భాస్కర్ సావె – సహజ సేద్య రంగంలో గాంధేయ వాది

దివంగత భాస్కర్ సావె సహజ సేద్య రంగంలో మహాత్మా గాంధీతో సరిసమానుడిగా గుర్తింపు పొందినవాడు. ఆయన మూడు తరాలకు స్ఫూర్తినిస్తూ పెద్ద సంఖ్యలో రైతులను సేంద్రీయ సేద్యం వైపు ప్రోత్సహించడంలో ప్రముఖ  పాత్ర వహించారు. ప్రకృతి సహజ లక్షణాలను, వాటితో ఉన్న అత్యంత సహజ సిద్ధమైన సాన్ని హిత్యం సాధించిన్న సావె తన అవగాహన మేరకు సేద్య విధానాలకు, సేద్య రంగానికి సంబంధించిన బోధనల్లో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన తన అనుభవాలను ఆసక్తి ఉన్న ఇతరులతో పంచుకుంటూ ఆనందించేవారు. ఆయన సేవా దృక్పథం గమనించిన తరువాత 2010లో అంతర్జాతీయ స్థాయి సేంద్రీయ సేద్య ఉద్యమాల ఫెడరేషన్ (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ మూవ్ మెంట్స్ – IFOAM) ప్రపంచ జీవన సాఫల్య అవార్డునిచ్చి సత్కరించింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సేంద్రీయ విధానాల్లో సాగు చేస్తున్నరైతులందరికీ ప్రాతినిథ్యం వహిస్తుంది.

గుజరాత్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా ప్రాంతంలోని వల్సాడ్ జిల్లాలోని డెహ్రీ గ్రామంలో భాస్కర్ సావె 14 ఎకరాలకు ఆసామీ. ఆయన వ్యవసాయ క్షేత్రానికి ఆయన కల్ప వృక్ష అని పేరు పెట్టుకున్నారు. అందులో 10 ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి చెట్లు, సపోటా చెట్లు, మరికొన్ని పండ్ల చెట్లతో పేద్ద తోట గా నిర్వహిస్తున్నారు. మరో రెండు ఎకరాలను పంటల కాలాన్ని బట్టి వివిధ రకాలైన పంటలను సాగు చేస్తుంటారు. సంప్రదాయక పంట మార్పడి పద్ధతిలోనే ఆయన సేంద్రీయ విధానాలనే అనుసరిస్తూ పంటలు పండిస్తుంటారు. మిగిలిన రెండు ఎకరాలలో నర్సరీ రూపంలో కొబ్బరి మొక్కల పెంపకానికి కేటాయించారు. ఆ ప్రాంతంలో కొబ్బరి మొక్కలకు గిరాకి చాలా హెచ్చుగా ఉంటుంది. ఆయన వ్యవసాయ క్షేత్రం అన్ని అంశాలలోనూ అంటే దిగుబడి, పోషక విలువలు, రుచి, జీవ వైవిధ్యం, పర్యావరణ ఆనుకూల్యత – సుస్థిరత, నీటి వనరుల వినియోగంలో పొదుపు, ఇంధన వినియోగంలో మెరుగైన  సామర్థ్యం, ఆర్థికంగా లాభదాయకంగా ఉండడంలో అగ్రస్థానంలో ఉంటుంది. ముఖ్యంగా రసాయనాలను వినియోగించే ఇతరుల పొలాలతో పోలిస్తే సావె అద్భుత ఫలితాలు రాబట్టగలిగారు. ఇక సేద్య వ్యయం విషయంలో (ప్రధానంగా లేబర్ ఖర్చులు) చాలా చాలా తక్కువే. బయటి మార్కెట్ నుంచి సమకూర్చుకావలసిన ఇన్ పుట్స్ స్థాయి దాదాపు సూన్నాయే.

