పోషకాల ఉద్యానాలు – మహిళలే సూత్రధారులు

తమిళనాడు రాష్ట్రంలోని వర్షాధారిత ప్రాంతమైన ధర్మపురి పరిసరాల్లో మహిళలు పెరటి తోటల పెంపకం వైపు తమ దృష్టిని, కృషిని మళ్లిస్తున్నారు. వారి చొరవ కారణంగా వారి కుటుంబాలకు ఇప్పుడు పోషక విలువలు సమృద్ధిగా ఉన్న ఆహారం లభిస్తోంది. మరింతగా ఆదాయం లభిస్తోంది. అందుబాటులో పరిమితమైన నీటి వనరులను సక్రమంగా వినియోగించడంతో పాటు పునర్వాడకంలో చూపిస్తున్న నేర్పు ఏడాది పొడవునా కాయగూరలను పండించడం సాధ్యమవుతోంది.

తమిళనాడులోని ధర్మపురి జిల్లా, పెన్నగరం తూర్పు కనుమలకు పడమటి దిశగా ఉండి భౌగోళికంగా ఒక ప్రత్యేకతతో విశిష్ట లక్షణాలను కలిగి ఉంటుంది. కొండ ప్రాంతం కావడంతో కావేరీ ప్రవాహం నుంచి అంతగా ప్రయోజనాలు ఈ జిల్లావాసులకు లభించవు. నిత్యం నీటి కొరత ఇక్కడ పెద్ద సమస్యగా సాగు రంగాన్ని మాత్రమే కాకుండా తాగునీటికి కూడా కటకట పడవలసి వస్తూ ఉంటుంది.

వర్షపు నీటిపై ఆధారపడి వేరు శెనగ సాగు ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వ్యవసాయదారులు అంతర పంటలుగా కందులు, కౌ పీ (cow pea) సాగు చేస్తారు. ఈ పంటలు ఇక్కడి పేద ప్రజానీకానికి ఆదాయం చేకూర్చడమే కాక, వారి కుటుంబాలకు అత్యవసరమైన పోషకాహారం, పశువులకు మేత  అందించడానికి కూడా తోడ్పడుతున్నాయి. అయితే గడచిన రెండు దశాబ్దాలుగా రైతన్నలకు అనేక రకాల సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి – తరచుగా పంట దిగుబడి దెబ్బతినడం, అంతు లేకుండా సాగు ఖర్చుల భారం పెరిగిపోతూ ఉండడం, దిగుబడి ఆశించిన దానికన్నా చాలా తక్కువగా ఉండడం, చివరికి చేతికి అతి స్వల్ప మొత్తాలలోనే ఆదాయం లభించడంతో రైతన్నలు చాలా నిరాశానిస్పృహల్లో కూరుకుపోతున్నారు. రసాయనిక ఎరువుల వినియోగం అపరిమితంగా ఉండడంతో భూసారం క్షీణించిపోతోంది. పర్యావరణం దెబ్బతింటోంది. ఒక ఏడాది వర్షాల రాక అస్తవ్యస్తమైనట్లయితే, ఇక్కడి రైతులు జొన్న సాగు (finger millet) చేపడుతున్నారు. సాధారణంగా ఇలాంటి వర్షాధారిత ప్రాంతాలలో సాగుచేయడానికి ఇదే అన్ని విధాలా అనువైన పంట. అలాంటి క్షామపీడిత సంవత్సరాలలో రైతు కుటుంబాలకు, పశువులకు కూడా పోషక విలువలతో కూడిన ఆహారం ఏ మాత్రం లభించదు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ఎఎంఈ ఫౌండేషన్ పెరటి తోటల పెంపకం ప్రోత్సహించింది. ఆ రకంగా వారికి పోషక విలువలున్న ఆహారం సమకూరడానికి తన వంతు తోడ్పాటును అందిస్తోంది. ఎఎంఈ ఫౌండేషన్ ప్రోత్సాహం కారణంగా పెన్నగరం తాలూకాలోని 20 గ్రామాలలో పెరటి తోటల సాగు విస్తారంగా ఆయా గ్రామాల రైతు కుటుంబాలు చేపట్టాయి. ఈ కార్యక్రమాన్ని ధర్మపురి ఫార్మ్ ఇనీషియేటివ్ (DFI) లో భాగంగా చెన్నైకి చెందిన శ్రీవత్స రామ్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్నారు.

