పరిశ్రమగా సేంద్రీయ సేద్య విస్తరణ

వర్షాధారిత సేద్యంపై ఆధారపడిన రైతులు ఎప్పుడూ ఒడిదుడుకులనే ఎదుర్కొంటూ ఉంటారు. అయితే అలా ఎదురయ్యే సవాళ్లనే అద్భుతమైన అవకాశాలుగా మళ్లించుకోవాలంటే వారిలో చాలా దృఢమైన మనోబలం కావాలి. అంతకన్నా ఎక్కువగా వారికి ఇతరుల నుంచి సహాయసహకారాలు, ప్రోత్సాహం కూడా అంతే అవసరం. అలా తనకు ఎదురైన సవాళ్లనే అనుకూలంగా మార్చుకుని ఆదర్శప్రాయమైన ఫలితాలు సాధించిన వారిలో సెబాస్టియన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన అనుసరించిన సేంద్రీయ  సేద్య విధానాలు ఉత్తమ ఫలితాలను ఇవ్వడమే కాకుండా మరెందరికో చేయూతనిస్తున్నాయి.

సేంద్రీయ పద్ధతుల్లో సేద్యం చేసే విషయంలో సేంద్రీయ లేదా జీవ సంబంధిత ఇన్ పుట్స్ వినియోగానికి అత్యంత ప్రాధాన్యం ఉన్నదని అందరికీ తెలిసిందే. సంప్రదాయబద్ధమైన వ్యవసాయంలో రసాయనాల వినియోగం చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయం కూడా తెలిసిన అంశమే. ఎందుకంటే రసాయనాల వినియోగం వల్ల వాటి ప్రభావం నేరుగా పంటలపై కనిపిస్తుంది. ఎందుకంటే పంటకు పోషణ, రక్షణ కూడా లభిస్తుంది. సేంద్రీయ సేద్యంలో ఇన్ పుట్ ల ప్రభావం పొలంలోని మట్టిపై ఎక్కువగా ఉంటుంది. పర్యావరణాన్ని పంట ఎదుగుదలకు అనుకూలంగా చేస్తుంది. ఈ పద్ధతి అనుసరించినప్పుడు చీడపీడల బెడద ఆర్థికంగా పరిమిత నష్టాల పరిధి (ఎకనామికల్ త్రెష్ హెల్డ్ లిమిట్ – ఈటీఎల్) లోనే ఉంటుంది. సేంద్రీయ సేద్యం చేపట్టడానికి ముందుకు వచ్చే వ్యవసాయదారులు గమనించ వలసిన ముఖ్యమైన అంశాలు రెండు ఉన్నాయి. ముందుగా అవసరమైన సేంద్రీయ ఇన్ పుట్లు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయా అనేది మొదటిది కాగా, కాగా, ఉత్పత్తి నాణ్యత ఎలా ఉంటుంది అన్నఅంశం రెండొవది.

ఇటీవలి సంవత్సరాలలో కొంతమంది రైతులు పారిశ్రామిక దృక్పథంతో నూతన పద్ధతులను అనుసరించేందుకు కూడా ముందుకు వస్తున్నారు. ప్రధానంగా జీవ సంబంధిత ఉత్పాదనలను అత్యుత్తమ నాణ్యతలతో తయారు చేసేందుకు, అలా తయారైన వాటిని రైతులకు చవక ధరలకే చేరువ చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. రైతుల్లో సేంద్రీయ సేద్య విధానాలపై ఆసక్తి పెరుగుతున్న విషయాన్ని వారు గుర్తించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాలైన సేంద్రీయ, జీవ సంబంధిత ఇన్ పుట్లను వారికి విక్రయించేందుకు చురుగ్గా అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. అలాంటి వారిలో సెబాస్టియన్ ఒకరు. ఇతర రైతులకు ఉపయోగకరమైన సేంద్రీయ ఇన్ పుట్లను తయారుచేసి ఆ పరిసరాలలోని వాళ్లందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

