దేశంలో పర్యావరణ అనుకూల సేద్యం తీరు మహిళా సంఘాల శక్తి, ప్రభావం

“జాతీయ విత్తన వంగడాలను పరిరక్షించేందుకు, సంప్రదాయక సేద్య విధానాలను ముందు తరాలకు అందించవలసిన బాధ్యత మన అందరిదీ. ఒకప్పుడు మన పూర్వీకులు అనుసరించిన సేద్య విధానాలు పూర్తిగా పర్యావరణ అనుకూలమైనవి. స్థానిక ప్రకృతి విశిష్టతలకు ఎలాంటి హాని కలిగించనివి.” ఈ మాటలు ఎవరివో తెలుసా! కర్నాటక రాష్ట్రం బెంగుళూరు సమీపంలోని అమృత భూమి సంస్థ కో-ఆర్డినేటర్ చుక్కి నంజుండస్వామి చెప్పినవి. పర్యావరణ సేద్య విధానంపై రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పడిన శిక్షణ సంస్థ పేరు అమృత భూమి. సంప్రదాయక సేద్య విధానాలతో పాటు ప్రత్యామ్నాయ సేద్య విధానాలు కూడా అనుసరించవచ్చుననేది ఈ సంస్థ ప్రచారం చేస్తున్న మౌలిక సూత్రం. ఇది లా వియా కాంపెసినా అన్న విదేశీ సంస్థకు అనుబంధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా రైతు నుంచి రైతుకు శిక్షణ విధానంలో పర్యావరణ సేద్య విధానాల గురించి, రైతుల హక్కుల గురించి, ఆహార సాధికరత గురించి, సామాజిక న్యాయం గురించి రైతులను చైతన్యవంతులను చేసేందుకు నిరంతరం కృషి చేస్తోంది. 

పారిశ్రామిక రూపంలో వాణిజ్య ప్రయోజనాలే ముఖ్యంగా వ్యవసాయం చేయడం ప్రపంచంలో దక్షిణావర్తంలో విస్తృతంగా వ్యాపించిపోయింది. ఈ లక్షణం మన భారత దేశంలో కూడా విస్తరించింది. ఈ విధానంలో ఉన్న పెద్ద దోషం ఏమిటంటే మహిళా రైతుల ప్రాధాన్యత పూర్తిగా క్షీణించిపోయింది. ఈ  పరిస్థితిని మరింత దిగజార్చే విధంగా ప్రకృతి సహజ  వ్యవసాయం పేరుతో జీరో బడ్జెట్ ప్రాతిపదికగా చేపట్టడం జరుగుతోంది. ఈ జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ విధానాన్నే సామాజిక నిర్వహణలో నేచురల్ ఫార్మింగ్ అని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని దాదాపుగా పది లక్షల మంది వరకు చిన్న కమతాల రైతులు అనుసరిస్తున్నారు. రుణ పరపతి సదుపాయాలు అంతగా అందుబాటులో ఉండని మహిళా రైతులు ఈ విధానానికి ఎక్కువగా మద్దతిస్తున్నారు. కారణం వారికి రుణాలు తేలికగా దొరకవు, భూవసతి అంతంత మాత్రమే, వాణిజ్యపరంగా లాభసాటి విత్తనాలు లభించడమూ కష్టమే. అందువల్ల ఈ మహిళా రైతులే ఈ కమ్యూనిటీ నిర్వహణలో సేద్య విధానం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

