న్యూట్రి-గార్డెన్స్ – పెరటి తోటలు పోషక సంపదలు — వ్యవసాయ మహిళలకు పోషక ఆహారానికి మూలం

సమృద్ధిగా పోషక విలువలు అందించడంలో అమూల్యమైనవి కూరగాయలు, పండ్లు. ఇవి పోషక లోపం సమస్యకు అత్యుత్తమ పరిష్కారం అని చెప్పవచ్చు. న్యూట్రీ-గార్డెన్స్ అంటే పోషక సమృద్ధమైన తోటల సాగు సాధారణ వంటింటి తోటలకన్నా (కిచెన్ గార్డెన్స్) ఎన్నో రెట్లు ఉన్నత శ్రేణికి చెందినవి. కిచెన్ గార్డెన్ లో కూరగాయలు, పండ్ల పెంపకాన్ని ప్రధానంగా కుటుంబ అవసరాలకు ఇంకా అదనపు ఆదాయం సంపాదించేందుకు మాత్రమే ఉపయోగిస్తాయి. చిన్న, మధ్యతరహా రైతులకు న్యూట్రి-గార్డెన్స్ సాగు వల్ల కుటుంబ సభ్యలకు మరింత పోషక విలువలున్న వైరుధ్యంతో కూడిన ఆహారం సమకూర్చడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు అందిస్తాయి. ఈ ప్రయోజనాలు మహిళా రైతులకు మరెంతో విలువైనవిగా చెప్పాలి.

గ్రామీణ ప్రాంతాలలో పోషకాహార లోపం చాలా పెద్ద సమస్య. ఇక కొండ ప్రాంతాలలో నివసించే వారి విషయం వేరే చెప్పనక్కరలేదు. ఇలాంటి కొండ పరిసరాలలో పంటల దిగుబడి చాలా స్వల్పమే. కారణ కమతాలు చాలా చిన్న చిన్నవిగానే ఉంటాయి. అది తక్కువ దిగుబడికి మొదటి కారణం. ఇక అలాంటి ప్రాంతాలలో భూసారం చాలా కొద్దిగానే ఉంటుంది. ఇది రెండో కారణం. ఇక తివరిది ఇక్కడి భూములన్నీ వర్షాధారమైనవే. అయినా కూడా ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో కూడా రైతు కుటుంబాలు సంప్రదాయక జీవనోపాధి అయిన వ్యవసాయాన్ని వదులుకోలేదు. ప్రధానంగా చిరు ధాన్యాల సాగు ఎక్కువ. వాటి సాగు ద్వారా సమకూరే సేద్య ఫలం వారి కుటుంబాలకు మూడు నాలుగు నెలలకు మించి చాలదు. అంటే ఏడాదిలో ఏడు ఎనిమిది నెలల పాటు వారు వేరే ఉపాధి చూసుకోవలసి ఉంటుంది. ఆ సమయంలో మైదాన ప్రాంతాలలో మగవారికి చేతి నిండా పని ఉంటుంది. అందువల్ల వారంతా ఆ మాసాలలో మైదాన ప్రాంతాలకు వలస వెళ్ళిపోతుంటారు. ఈ కారణంగా కొండ ప్రాంతాలలో మహిళలే మిగిలిపోయి ఉంటారు. ఈ కారణంగా ఇక్కడ జనాభాలో వారి సంఖ్యే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే పురుషులు చేసే కార్యభారం కూడా మహిళలపైనే పడుతూ ఉంటుంది. వారే చాలా ఎక్కువగా శ్రమపడాల్సి ఉంటుంది కూడా. అందువల్లనే మహిళలకు మరింత ఎక్కువ పోషకాహారం అవసరమవుతుంది. వారిలో సర్వసాధారణంగా పోషకాహార లోపం సమస్యగా ఉంది. వారికి ఎదురవుతున్న ఈ సమస్యకు – స్థానికంగా అక్కడి ప్రజల అవసరాలను స్థానికంగానే సమకూర్చడమే సరైన పరిష్కారం. వాతావరణం దృష్ట్యా చూస్తే  కొండ ప్రాంతాలలోని నేలలు సీజనల్ పంటలు లేదా సీజనల్ కాని పంటలు అంటే కూరగాయలు, పండ్లు వంటి వాటి సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇలాంటి కూరగాయలు, పండ్లు పోషక సమృద్ధమై ఉంటాయి. చిన్న చిన్న కమతాలు కావడం వల్ల న్యూట్రి-గార్డెన్ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మంచి ఆదాయం కూడా లభిస్తుంది. వీటిని పండించినట్లయితే కొండ ప్రాంతాలలో నివసించే వారి పోషకాహార లోపం సమస్య పరిష్కరించవచ్చు. 