వాస్తవానికి ఆయన కూడా ఒక సాధారణ వ్యవసాయదారుడే. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లా వైయంపట్టి బ్లాకు, ముంగవనూరు గ్రామానికి చెందిన ఆయనకు కేవలం నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే ఉంది. అందులో రెండున్నర ఎకరాల పొలంలో వర్షాధారిత సేద్యానికి కేటాయించారు. మరో రెండు ఎకరాలను బావి లేదా బోర్ వెల్ ఆధారంగా సేద్యం చేస్తుంటాడు. అయితే దశాబ్దకాలంగా, ఇంకా ఎక్కువ కాలమే కావచ్చు,  అక్కడ కరువుకాటకాలు సర్వసాధారణమైపోయాయి. దాంతో, పంటలను పండించడం అనేది ఆయనకు ప్రతి ఏడాది పెద్ద సమస్యగా ఉండేది. అందువల్ల ఆయన అధికంగా నీటి వనరులు అవసరమైన పంటలను, వరి వంటివి,  పండించడం మానివేశాడు. వాటి స్థానంలో కాకర కాయలు, పొట్ల కాయలు, బీర కాయలు వంటి కూరగాయల సాగు ప్రారంభించాడు. వాటి నీడలో టమేటా కూడా పండించడం మొదలుపెట్టాడు. ఈ పద్ధతిని అట్టడుగు స్థాయిలో అనుసరించదగిన అత్యుత్తమ ఆవిష్కరణగా గుర్తింపు పొందింది. ఇదే విధానాన్ని నార్వేలో క్లైమా-అడాప్ట్ (అంటే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా) సేద్యం చేసే విధానం రూపంలో అమలవుతోంది. తమిళనాడు వ్యవసాయ విశ్వ విద్యాలయం కూడా 2012 సంవత్సరంలో స్వీకరించింది. ప్రయోగాలు చేపట్టింది.

సేంద్రీయ సేద్య విధానం – పురోగమనం తీరు

సెబాస్టియన్ నివాసం, వ్యవసాయ క్షేత్రం రెండూ వనగం సంస్థకు సమీపంలోనే ఉంటాయి. ఈ సంస్థను కీర్తి శేషులు శ్రీ నమ్మళ్వార్ అనే ఆయన ఏర్పాటు చేశారు. తమిళనాడులో సేంద్రీయ వ్యవసాయ రంగంలో ప్రముఖ పాత్ర నిర్వహించి పేరు గడించిన వ్యక్తి ఆయన. 2013లో వనగం ఆధ్వర్యంలో పర్యావరణ అనుకూల వ్యవసాయం గురించి జరిగిన అయిదు రోజుల శీక్షణ కార్యక్రమాలకు సెబాస్టియన్ కూడా హాజరయ్యారు. ఈ శిక్షణ తరగతులు సురుమాన్ పట్టి గ్రామంలో ఉన్న సేంద్రీయ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. ఆ తరువాత, ఆయన అడుగులు దారి  మళ్లి, సేంద్రీయ సేద్యంవైపు ముందుకు కదిలాయి. ఆయన జీవితంలో అదొక గొప్ప మలుపుగా మారింది.