సామాజిక సమష్టి వ్యవస్థల ద్వారా మాత్రమే కాకుండా స్వయంసహాయక బృందాల తోడ్పాటుతో పర్యావరణ సేద్య విధానాలను ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి ప్రచారం చేసే బాధ్యత భుజాలకు ఎత్తుకున్నారు. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యలకు పోషకాలతో సమృద్ధమైన ఆహారం సిద్ధం చేసుకోగలుగుతున్నారు. అదనంగా ఆదాయం సంపాదిస్తున్నారు. భూసారాన్ని కాపాడుకుంటున్నారు. తమకు తాముగా ఏర్పాటుచేసుకున్న వ్యవస్థ సహకారంతో ఆత్మగౌరవంతోగౌరవప్రదమైన జీవితాలు సాగిస్తున్నారు. వారు అనుసరించే విధానాలలో సాధారణంగా మహిళలకు ఉండే విచక్షణా బుద్ధికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కెట్ ప్రభావిత సంప్రదాయక లెక్కలను పక్కన పెడుతున్నారు. అయితే ఈ చొరవ కొన్ని రాజకీ. ఉద్రిక్తతలకు, వివాదాలకు కారణం అవుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలు పర్యావరణ అనుకూల వ్యవసాయ విధానాలను గ్రామగ్రామాలకు విస్తృతంగా ప్రచారం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అట్టడుగు స్థాయిలో అటే గ్రామ స్థాయిలో ఇటువంటి పటిష్టమైన పునాదులు లేని పక్షంలో ఈ విధానాలకు ఇంత వ్యాప్తి సాధ్యమయ్యేది కాదు. సుమారుగా ఇప్పటికే 6,00,000 మంది రైతులకు ఈ విధానాలపై అవగాహన కల్పించగలిగారు. ఆశించిన విధంగా దశాబ్దం చివరిలోగా 60 లక్షల మంది రైతులకు విస్తరింపజేయాలన్న లక్ష్యం నిర్ణయించుకోవడం సాధ్యమయ్యేది కాదు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కానీ, శిక్షణ నిచ్చే శిక్షకులు కానీ అందరూ మహిళా రైతులే కావడం ఒక ప్రత్యేకత.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో సొంత భూమి లేని మహిళా రైతుల సంఖ్య చాలా ఎక్కువే. కొంత మందికి భర్త లేరు. ఒంటరి వారు. కొంత మంది ఈ సమస్యకు పరిష్కారం చూసుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. (ఈ సమస్య దేశవ్యాప్తంగా కనిపిస్తుంది.) అత్యధికులు కులవివక్షకు గురైనవారే. ఈ పరిస్థితిలోనే కొంతమంది సంఘటితమయ్యారు. ఉమ్మడిగా బీడు భూములను కౌలుకు తీసుకున్నారు. వారంతా కలిసికట్టుగా తమ నైపుణ్యాలను, పరిజ్ఞానాన్ని, శ్రమశక్తిని వినియోగించి వాటిని సాగు చేస్తున్నారు. క్రిమిసంహారకాలు లేని సేద్య విధానాలు పాటిస్తూ తమ కుటుంబాలకు అవసరమైన ఆహారం సమకూర్చుకుంటున్నారు. మిగులు ఏమైనా ఉంటే వాటిని స్వయంగా ఏర్పాటుచేసుకున్న వ్యవసాయ ఉత్పత్తుల స్టోర్ లోనే ఇతరులకు విక్రయిస్తున్నారు. సైకిళ్లపై ప్రయాణిస్తూ అవసరమైన వారికి ఇండ్ల వద్దకే చేరవేస్తున్నారు. అతి చిన్న వ్యాపారంగా ప్రారంభించిన ఈ ఉత్పత్తి – విక్రయ వ్యాపారం మరింతగా వృద్ధిపొందాలని ఆశిస్తున్నారు. ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ భూమిలో శ్రమశక్తిని అందించేందుకు వారిలో వారు వంతుల వారీగా ఒక క్రమపద్ధతి పాటిస్తున్నారు. అదే విధంగా వంతుల వారీగానే వ్యాపార కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ విధంగా అటు ఉత్పత్తిలోనూ, ఇటు వ్యాపారంలోను మెళుకవలు నేర్చుకుంటున్నారు. ఇక్కడే మహిళలు తమ విచక్షణ ఉపయోగిస్తున్నారు. అంతేకాని మార్కెట్ పోకడలను పాటించడం లేదు. పంటల కాలంలో వేతనాన్ని పాక్షికంగా చెల్లిస్తారు. ఆ రకంగా పంట చేతికి వచ్చే ముందు గృహ అవసరాలకు ఈ పాక్షిక వేతనాలను ఉపయోగించుకుంటారు. మొత్తం మీద వీరు అనుసరిస్తున్న పర్యావరణ అనుకూల సేద్య విధానం ఆదాయ మార్గాలను మరింతగా పెంచింది. మంచి లాభాలు వస్తున్నాయి. అదే సమయంలో ఆహారం విషయంలో సాధికారికత సాధిస్తున్నారు. స్వయం సమృద్ధి సంపాదించుకున్నారు. గౌరవప్రదమైన జీవితాలు గడుపుతున్నారు.