 ‘కల్పవృక్ష’ లో సహజ వనరులకు కొరత లేదు

వ్యవసాయ క్షేత్రంలోకి అడుగు పెట్టిన వెంటనే ఆకట్టుకునేది అక్కడ వేలాడదీసి ఉంచిన ఒక బోర్డు. దానిపై ‘సహకారమే ప్రకృతి నియమం’ అని రాసి ఉంటుంది. చాలా తక్కువ మాటల్లో ఆయన తనదైన సిద్ధాంతాన్ని, ఆచరణ మార్గాన్ని ఆయన ఇందులో స్పష్టంగా ప్రకటించారు. ఇలాంటి బోర్డులు లోపలికి వెళ్లే కొద్దీ మరెన్నో కనిపిస్తాయి. అన్నీ కొద్ది మాటల్లోనే ఉంటాయి. అద్భుతమైన ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి గురించి, వ్యవసాయం గురించి, ఆరోగ్యం గురించి, సంస్కృతి గురించి, ఆధ్యాత్మికత గురించి వాటిలో అమూల్యమైన సూత్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. రైతు బిడ్డగా పుష్కలంగా ఆహారం సంపాదించడమే కాకుండా సంవత్సరాల తరబడి ఆయన వేసిన ముందడుగుల ఔన్నత్యాన్ని అవి ప్రతిఫలిస్తాయి.

కల్ప వృక్ష క్షేత్రం అధిక దిగుబడులకు కూడా గుర్తింపు సంపాదించుకుంది. ఆధునిక రసాయనాలను వినియోగించిన పొలాలతో పోలిస్తే ఇక్కడ చాలా హెచ్చు దిగుబడి సాధ్యమవుతోంది. ఆ విషయం  ఎల్లవేళలా స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ పెంచుతున్న కొబ్బరి చెట్లలో దేనికి కాసిన కొబ్బరి కాయల సంఖ్యను చూసినా కూడా దేశంలోనే అత్యధికంగా ఉంటున్నది. కొన్ని చెట్లు ఏడాది కాలంలో ఏకంగా 400కు పైగా కాయలనిస్తున్నాయి. సగటు లెక్కిస్తే కనీసం 350 కంటే తక్కువ ఉండదు. ఇక సపోటా విషయానికి వస్తే వాటిని పెంచడం ప్రారంభించి ఇప్పటికి 45 ఏండ్లు దాటిపోయింది. అయినా, ఒక్కో చెట్టు నుంచి ఏడాదికి 300 కిలోల సపోటా దిగుబడి వస్తోంది.

కల్ప వృక్ష ఆవరణలోని తోటలో అరటి, బొప్పాయి, ఆరెకా నట్స్ (పోక),  వివిధ రకాల నిటారుగా పెరిగే చెట్లు, ములక్కాడ, మామిడి, జాక్ ఫ్రూట్ (పనస), తాటి, కస్టర్డ్ ఆపిల్, జాంబుల్ (నేరేడు), జామ, దానిమ్మ, నిమ్మ, పొమెలో (పంపర పనస), చింత, వేప, ఔదుంబర్ (రావి) చెట్లు విరివిగా కనిపిస్తాయి. ఇంకా వెదురు, కరివేపాకు, క్రోటన్స్, తులసి, మిరియాలు, తమలపాకులు, ప్యాషన్ ఫ్రూట్ మొక్కలు సమృద్ధిగా ఉన్నాయి.

స్థానికంగా అధిక దిగుబడినిచ్చే వరి రకాలలో నవాబీ కోలం పేరుతో పొడుగాటి గింజ ఉండే వరి రకం, వివిధ రకాల పప్పు  ధాన్యాలు, శీతాకాలంలో సాగుచేసే గోధుమ, కొన్ని కూరగాయలను, దుంపలను కూడా ఆయన సీజన్ వారీగా పండిస్తారు. అందు కోసం 2 ఎకరాలను ప్రత్యేకంగా కేటాయించారు. వీటిని సాగుచేయడం ద్వారా కుటుంబానికి, అప్పుడప్పుడు వచ్చే అత్మీయులకు అవసరమైన పోషక  ఆహారం సమృద్ధిగా లభిస్తుంటుంది. కొన్ని సంవత్సరాలలో వరి మిగిలిపోతుంటుంది. అలాంటి బియ్యాన్నిబంధు, మిత్రులకు పంచిపెడుతుంటారు. వాటి నాణ్యత, రుచి అందరి మెప్పును పొందుతోంది.

