డ్రాగన్ పండ్లు: సేంద్రీయ పద్ధతుల్లో సాగు

పంజాబ్ రాష్ట్రానికి చెందిన హర్బంత్ సింగ్ సేంద్రీయ సేద్య విధానాలను అనుసరించి డ్రాగన్ పండ్లు, సాండల్ వుడ్ పెంపకాన్ని చేపట్టాడు. కారణం వీటిని పెంచడానికి ఇతర సంప్రదాయక పంటలతో పోలిస్తే చాలా తక్కువ మొత్తంలో నీటి వనరుల అవసరం ఉంటుంది.

పంజాబ్ లోని తులేవాల్ గ్రామానికి చెందిన హర్బంత్ సింగ్ 1970 దశకంలో కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయాన్ని జీవనోపాధిగా ప్రారంభించాడు. అప్పటికి 15 అడుగుల లోతులోనే భూగర్భ జలాలు పుష్కలంగా లభించేవి. కొన్ని సంవత్సరాల తరువాత పరిస్థితి మారిపోయింది. అది కూడా ఆతడి కుమారుడు సత్నాం వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టే సరికి భూగర్భ జలాల మట్టం 150 అడుగులకు అడుగంటిపోయింది. ఈ పరిస్థితి ఆతని కుటుంబంపై చాలా దారుణమైన ప్రభావాన్నే చూపించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కారణం ఇన్ పుట్ల ఖర్చు భారంగా మారడమే. వాటిలో భూగర్భం నుంచి ట్యూబ్ వెల్ ద్వారా నీటిని తోడేందుకు ఉపయోగించే మోటారు వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. దానికి తోడు రసాయనిక ఎరువుల ధరవరలు ఆకాశానికి చేరుకున్నాయి. పేరుకి అయిదు నదుల – బీయాస్, జీలం, చీనాబ్, రావి, సట్లెజ్ – సంగమ ప్రాంతంగా పేరు మోసిన పంజాబ్ లో హర్బంత్ – సత్నాం సింగ్ కుటుంబం కూడా వేలాది మంది ఇతర రైతులందరికీ ఎదురైన నీటి ఎద్దడి సమస్యకు గురయ్యారు.

రైతుల దుస్థితికి గణాంకాలు కూడా నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2019 నాటి కేంద్ర ప్రభుత్వ భూగర్భ జల వనరుల బోర్డు పంజాబ్ విభాగం సేకరించిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం వరి సాగు చేస్తున్న ప్రాంతాలలో ఇదే విధంగా  భూగర్భంలోని నీటిని తోడివేస్తే మరో పాతికేళ్లలో ఆ ప్రాంతమంతా ఎడారి భూములుగా మారిపోతుంది. ఈ నివేదిక కన్నా ముందే హర్బంత్ సింగ్ ఈ విషయాన్ని గుర్తించాడు. తాను అనుసరిస్తున్న వ్యవసాయ విధానాల కారణంగా పర్యావరణానికి జరుగుతున్న నష్టాలను గమనించాడు. రానున్న రోజులు మరింత సమస్యాత్మకంగా మారనున్నాయని కూడా ఆయన సరిగానే అంచనా వేశారు. అయితే పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి అవసరమైన అవకాశాలు కానీ, వనరులు కానీ ఆయనకు అందుబాటులో లేకపోయాయి. ముఖ్యంగా 2016 తరువాతే ఆయనకు పర్యావరణ అనుకూల విధానాలు, సేద్యంలో మార్పులు తీసుకురావడానికి ఆయనకు సాధ్యమైంది.

అప్పట్లో తమ నివాసానికి చేరువగానే రైతుల శిక్షణకు గాను ఖేతీ విరాసత్ మిషన్ నిర్వహించిన వర్క్ షాప్ కు హర్బంత్ – సత్నాం సింగ్ లు హాజరయ్యారు.  ఇదొక చారిటబుల్ సంస్థ. సేంద్రీయ సేద్యం ప్రోత్సహించేందుకు ఇది కృషి చేస్తోంది. అందుకోసం రైతులతో సంప్రదింపులు జరిపారు. ఉత్తమ సేద్య పద్ధతులను గుర్తించారు. రసాయనిక ఎరువుల స్థానంలో పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను గుర్తించారు. రైతులకు తెలియజేశారు.