కర్నాటకలోని గొట్టిగహళ్లి గ్రామానికి చెందిన దంపతులు – సుజాత, జగదీశ్. వారికి ఉన్న నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిలో పదేండ్లుగా సేంద్రీయ సేద్యమే చేస్తున్నారు. రసాయనాల వాడకం నుంచి సేంద్రియ సేద్యానికి మళ్లడం ప్రారంభంలో చాలా పెద్ద సవాలు అనిపించిదని సుజాత వివరించారు. అయితే రసాయ రువులు, క్రిమిసంహారకాల వాడకంలో ఎదురవుతున్న సమస్యలను గమనించిన తరువాత కష్టసాధ్యమే అయినా సేంద్రీయ సేద్యమే మేలనే నిర్ణయం  వారిలో మరింత బలపడింది. నేచురల్ ఫార్మంగ్ విధానంలో చెప్పినట్లుగా అయిదు వరుస (లేయర్) విధానం పాటిస్తున్నారు. పర్యవసానంగా వారి నాలుగు ఎకరాల భూమి మామూలు వ్యవసాయ క్షేత్రంలా కనిపించదు. పర్యావరణకు అనుకూలమైన ఓ మోస్తరు చిట్టడవిలా కనిపిస్తుంది. “అక్కడ 200 అంతకన్నా ఎక్కువ వెరైటీలే ఉన్నాయి” అంటున్నారు జగదీశ్. వారి పొలంలో అరటి, కొబ్బరి, జామ, జాక్ ఫ్రూట్, తీపి బంగాళా దుంప, పప్పు ధాన్యాలు, నిమ్మ సాగవుతున్నాయి. అవి కాక కాఫీ తోట పెంచే ప్రయత్నాన్ని వాలు ప్రదేశంలో చేపట్టారు. కోళ్లు, గొర్రెలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ, మేత మేస్తూ కనిపిస్తాయి. సిల్వర్ ఓక్ చెట్లు, మోరింగా (ములగ) చెట్లు గట్ల వెంబడి సహజసిద్ధమైన ఫెన్స్ గా పెరిగిపోయి ఉంటాయి. ఈ చెట్ల ఆకులు, ఇతర వ్యర్థాలను పొలంలో ఎరువుగా కుళ్లిన చెత్త ఉపయోగపడుతోంది. భూసారం పెంరగేందుకు తోడ్పడుతున్నాయి.