విభిన్నమైన మొక్కలతో జీవ వైవిధ్యానికి సాక్షీరూపంగా కనిపిస్తుంది భాస్కర్ సావె పెంచి పోషిస్తున్న కల్ప వృక్ష క్షేత్రం. అన్ని రకాలూ అందులో కనిపిస్తాయి. దట్టంగా అలముకున్న ఆహార ఉత్పాదనల సమాహారంగా ఉంటుంది. మొక్క అన్నది లేని జాగా అంగుళం మేరకు కూడా కనిపించదు. అంటే సూర్యుడికి, గాలికి, వర్షపు  నీటికి చోటు ఉండదు. అక్కడ పెరుగుతున్న చేకూ చెట్లు చల్లటి నీడనివ్వడమే కాకుండా వాటి ఆకులు అలములతో నేలపై పచ్చటి పరుపు పరిచినట్లుగా మెత్తగా ఉంటుంది. ఎక్కడైనా కాస్త సూర్యరశ్మి చేరితే అక్కడి నుంచి వివిధ రకాలైన సూక్ష్మ క్రిములు కదలికలు గమనించవచ్చు.

ఇలా నేలపై పరిచినట్లున్న ఆకులు అలముల కారణంగా ఆయన పొలంలోని మట్టి అతి సూక్ష్మ క్రిములతో సహజాతిసహజంగా భూసారాన్ని నిరంతరం మెరుగుపరుస్తుంటాయి. ఇలాటి వాతావరణం వ్యవసాయంలో చాలా కీలకమైనదని ఆయన అంటారు. ‘మండిపోతున్న ఎండా కాలంలో కూడా మొక్కల నుంచి, చుట్టూ ఉన్న చెట్ల నుంచి వచ్చే చల్లటి గాలి కారణంగా నేల పైభాగం చల్లగానే ఉంటుంది. అక్కడ ఎంతో కొంత తేమ నిలిచి ఉంటుంది. ఇక వణికించే చలి రోజుల్లో నేలపై పరిచి ఉన్న ఆకులు అలముల వల్ల అక్కడ వెచ్చటి దుప్పటిని పరిచినట్లు వెచ్చగా ఉంటుంది. ఇక గాలిలో తేమ కూడా చుట్టూ ఆవరించి ఉన్న దట్టమైన మొక్కల కారణంగా,  నిలిచి ఉంటుంది. ఫలితంగా నీటి వనరుల అవసరం తగ్గిపోతుంది. అక్కడి మట్టిలో పెరిగే సూక్ష్మజీవులు భూసారాన్ని కాపాడుతూ, మనకు నిజమైన మిత్రుడిగా ఉపయోగపడతాయి.’ అంటారు సావె.

మొత్తం మీద 10 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఆయనకు సగటున 15,000 కిలోల ఆహార పదార్థాలను ఏటా అందిస్తున్నాయి. (అయితే గత 15-20 ఏళ్లలో ఈ సగటు కొంత తగ్గుతోంది. కారణం పరిసరాలలో విస్తరిస్తున్న పారిశ్రామికీకరణే.) పోషక విలువల విషయానికి వస్తే, పంజాబ్, హర్యానా, మరి కొన్ని రాష్ట్రాలలో రసాయనాల వినియోగం ప్రధానంగా పండించిన పంటతో పోలిస్తే ఎన్నో రెట్లు ఉత్తమ నాణ్యతతో లభిస్తాయి.

