పప్పుధాన్యాల పంచాయతీలు – పప్పుల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించిన ఘనత

సుస్థిర ప్రాతిపదికన పప్పుధాన్యాలను ఉత్పత్తి చేయడంతో పాటు అదనపు ప్రయోజనాలు అందుకోవడం, మార్కెటింగ్ నైపుణ్యాలను సమకూర్చుకోవడంలో పప్పు ధాన్యాల పంచాయతీలు అనుసరించిన విధానం సమష్టి కృషికి నిదర్శనం. తమిళనాడులోని రైతు ఉత్పత్తిదారుల కంపెనీ తీసుకున్న చొరవ కారణంగా రాష్ట్రం పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించే దిశగా అతి వేగంగా అడుగులు వేస్తోంది.

జీవ సంబంధమైన నత్రజని స్థిరీకరణలోనూ, వాతావరణ మార్పలను తట్టుకోగల శక్తిసామర్థ్యాలలోనూ పప్పు ధాన్యాలకు ఒక ప్రత్యేకత ఉంది. భూసారం స్వల్పంగా ఉన్న నేలల్లో కూడా వీటిని సాగు చేయడం ద్వారా మంచి దిగుబడి సాధించేందుకు మాత్రమే కాకుండా అక్కడి భూ సారాన్ని పెంపొందించేందుకు మంచి అవకాశం ఏర్పడుతుంది. పోషక విలువలు ఎక్కువగా ఉండడమే కాక, ప్రతికూల పరిస్థితులలో కూడా ఫలితం చేతికి అందించే పప్పు ధాన్యాలు చిన్న కమతాలు ఉన్న పేద రైతాంగానికి అన్ని విధాలా అనుకూలమైనవి.

కొద్ది సంవత్సరాలుగా పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది .ఓ మోస్తరు భూసారం ఉన్న నేలల్లో వర్షాధారంగా వీటిని సాగు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు అనేక సమస్యలు ఎదురుకావడం తప్పడం లేదు. తక్కువ దిగుబడి, గిరాకీలో స్తబ్ధత, సకాలానికి అందని ముడి సరుకు, చీడపీడల ముప్పు, క్రిమికీటకాల భయం, నిల్వ సదుపాయాల లోపం, మార్కెట్ అనుసంధానతా కొరత, ధరవరల్లో హెచ్చుతగ్గులు, పంటల బీమా సదుపాయం లేకపోవడం వంటివి వాటిలో ముఖ్యమైన కొన్ని సమస్యలు. దేశంలో తలసరి పప్పు ధాన్యాల లభ్యత రోజుకు 33 గ్రాములు మాత్రమే (2009-10 గణాంకాలు) ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం రోజుకు ఒక వ్యక్తికి కనీసంగా 80 గ్రాముల  పప్పు దినుసులు అవసరం. దేశంలో వీటికి ఉన్న గిరాకీని తట్టుకునేందుకు ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తోంది.

దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంపొందించి, సామాన్య ప్రజానీకానికి సరసమైన ధరలకే అందించేందుకు ఆధునిక పరిజ్ఞానాన్ని, పొలం నిర్వహణలో మెరుగైన పద్ధతులను జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పథకం దేశంలోని 14 రాష్టాలలోని 171 జిల్లాల్లో అమలవుతోంది. ఇటీవల రైతులకు పప్పు ధాన్యాల సాగు మరింత ప్రయోజనకరంగా ఉండేందుకు క్వింటాల్ పప్పు ధాన్యాలపై రూ. 200 లను ప్రోత్సాహకంగా ప్రకటించింది.

