పేదరికం నుంచి ఆశల అంచులకు – మహిళల పౌల్ట్రీ పారిశ్రామిక విజయ గాథ

సుకృత్ బాయ్ నిరుపేద మహిళ. మరెందరో మహిళల్లాగే ఒంటరి జీవితం సాగిస్తున్నది. భర్త నిరాదరణకు, అన్ని విధాలా అణచివేతలకు గురైన పేదరికంలోనే మగ్గిపోయిన సగటు స్త్రీ. పీరా గ్రామంలో నివసిస్తున్న సుకృత్ ఇప్పుడు ఆత్మవిశ్వాసం నిండుగా రూపుదాల్చిన స్త్రీ. ఆమె దృష్టి ఇప్పుడు పూర్తిగా పౌల్ట్రీ సంస్థ నిర్వహణపైనే కేంద్రీకృతమై ఉంటున్నది. ధ్రుఢ సంకల్పం, బయటి నుంచి అందిన కొద్ది పాటి చేయూత మాత్రమే ఆమె పెట్టుబడి. ఆమె జీవితమే మారిపోయింది. మెరుగుపడిన శక్తిసామర్థ్యాలు, ఆత్మవిశ్వాసంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్న సుకృత్ ఇప్పుడు ఆమె గ్రామంలోని ఇతర మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ గ్రామ వాసి సుకృత్ బాయ్. ఆమెకు 12 ఏండ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె తన తల్లిదండ్రులు, నలుగురు సోదరులతో కలిసి నివసిస్తున్నది.  12 ఏండ్ల క్రితం ఆమెను భర్త వదిలేసాడు. ఆ కారణంగానే ఆమె తన పుట్టింటికి వచ్చి అక్కడే బతుకుతోంది. వారికి సుమారుగా 8 ఎకరాల పొలం ఉన్నది. ఆ చిన్న భూమినే నమ్ముకుని ఆ కుటుంబం గోధుమ, పప్పు ధాన్యాలు, ఆవాలు, మినుములు, పెసలు, సోయాబీన్ పండించుకుని జీవనం సాగిసుతన్నది. వారు చేపట్టే సేద్య భారం మొత్తం కుటుంబ పోషణ లక్ష్యంతోనే సాగుతుంది. వారికి అదే జీవనాధారం. అలా పండించిన పంటలో చాలా కొద్ది భాగం మాత్రమే మార్కెట్ లో అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఆమె సోదరులు వ్యవసాయ కూలీలుగానో, భవన నిరామణ కార్మికులుగానో పరిసర గ్రామాలకు వెడుతూ ఉంటారు.

గతి లేని పరిస్థితిలో పుట్టినింటికి చేరిన సుకృత్ ఏనాడూ తన తల్లిదండ్రులకు భారంగా ఉండాలనుకోలేదు. కొత్తలో వెదురు బుట్టలు అల్లి, వాటిని విక్రయించి తన అవసరాలకు సరిపడా సంపాదించి ఇచ్చేది. రు. 30 – రు. 40 ఖర్చు పెట్టి వెదురు కొని తెచ్చుకునేది. వాటితో తయారు చేసిన బుట్టలను రు. 100 కే విక్రయించేది. అలా ఆమె రోజుకు ఒక్క బుట్ట మాత్రమే అల్లడం సాధ్యమయ్యేది. “ఇలా బుట్టలను అమ్మడం వల్ల వచ్చే కొద్ది ఆదాయం నా అవసరాలకే చాలేది కాదు. అలాంటి సమయంలో నాకు అండగా ఉంటున్న అమ్మా,నాన్నలకు ఏమి ఇవ్వగలను ? వారికి ఏ విధంగానూ సాయం చేయలేకపోయేదాన్ని ” అన్నారు సుకృత్.