దుక్కి దున్నడం, భూసారం పెంపు కూడా ప్రకృతి ప్రసాదమే

వ్యవసాయ రంగంలో వానపాముల ప్రత్యేకత వేరే చెప్పనక్కరలేదు. బహుశా ప్రపంచం మొత్తం మీద, మరే ఇతర జీవి వీటితో సమానంగా వ్యవసాయానికి సహాయం చేసి ఉండదు. అదే విషయాన్నిసావె దృవీకరిస్తూ, తన పంట పొలంలో వానపాములు సహజసిద్దంగా వృద్ధి పొందడానికి ఏ రైతు తోడ్పడతాడో, ఆ రైతు ఇంట ధాన్య లక్ష్మి సుస్థిరంగా నిలిచి ఉంటుందని అభిప్రాయం వ్యక్తంచేశారు.  మరి కొన్ని జీవాలు కూడా రైతుకు సహాయకారిగా ఉంటాయి. అలాంటి వాటిలో చీమలు. చెదలు, మరెన్నో సూక్ష్మ జీవాలు మట్టిని తిరగదోయడంలో తోడ్పడడమే కాకుండా, మొక్కలకు అత్యవసరమైన పోషకాలను ఎప్పటికప్పుడు పైకి చేరుస్తూ వాటికి రక్షణ ఇస్తుంటాయి. ఇలాంటి జీవ సంతతి కల్ప వృక్ష క్షేత్రంలో పుష్కలంగా కనిపిస్తుంది.

ఆధుననిక సేద్య విధానం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మట్టికి బంగారంలా ఉపయోగపడవలసిన జీవసంతతిని ఆధునిక సేద్య పద్ధతులు నాశనం చేస్తున్నాయి. అదిక దిగుబడి లక్ష్యంగా మొక్కలకు లేని పోషకాల కొరతను సృష్టించి, నాసి రకం దిగుబడి పొందుతున్నాం అంటారు సావె. మార్కెట్ నుంచి తెప్పించుకున్న ఇన్ పుట్లకు పెద్ద మొత్తం ఖర్చు చేయవలసి వస్తోంది. ఇక లేబర్ ఖర్చు నిత్యం పెరిగిపోతోంది. ఈ దుష్ఫలితాలకు ఆధునిక సేద్య విధానాలే కారణమని ఆయన భావిస్తారు. సజీవమైన పంటపొలం అంటే సేంద్రీయ సమతూకం సంపాదించుకోవడమే అని ఆయన చెబుతారు. ఈ జీవ ప్రక్రియను సజీవంగా కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచిస్తున్నారు. అప్పుడే ప్రకృతి సహజమైన సేద్యం సాధ్యమవుతుంది.

కలుపు చెరుపు కాదు – సేద్యానికి హితం

‘ప్రకృతిలోని ప్రతీ జీవి లేదా మొక్క పర్యావరణ పరిరక్షణలో తన వంతు పాత్ర నిర్వహిస్తుంది. మానవాళికి ఆహారం సమకూర్చడంలో ప్రతీది ప్రయోజనకరమే.’

పంటలకు ప్రమాదంగా మారిన కలుపు మొక్కల సమస్యకు మిశ్రమ పంటల సాగు, పంటల మార్పిడి అన్న మార్గాలు సరైన పరిష్కారాలు. రసాయనాలకు, లోతుగా దున్నే విధానానికి స్వస్తి చెప్పాలి. ఎందుకంటే, సమస్యగా కనిపించే కలుపు భూసారం పెరిగే కొద్దీ అదంతట అదే అదృశ్యమైపోతుంది. భూమి ఆరోగ్యవంతంగా మారితే కలుపు మొక్కలకు చోటు ఉండదు. అయినా భూమి ఆరోగ్యం మెరుగుపడే క్రమంలో కొంత కాలం వాటి సమస్య తప్పకపోవచ్చు. ముఖ్యంగా పూత పూసే సమయంలో. ఆ సమయంలో ముందుగానే వాటిని కత్తిరించివేయడమే పరిష్కారం. అలా కత్తిరించిన కలుపునే నేలపై మూడు లేక నాలుగు అంగుళాల మందంతో నేలపై మెత్తటి పరుపులా పరచి ఉంచినట్లయితే, పంటకు మేలే జరుగుతుంది. మట్టిలో కూరుకుపోయిన కలుపు విత్తులు సూర్యరశ్మి లేని కారణంగా మళ్లీ పెరగలేవు.