అనంతర కాలంలో స్థానికంగా స్వచ్ఛందంగా చీడపీడల నివారణ అంశంపై కృషి చేస్తున్న అహింస సంస్థ నిర్వహించిన శిక్షణకు సెబాస్టియన్ హాజరయ్యారు. సమీకృత చీడపీడల నివారణ పద్ధతులపై విస్తృతంగా సేవలను అందిస్తున్న సంస్థ అహింస. తమిళనాడు రాష్ట్రంలో 1997 నుంచీ ఈ సంస్థ కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ప్రధానంగా, ఏఎంఈ (అగ్రికల్చర్ మాన్ ఎకాలజీ) పేరుతో సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నదీ సంస్థ. ఇప్పటికీ, వైయంపట్టి బ్లాకు పరిధిలో పర్యావరణ అనుకూల సేద్యాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తూనే ఉన్నది. ఆ తరువాతి కాలంలో సెబాస్టియన్ అహింస మద్దతుతో నాబార్డు చేపట్టిన ఉజ్వర్ మంద్రమ్ సంస్థలో క్రియాశీలక సభ్యుడుగా చేరారు. ఈ క్రమంలో ఆయన వనగమ్, అహింస సంస్థల కార్యకలాపాలలో భాగంగా ఆయన సాధించిన గుర్తింపు ఆయనకు ఎంతగానో తోడ్పడింది. సేంద్రీయ వ్యవసాయం విషయంలో ఎంతో మందికి ఆయన ఆదర్శంగా నిలిచారు. ఎంతో మందిని ప్రోత్సహించారు. తన పొలంలో కూడా పూర్తిగా సేంద్రీయ సేద్య విధానాలనే అనుసరిస్తూ వచ్చాడు. ఏడాదిలోపే తనకున్న నాలుగున్నర ఎకరాల పొలంలోనూ కూడా పూర్తిగా అన్ని విషయాలలోనూ సేంద్రీయ విధానాలనే పాటించగలిగాడు.

సంక్షోభం నుంచి నూతన సృష్టి

ఆయన విశ్వాసం దెబ్బతినే స్థాయిలో ఒక సమస్య ఎదురైంది. ప్రకృతి ప్రతికూలంగా ఎదురు నిలిచింది. కరువుకాటకాలు వరుసగా దెబ్బతీసాయి. సేంద్రీయ సేద్యం కలగా మారే ప్రమాదం ఏర్పడింది. వరుస సంవత్సరాల్లో ఎదురైన వర్షాభావ పరిస్థితులు తనకున్న వర్షాధారిత పొలంలో వ్యవసాయం ఇబ్బందిగా కనిపించింది. అదే సమయంలో సేద్యపు బావి, బోర్ బావి కూడా ఎండిపోయాయి. ఆ పరిస్థితుల్లో ఏ పంటనైనా సరే పండించడం సాధ్యం కాని పని. అప్పటికీ పండిస్తున్న కూరగాయల మొక్కలను కాపాడుకునేందుకు కుండల్లో నీరు తెచ్చి మొక్కలకు నీరు అందిస్తూ వచ్చాడు.

అలాంటి పరిస్థితులలో పుదుక్కోటై జిల్లా కుడునియన్ మలై లో అన్నా తోటల పెంపకం క్షేత్రంలో (అన్నా హార్టికల్చర్ ఫార్మ్) తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ తరగతులకు సెబాస్టియన్ హాజరయ్యారు. ఈ తరగతుల్లో బయో ఇన్ పుట్లను తయారు చేసి, వాటి విక్రయం ద్వారా అదనపు ఆదాయం సంపాదించవచ్చునో వివరించారు. అక్కడ ఆయన తెలుసుకున్న అంశాలు ఆ.నలో తిరిగి ఉత్సాహం నింపాయి. జీవ సంబంధిత ఇన్ పుట్స్ తయారీ రంగంవైపు ఆసక్తిని పెంచాయి. తనకు ఎదురైన సమస్యకు పరిష్కారం కనిపించినట్లయింది. వెంటనే పంటల సాగు నుంచి తన ఆలోచనను బయో ఇన్ పుట్ల తయారీవైపు మళ్లించాడు. వాటిని మార్కెట్ కు చేర్చడం ప్రారంభించాడు.

