నేలతల్లి సంరక్షకులు రైతన్నలే

…… మన ఆలోచనలకు హద్దులేదు. సాధించిన విజయాలకు అంతం లేదు. కానీ, నేల తల్లిని నమ్ముకున్న రైతన్న, ఆతనికి, అతనితో పాటు మనందరికి ఇంత అన్నం అందించే విత్తనాలు మాత్రం పరిమితుల్లోనే ఉంటాయి. పరిమితంగా ఉంటూనే ప్రపంచమంతటా జీవితాలు వికసించేందుకు అనువుగా అంతులేని సృష్టివికాసానికి తోడ్పడుతున్నాయి. మనకు అత్యంత అవసరమైన సమస్తమూ మన శరీరాలలోనూ, నేల తల్లి ఒడిలోనూ సమృద్ధిగా నిల్వ ఉన్నాయి. వ్యవసాయం చేసే రైతన్న ఈ మట్టిలోనుంచి పెంచి పోషించే అమూల్యమైన వాటి వెనుక ఎన్నో జాగ్రత్తలు, మరెంతో శ్రద్ధ, అంతకుమించి ప్రతిఘటన, మనుగడ కోసం ఆరాటం, అమితమైన బాధ్యత, సమష్టి కృషి దాగి ఉన్నాయి. ఇదొక పవిత్ర కార్యం.  …..

     పర్యావరణపరంగా కానీ, సామాజికపరంగా కానీ మానవ సమాజం అనుసరించే కొన్ని పద్ధతులు నష్టదాయకంగానే ఉంటున్నాయి. నేటి పరిస్థితి ఎలా ఉందంటే వ్యవసాయ రంగంలోను, ఇతరత్రా ఒక అత్యంత కీలకమైన భూమి వనరులను కాపాడుకునేందుకు తక్షణం కొన్ని చర్యలు తీసుకోవడం తప్పదనిపిస్తున్నది. వ్యవసాయం అంటే కేవలం శాస్త్రీయ విధానాలను పాటిస్తూ కేవలం ఆహారోత్పత్తిని చేసే సాంకేతిక  ప్రక్రియ అనుకోరాదు. వ్యవసాయం అంటే సామాజిక-సాంస్కృతిక వ్యవస్థ. అది సుసంపన్నమైనది. అందులో ప్రధాన భాగస్వాములైన సమాజంలోని మానవులందరికీ ప్రత్యేక పరమార్థం దాగి ఉంది. వ్యవసాయం అంటే పంటలు పండించడం. అంటే సంరక్షణ చేయడం, పెంచి పోషించడం. ఇందులో నేల్లోని మట్టి, విత్తనం, నీటి తేమ, వాతావరణంలోని ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ తీరుతెన్నులు చాలా కీలకమైనవి. వీటితో పాటు అస్థిరత నిత్యం సమస్యగానే ఎదురవుతుంది. చీడపీడలు, కలుపు వెతలు, వ్యాధికారకాలు సవాళ్లు విసురుతూనే ఉంటాయి. నిరంతరం నిఘా వేసి ఉంచాలి. అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి. ఈ మొత్తం సేద్యం వెనుక మనిషులు, వారి మధ్య ఉండే పరస్పర ఆధారిత అనుబంధాలు ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. దీనికి పూర్తిగా విరుద్ధమైన భావం పేరే – పారిశ్రామిక వ్యవసాయం. ప్రస్తుతం ఇది దేశంలోని వ్యవసాయ రంగానికి అత్యంత ప్రమాదకరంగా మారింది.

