పరోక్ష పంటలు

పుడమి తల్లి కరుణ కారణంగా రైతన్న కష్టంతో పని లేకుండానే విలువైన పోషకాలను, ఔషధ విలువలను సమకూర్చే మొక్కలను మనకు అందజేస్తోంది. అలాంటివి వందల సంఖ్యలో ఉన్నాయి. వాటిని మనం ఆరుగాలం కష్టించి సాగు చేయవలసిన పనిలేదు. అందుకే వాటిని పరోక్ష సాగు ఫలితాలు అని చెప్పుకోవాలి. అవి మనకు రోజువారీ ఆహారంలో పోషకాలను సమకూర్చడమే కాక, కొంత ఆదాయం కూడా అందిస్తాయి.

మనం నివసించే ఈ భూమి మీద దాదాపు 12000 మొక్కలు మనకు ఆహారంహా ఉపయోగపడతాయి. వాటిలో కేవలం 15 రకాలు దాదాపు 90 శాతం ఆహార అవసరాలను తీరుస్తున్నాయి. వాటిలో కూడా మూడు చాలా ప్రధానమైన ఆహారపు పంటలుగా చెప్పుకోవాలి. అవి బియ్యం, మొక్క జొన్న, గోధుమలు. మొత్తం ఆహారపు పదార్ధాల్లో దాదాపు మూడింట రెండు వంతులు ఈ మూడు పంటల ద్వారానే లభిస్తుంది. నేటి కాలంలో చాలా దేశాలు తమ ఆహారపు అవసరాల కోసం వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటాయి. అంత మాత్రాన ఆయా దేశాల ప్రజల ఆహార అవసరాలను పూర్తిగా ఆ మూడు పంటలే తీరుస్తున్నాయి అనుకోవడానికి వీలు లేదు. వ్యవసాయ క్షేత్రాలలో సాధారణంగా మనం సాగు చేసే పంటలతో పాటు కొన్ని మన ప్రమేయం లేకుండానే పెరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని మనం ఆహారంలో భాగంగా ఉపయోగించవచ్చు. అలాంటి అసాధారణమైన మొక్కలు ఆహారంలో తీసుకోవడం వల్ల అదనపు ఆదాయం అందించడమే కాకుండా మన ఆరోగ్య సంరక్షణకు కీలకమైన పోషకాలను సమకూరుస్తాయి. ఈ కారణంగానే వాటిని వ్యవసాయ రంగంలో పరోక్ష పంటలుగా  వ్యవహరిస్తారు.

ఆహారంలో ఉపయోగించేందుకు అనువైన ఇలాంటి మొక్కలను కేరళలో పెద్ద ఎత్తున ఇళ్ల పెరటి తోటల్లోనూ, ఇళ్లలోనూ పెంచడం సర్వసాధారణం. అలా పెరళ్లలోనే లభించే ఈ రకమైన మొక్కలను ఆహారంలో భాగంగా చేరుచకోవడం సర్వసాధారణమే. మలప్పురం జిల్లాలోని దాదాపు 48 ఇళ్లలో వాళ్ల పెరటి తోటలో పెంచుకుంటున్న మొక్కల గురించి వివరాలు సేకరించినప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే  27 రకాలైనవి ఔషధ ప్రాధాన్యతలు ఉన్నవిగా నిర్ధారణ అయింది. వాటిలో 22 రకాల మొక్కల ఆకులు ఆహారంలో ఉపయోగపడతాయని తెలిసింది. మిగిలిన 8 మొక్కలను యథాతథంగా ఆహారంలో తీసుకోవచ్చు. అలాంటి వాటిలో సరస్వతీ ఆకుల మొక్కలు (సెంటెల్లా ఆసియాటికా), పులిచింత మొక్క (Oxalis corniculata), ఫిలాంతస్ యురినారియా అనబడే మొక్క, పెద్ద పవిలి కూర (Portulaca oleracea), సెన్నా ఆక్సిడెంటలిస్, సెన్నా టోరా అన్న మొక్కలు అన్ని ఇళ్లలోనూ కనిపిస్తాయి. అవి అత్యంత సహజంగా పెరుగుతాయి. ఇండ్ల పెరళ్లలో అనివార్యంగా ఇవి కనిపిస్తూనే ఉంటాయి. అవి ఆహారంగానే కాక ఔషధాలు కూడా విస్తృతంగా వాడుకలో ఉన్నాయి.

