పర్యావరణ-సేద్య సమాచార మార్పిడి – ఆచరణలో ప్రయోజనం ఉంటుందా?

పర్యావరణహిత సేద్యం అనుసరించడం ద్వారా రైతన్నలకు ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా వారు నిత్యం వ్యవసాయ కార్యకలాపాలలో అనుసరించే విధానాల నుంచి స్థానిక పరిస్థితులు, వనరులు, పరిజ్ఞానానికి అనుగుణంగా స్వీయ అనుభవాల ప్రాతిపదికగా సమస్యలకు పరిష్కారం కనుగొనటం సాధ్యమవుతుంది. సాధారణంగా వ్యవసాయ రంగంలో రైతులు తమ అనుభవాలను మెరుగుపరచుకోవడంతో పాటు నైపుణ్యం పెంచుకోవడం పర్యావరణ సేద్యంలోని కీలక అంశంగా చెప్పుకోవాలి.

దేశంలో పర్యావరణపరంగా శ్రేయోదాయకమైన వ్యవసాయ విప్లవం ఎనభైవ దశకంలో ప్రారంభమైంది. సంప్రదాయక, రసాయనాల ఆధారిత వ్యవసాయం నిరాశ మిగల్చడంతో కొద్ది మంది రైతన్నలు ప్రత్యామ్నాయ సేద్య విధానాల బాట పట్టారు. భూసారం త్వరిత గతిన క్షీణించిపోకుండా కాపాడుకుంటూనే ఎక్కువ దిగుబడి ఇచ్చే విధానాలను అవలంభించారు. ఈ క్రమంలో భవిష్యత్ తరాలకు ప్రకృతి వనరులను సురక్షితంగా అందజేశారు. వారికి తగిన భద్రతనిచ్చారు. పర్యావరణ సేద్యం అటువంటి ప్రకృతిహితమైన సేద్య విధానమే వేర్వేరు పేర్లతో – సుస్థిరమైన వ్యవసాయం, పర్యావరణ వ్యవసాయం, తేలికపాటి బాహ్య పరికరాల అవసరం లేని సేద్యం, లేదా ప్రజా భాగస్వామ్య వ్యవసాయం – వ్యవహరిస్తారు.

ఈ విధమైన సేద్య విధానం వాస్తవానికి వ్యవసాయ క్షేత్రంలోనే రూపుదిద్దుకుంది. ఈ రకమైన సేద్య విధానం అనుసరించడంలో రైతు సోదరులు ముందుగా తమ పంటల గురించిన పరిశీలన, అధ్యయనం చేశారు. అందులోంచే సరికొత్త విధానాలను గుర్తించి నూతన ఆవిష్కరణలకు తెరతీశారు. స్థానిక పరిస్థితులు, వనరులు, స్వీయ అనుభవం ప్రాతిపదికగా వారు తమ సమస్యలన్నిటికీ పరిష్కారాలను ఎంపికచేసుకున్నారు. ఈ కారణంగానే పర్యావరణ-సేద్యంలో అనుసరించే విధానాలు ప్రతీ ఒక్కరూ గుడ్డిగా అనుసరించే అవకాశం ఉండవు. ఒక్కో రైతు తన క్షేత్రంలో తనకు ఏది ఎక్కువగా ప్రయోజనకరమో గుర్తించి అందుకు అనుగుణంగానే విధానాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సంప్రదాయక సేద్యంలో ఇందుకు భిన్నంగా ప్రతి ఒక్కరూ ఏక రూపక విధానాలు పాటించే అవకాశం ఉంటుందని మన అందరికీ తెలిసిందే. పర్యావరణ సేద్యంలో వ్యవసాయదారులు నిరంతరం తాము అనుసరించే విధానాలను, పద్ధతులను మెరుగుపరచుకోవడంపైనే ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు.

ఇలా తమ అనుభవ సారం చుకునే ప్రయత్నంలోనే తగిన నైపుణ్యాన్ని, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వాటి గురించి తమలాంటి ఆలోచనలతోనే ఉన్న ఇతర రైతులకు ఇచ్చిపుచ్చుకోవడం సర్వసాధారణం. తాము తెలుసుకున్న ప్రయోజనకరమైన విధివిధానాలను గురించి పరస్పరం అందించుకోవడం ద్వారానే వారి సేద్య విధానాల నైపుణ్యం మరింత మెరుగుపడుతుంది.  సభ్య సమాజాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రైతుల సమావేశాలు, రైతుల మధ్య అనుభవాల పరస్పర మార్పిడి అవకాశాలు, పరస్పర అభిప్రాయ మార్పిడి వేదికలు ఈ పరిజ్ఞానం వెల్లడించుకునేందుకు  తోడ్పడుతుంటాయి. అవి అప్పుడప్పుడు మాత్రమే వారికి అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా భావవ్యక్తీకరణకు సిద్ధం చేస్తున్న వేదికలు ఆశించిన ప్రయోజనాలు అయితే లభిస్తున్నాయి. ఈ కృషిలో కీలక బాధ్యతలను లీసా ఇండియా ఇనీషియేటివ్ సంస్థ నిర్వహిస్తోంది. సేద్య పరిజ్ఞానం విస్తృతంగా రైతు సోదరుల ముందుకు చేర్చడమే లక్ష్యంగా కృషి చేస్తున్న లీసా ఇండియా ఇనీషియేటివ్ సంస్థ 2000 వ సంవత్సరం నుంచి పర్యావరణహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న మేగజైన్ పాఠకుల నుంచి సేకరించిన అభిప్రాయాలు ఆధారంగా పర్యావరణసేద్య విధానాల ఆమోదం, అనుసరణలపై ప్రత్యేకంగా అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనం 2009 నుంచి సాగుతోంది.