     ఈ ప్రమాదం నేపథ్యంలోనే కొంత మంది  రైతు సమాఖ్యలతో సంప్రదింపులు చేపట్టారు. వ్యవసాయాన్ని ఒక సంస్కృతిగా గుర్తించి పర్యావరణ సంరక్షణ, సామాజిక స్థితిగతులకు అనుగుణంగా ఒక క్రమపద్ధతిలో ప్రత్యామ్నాయ సేద్య విధానాలను రూపొందించాలని నిర్ణయించారు. ఫెయిర్ ట్రేడ్ అలెయెన్స్ ఆఫ్ కేరళ (FTAK) పేరుతో సంఘటితమైన రైతు ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో వెలుగుచూసిన అంశాల సారాంశమే ఈ వ్యాసంలోని ముఖ్యాంశాలు. ఇప్పటికి మూడేండ్లుగా ఈ విధంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో రచయితతో పాటు విజువల్ ఆర్టిస్టు అజీజ్ టి.ఎం., కవి వి.టి. జయవర్దన్, థియేటర్ ఆర్టిస్టు శివదాస్ పోయికవు, మరో సాహితీ ప్రముఖులు ఎం.పి. ప్రతీశ్ పాలుపంచుకున్నారు.

మారుతున్న విలువలు

     కొద్ది సంవత్సరాల క్రితం వరకు మన దేశంలో అత్యధికులు స్వయంగా వ్యవసాయం వృత్తిగా జీవించేవారు. లేదా ఎంతో కొంత సేద్యం పనులలో పాలు పంచుకునేవారు. మొత్తం మీద ఏదో రూపంలో వ్యవసాయంతో అనుబంధం ఉండేది. చివరికి రైతులతో సన్నిహితమైన పరిచయాలు ఉండేవి. ప్రస్తుతం అది పూర్తిగా లోపించింది. వ్యవసాయపు పనుల ప్రభావం మన సంస్కృతిపై కానీ, పర్యావరణంపై కానీ, ఆహార పదార్థాల వాడకంపై కానీ, ఆహారపు ఆలవాట్లపై కానీ ఎంత ప్రభావం ఉంటుందో తెలుసిన వారు చాలా కొద్ది మంది మాత్రమే.  ముఖ్యంగా మనం ఎంత పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను కానీ, అందుబాటులో ఉన్న వనరులను వృథా చేస్తున్నామో తెలియడం లేదు. పరిస్థితిని తిరిగి యథాపూర్వస్థితికి చేర్చాలంటే తెగిపోయిన ఈ అనుబంధాలను – వ్యవసాయంతో సామాన్యల సంబంధాలను – మెరుగుపరచడం అత్యవసరం.