నిసర్గ నిసర్గక సవయవ కృషికార్ సంఘ్ కర్నాటకలోని హోసూరు ప్రాంతంలో స్వయంసమృద్ధి సాధించిన సహకార బృందం. ఇందులోని సభ్యలందరూ నేచురల్ ఫార్మింగ్ విధానాలనే అనుసరిస్తున్నారు. సమిష్టిగా చేపట్టిన ఈ సంఘ్ కార్యకలాపాలలో సామాజిక, కుల, జాతి విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. జీరో బడ్జెట్ ప్రాతిపదికన సాగే నేచురల్ ఫార్మింగ్ విజయవంతంగా ముందుకు సాగిపోతోంది. అదే సమయంలో ఇది సాధిస్తున్న విజయ పరంపర కొన్ని రాడకీయపరమైన సవాళ్లకు, ఇతరత్రా వివాదాలకు కారణంగా మారుతోంది. ఈ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విధానంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే భూసారాన్ని, మట్టిలో అతి సూక్ష్మ జీవజాలాన్ని వృద్ధి పెంపొందించేందుకు ఆవు మూత్రాన్ని, ఆవు  పేడ ఆధారంగా తయారుచేసే ఎరువులు ఉపయోగిస్తారు. ఇక్కడ అన్నిటికన్నా పెద్ద సవాలు అదే. కొన్ని అతివాద హిందు పార్టీలు ఆవును అతి పవిత్రంగా చూస్తారు. గోవధను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అలాంటి వాళ్లు దీన్ని రాజకీయ వివాదంగా మార్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వైఖరి కారణంగా ముస్లింలు, ఇతర కొన్ని అల్పసంఖ్యాక వర్గాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వారిని నేరస్తులుగా పరిగణించే ప్రమాదం పెరిగింది. ఈ వర్గాల ప్రజలు తమ జీవనోపాధిగానూ, ఆహార భద్రత కోసం పశువులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మన దేశంలో ఇలాంటి వారి సంఖ్య చాలా ఎక్కువే. ఈ ప్రమాదం కారణంగా ఇప్పటివరకు ఈ విధానం అనుసరించకుండా ఉన్న వారు దీనిని చేపట్టడానికి వెనుకాడవలసి వస్తోంది. ఇక మరో వివాదాంశం ఏమిటంటే – జన్యుపరంగా మెరుగుపరచిన విత్తనాల వినియోగం ఈ విధానంలో కీలకం. అది మరి కొన్ని వివాదాలకు కారణమవుతోంది. ఇటువంటి జన్యుపరంగా శుద్ధి చేసిన విత్తనాలు, సంకర జాతి విత్తనాల వాడకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఇతర వర్గాలు ఈ తరహా విత్తనాల వినియోగానికి సిద్ధంగా ముందుకు వస్తున్నాయి. ఈ సమస్యల కారణంగా ఈ కార్యక్రమం ఎంతగా రైతుల లేదా కొన్ని వర్గాల ఆదరణ సంపాదించుకున్నప్పటికీ, ఈ జీరో ఆధారిత నేచురల్ ఫార్మింగ్ విధానం ప్రస్తుత వ్యవస్థలో అందరి ఆమోదం పొందుతుందా అనేది సందేహాస్పదంగా తయారైంది. ప్రస్తుత సేద్య విధానంలో పారిశ్రామికంగా తయారుచేసిన ఆధునిక సాంకేతికతతో తయారుచేసిన ఇన్ పుట్లపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటోంది. అందుకు ఉదాహరణ దేశంలో విస్తరిస్తున్న బీటీ పత్తి సాగు ప్రాంతాలు.

ఇలాంటి వాతావరణంలో బయ్యమ్మ రెడ్డి వంటి రైతులు దేశీయ విత్తనాల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పర్యావరణ అనుకూల సేద్య విధానాలు అనుసరిస్తూ, తమకున్న పరిజ్ఞానం ఆధారం చేసుకుని సాధించిన ఫలితాలు ఇతరులకు వాటి విలువను తెలియజేస్తున్నాయి. బయ్యమ్మ కుమారులు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన సమయంలో ఆమో నేచురల్ సేద్య విధానం చేపట్టింది. తరతరాలుగా వస్తున్న సేద్య విజ్ఞానం, మెళుకువల సాయంతో తన ఇంటికి సమీపంలోనే ఉన్న కొద్ది పాటి జాగాలో ఈ విధానం అనుసరించి సేద్యం మొదలుపెట్టింది. రాష్ట్రంలోనే కరువు పీడిత ప్రాంతాలలో ఒకటైన బక్కనపల్లి గ్రామానికి చెందిన బయ్యమ్మ ఈ సాహసం చేసింది. నిజానికి చుట్టూ ఉన్న పొలాల్లో వాణిజ్య పంటలను సాగుచేయడం సాధ్యం కాదు. ఎందుకంటే వాణిజ్య పంటలకు అధికంగా నీటి సదుపాయం ఉండాలి. వివిధ రకాలైన ఆహారపు దినుసులు సమకూర్చుకునేందుకు, అదే సమయంలో పంట వైఫల్యం సమస్యను పరిష్కరించుకునేందుకు ఆమె, తన భర్తతో కలిసి సంప్రదాయక సాగు అంటే తొమ్మిది రకాల ధాన్యాలను, చిరు ధాన్యాలను సాగుచేసే పద్ధతి) ని వర్షాకాలం రాక ముందే చేపట్టేది. మంచి ఫలితాలు సాధించగలిగింది.