వ్యవసాయదారులు మళ్లీ సేంద్రీయ సేద్యం దిశగా అడుగులు వేసినట్లయితే, ఏళ్లు గడిచే కొద్దీ వారి వ్యవసాయ భూములలోని భూసారం మెరుగు పడుతూ వస్తుంది. అదే సమయంలో పంట పెరుగుదల మెరుగవుతుంది. కలుపు సమస్య తగ్గిపోతుంది. కేవలం రెండు మూడేళ్ల కాలంలో కలుపు తీత అవసరమే ఉండదు. అప్పటి వరకు మాత్రం రైతు కలుపు ఏరివేస్తూ, వాటి వ్యర్థాలను పొలంలోనే వదిలివేస్తూ ఉండాలి.

కలుపు మొక్కలను నేలకు సమానంగా కోసివేస్తూ, వాటి మొదళ్లను లేదా లోపలి వేళ్లను మాత్రం నాశనం చేయరాదు. ఇలా పీకివేసిన కలుపు మొక్కలను అక్కడే పొలంలో పై పొరగా వదిలేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. ఇది ఎన్నో విధాలుగా, నేలకు మేలు చేస్తుంది. అవి కుళ్లి నశించే క్రమంలో మట్టిలోని తేమ లేదా గాలి స్థిరంగా ఉంటుంది. వాటికి కొరత ఉండదు. మట్టి గడ్డ కట్టుకుపోయే పరిస్థితి తగ్గుతుంది. తేమ ఆవిరైపోకుండా నిలుస్తుంది. అంటే నీటి వాడకం అవసరం తగ్గిపోతుంది. మట్టిలో వాయు ప్రసరణ సాఫీగా సాగుతుంది. తేమను పీల్చుకునే శక్తి పెరుగుతుంది. ఎండ వేడి, శీతా కాలపు చలి గాలుల నుంచి మట్టికి రక్షణ ఎక్కువవుతుంది. ఇలా వదిలేసిన కుళ్లిపోయిన ఆకులు అలముల కారణంగా మట్టిలో జీవించే వానపాములు, ఇతర సూక్ష్మ క్రిములకు సమృద్ధిగా ఆహారం అందుతుంది. ఆ రకంగా పంటలకు అన్ని విధాలా ఆరోగ్యదాయకమైన పోషకాలు లభిస్తాయి. కలుపు మొదళ్లను అలాగే వదిలివేసిన కారణంగా, మట్టి పటిష్టంగా నిలిచి ఉంటుంది. తనకు తానుగా మట్టి పై పొరలపై కలుపు చెత్త ఉపయోగపడినట్లే అవి లోపలి పొరల్లో సేంద్రీయ ఎరువులుగా ఉపకరిస్తాయి.

————————————————————————————————————————————————

ప్రకృతిబద్ధమైన సేద్య సూత్రాలు

‘ప్రకృతి సిద్ధమైన సేద్యానికి నాలుగు సూత్రాలు ఉన్నాయంటారు భాస్కర్ సావె. మొదటిది – సృష్టిలోని ప్రతి జీవికీ జీవించే హక్కు ఉంది. ఆ హక్కును గౌరవించడమే వ్యవసాయంలో పాటించవలసిన మొదటి సూత్రం.’

రెండవది – ప్రకృతిలో లభించే ప్రతి ఒక్కటీ ప్రయోజనకరమే. జీవరాశుల జీవితగమనంలో ఏదో ఒక ప్రయోజంనం అందిస్తాయి.