విధివిధానాలు

రైతుల మధ్య నిర్వహిస్తున్న ఈ అనుభవ మార్పిడి ప్రక్రియ ప్రారంభించి దశాబ్దకాలం దాటిపోయింది. ఫలితాలను విశ్లేషించే ప్రయత్నం కూడా నిరాఘాటంగా సాగిపోయింది. రైతుల నుంచి అభిప్రాయాలను సమీకరించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రయత్నాన్ని – ప్రయోజన ప్రభావం (స్ఫియర్ ఆఫ్ కంట్రోల్) – పేరుతో లీసా ఆచరణ విధానాలుగా ప్రచారం చేయడంపై దృష్టి కేంద్రీకరించడం జరిగింది. అనుసరించడానికి అనువైన ఉత్తమ పద్ధతులను అందరికీ తెలియజేయడంలో అనుసరించవలసిన – ప్రభావ విస్తృతి (స్ఫియర్ ఆఫ్ ఇన్ ఫ్లుయెన్స్)  పరిమితిని నిర్దేశించడం జరిగింది. అనంతరం ఈ విధానాలు చిన్న స్థాయి రైతన్నకు ఏ మేరకు ఉపయోగపడతాయో అంచనా వేసేందుకు ప్రయోజనాల పరిధిని (స్ఫియర్ ఆఫ్ ఇంటరెస్ట్) నిర్ణయించే విషయాన్ని పరిశీలించడం జరిగింది. ఈ మొత్తం అధ్యయనం జరిపేందుకు రకరకాలైన పాఠకుల అభిప్రాయ సేకరణ పద్ధతులను అనుసరించవలసి వచ్చింది. ఉదాహరణకు పాఠకుల అభిప్రాయాల సేకరణ, బృందాలవారీ చర్చలు, వ్యక్తులను విడివిడిగా కలుసుకోవడం, క్షేత్ర సందర్శనలు, ప్రత్యేకంగా నిర్వహించిన వర్క్ షాపులు ఏర్పాటుచేయవలసి వచ్చింది. ప్రస్తుతం ప్రభావ విస్తృతి (స్ఫియర్ ఆఫ్ ఇన్ ఫ్లుయెన్స్) గురించి ఇక్కడ తెలుసుకుందాం. పర్యావరణ హితమైన సేద్య విధానం ఏ విధంగా విభిన్నమైన ఆలోచనా ధోరణులు కల పాఠకులను లేదా వ్యవసాయదారులను ఆకట్టుకోగలిగిందో, వారి సేద్య విధానాలలో ఎలాంటి మార్పులకు తోడ్పడిందో తెలుసుకునేందుకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

పాఠకులపై నిర్వహించిన సర్వేలో దాదాపు 1500 మంది పాల్గొన్నారు. 21 మందితో విస్తృతంగా మాట్లాడడం జరిగింది. వారిలో ఎనిమిది మంది వ్యవసాయ రంగానికి చెందినవారే. వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు ఏడుగురి అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. ముగ్గురు మీడియాకు చెందిన వారు. ప్రభుత్వం నుంచి ఒకరు, రీసెర్చి ఇనిస్టిట్యూషన్ నుంచి ఒకరు, రుణపరపతి సంస్థ తరఫున ఒకరు వారి అభిప్రాయాలు తెలియజేశారు. ఒక రకంగా లీసా మేగజైన్ లోని సమాచారాన్ని వారు ఎలా ఉపయోగించుకున్నారో, వాటి ఫలితాలు, ప్రయోజనాలు ఏమిటో వారి ద్వారా తెలిసింది. వాళ్లందరినీ బృందాలుగా ఏర్పాటుచేసి చర్చా గోష్ఠులను కూడా నిర్వహించి వారివారి అనుభవాలను, అభిప్రాయాలను సేకరించారు. లీసా ఇండియా పాఠకులను 50 నుంచి 60 మందిని ఒక బృందంగా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం (యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్), ఉద్యానవనాల పరిశోధనా కేంద్రం (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చి), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, వ్యవసాయ మార్కెటింగ్ బోర్డు, స్థానిక ఆరోగ్య సంరక్షణ విధానాల పునరుద్ధరణ సంస్థ (Foundation for Revitalisation of Local Health Traditions (FRLTH), ఇంకా ఇలాంటి వ్యవసాయదారుల ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న స్పెయిన్ సంస్థ గ్రామీణ అభివృద్ధి ట్రస్టు (Rural Development Trust (RDT) ప్రతినిధులను కూడా జతచేయడం జరిగింది. ఈ మేగజైన్ పాఠకులలో స్వయంగా సేద్యం చేస్తున్న నలుగురు రైతు సోదరులకు క్షేత్ర స్థాయి పర్యటనలకు ఎంపిక చేయడం జరిగింది. వారి నుంచి మేగజైన్ లో సూచించిన విధానాలను అమలు చేయడంలో వారి అనుభవాలను సేకరంచేందుకు కృషి జరిగింది. క్షేత్ర పర్యటనల్లో పాల్గొన్న నలుగురు పాఠక వ్యవసాయదారులలో ముగ్గురు కేవలం రెండు నుంచి మూడు ఎకరాల పొలం మాత్రమే ఉన్న చిన్నకారు రైతన్నలు. ఇక నాలుగో రైతు మాత్రం దాదాపు 15 ఎకరాలకు ఆసామీ.