ఇండియా మొరాకో ఫుడ్ లెగమ్ ఇనీషియేటివ్ సహకారంతో ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చి ఫౌండేషన్ తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలలో ఈ పప్పు ధాన్యాల పంచాయితీలను ప్రారంభించడంతో పాటు వాటి నిర్వహణలో చురుగ్గా పాల్గొంది. దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాదించడం ఈ రెండు సంస్థల సంయుక్త కృషి ప్రధాన ఉద్దేశం. మొరాకో ఫుడ్ లెగమ్ ఇనీషియేటివ్ ను మొరాకోకు చెందిన ఓసీపీ ఫౌండేషన్ నెలకొల్పింది. ఇందుకు అవసరమైన పేద దేశాల మధ్య సహకారం (సౌత్ – సౌత్ కొలాబొరేషన్) పేరుతో ఇండియా, మొరాకో సంయుక్త ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ప్రస్తుత వ్యాసంలో ఎం.ఎస్. స్వామినాథన్ రీసెరిచ ఫౌండేషన్ తమిళనాడులో చేపట్టిన చర్యలను గురించి తెలుసుకుందాం.

మారుమూల కుగ్రామంలో 

తమిళనాడులోని పుదుక్కోటై జిల్లాలోని అన్నవాసల్ బ్లాక్ లోని ఎడియపట్టి పంచాయతీ కేంద్రంగా పప్పు ధాన్యాల తొలి పంచాయతీ ఏర్పడింది. రాష్ట్రంలోనే అతి తక్కువగా వర్షపాతం ఉండడంతో దాదాపు ఎడారి ప్రాంతంగా పరిగణించే వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. సుమారుగా 95 శాతం మంది రైతులు చిన్న కమతాలు ఉన్న వాళ్లే. ఈ పంచాయతీలో సాగు నీటి అవసరాలలో సగం వరకు మాత్రమే ఉపయోగపడే 79 బావులున్నాయి. ఇక్కడ ఎక్కువగా సాగుచేసే పంటల్లో ముఖ్యమైనవి – వరి, జొన్న, మిరియాలు, వేరు శెనగ. చాలా కొద్ది మంది సుమారుగా 30 ఎకరాలలో మాత్రమే పప్పు ధాన్యాలను పండిస్తారు. ప్రధానంగా వర్షాధార ప్రాంతం కావటం వల్ల ఇక్కడి భూముల్లో ఎక్కువ భాగం బంజరు భూములను పోలి ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో ఇక్కడ బయో-ఇండస్ట్రియల్ వాటర్ షెడ్ (పరీవాహక ప్రాంతాల అభివృద్ధి) చర్యల ఫలితంగా చురుగ్గా వ్యవసాయ యోగ్యంగా మారిపోయాయి.

ఇల్లుప్పూర్ వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీ (IAPCL) ఏర్పాటు చేయాలనే ఆలోచన 2012లో మొలకెత్తి 2015 జనవరి నాటికి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంది. ఈ సహకార సంస్థ అక్కడి వ్యవసాయదారుల సమష్టి మార్కెట్ అవసరాలను తీర్చడానికి కృషిచేసింది. ఇందులో వెయ్యి మంది సభ్యులుగా ఉన్నారు. వారంతా ఎడియపట్టి పంచాయతీతో పాటు మరో నాలుగు పంచాయతీలకు చెందిన వారు. ఎడియపట్టికి చెందిన మొత్తం 182 మంది రైతులు ఈ కంపెనీలో సభ్యులుగా ఉండి వ్యవస్థ రూపంలో పటిష్టమైన శక్తిగా పనిచేస్తున్నారు. నాలుగు ప్రధాన రంగాలలో (పప్పు ధాన్యాలు, సేంద్రీయ కాయగూరల పెంపకం, సమీకృత పాడి పరిశ్రమ అభివృద్ధి, కోళ్ల పరిశ్రమకు ప్రోత్సాహం) విలువ ఆధారిత సేవలను అందించడం ఈ సంస్థ ప్రధాన ధ్యేయం. ఆ విధంగా సమైక్య కృషిని ప్రోత్సహిస్తూ, సుస్థిర ఉత్పత్తి, మార్కెటింగ్, వారి ఉత్పాదనల విలువల పెంపు ద్వారా రైతన్నల ఆదాయాన్ని గణనీయంగా పెంచడానికి ఈ కంపెనీ తోడ్పడుతుంది.

