లీచీ పండ్ల శుద్ధి ప్రాధాన్యత అదనపు విలువ చేర్పు ప్రయోజనాలు

ఆహారయోగ్యమైన పండ్లను శుద్ధి చేయడం ద్వారా వాటికి అదనపు విలువలను చేకూర్చినప్పుడు కలిగే ప్రయోజనాలు అంతా ఇంతా కాదు. అయితే ఆ ప్రక్రియను చేపట్టేందుకు భారీ పెట్టుబడి అవసరమవుతుంది. అందువల్లనే సాధారణ వ్యవసాయదారులు ఈ అంశం జోలికి వెళ్లడం లేదు. వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక అంశాలపై పరిశోధనలు చేస్తున్న భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చి (ఐకార్) సంస్థ చేయూత ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. తేలికపాటి పద్ధతులతో పండ్లను శుద్ధి చేసే విధానాలను వారికి చేరవేస్తోంది. ముఖ్యంగా బీహార్ లో లీచీ పండ్లను పండించే వ్యవసాయదారులకు తోడ్పడుతోంది. వారి ఆకాంక్షలను, ఆశలను నెరవేర్చేందుకు సహకరిస్తోంది.

లీచీ పండ్ల విక్రేత లేదా వీధుల్లో విక్రయించే వారిని ఎవరిని ప్రశ్నించినా, వాటిని పండించడంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పక తప్పదు. లీచీ పండ్ల సాగు విస్తృతంగా చేపట్టే బీహార్ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. పంట కోతకు ముందే కంట్రాక్టర్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు దిగుబడి మొత్తాన్ని రైతు అమ్మేసుకుంటాడు ఆ తరువాత వాటి క్రయవిక్రయాలలో రైతుకు ప్రమేయం ఉండదు. దానిపై వచ్చే లాభాలన్నీ కూడా కంట్రాక్టర్ జేబులోకే వెళ్లిపోతుంది. దేశవ్యాప్తంగా ఉన్న గిరాకీని ఆతడే సొమ్ము చేసుకుంటాడు. ఈ వ్యవహారంలో రైతుకు కూడా మార్కెటింగ్ బెడద తప్పుతోంది కదా అనే వాదన కూడా అక్కడక్కడ వినిపిస్తుంది.  కానీ రైతు పట్టించుకుని తీరవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిని గమనిస్తే రైతుకు చేరవలసిన ఎన్నిప్రయోజనాలు వారికి దూరమవుతున్నాయో అర్థమవుతుంది. అదే సమయంలో ఏ స్థాయిలో సమస్యలు ఉంటే రైతు పంట చేతికి రాకముందే కంట్రాక్టర్ చేతిలో పోసేందుకు సిద్ధపడతాడో కూడా తెలుసుకోవడం చాలా అవసరం.

