రైతన్నకు కొండంత అండ సేంద్రీయ సేద్యం

కొద్దిపాటి చేయూత, మరి కాస్త సరైన మార్గదర్శకం అందిస్తే వ్యవసాయదారులు – ఎలాంటి సవాళ్లనైనా, అవి వాతావరణ మార్పుల ప్రభావాలకు సంబంధించినవే అయినా, మార్కెట్ సమస్యలకు సంబంధించినవైనా – సమర్థవంతంగా ఎదుర్కోగలరనేది వాస్తవం. అందుకు ఉదాహరణగా, వూటర్ (WOTR) సహాయసహకారాలతో తాను చేపట్టిన వ్యవసాయ కార్యకలాపాలను మార్చివేసుకునడమే కాకుండా, కుటుంబ ఆదాయాలను కూడా గణనీయంగా పెంచుకోగలిగిన పీతర్ సబర్ గురించి తెలుసుకోవడం అవసరం. అంతేకాదు ఇవాళ్టి రోజున ఆయనతన పరిసరాలలోని ఇతరులందరికీ తలలో నాలుకలా తయారయ్యాడు.

పీతర్ సబర్ కూడా ఒక సాధారణ రైతు. ఒడిస్సా రాష్ట్రంలోని రాయగఢ జిల్లా – గున్నుపూర్ గ్రామానికి చెందిన వాడు. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలే జీవనాధారంగా బతుకు బండి నడిపిస్తున్నాడు. చిన్న కమతంగా చెప్పవలసిన 7 ఎకరాల పొలానికి ఆయన ఆసామీ. అందులో ఒక ఎకరా స్థలంలో ఖరీఫ్ పంటకాలంలో వర్షాధారిత పంటల సాగు చేపడతాడు. మిగిలిన ఆరు నెలల కాలంలో పశువుల మేత కు వదిలేస్తాడు. ఆ భాగంలోనే అడవుల్లో పుట్టి పెరిగిన జీడి చెట్లను కూడా పెంచుతున్నాడు. అయితే జీడి చెట్ట ద్వారా వచ్చే దిగుబడి అంతంత మాత్రమే.

వాస్తవానికి ఆయన ఏడాది కాలంలో ఒక్క పంటనే పండిస్తాడు. మిగిలిన కాలంలో అంటే శీతాకాలమంతా భూమిని అలా గాలికి వదిలేస్తాడు. ఖరీఫ్ కాలంలో వరి సాగు చేస్తాడు. పండించిన ధాన్యాన్ని కుటుంబ అవసరాలకు నిల్వ చేసుకుంటాడు. ఇతరత్రా వచ్చే కుటుంబ అవసరాలను తీర్చుకునేందుకు జీడి పిక్కల విక్రయం, స్థానికంగా కూలీనాలీ చేసుకుని వచ్చే ఆదాయంపైనే ఆధారపడి ఉంటాడు.

వారు నివసించే గ్రామంలో చాలా మంది ప్రతీ సంవత్సరం కనీసం ఆరు నెలల పాటు ఉపాధి కోసం ఇతర పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లిపోవడం సర్వసాధారణం. పీతర్ కూడా వారిలాగే వలస జీవితం గడిపేస్తుంటాడు. వారంతా అటు అరుణాచల్ ప్రదేశ్, ఇటు తమిళనాడు, పూనే వంటి ప్రాంతాలకు వలస పోతారు.

మార్పునకు శ్రీకారం

ఆగస్టు 2018 లో వూటర్ (వాటర్ షెడ్ ఆర్గనైజేషన్ ట్రస్ట్) రాష్ట్రంలోకి అడుగు పెట్టింది. గున్నుపూర్ బ్లాక్ లోని 11 గ్రామాలలో తన కార్యక్రమాలను ప్రారంభించింది. అప్పట్లో ఈ సంస్థ ఆశయాలలో ముఖ్యమైనవి – స్థానికంగా నివసిస్తున్న గిరిజన తెగల పేదలకు మెరుగైన జీవనోపాధులు కల్పించడం, వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా వారి సామర్థ్యాలను, వారిలో మరింత ఆత్మవిశ్వాసం పెంపొందించడం. ఈ ప్రాజెక్టుకు బ్రెడ్ ఫర్ ది వరల్డ్ సంస్థ నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది.

ఈ ప్రాజెక్టులో వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం అనేది అత్యంత కీలకమైన అంశం. సేద్య రంగంలో సుస్థిరమైన లాభదాయకమైన విధానాలను అనుసరించడం ద్వారా క్రాప్ ఇంటెన్సిఫికేషన్ సిస్టమ్ రూపంలో ఉత్తమ విధానాలను ఆచరణలోకి ప్రోత్సహించడం అందులోని అంతర్భాగాలు. సేంద్రీయ సేద్య విధానాలను, కూరగాయల సాగును ప్రోత్సహించడం, వ్యవసాయ ఖర్చులను నియంత్రించడం వంటివి కూడా సంస్థ లక్ష్యాలలో మరి కొన్ని.

