్రోగ్రామ్ ప్రయోజనాన్ని అధ్యయనంచేసేందుకు కూడా ఈ ఉదంతం తోడ్పడుతుంది. ఈ కార్యక్రమం చేపట్టిన కుటుంబాలకు జీవనోపాధులు మెరుగయ్యాయి. పోషక ఆహారం లభించింది. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ఈ మార్గంలో ముందుకు సాగిన 2 లక్షల కుటుంబాలు దేశవ్యాప్తంగా ఉన్నారు.

గుజరాత్ దక్షణ ప్రాంతం వల్సాడ్ జిల్లా కార్పడా బ్లాక్ లోని మారుమూల గ్రామంలో గిరిజనుడైన శ్రీ సీతారామ్ సోంజీ ఘట్కా నివసిస్తున్నాడు. ఆతని కుటుంబంలో ఆరుగురు సభ్యులున్నారు. వారికి ఉన్నది నాలుగు ఎకరాల మైదాన భూమి. అందులో సగం ఏటవాలుగా ఉంటుంది. ఏ మాత్రం భూ సారం లేనిది. వారి జీవనాధారం వ్యవసాయం మాత్రమే. అందులో వరి, రాగులు (ఫింగర్ మిల్లెట్స్) మినుములు సాగుచేస్తుంటారు. వర్షాకాలం మాత్రమే వారి భూముల్లో సాగు సాధ్యమవుతుంది. ఖరీఫ్ పంట చేతికి వచ్చిన తరువాత, ఆయనకు గ్రామంలో మరో జీవనోపాధి లభించదు. అందుకని మరో చోటికి కూలిగా పనిచేసేందుకు వలస వెళుతుంటాడు. సమీపంలోని వాపి, సిల్వాసా, నాసిక్ ప్రాంతాలకు మూడు నాలుగు సార్లు వెళ్లి వస్తుంటాడు. వెళ్లిన ప్రతీ సారి 15 నుంచి 20 రోజులు కూలీ పనులు చేసి తిరిగి వచ్చేస్తాడు. ఆ సమయంలో భూమిని అలాగే వదిలేయడం వల్ల అది నిస్సారంగా మారిపోతోంది. కొన్ని సందర్భాలలో కుటుంబం మొత్తం వలసపోతుంది. ఈ కారణంగా వారి ఆరోగ్యం దెబ్బతింటున్నది. పోషక విలువల కొరత ఏర్పడుతోంది. వారి పిల్లల చదువులు కూడా సజావుగా సాగేవి కావు. ఏది ఏమైనా రోజులు గడిపేందుకు మాత్రమే వలస జీవనం ఉపయోగపడుతోంది. ఈ ప్రాంతంలోని చాలా కుటుంబాల పరిస్థితి ఇదే విధంగా చాలా ఆందోళనకరంగా ఉంటుంది.

ఈ పరిస్థితులలో బెయిఫ్ ఈ ప్రాంతంలో వాడీ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టింది. తొలి దశలో నాబార్డు, సుప్రజా ఫౌండేషన్ తోడ్పాటు అందించాయి. ముఖ్యంగా వ్యవసాయం, తోటల పెంపకం, అడవుల పెంపకం సాగు పద్ధతులను తయారు చేయడంలో  ఈ రెండు సంస్థలు సహకరించాయి. సుప్రజా ఫౌండేషన్ సహకారంతో బెయిఫ్ ‘ఆదర్శప్రాయమైన గ్రామీణాభివృద్ధి కార్యక్రమాన్ని’ ప్రారంభించింది. ఇందులో భాగంగానే వాడీ మోడల్ వ్యాప్తిలోకి వచ్చింది. అదనపు విలువలను చేకూర్చేందుకు అనువైన తోటల సాగుకు ప్రోత్సాహం లభించింది. ఆ సమయంలో ఈ విధానం నుసరించి లబ్ది పొందిన మిత్రులు, బంధువుల ద్వారా సీతారామ్ కూడా ఈ మోడల్ గురించి తెలుసుకున్నాడు. తాను కూడా ఆ మోడల్ ను అనుసరించాలని నిర్ణయించుకున్నాడు.