మూడొవది – వ్యవసాయం అనేది ఒక ధర్మం. ప్రకృతికి సేవచేసేందుకు, తోటి జీవుల మనుగడకు తోడ్పడేందుకు బాధ్యతాయుతంగా అనుసరించి తీరవలసిన విధి అది. అంతే కాని దానిని డబ్బు కోసం ఒక వ్యాపార కార్యక్రమంగా లేదా పరిశుద్ధమైన ప్రకృతి పేరుతో కలుషితం చేయడం కానీ భావ్యం కాదు. దూరదృష్టి లేకుండా ఇంకా ఇంకా సంపాదించాలనే ఆలోచనతోనే ముందుకు వేెళ్లడం సరికాదు. ఆ ప్రయత్నంలో ప్రకృతి సూత్రాలను విస్మరించకూడదు. ప్రకృతి సూత్రాలను పాటించినప్పుడే మనకు ఎదురవుతున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

—————————————————————————————————————————————————

ఇక చివరిది – భూసారాన్ని శాశ్వతంగా సమకూర్చుకోవడం అనేది చాలా ప్రధానమైన అంశం. భూమి నుంచి మనకు లభిస్తున్న పండ్లు, కాయలు, ఇతర పంటలపై మనకు మాత్రమే అధికారం ఉంది అనుకోవడం సరి కాదు. నిజానికి ఈ రకంగా లభించే బయో మాస్ భూగోళం మొత్తం మీద లెక్కించినా కూడా 5 నుంచి 15 శాతం మాత్రమే. మిగిలినది అంతా  అంటే 85 నుంచి 95 శాతం వరకు వాటి వ్యర్థాలే. వాటిని తిరిగి ప్రకృతికి అందించవలసిన బాధ్యత మనపైనే ఉంది. అలా ఆ వ్యర్థాలను తిరిగి మట్టికి చేర్చగలిగితే భూసారం క్రమంగా మెరుగవుతుంది. స్థిరంగా నిలిచి ఉంటుంది. అది నేరుగా చెతత రూపంలో కానీ, పశుపక్ష్యాదుల వ్యర్థాల రూపంలో కానీ తిరిగి నేల తల్లికి చేరాల్సిందే. ఈ సూత్రాలను ఖచ్చితంగా పాటిస్తే, భూసారం సుస్థిరంగా కలకాలం నిలిచి ఉంటుంది.

———————————————————————————————————————————————- ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే, కలుపుతీత, నరికేసిన వాటిని కుళ్లబెట్టడం అన్న రెండు ప్రక్రియలను కలుపు పూత దశకు చేరుకోకముందే పూర్తి చేయాలి. అలా పూత పూసే దశకు చేరినా, లేక  పరాగసంపర్క (పోల్లినేటెడ్) దశకు చేరినా నష్టం తప్పదు. రైతు ఆలస్యం చేసినట్లే. ఎందుకంటే ఆ దశకు చేరిన తరువాత వాటిని తీసివేసినా, పూర్తి పొల్లినేటె్ అయిన విత్తనాలు మట్టిలోకి చేరిపోతాయి. కొత్త కలుపు మొక్కలు పెరుగుతాయి.

ఏమీ చేయొద్దా?

ఆధునిక వ్యవసాయ విధానాలతో పోలిస్తే సేంద్రీయ సేద్యంలో నిరంతరం కార్మికశక్తి ఉపయోగించవలసిన అవసరం చాలా తక్కువగా ఉంటుంది. అయితే నిత్యం జాగురూకతతో వ్యవహరించడం మాత్రం తప్పనిసరి. అందుకే జన వాడుకలోకి వచ్చిన వచ్చిన పదబంధం చాలా ప్రాముఖ్యం ఉన్న అంశం. ఇంతకీ ఆ పదం ఏమిటంటే – రైతు పాదాలు పడిన చోటే మొక్కలకు అవసరమైన అన్ని పోషకాలు అందుబాటులోకి వస్తాయి. దీని అర్థం రైతు ఎంత నిశితంగా తన మొక్కలను గమనిస్తూ ఉంటాడో వాటి ఎదుగుదల అంత సజావుగా సాగిపోతుంది. క్రమంగా రైతు తిరగాడిన చోటల్లా మొక్కలు, అక్కడి మట్టి ఆరోగ్యం సంతరించుకున్నట్లయితే, ఆ మేరకు రైతుకు శ్రమ తగ్గిపోతుంది. ువాత రైతు తన పొలంకేసి చూడనక్కరలేదు. సకాలంలో పంట కోసుకోవడం తప్ప. కొబ్బరి చెట్ల విషయంలో సాహె పంటను కోసుకునే అవసరం కూడా లేకుండా చూసుకుంటున్నారు. ఎలా అంటే చెట్టున ఉన్న కాయ పక్వమై తనకు తానుగా నేలకు రాలే వరకు ఆయన ఓపిగ్గా ఎదురు చూస్తారు. వాటిని సేకరించడం ఒక్కటే ఆయన చేపట్టే కార్యక్రమం.