పప్పు ధాన్యాల సాగును పెద్ద ఎత్తున చేపట్టాలని 2013లో మొత్తం పంచాయతీ తీర్మానించింది. అందుకు సాధ్యమైనంత ఎక్కువ విస్తీర్ణం కేటాయించాలని కూడా నిర్ణయించింది. ఆ మేరకు, ఒక పంట కాలంలో సాగు చేసే మొత్తం (గ్రాస్ క్రాప్డ్ ఏరియా) విస్తీర్ణంలో 474 ఎకరాలను పప్పు ధాన్యాల సాగుకే ప్రత్యేకించారు. ఫలితంగా రబీ పంట కాలంలో సర్టిఫైడ్ పప్పు విత్తనాలను ఉత్పత్తి చేయడంలో ఘన విజయం సాధించారు.

పంచాయతీలోని పది గ్రామాల ప్రజలు పప్పు ధాన్యాల ఉత్పత్తికి నడుం బిగించారు. అందుకోసం రిమోట్ సెన్సింగ్ పరికరాల సాయంతో డిజిటైజ్ విధానాలను, సాగు వ్యూహాలను అనుసరించారు. ప్రణాళకలను సిద్ధం చేయడంలోనూ, పర్యవేక్షణలోనూ వారికి పంచాయతీ నుంచి మాత్రమే కాకుండా ఈ కంపెనీ వారికి అన్ని విధాలా సహాయసహకారాలు లభించాయి. పంచాయతీల నుంచి గ్రామ స్థాయి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు, ఇతర వ్యవసాయ పరికారలను అందిజేయడం వంటి మౌలిక సదుపాయాలు సమకూరినాయి. సాంకేతిక పరమైన మద్దతును ప్రభుత్వ వ్యవసాయ శాఖ, జాతీయ పప్పు ధాన్యాల పరిశోధనా కేంద్రం (వంబన్), ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చి ఫౌండేషన్ సమకూర్చాయి.

 ఇళత్తూర్ కంపెనీ ఏర్పాటుకు ముందు వివిధ పంటలు, వాటి వాణిజ్య లాభ నష్టాల గురించిన అంచనాలను గురించి విస్తృతంగా చర్చించి విశ్లేషించడం కూడా జరిగింది. అందువల్ల అవసరమైన అన్ని కార్యక్రమాలను కూడా ఆ కంపెనీ ద్వారానే చేపట్టడం జరిగింది. ఈ కంపెనీ నిర్వహిస్తున్న కీలక పాత్ర గురించి తెలుసుకునేందుకు కింది అంశాలను గమనిస్తే స్పష్టత ఏర్పడుతుంది.

  • సేద్య రంగంలో ప్రధానమైన ముడి సరుకులు – నాణ్యమైన విత్తనాలు, జీవసంబంధ ఎరువులు (బయో-ఫెర్టిలైజర్లు), ఇతర పరికరాలను సమకూర్చడం (అది స్థానికంగా కానీ, అద్దెకు చేకూర్చడం)
  • ఉత్పత్తిని సేకరించి, తగిన విధంగా నిల్వ చేయడం, మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులో ఉంచడం
  • బ్యాంకుల సహకారంతో రుణపరపతి అందించడం
  • గ్రామ స్థాయి విజ్ఞాన కేంద్రాల సహకారంతో రైతన్నలకు ఉపయోగకరమైన సమాచారం అందజేయడం
  • విలువను పెంపొందించేందుకు వీలుగా ఉత్పత్తికి అదనపు హంగులు సమకూర్చడం
  • భాగస్వాములైన వారికీ, స్వామినాథన్ రీసెర్చి ఫౌండేషన్ వారికి మధ్య అనుసంధానం సాధించడం.