ప్రభావ విస్తృతి (స్ఫియర్ ఆఫ్ ఇన్ ఫ్లుయెన్స్)

మేగజైన్ అందిస్తున్న సమాచారం ఆధారంగా – రైతులు ఎలా తమ వ్యవసాయపు పనులను నిర్వహిస్తున్నారు, వాటి ఫలితాలేమిటి, వాటి కారణంగా వారిలో ఆలోచనలపరంగా కానీ, పని నైపుణ్యం విషయంలో కానీ, ఆచరించడంలో కానీ – అన్న విషయాలను అధ్యయనం చేయడం జరిగింది. ఈ అధ్యయనంలో ప్రయోజనాలు, వారి ఆలోచనలపై ప్రభావం వంటివి పరిశీలించడం జరిగింది. ఎంపిక చేసిన పాఠక కర్షకుల నుంచి వ్యక్తిగతమైన అభిప్రాయాలను సమీకరించడం జరిగింది.

విభిన్నమైన ఆలోచనలకు ఆస్కారం

పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా, పర్యావరణ సేద్య కార్యకలాపాలను నిర్వహించడంలోనూ,  ఆలోచనా ధోరణిలోనూ, వారి దృక్పథంలోనూ గణనీయమైన మార్పులు కనిపించాయి. ఈ మార్పు కేవలం రైతులలో మాత్రమే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ఔత్సాహికులలోనూ కూడా కనిపించింది. ఉదాహరణకు కేవలం వ్యవసాయంపైనే ఆదారపడి జీవనం సాగిస్తున్న రైతుల విషయమే తీసుకుంటే – వారికి తాము అనుసరిస్తున్న జీవనోపాధి అంటే వ్యవసాయంపై విశ్వాసం, నమ్మకం మరింతగా పెరిగాయి. ప్రత్యామ్నాయాలు కనిపించాయి. విశాలమైన ఈ ప్రపంచంలో తమలాంటి వాళ్లు మరెందరో ఉన్నారనే వాస్తవికత గుర్తింపునకు వచ్చింది. ఇలాంటి వాళ్లకి లీసా మేగజైన్ ఆశావహమైన భవిష్యత్తును చూపించింది. ఫలితంగా వాళ్లంతా తమ జీవనోపాధి అయిన వ్యవసాయ కార్యకలాపాలను మరింత ఉత్సాహంగా, విశ్వాసంతో కొనసాగించగలిగారు.

మరోవైపున – ఆచరణసాధ్యమైన పర్యావరణ సేద్యం చేపట్టినందువల్ల వారి చుట్టూ ఉన్న మొత్తం రైతాంగం అభివృద్ధి పథంలో ముందుడుగులు వేయగలిగారు. జీవనోపాధుల్లో ప్రత్యామ్నాయాలు కనిపించడంతో ఆర్థికంగానూ, ఇతరత్రా కూడా పురోగతి సాధించారు. ఇంతవరకు వారు అదనపు ఆదాయం కోసం అంతగా ప్రయోజనం లేని మార్గాలనే అనుసరించేవారు. ఆ క్రమంలో సురక్షితమైన వ్యవసాయం చేసే మార్గాలను వారు గుర్తించలేకపోయేవారు. ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలను గురించిన సమాచారం తెలియడంతో గ్రామీణ ప్రజానీకం కొత్తగా చేపట్టిన విధానాలు ఎంత ఉపయోగకరంగా ఉండేవో తెలుసుకున్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 74 శాతం మంది తమకు ఇప్పుడు ప్రత్యామ్నాయాల విషయంలోనూ, పర్యావరణ సేద్యంపైనా మరింత మెరుగైన స్పష్టత ఏర్పడిందని అంగీకరించారు. వారికీ విషయంలో శ్రీ వరి సేద్యం, ఐపీఎం సేద్యం విధానాలతో పాటు సజీవమైన పంట పొలాల గురించిన అవగాహన మెరుగుపడింది.