     వ్యవసాయ రంగంతో సామాన్యులకు సాన్నిహిత్యం పెరిగినప్పుడే వాటి వెనుక ఉన్న సాంస్కృతిక విలువలు కూడా అర్థమవుతాయి. ఉదాహరణకు, ఆహారం ప్రాధాన్యత అర్థమవుతుంది. అప్పుడే ఆహారం విలువ కూడా తెలుస్తుంది. కొద్ది సంవత్సరాల క్రితం వరకు మన ఇండ్లలో చిన్నారులు చిన్నతనం నుంచి ధాన్యపు గింజను ఎంత విలువైనదో పెద్దల నుంచి తెలుసుకుని ఉండేవారు. వాటిని పంట రూపంలో మనకు అందిస్తున్న నేల తల్లి విలువ కూడా వారికి అర్థమై ఉండేది. ఇంట్లో ఒక్క బియ్యపు గింజ నేలపై పడి ఉన్నా వెంటనే ఆ ఒక్క గింజను అత్యంత ప్రేమతో మరింత గౌరవంతో పైకి తీసి భద్రపరిచేవారు. అలా నేర్పించేవారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అవగాహన ఉండేది. బియ్యపు గింజలను చీపుళ్లతో పక్కకు జరపడం అనేది ఆ అన్న పరమాత్మను అవమానించడంగా భావించేవాళ్లు. ఇంట్లో బస్తాల కొద్దీ ధాన్యం ఉన్నా సరే ధాన్యం గింజకు అంత విలువ, గౌరవం ఇచ్చేవారు. చేతిలో ఉన్న అన్నం ముద్ద విలువను దాని ఖరీదును చూసి కాదు ఇవ్వవలసింది. ప్రకృతి మాత రూపంలో ఆ దైవం ప్రసాదించిన దైవప్రసాదంగా భావించేవారు. ప్రతి ధాన్యపు గింజ మరెంతో ఆహారం మనకు అందించే విత్తనం అన్న ధ్యాస ఉండేది. అలా చేతికి అందే ధాన్యమే మన జీవితాలు సవ్యంగా సాగడానికి ఆధారమన్న అవగాహన ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆహారం విలువ ఎవరికీ తెలియడజం లేదు. చాలా అధిక మేతాదులో ఆహార పదార్థాలను వ్యర్థం చేసి చెత్త రూపంలో విసిరిపారేయడం సర్వసాధారణమైంది. మరో మాటలో చెప్పాలంటే అలా ఆహారాన్ని వ్యర్థంగా చెత్తలోకి చేర్చడం అనేది వెర్రితలలు వేసిన పిచ్చి ముదిరిపోయిందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా అభివృద్ధి పేరుతో చేపట్టిన భారీ ప్రాజెక్టుల పేరుతో వ్యవసాయ భూములు ప్రభుత్వాల పరంకాగా, మిగిలిన కొద్ది పాటి భూములను నమ్ముకుని అనేకులు ఇంకా పట్టుకు వేలాడుతున్నారు. వారి పరిస్థితి కొమ్మలు నరికేసిన చెట్లలా కొత్త చిగుళ్లు వేస్తాయని ఎదురుచూస్తున్నారు. వాళ్లే వ్యవసాయ రంగానికి ఆశాదీపాల్లా కనిపిస్తున్నారు. నేలతల్లిని నమ్ముకుని పంట పండించడమే తమ పవిత్ర కర్తవ్యంగా వారు భావిస్తున్నారు. వాళ్లే ఇప్పటికీ మనిషులకూ, సేద్యానికి వారధుల్లా మిగిలి ఉన్నారు. మార్కెట్ ఆధిపత్యం పైనే ఆధారపిడన పెట్టుబడిదారీ వ్యవస్థకే అనుకూలంగా చట్టాలు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే వ్యవసాయదారుల చట్టం వేరు. వారు ఇంకా ప్రజల జీవితాలు, ఆరోగ్యమే తమ చట్టబద్ధమైన విధిగా పంటలు పండిస్తున్నారు. వారి చట్టం ప్రకారం జీవితాలు అన్నిటికన్నా విలువైనవి. జీవితాల విలువలను గుర్తించి సేద్యం చేస్తూ వ్యవసాయానికి మనషి మనుగడకు మధ్య ఉన్న పరస్పర ఆధారిత, పరస్పర అనుబంధాలను గౌరవించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఒక్క కారణం వల్లనే గతంలో ఎన్నో ప్రజా ఉద్యమాలు ఊపిరిపోసుకున్నాయి. అవి రైతుల ఉద్యమాలు  కావచ్చు. గిరిజనులవి కావచ్చు. లేదా చేపలు పట్టేవారివి కావచ్చు. అలాంటివాళ్లే భారీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేదా మార్కెట్ ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులను ఎదుర్కొని పోరాటం సాగించారు. ఇలాంటి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వారందరి లక్ష్యం ఒకటే – మట్టికి జీవి మనుగడకు ఉన్న అనుబంధాన్ని సురక్షితంగా కాపాడడమే.

బాక్సు 1

ఫెయిర్ ట్రేడ్ అలెయెన్స్ కేరళ (ఎఫ్ టి ఏ కే) సంస్థ 2005లో కేరళ వ్యాప్తంగా నెలకొన్న వ్యవసాయ రంగం సంక్షోభం కారణంగా ఏర్పడింది. టోమీ మాథ్యూ ప్రారంభించిన ఈ సంస్థ కేరళలోని కోజికోడ్ పట్టణంలోని అత్యంత పురాతన సేంద్రీయ ఉత్పత్తుల మార్కెట్ కేంద్రం. దాని పేరు ఎలిమెంట్స్.  వైనాడ్ పరిసరాలలోని 350 కుటుంబాలు మొట్టమొదటిసారి ఈ మార్కెట్ సభ్యత్వం తీసుకున్నారు. ఇప్పుడు వారంతా తమ ఉత్పత్తులకు మరింత విస్తృత స్థాయిలో మార్కెట్ అవకాశాలు సంపాదించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మెరుగైన ధరలను రాబట్టేందుకు కృషిచేస్తున్నారు. బేరసారాలు చేయగలుగుతున్నారు. ఈ రకంగా వాణిజ్య వ్యవహారాలలో తమకు సముచిత న్యాయం సాధించుకుంటున్నారు. సమష్టిగా సాగుతున్న ఈ కృషి వెనుక రైతుల ఆత్మగౌరవం మూలకేంద్రంగా నిలుస్తోంది. ఈ సంస్థ సభ్యత్వం ఇప్పుడు 5000 కుటుంబాలకు పెరిగింది. మలబార్ గిరిజన ప్రాంతాలలో ఉత్పత్తులకు మెరుగైన గిట్టుబాటు ధరల సాధనకు ఇది ఇప్పుడు మార్గసూచి గా నిలుస్తోంది.