ఈ లక్ష్య సాధనలో భాగంగా రైతులకు ఉన్న అవగాహనను మరింతగా వృద్ధిపరిచేందుకు, పప్పు ధాన్యాల సాగులో వారికు అవసరమైన విస్తృత సమాచారాన్ని అందించడం (పార్టిసిపేటరీ వెరైటల్ సెలక్షన్ ప్రాసెస్), రైతుల క్షేత్రస్థాయి తరగతులు, రైతుల క్షేత్రస్థాయి పర్యటనల నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తిదారుల అసోసియేషన్ల ఆధ్వర్యంలో చర్చాగోష్టుల ఏర్పాటు, ప్రయోజనకరమైన రీతిలో మార్కెటింగ్ అవకాశాలు అందజేయడం, అందుకు వారి సమైక్యశక్తికి నిదర్శనమైన కంపెనీని ప్రాతిపదికగా తీసుకోవడం, ఈ ప్రయత్నంలో రైతులకు మరింత ప్రీమియం ధర లభించేందుకు కృషి చేయడం వంటివి చేపట్టడం జరిగింది. ఈ ప్రయత్నాలన్నిటి కారణంగా పప్పు ధాన్యాల సాగు పట్ల వారిలో ఆసక్తిని పెంపొందించడం జరిగింది. ఆ రకంగా చేపట్టిన కొన్ని కార్యక్రమాలను దిగువ గమనించవచ్చును.

రైతు భాగస్వామ్య వైవిధ్యపూరిత విత్తన ఎంపిక పరీక్షలు
(Farmer-Participatory Varietal Selection Trials (FPVST))

ఉత్తమ శ్రేణికి చెందిన పప్పు ధాన్యాల విత్తనాలను ఎంపిక చేయడం కోసం ఈ ప్రాంతంలో దాదాపు 41 పరీక్షలను నిర్వహించడం జరిగింది. సాథనికంగా లభించే వివిధ రకాలైన విత్తనాలలో ఉత్తమమైనదాని కోసం ఈ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. పరీక్షించేందుకు అవసరమైన వివిధ రకాల విత్తనాలను అనేక సంస్థలు సమకూర్చాయి.  వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, రీసెర్చి సంస్థలు, కొద్దిమంది రైతులు వాటిని సమకూర్చారు. ఇలా చేపట్టిన ప్రతిపరీక్షలో ప్రగతికాముక పైతన్నలు చురుగ్గా సహకరించారు. వారు మొత్తం అయిదు దశల్లో కృషిచేయాల్సివచ్చింది. మినుము సాగులో వంబన్ 4, 6 రకాలు, పెసర సాగులో వంబన్ 3, సీఓ 8, కంది సాగులో సీఓ 6, ఎల్ఆర్జీ 41 మెరుగైన ఫలితాలను ఇచ్చాయి. ఈ రకంగా నిర్ధారించుకున్న ఉత్తమ శ్రేణి విత్తనాలను రైతన్నలు తమ పొలంలోనే ప్రయోగాత్మకంగా సాగుచేపట్టారు. అందుకు గానూ ఈ అయిదు దశల్లోనూ ఆరు కొలమానాలను ప్రాతిపదికలుగా తీసుకోవడం జరిగింది.

టేబుల్ 1 –  విత్తన ఎంపిక పరీక్షలు 2015- 2016

పప్పు పంట పరీక్షించిన విత్తన రకాలు ఉత్తమమైనది గుర్తించినది
మినప పప్పు    
ఖరీఫ్ – విబిఎన్ 4, ఏడీటీ-5,  ఎండీయూ-1              
రబీ విబిఎన్ 4, విబిఎన్-6
ఖరీఫ్ & రబీ – విబిఎన్ 4
     
కంది పప్పు       
ఖరీఫ్ – 37 ఎకరాల్లో వేరు శెనగతో అంతరపంట    
రబీ – విబిఎన్ 2, ఐసీపీఎల్ 1124, 161, 20335, 88039    
రబీ- ఐసీపీఎల్ 88039     
వేరు శెనగ  
ఖరీఫ్ – సీఓ 7, పోలాచీ 1, విఆర్ఐ 2
రబీ – విఆర్ఐ 2, కే6, సీఓ 4, టిఎంవి 7,  సీజీ 2    
ఖరీఫ్ – సీఓ 7 & విఆర్ఐ 2
రబీ – విఆర్ఐ 2