తొలి అడుగులు

వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ముందుగా రైతులందరినీ సమావేశపరచి వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం (PRA) జరిగింది. అందులో రైతులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారి నుంచి ప్రస్తుత పరిస్థితుల గురించి మాత్రమే కాక భవిష్యత్తు కోసం చేపట్టవలసిన చర్యల గురించి విస్తృతంగా చర్చించడం జరిగింది. వేరు శెనగ సాగును అభివృద్ధి చేయడం మట్టమదట చేపట్టవలసిన కార్యక్రమంగా గుర్తించారు. తరువాత పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహించవలసిన అవసరాన్ని గుర్తించారు.

ప్రారంభంలో 20 గ్రామాల నుంచి ఎంపిక చేసిన 25 మంది ఔత్సాహికులైన యువతులకు పర్యావరణ అనుకూల పద్ధతుల్లో వేరు శెనగా సాగు గురించి శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో భాగంగా, వారు ఇతరులకు ఈ విషయంలో సహకరించేందుకు వీలుగా అవసరమైన నైపుణ్యాలు పెంపొందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అందుకు ప్రత్యేకంగా రైతులకు క్షేత్ర స్థాయి శిక్షణ కేంద్రాలను (Farmer field schools) ఏర్పాటు చేసారు. ఇలా సుశిక్షితులైన మహిళలు

ఏఎంఈ సిబ్బంది, ఆ 20 గ్రామాలకు చెందిన రైతు శిక్షణ కేంద్రాల నిర్వహణలో పాల్గొన్నారు. మొత్తం మీద 400 మంది రైతులకు ఇలా శిక్షణ పొందారు. సుస్థిరమైన సాగు పద్ధతులలో వేరు శెనగ సాగులో వారు ఆయా పంటల కాలం యావత్తూ నైపుణ్యం పెంపొందించుకోగలిగారు.

పెరటి తోటల ఏర్పాటు

వేరు శెనగసాగులో సంతృప్తికరమైన ఫలితాలు సంపాదించుకున్న ఆ మహిళలంతా తమ కుటుంబానికి ఉపయోగకరమైన ఇతర అంశాలపై కూడా శ్రద్ధ చూపించారు. ఈ సమయంలోనే పెరటి తోటల ఆలోచన రూపు దిద్దుకుంది. ఆ విధంగా తమ కుటుంబంలోని ప్రతీ ఒక్కరికీ పోషక విలువలతో కూడిన ఆహారం సమకూర్చడం సాధ్యమవుతుందని గుర్తించి అందుకు ముందుకు వచ్చారు. మెళకువలు  నేర్చుకునేందుకు వారు ఉత్సాహం చూపించారు. ప్రత్యేకంగా సేద్యపు పనులు లేని సమయాలలో ఇలాంటి కొత్త విషయాలు నేర్చుకునేందుకు వారు సుముఖత చూపారు. ఆ కారణంగా తక్కువ ఖర్చుతో పర్యావరణ అనుకూల పద్ధతుల్లో పెరటి తోటల పెంపకం గురించి శిక్షణ పొందారు.