—————————————————————————————————————————————————-

ముఖ్యాంశాలు – ప్రయోజనాలు

  • స్థానిక వనరుల వినియోగం, ఉత్పత్తి కార్యక్రమాలలో ఆదర్శప్రాయమైన సానుకూల విధానం
  • బెయిఫ్ ప్రేరణతో 12 రాష్ట్రాలలో 2 లక్షల కుటుంబాలకు విస్తరణ, నాబార్డ్ తోడ్పాటుతో 5 లక్షల కుటుంబాలకు విస్తరణ
  • ఏడాది పొడవునా కుటుంబానికి రూ. 80, 000 నుంచి రూ. 90, 000 నికర ఆదాయం
  • దిక్కులేని పరిస్థితుల్లో వలసల అవసరం తగ్గి పోయింది.
  • సామాజికంగా ఉన్నత స్థితి, సాధికారికత
  • 48 పార్మర్స్ ప్రొడ్యూజర్స్ ఆర్గనైజేషన్స్ భాగస్వామ్యంతో 41, 000 మందికి మామిడి, జీడి, ఉసిరి ప్రాసెసింగ్ లో శిక్షణ, నైపుణ్యాల పెంపు
  • కర్బన కాలుష్యం నియంత్రణ – హెక్టారుకు 24 టన్నులు
  • నాణ్యతా ప్రమాణాల లక్ష్యం – 1,2,3,10,12,13

————————————————————————————————————————————————–

మొదట్లో అంతగా నమ్మకం లేకపోయినా తనకున్న కొద్ది పాటి పొలంలో చెట్లను నాటడానికి చాలా కొంత భాగాన్నే కేటాయించగలిగాడు. వాలుగా ఉన్న ప్రదేశం, అది కూడా భూసారం లేని ప్రాంతం కేటాయించాడు. సీతారామ్ అభ్యర్థనపైనే బెయిఫ్ బృందం వెళ్లి అతనికి అందుబాటులో ఉన్న వనరులను పరిశీలించారు. సంయుక్తంగా మెరుగైన సేద్య విధానాన్ని ప్రతిపాదించారు. దానికి అవసరమైన కార్మిక శక్తిని సమకూర్చడంతో పాటు అవసరమైన శిక్షణ పొందడానికి ఆసక్తి  చూపించాడు. దాంతో అవసరమైన మొక్కలు, ఆకులు, అలములు వంటి చెత్తను, ఇతర ఎరువులను సరఫరా చేసారు. మొక్కలను నాటడానికి ముందు చేపట్టవలసిన భూమిని దున్నడం, మొక్కల పెంపకానికి అవసరమైనకుండల్లో పెంచడం, సేంద్రీయ ఎరువులను సమకూర్చడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. క్రమంగా సీతారామ్ తన వ్యవసాయ క్షేత్రంలో 20 మామిడి, 40 జీడి మొక్కలు, ఇంకా అడవులలో మాత్రమే పెరిగే 250 రకాల మొక్కలను నాటాడు. అంతర పంటలుగా దుంపలు, పప్పు ధాన్యాలను కూడా పండ్ల చెట్ల మధ్య సాగుచేయడం ప్రారంభించాడు. ఖరీఫ్ పంట చేతికి వచ్చిన తరువాత, నేలలో మిగిలి ఉన్న తేమ ఆధారంగా జనుము (సన్ హెంప్) సాగునుఅంతర పంటగా చేపట్టాడు. ఈ రకమైన అంతర పంటల కారణంగా అదనపు ఆదాయం లభించడమే కాకుండా, భూసారాన్ని మెరుగుపడింది. ఈ అంతర పంటల వల్ల అక్కడి మట్టిలో నత్రజని పాలు బాగా పెరిగింది. వేసవి  కాలంలో భూసారం మెరుగుపడేందుకు మరిన్ని చర్యలను కూడా సీతారామ్ తీసుకోవడంతో మంచి ఫలితం వచ్చింది. పొలంలో పేరుకుపోయే వ్యర్థాలను ఉపయోగించి సేంద్రీయ ఎరువుల పునరుత్పాదన విధానం అనుసరించాడు. అదే సమయంలో గ్రీన్ మాన్యూర్, దశపర్ణి ఆర్క్ వంటివి చేపట్టాడు. ఫలితంగా భూసారం   మెరుగైంది.