    వాతావరణ అనుకూల సేద్య విధానాలు

వరి సాగుకు అనుకూలం కానటువంటి బీడు భూముల్లో పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించడం జరిగింది. ఫలితంగా అదనంగా 40 శాతం ఎక్కువ విస్తీర్ణంలో పప్పు ధాన్యాలను సాగుచేయడం సాధ్యమైంది. ప్రధానమైన లేదా అంతర పంటలుగా తక్కువ వ్యవధిలోనే దిగుబడినిచ్చే రకాలను సాగు చేసి ఇతర రైతన్నలకు ప్రత్యక్ష నిదర్శనంగా చూపించారు. సంప్రదాయకంగా సాగు విస్తీర్ణం కన్నాదాదాపు మరో 30 శాతం అదనపు విస్తీర్ణంలో వాటి సాగును రైతన్నలు చేపట్టారు. ఫలితంగా వారికి అదనంగా ఆదాయం కూడా లభించింది. ఈ రకంగా మేలు రకం ఉపయోగించడం వల్ల మొత్తం మీద 70 శాతం పప్పు ధాన్యాల సాగును చేపట్టే రైతుల సంఖ్య పెరిగింది. వారికి అవసరమైన ముడి సరుకుల సరఫరా, రుణ పరపతి సదుపాయాలు వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీ అందజేసింది. అదే సమయంలో కొత్తగా గుర్తించిన మేలు రకం విత్తనాలతో సాగు చేయడంలో వారికి సమీకృత పంటల నిర్వహణలో తగిన నైపుణ్యాన్ని పెంపొందించడానికి కూడా దృష్టి పెట్టారు. ఈ సందర్భంలోనే వాతావరణానికి అనువైన రకాలను ఉపయోగించడం గురించి కూడా అవగాహన కలిగించడంపై శ్రద్ధ పెట్టారు. హెందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (ముంబయ్), ఆసియా ఇనీషియేటివ్స్ (అమెరికా) సంస్థల నుంచి సీఎస్ఆర్ నిధులను సమకూర్చారు. పప్పు ధాన్యాల సాగుకు

పప్పుధాన్యాల సంరక్షణకు వీలుగా పల్స్ బయోపార్క్ రూపంలో వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవసరమైన అదనపు విలువల కూర్పు ప్రయత్నాలు చురుగ్గా సాగాయి. ఫలితంగా వినియోగదారు చెల్లించే రూపాయిలో రైతన్నకు అదనపు వాటా చేకూరింది.

అవసరమైన విధంగా నీటి వనరులను, ప్రధానంగా రబీ పంట కాలంలో, అందరూ సమవాటాల ప్రాతిపదికపై ఉపయోగించుకునేందుకు వీలుగా 30 బావులను పునరుద్ధరించడం జరిగింది. మేలు రకం విత్తనాలను ఉపయోగించేందుకు వీలుగా చేపట్టిన ఈ చర్యల ఫలితంగా ఇప్పటివరకూ బీడు భూములుగా ఉన్న 50 ఎకరాల భూమి సారవంతమైంది.

రైతుల క్షేత్రస్థాయి పాఠశాలల్లో వాతావరణ అనుకూల సేద్య విధానాలపై సమగ్రమైన శిక్షణ ఇవ్వడం జరిగింది. వాటిలో చెప్పుకోవలసిన నైపుణ్యాలలో నాణ్యమైన మేలు రకపు విత్తనాలను ఎంపిక చేసుకోవడం, చీడపీడలు, క్రిమికీటకాల బెడదను తట్టుకోగలిగిన శక్తి ఉన్న విత్తన రకాలనే ఉపయోగించడం, భూసార పరిరక్షణలో అనుసరించవలసిన మొక్కల పోషక విలువలు, విత్తన శుద్ధి, డీఏపీ (డైఅమ్మోనియం ఫాస్ఫేట్) ను ఫోలియర్ స్ప్రే చేయడం, మొక్కల పెరుగుదలకు తోడ్పడే పోషకాలు, నియంత్రణ సామర్థ్యం ఉన్న పల్స్ వండర్ ఉపయోగాలు, వరుసలో మొక్కలను నాటడం, నీటి వాడకం నియఁత్రణ, అంతర్ పంటలు, ప్రాసెసింగ్ వంటి అంశాలు ముఖ్యమైనవి.