న్యూట్రీ-గార్డెన్ పెంపకం

కూరగాయల ఆధారిత న్యూట్రీ-గార్డెన్ సాగు పోషకాహారం అందించగలిగే అత్యుత్తమ మార్గం. పోషకాహార లోపం సమస్యకు చక్కటి పరిష్కారం. ఒక్క మాటలో చెప్పాలంటే కూరగాయలను సాగుచేయడానికి ఇంటి వెనక పెరళ్లలో పండించడం కంటే న్యూట్రీ-గార్డెన్ సాగు కాస్త పెద్ద ఎత్తున చేపట్టే కార్యక్రమం. కిచెన్ గార్డెన్ లో ప్రధానంగా కుటుంబ అవసరాలను తీర్చడంతో పాటు కొద్ది పాటి ఆదాయం కూడా పొందవచ్చు. అదే న్యూట్రీ-గార్డెన్ సాగు ద్వారా కుటుంబ అవసరాలను తీర్చడంతో పాటు మరెన్నో విధాలుగా ప్రయోజనాలు పొందవచ్చు. ఈ విధానం మహిళలకు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం పరిశోధకులు తమ దృష్టిని కొన్ని అంశాలకే పరిమితం చేశారు. క్షేత్ర స్థాయిలో జరిగే సాగు ఫలాలను కుటుంబ సభ్యుల పోషకాహార అవసరాలకు, నాణ్యమైన ఆహారం సమకూర్చుకునేందుకు ఉపయోగించడం లేదని వారు గుర్తించారు. కేవలం ఆదాయమే లక్ష్యంగా ఈ క్షేత్ర స్థాయి సేద్యం జరుగుతోందని గమనించారు.దీంతో పోషకాహార ప్రాధాన్యం, కుటుంబంలోని వారి ఆరోగ్యం పట్ల వారిలో వ్యక్తమవుతున్న నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ధోరణి కారణంగానే, కేవలం అధిక ఆహార ఉత్పత్తి లక్ష్యంగా కాకుండా, పోషక విలువలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు వీలుగా న్యూట్రీ-గార్డెన్ సాగు విధానాన్ని ప్రోత్సహించాలని వారు నిర్ణయించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్, 2010) నివేదికలో కొన్ని మార్గదర్శకాలను సిఫార్సు చేసింది. రోజుకు ఒక వ్యక్తికి 300 గ్రాముల కూరగాయలు అవసరమని నిర్ధారించింది. అందులో 50 గ్రాములు ఆకు కూరలు, 50 గ్రాములు దుంపలు, 200 గ్రాముల వరకు ఇతర కూరగాయలు ఉండాలని సిఫార్సు చేస్తోంది.

‘ఈటింగ్ రెయిన్ బో’ ఇంద్ర ధనుస్సులోని రంగులు మన రోజువారీ ఆహారంలో ఉండాలనే సూత్రాన్ని ప్రతిపాదించారు. ఇంద్ర ధనస్సులో న్ని రంగులు ఉంటాయో అన్ని రంగులు మనం ఆహారం భుజించే పళ్లెంలో కూడా కనపడాలని వారు అభిప్రాయపడుతున్నారు. వేర్వేరు రంగులు వేర్వేరు విటమిన్లు, ఇతర పోషకాలు ఉంటాయని వారి ఉద్దేశం. 