ఇతర పండ్లతో పోలిస్తే లీచీ పండ్ల సాగు ఒక్కసారి మాత్రమే చేపట్టడం సాధ్యమవుతుంది. రైతు తనకున్న పొలం మొత్తాన్ని లీచీ సాగుకే కేటాయించవలసి ఉంటుంది. లీచీ సాగు అతి తక్కువ కాలంలోనే చేతికి దిగుబడినిస్తుంది. గట్టిగా రెండు మూడు వారాలలో పంట ఫలితం దక్కుతుంది. ఆ తరువాతే పండు రంగు మారిపోయే ముప్పు ముంచుకొస్తుంది. సాధారణ వాతావరణ పరిస్థితులలో పండ్ల రంగు 24 నుంచి 48 గంటలలోపే గోధుమ రంగులోకి మారిపోతుంది. అలా రంగు మారిన పండ్లకు గిరాకీ తగ్గిపోతుంది. నాణ్యత దెబ్బతింటుంది. పైగా ఈ పండ్లకు గిరాకీ ప్రధానంగా వాటిపై ప్రజల కన్ను పడినప్పుడు మాత్రమే ఉంటుంది. రంగు మారిన లీచీ పండ్లకు ఏ మాత్రం గిరాకీ ఉండదు పైగా ఒకేసారి రైతుల దిగుబడి మొత్తం మార్కెట్ కు చేరుకుంటుంది. అందువల్ల అతి తక్కువ ధరలకే రైతు విక్రయించుకోవలసి వస్తుంది. ఇక దూర ప్రాంతాలకు సరఫరా చేయడం అనేది ఊహించడానికి కూడా సాధ్యం కాని స్థితి. చాలా తక్కువ సమయంలోనే పండ్ల నాణ్యత క్షీణించిపోయే అవకాశం ఉండడమే అందుకు ప్రదానమైన కారణం. వాటిని సరైన సమయానికి దూర ప్రాంతాలకు చేరవేసేందుకు అనువైన రవాణా సదుపాయాలు లేకపోవడం మరో కారణం. అందువల్ల చాలా మంది లీచీ సాగుదార్లు అత్యంత సదుపాయంగా ఉండే దళారీలకు పంట ఫలం చేతికి రాకముందే ఒక ఒప్పందం కుదిర్చేసుకుంటున్నారు. నిజానికి అలా కంట్రాక్టరుతో ముందుగానే ఒప్పందం చేసుకోవడం ఒకరకంగా నష్టదాయకం మాత్రమే కాకుండా చాలా తక్కువ ఆదాయం అందిస్తుంది.

శుద్ధి ప్రక్రియ – అదనపు విలువల కూర్పు

ఐసీఏఆర్-ఎన్ఆర్సీఎల్ చేయూత

ఫలసాయం చేతికి వచ్చిన వెంటనే ఎదురయ్యే రంగు మార్పు సమస్యను పరిష్కరించేందుకు ఉన్న ఏకైక మార్గం శుద్ధి ప్రక్రియను చేపట్టడం. పండించిన పంటకు అవసరమైన అదనపు విలువలను చేకూర్చడం. ఇలా శుద్ధి చేసిన పండ్లను ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చు. నిల్వచేసి, మార్కెట్ కు చేర్చవచ్చు. అలా చేసే ప్రయత్నంలో ప్రాసెస్ చేసే వారికి వాటిని కాపాడుకునేందుకు మరికొంత సమయం దొరుకుతుంది. మార్కెట్ లో డిమాండ్ ఆధారంగా చేర్చడానికి వీలవుతుంది.

ముజఫర్ పూర్ (బీహార్) లోని జాతీయ స్థాయిలోని లీచీ పరిశోధనా సంస్థ (నేషనల్ రీసెర్చి సెంటర్ ఆన్ లీచీ – ఎన్ఆర్సీఎల్), భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐకార్ సంయుక్తంగా శుద్ధి చేసే ప్రక్రియలను, నిల్వ చేసే విధానాలను రూపొందించి వాటినీ ప్రమాణీకరించేందుకు కృషి చేస్తున్నాయి. అయితే బహుళ జాతి సంస్థల ఆధిపత్యం అధికంగా ఉన్న ఈ పరిశ్రమకు భారీ పెట్టుబడులు అవసరమవుతాయి. అవసరమైన ఆర్థిక వనరుల సమస్య, ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లేని కారణంగా ఆ సాంకేతికతను ఆచరణలోకి తీసుకురావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ కారణంగా ఆ దిశగా చర్యలు తగిన స్థాయిలో అందుబాటులోకి రావడం లేదు.