ఆరంభంలో వాళ్లు 13 రకాల కాయగూరల సాగును చేపట్టారు. కాయగూరలు సమృద్ధిగా పండాయి. ఆకు కూరలు పుష్కలంగా పండాయి. మొదట్లో వాటిని తమ కుటుంబ అవసరాలకు వినియోగించేవారు.  క్రమంగా మిగులుగా ఉన్న వాటిని ఇరుగుపొరుగు వారికి ఇవ్వడంతో పాటు మార్కెట్లో అమ్మడం వారికి సాధ్యమైంది. రోజువారీ దిగుబడులు రావడంతో వారి ఇంటి అవసరాల కోసం మార్కెట్ కు వెళ్లి కూరలు కొనడం పూర్తిగా మానివేశారు. ఆ రకంగా ఒక్కో కుటుంబం నెలకు దాదాపు రూ. 2100 వరకు ఆదా చేసుకోగలిగారు. ఒక నెల వ్యవధిలో వారు తమ తోటలో 6-9 కిలోల వంకాయలు (brinjal) , 7-9 కిలోలు బీరకాయలు (ribbed gourd), 10-14 కిలోల బెండకాయలు, 4-6 కిలోల కాకరకాయలు వాళ్ల పెరటి తోటలలో కాయడం సాధ్యమైంది. ఇందులో దాదాపు 40 శాతం అమ్మివేయడం ద్వారా నెల తిరిగే సరికి వారు రూ. 2000-రూ. 2400 వరకూ అదనంగా ఆదాయం సంపాదించే స్థాయికి చేరుకున్నారు. ఈ కార్యక్రమం కింద దాదాపు 400 మంది రైతులు తమ ఇంటి వెనకాల ఉన్న 100 నుంచి 150 చదరపు అడుగుల స్థలంలో కాయగూరలను పండించడం ప్రారంభించారు.

కాయగూరల పెంపకంలో వచ్చే లాభాలు వారికి ఉత్సాహం కలిగించినా నీటి కొరత కారణంగా దీన్ని కొనసాగించడం లేదా విస్తరించడం పెద్ద సమస్యగా మారింది. అందువల్ల కాయగూరల పెంపకం కూడా వర్షాలపై ఆధారపడవలసిన పరిస్థితి ఎదురైంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు వారు వ్యర్థంగా నేలపాలవుతున్న నీటిని అంటే ఒకసారి ఇంట్లో ఉపయోగించిన తరువాత వృధాగా మురికి కాలువల పాలుచేస్తున్న నీటిని కూడా ఉపయోగించుకోవాలనే ఆలోచనకు పురికొల్పింది. ముందుగా వంటిట్లో వాడుతున్న నీటిలో ఎంత మేరకు వృధాగా పోతున్నదో వారు ఒక అంచనా వేశారు. వారి అంచనా ప్రకారం రోజూ ఇలా 40 నుంచి 50 లీటర్ల నీరు వ్యర్థమవుతోందని గుర్తించారు. ఇలా నీటిని పారబోసుకోవడం కన్నా, దానిని పెరటి తోటకు మళ్లిస్తే మంచిదని నిర్ణయించుకున్నారు. కొద్దిగా అయినా అందుబాటులో ఉన్న నీటి వనరును వృధా కాకుండా నీటిని శుద్ధి చేసి (ఫిల్టర్) డ్రమ్ముల్లో (50 లీటర్ల నిల్వ సామర్థ్యంతో) నిల్వచేసి వాడడం ప్రారంభించారు. ఆ డ్రమ్ములకు బిందు సేద్యానికి అనువుగా డ్రిప్ లెట్స్ అమర్చుకున్నారు. వాటి సాయంతో మొక్కల పాదులు తడపడం మొదలెట్టారు. ఈ విధంగా తోటల పెంపకంలో వారు వినూత్న ఆలోచన కూడా చేశారు. లీటరు మంచి నీటి సీసాలు ఉపయోగించే పద్ధతి పాటించారు. పాదులకు నీరు పెట్టేందుకు వారీ సీసాలను ఆధారం చేసుకుని డ్రిప్ సాగు చేపట్టారు. ఈ విధంగా నీటి వనరులను మెరుగ్గా ఉపయోగించడానికి వారు చొరవ తీసుకున్నారు. వృధాగా నీరు ఎండిపోకుండా, మట్టిలో కలిసిపోకుండా తోటలో మొక్కల పెంపకం వైపు మళ్లించి మెరుగైన ఫలితాలు సాధించారు. ఇప్పుడు అన్ని కుటుంబాలు ఈ పద్ధతిలో వంటింటి నీరు వృధా కాకుండా సద్వినియోగం చేసుకుంటున్నాయి.