అనంతర కాలంలో కూరగాయల పెంపకం విషయంలో కూడా ఆయన సమగ్రమైన శిక్షణ పొందాడు. తడకల ఆధారంతో పెరిగే కూర మొక్కల పెంపకం మొదలుపెట్టాడు. అయితే ఆయన కూరగాయల సాగును  ఏనాడూ వాణిజ్యపరంగా చేపట్టలేదు. కొద్ది పాటి స్థలంలోనే ఆయన ఇలా తడకల ఆధారిత కూరగాయల పెంపకం పెట్టాడు. అంతే కాకుండా, ఆకు కూరల పెంపకం కూడా చేపట్టాడు. బీర కాయలను ఈ రకంగా పెంచడం ప్రారంభించాడు. ఇలా రెండు మూడు పంటలను పెంచగలిగాడు. మొదటి సీజన్ లోనే మంచి ఫలితాలు అందాయి. కొంత సొమ్మును ఉపయోగించి, కూరగాయలకు మరింత స్థలం కేటాయించాడు. ఏళ్లు గడిచే కొద్దీ, చెట్లు బాగా పెరిగాయి. భూసారం  కూడా చాలా పెరిగింది.

పప్పు ధాన్యాల సాగును అంతర పంటగా చేపట్టిన తొలి సంవత్సరాలలో సీతారామ్ కు మంచి ఆదాయమే వచ్చింది. ఇక కూరగాయల పెంపకం ద్వారా మెరుగైన రాబడే వచ్చింది. పండ్ల తోటల ద్వారా నాలుగో సంవత్సరం నుంచి మంచి ఫలితాలే వచ్చాయి. ఇప్పుడు సీతారామ్ కు ఏడాది పొడవునా పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు, కూరగాయలు, పండ్ల దిగుబడి ఆధారంగా నికరమైన ఆదాయం లభిస్తోంది. ఆయన ఈ చర్యలు తీసుకోకముందు,, తీసుకున్న తరువాత సాధించిన ఉత్పత్తులు, వాటి విలువలను దిగువ టేబుల్ స్పష్టం చేస్తుంది.

పొలంలో దిగుబడి పెరగినందున పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు వంటి వాడకం ఆతని కుటుంబంలో కూడా బాగా పెరిగింది. అంటే వారికి ఇప్పుడు పోషక విలువలు సమృద్ధిగా ఉన్న ఆహారం లభిస్తోంది. మిగులు పండ్లు, కూరగాయలు కుటుంబానికి అదనపు ఆదాయం తెచ్చి పెడుతున్నాయి. ఇప్పుడు వారికి రోజు గడవడం కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి పూర్తిగా తొలగిపోయింది. గౌరవప్రదంగా జీవితం సాగిస్తున్నారు. పిల్లల చదువులు సజావుగా సాగిపోతున్నాయి. తోటలు, పండ్ల పెంపకం ఆతని కుటుంబానికి, ఆతని పొలంలో భూసారం పెరగడానికి, ఆదాయం పెరగడానికి కూడా తోడ్పడింది. రకరకాల పంటల సాగు కారణంగా పొలంలో జీవ వైవిధ్యం విస్తరించింది. పక్షులు, ఇతర క్రిమికీటకాలు అధికమయ్యాయి.