సొంత భూముల్లోనే ప్రయోగాలు

ఆలోచనల్లో వచ్చిన మార్పులు ఆచరణలో కూడా చోటు సంపాదించుకున్నాయి. పంటల సాగు విధానాల్లోనూ మార్పులకు దారితీసింది. కొత్త కొత్త ఆలోచనలను, నూతన విధానాలను అనుసరిస్తూ మెరుగైన ఫలితాల అన్వేషణ ప్రారంభించారు.

ఈ మార్పులు వారి పంట చేలను చూడగానే మనం గుర్తించవచ్చు. దాదాపు 58 శాతం మంది తమకు తెలిసిన కొత్త విధానాలను పొలాల్లో ఉపయోగించారు. సేంద్రీయ ఎరువులను ఉపయోగించడం, కంపోస్టు, వెర్మిపోస్టు, అజోలా  వంటి  ఎరువులను వాడడం మొదలుపెట్టారు. ఉదాహరణకు, షిమోగా జిల్లాలోని ఒక రైతు తన పొలంలో ఎత్తు పెంచిన నేలల్లో వరి సాగు చేపట్టాడు. ఆయనకు ఈ విషయంలో ప్రత్యేకంగా వరి సాగు కోసం పంట పొలం ఎత్తును పెంచడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రోత్సహించిన వ్యాసం ఆయనకు స్ఫూర్తినిచ్చింది. ఈ విధానం కారణంగాసాగు వ్యయం సగానికి సగం తగ్గిపోయిందని చెప్పారు. అంటే ఆయనకు వచ్చిన లాభంలో50 శాతం పెరిగిందన్నమాట.

మరో విషయం కూడా మనం గమనించవచ్చు. చాలా మంది రైతన్నలు ఇప్పుడు రసాయనాల వాడకాన్ని చాలా వరకు తగ్గించివేశారు. పంట పొలాల్లో లభించే వ్యర్థాలు ఉపయోగించుకుని సేంద్రీయ ఎరువులను తయారుచేసుకుంటున్నారు. ఈ జిల్లాలోని కొందరు సేంద్రీయ ఎరువులతో పాటు సాగు నీటిని జత చేసి పొలాలకు పుష్టిని, మరింత శక్తిని సమకూర్చుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల పొలానికి సేంద్రీయ ఎరువులను జతపరచే పనుల కోసం కార్మిక శక్తి పేరుతో అయ్యే ఖర్చు బాగా తగ్గిపోయింది. కొందరు కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. వారు స్వయంగా ఎరువుల తయారీకి ఉపయోగపడే సేంద్రీయ వ్యర్థాలను అందించే పంటలను సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ విధంగా విడిగా సేంద్రీయ ఎరువులను అదనంగా పొలాలకు జత చేయవలసిన అవసరాన్ని తప్పించుకుంటున్నారు. షిమోగా జిల్లాకు చెందిన యువ రైతు నందీశ్ ఇలాంటి రకరకాల పంటల సాగును చేపట్టి సజీవమైన మొక్కల పెంపకం ద్వారానే తన పొలానికి అవసరమైన సేంద్రీయ ఎరువులను సమకూర్చుకోగలుగుతున్నాడు.

ఇతరులకు ఆదర్శంగా …

పర్యావరణ సేద్య విధానాలపై పెరిగిన అవగాహనతో పరిసర ప్రాంతాలలోని ఇతర రైతన్నలకు కూడా పర్యావరణ హితమైన వాతావరణాన్ని అందించగలుగుతున్నారు. వారి ప్రయత్నాలు, ఫలితాలపై జరిపిన అధ్యయనంలో తేలిన మరో విషయం ఏమిటంటే దాదాపు 39 శాతం స్వచ్ఛంద సంస్థలు తమ పరిధిలోని వ్యవసాయదారులు వర్మి కంపోస్టు, సజీవ ఎరువులు, శ్రీ సేద్యం వంటి విధానాలను  అనుసరించేందుకు ప్రోత్సహిస్తున్నాయి. ఉత్తరాఖండ్ లోని మారు మూల గ్రామమైన అకోటంలో వర్మికంపోస్టు తయారీని సామాజిక బాధ్యతగా అక్కడి రైతన్నలకు అప్పగించడం జరిగింది. ఇందుకు లీసా మేగజైన్ ప్రచురించిన వ్యాసమే స్ఫూర్తినిచ్చింది.  అందులో సూచించిన విధంగా పశువులకు దాణాగా ఉపయోగపడే అజోలా సాగును మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలలో ని పాడి పరిశ్రమలో ప్రవేశపెట్టారు. మంచి ఫలితాలు సాధిస్తున్నారు. వ్యవసాయ సంబంధ అభివృద్ధి కార్యక్రమాలను గురించి సలహా సూచనలిచ్చే సచిన్ సురేశ్ లీసా మేగజైన్ అందించిన ఒక వ్యాసం ప్రేరణతో పీతల పెంపకంలో పెరిగే గుందీ అనే పురుగుల వృద్ధికి ఇతర రైతులకు మార్గదర్శకం చేశాడు. ఈ గుందీ పురుగులు (ఒక రకం వానపాములు) వ్యవసాయదారులకు చాలా ఉపయోగపడతాయి. అదే విధంగా తమిళనాడులో వ్యవసాయ దారులకు సలహాలు ఇస్తున్న సీడ్స్ అనే సంస్థ అజోలా, వర్మి కంపోస్టు అభివృద్ధికి తోడ్పడుతోంది. మేగజైన్ ప్రేరణతో మొదట్లో నలుగురైదుగురు రైతులు మాత్రమే ఈ దిశగా దృష్టి పెట్టారు. ఇప్పుడు చాలా మంది అదే బాట పట్టారు.