పంటలుగా సాగు చేయవలసిన వరి, గోధుమ, పప్పు ధాన్యాలు, కూరగాయల వంటి వాటి విషయంలో ఆయా సీజన్ లలో కొద్ది మాత్రం శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. అందుకే తాను సాగు చేసే విధానం గురించి మాట్లాడుతూ, సేంద్రీయ సేద్యం అనేది ‘ప్రకృతి సహజ పద్ధతిలో సేద్యం అంటే ఏమీ చేయకుండా ఉండడమే’ అంటారు సాహె. ీ సూత్రం ప్రధానంగా చెట్లు, లేక పూర్తిగా పక్వ దశకు చేరుకున్న వాటి విషయంలో మాత్రమే వర్తిస్తుంది. పంటలను సాగు చేయడంలో మాత్రం రైతు ప్రమేయం సాధ్యమైనంత తక్కువగా ఉండాలని ఆయన గట్టిగా విశ్వసిస్తారు. ప్రకృతి సామర్థ్యంపై నమ్మకంతో తన జోక్యం లేకుండా చూసుకోవడమే రైతు చేయవలసిన కర్తవ్యం.

సేద్యంలో అయిదు ప్రధాన సమస్యలు

తాను అనుసరించే ప్రకృతి సహజమైన సేద్యానికి సంబంధించి అయిదు ప్రధానమైన అంశాలను సాహె చాలా గట్టిగా గుర్తుచేస్తున్నారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా రైతులు అందరూ వాటిపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. వాటిని క్లుప్తంగా చెప్పాలంటే – దుక్కి దున్నడం, ఎరువుల పోషణ, కలుపుతీత, నీటి వసతి కల్పన, పంటల సంరక్షణ.

దుక్కి దున్నడం –

చెట్ల పెంపకం విషయంలో మొక్కల నాటడానికి లేదా విత్తనాలు చల్లడానికి ముందు మాత్రమే అదీ, ఒక్కసారి చేపట్టాలి. అలా చేయడం వల్ల మట్టి గుల్లబారుతుంది. మొక్కలను నాటిన తరువాత, మట్టిలో వాయు ప్రసరణ, నీటి పారుదలకు సంబంధించిన అంశాలను పూర్తిగా అయా ప్రాంతాలలో మట్టిలోనే నివసించే సూక్ష్మజీవాలకు, క్రిములకు, కొన్ని మొక్కల వేళ్లకు వదిలేయాలి.

ఎరువుల పోషణ

భూసారం స్థిరంగా నిలవాలంటే పంట చేల చెత్తాచెదారాన్ని, ఇతర బయో వ్యర్థాలను పొలంలోనే ఎరువుగా ఉపయోగించడం  వల్ల ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. అలా పొలంలోనే పోగయ్యే వ్యర్థాలకు తగినంతగా లభించడం లేదనుకుంటే, బయటి నుంచి వాటిని తీసుకువచ్చి కూడా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఏ పరిస్థితిలోనూ రసాయనిక ఎరువులను ఉపయోగించరాదు.