ఇండ్ల పెరళ్లలో తోటలను పెంచుకునే కుటుంబాల వారు ఈ రకమైన ఆహారయోగ్యమైన మొక్కలను సేకరించేందుకు రెండు పద్ధతులు అనుసరిస్తారు. ఉదాహరణకు, ఆల్టర్నంత్ర బెట్టిజికియానా, ఆల్టర్నంత్ర పుంజెన్స్, అమరాంతస్ కాడాటస్, అమరాంతస్ స్పినోసస్, డిప్లజియమ్ ఎస్కలెంటమ్, సెన్న ఆక్సిడెంటల్స్, సెన్న తోర వంటి మొక్కలను సేకరించేందుకు గుంపులు గుంపులుగా బయలుదేరుతారు. మరోవైపు మరి కొన్ని రకాలైన మొక్కల కోసం (సెంటెల్లా అసియాటికా, ఆకాసలిస్ కార్నికులతా, ఫిలాందస్ యురినారియా వంటివి) ఎప్పుడు పడితే అప్పుడే లభ్యమవుతాయి. ఆ కారణంగా ప్రత్యేకంగా ఏ ప్రయత్నం అవసరం లేకుండా సేకరించగలుగుతారు.

ఆహార యోగ్యమైన మొక్కలలో ప్రొటీన్, ఫైబర్, ఫాట్, కొన్ని మినరల్స్ లభించడమే కాక ఇతర వాణిజ్యపరమైన కాయగూరలతో పోల్చినప్పుడు వాటిలోని ఎక్కువ పోషకాహార విలువలు సమృద్ధిగా వీటిలో లభిస్తాయి.

ఈ సమయంలో గమనించవలసిన విషయం ఏమిటంటే  – ఈ ప్రాంతాలలోని చాలా కుటుంబాలకు ఇలాంటి సమృద్ధిగా పోషకాలు ఉన్న 27 రకాల మొక్కల గురించి పూర్తి అవగాహన ఉంది. అయితే వాటిలోని పోషక విలువ గురించి శాస్త్రీయబద్ధమైన విశ్లేషణలు ఏవీ జరగలేదు.  కానీ ఇటీవలే కేరళ ఫారెస్ట్ ఇనిస్టిట్యూట్ ఆ దిశగా కొంత ప్రయత్నం చేసింది. వాటిలోని 11 పోషకాల విలువల గురించిన సమాచారాన్ని టేబుల్ 1లో గమనించవచ్చు.

మన శరీరంలోని జీవకణాలు సక్రమంగా పెరగడానికి, వాటిని భద్రంగా కాపాడడానికి ప్రొటీన్లు చాలా కీలకమైనవి. ఇండియన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నూట్రిషన్ అధ్యయనం ప్రకారం ప్రతీ వ్యక్తికీ రోజుకి 60 గ్రాముల ప్రొటీన్లు అవసరం. ఈ అధ్యయనం ప్రకారం ఈ ఒక్కో రకం ఆహారయోగ్యమైన మొక్కల్లో ప్రతీ గ్రాములోనూ 19.3 మిల్లీ గ్రాముల నుంచి 54.33 గ్రాముల వరకు ప్రొటీన్లు లభిస్తాయి. క్లియోమ్ విస్కోసా, డిప్లజామ్ ఎస్కులెంటమ్, రెముసాటియా వివిపరా, ఆల్టర్నతెర బెట్జికియానా వంటి వాటిలో మరిన్ని ప్రొటీన్లు ఉన్నాయి. పాలకూర, క్యాబేజీ (లెట్యూస్) వంటి వాటిలో కన్నా ఎక్కువ మోతాదులో ప్రొటీన్లు ఉన్నాయి.

అదేవిధంగా ప్రతీ మనిషికీ శరీరంలో శక్తి నిల్వ ఉండడానికీ, నరాల సత్తువను కాపాడడానికి, మెదడు చురుగ్గా పనిచేయడానికీ తగు మోతాదులో ఫాట్స్ కూడా అవసరం. ఆకు కూరల్లో ఫాట్స్ స్వల్పంగా ఉంటుందనేది సాధారణ జనాభిప్రాయం. ఇప్పటివరకూ పరిశీలించిన 27 రకాల మొక్కల్లో రెముసాటియా వివిపరా, క్లియోమ్ విస్కోసా లలో అత్యధిక మోతాదులో ఫాట్స్ ఉంటాయని తెలిసింది. (ఒక గ్రాములో 0.015 – 0.016 మిల్లీ గ్రాముల వరకూ.) మనం నిత్యం ఉపయోగించే ఆకుకూరలతో పోలిస్తే ప్రత్యేకంగా సాగు చేయవలసిన అవసరం లేని ఈ ఆహారయోగ్యమైన మొక్కల్లో ఎక్కువ ఫాట్స్ ఉంటాయి.

