జీవామృతం అసలు సిసలు ద్రవరూపక బంగారమే

వనరులు కొద్దిగానే ఉన్నా, కొద్దిపాటి శిక్షణ, మరి కొంత తొలిదశ సహాయసహకారాలు ఉంటే చాలు పర్యవారణ అనుకూల సేద్య విధానాలు అనుసరించడం సుసాధ్యమే అని పాడేరు మహిళా రైతులు నిరూపించారు. జీవసంబంధమైన ముడి పదార్థాలు ఉపయోగించడం అనేది పంట నేలలను పచ్చటి మొక్కలతో కళకళలాడేలా చేసేందుకు అనువైన ఒక చిన్న సాధనం మాత్రమే అన్న వాస్తవాన్ని వారు ఆచరణలో సాధించి చూపించారు. చిన్న చిన్న అడుగుల రూపంలో ముందుకు సాగే ఈ కృషి విస్తరించి, మరింత వ్యాపించి అద్భతమైన ఫలితాలు సాధించడంలో వ్యవసాయ ఉత్పత్తిదారుల సమిష్టి (ఎఫ్ పి ఓ) సంఘాల పాత్ర అమూల్యమని వారి కృషి నిరూపిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయం గత కొన్ని ఏండ్లుగా క్రమంగా విస్తరిస్తోంది. ప్రారంభంలో కేవలం పండ్లు, కూరగాయలను విషపూరిత రసాయనాలు, క్రిమిసంహారకాల ప్రభావం లేని తాజా సరుకు వినియోగదారులకు చేరవేయాలనే ఆలోచనతో మొదలైన ఈ సేంద్రీయ వ్యవసాయ విధానం ఇప్పుడు అన్ని రకాల ఆహార పదార్థాల ఉత్పత్తిలోను అమలు చేస్తున్నారు. పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, కాఫీ, టీ వంటివాటి సాగు కూడా సేంద్రీయ విధానాల ప్రకారమే సాగుతోంది. దీనికి చాలా ముఖ్యమైన కారణం – వినియోగదారుల్లో పెరుగుతున్న చైతన్యం లేదా అవగాహన అని చెప్పాలి. అది కూడా పట్టణ ప్రాంత ప్రజలలో సేంద్రీయ ఆహారంపై విపరీతమైన మోజు కనిపిస్తోంది. ఆరోగ్యపరంగా కానీ, పర్యావరణపరంగా కానీ సేంద్రీయ పద్ధతుల్లో పండించిన పంట ఆహార ఉత్పత్తులు శ్రేయస్కరమనే భావన ప్రజలలో బాగా నాటుకుపోయింది. ప్రస్తుత కాలంలో సేంద్రీయ ఉత్పత్తులకు విపరీతమైన గిరాకీ ఉంటోంది. 2020-25 మధ్య కాలంలో వీటి వాడకం లేదా గిరాకీ దాదాపు 16.4 శాతం మేరకు పెరిగిపోతుందని అంచనాలు వినిపిస్తున్నాయి.