పర్యావరణ సేద్యం గురించిన సమాచారాన్ని శాస్త్ర పరిశోధకులు మరో విధంగా ఉపయోగించుకున్నారు. నిజానికి వారు కూడా ఈ సమాచారాన్ని ఆచరణలోకి తీసుకువచ్చి సత్ఫలితాలను సాధించారు. ఉదాహరణకు, నీటి పారుదల సదుపాయాలు అంతంత మాత్రంగా ఉండే మెట్ట ప్రాంతాలలో సేంద్రీయ సేద్యాన్ని ఒక నమూనాగా ప్రవేశపెట్టారు. భూసార సంరక్షణ గురించిన సమాచారంపైనా, ఆచరణాత్మక ఉత్పాదన సమర్థవంతమైన నిర్వహణ గురించి కేంద్ర మెట్ట ప్రాంతాల వ్యవసాయ పరిశోధన సంస్థ (సీఏజెడ్ఆర్ఐ) ఒక నమూనాను తయారు చేసారు. స్థానిక స్థాయిలో వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలను పర్యవేక్షించే కృషి విజ్ఞాన్ కేంద్రాలు కూడా ఈ మేగజైన్ ఆధారంగా కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఉదాహరణగా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్ లోని సేంద్రీయ పత్తి మార్కెటింగ్ పై (ఎంటర్ ప్రైజెస్ పర్ ఫార్మెన్స్ మేనేజ్ మెంట్) దృష్టి పెట్టాయి.

ఆలోచనల్లో, ఆచరణలో కొత్తదనం

ఇటీవల కాలంలో వ్యవసాయ నిపుణులు ప్రజా ప్రయోజనాల ప్రాతిపదిక మీద, స్థానిక అవసరాల ఆధారంగానూ, సంప్రదాయ విధానాల మీద దృష్టి కేంద్రీకరించి తమ పరిశోధనలను చేపడుతున్నారు. ఈ లక్ష్యంతో వ్యవసాయదారులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వారికి ఉపయోగకరమైన సేద్య పద్ధతులకు రూపకల్పన చేస్తున్నారు. ముఖ్యంగా భాగస్వామ్య సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి (పార్టిసిపేటరీ టెక్నికల్ డెవలప్ మెంట్), వ్యవసాయదారుల క్షేత్ర స్థాయి బోధన (ఫార్మర్స్ ఫీల్డ్ స్కూల్స్) పై వారు పరిశోధనలు చేపట్టారు. ఇందుకు మేగజైన్ లోని వ్యాసాలే స్ఫూర్తినిచ్చాయి. ఇందుకు తమిళనాడులోని కోయంబత్తూర్ లోని చెరకు పరిశోధనా కేంద్రం (సుగర్ క్రేన్ బ్రీడింగ్ ఇనిస్టిట్యూట్) ఒక ప్రయత్నం చేసింది.  ఒక చక్కెర ఫ్యాక్టరీ పరిధిలో వేర్వేరు రకాలైన విధానాలను ప్రోత్సహించింది. ఫలితంగా ఆ ఫ్యాక్టరీ మూసివేత ప్రమాదంనుంచి బయటపడింది. ఇదే విధంగా చాలామంది పాఠకులు / స్వచ్ఛంద సంస్థలు వ్యవసాయదారుల శిక్షణపై ఆసక్తి పెంచుకున్నాయి. తమ వ్యవసాయ క్షేత్రాలలో తమకు అవసరమైన తీరులో ఉపయోగించుకున్నాయి.

ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాల కోసం చాలా మంది శాస్త్రవేత్తలు, విద్యావంతులు కూడా లీసా ఇండియా సంస్థ ప్రచురిస్తున్న మేగజైన్ లో లభించే సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. వారికి ఈ మేగజైన్ ద్వారా విజ్ఞానం పెంపొందడమే కాకుండా వారి పరిశోధనల్లో కొత్త ఆలోచనలకు మార్గం లభిస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన కొన్ని పరిశోధనల్లోనూ, పీహెచ్ డీ అధ్యయనాలలోనూ ఈ వ్యాసాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. కొత్త ప్రాజెక్టులకు అవసరమైన ఆలోచనలకు కూడా ఇవి స్ఫూర్తినిస్తున్నాయి.