సంస్థ వ్యవస్థాపకుడు, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా అయిన ఉమేంద్ర దత్ తమ కృషి గురించి ఈ విధంగా వివరించారు. ‘ఏక పంట సాగు విధానం భూసారాన్ని తగ్గించేస్తుంది. అందువల్ల రైతులు తప్పనిసరిగా రసాయనిక ఎరువులపై ఆధారపడవలసి వస్తుంది. పర్యవసానంగా, సేద్య రంగంలో కీలకమైన నాట్ల సహజ క్రమం దెబ్బతింటుంది. అందువల్ల సాధ్యమైనన్ని సీజనల్ పంటల సాగును చేపట్టడం ఉత్తమ మార్గం. పంటలలో భాగంగా కూరగాయలను పండించడం కూడా ప్రయోజనకరమే. ఇలా అనేక పంచలను, లేదా కూరగాయలను పండించడం వల్ల క్రిముల దాడిని అరికట్టవచ్చును కూడా.’

ఉమేంద్ర మరి కొన్ని విషయాలు కూడా తెలియజేశారు. అవి – సాగు సమయంలో కనిపించే ప్రతి క్రిమి కీటకాలను నాశనం చేయనక్కరలేదు. ఎందుకంటే వాటిలో కొన్ని రైతుకు మేలు చేస్తాయి. కొన్ని క్రిములు భూసారం మెరుగుపడేందుకు తోడ్పడుతాయి. ముఖ్యంగా వేళ్ల మొదళ్లకు బలం చేకూరుస్తాయి. చివరిగా, రైతులు ప్రకృతి సహజ సిద్ధమైన పద్ధతుల్లో పంటల సాగు చేపడితే ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుంది. మరోలా చెప్పాలంటే, ప్రకృతి అడుగుజాడల్లోనే సేద్యం సాగాలి. ఎరువులు, క్రిమసంహారకాల వంటి బాహ్య ఇన్ పుట్ల వాడకాన్ని తగ్గించాలి.

‘రైతులు తమ పంట పొలాల్లో తప్పనిసరిగా ఆవులు, కోళ్లు వంటి వాటిని పోషించడం అలవరచుకోవాలి. వాటి వల్ల సేద్యానికి అనువుగా మట్టిని సిద్ధం చేయడం సులభమవుతుంది. వాటి వ్యర్థాలు పొలానికి మంచి పోషకాలుగా ఉపయోగపడతాయి. అదే విధంగా వ్యవసాయంలో పేరుకుపోయే వ్యర్థాలను పారవేసే ముందు, ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే పంట వ్యర్థాలు చెత్తా చెదారం వంటివి భూసారం పెంపొందించేందుకు తోడ్పడతాయి. అంతేకాకుండా ఆ చెత్తాచెదారం కారణంగా, పక్షుల రాక పెరుగుతుంది. అవి పంటను సేక వినాశకర క్రిములను తినివేస్తాయి. ఆ రకంగా పంట రక్షింపబడుతుంది. వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారాలను ప్రకృతి నుంచే లభిస్తాయి.’ అని ఉమేంద్ర వివరించారు.

హర్బంత్ సింగ్ ఈ సందర్భంలో తన అనుభవం ఇలా తెలియజేశారు.  ‘హానికరమైన క్రిమిసంహారకాలను, పరిమిత నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడంలోనూ మన ప్రాంతంలోని రైతులకు ఒక దురలవాటుగా మారిపోయింది. ఈ విషవలయం నుంచి బయటకు పడాలని రైతులు అందరూ ఆశిస్తున్నారు. అయితే ఏ ఒక్కరూ కూడా సాహసించలేకపోతున్నారు. ఇప్పుడు అనుసరిస్తున్న సేద్య విధానాల కారణంగా ఎదురవుతున్న కష్టనష్టాలను ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. అందువల్ల నాకంటూ ఒక అవకాశం దొరికితే చాలనుకునేవాడిని. అలాటి అవకాశం దొరికిన వెంటనే ఆలస్యం చేయకుండా సేంద్రీయ సేద్య విధానాలను అనుసరించడం ప్రారంభించాను.’

———————————————————————————————————————————————

బాక్సు 1: ఉత్తమ సాగు విధానం

  • ముందుగా 2 అడుగుల లోతులో గొయ్యి తీయాలి. దానిపై 7X12 అడుగుల సిమెంట్ స్థంభం నిర్మించాలి.
  • దాని చుట్టూ సిమెంటుతోనే ఒక రింగ్ వంటిది ఏర్పాటుచేయాలి.
  • వాటి మధ్య అడుగు దూరం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సూర్యరశ్మి సాఫీగా ప్రసరిస్తుంది.
  • తీగలాగ పెరిగే నాలుగు డ్రాగన్ పండ్ల మొక్కలను ఆ స్థంబం ఆధారంగా పెంచవచ్చు.
  • ఆ స్థంబాల మధ్య సారవంతమైన మట్టిని చేర్చండి. దానికి జీవామృత్ (ఆవు పేడ, మూత్రం మిశ్రమం) జతచేయండి. ఆ విధంగా డ్రాగన్ చెట్లకు మంచి పోషకాలు లభిస్తాయి.
  • వేళ్ల మొదళ్లకు నీరు అందించేందుకు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి అనుసరించండి. హర్బంత్ సింగ్ నీటితో పాటు సేంద్రీయ రసాయన ఎరువులను కూడా అందజేస్తాడు. అలా చేయడం వల్ల హానికరమైన క్రిములు నాశనమైపోతాయి.