భౌగోళికంగానూ, వాతావరణ పరంగానూ కూడా కొండల ప్రాంతాలలో ఉష్ణ మండల, ఓ మోస్తరు ఉష్ణ మండలాలలో పండించగలిగే పండ్లను పండించడం సాధ్యమవుతుంది. అలాంటి వాటిలో యాపిల్, నేరేడు (పియర్స్), అత్తి పండు (పీచ్), రేగి పండు జాతి (ప్లమ్), నిమ్మ జాతి(సైట్రస్),(ఆప్రికోట్), వాల్ నట్ వంటివి పండించవచ్చు. రోజువారీగా మనం తీసుకునే ఆహారంలోసూక్ష్మ పోషకాల (మైక్రో న్యూట్రియంట్స్) లోపాన్ని రకరకాలైన పండ్లు, కూరగాయలను చేర్చుకోవడం ద్వారా భర్తీ చేసుకోవచ్చు. అల్మోరా కేంద్రంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చి (ఐసీఎంఆర్) – వివేకానంద పర్వతీయ కృషి అనుసోధన్ సంస్థాన్(విపికెఏఎస్) సంయుక్తంగా 2018లో చేపట్టిన ప్రయత్నాలు, రోజు వారీ ఆహారంలో వైవిధ్యం, అందుకు తగినట్లు ఉత్పత్తిని ప్రోత్సహించాయి. ఉత్తర ఖండ్ రాష్ట్రంలోని ఎత్తైన కొండల పరిసరాలలో 65 న్యూట్రీ-గార్డెన్లను వారు ఏర్పాటు చేయించగలిగారు. వీటిలో మహిళలదే కీలకమైన భూమిక.

న్యూట్రీ-గార్డెన్ ఏర్పాటు విధానం

సాధారణంగా ఇలాంటి న్యూట్రీ-గార్డెన్ లను ఇంటి వెనుక మిగిలి ఉన్న కొద్దిపాటి జాగాలో చేపట్టవచ్చు. అయితే అవసరమైన నీటి వసతి ఉండాలి. ఇలా ఇండ్లకు చేరువగానే న్యూట్రీ-గార్డెన్ లను పెంచడం వల్ల జంతువుల నుంచి ఎదురయ్యే నష్టాలను సమర్థవంతంగా ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. చదరపు ఆకారంలోని స్థలం కన్నా దీర్ఘచతురస్రాకారంలోని జాగా వీటి పెంపకానికి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. అంటే సమారుగా 200 మీటర్ల స్క్వేర్ల జాగా ఉంటే చాలు. ఏడాది పొడవునా కూరగాయలు సాగుచేయవచ్చు. ఈ విధంగా లభించే ఫలసాయం అయిదుగురు సభ్యులున్న కుటుంబ అవసరాలకు సరిపోతుంది. వాతావరణం, సీజన్ మార్పులకు అనుగుణంగా భూమి వినియోగంలో మార్పులు చేసుకోవచ్చు.

  • అందుబాటులో ఉన్నజాగాలో ఒక వైపు పూర్తిగా నిత్యం పండే కూరగాయల సాగుకు వదిలేయాలి. అయితే వాటి పెంపకం వల్ల ఇతర మొక్కలపై కానీ, ఇతరత్రా చేపట్టే అంతర పంటలపై కానీ వాటి నీడ ఏదీ పడకుండా చూసుకోవాలి. అయితే నీడ కొన్ని మొక్కలకు అవసరం. అలాంటి వాటిని ఈ రకమైన మొక్కల మధ్య పెంచుకోవాలి. జాగాకు ఒక మూలన చెత్తా చెదారం పోగుచేసి కంపోస్టు తయారు చేసుకోవడానికి వీలుగా కంపోస్టు పిట్స్ ఏర్పాటు చేసుకోవాలి.
  • ఇలా నిత్యం పండే కూరగాయలకు కేటాయించిన జాగాను విడిచిపెట్టి, మిగిలిన భాగాన్ని ఆరు లేక ఎనిమిది చిన్న చిన్న ప్లాట్లుగా ఏర్పాటుచేసుకోవాలి. వాటిలో ఏటా పండించే కూరగాయల పంటలు వేసుకోవాలి.
  • శాస్త్రీయ పద్ధతులు, పంట మార్పిడి పద్ధతులను అనుసరించడం ద్వారా అదే థలంలో రెండు మూడు పంటలను సాగుచేయవచ్చు. ఉన్న భూవసతి ఆధారంగా గరిష్ట ప్రయోజనాలు పొందడం కోసం అనుబంధ పంటలు (యాక్సెషన్ క్రాపింగ్), అంతర పంటలు (ఇంటర్ క్రాపింగ్), మిశ్రమ పంటలు (మిక్స్ డ్ క్రాపింగ్) సాగును చేపట్టవచ్చును.
  • మధ్యలో మాత్రమే కాకుండా నాలుగు వైపులా కూడా మనం నడవడానికి వీలుగా నడవా ఏర్పాటు చేసుకోవాలి.  తాజా కూరలను కుటుంబ అవసరాలకు ఉద్దేశించినందున వాటిని సేంద్రీయ ఎరువులను ఉపయోగించి పండించాలి. సాధారణంగా పల్లె ప్రాంతాలలో అవసరమైన సేంద్రీయ పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి కూడా. అయితే చీడపీడలు లేని దిగుబడి సాధనకు పరిమితంగా రసాయనిక ఎరువులు కూడా వాడవచ్చు.
  • అధిక దిగుబడి కోసం తాపత్రయపడకుండా, ఎక్కువ వ్యవధి పట్టినా, నిలకడైన దిగుబడినిచ్చే పంట రకాలను ఎంపిక చేసుకోవడం మంచిది. 
  • ఇలా 200 మీటర్ల స్క్వేర్ జాగాలో తేనె టీగల పెంపకం కూడా చేపట్టడం మంచిది. అలా చేస్తే పోలినేషన్ (పరాగసంపర్కం) సవ్యంగా సాగుతుంది. అది మంచి ఫలితాలకు కారణమవుతుంది. తేనె కూడా లభిస్తుంది.