ఎన్ఆర్సీఎల్ సంస్థ 2014 నుంచి 2017 వరకు మెల్లిమెల్లిగా ఈ సాంకేతికత విషయంలో సానుకూల చర్యలను చేపడుతోంది. అందులో భాగంగా, శిక్షణ కార్యక్రమాలను, కిసాన్ మేళాలను ప్రదర్శన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అదే సమయంలో ప్రయోగాత్మకంగా బెవెరేజెస్ తయారీ చేపట్టి, వాటిని మార్కెట్ కు చేరవేసేందుకు చర్యలు తీసుకుంది. ఆ రకంగా దీనినో లాభదాయకమైన వ్యాపార కార్యక్రమంగా రైతులను ప్రోత్సహించింది. ఉత్పత్తిదారుల్లోని ఉత్సాహం గమనించి లీచీ బెవెరేజెస్ తయారీలో మైక్రో ప్రాసెసింగ్ ప్రక్రియలోల ఔత్సాహిక పారిశ్రామిక అభివృద్ధి దిశగా వారిని పురికొల్పింది. అందులో పేర్లు నమోదు చేసుకున్న రైతులకు బెవెరేజెస్ నిల్వచేయడంలోని శాస్త్రీయ పద్ధతులను వివరించి, ఆహార భద్రతా నియమాలను తెలియచేసి, లైసెన్సింగ్, స్టోరేజీ, మార్కెటింగ్ నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంది. శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకున్న తరువాత వారంతా తమ తమ ఇండ్లలోని వంట గదుల్లోనే బెవెరేజెస్ తయారీ చేపట్టారు. సాధ్యమైనంత తక్కువ పెట్టుబడితోనే వారు వాటిని తయారు చేయగలుగుతున్నారు. 2018 తరువాత పరిస్థితి మరింతగా చక్కబడడం ప్రారంభమైంది.

మార్గదర్శకులుగా నిలిచిన కొందరు

ముజఫర్ పూర్ జిల్లా కుర్హాని బ్లాకు కు చెందిన 55 ఏండ్ల రామ్ సరోవర్ ఎన్నడూ ఊహించను కూడా ఊహించని స్థాయిలో ఇప్పుడు ఆదాయం అందుకుంటున్నాడు. ఆయన తోటలో 10 మామిడి చెట్లున్నాయి. వాటినుంచి వచ్చే ఆదాయం అప్పటివరకు ఓ మోస్తరుగా కుటుంబ అవసరాలకు సరిపోయేది. ప్రాసెసింగ్ ప్రక్రియను చేపట్టినట్లయితే తనకున్న పేదరికం నుంచి విముక్తి కలుగుతుందన్న నమ్మకం శిక్షణ తరువాత ఆయనలో బలంగా నాటుకుపోయింది. శిక్షణలో నేర్చుకున్న మెళకువలను ఉపయోగించి ఆయన రెడీ-టు సర్వ్ పండ్ల రసాలను తయారు చేయడం ప్రారంభించారు. మెల్లిగా తన పరిసరాలలోని ఇతర రైతుల నుంచి కొనుగోలు చేసి లీచీ పండ్లను సేకరించి లీచీ పండ్ల గుజ్జును కూడా తయారుచేయడం ప్రారంభించారు. వ్యవసాయం పట్ల యువతకు ఏ మాత్రం ఆసక్తి ఉండడం లేదని, సేద్యాన్ని జీవనోపాధిగా చేసుకునేందుకు వారు సిద్దంగా లేరని అందరికీ తెలిసిందే. ఈ ధోరణి దేశమంతటా ఒకేలా ఉంది. సరోవర్ కుమారుడు భరత్ భూషణ్ కూడా సేద్యంపై ఏ మాత్రం ఆసక్తి చూపించేవాడు కాదు. తన 24 ఏండ్ల కుమారుడి గురించి ఆయన ఇలా వాపోయాడు. ‘చదువుకున్నా కూడా నిరుద్యోగిగా మిగిలిపోయిన నా బిడ్డ గురించి చాలా బెంగగా ఉండేది. అతడికి సేద్యాన్ని నమ్ముకుని బతుకుతెరవు చూసుకోవడం ఇష్టంలేదు. అయితే నేను ప్రారంభించిన లీచీ ప్రాసెసింగ్ కార్యకలాపాలు విజయవంతం, లాభాలు వస్తుండడంతో ఇప్పుడు నా బిడ్డ కూడా నాకు అన్ని పనుల్లోనూ చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అది తనకు చాలా ఆనందాన్ని ఇస్తున్నదని’ ఆయన తన ఆనందాన్ని వ్యక్తంచేసారు. ఇప్పుడు భరత్ భూషణ్ కూడా చురుగ్గా లీచీ పండ్ల ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యాపారంలోకి దిగాడు. 2018లో మరి కొంత పెట్టుబడి చేర్చి వాణిజ్యాన్ని విస్తరించారు. ఇవాళ్టి రోజున వారు ఏర్పాటు చేసుకున్న రామ్ సరోవర్ అగ్రో ఫుడ్స్ సంస్థ లీచీ పండ్ల రసాన్ని, రెడీ టు సెర్వ్ ఉత్పాదనలను స్వయంగా తయారుచేసి పరిసరాలలోని రిటైలర్లకు, రెస్టారెంట్లకు, ధాబీలకు సరఫరా చేస్తున్నది. ముజఫర్ పూర్ – పాట్నా రహదారి వెంబడి ఉన్న అన్ని చోట్లా వారి పానీయాలు విరివిగా లభిస్తున్నాయి. మూడేళ్ల వ్యవధిలో ప్రాసెసింగ్ కార్యకలాపాలను మొట్టమొదటి సారి చేపట్టి ఇప్పుడు ఇతరులకు సరఫరా చేసే స్థాయికి చేరుకున్నారు. అటు విస్తరణతో పాటు తమ కలలను సాకారం చేసుకుంటున్నారు.