ఆ సమయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆశా రేఖ కనిపించింది. రాష్ట్ర జిల్లా స్థాయి పేదరికం నిర్మూలన ప్రాజెక్టు (MPDPIP) చేపట్టిన ‘ప్రదాన్’ నిర్వాహకులు వారి గ్రామానికి వచ్చారు. మహిళలను చేరదీసి వారి జీవనోపాధులను మెరుగుపరిచేందుకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. ఇది 2005లో జరిగింది. ముందుకు వచ్చే మహిళలకు ప్రభుత్వం నుంచి అందే సహాయసహకారాలను వారు తెలియజేశారు. చాలా మంది ఆసక్తి చూపించారు. వారిలో సుకృత్ కూడా ఒకరు. ప్రదాన్ ప్రోత్సాహంతో వాళ్లంతా పౌల్ట్రీ పరిశ్రమవైపు దృష్టిపెట్టారు. కోళ్ల పెంపకంలో మెలకువలు తెలుసుకున్నారు. వారిని సమష్టి ప్రయోజనాల బృందాలుగా సంఘటితం చేసింది ప్రదాన్. అలాంటి ఒక బృందంలో సుకృత్ సభ్యురాలిగా 2006లో అడుగుపెట్టింది.

ఈ విధమైన సమష్టి ప్రయోజనాల బృందాల ఏర్పాటు కారణంగా, సమీప గ్రామాలకు చెందిన మరో నలుగురు మహిళలతో కలిసి రెండు రోజుల శిక్షణ కోసం హోషంగాబాద్ జిల్లాలోని ఖేస్లాకు బయలుదేరి వెళ్లింది. అక్కడ వాళ్లంతా కోళ్ల పెంపకంలో శిక్షణ తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని ఖేస్లా పౌల్ట్రీ సొసైటీ నిర్వహించింది. పౌల్ట్రీ (బ్రాయిలర్) నిర్వహణ మెళుకువలు, పౌల్ట్రీ షెడ్ల నిర్మాణం వంటివి నేర్చుకున్నారు.

శిక్షణ ముగిసిన తరువాత, వాళ్లంతా మధ్యప్రదేశ్  జిల్లా స్థాయి పేదరికం నిర్మూలన ప్రాజెక్టుతో అనుసంధానమయ్యారు. అక్కడ వారికి రూ. 30000 చొప్పున ఒకొక్కరికి ఆర్థిక సాయం లభించింది. ఆ మొత్తంతో 300 చదరపు అడుగుల కోళ్ల ఫారమ్ షెడ్డును నిర్మించుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి చుట్టుపక్కల ఉన్న 13 గ్రామాలకు చెందిన 360 మంది మహిళలు సంఘటితమై సహకార రంగంలో సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు రాజ్ నగర్ గ్రామీణ మహిళా ముర్గి ఉత్పాదక్ సహకారిత మర్యాదిత్. ఇప్పుడు ఆ సొసైటీ బోర్డులో సుకృత్ బాయ్ ఒకరు. ఇలా సొసైటీగా ఏర్పడిన తరువాత పౌల్ట్రీ పెంపకం కార్యక్రమం చేపట్టారు. ఒక రోజు వయసున్న కోడి పిల్లల పెంపకం బాధ్యత చేపట్టారు.  ఒకొక్కరు 300 కోడి పిల్లలను తెచ్చుకున్నారు.

వారి నుంచి మళ్లీ కోడి పిల్లలను సొసైటీ కొనుగోలు చేస్తుంది. వాటికి అవసరమైన మేత అందిస్తుంది. అవసరమైన మందులు, వ్యాక్సీన్లు సరఫరా చేస్తుంది. అందుకయ్యే ఖర్చును వారి నుంచి కొనుగోలు చేసిన కోడి పిల్లల ఖరీదు నుంచి వెనక్కి తీసుకుంటారు. 25 నుంచి 28 రోజులపాటు పెంచిన కోళ్ల బరువు కిలో నుంచి 1.2 కిలోల వరకు పెరిగిన తరువాక వాటిని సొసైటీ మరింత అధిక ధరను చెల్లించే కొనుగోలుదారుకు విక్రయిస్తుంది. అవసరమైన వైద్య సాయం అందించేందుకు ఒక వైద్యుడిని కూడా సొసైటీ సమకూరుస్తుంది. వారికి అవసరమైన సాంకేతిక సలహా సూచనలు అందించేందుకు తోడ్పడుతుంది.