     ప్రారంభంలో మంచి ధరల సాధనకు, మెరుగైన మార్కెట్ అవకాశాల కోసం మాత్రమే ఈ సంస్థ తన దృష్టి పెట్టింది. ఇప్పుడు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి సేంద్రీయ సేద్య విధానాలలో ఉత్తమమైన వాటిని ప్రోత్సహించడంలోనూ, జీవవైవిధ్యం కోసం శ్రద్ధ తీసుకుంటూ ఏక పంట సాగు విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. జన్యుపరమైన మార్పులను వ్యతిరేకించే సాంకేతికతపై వేలెత్తి చూపిస్తోంది. ప్రజా శ్రేయస్సుకు అనుకూలమైన విత్తనాలనే ప్రోత్సహిస్తోంది. అదే సమయంలో ఆహార ఉత్పాదనలో స్వతంత్రత కోసం సున్నితమైన సేద్య విధానాలను గురించి రైతులకు అవగాహన కల్పిస్తోంది. దీని అనుబంధ 4500 రైతు కుటుంబాలు పశ్చిమ తీరాన దాదాపు 15000 ఎకరాలను వాతావరణ సవాళ్లను తట్టుకునే విధంగా సంసిద్ధం చేయగలిగారు. ఈ క్రమంలో రైతుల సాగులోని ప్రతీ వ్యవసాయ క్షేత్రాన్ని నిత్య హరిత వనాలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  పచ్చదనమే ప్రకృతి రూపంగా మార్చేందుకు యత్నిస్తున్నారు. పడమటి కొండల ప్రాంతాలు సహజంగానే పచ్చని అడవులకు ప్రసిద్ధి. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని జీవావరణ సంరక్షణ ప్రాంతంగా కూడా ప్రకటించారు.

మనం సంపాదించుకుంటున్న అనేక ప్రయోజనాలలో ఒకటి చేపలను పట్టడం కోసం చెరువులను విషతుల్యం చేయడమే. స్వల్పకాలిక లాభాల కోసం పర్యావరణ శ్రేయస్సును విస్మరించడం. సామాజిక పరిణామాలను పట్టించుకోకపోవడం. రైతుల్లో కొంత మంది వేరే రకం. వారు సరైన మార్గాలనే అనుసరిస్తారు. కానీ వారు మరో రకమైన బానిసలుగా మారిపోయారు. వాస్తవానికి వారే ఈ నేల తల్లికి సరైన రక్షకులు. వారు, మనం కూడా నివసిస్తున్న  నేల తల్లిని పరిశుభ్రంగా ఉంచాలనేదే వారి ఆశయం. వారునేల తల్లి కాలుష్యరహితంగా ఉండాలనే ఆలోచనతో ముందుకు సాగినట్లయితే వారి వారసులు కూడా అదే మార్గంలో ముందుకు సాగుతారు. కాలుష్యరహితమైన నేలపై మనుగడ సాగించగలరు. వారి దృష్టిలో న్యాయం అంటే బాధ్యతాయుతంగా వ్యవహరించడం. భూమి మట్టిలో దాగి ఉన్న ఈ నేల తల్లి పవిత్రతను కాపాడడం అంటే తమ కుటుంబాలను, తమ తరువాతి తరాలను, తమ చుట్టూ ఉన్న సమాజాన్ని సురక్షితంగా ఉంచడమే.