——————————————————————————————————————————————

ఆచరించవలసిన విధానం

వర్క్ షాప్ కు హాజరైన తరువాత ఆ 60 ఏళ్ల హర్బంత్ సింగ్ పాత విధానాలను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నాడు. తనకున్న పూర్వ అనుభవాన్ని కూడా అందరి మేలు కోసం వదిలేసుకున్నాడు. డ్రాగన్ ఫ్రూట్స్ తో పాటు నిమ్మ, శాండల్ వుడ్ పెంపకం చేపట్టాడు.

అందుకు కారణాలను కూడా ఇలా వివరించాడు. ఒక రకంగా ఇలా విభిన్నమైన మొక్కల సాగును చేపట్టేందుకు ఆయన ముందుకొచ్చాడు. ఆ విషయాన్నే ఆయన కుమారుడు సత్నాం సింగ్ ఇలా వివరించాడు. ‘మాకున్నవి 8 ఎకరాలే. అందులో 1.55 ఎకరాల పొలాన్ని రసాయన రహిత సేద్యానికి కేటాయించాం. వరి, గోధుమ వంటి ఇతర రకాలతో పోలిస్తే డ్రాగన్ పండ్ల చెట్లు, శాండల్ వుడ్ చెట్లకు దాదాపు 90 శాతం తక్కువగా నీటిని అందిస్తే చాలు. వాటి నిర్వహణ కూడా చాలా తేలిక. తక్కువ ఖర్చుతో ఫలితం వస్తుంది. అయినా కూడా అత్యధిక రాబడికి తోడ్పడతాయి.’

హరీశ్ థక్కర్ కచ్ ప్రాంతంలో డ్రాగన్ పండ్ల సేద్యంలో చాలా అనుభవం ఉన్న వాడు. సత్నాం అభిప్రాయాలతో ఆయన పూర్తిగా ఏకీభవించాడు. ఆయన కూడా ఇలా తన భావాలు వ్యక్తంచేస్తున్నాడు. ‘డ్రాగన్ పండ్లు ఉష్ణమండల ప్రాంతాలలోనే పండుతాయి. వీటిలో క్యాలరీలు చాలా కొద్దిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని పెండించేందుకు ఎక్కువ నీటి అవసరం ఉండదు. నీటి వనరులు అంతగా లేని ప్రాంతాలలో కూడా పండించవచ్చు.’

నీటి అవసరం కానీ, పెద్ద మొత్తంలో ఇన్ పుట్లు కాని అవసరం లేకపోయినా, డ్రాగన్ చెట్లు దిగుబడి విషయంలో పూర్తి సంతృప్తినిస్తాయి. ఉదాహరణకు, సింగ్ కుటుంబం ఏడాదికి 40 క్వింటాళ్లు అంటే 4000 కిలోల పండ్ల దిగుబడి వస్తోంది. కిలో పండ్లకు రూ. 200 ల ఆదాయం వస్తోంది. ‘ మాకున్న పొలంలో 2500 చెట్లున్నాయి. వాటి నుంచి ఏటా రూ. 8,00,000 ఆదాయం ఒక ఎకరాపై లభిస్తోంది. ఇక సాండల్ వుడ్ చెట్లు 15 ఏళ్ల తరువాత దిగుబడి ఇస్తాయి. ప్రతి చెట్టు నుంచి రూ. 3,00,000 ఆదాయం వస్తుంది. మేము 200 సాండల్ వుడ్ చెట్లుపెంచుతున్నాం.’ అని చెప్పారాయన.

డ్రాగన్ పండ్ల పెంపకంలో వియత్నాం విధానం

గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతంలో నీటి ఎద్దడి గత దశాబ్దంగా నిత్యం ఎదురవుతున్న సమస్యే. అయినా కూడా  మధ్య కాలంలోనే డ్రాగన్ పండ్ల సేద్యం మొదలు పెట్టడం సేంద్రీయ సేద్యానికి మార్గం చూపిన విప్లవరూపం దాల్చింది. ఇప్పుడు వందల సంఖ్యలో రైతులు వీటిని సాగుచేస్తున్నారు. ఇది బయటి వైపు పచ్చటి రంగుతో ఉండి లోపల తెల్లటి గుజ్జు పదార్థం ఉంటుంది. విత్తనాలు నల్లగా ఉంటాయి.