ఇక ఫైబర్ (సాదారణ భాషలో వీటిని పీచు పదార్థాలు అంటాం) మన శరీరంలో జీర్ణ ప్రక్రియను పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇండియన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నూట్రిషన్ అంచనా ప్రకారం ప్రతీ మనిషికీ రోజుకూ 28 నుంచి 35 గ్రాముల వరకూ ఫైబర్ అవసరం. ఇప్పటివరకూ అధ్యయనం చేసిన అన్ని రకాలైన మొక్కల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుందని నిర్ధారణ అయింది. డిప్లజియమ్ ఎస్కూలెంటమ్ రకం మొక్కల్లో రపతి గ్రాములోను 49.8 మిల్లీ గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. అంటే 100 గ్రాముల మొక్కలతో చేసిన వంటకాల నుంచి మన శరీరానికి కావల్సిన ఫైబరంలో 9 నుంచి 12 శాతం లభిస్తుంది.

కాల్షియం కూడా మన శరీరానికి రోజూ అవసరం. మన శరీరంలో తగినంత కాల్షియం ఉంటేనే మన కండరాలు పటిష్టంగా ఉంటాయి. నరాలు బలంగా ఉంటాయి. ఇప్పటివరకూ అధ్యయనం చేసిన మొక్కల్లో డిప్లజియమ్ ఎస్కూలెంటమ్, తాలినం క్యునీఫోలియమ్ మొక్కల్లో (ఒక గ్రాములో 12.6 నుంచి 13.3 మిల్లీ గ్రాముల వరకూ) కాల్షియమ్ ఉంటుందని తేలింది. మనకి రోజుకి కనీసం 18 మిల్లీ గ్రాముల ఐరన్ అవసరం. అప్పుడే రక్తం సమృద్ధిగా వృద్ధి చెందుతుంది. ఆక్సిజన్ ను చురుగ్గా ప్రసారంచేయగలుగుతుంది. ఈ 27 రకాల మొక్కల్లో తాలినమ్ కునీఫోలియమ్ లో మిగిలిన వాటికన్నా ఎక్కువ మోతాదులో ఐరన్ ఉంటుంది. (ఒక గ్రాములో 0.8 మిల్లీ గ్రాములు).

చివరికి మనం నిర్ధారణకు రావలసిన  అంశం ఏమిటంటే – ప్రత్యేకంగా సాగు చేయవలసిన అవసరం లేకుండా మన చేనులోనే తమంతట తాము పెరిగి మనకు ప్రొటీన్, ఫైబర్, ఫాట్, మినరల్స్ వంటి పోషకాలను సమృద్ధిగా అందించే మొక్కలు ఎంతో ఉపయోగకరమైనవి. వాణిజ్యపరంగా సాగు చేసే ఇతర రకాల కాయగూరల కన్నాఇవి ఎన్నో విధాలుగా ఎక్కువ శ్రేష్టమైనవి. ఈ మొక్కల్లో మరో సుగుణం కూడా ఉంది. వాటిలో చాలా ఔషధ విలువలున్నాయి. ఈ అన్ని కారణాల వల్ల ప్రస్తుతం మన సమాజంలో పెద్ద సమస్యగా తయారైన పోషకాహార లోపానికి ఈ మొక్కలు అతి చవకగా లభించే పరిష్కారం అని గుర్తించాలి. మనం ప్రత్యేకంగా సాగు చేయవలసిన అవసరం లేదు. అంటే వాటి కోసం మనం ఎలాంటి అదనపు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. వాటికి తగినంత ప్రాచుర్యం కల్పించి, సక్రమంగా వాటి వినియోగాన్ని ప్రోత్సహించినట్లయితే ఇంతవరకూ అంతగా ప్రచారంలో లేని ఈ మొక్కల వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. జీవ వైవిధ్యానికి తోడ్పడతాయి. మారుమూల పల్లెల్లో ఆహార భద్రతకు సహకరిస్తాయి.

యు.ఎం. చంద్రశేఖర
సైంటిస్ట్ ఇన్ చార్జీ,
కేరళ ఫారెస్ట్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ సబ్ సెంటర్,
నీలంబూర్ (పోసాటఫీస్) – మలప్పురం
కేరళ – 679 329
E-mail: umchandra@rediffmail.com

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి 18, సంచిక 2, జూన్ ౨౦౧౬

 

 

 

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...