 అయితే నేటి రైతు పరిస్థితి మరోలా ఉంది. వారు కూడా ధనదాహంతో ఇంకా ఇంకా సంపాదించాలనేదే లక్ష్యంగా తమ నిత్య అవసరాలే చాలా ముఖ్యమైనవిగా, తమ పిల్లల విద్యాబుద్ధులే కర్తవ్యంగా వారు వ్యవసాయాన్ని కూడా వ్యాపారంగా మార్చివేసుకున్నారు. పిల్లల చదువుల కోసం ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేస్తున్నారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడమే జీవనశైలిగా బతుకులు సాగిస్తున్న ఈ ప్రపంచంలో తమ పిల్లలు కూడా ఇతరులలాగే సేద్యాన్ని పట్టించుకోకుండా బలికడం నేర్చుకోవాలని తాపత్రయపడుతున్నారు. సకల జీవజాలం ప్రకృతి నియమాల పరిధిలోనే జీవించేందుకు మార్గం చూపిస్తున్న ఇలాంటి సేద్యగాళ్లను కాపాడి దేశ ప్రజలందరికనీ కాపాడవలసిన ప్రభుత్వాలు పాలనలో ఉన్న వేళ ఎవరు మాత్రం ఏం మాట్లాడగలరు? ఎలా ఉండరాదో వారికి నేర్పిస్తున్నాం. ఫలితంగా మన ముందు నిలిచిన పరిస్థితి మరో ప్రత్యామ్నాయం అనేదే లేకుండా చేస్తోంది.. ఒక్క మాటలో చెప్పాలంటే మన నేటి సమాజపు వికృత పోకడ అని చెప్పాలి.

 పోషించడం, సంరక్షించడం అన్న పదాలను మార్కెట్ ప్రభావిత అవసరాలను తీర్చడంగా విపరీత అర్థం వ్యాపించింది. ఇదే విషయాన్ని ఒక రైతు మాటల్లో తెలుసుకుందాం. “ఇవాళ మన ఆహారంలో అలవాట్లు మారిపోయాయి. రుచులు మారిపోయాయి. మన రుచులను నాశనం చేయడమే మార్కెట్ ప్రధాన లక్ష్యం. ఇప్పటివరకు రుచులు అంటే మన పంట పొలాల్లో పండిన పంటలపైనే ఆధారపడి ఉండేది. ఇప్పుడు మార్కెట్ ప్రవేశించింది. మన ఉత్పత్తులను వారు సేకరిస్తున్నారు. కానీ వారి రుచులను మనకు అలవాటు చేస్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు జాక్ ఫ్రూట్ బర్గర్లు, రోల్స్ వంటి రుచులను మనకి అంటిస్తున్నారు. మన ఇండ్లలో ఉండే వంట గదులు కేవలం వంటలను చేయడం కోసం మాత్రమే కాదు. మన ఆహారాన్ని, విత్తనాలను సురక్షితంగా ఉంచే రక్షణ శాలలు. నేడు మన మట్టిమీద చేస్తున్న పనులు, పండిస్తున్న రుచులకు మన వంటింళ్ళలో చోటు లేదు. ఒక రకంగా మనకు తెలియని మార్కెట్ అవసరాల కోసం మనం పండిస్తున్నాం. మన ఇండ్లలో కూడా బయటి ప్రపంచపు వాసనలే ప్రభావం చూపిస్తున్నాయి.” మనం శాశ్వతంగా నష్టపోతున్న అనుబంధం ప్రకృతికి విరుద్ధం.