సంస్థాగతంగా మెరుగైన వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావటంలో కూడాఈ మేగజైన్ తోడ్పడుతోంది. ఉదాహరణకు ఉత్పత్తిదారుల కంపెనీ ఏర్పాటుకు మేగజైన్ లోని సారాంశమే మార్గం చూపింది. కేరళలోని అట్టపడి ప్రాంతాంలోని రైతన్నలు సంఘటితమై స్వచ్ఛంద సంస్థ అయిన అహాద్స్ (అట్టపడ్డి హిల్ డెవలప్ మెంట్ సొసైటీ) సాయంతో ఫార్మా అనే కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. ఫెయిర్ ట్రేడ్ విషయంపై వ్యాస రచయితను ఈ సంస్థ సంప్రదించింది. రైతన్నలను సంఘటితపరచడంపై వారి సూచనలను ఆదారం చేసుకునే ఫార్మా ఏర్పాటుకు ముందుకొచ్చింది.

లీసా ఇండియా నుంచి ఆవిష్కృతమైన ముఖ్యమైన మార్పులలో ఒకటి – వరి ఉత్పత్తి విధానాలలో ప్రవేశపెట్టిన విధానాలు. శ్రీ వరి సాగు (సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్) విధానం రూపొందించి అమలు చేయడంలో లీసా ఇండియా చాలా సంవత్సరాలుగా ఆదర్శంగా నిలుస్తోంది. చాలా మంది రైతన్నలకు శ్రీ వరి సాగులో లీసా ఇండియా నుంచి లభించే సమాచారమే కీలకంగా ఉంటూ వచ్చింది. వారు స్వయంగా తమ పంట పొలాల్లో శ్రీ వరి సాగును చేపట్టారు. లేదా ఇతర రైతన్నలను ప్రోత్సహించి శ్రీ వరి సాగు చేపట్టేందుకు తోడ్పడ్డారు. ఉదాహరణకు  ఒరిస్సాకు చెందిన ప్రదీప్ కుమార్ తన రాష్ట్రంలో సుమారు వెయ్యి మంది శ్రీ వరి సాగును చేపట్టేందుకు ప్రోత్సాహం అందించారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. అందుకు తనకు మేగజైన్ లోని సమాచారమే స్ఫూర్తినిచ్చిందని ఆయన తెలిపారు. నిజానికి ఆయన చొరవ తీసుకున్న తర్వాతనే అక్కడి ప్రభుత్వం కూడా శ్రీ వరి సాగును ప్రోత్సహించడం ప్రారంభించింది.

మేగజైన్ లో వచ్చే సమాచారం ఆధారం చేసుకునే చాలా మంది తమ వ్యవసాయ క్షేత్రాలలో తాము చేపట్టే కార్యక్రమాలను మరింతగా మెరుగుపరచుకున్నారు.  చాలా స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే వ్యవసాయ శిక్షణ కార్యక్రమాలలో మేగజైన్ లోని సమాచారాన్ని కూడా ఉపయోగించుకుంటూ వచ్చాయి. ఈ సమాచారం ఆధారంగా తాము ఆశించిన మార్పులను తీసుకురావచ్చుననే గట్టి నమ్మకం వారిలో ప్రబలంగా కనిపిస్తుంది. పైగా ప్ర్త్యామ్నాయ వ్యవసాయ విధానాల గురించి ప్రత్యేకంగా తమ శిక్షణలో చోటు ఇచ్చేందుకు అవసరమైన సమాచారం వారి దగ్గర లేకపోవడంతో వారు మేగజైన్ పైనే ఆధారపడకతప్పేది కాదు. ఇందుకోసం కూడా వారికి లీసా మేగజైన్ సహాయపడుతూ వచ్చింది. ఈ మేగజైన్ సమాచారం ఆధారంగానే రైతులకు ఇచ్చే శిక్షణలో సేంద్రీయ వ్యవసాయం గురించి వివరించేందుకు కావల్సిన పాఠ్య అంశాన్ని కూడా మేగజైన్ లోని సమాచారం ఆధారంగానే రూపొందించారు.

ప్రధాన స్రవంతిలో భాగంగా …

లీసా ఇండియా మేగజైన్ లోని సమాచారాన్ని ఆధారం చేసుకుని వ్యవసాయదారులకు ఉపయోగకరమైన ప్రదర్శనలను పరిశోధనా సంస్థలు రూపొందించాయి. పరిశోధనా అంశాలను ఎంపిక చేసుకున్నారు. ఉదాహరణకు వాతావరణ మార్పులకు సంబంధించిన పరిశోధనాంశాన్ని మేగజైన్ లోని సమాచారం సహాయంతోనే ఎంపిక చేసుకున్నారు. ఉద్యానవనాల పరిశోధనా కేంద్రం రూ. 9 లక్షలు ఖర్చు అయ్యే పారా-ఏజెంట్ల గురించి అధ్యయనం చేపట్టింది. దీనికి మేగజైన్ లో వచ్చిన వ్యాసమే ప్రేరణగా నిలిచింది. అదే విధంగా, భూసార పునరుద్ధరణకు సంబంధించి మేగజైన్ లో వచ్చిన వ్యాసం ఆధారం చేసుకునే అనుకూలమైన రీతిలో మైక్రోబ్స్ సమూహాన్ని గుర్తించేందుకు ఈ కేంద్రం రెండు ప్రతిపాదనలను పరిశీలనకు స్వీకరించింది.