ఈ రకంగా ఏర్పాటుచేసిన న్యూట్రీ-గార్డెన్ లో తోటల పెంపకం కూడా చేపట్టవచ్చు. అంటే పండ్లు, కూరగాయలు, దుంపలు, రూట్స్, సుగంధ మొక్కలు, సుగంధ ద్రవ్యాలు, మొదలైనవి చేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా సమృద్ధిగా పోషకవిలువలను అందిస్తుంది.

మహిళల సాధికారితకు మార్గం

ఉత్తర ఖండ్ పర్వత సీమలలో నివసించే శ్రీమతి పూజా కర్కి ఇదివరకు సంప్రదాయక సుస్థర వ్యవసాయం చేసేది. వారి కుటుంబానికి సరిపడా మాత్రమే పండించుకోగలిగేది. అది కూడా ఏడాదిలో మూడు నాలుగు నెలలకు సరిపోయే మేరకే. మిగిలన సమయమంతా మార్కెట్ ఆధారంగానే రోజులు గడిపేది. కొద్ది కాలం క్రితం ఆమె ఇకార్-విపికేఎఎస్ కార్యక్రమంలో కూర గాయలు, కుక్క గొడుగుల (మష్రూమ్) సాగులో, వర్మీ కంపోస్ట్ తయారీలో, తేనె పెట్టెల నిర్వహణలో, సంరక్షిత వాతావరణంలో కూరగాయల విత్తన పెంపకంలోనూ ప్రత్యేక శిక్షణ పొందారు. ఆమె చదివింది కేవలం 8వ తరగతి మాత్రమే. అయినా, పోషక విలువలు, ఇతర ఆధునిక సాగు పద్ధతులపై చాలా ఆసక్తి పెంచుకునేది. ఆమె ఆసక్తి వల్ల పోషక విలువలతో కూడిన పంటలను సాగుచేయగలిగేది. దాదాపు 16 రకాల కూరగాయలు, పండ్ల మొక్కలను ఆమె తన న్యూట్రీ-గార్డెన్ లో పండించేది.  కుటుంబ అవసరాలకు సరిపోయే సూక్ష్మ పోషకాలను అందించే దిగుబడి ఇచ్చే విధంగా 200 మీటర్ల స్క్వేర్ జాగాలోనే ఆమె ఈ ఉత్పత్తి చేపట్టింది. అదే సమయంలో తనకున్న జాగాలోనే న్యూట్రీ-గార్డెన్ గురించి ఇతరులకు అవగాహన కల్పించే విధంగా ప్రదర్శనలు నిర్వహించేది. స్వయంగా ఇతరులకు శిక్షణ ఇచ్చేది. ఈ కార్యక్రమాలన్నిటినీ ఆమె ఒక్కతే తన ఒంటి చేతి మీదుగానే నిర్వహించగలిగేది.