మారిపోతున్న అభిరుచులు

మనకు ఈ రోజుల్లో ముద్రితమైన వాటి మీదే నమ్మకం ఎక్కువ. ఆ ముద్రిత పుస్తకాల్లోని అంశాలనే పరిజ్ఞానం అనే భ్రమలో జీవించేస్తున్నాం. అయితే నేల తల్లిని నముమకుని సేద్యం చేసే వ్యవసాయదారుడికి ఉండే పరిజ్ఞానం పుస్తకాల్లో ఎక్కడా ముద్రితమై కనిపించదు. అంటే రైతులకు తెలిసిన విజ్ఞానాన్ని గ్రంథాలయాలలో ఎంత వెతికినా కనపడదు. అది నిత్యం వారి జీవితాల్లోనే తరతరాల పాటు సురక్షితంగా ఉంటుంది. అలాంటి విజ్ఞానం, తెలివితేటలకు రైతుల సురక్షితంగా కాపాడుతున్నారు. నేటి తరంలో రైతులయినా, ఇతర వృత్తినిపుణులైనా, మేధావులైనా ఎంత ఈ సమాజానికి అందిస్తున్నారు, వాటి వల్ల ఏ మేరకు లబ్ది చేకూరింది, వాళ్లు ఎంత పెద్ద మొత్తంలో వనరులను కాని ఉత్పాదనలను కాని దుర్వినియోగం  చేస్తున్నారు అనే అంశాలపై ప్రతి ఒక్కరూ లేదా ఎవరి మటుకు వారు అంతరంగాన్ని పరీక్షించుకోవాలి. జీవితాలు సజావుగా సాగేందుకు చేస్తున్న కృషిని,

పర్యావరణాన్ని సురక్షితంగా కాపాడుకునేందుకు తోడ్పడుతున్న వైనాన్ని, ఇంధనాన్ని కానీ, వనరులను కాని సద్వినియోగం చేసుకునే విషయంలోనూ, వృధా చేస్తున్న వాటిని కూడా ఈ పరిశీలనాంశాలలో చేర్చుకోవాలి. వాస్తవ రూపాల గురించి సరైన అవగాహన ఉంటే తప్ప పెంచి పోషించే ఉత్తమ లక్షణాన్ని అలవరచుకోలేరు. ప్రకృతి సహజంగా రైతుల జీవనం ఇలా పెంచి పోషించడం, సహజీవనం సాగించడం, మనుగడ కొనసాగించడం అనే ప్రాథమిక సూత్రాలపైనే ఆధారపడి సాగుతుంటాయి. ఈ వాస్తవాలు వారి మనస్సులో చాలా గట్టిగా నాటుకుని పోయి ఉంటాయి.

ప్రస్తుత వాతావరణంలో విజ్ఞానం అనేది కేవలం ఊహాత్మకమైనది. అయితే జీవితానికి మేలు చేసేదే విజ్ఞానం అని గుర్తించాలి. నిజమే ఇప్పుడు మనకు చాలా విషయాలు తెలుసు. మనకి తెలిసిన విషయాలు మనకు జీవిత సత్యాలను గుర్తించలేని గుడ్డితనమే ఇస్తున్నాయి. గెలవడం, మరిన్ని లాభాలు సంపాదించడమే మన జీవితాలలో పెరిగిపోయిన కలుపు మొక్కలని తెలుసుకోవడం లేదు. ఈ కలుపు మన ఆలోచనలను, మనం చేసే పనులనూ విషపూరితం చేసి వేస్తున్నాయి. మన ముందు మరిన్ని సవాళ్లను తీసుకొచ్చి కొత్త సమస్యలను వెంట తెస్తున్నాయి. మార్కెట్ లో నుంచి హానికరంగా భావించి దేనినైనా నిషేధిస్తే మరో రూపంలో మళ్లీ మార్కెట్ లో కనిపిస్తున్నాయి. ఒక సమస్యకు కనుగొన్న పరిష్కారమే తరువాత మరో సమస్యకు మూలం అవుతోంది. దానిని పరిష్కరించేందుకు మరేదో మార్గం చూస్తాం. మళ్లీ అదే సమస్య అవుతుంది. ఇది ఒక విషవలయంగా మనలను వేధిస్తూనే ఉంటుంది. కారణం మనం సమస్యలను పరిష్కరించే క్రమంలో జీవితానికి దానిని సరైన విధంగా అన్వయించుకోవడం లేదు. నిత్య జీవితానికి సంబంధం లేకుండానే పరిష్కారాలు వెతుక్కుంటున్నాం. అలా నిత్యం సమస్యలతోనే కాలం గడిపేస్తున్నాం. ఫలితమే శారీరికంగానే కాకుండా మానసికంగా, భావోద్వేగాల పరంగా ఎన్నో సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం.