కోడి పిల్లల సేకరణ, బ్రాయిలర్ పక్షుల విక్రయం వంటి బాధ్యతలను సమష్టిగానే నిర్వహిస్తారు. ఫలితంగా మన దృష్టిని పూర్తిగా కోడి పిల్లల పెంపకంపైనే కేంద్రీకరించవచ్చు.

మొదటిసారి కోడి పిల్లల పెంపకానికి తీసుకెళ్లిన సమయంలో వారికి తగిన సూచనలు ఇవ్వడానికి కేరళ నుంచి ప్రత్యేకంగా శిక్షకుడిని ఖేస్లాకు తీసుకువచ్చారు. ఆతని ఆధ్వర్యంలో 30 రోజుల పాటు క్షేత్రస్థాయిలోనే వారికి పూర్తి స్థాయి శిక్షణ ఇప్పించారు. ఆతడు నిత్యం వాళ్ల కోళ్ల ఫారమ్ లను స్వయంగా సందర్శించి వాటిని పర్యవేక్షిస్తూ, అవసరమైన సహాయసహకారాలు అందజేసే సదుపాయం కూడా సొసైటీ సమకూర్చింది. కోళ్ల పెంపకంలో ఉత్తమ విధానాల గురించి వాళ్లకి తెలియజేయాలంటే వారికి సమీప గ్రామంలోనే ఒక చోట అందరినీ సమావేశపరచి వివరించేవాడు.

“వచ్చిన ఫలితాలు మాకు సంతృప్తి కలిగించింగి. మరింత డబ్బు మదుపు చేయడానికి ధీమా వచ్చింది. మా కార్యకలాపాలను విస్తరించుకోవాలనే ఆలోచన వచ్చింది. ” అని ఇప్పుడు సుకృత్ బాయ్ ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. కోళ్ల పెంపకం చేపట్టిన మహిళలు తమ గ్రామంలోనే వారానికి ఓ సారి సమావేశమయ్యేవారు. తమకు ఎదురైన సమస్యల గురించి కలిసి కూర్చుని చర్చించుకునేవారు. పరిష్కారాలు గుర్తించేవారు. అదే విధంగా సొసైటీ పాలకవర్గం ప్రతీ నెలా 8వ తేదీన సమావేశమవుతుంది. ఆ సమావేశం బమితా గ్రామంలో జరిగేది. అది సుకృత్ బాయ్ నివసించే పీరా గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 13 గ్రామాల నుంచి ఎంపిక చేసిన ప్రతినిధులు పాలకవర్గంలో సభ్యులుగా ఉంటారు. సొసైటీ నిర్వహణ గురించి వారు చర్చిస్తారు. వివిధ గ్రామాల్లో కోళ్ల పెంపకం తీరును సమీక్షిస్తారు. వ్యాపారం అభివృద్ధికి తీసుకోవాలసిన చర్యలను నిర్ణయిస్తారు.

కోళ్ల బరువు 25 రోజులు గడిచే సరికి దాదాపు కిలో వరకు పెరుగుతుంది. ఒకొక్కరు 3 లేక 4 క్వింటాళ్ల వరకు కోళ్లను ఒక సైకిల్ వ్యవధిలో అమ్ముకోగలుగుతారు. ఆ దశలో కోడి పిల్లలను, అవసరమైన మందులు, కోళ్ల దాణా వంటి వాటిని సొసైటీ సేకరిస్తుంది. సొసైటీకి కావలసిన ఈ ముడి సరుకులను భోపాల్ లోని రాష్ట్ర స్థాయి ఫెడరేషన్ – MPWPCL – సరఫరా చేస్తుంది. ఒక్కో గ్రామంలోని పెంపకందారులు ఒక సూపర్ వైజర్ ను నియమించుకున్నారు. ఉత్తమ యాజమాన్య పద్ధతులను అనుసరిస్తున్నదీ లేనిదీ వారు పర్యవేక్షిస్తుంటారు. వారానికి ఒకసారి సూపర్ వైజర్ కోడిపిల్లల బరువును కూడా గమనిస్తూ ఉంటారు. ఆ వివరాలను సొసైటీకి తెలియచేస్తూ ఉంటారు. ఈ సేవలకు గాను పెంపకం దారులు విక్రయించే ఒక్కో కోడి పిల్లకు 50 పైసల చొప్పున చెల్లిస్తారు.