ఒక సందర్భంలో సత్నాం సింగ్ విషాల్ దోడా సందర్శించవలసి వచ్చింది. ఆ సమయంలో కచ్ ప్రాంతంలోని ఆతని మిత్రుడు ఒకడు 15 ఎకరాల విస్తీర్ణంలో డ్రాగన్ పండ్ల చెట్లను పెంచుతున్నాడు. ఆయన అనుసరిస్తున్న వియత్నాం సేద్య విధానం సత్నాంను ఆకట్టుకుంది. ఆ విధానం గురించి పూర్తి వివరాలు సేకరించాడు. వెంటనే 500 డ్రాగన్ పండ్ల మొక్కలను స్థానిక నర్సరీ నుంచి సేకరించి తీసుకువచ్చాడు.

ఇంటికి చేరిన తరువాత, సత్నాం తన తండ్రికి వివరించి, ఎకరాకు రూ. 4 లక్షల చొప్పున పెట్టుబడి సిద్ధం చేశాడు. ఆ పెట్టుబడి సహాయంతో సిమెంట్ పోల్స్ ఏర్పాటుకు, నీటి పారుదల సదుపాయాలను సమకూర్చుకుని అవసరమైన పనివాళ్లను నియమించుకున్నారు. విత్తనాలు సేకరించారు. హర్బంత్ తన పొలంలోని 1.25 ఎకరాల జాగాలో 500 పోల్స్ ఏర్పాటు చేసుకున్నారు. ‘మొదటి ఏడాది కాలంలో ఒక్కో పోల్ కు 4 – 5 కిలోల పండ్ల దిగుబడి వచ్చింది. మెల్లిగా ఆ దిగుబడి అయిదో సంవత్సరం నాటికి 20 కిలోలకు చేరింది. పెట్టిన ఖర్చును రెండేళ్ల వ్యవధిలోనే ఆయన తిరిగి సంపాదించేసుకోగలిగారు.’

సాండల్ వుడ్ – నిమ్మ తోటలు

సహజంగా పరాన్నభుక్కు అయిన సాండల్ వుడ్ వేళ్లు తమకు అవసరమైన పోషకాలను తనకు నీడనిచ్చిన ఇతర చెట్ల నుంచే లాక్కుంటాయి. అదే సమయంలో ఆ చెట్లకు కావలసిన పోషకాలను కూడా అందిస్తాయని కరెంట్ సైన్స్ జర్నల్ ప్రకటించింది.

అందువల్ల హర్బంత్ సింగ్ బెంగుళూరు నుంచి సంతలుం అల్బమ్ వెరైటీ సాండల్ వుడ్ మొక్కలు సంపాదించారు. దాదాపు 200 మొక్కలను అర ఎకరా స్థలంలో వాటిని నాటి పెంచడం ప్రారంభించాడు. ఒక్కో చెట్టుకూ మధ్య 12 అడుగుల ఎడం ఉండేలా చూసుకున్నాడు. ఆ జాగాలోనే నిమ్మ చెట్లను నాటాడు.

‘సాండల్ వుడ్ కు వాణిజ్యపరంగా చాలా విలువ ఉండడమే కాకుండా మరెన్నో విధాలుగా ప్రయోజనాలు అందిస్తుంది. వాటి పెరుగుదలకు మొదటి అయిదేళ్ల కాలంలో చాలా కొద్ది మాత్రం నీరు చాలును. పూర్తి స్థాయి పెరగేందుకు 15 సంవత్సరాలు పడుతుంది. నాలుగేళ్ల తరువాత నుంచి వాటి విత్తనాలు కూడా అందుబాటులోకి వస్తాయి. కిలో విత్తనాల నుంచి రూ. 1000 ల వరకు ఆదాయం లభిస్తుంది. పంజాబ్ లో సాండల్ వుడ్ పెంపకంపై ఎలాంటి ఆంక్షలు లేక నిషేధం లేదు. కేవలం ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంతే’ అంటూ వివరించారు సత్నాం సింగ్.

ఇది https://www.thebetterindia.com/237963/punjab-farmerearns-lakhs-how-to-
organic-farming-dragon-fruitsandalwood-india-gop94/ ప్రచురణకు సంక్షిప్తరూపం.

గోపీ కరెలియా

ఆంగ్ల మూలం: 
లీసా ఇండియా సంపుటి 23, సంచిక 3 , జూన్ ౨౦౨౧

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...