గట్టిగా యాభై ఏండ్ల క్రితం వరకు మన జీవితాల్లో వ్యర్థాలు అన్న పదానికి అంతగా చోటు ఉండేది కాదు. అప్పట్లో అలా వృధా చేయడం అనే ఆలోచనే చాలా భయంకరంగా కనిపించేది. మనకు పనికిరానిదేదైనా మరో జీవి బతకడానికి ఆధారంగా ఉపయోగపడేది. అంటే పెంచి పోషించడంలో ప్రతి ఒక్క పదార్థం ఏదో రూపంలో ఉపకరించేది. ఇప్పుడు వృధా అన్న పదం గురించి వేరే ఆలోచించనవసరం లేదు. మన జీవితాలే వ్యర్థాల చుట్టూ సాగుతున్నాయి. మన చుట్టూ ఉన్నవి అవే. ఇవాళ్లి లెక్కల ప్రకారం మన దేశంలో రోజుకు 25,940 టన్నుల మేరకు ప్లాస్టిక్ వ్యర్థాలనే పారవేస్తున్నాం. ఇప్పుడు మన ఆలోచనలు కూడా ఎలా మారిపోయాయంటే ప్రతీ వ్యర్థపదార్థం నుంచి కూడా మరో వ్యాపారం చేసుకోవచ్చనే స్థాయికి చేరింది. అన్ని సమస్యలకు పరిష్కారం చూపించేందుకు మన వ్యవస్థలో అవకాశాలున్నాయనేది నేటి విశ్వాసం. ఒక పక్కన సర్వం నష్టపోతున్నాం. కానీ కలలకు మాత్రం ఏ కొరత ఉండడం లేదు. ఇలా కలల్లోనే ఎంత కాలం జీవితాలు సాగిద్దాం?

జీవితాలతో అనుసంధానం అవసరం

ఇప్పుడు మన జీవితాలు పూర్తిగా మార్కెట్లతో ముడిపడిపోయి ఉన్నాయి. మార్కెట్ అనుకూల యంత్రాలుగా మారిపోయాం. ఎప్పటికప్పుడు మార్కెట్ అవసరాలకు తగినట్లుగానే లక్ష్యాలు నిర్ణయించుకుంటున్నాంయ వాటి వెనుక పరుగెడుతున్నాం. ఈ పరుగు పందెంలో మన జీవితాలనే పణంగా పెడుతున్నాం. అయితే వ్యవసాయదారులు మాత్రం మరో జీవనమార్గాన్ని అనుసరించి మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వేరి పరుగు వేగం వేరు. వారు జీవించే కాలం వేరేగా కనిపిస్తుంది. మట్టి, విత్తనం, మొలకలు, దిగుబడులు ప్రవర్తించే విధానం వేరు. వాటికి తగినట్లుగా అప్రమత్తంగా ఉంటూ, మొలకెత్తే వరకు ఎదురుచూస్తూ, నెమ్మదిగానే అయినా దాని క్రమంలో అది ఎదిగేందుకు అవకాశమిస్తున్నారు. మన ఆదాయం లేదా మన ఆహారం అందడంలో జరిగే జాప్యాన్ని మనం ఎంత వరకు ఏ విధంగా అర్థం చేసుకోగలం? మనం ఉంటున్న కాలానికన్నా మనమే వెనకబడి జీవితాలు సాగించేస్తున్నాం.

 రైతుల శ్రమ వెనుక నిలిచి ఉన్న మట్టి, విత్తనం జీవితసత్యాలను తెలియజేస్తాయి. వ్యవసాయం అంటేనే అత్యంత అప్రమత్తత. మరెంతో సునిశిత పరిశీలనా శక్తి. ఈ రెండు చురుగ్గా పనిచేస్తూ వాటికి మనకు తెలిసి కానీ తెలియక కానీ మన కాళ్లూ చేతులూ తోడయితేనే సహజీవనం సజావుగా సాగుతుంది. స్టూడియో అలంకరణలకు, కార్పొరేట్ అట్టహాసాలకు, ఆకర్షణీయ వినోదాత్మక దృశ్యాలకు అలవాటు పడి వాటి ప్రభావంలో కొట్టుకుపోతున్న నేటి తరానికి మట్టి వాసనలోని ఆకర్షణ, విత్తనం మొలకెత్తడంలోని సౌందర్యం గుర్తించాలంటే అదో పెద్ద తీర్థయాత్రగానే పరిగణించాలి. ఇలా అనేక రకాలుగా తెగిపోయిన వ్యవసాయం – సామాన్య ప్రజానీకం మధ్య సాన్నిహిత్యాన్ని, అనుబంధాలను తిరిగి ఉద్ధరించాలంటే దేశ పౌరులలోని 30 ఏండ్ల వయుసు వచ్చిన ప్రతి ఒక్క స్త్రీ/పురుషుడు కనీసం రెండు సంవత్సరాల పాటు సమీకృ వ్యవసాయ క్షేత్రాలలో పనిచేయాలి.