ప్రతీ సారి కోడి పిల్లలను విక్రయించిన తరువాత సుకృత్ బాయ్ కోళ్ల షెడ్డును 10-15 రోజుల పాటు మూసేసి ఉంచుతుంది. ఫినాయిల్ ను ఉపయోగించి నిమ్మ నీటితో శుభ్రంచేస్తుంది. అక్కడి నేల పూర్తిగా ఎండిన తరువాతే కొత్తగా కోడి పిల్లలను తీసుకువస్తుంది.

 “అప్పటి వరకు పెంచిన కోళ్లను విక్రయించిన తరువాత నేను సమితి కార్యాలయం వెళ్లి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తాను. నాకు రావలసిన పైకం తెచ్చుకుంటాను. ” అంటున్నారు సుకృత్ బాయ్. ఇతర కోళ్ల పెంపకందారులు కూడా అదే విధంగా కార్యాలయం వెళ్లి తమకు రావలసిన పైకం తెచ్చుకుంటారు. “కోడి పిల్లలను సేకరించడం, బ్రాయిలర్ కోళ్లను తిరిగి విక్రయించడం అందరూ కలిసికట్టుగానే చేస్తారు. అలా చేయడం వల్ల ఈ బాధ్యతల భారం తగ్గిపోతుంది. వాళ్ల దృష్టి యావత్తూ ఉత్పత్తిపైనే కేంద్రీకరించడం సాధ్యమవుతుంది. అమ్మకానికి తగిన స్థాయికి కోళ్లు తయారుకాగానే సహకార సొసైటీకి సమాచారం అందిస్తారు. వాళ్లు అన్ని విధాలా అనుకూలమైన కొనుగోలుదారులను గుర్తించి తెలియజేస్తారు. వాళ్లతా సొసైటీయే సంప్రదింపులు సాగిస్తుంది. చర్చల్లో ఒక ఏకాభిప్రాయం రాగానే కొనుగోలుదారులు ఆయా గ్రామాలను స్వయంగా సందరిస్తారు. కోళ్లను తీసుకెడతారు. అందరి సమక్షంలోనే కోళ్ల బరువును తూచి చూపిస్తారు. ఆ సమయంలో ప్రత్యేకంగా ఇలాంటి సహాయసహకారాల కోసమే నియమించుకున్న సూపర్ వైజర్ కూడా హాజరవుతారు. ఆయన దగ్గర ఉండి ఒక్కో పెంపకందారుకు సంబంధంచిన రికార్డులను సక్రమంగా ఉండేట్లు తాజాపరుస్తారు. ”

వారిలో సుకృత్ బాయ్ దినచర్య ఎలా ఉంటుందంటే, రోజుకు మూడు సార్లు కోళ్ల మేతకు వినియోగించే పాత్రలను శుభ్రం చేస్తుంది. ఆ తరువాత కోడిపిల్లలకు మేత పెడుతుంది. నీరు అందిస్తుంది. వేసవి కాలంలో వాటిపై నేరుగా వేడి గాలి తగలకుండా తన పాత చీరలను అడ్డు తెరలుగా షెడ్డు చుట్టూ ఏర్పాటు చేస్తుంది. చలి కాలంలో కోడి పిల్లలకు చల్లటి గాలి తగలకుండా షెడ్డు లోపల వేడిగా ఉండేందుకు వీలుగా చిన్న మంట ఏర్పాటుచేస్తుంది. “అలాటి చలి మంట వల్ల వచ్చే పగ కారణంగా కోడిపిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం” అని ఆమె చెప్పింది. ఒక గ్రామంలోని పెంపకందారులందరూ కలిసి కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. వాటిని ఆయా గ్రామాల వారూ, పరిసర గ్రామాల వారూ తప్పక నిక్కచ్చిగా పాటిస్తుంటారు.  వాటిలో కొన్ని ఎలా ఉంటాయంటే చిన్న పిల్లలను షెడ్ల దగ్గరకి రానీయరు. అలాగే పిల్లులు, కుక్కలు ఆ దరిదాపులకు రాకుండా అడ్డుకోవాలి. కోళ్ల షెడ్లలోకి వెళ్లే ముందు, బయటకు వచ్చిన తరువాత కాళ్లూ చేతులను శుభ్రంగా క్లీనింగ్ ద్రావకంతో కడుగుకుని తీరాలి. అంతేకాదు, ఒకరి నిర్వహణలో ఉన్న షెడ్డులోనికి మరో పెంపకందారులు ప్రవేశించకూడదు. ఇలా వారిలో వారు కొన్ని నియమాలను సిద్ధంచేసుకున్న నిబద్ధతతో పాటిస్తుంటారు.