“సేంద్రీయ పద్ధతిలో సేద్యం చేయడానికి అవసరమైన విస్తీర్ణంలో నాకు పొలం ఉన్న మాట నిజమే. కానీ, అందులో సగం పొలంలో మాత్రమే పంటలు పండించడం సాధ్యమవుతుంది. ఎందుకంటే నాకు అందుబాటులో ఉన్న నీటి వనరులు సగం పొలానికి మాత్రమే నీరు అందించగలవు. అదే సమయంలో మరి కొందరు రైతులు కూడా సేంద్రీయ సేద్యం చేపట్టేందుకు ఆసక్తి ఉన్నా సాధ్యం కాదని భావించి సొంతంగా తమకు అవసరమైన స్థాయిలో బయో ఇన్ పుట్లను తయారు చేసుకునేందుకు విముఖత చూపించారు. వారి ఆలోచన గుర్తించిన నేను వెంటనే బయో ఇన్ పుట్ల తయారీ రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాను. ఆ విధంగా నాకు కొంత ఆదాయం చేకూరడమే కాకుండా, సేంద్రీయ సేద్యంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్న తోటి రైతులకు తోడ్పడినట్లు కూడా అవుతుందని భావించాను. ఈ ప్రేరణ నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. సంతోషంగానూ ఉంది” అంటూ వివరించారు సెబాస్టియన్.

బయో ఇన్ పుట్స్ తయారీ – ఆదాయం

ప్రస్తుతం ఆయన దశగవ్య, పంచగవ్య, ఫిష్ అమినో ఆసిడ్, వర్మీ కంపోస్టు, హైర్బల్ పెస్ట్ రెపెల్లెంట్ మిశ్రమాలను తయారు చేస్తున్నాడు. వాటికి అవసరమైన ముడి సరుకులుగా తమ వ్యవసాయ క్షేత్రంలో లభించే వ్యర్థాలనే ఉపయోగిస్తున్నాడు. పశువులు, పంటల కాలంలో పేరుకుపోయే వ్యర్థాలు ప్రధానంగా ఉపయోగిస్తూ, చాలా కొద్ది మొత్తంలో బయటి  మార్కెట్ వస్తువులను వినియోగిస్తున్నాడు. ఆయన రెండు దేశవాళీ ఆవులను (స్థానికంగా మనపారై జాతిగా వ్యవహరిస్తారు), వాటితో పాటు ఒక జెర్సీ ఆవును పెంచి పోషిస్తున్నాడు. వాటి మలమూత్రాలను పూర్తిగా బయో ఇన్ పుట్ల తయారీకే కేటాయించాడు.

సెబాస్టియన్ నిర్వహణ సామర్థ్యం గమనించిన వ్యవసాయ శాఖ నుంచి వర్మీ కంపోస్టు తయారీకి సహకరిస్తోంది. ఆయనకు చేయూతగా 2 టన్నుల సామర్థ్యం ఉన్న వర్మీ కంపోస్టు పిట్లను సమకూర్చింది. అదే విధంగా, అహింస సంస్థ కూడా దశగవ్య, పంచగవ్య, ఫిష్ అమినో ఆసిడ్, హెర్బల్ పెస్ట్ రెపెల్లెంట్ మిశ్రమం తయారీకి  తయారీకి అవసరమైన ప్రత్యామ్నాయాలను అందిస్తోంది. వాటితో పాటు అవసరమైన స్ప్ర్రేయర్లను కూడా సమకూర్చింది.

ఆయన కుటుంబంలోని సభ్యులందరూ అంటే భార్యా, ఇద్దరు పిల్లలు కూడా ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఆయనకు తోడుగా ఉంటున్నారు. అవసరమైన హెర్బ్ లను గుర్తించే మెళకువలను ఆయన తన పిల్లలకు నేర్పించాడు. అదే సమయంలో వాటి ప్రయోజనాలను వివరించి, వాటి సేకరణలో, ముడి సరుకులను సేకరించడంలో మాత్రమే కాకుండా, బయో ఇన్ పుట్ల తయారీ, పర్యవేక్షణ, నిర్వహణ, మార్కెటింగ్ వ్యవహారాలలో వారి సేవలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాడు.