 వ్యవసాయ రంగానికీ ఆధ్యాత్మికపరమైన పరమార్థం కూడా ఉంది. అది మట్టికీ, విత్తుకూ ఉన్న అనుబంధం గుర్తుకు తీసుకువస్తుంది. మట్టిలో కాలు పెట్టినప్పుడు కలిగే అనుభూతి వేరేగా ఉంటుంది. మన శరీరం అపూర్వమైన స్పందనలకు గురవుతుంది. ఆధ్యాత్మిక విధుల్లోలాగే విత్తనాలను వేరుచేసి, శుద్ధి చేసి, సంరక్షిస్తూ, నాట్లు పోసి, మొక్కలను పెంచడంలో వాటిని మార్పు చేసుకోవడంలో మన చేతులూ, కాళ్లూ, కళ్లూ, హృదయమూ కూడా మమేకమైపోతాయి. మనలోని అనేక చీకట్లను తొలగిస్తాయి. విత్తంనం నాటడమే నిశ్శబ్దంగా సాగే ప్రార్థనగా పరిగణించగలగాలి.

 వివిధ వృత్తులకు సంబంధించిన నిపుణులను మనం ఏ విధంగా అయితే అత్యంత గౌరవభావంతో చూస్తామో నేలపై కదులుతూ, మట్టితో కలిసి సహజీవనం సాగించే రైతు విషయంలోనూ చూపించడం అత్యవసరం. పేరు లేదు, అడ్రసు ఉండదు. కానీ రాత్రిపగలు భేదం లేకుండా మట్టిలోనే బతుకుతూ మట్టిని ఆధారం చేసుకుని మన నోటికి విభిన్నమైన రుచులను, వంటలు అందించే బంగారంగా మారుస్తున్న కర్షకులకు మనఁ ఇవ్వగలిగినది ఏముంటుంది? అటు మన కడుపులను నింపుతూ, నేల తల్లిని కాపాడుకుంటూ మన అందరికి రక్షణ ఇస్తున్న రైతుకు ఏమి ఇస్తే రుణం తీరుతుంది? అయినా వారు మన జాగృత అవస్థలో ఏ మూలనో ఉండిపోతున్నారు.

మన జీవితాలకి తగిలిన గాయాలు మానాలంటే మనం వారి హృదయాలలోకి వెళ్లి అక్కడ ఉన్న గాయాలను మాన్చడానికి సిద్ధం కావాలి. ప్రకృతి మాతతో కలిసి పరస్పర ఆధారిత సహజీవనం సాగిస్తున్న  రైతు గాయాలను ముందుగా మానడానికి తోడ్పడాలి. మన గాయాలు, బాధలు, ఆనందాలు ఇలా మన జీవితంలోని ప్రతి అనుభవంలోనూ ఆ రైతన్నకు కూడా కొంత చోటిచ్చి మనందరి సమష్టి జీవితాలను వెలుగుల మయం చేసుకుందాం.

సి.ఎఫ్. జాన్
25, 2వ క్రాస్, 2వ మెయిన్
భైరవేశ్వర సే అవుట్, హెన్నూర్ బండ్
కల్యాణనంగర్ పోస్టు, బెంగళూరు – 560 043
E-mail: cfjohn23@gmail.com

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి 21 , సంచిక 3 , సెప్టెంబర్ ౨౦౧౯

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...