వూటర్ సంస్ఠ నిర్వహించిన కొన్ని శిక్షణ కార్యక్రమాలకు పీతర్ కూడా హాజరయ్యాడు. ఆ తరగతులలో వ్యవసాయ కార్యకలాపాలలో ప్రధానమైన విత్తన శుద్ధి నుంచి పంట కోత వరకు అన్ని అంశాల గురించిన ఉత్తమ పద్ధతులను వివరించడం జరిగింది. ఆ శిక్షణ ప్రభావం గురించి పీతర్ మాట్లాడుతూ … ‘విత్తనాలను ఎలా ఎంపిక చేసుకోవాలి, విత్తనాలను శుద్ధి చేసే పద్ధతి, పొలం భూమిని సవ్యంగా సిద్ధం చేయడం వంటి అంశాల గురించి బోధన మొదలుపెట్టారు. తరువాతి దశలో క్రాప్ ఇంటెన్సిఫికేషన్ సిస్టమ్ ల గురించి వివరిస్తూ, వరుస పద్ధతిలో విత్తనాలను నాటడం గురించి తెలియచేశారు. వాటిని అనుసరిస్తే అధిక దిగుబడుల సాధనకు వీలుగా విలువైన పోషకాలను అందిచడం గురించి కూడా తెలియజేశారు. మూడో విడత శిక్షణలో పోషకాలను అందించడంలోను,  సేంద్రీయ సేద్యంలో ఉత్తమ పద్ధతుల గురించి వివరించడం జరిగింది. వాటిలో దశపర్ణి ఆర్క్, జీవామృత్. నీమాస్త్ర వంటివి కూడా ఉన్నాయి. నాలుగో కార్యక్రమంలో పంటల కోత విధానాలు, కోతల అనంతరం చేపట్టవలసిన లేక అనుసరించవలసిన విధానాల గురించి అవగాహన కల్పించారు. ’

సామర్థ్యం పెంపు కసరత్తు

శిక్షణలో భాగంగా బోధించిన కొన్ని అంశాలపై పీతర్ మరింత ఆసక్తి చూపించారు. అవి చాలా లాభదాయకంగా కనిపించాయి. రైతులకు అనుకూలమైన రీతిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంలో వసుంధర సేవక్, ఇతర వూటర్ సిబ్బంది ఎంతో శ్రద్ధ చూపించారు. అక్కడితో ఆగకుండా పంట సాగు కాలమంతటా రైతుల వెంట ఉంటూ మార్గనిర్దేశకం చేశారు.

రైతులకు సరైన అవగాహన కల్పించేందుకు వూటర్ నిర్వహణలో ప్రదర్శన రూపక వ్యవసాయ క్షేత్రం కూడా ఏర్పాటుచేయడం జరిగింది. అందులో రైతులు అనుసరించడానికి అనువైన ఉత్తమ పద్ధతులను ఆచరణలో ప్రదర్శించారు. అదే సమయంలో నిర్వహించిన మరో క్షేత్రంలో సంప్రదాయక పద్ధతులలో సేద్యం చేసి, రెండు పద్ధతులలో సాధించిన ఫలితాలలో తేడాలను విశ్లేషిస్తూ రైతులకు మార్గనిర్దేశం చూపించారు. నిజానికి రెండు వేర్వేరు పొలాల్లో కనిపించిన ఫలితాలే వాటి వాటి ప్రయోజకత్వాన్ని నిర్ధారించాయి. ఈ ప్రయోగాత్మక సేద్య విధానాలలో మొక్కల ఎదుగుదల, వాటి పరిపక్వత, అంతిమ పక్వత వంటి అంశాలపై సమగ్రమైన రికార్డును వూఫర్ సేకరించింది. వాటి ఆధారంగా దిగుబడిని అంచనా వేసింది. వూఫర్ పనితీరు గురించి పీతర్ వివరిస్తూ ‘ఇలా సమగ్రమైన వివరాలను సిద్ధం చేయడం వల్ల పంట సాగులో ఏ దశలో ఏయే ప్రక్రియ ఏ స్థాయిలో ఎంత మేరకు ఉపయోగకరంగా ఉంటున్నదో గమనించడానికి అవకాశం దొరికింది. రెండు పద్ధతుల్లో సాగు ఫలితాలను బేరీజు వేయడానికి ఇలా భద్రం చేసిన రికార్డులు చాలా ఉపయోగపడ్డాయి.’ అని చెప్పారు.

వూఫర్ సలహాసూచనల మేరకు అనుసరించిన ఉత్తమ పద్ధతుల ద్వారా టమోటా సాగును 2019లో మొట్టమొదటి సారిగా ఆయన చేపట్టాడు.  సమయంలో టమోటా మొక్కలు వాలిపోకుండా ఉండేందుకు కర్రలను ఊతంగా అమర్చే పద్ధతిని ఆయన అనుసరించాడు. ఇలా చేయడం వల్ల మొక్కలు నిటారుగా ఎదుగుతాయి. వాలిపోకుండా ఉంటాయి. పండ్లు కుల్లిపోకుండా ఉంటాయి. మొత్తం మీద ఆ పంట కాలంలో ఆయన టమేటాల విక్రయం ద్వారా రూ. 8000 ఆదాయం సంపాదించాడు. వాటిని సాగు చేయడంలో దశపర్ణి ఆర్క్, నీమాస్త్ర, అమృతపాణి వంటి ప్రకృతి సిద్ధమైన ఎరువులను, క్రిమి నాశకాలను వినియోగించడంతో అవి రసాయన రహితంగా తియ్యటి రుచిని సంతరించుకున్నాయి.