లీచీ పండ్ల ప్రాసెసింగ్ చేపట్టిన తరువాత అనోజ్ కుమార్ రాయ్ ఆదాయం లో మార్పు

మార్కెటింగ్ తీరు  తాజా మార్కెట్ తీరు  ప్రాసెసింగ్   ఆదాయం మొత్తం
దళారుల ప్రభావం  (ఇది సంప్రదాయక పద్ధతి) 3000 కిలోలు ఏమీ లేదు రూ. 40,000
  పాక్షిక ప్రాసెసింగ్ (2020 నాటి అనుభవం)    2500 కిలోలు    500 కిలోలు  రూ. 1,12,500
పూర్తి స్థాయి ప్రాసెసింగ్   3000 కిలోలు ఏమీ లేదు   రూ. 4,75,000

ఇతర పండ్ల రకాలతో పోల్చి చూసినప్పుడు లీచీ ప్రత్యేకత అంతా దాని రుచిలోనే ఉంది. ఉష్ణమండల ప్రాంతాల విశిష్ట గుణాలతో అద్భుతంగా ఉంటుంది. అన్ని వర్గాల వారికీ ఎంతో ఆనందాన్ని పంచిపెడుతున్న లీచీ పండ్లతో ఇప్పుడు అనేక రకాల ఆహార పదార్ధాలు అందుబాటుకు వస్తున్నాయి. బెవెరేజెస్, ఐస్ క్రీమ్ లు, రుచికరమైన డెసెర్ట్స్, ఇంకా సువాసనలను ఇచ్చే అగరు ధూప కడ్డీలను, లిప్ స్టిక్ తరహా మరెన్నో సౌందర్య సాధనాల రూపంలో లభిస్తున్నాయి.  ఈ సందర్భంలో మరో లీచీ సాగుదారు 50 ఏండ్ల అనోజ్ కుమార్ రాయ్ గురించి కూడా తెలుసుకోవాలి. ఈయన సమస్తిపూర్ వాసి, లీచీ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి మరెన్నో రకాలైన ఆహార రూపాలను అందించాలనేది ఆయనకి చిన్న నాటి నుంచి ఉన్న ఆలోచన. ఆ రకంగా పెద్ద స్థాయిలో ఆదాయం సంపాదించాలనేది కోరిక. ‘లీచీ పండ్లు కేవలం ఒక్క నెల రోజులు మాత్రమే అందుతుంది. వాటిని ప్రాసెస్ చేయాలనేది తనకున్న పెద్ద కోరిక. అలా చేయడం వల్ల మరెంతో మందికి వాటి రుచి ఆస్వాదించగలుగుతారు. అభిరుచి పెంచుకోగలుగుతారని తన గట్టి విశ్వాసం. ఆరోగ్యానికి కూడా లీచీ పండ్లు చాలా మేలు చేస్తాయి. ప్రాసెస్ చేసినట్లయితే వాటిని ఏడాది పొడవునా కస్టమర్లకు అందించవచ్చనేది నాకున్న ఆశయం.‘ అంటూ వివరించారు అనోజ్. ఆయనకు సమస్తిపూర్ సమీపంలో మారుమూల ఉండే మలికోర్ గ్రామం. అక్కడ ఆయనకు అయిదెకరాల పొలం ఉంది. రవాణా సదుపాయాలు అంతంత మాత్రమే అయినా ఆయనలో ఆత్మవిశ్వాసం ఏ మాత్రం చెక్కు చెదరలేదు. దేశమంతటా కోవిడ్ ముప్పు విజృంభించిన వేళ అంటే 2020 మే మాసంలో తాజా లీచీ పండ్లను మార్కెట్ కు చేర్చడం చాలా సమస్యగా తయారైంది. నష్టదాయకంగా కూడా మారింది. దానినే అవకాశంగా మార్చుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ‘లీచీ పండ్లు అతి తక్కువ కాలంలోనే చెడిపోతాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రభావం వల్ల ఇతర ప్రాంతాలకు రవాణా దాదాపు అసాధ్యం. ఈ సమస్యలను గమనించి, చేతులు ఎత్తేయడం కన్నా ఏద మార్గం అన్వేషించాలని నిర్ణయించుకున్నాను. అప్పటికే నష్టాలు పెరిగిపోతున్నాయి. అందువల్ల వాటిని ప్రాసెస్ చేయాలని, వాటి గుజ్జు నిల్వ వ్యవధిని పెంచాలని తీర్మానించుకున్నాను.’ అని ఆయన తన ఆలోచనను వివరించారు. ఎన్ఆర్సీఎల్ సాంకేతిక పర్యవేక్షణలో చేపట్టిన కార్యక్రమాల వల్ల అనోజ్ తన లీచీ పండ్ల పంటను కాపాడుకోవడమే కాకుండా, సొంతంగా ప్రాసెసింగ్ ప్రక్రియ చేపట్టి విజయం సాధించాడు. ఆయన సాగులో దాదాపు 60 లీచీ చెట్లు ఉన్నాయి. వాటి దిగుబడిని దళారులకు పంట చేతికి రాకముందే అమ్మేసుకోవడం వల్ల కేవలం రూ. 40000 ఆదాయం వచ్చేది. అయితే 2020 వేసవిలో ప్రాసెసింగ్ ప్రక్రియ చేపట్టిన తరువాత ఆయన ఆదాయం రూ. 79,200కు చేరింది. అది కూడా పది చెట్ల ఫలసాయం అయిన 500 కిలోలను ప్రాసెస్ చేసినందున వచ్చిన ఆదాయం. వాటిని రెడీ టు సెర్వ్ పానీయాలుగా మార్చి అదనపు రాబడి సంపాదించగలిగాడు. లీచీ పండ్ల ప్రాసెసింగ్ ద్వారా వచ్చిన ఫలితాన్ని చూసిన తరువాత మల్లికా రకం మామిడి పండ్లపై ఆయన తన దృష్టి పెట్టాడు. ఇవాళ ఆయన స్థానికంగా తన సొంత ఉత్పాదనలను మార్కెటింగ్ చేయగలుగుతున్నాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్న సరోవర్ మాదిరిగానే అనోజ్ కూడా స్థానికంగా పూసా – సమస్తిపూర్ మధ్య ఉండే రెస్టారెంట్లు, రిటైల్ దుకాణాలు, కేటరింగ్ హౌజ్ లకు ఆయన తయారుచేసిన పానీయాలు చేరుతున్నాయి. వ్యవసాయపరంగా ఆవిష్కరణలపై ఆసక్తి ఎక్కువగా ఉన్న అనోజ్ అందరి ప్రశంసలకు అర్హుడనే చెప్పాలి. పరీక్షలకు ఎదురునిల్చి విజయపథంలో దూసుకుపోతున్న అనోజ్ నిజంగా అభినందనీయుడే. ఆయనకున్న అయిదెకరాల పొలంలో రకరకాల పండ్ల చెట్లు సాగవుతున్నాయి. వాటిలో లీచీ, మామిడి, ఆపిల్, పీచ్ రకం పండ్ల చెట్లు, ఇంకా, ప్లమ్, కిన్నో, మాండరిన్, నిమ్మ, ద్రాక్ష, జామూన్, అనోలా, ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని వివిధ విశ్వవిద్యాలయాలను, పరిశోధన సంస్థలను సందర్శించి సేకరించి తీసుకువచ్చారు. ఇప్పుడు అనోజ్ ఆలోచనలు మరెన్నో ఉన్నాయి. ముందు ముందు మరెన్నో రకాలైన పండ్ల ప్రాసెసింగ్ చేపట్టారని ఆయన ఆశిస్తున్నారు. ఆయన సాధించిన విజయం గమనించి పరిసరాలలోని ఇతర రైతులు ఆయన వెంట నడిచేందుకు ముందుకు వచ్చారు.  ఇప్పుడు వారంతా కలిసి పూసా ఫార్మర్స్ ప్రొడ్యూజర్స్ కంపెనీ పేరుతో సంఘటితమయ్యారు.