మొదటి సీజన్ లోనే మంచి దిగుబడి సాధించింది. కుటుంబ అవసరాలకు సరిపడా సాధించింది. సమీపంలోని మార్కెట్ లలో మిగులు ఉత్పత్తులను విక్రయించుకునేది. న్యూట్రీ-గార్డెన్ లోనే ఏర్పాటు చేసిన పోలీ-టన్నెల్స్ ఆధారిత కూరగాయల మొక్కల పెంపకం కోసం నర్సరీని కూడా నిర్వహించడం ప్రారంభించింది. తన నర్సరీలో సిద్ధం చేసిన మొక్కల నారును తోటి మహిళలకు సమకూర్చిపెట్టేది. సమీప గ్రామాల రైతులు కూడా వచ్చి ఆమె నిర్వహిస్తున్న గార్డెన్ సందర్శించి స్ఫూర్తి పొందేవారు. ఆ రకంగా పోషక విలువలతో కూడిన ఆహారం ప్రాధాన్యాన్ని వారు కూడా గుర్తించేందుకు ఆమె ఆదర్శంగా నిలిచారు.

ముగింపు వాక్యాలు

న్యూట్రీ-గార్డెన్ పెంపకం అనేది సంప్రదాయక సేద్యంలో ఒక భాగమే. అయితే ఇది చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైంది. రోజువారీ ఆహారంలో వివిధ రంగులలో ఉండే ఆహార పదార్థాలను చేర్చుకోవడం వల్ల మన శరీరం రోగాల బారిన పడడకుండా ఉంటుంది. రోగనిరోధక శక్తి పుష్కలంగా పెరుగుతుంది. తాజా పండ్లలోను, కూరగాయలలోనూ లభించే ఫైటోకెమికల్స్ అంటే తాజా మొక్కలలో ఉండే సహజ పోషకాలు యాంటీ యాక్సిడెంట్లుగానూ (కొన్ని పదార్థాల ఆక్సిజనీకరణ నివారించేందుకు ఉపయోగపడతాయి), యాంటీ అలెర్జిక్ (అలెర్జీ లక్షణాలను నివారిస్తాయి), యాంటీ-కార్సినోజెనిక్ (క్యాన్సర్ నివారకాలు), యాంటీ-ఇన్ ఫ్లమేటరీ (వాపు నివారకాలు), యాంటీ-వైరల్ (వైరస్ నుంచి రక్షణ నిచ్చేవి), యాంటీ-ప్రోలిఫిరేటివ్ (రోగవ్యాప్తి నిరోధకాలు)  కుటుంబ సభ్యులందరి ఆరోగ్యానికి సదా రక్షగా నిలుస్తాయి. న్యూట్రీ-గార్డెన్ విధానం మారుమూల గ్రామాలలోని వారూ, మార్కెట్ అందుబాటులో లేని ప్రాంతాలలోని వారికి చాలా విధాలుగా ఉపయోగకరం. అందువల్ల పోషక ఆహారం, న్యూట్రీ-గార్డెన్ పెంపకం, ఆహారం తీసుకోవడంలో అనుసరించవలసిన ఉత్తమ పద్ధతులు గురించి మారు మూల గ్రామాలలో ప్రచారం చేయడం, వారిలో అవగాహన కల్పించడం అత్యవసరం. తక్కువ పెట్టుబడితో మహిళలలో పోషకాహార లోపం సమస్య పరిష్కారానికి న్యూట్రీ-గార్డెన్ ఉత్తమ సాధనం.

 

ప్రీతి మంగాయ్
ప్రిన్సిపాల్ సైంటిస్టు, ఐకార్-అటారీ, జోన్ 1
పిఏయూ క్యాంపస్, లూధియానా, పంజాబ్, ఇండియా
E-mail: preetinariyal@yahoo.com

పంకజ్ నౌతియాల్
ఎస్ఎంఎస్ (హార్టికల్చర్), కేవికే (ఐకార్-విపికేఏఎస్)- ఉత్తర కాశి
ఉత్తర ఖండ్, ఇండియా

రేణి జేతి
సీనియర్ సైంటిస్టు (సోషల్ సైన్స్)
ఐకార్-విపికేఏఎస్, అల్మోరా, ఉత్తర ఖండ్, ఇండియా

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి ౨౩, సంచిక 3, సెప్టెంబర్ ౨౦౨౧

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...