కోవిడ్ విజృంభణ సమయంలో అంటే 2020లో జిల్లా యావత్తూ కోవిడ్ కారణంగా అల్లకల్లోలమైనప్పటికీ పీతర్ మాత్రం ప్రశాంతంగా తాను పండించిన టమేటాలను, ఉల్లి పాయలను విక్రయించుకోవడంలోనే బిజీగా గడిపేశాడు.

తరువాతి కాలంలో శ్రీ వరి సాగు ను పెద్ద ఎత్తున చేపట్టేందుకు వీలుగా రైస్ ఇంటెన్సిఫికేషన్ సిస్టమ్ అనుసరించి 2020-21 ఖరీఫ్ కాలంలో వరి సాగు మొదలుపెట్టాడు. రబీ సీజన్ లో ఆయనకు కొన్ని స్ప్రింక్లర్లను సహాయంగా అందించారు. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఆ సమయంలో స్ప్రింక్లర్ సెట్ కోసం పీతర్ రూ. 2000 ఖర్చుచేశాడు. దానిని వినియోగించే విషయంలో కూడా ఆయనకు సమగ్రమైన శిక్షణ లభించింది. మొత్తం మీద సత్ఫలితాలను సాధించగలిగాడు. కంట్రోల్ పద్ధతిలో సాగుచేసిన భూమిలో ఎకరాకు రూ. 1700 విలువ చేసే దిగుబడి సాధించాడు. అదే కమాండ్ పొలంలో ఎకరాకు రూ. 2000 విలువ చేసే దిగుబడి లభించింది. అంటే 18 శాతం అదనంగా దిగుబడి వచ్చింది. ఆ తరువాత నుంచి ఆయన ఉల్లి, టమేటా కూడా పండించి రూ. 8530 వరకు లాభాలు సంపాదించాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఏనాడూ రబీ సాజన్ లో పంట సాగు కోసం అడుగు ముందుకు వెయ్యని ఒక రైతు అదే సీజన్ లో సాగు చేసి రూ. 8000 లాభాలు సంపాదించాడు.

ఇప్పుడు ఆయన తన పొలంలో రెండవ పంటగా సన్ ఫ్లవర్, స్వీట్ మొక్క జొన్న, కూరగాయలు, మిరప కాయలు, కాలీ ఫ్లవర్, వంకాయలు, కాకర కాయలు, బీర కాయలు, ఉల్లిపాయలు వంటివి సాగు చేసేందుకు సిద్ధమవుతున్నవాడు. ‘ఇప్పుడు పనిలేక ఇబ్బందులు పడడం కానీ, మరోచోటికి వెళ్లి ఉపాధి వెతుక్కోవలసిన అవసరం కానీ నాకు ఎదురు కావడంలేదు. టమేటాస ఉల్లి, ఇతర కూరగాయలను పండించడం ద్వారా తగినంత రాబడి సాధిస్తున్నాను. వరి సాగు, ఇప్ప గంజల సేకరణ, జీడి గింజల సేకరణలోనే రోజంతా గడిచిపోతోంది.’ అంటున్నారు పీతర్. అంతేకాకుండా ఇరుగు పొరుగు రైతులకు సేంద్రీయ ఎరువులు వంటి వాటిని విక్రయించగలుగుతున్నారు.

తాను నేర్చిన మెళకువలను ఇతరులకు కూడా తెలియజేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నారు. ఆసక్తి ఉన్న వాళ్లకి వాటిని నేర్పిస్తున్నాడు. పీతర్ ఆసక్తి, పరిసరాలలో రైతులు చూపిస్తున్న ఆసక్తిని గుర్తించిన వూఫర్ సంస్థ తమ ప్రచార కార్యకర్తగా ఆయన సేవలను ఉపయోగించుకుంటోంది. వలస జీవి స్థాయి నుంచి స్వతంత్ర వ్యవసాయదారుడుగా పీతర్ మార్పు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం.

 

హర్షల్ ఖాడే
కమ్యూనికేషన్స్ ఆఫీసర్
వాటర్ షెడ్ ఆర్గనైజేషన్ ట్రస్టు (వూఫర్)
ది ఫోరమ్, 2వ ఫ్లోర్
పూణే, సతారా రోడ్డు, పద్మావతి కార్నర్
రాంగా జ్యువెలర్స్ (ఎగువన) పూణే – 411009
మహరాష్ట్ర

E-mail: harshal.khade@wotr.org.in

ఆంగ్ల మూలం: 
లీసా ఇండియా సంపుటి ౨౪, సంచిక 3 , సెప్టెంబర్ ౨౦౨౨

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...