సమర్పణ్ జీవికా మహిళా కిసాన్ ప్రొడ్యూజర్ కంపెనీ లిమిటెడ్ అన్న సమష్టి బృందం ముజఫర్ పూర్ లోని ఝపహా ప్రాంతంలోని మహిళా రైతులకు చేయూతను అందిస్తోంది. వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగపరచడమే ఈ సంస్థ ఆశయం. అందుకు అవసరమైన సాంకేతిక, మార్కెటింగ్ సహకారం అందిస్తోంది. వాటిలో కాయగూరలు, పండ్ల ప్రాసెసింగ్ విధానాల వ్యాప్తి ఒకటి. ఆ రకంగా వారికి అదనపు ఆదాయం సంపాదించుకునే మార్గాలను వివరిస్తోంది. ఐకార్ – ఎన్ఆర్సీఎల్ సంయుక్తంగా 2020 మార్చిలో ఏర్పాటుచేసిన ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డేవలప్ మెంట్ ప్రోగ్రామ్ కి ఈ కంపెనీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఆ ఏడాది మే – జూన్ మాసాల్లో 20 టన్నుల లీచీ పండ్ల ప్రాసెసింగ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో హాజరైన తరువాత ఈ కంపెనీ స్యవంగా లీచీ స్క్వాష్, రెడీ టు సెర్వ్ పానీయాలను తయారుచేస్తోంది. త్వరలో మరెన్నో వివిధ రకాల ఉత్పాదనలను తయారుచేసేందుకు సిద్ధమవుతోంది. అదే జరిగితే అక్కడి రైతులకు మరిన్ని జీవనోపాధులు చేకూర్చడం సాధ్యమవుతుంది.

ఫుడే ప్రాసెసింగ్ పరిశ్రమలో ఇలాంటి విజయ గాథలు అనేకం కనిపిస్తాయి. ఈ రంగంలో వస్తున్న మార్పులు ఎంతో స్ఫూర్తివంతంగా కనిపిస్తున్నాయి. అంతటా ఆశావహ దృక్పథం కనిపిస్తోంది. జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) గుర్తింపు పొందిన షాహీ లీచీ అన్న పానీయం నాణ్యతాపరంగానూ, ప్రత్యేకతకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది బీహార్ లోనే తయారవుతుంది. ముజఫర్ పూర్, తూర్పు చంపారణ్, సీతామర్హి జిల్లాలలో పండించే లీచీ పండ్లతో ఇది తయారు అవుతోంది. జిల్లాకో ఉత్పాదన రూపంలో మార్కెట్ లో అందుబాటులో ఉంటోంది. వీటిని ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ఫార్మలైజింగ్ పథకం (పిఎంఎఫ్ఎంఈ) కింద  చేపడుతున్నారు. అందుకు అవసరమైన అన్ని పథకాల నిర్వహణ భారాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. అవన్నీ కూడా ఇతర ఉత్పాదనలతో పాటు లీచీ పండ్లకు సంబంధించి కూడా ఎన్నో ప్రాసెసింగ్ అవకాశాలు అందిస్తున్నాయి.