విజ్ఞానవేత్తలు లీసా ఇండియా మేగజైన్ లోని సమాచారాన్నే ఉపయోగించి ఇతరులకు శిక్షణ ఇస్తున్నారు. సుస్థిర వ్యవసాయం, సుస్థిర అభివృద్ధి, సేంద్రీయ సాగు విధానాలు, వ్యవసాయ క్షేత్రాల సక్రమ నిర్వహణ, భూసార రక్షణ, నీటి సద్వినియోగం, క్రిమికీటకాలకు పర్యావరణకు ఉన్న సంబంధాలు వంటి వాటి గురించి పాఠ్యప్రణాళికలలో చోటు కల్పించారు. ప్రత్యేక కోర్సులను నిర్వహించారు. తమిళనాడులోని గాంధీగ్రామ్ రూరల్ యూనివర్సిటీ నిర్వహించే బోధనా కార్యక్రమాలలో లీసా సంస్థకు ప్రాధాన్యం ఇచ్చింది. మూడేళ్లకోసారి బోధనాంశాలను మెరుగుచేసే సమయంలో మేగజైన్ లో లభించే సమాచారానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. వ్యవసాయ విస్తరణకు సంబంధించిన ప్రాథమిక శిక్షణలో మేగజైన్ సమాచారానికి తగిన ప్రాధాన్యతనిచ్చారు. తాజాగావాతావరణ మార్పులపై మేగజైన్ ప్రచురించిన సమాచారం ఆధారంగా వాటిపై ప్రత్యేకంగా ఒక అధ్యయన కకేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉంది. ఇలా వివిధ వర్గాల నుంచి అందుతున్న ప్రోత్సాహం గమనిస్తే, సుస్థిర వ్యవసాయం ప్రతిపాదనకు ప్రధాన స్రవంతిలో ఆలోచనల పరంగానూ, ఆచరణాత్మకంగానూ ప్రాముఖ్యత గణనీయంగా పెరుగుతున్నట్టు స్పష్టమవుతుంది. అందుకు ఆయా సంస్థల ప్రాధాన్యతల్లో కానీ, ప్రణాళికలలో కానీ వచ్చిన మార్పులు కారణం కావచ్చు. లేదా అది కేవలం కొద్ది మంది వ్యక్తుల అత్యుత్సాహం కావచ్చు.

విస్తృతంగా జరుగుతున్న ప్రచారం

మేగజైన్ ద్వారా లీసా ఇండియా అందిస్తున్న సమాచారం కేవలం రైతన్నల వరకు మాత్రమే కాకుండా ఆసక్తి గల అన్ని వర్గాల వారికి చేరేందుకు వీలుగా అన్ని వైపులా విస్తృతంగా ప్రచారమవుతోంది. ఈ విషయంలో పాఠకులుగా ఉన్న వ్యవసాయదారులే ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నారు. ప్రత్యామ్నాయ వ్యవసాయం గురించిన సమాచారాన్ని

ఈ పాఠక రైతన్నలే విస్తృతంగా తమ రైతు సమాజంలో ఇతరులకు పరిచయం చేస్తున్నారు. వారిలో దాదాపు 54 శాతం మంది ఇలా పరస్పరం సమాచారం ఇచ్చి పుచ్చుకుంటుండగా, 41 శాతం మంది వర్క్ షాపుల్లోనూ, సమావేశాలలోను ఇతరులకు తెలియజేస్తున్నారు. ఇక 53 శాతం మంది తమకు వృత్తిపరంగా సహాయసహకారాలు అందిస్తున్న నిపుణులతో సంప్రదించి మంచిచెడులను బేరీజు వేసుకుంటున్నారు.

ఇక ఔత్సాహికులు, పరిశోధకులు, విద్యార్థులు తాము పాల్గొనే వివిధ రకాలైన సమావేశాలు, వర్క్ షాపులను లీసా మేగజైన్ అందించే సమాచారాన్ని ఇతరులకు తెలియజేసేందుకు వేదికలుగా ఉపయోగించుకుంటున్నారు. వ్యవసాయానికి సంబంధించి ఎక్కడ ఏ రకంగా ఏ కొద్ది మంది కలిసినా వారి మధ్య తప్పనిసరిగా లీసా మేగజైన్ సమాచారం ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఉపయోగపడుతూనే ఉంటుంది. లీసా మేగజైన్ లో కనిపించే సమాచారంతో పాటు వాటిలో ప్రస్తావనకు వచ్చే ఇతర పుస్తకాలు, ఇతర మూల సమాచారం కూడా వారికి ఉపయోగపడుతోంది.