రైతుల క్షేత్ర సందర్శన సందర్భాలలో అటు వ్యవసాయదారులకు మాత్రమే కాకుడం శాస్త్రజ్ఞులకూ, ప్రాజెక్టు సిబ్బందికీ, ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారులకూ కూడా పప్పు ధాన్యాల ఉత్పత్తి విషయంలో అనుభవపూర్వకమైన అవగాహన పెంపొందింది. వివిధ రకాలైన పప్పు ధాన్యాల ఉత్పత్తి రాష్ట్రంలో కానీ, జాతీయ స్థాయిలో కానీ దాదాపు రెట్టింపు పెరగడం ఇక్కడ గమనించవలసిన అంశం.

విత్తన వ్యవస్థ – నిర్వహణల అభివృద్ధి

నాణ్యమైన విత్తనాల సరఫరాకు ఆచరణకు ఉపయోగకరమైన నిలకడైన విత్తన వ్యవస్థ ఉండడం చాలా అత్యవసరం. సర్టిఫై చేసిన లేక విశ్వసనీయమైన విత్తనాల కోసం ఎదురయ్యే గిరాకీని దృష్టిలో పెట్టుకుని, విత్తన ఉత్పత్తి కంపెనీ ఆధ్వర్యంలో విత్తన విలువల పెంపు వ్యవస్థను ఒక గొలుసుకట్టు తీరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఫలితంగా మేలైన విత్తనాలను నాసి రకం విత్తనాల స్థానంలో అందజేయడానికి 40 శాతం వరకూ అవకాశాలు మెరుగయ్యాయి. అలాంటి మేలు రకం విత్తనాలను కంపెనీ సేకరించి భద్రపరిచి ఇందుకు తోడ్పడింది. ఈ రకంగా నిల్వ చేసి ఉంచిన నాణ్యమైన విత్తనాలకు మళ్లీ ప్రభుత్వ సంస్థల నుంచి అవసరమైన సర్టిఫికెట్లు కూడా లభిస్తాయి. ఆ విధంగా తక్కువ ధరలకే రైతులుకు మేలు రకం విత్తనాలు, అవి కూడా వారి ఆకాంక్షలకు అనువైనవి, అందించడం సాధ్యమైంది. ముఖ్యంగా ఈ లక్ష్యసాధనలో రైతుల భాగస్వామ్యంతో వివత్తన వైవిధ్యం కోసం అనుసరించిన చర్యలు ప్రోత్సాహకరమైన ఫలితాలకు దారితీసాయి.

ఇక విత్తనాలను నిల్వ చేసేందుకు మూడంచెల విధానం రూపుదిద్దుకుంది. ఈ విధానాన్ని శాశ్వత ప్రాతిపదికన మెరుగుపరచిన పంటల నిల్వల విధానం (Purdue Improved Crop Storage (PICS) అని వ్యవహరిస్తారు. దీనిని పర్ డ్యూ విశ్వవిద్యాలయం మొట్టమొదటగా రూపొందించింది. దీని ఉపయోగాల గురించి కూడా ఆ విద్యాలయమే ప్రయోగాత్మకంగా ప్రదర్శించి నిరూపించింది. నిల్వ చేసే క్రమంలో చీడల పాలవడంవల్ల ఆ విత్తనాల నాణ్యతకు కలిగే హాని చాలా స్వల్పంగానే ఉంటుందని ఈ విద్యాలయం గుర్తించింది. విత్తన నాణ్యతను కాపాడడంతో పాటు ఈ పద్ధతిలో నిల్వ చేసిన విత్తనాల విశ్వసనీయత చెక్కుచెదరలేదు.