మొదట్లో ఎక్కువ సంఖ్యలోనే కోడిపిల్లలు చనిపోతూ ఉండేవని సుకృత్ బాయ్ చెప్పారు. దాదాపు 20 నుంచి 25 వరకు చనిపోయేవి. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ సంఖ్య బాగా తగ్గింది. ఇప్పుడు 2 – 3 పక్షులు మాత్రమే చనిపోతున్నాయి. సుకృత్ బాయ్ మరదలు కూడా ఆమెను చూసి ప్రేరణ పొందింది. ఇటీవలే ఆమె బ్యాంకు రుణం తీసుకుంది. ఆమె సొంతంగా ఒక షెడ్డును నిర్వహిస్తున్నారు. ఆ రకంగా వారి కుటుంబంలో మరో పౌల్ట్రీ పరిశ్రమ తయారవుతోంది.

“ఈ రకమైన ఉపాధి మార్గం చాలా సదుపాయంగా ఉంది. ఇంటి పట్టునే ఉంటాం. కాబట్టి ఇంట్లో ఇంతర పనులు చూసుకుంటూనే కోళ్ల బాగోగులు చూసుకోవచ్చు. బిడ్డల సంరక్షణ బాధ్యతలను కూడా ప్రశాంతంగా నిర్వహించవచ్చు. సంతృప్తికరమైన ఆదాయం వస్తోంది. ఇదివరలో 300 కోడి పిల్లలను పెంచి పోషించి విక్రయించడం ద్వారా రూ. 1200 నుంచి రూ. 1500 వరకూ లభించేది. ఇప్పుడు 500 కోడి పిల్లలను పెంచడం ద్వారా రూ. 2000 నుంచి రూ. 2200 వరకూ నెలకు రాబడి సంపాదిస్తున్నాను. ఇప్పుడు నేను మా కుటుంబానికి భారంగా లేను. నా కుమారుడి చదువు సంధ్యలు నేనే స్వయంగా చూసుకోగల స్థితికి చేరుకున్నాను.  ”అంటన్నారు సుకృత్ బాయ్ సగర్వంగా. అంతేకాదు,  “ఈ మధ్య నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయిన నా భర్త కూడా మళ్లీ రావడం మొదలుపెట్టాడు. నన్ను మళ్లీ ఏలుకుంటాడట. నాతో, నా కుమారుడితో కలిసి జీవనం సాగిస్తాడట. నేను ఎలా చెపితే అలా నడుచుకుంటానని మాట ఇస్తున్నాడు. ముందే చెప్పాను. నేను ఈ కోళ్ల పెంపకం ఉపాధి వదులుకోను, మరింత విస్తరిస్తాను అని. అందుకు ఆయనకు అభ్యంతరం లేదని కూడా అంటున్నాడు. ” అని చెబుతున్న ఆమె మాటల్లోనే కాదు, ముఖంలో కూడా గెలిచాననే భావన స్పష్టంగా కనిపిస్తోంది.

సేకరణ : “ కోళ్ల పెంపకంలో సుకృత్ బాయ్ చౌటలే విజయ గాథ మరెందరికో స్ఫూర్తిదాయకం ” శీర్షికతో SAPPLP వెబ్ సైట్ www.sapplp.org లో వచ్చిన కథనం ఆధారంగా సమర్పిస్తున్నది.

ప్రదాన్
ఈ-1/ఎ, కైలాశ్ కాలనీ,
గ్రౌండ్ ఫ్లోర్ మరియు బేస్ మెంట్,
న్యూఢిల్లీ, - 110 048
ఈ-మెయిల్ : headoffice@pradan.net

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి 16, సంచిక 2, జూన్ ౨౦౧౪

 

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...