ఉత్పత్తి, పంటల విలువలు

  వాడీ చేపట్టక ముందు   ఆ తరువాత  
పంటల సాగు   దిగుబడి (కిలోల్లో)     విలువలు (రూ.లలో)   దిగుబడి (కిలోల్లో)     విలువలు (రూ.లలో) 

చిరుధాన్యాలు   (వరి, రాగి)     

1400            35,000          1100          27,500
పప్పు ధాన్యాలు  (మినుములు, పీజియన్ పీ)                              70            4,900  150      10,500
బీర కాయలు     15,540              2,17.560
దోస కాయ                                    1000        16000
మామిడి                                        805                21735
జీడి                                              180      18900
మొత్తం ఉత్పత్తుల విలువ          39900           3,12,195

 

సమష్టిగా చేపట్టిన చర్యలు

వాడీ కార్యక్రమాన్ని (వ్యవసాయం – తోటలు – అటవీ పెంపకం) ఈ ప్రాంతంలోని మరి కొందరు రైతులు కూడా చేపట్టారు. ఇది అక్కడ సేద్య రంగంలో చాలా మార్పులకు కారణమైంది. ఆదాయం పెరిగింది. సహజ వనరులు మెరుగయ్యాయి. అంతేకాకుండా వారంతా రైతు ఉత్పత్తి దారుల సంఘాలుగా (ఫార్మర్స్ ప్రొడ్యూజర్స్ ఆర్గనైజేషన్స్) గా అంటే రైతు సహకార సంఘాలుగా ఏర్పడ్డాయి. సమష్టిగా అదనపు విలువలను సమీకరించుకునేందుకు చొరవ తీసుకున్నారు. అలాంటి కార్యక్రమాలలో రైతులకు అవసరమైన ముడి సరుకు అందించడం, ఉత్పత్తులను సమీకరించుకోవడం, మామిడి, జీడి వంటి వాటి ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి వాటిని కలిసికట్టుగా చేపట్టారు. ఫలితంగా రైతుల ఉత్పాదన ఖర్చు తగ్గింది. మంచి గిట్టుబాటు ధర లభించింది. వ్యవసాయ ముడి సరుకు, ఉత్పత్తుల సేకరణ, ప్రాసిసెంగ్, మార్కెటింగ్ కారణంగా, కొత్త కొత్త ఎంటర్ ప్రైజెస్, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.

చాలా కుటుంబాలు తదుపరి రంగాలకు తమ కార్యకలాపాలను విస్తరించాయి. అంటే పండ్ల తోటల పెంపకం, అంటు కట్టడం, కూరగాయల నాట్లు వేయడం, వర్మీ కంపోస్టు తయారు చేయడం, కుక్క గొడుగల పెంపకం వంటివాటిని చేపట్టడం ప్రారంభించాయి. అవి ఆయా కుటుంబాలకు మాత్రమే కాకుండా, ఆయా సామాజిక వర్గాల వారికి అదనపు ఉపాధి అవకాశాలు కల్పించాయి. మొత్తం మీద  వారి జీవితాలు సామాజికంగానూ, ఆర్థికంగానూ కూడా ఉన్నత స్థితికి చేరాయి. వాడీ కార్యక్రమం పరిసరాలలో నత్రజని ప్రభావం తగ్గిపోవడంతో అక్కడి వాతావరణం, పర్యావరణం మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది.

యోగేశ్ జి. సావంత్
సీనియర్ థెమాటిక్ ప్రోగ్రామ్ ఎక్జిక్యూటివ్
E-mail: ygsawant@baif.org.in

రాకేశ్ కె. వారియర్
చీఫ్ ప్రోగ్రామ్ ఎక్జిక్యూటివ్
E-mail: rakeshkwarrier@baif.org.in

రాజేశ్ బి. కోట్కర్
సీనియర్ ప్రాజెక్టు ఆఫీసర్
E-mail: rajesh.kotkar@baif.org.in

బెయిఫ్ డెవలప్ మెంట్ రీసెర్చి ఫౌండేషన్
బెయిఫ్ భవన్, డాక్టర్ మణిభాయ్ దేశాయ్ నగర్
ఎన్ హెచ్ 4, వార్జే, పూణే - 411058

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...