పప్పుధాన్యాల ప్రాంగణం (పల్స్ బయోపార్క్)

గొలుసుకట్టు తీరులో విత్తనాల విలువను పెంపొందించేందుకు వీలుగా వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీ ఒక ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించింది. దీనికి ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చి ఫౌండేషన్ నుంచి, ఇతర లబ్ధిదారుల నుంచి పూర్తి సహాయసహకారాలు లభించాయి. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన మిల్లు కారణంగా పప్పుల శుద్ధి ప్రయోజనాలు సన్న, చిన్నకారు రైతన్నలకే దక్కాయి. ఇలా సేకరించిన పప్పును మరింత శుద్ధి చేసి, ప్యాక్ చేసి, ఒక బ్రాండ్ పేరుతో మార్కెట్ కు సరఫరా చేయడం సాధ్యమైంది. ఇప్పటికే అమలులో కొన్ని విధానాలు పప్పు ధాన్యాలకు అదనపు విలువను సమకూరుస్తున్నాయి. వాటితోపాటు కొత్తగా మరికొన్ని రూపుదిద్దుకున్నాయి. వాటిని అన్నిటినీ సమాచార భాండాగారంలో భద్రపరిచేందుకు చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలకు దారితీసాయి. ఫలితంగా వాటి విలువ, అమ్మకాలు, స్థిరత్వం మెరుగుపడ్డాయి.

టేబుల్ 2         మినుము సాగులో ఆర్ధికపరమైన అంశాలు       

విత్తన రకం     కొత్తగా మెరుగుపర్చిన విబిఎన్ 4  (రూపాయలలో) సంప్రదాయక స్థానిక విత్తనం  (రూపాయలలో)
వేసవిలో దున్నటం        550               ఏమీ లేదు
పెరటి ఎరువుల వాడకం   (2 ట్రాక్టర్లు) 3600    ఏమీ లేదు
విత్తనాలు నాటే ముందు (2 సార్లు దున్నటం)        900    1100
నాణ్యమైన విత్తనాల వాడకం   (ఎకరాకు … కిలోలలో)        900 (6 కిలోలు)       1200 (  8 కిలోలు)
విత్తన శుద్ధికి    50    ఏమీ లేదు
విత్తనాలు నాటేందుకు   500 (మెషీన్లతో)          200
కలుపుతీతకు   600    2000
ఫాయలర్ విధానంలో క్రిమి సంహారకాల వాడకానికి 1000       500
పంట సాగుకు, త్రెషింగ్ (నూర్పిడికి)   2000       2000
మొత్తం దిగుబడి  (ఎకరాకు కిలోలలో)   350          140
మొత్తం ఆదాయం (ఎకరాకు)   31500           12600
మొత్తం వ్యయం (ఎకరాకు రూపాయలలో)     10100         7000
మిగులు ఆదాయం (ఎకరాకు రూపాయలలో) 21400   5600
మొత్తం ఆదాయం    ఎకరాకు  రూ. 21400     

 

 సమాచార నిర్వహణ

ఫార్మర్స్ ఫీల్డ్ స్కూల్స్, ఫార్మర్స్ ఫీల్డ్ సందర్శనల సహాయంతో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీ ఆధ్వర్యంలో గ్రామీణ విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ మొత్తం కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి. అవసరమైన సేద్య పరికారలను సరైన సమయానికి సరసమైన ధరలకే రైతులకు సమకూర్చడం ఇందులోని మరో విశేషం. ఫలితంగా చిన్న, సన్నకారు రైతన్నలకు విశేషంగా ప్రయోజనం చేకూరింది. విజ్ఞాన కేంద్రాల నుంచి రైతులకు సకాలంలో సరైన సలహాసూచనలు అందుతూ వచ్చాయి. ముఖ్యంగా వాతావరణ మార్పులు, అందుకు అనుగుణమైన సేద్య విధానాలు, పంటల బీమా సదుపాయాలు, భూసార సంరక్షణ, మార్కెట్ ధరవరలు, మొక్కల, పాడి పశువుల ఆరోగ్య సంరక్షణ, రుతుపవనాల కదలికలు, ప్రభుత్వ పథకాల గురించిన సమగ్ర సమాచారాన్ని ఆ కేంద్రాలు సరైన సమయంలో రైతులకు అందజేయడంలో కీలక పాత్ర వహించాయి. ఫోన్ ల ఆధారంగా వాయిస్ కాల్స్ రూపంలోనూ, మెస్సేజీల రూపంలో వారికి అవసరమైన సూచనలు ఎప్పటికప్పుడు చేరవేయడం సాధ్యమైంది. ఈ రకంగా సుమారు 2000 మంది రైతులు తమకు అందిన సూచనలను అనుసరిస్తూ ప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంపొందించే కృషిలో భాగస్వాములయ్యారు.