కలుపుతీత

కలుపు ఏరివేత అనే ప్రక్రియనూ పూర్తిగా విడిచిపెట్టేయాలి. పంటల పెరుగుదల స్థాయి కన్నా కలుపు పెరుగుదల ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే, కలుపు ఏరివేయాలి. అలాగే వాటి పెరుగుదల కారణంగా, మొక్కలకు అవసరమైన సూర్యరశ్మి కూడా అందకుండా ఉండే పరిస్థితిల్లో కూడా వాటిని పీకివేయాలి. అలా పీకివేసిన వాటిని తిరిగి ఆ మొక్కల సమీపంలోనే కుళ్లిపోయేందుకు వదిలేయాలి. అంతేకానీ, క్లీన్ కల్టివేషన్ పేరుతో వాటిని వేళ్లతో సహా పెకిలించి వేయరాదు. క్రిమి సంహారకాలను కూడా ఎట్టి పరిస్థితిలోనూ ఉపయోగించరాదు.

నీటి పారుదల వ్యవస్థ

నీటిని చాలా పొదుపుగా ఉపయోగించాలి. మట్టిలో తేమ లివడానికి అవసరమైనంత మేరకే నీరు అందించాలి. పూర్తిగా పొరలు పొరలుగా పచ్చి ఆకులు, అలములు పరిచి, వాటిని కుళ్లనివ్వడం చాలా ఉత్తమ మైన మార్గం. అలా చేస్తే నీటి అవసరం కూడా చాలా తగ్గిపోతుంది.

పంటల సంరక్షణ

సస్య రక్షణ బాధ్యతను పూర్తిగా ప్రకృతికే వదిలేయడం చాలా మంచిది. ప్రకృతి ప్రసాదించిన జీవాలే హానికర జీవాలనుంచి పంటకు రక్షణ లభిస్తుంది. ఆరోగ్యప్రదమైన పోలీ-కల్చర్ విధానం, సేంద్రీయ పద్ధతుల్లో ఆరోగ్యవంతమైన మట్టిలో పండించిన పంటలకు సహజంగానే చీడపీడల నివారణ శక్తి అధికంగా ఉంటుంది. ఒకవేళ కొద్దిగా చీడ సోకినా నష్టం చాలా పరిమితంగానే ఉంటుంది. వాటి తాకిడి అవి స్వయంగా నియంత్రించుకోగలుగుతాయి. తప్పనిసరి అయితే, రసాయనాలతో సంబంధం లేని జీవ సంబంధిత క్రిమి నాశకాలు వేప, దేశీ ఆవుల మూత్రాన్ని నీళ్లతో కలిపి కాని, అలాంటివి ఉపయోగించవచ్చు. క్రమంగా అవి కూడా అవసరం ఉండదు.

ఈ రకంగా పూర్తిగా సేంద్రీయ సేద్య విధానాలను అనుసరిస్తే, రైతులకు ఆధునిక సేద్య విధానంలో తలకు మించిన భారంగా మారిన అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. భూమి తనకు తానుగా శక్తిని పుంజుకుంటుంది.

‘అహింస అనే సూత్రం , సాంస్కృతిక, ఆధ్యాత్మిక పరిణామ క్రమంలో మాత్రమే కాదు ప్రకృతి సహజమైన సేద్య పద్ధతుల ద్వారా కూడా సాధింవచ్చు’ అంటారు భాస్కర సావె.

చివరిగా భాస్కర సావె చెప్పే మాట ఒక్కటే – పేంద్రీయ సేద్యానికి అన్నపూర్ణ ఆశీర్వాదం సదా ఉంటుంది. సదా పూర్ణ పుష్కలంగా ఆహారం అందజేస్తుంది.

ఈ వ్యాస సారాంశాన్ని భరత్ మన్సాతా రాసిన పుస్తకం ‘ది విజన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్’ నుంచి సేకరించినది. ఇందులో 277 పేజీలు ఉంటాయి. ఎర్త్ కేర్ బుక్స్, www.earthcarebooks.com

—————————————————————————————————————————————————-

భరత్ మాన్సాతా
E-mail: bharatmansata@yahoo.com

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి ౨౩, సంచిక 3, సెప్టెంబర్ ౨౦౨౧

 

 

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...