వివిధ కారణాల ప్రభావం

రామ్ సరోవర్ లేదా అనోజ్ కుమార్ రాయ్ వంటి వారికి స్ఫూర్తినిస్తున్న కారణాలలో కొన్నింటిని గురించి కూడా తెలుసుకోవడం అవసరం.

వంట గదిలోనే సాధ్యం

ఆధునిక సాంకేతికత అమలుకు అడ్డంకిగా ఉన్న కారణాలలో చాలా పెద్ద మొత్తం పెట్టుబడి అవసరమవుతుందనే అపోహే. చాలా మంది ఈ అపోహ ప్రభావం వల్లనే ప్రాసెసింగ్ ప్రక్రియల వైపు దృష్టి మళ్లించలేకపోతున్నారు. చిన్న, సన్నకారు రైతులు ప్రాసెసింగ్ చేపట్టి ఓ మోస్తరు పారిశ్రామిక వేత్తలుగా పురోగమించేందుకు పెట్టుబడి విషయంలో ఉన్న అపోహలను తొలగించడం చాలా ముఖ్యమైన అంశం. అయితే వారంతా గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే రైతు తన ఇంటిలోని వంట గది ఆసరాగా ఈ మొత్తం ప్రక్రియను విజయవంతంగా కొనసాగించవచ్చు. ప్రత్యేకంగా ఎలాంటి పెట్టుబడులు అవసరం లేదు. ఈ వాస్తవాన్ని వాళ్లకి సక్రమంగా అర్థమయ్యేలా వివరించేందుకు ప్రాసెసింగ్ ప్రక్రియలో నైపుణ్యాలను అన్నిటిని వారికి అందించాలి. అవసరమైన సామర్థ్యం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలి. అంటే శాస్త్రీయబద్ధమైన సాంకేతికతను చేరవేయాలి. అనుభవం, శిక్షణ ప్రాతిపదికలుగా ఈ చర్యలను చేపట్టాలి. ఇప్పుడిప్పుడే ప్రాసెసింగ్ ప్రక్రియ ప్రారంభించిన మరో రైతు సోదరుడు అఖిలేశ్ (ముజఫర్ పూర్) తన అభిప్రాయాలను ఈ విధంగా వివరించారు. ‘మాకున్న తోటలో అనేక రకాలైన పండ్ల చెట్లను పండిస్తున్నాను. ఆశలు, ఆశయాలు కూడా నాకు చాలా హెచ్చుగానే ఉన్నాయి. అయితే తొందరపడి ఏవైపు అడుగు వేయాలన్నా, పండ్ల నిల్వ విషయంలో మౌలిక సూత్రాలను గురించి స్పష్టమైన అవగాహన సంపాదించుకోవాలి. మార్కెట్ లో నిలబడగలిగే ఉత్పాదనకు నాంది పలకాలి.’

వ్యవస్థాపరమైన మద్దతు

సాంకేతికపరమైన మెళకువలు నేర్పడంతో పాటు ప్రతి అడుగులోనూ వారికి అవసరమైన వ్యవస్థాపరమైన మద్దతు అందించాలి. ఇలాంటి ఆధునిక పద్ధతులను మొదటిసారి చేపడుతున్న వారికి ఇలాంటి వ్యవస్థ సహాయసహకారాలు చాలా అవసరం. ముఖ్యంగా ఐకార్ లేదా కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా నిర్వహిస్తున్నఅగ్రి-బిజినెస్ ఇంక్యూబేషన్ యూనిట్లు, సాంకేతికత బదిలీ సదుపాయాలు అందుబాటులో ఉండాలి. అప్పుడే చిన్న చిన్న పరిశ్రమలు విజయవంతంగా నడుస్తాయి. ఐకార్ – ఎన్ఆర్సీఎల్ సహకారంతో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో శిక్షణ పాల్గొనేందుకు ముందే వారికి అవసరమైన లేబొరెటరీ పరికరాలను, అనుకూలమైన సాంకేతికతను కూడా అందించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యంతోనే పంట చేతికి వచ్చే ముందే వర్క్ షాప్ నిర్వహించాలి. ప్రాసెసింగ్ సదుపాయాలు విస్తరించాలి. అందులో భాగంగా మార్కెటింగ్ నైపుణ్యాలను కూడా అందించాలి. అదే సమయంలో వారికి ఆహార పదార్థాల విషయంలో అవసరమైన లైసెన్సులు మంజూరుచేయాలి. అలా చేయడం వల్ల చేతితో ఆహార పదార్థాలను తయారుచేసే సాధారణ రైతులకు ఫెయిల్యూర్ భయం అనేది ఉండదు.