ముగింపు వాక్యాలు

పప్పు ధాన్యాల పంచాయతీ ఉద్యమం వినూత్నమైన శైలిలో సమాచార స్రవంతిని సద్వినియోగం చేయడంలో తోడ్పడింది. ఈ కృషిలో అనేక మంది తమ వంతు సాయం అందించారు. ప్రభుత్వ వర్గాల నుంచి తగిన సహకారం లభించింది. ఇంత మంది సమన్వయంతో కలిసికట్టుగా చేసిన కృషి ఫలితమే పప్పు ధాన్యాల పంచాయతీల ఉద్యమం అని చెప్పకతప్పదు. ఆ కృషి ఫలితంగానే స్వయం సమృద్ధి సాధ్యమైంది. పప్పు ధాన్యాల బయోపార్క్ కారణంగా పప్పు ధాన్యాల ఉత్పత్తి కృషి విలువ మరింతగా పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీ నుంచి అందిన మద్దతు ఎంతో మంది రైతులను పప్పు ధాన్యాల సాగు దిశగా ప్రోత్సహించింది. పంట నష్టాలను తగ్గించింది. రైతులకు తగిన ప్రతిఫలం లభించింది. ఫలితంగా డిమాండ్ కూ, సరఫరాకు మధ్య ఉన్న అంతరాలు చాలా వరకూ తగ్గిపోయాయి. పప్పు ధాన్యాల పరిశోధనలకు కొత్త ఊపు నిచ్చింది. ముఖ్యంగా పోషకాహారం కొరతగా ఉన్న స్వల్పాదాయ వర్గాల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాలకు ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దిగుబడుల పరిమితులు మార్చేసి, బయోటెక్ సమస్యలకు, ఇతర జీవసంబంధ పరిష్కారంగా పప్పు ధాన్యాల జన్యుపరమైన సవాళ్లకు సమాధానంగా ఈ విధానం ప్రస్తుత అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరం విజయం వంతం కావడానికి తోడ్పడుతుంది.

అభినందనలు

ముందుగా చిన్న, సన్నకారు రైతన్నల ప్రయోజనాల కోసం చేపట్టిన ఈ పల్స్ పంచాయతీ ఉద్యమానికి ఇలుప్పూర్ వ్యవసాయ ఉత్పత్తిదారుల కంపెనీ నుంచి అందిన సహాయ సహకారాలు, ఆ క్రమంలో వారు చూపిన నిబద్ధతకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.  అదేవిధంగా ఆర్థిక సహాయం అందించిన ఓసీపీ ఫౌండేషన్ (మొరాకో), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (ముంబయ్),, ఆసియా ఇనీషియేటివ్స్ (అమెరికా) తమిళనాడు ప్రభుత్వ చిన్న రైతుల బిజినెస్ కన్సార్టియం (TNSFAC) లకు మా ప్రత్యేక ధన్యవాదాలు. పల్స్ పంచాయతీల ఉద్యమం ముందుకు సాగేందుకు మార్గదర్శకం బాధ్యతలు నిర్వహించిన ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చి ఫౌండేషన్ వారికి అభినందనలు.

ఆర్.ఎస్. శాంతకుమార్ హోపర్
డైరెక్టర్, ఎకో-టెక్నాలజీ
ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చి ఫౌండేషన్
3వ క్రాస్ స్ట్రీట్, తారామణి ఇన్సిట్యూషనల్ ఏరియా,
చెన్నై – 600113
E-mail: hopper@mssrf.res.in

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి 18, సంచిక 2, జూన్ ౨౦౧౬

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...