ఈ విధంగా పెరటి తోటల పెంపకంలో మహిళలతో పాటు ఇంటిల్ల పాది చురుగ్గా పాల్గొనడం చెప్పుకోవలసిన విషయం. తోటకు కావలసిన నీటిని ఇంటికి మోసుకురావడం, కంచె నిర్మాణం వంటి వాటిని మగవాళ్లు చేసేవారు. మహిళలు మొక్కలకు దులు పెట్టి నీరు అందించడం, క్రిమికీటకాల నుంచి కాపాడేందుకు జిగురుతో ఉన్న పాలస్టర్లను వాటికి అతికించడం ఇంకా ఇతర పనులు చేస్తున్నారు. ఇక చిన్న పిల్లలు తమ వంతు సాయంగా తల్లికి చేయూత అందిస్తున్నారు. అది కూడా వారికి చదువుల ఒత్తిడి లేని సమయాల్లో మాత్రమే.

ఇప్పుడు వారి ఆహారపు అలవాట్లలో కూడా మార్పు వచ్చింది. వారు రోజూ తీసుకునే ఆహారంలో రకరకాల  కాయగూరలకు ఒక ప్రత్యేక స్థానం దక్కుతోంది. ఫలితంగా వారి ఆరోగ్యం కూడా బాగా మెరుగయింది. ఆకు కూరలు అధికంగా ఆహారంలో భాగంగా చేర్చుకుంటున్న కారణంగా తమకు జీర్ణ సంబంధమైన సమస్యల బెడద తగ్గిపోయిందని వారు అంటున్నారు.

పెరటి తోట పెంపకం పనులను ఇతరత్రా సేద్యపు పనుల ఒత్తిడి లేని సమయాలలో మాత్రమే చేపడుతున్నారు. అంటే మొదటి రెండు సంవత్సరాల కాలంలో జనవరి-జూన్ మాసాల (2010-11, 2011-12) మధ్య చేపట్టేవారు. ఇప్పుడు ఆ నెలల్లో కూడా పెరటి తోటల సాగుపై మహిళలు తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఆ రకంగా ఏడాది పొడవునా కాయగూరలకు కొరత లేకుండా చుసుకుంటున్నారు.

విస్తరిస్తున్న విజయపథం

ఈ ప్రాంతంలోని 400 మంది మహిళలు సాధించిన అపూర్వ విజయాలు ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తివంతంగా మారాయి. ఆ 20 గ్రామాలలో మరో 300-500 కుటుంబాలు ఇప్పుడు పెరటి తోటల పెంపకం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.

కుటుంబ సేద్యంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు ప్రారంభ వేదికపై నిలిచి ఈ మహిళలు తమ విజయగాథ వినిపించే మహదవకాశం వారికి దక్కింది. ఈ సదస్సు బెంగళూరులో జరిగింది. ఇంటి తోటల్లో పెంచిన వివిధ రకాల కాయగూరలను వారు ఈ సందర్భంగా సగర్వంగా ప్రదర్శించారు. తమ అనుభవాలను ఘనంగా అందరికీ వినిపించారు.

ఈ మహిళల జీవితాలలో పెరటి తోటలు అనూహ్యమైన మార్పులకు రాటబాటలు వేసాయి. దీని వల్ల వారి కుటుంబాలకు ఇప్పుడు పోషక విలువలు సమృద్ధిగా ఉన్న ఆహారం లభిస్తోంది. అదనంగా ఆదాయం సంపాదించగలుగుతున్నారు. కాయగూరల కోసం 10-15 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లవలసిన దుస్థితి వారికి తప్పింది. అన్నిటికన్నా ముఖ్యంగా వారి కుటంబ సభ్యుల మధ్య, ఇరుగుపొరుగుతో వారికి సంబంధాలు మరింత బలపడ్డాయి.

జె. కృష్ణన్
రైతుల శిక్షణ కేంద్రాల నిర్వహణ నిపుణుడు (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్)
ఏఎంఈ ఫౌండేషన్, నెం. 5/1299-బి-2,
ఎన్.ఎస్.సీ.బీ రోడ్డు, టిఏఎంఎస్ కాలనీ
లక్కింపట్టి, ధర్మపురి – 636705
Email : josephkrish@rediffmail.com

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి 16, సంచిక 4, డిసెంబర్ ౨౦౧౪

 

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...