తన పొలంలో అవసరాలు తీరిన తరువాత దాదాపు 100 లీటర్ల దశగవ్య, 100 లీటర్ల పంచగవ్య, 20 లీటర్ల ఫిష్ అమినో ఆసిడ్, 100 లీటర్ల హెర్బల్ పెస్ట్ రెపెల్లెంట్ మిశ్రమం, మరో 2000 కిలోల వర్మి కంపోస్టు ను మార్కెట్కు చేర్చగలుగుతున్నాడు. ఆ రకంగా కేవలం బయో ఇన్ పుట్లను విక్రయించడం ద్వారా, ఏటా రూ. 60,000 ల ఆదాయం సంపాదించుకోగలుగుతున్నారు. ఆయన వద్ద వాటిని కొనుగోలు చేసే వారి సంఖ్య 60 నుంచి 70 మంది ఉంటున్నారు. వారిలో 20 మంది మళ్లీ మళ్లీ వచ్చి  తమ అవసరాలను తీర్చుకుంటున్నారు.

ఆయన తయారు చేసిన ఈ బయో ఇన్ పుట్లలో దాదాపు 90 శాతం ఆయన పొలంలో ఉండగానే అమ్ముడైపోతోంది. మిగిలిన కొద్ది మొత్తాన్ని తనకు పరిచయం ఉన్న వారితో ఫోన్ లో సంప్రదించి అమ్మేసుకోగలుగుతున్నాడు. ఈ మధ్య సోషల్ మీడియా మాధ్యమాన్ని కూడా వాడుతున్న కారణంగా గిరాకీ మరింత పెరిగింది. ఇతర రైతులు ఎవరికైనా బయో ఇన్ పుట్ల తయారీలో కానీ, వాడకంలో గాని ఎలాంటి సందేహాలున్నా వారికి సలహా సూచనలు ఇస్తూ, తన వంతు సహాయం అందిస్తున్నాడు.

——————- మార్కెట్ సంబంధిత సవాళ్ల నుంచి రక్షణ కోసం తొలి దశలో బయో ఇన్ పుట్ల తయారీదారులకు వారి ఉత్పత్తిని కొనుగోలు విషయంలో బయ్ బ్యాక్ భరోసా అవసరం. ———-

చిన్న పాటి ప్రయోగశాల

సమష్టి కృషిని ప్రోత్సహించేందుకు, వారిలోని ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్యాన్ని పెంపొందించేందుకు వ్యవసాయ శాఖ 2018-19లో రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. రైతు సంఘం (ఎఫ్.పి.ఓ) సభ్యుడుగా మరో 70 మంది వెంట సెబాస్టియన్ కూడా హాజరయ్యారు. శిక్షణ తరువాత, సెబాస్టియన్ మరో విషయంపై కూడా ఆసక్తి ప్రదర్శించాడు. ఫంగల్ ఆధారిత ఎంటోమోపాథాజెన్ (మట్టిలో నివసిస్తూ, మట్టిలో నివసించే చీడపీడల వ్యాధికారక క్రిములను నాశనం చేసే ఔషధరూపం) తయారీకి కూడా సంసిద్ధత వ్యక్తంచేశారు. దీనిని మెటార్హిజియమ్ అనిసోప్లియా అని కూడా పిలుస్తారు. ఇది బయో కంట్రోల్ ఏజెంట్ గా పనిచేసి, చేను మట్టిలో పెరిగి పెద్దయే సూక్ష్మక్రిములను, మొదళ్లను ధ్వసం చేసే క్రిములను నాశనం చేస్తాయి. దీని తయారీ విషయంలో సహాయం కోసం సెబాస్టియన్ వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాడు. అవసరమైన ప్రయోగశాల ఏర్పాటుకు, దీని తయారీకి ఆయన సిద్ధపడ్డారు.