ఆషా సంస్థ (అలెయెన్స్ ఫర్ సస్టయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్) వ్యవస్థాపకురాలు కవితా కురుగంటి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న నక్కమ్ అనే సంస్థతో కలిసి ఆమె పనిచేస్తున్నారు. ఈ నక్కమ్ సంస్థలో 24 రాష్ట్రాల నుంచి 120 మంది సభ్యులున్నారు. వారిలో మహిళా రైతు సంఘాలు కూడా ఉన్నాయి. ఇంకా అనేక పౌర సంఘాలు, సమాజాలు, రీసెర్చర్లు, కార్యకర్తలు నక్కమ్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. నక్కమ్ సంస్థ మహిళా రైతుల హక్కులను కాపాడేందుకు, వాటికి గుర్తింపు సాధించేందుకు కృషిచేస్తుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కవిత మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో అత్యంత కష్టమైన పనుల్లో మహిళలను మాత్రమే ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేసారు. ముఖ్యంగా మొక్కల నాటడం, కలుపు తీయడం, పంట కోత పనుల్లో ఆడవాళ్లే ఎక్కువగా కష్టపడుతున్నారని ఆమె చెప్పారు. అయితే “వ్యవసాయం మార్కెట్ అనుకూల పంధాలో సాగుతుండడంతో, ఔషధ పూరిత్ క్రిమిసంహారకాలు (హెర్బిసైడ్స్) తో పాటు యంత్రాల వాడకం కూడా విస్తరిస్తోంది. దీంతో నిర్ణయాధికారం పురుషుల చేత్తుల్లోకి వెళ్లిపోతోంది.” అని ఆమె అభ్యంతరం తెలిపారు. పర్యావరణ అనుకూల సేద్య విధానం వల్ల మహిళలు తాము కోల్పోతున్న గౌరవప్రదమైన నిర్ణయాధికారాన్ని తిరిగి సమకూర్చుకోగలుగుతారని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ పేజీలలో ఉన్న ఫోటోలను అన్నిటినీ సౌమ్య శంకర్ బోస్ సమకూర్చారు. అమృత గుప్త వాటికి సంబంధించిన విలువైన సమాచారం అందించారు. ఈమె అగ్రో ఎకాలజీ ఫండ్ సంస్థలో పనిచేస్తున్నారువీరిని సంప్రదించేందుకు ఈమెయిల్ l: amrita.agroecologyfund@gmail.com

క్షేత్ర స్థాయి సందర్శనల తరువాతనే ఈ వ్యాసం రూపుదిద్దుకుంది. గత ఫిబ్రవరి 2020లో దక్షిణాదిన నిర్వహించిన ఒక వర్క్ షాపులో జరిగిన ఇష్టాగోష్టి సమయంలో వెలుగు చూసిన సారాంశం ఆధారంగా ఉపయోగపడింది. ఈ వర్క్ షాపులో 30 దేశాల నుంచి దాదాపు వంద మంది వరకు పర్యావరణ సేద్యం చేస్తున్న వారు, మద్దతుదారులు, రీసెర్చర్లు, విధాన నిర్ణేతలు పాల్గొన్నారు.

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి 22 , సంచిక 4 , డిసెంబర్ 2020

 

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...