పెద్ద కలలు – చిన్న అడుగులు

ఆశలు పెంచుకోవడం వేరు, వాటిని సాకారం చేసుకోవడం వేరు. ఆహార పరిశ్రమలో ఎన్నో పెద్ద పెద్ద బహుళజాతి సంస్థలున్నాయి. వాటి పోటీని తట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. చిన్న స్థాయి ప్రాసెసర్ కు నమ్మకం కలగాలంటే, మార్కెట్ అవసరాలకు అనువైన ఉత్పాదనలను రూపొందించాలి. అది కూడా భారీ పెట్టుబడి అవసరం లేకుండా అన్న ధీమా కల్పించాలి. ఈ అంశంపై అనోజ్ కుమార్ ఇలా అంటున్నారు. ‘స్థానిక మార్కెట్ అవసరాలకు అనువైన ఉత్పాదనను కొద్ది మాత్రం పెట్టుబడితో చేపట్టాలనేది నా ఆలోచన. అందుకు అనుగుణంగానే లీచీ పండ్ల ఉత్పాదనలను మార్కెట్ కు చేర్చాలని ఆశిస్తున్నాను. వ్యాపారం పెరిగే కొద్దీ అదనపు పెట్టుబడులు కూడా సమకూర్చుకోవాలనేది నా ఆలోచన.’

ముగింపు వాక్యాలు

లాభసాటి వ్యాపారం, ఆశాజనకమైన అవకాశాలు లీచీ పండ్ల ప్రాసెసింగ్ లో లభిస్తాయి. తాజా లీచీ పండ్లను మార్కెట్ కు చేరవేయడంలో ఎదురవుతున్న ఎన్నో సమస్యలకు ప్రాసెసింగ్ పరిష్కారం చూపిస్తుంది పారిశ్రామిక ఉత్సాహం, వ్యాపారాభివృద్ధి అందులో భాగమైన ప్యాకేజింగ్, ఆహార మూలకాలు, నీటి శుద్ధి, రవాణా సదుపాయాలు, గోడౌన్ సదుపాయాలు, ఇంకా ఈ-కామర్స్ సేవలు అందుబాటులోకి తీసుకెళ్లాలి. ఇటీవలి సంవత్సరాలలో లీచీ పండ్లపై ఆధారపడి ప్రాసెసింగ్ చేపట్టిన వారి సంఖ్య మెల్లి మెల్లిగా పెరుగుతోంది. ఇప్పటికే లీచీ పండ్లకు జీఐ గుర్తింపు వచ్చిన కారణంగా, పిఎంఎఫ్ఎంఈ పథకం పథకం పరిధిలోనే వ్యవస్థాపరంగా మద్దతు అందించడం అవసరం.

అలెంవతి పోంగెనెర్, ఎస్.కె. పుర్బీ, వినోద్ కుమార్, విశాల్ నాథ్, ఎస్.డి, పాండే, అభయ్ కుమార్

———————————————————————————————————————————————–

అలెంవతి పోంగెనర్
సైంటిస్టు (ఫ్రూట్స్ సైన్స్)
ఐకార్-నేషనల్ రీసెర్చి సెంటర్ ఆన్ లీచీ
ముజఫర్ పూర్, బీహార్
E-mail: alemwati@gmail.com

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి 23, సంచిక 2 , జూన్ ౨౦౨౨

 

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...