లీసా మేగజైన్ ఆధారంగా సేద్య విధానాలపై మాత్రమే కాకుండా సమీకృత విధానాల ప్రయోజనాలపై కూడా ప్రగాఢమైన నమ్మకం రైతన్నల్లో క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో వారు సంప్రదాయక విధానాలలో అవసరమైన మార్పులను కూడా పాటించేందుకు వెనుకాడడం లేదు. ముఖ్యంగా లీసా ఇండియా మేగజైన్ ప్రతిపాదించిన ఎకరా నమూనా వారికి ఎక్కువ ఆసక్తి కలిగించింది. చాలా మంది దానిని అనుసరిస్తున్నారు. వారిలో చాలా మంది నమూనా క్షేత్రాలను స్వయంగా సందర్శించి కొత్త విధానాలను, పద్ధతులను తమ పంట పొలాల్లో అనుసరించేందుకు ఆసక్తి చూపించారు.

ఇతర ప్రచార సాధనాలు కూడా లీసామేగజైన్ లోని సమాచారాన్ని తమ ప్రింట్, దృశ్య ప్రచారాల్లో విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ సమాచారం ఆధారంగా చాలామంది పాత్రికేయులు తమ స్థానిక భాషలలో ఇతరులకు చేరవేస్తున్నారు. ఉదాహరణకు లీసా ఇండియా మేగజైన్ ప్రచురించిన వ్యాసం సహాయంతోనే కన్నడ దినపత్రిక ప్రజావాణి విలేకరి ఎకరా నమూనాపై తన పత్రికలో ఒక వ్యాసం ప్రచురించాడు. దానిని చూసిన పాఠకుల నుంచి సుమారు 5 వేల మంది మరింత సమాచారం కోరుతూ ఆయనకు ఫోన్లు చేశారు. బెంగాలీ, ఒరియా, మలయాళం భాషల్లోకి చాలా మంది పాఠకులు వీటిని అనుదించి తమ ప్రాంతీయులకు అందుబాటులోకి తెచ్చారు. ఆల్ ఇండియా రేడియో తన వ్యవసాయ కార్యక్రమాలలో ఇలా మేగజైన్ లోని సమచారాన్ని ఉపయోగించుకుంది. లీసా ఇండియా మేగజైన్ కు వ్యాసాలు రాసే కాలమిస్టు శ్రీ నారాయణ రెడ్డితోఇంటర్వ్యూను గుల్బర్గా రేడియో ప్రసారం చేసింది. దానికి మంచి స్పందన వచ్చింది. ప్రసార భారతి, దూరదర్శన్ డైరెక్టర్ దీని గురించి మాట్లాడుతూ ‘లీసా ఇండియా సమాచారమే’ పర్యావరణ అనుకూల సేద్యం విషయంలో తమకు ప్రామాణికంగా నిలిచిందని చెప్పారు. అంతేకాక తమ సిబ్బందిని ఈ మేగజైన్ సమాచారాన్ని అధ్యయనం చేసి కార్యక్రమాలను రూపొందించాలలని ఆయన సూచించారు కూడా.

మార్పులకు తోడ్పడే సమాచారం

కార్పొరేట్ సంస్థలు, బహుళ దేశాల గుత్త సంస్థల అధీనంలో మొత్తం వ్యవస్థ సాగుతున్న సమయంలో ప్రజల ప్రయోజనాలు లక్ష్యంగా మార్పుల కోసం ప్రయత్నించడం కత్తి మీద సాములాంటిదే. చాలా కాలం పోరాడితే కానీ ఫలించే అవకాశం ఉండదు. అలాంటి మార్పు కోసం చేసే ప్రయత్నంలో ఈ సమాచార మార్పిడి అనేదే ప్రధాన సాధనం. అందువల్ల సమాచార మార్పిడి, విజ్ఞాన విస్తరణ అందుకు అవసరమైన ప్రయత్నాలు, అనుసంబంధిత వ్యవస్థలు, సామర్థ్యం పెంపు నైపుణ్యాలు, పాలకుల నుంచి సానుకూల విధాన నిర్ణయాలు చాలా కీలక పాత్ర వహిస్తాయి. అన్నీ సమకూరినప్పుడే వ్యవసాయం, జీవనోపాధులు సుస్థిరమై ఆశించిన ప్రయోజనాలు చేకూరుస్తాయి.

టి.ఎం. రాధ
మేనేజింగ్ ఎడిటర్, లీసా ఇండియా
ఏఎంఈ ఫౌండేషన్,
బెంగళూరు 500 085
Email: leisaindia@yahoo.co.in

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి 18, సంచిక 3, సెప్టెంబర్ ౨౦౧౬

 

 

 

 

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...