ఆ క్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు ఆయన క్షేత్రాన్ని సందర్శించి, పరిశీలించారు. ఇతర గ్రూపు సభ్యలతో కూడా సంప్రదింపులు జరిపారు. అవసరమైన ముడి సరుకు కొనుగోలుకు మొత్తం రూ. 70,200 ల నగదు సాయం అందించారు. దానితో ప్రయోగశాలను, అందులోనికి అవసరమైన టేబుళ్లు, ప్రెషర్ కుక్కర్, యువీ లైట్లు, బకెట్లు, కంటైనర్లు సమకూర్చుకున్నారు. ఏటా 50 కిలోల మోపాధజెన్ ఉత్పత్తి చేయగలుగుతున్నాడు. ఈ విధంగా ఏటా మరో రు. 9000 ఆదాయం సంపాదిస్తున్నాడు.

అయితే ఆయన ఉత్పత్తిచేసే ఉత్ప్తత్తులను మార్కెట్ కు చేర్చడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. వ్యవసాయ శాఖ అవసరమైన ఆకర్షణీయమైన రీతిలో ప్యాకింగ్ చేసి నేరుగా రైతులకు విక్రయిస్తుంది. దానికో బ్రాండ్ నేమ్ కూడా నిర్ధారించారు. సెబాస్టియన్, ఆయన లాంటి మరి కొందరు కూడా వాటిని తయారు చేస్తున్నప్పటికీ ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ లేకపోవడంతో పాటు వ్యవసాయ శాఖ స్వయంగా వారికి పోటీగా ఎదురు నిలుస్తోంది. వీరి ఉత్పాదనకు ఎలాంటి బ్రాండ్ నేమ్ లేకపోవడం కూడా సమస్యగా మారింది. అందువల్ల వారికి ప్రారంభ దశలో బయ్ బ్యాక్ భరోసా అందించాల్సిన అవసరం ఉంది.

ముగింపు వాక్యాలు

సేంద్రీయ విధానం అనుసరించడం ద్వారా, సెబాస్టియన్ మరి కొందరు రైతులు పూర్తి సంతోషంతో ఉంటున్నారు. ఈ విధానాల వల్ల భూసారం మెరుగవుతోంది. జీవ సంబంధిత ఇన్ పుట్లను ఉపయోగిస్తున్న కారణంగా పునరుత్పాదన సామర్థ్యం మెరుగుపడుతోంది. మట్టి లోపలి హానికర క్రిముల బెడద తగ్గిపోతోంది. చీడపీడల సమస్య చాలా వరకు అదుపులో ఉంటోంది. మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతున్నాయి. చివరికి కుటుంబ సభ్యులకు ఆరోగ్యదాయకమైన ఆహారం పుష్కలంగా లభిస్తోంది.

సెబాస్టియన్ చేస్తున్న ప్రయత్నాలకు స్థానిక వార్తా పత్రికలు, ఆల్ ఇండియా రేడియో ద్వారా విస్తృతంగా ప్రచారం లభిస్తోంది. తిరుచిరాపల్లి ఆల్ ఇండియా రేడియో ప్రసారం చేసే వీలాన్ అరంగం కార్యక్రమంలో వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు ప్రధానంగా ప్రసారమవుతాయి. వాటిలో అందిన ప్రచారం కారణంగా సెబాస్టియన్ ఇప్పుడు పరిసరాలలోని రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

—————————————————————————————————————————————————

విక్టర్ ఐ
సెక్రెటరీ, అహింస
నెం. 1-207 సి, సోనా కాంప్లెక్స్, మెయిన్ రోడ్డు
వైయంపట్టి - 621 315
తిరుచ్చి జిల్లా, తమిళనాడు
E-mail: info@ahimsa.ngo

సురేశ్ కన్నా కె.
సీనియర్ టీమ్ మెంబర్
కుదుంబం
113/118, సుబ్రమణ్యపురం, తిరుచ్చి, 620020
E-mail: kannasureh71@gmail.com

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి ౨౩, సంచిక ౧, మార్చి ౨౦౨౧

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...