సేంద్రీయ వ్యవసాయంలో అన్నిటికన్నా ఎక్కువ ఆసక్తి కలిగిస్తున్న అంశం – అధిక దిగుబడి లేదా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు రసాయనాలు, విషపూరిత క్రిమిసంహారకాలు వినియోగించకుండా, వాటి స్థానంలో ప్రకృతి సహజంగా లభించే ఎరువులు, క్రిమిసంహారకాలను ఉపయోగించడమే. ఈ రకంగా సాగు చేసినట్లయితే పర్యావరణ కాలుష్యం ముప్పు తప్పిపోతుంది. అదే సమయంలో మరెన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు లభిస్తాయి. అందువల్ల జీవ సంబంధిత ఎరువులు (బయో ఫెర్టిలైజర్స్), ఇతర సూక్ష్మజీవుల (మైక్రో-బయోలాజికల్) ఆధారిత సేద్యం చేపట్టి సేద్య రంగాన్ని మరింత సుస్థిరమైనదిగా మార్చివేస్తున్నారు. అయితే ఈ రకంగా సేంద్రీయ పద్ధతులలో పండించిన కూరగాయలు లేదా పండ్లు ఇతరత్రా రసాయనాలు, విషపూరిత క్రిమిసంహారకాలతో పండించిన వాటికంటే ఎక్కువ ధరల్లో లభ్యమవుతాయి. అయినా కూడా సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం. ఉపయోగించడం సమాజంలో ఉన్నత స్థానానికి నిదర్శనంగా చాలా మంది భావిస్తున్నారు. ఈ ధోరణి ఎక్కువగా పట్టణ ప్రాంతాలలో కనిపిస్తుంది. మరో పక్కన వ్యవసాయదారులు విపరీతమైన ధరాభారం మోస్తూనే అధిక ధరలకు వ్యవసాయ ముడి సరుకులను, ఎరువులను, క్రిమిసంహారకాలను, ఇతర ప్రధానమైన వనరులను సమకూర్చుకోవలసి వస్తోంది. అప్పుడే వారికి తగినంత దిగుబడి చేతికి అందుతోంది. సేంద్రీయ సేద్య విధానంలో కూడా చీడపీడలను అదుపు చేసేందుకు, ఆరోగ్యదాయకమైన దిగుబడి పండించేందుకు రైతులు కొన్ని రకాలైన ముడి పదార్థాలు వినియోగించక తప్పడం లేదు. అలాంటి వాస్తవ పరిస్థితులలో మారు మూల ప్రాంతాలలో గిరిజన గ్రామాలలో నివసించే సాధారణ ప్రజానీకం తమకు అవసరమైన నిత్య ఆహార పదార్థాలను సేంద్రీయ విధానంలో ఎలా సమకూర్చుకోగలుగుతారు?

కోవిడ్ 19 కరోనా బెడద ఉప్పెనలా ముంచెత్తిన వేళ, పాడేరు గిరిజన మహిళలు స్వయంసమృద్ధి సాధించి, కేవలం తమ కుటుంబాలకు అండగా నిలవడమే కాకుండా, గ్రామంలోని ఇరుగుపొరుగు వారికి కూడా కాయగూరలను అందించి ఆదుకున్నారు. అందుకు వారు అనుసరించిన ఏకైక మార్గం – తమ ఇండ్ల వెనక ఉండే కొద్దిపాటి జాగాలో కూరగాయల సాగు చేపట్టడమే. 

విశాఖ పట్టణానికి సుమారు 100 కిమీ దూరంలో ఉన్న పాడేరు సమీపంలోని కొండ చరియలను ఆనుకుని ఉన్న మినిములూరు గ్రామానికి చెందిన మహిళలు వారంతా. ప్రశాంతతకు, అందమైన పరిసరాలకు ఆలవాలమైన ఆ గ్రామం పరజా గిరిగిన జాతికి చెందినవారు. రాష్ట్రంలో నివసిస్తున్న 33 గిరిజన జాతుల్లో ఇది ఒకటి. అనునిత్యం అక్కడ నివసించే స్త్రీ పురుషులు తమకున్న కొద్ది పాటి పంట పొలాల్లో కాయకష్టం చేసుకుంటూ కనిపిస్తారు. చాలా మందికి ఎకరా లేదా ఎకరాన్నర పంట చేనులున్నాయి. ఆ కాస్త పొలాల్లో వారంతా ఎక్కువగా వరి, పసుపు, కాఫీ తోటలు పెంచుతుంటారు. రోజువారీ ఆహారం కోసం మాత్రమే కాకుండా వారి జీవనోపాధి కూడా సాధారణంగా అక్కడ ప్రకృతి అందించే ఆహారంపైనా ఆధారపడి సాగుతుంటుంది. అయితే చాలా కాలం జరిపిన అధ్యయనాల ప్రకారం అక్కడి ప్రజలలో, ముఖ్యంగా స్త్రీలలో పోషకాల లోపం సమస్య చాలా అధికం. 

మార్గం చూపిన టెక్నో సెర్వ్

లాభాపేక్ష లేకుండా పేదరికం నిర్మూలన కోసం కృషి చేస్తున్న టెక్నో సెర్వ్ సంస్థ అక్కడి వారికి అండగా నిలిచి మార్గం చూపిన తరువాత వారి జీవితాలలో ఎన్నో మార్పులు వచ్చాయి. వాల్ మార్ట్ ఫౌండ్షన్ అందించిన ఆర్థిక సహాయంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిన్న కమతాల వ్యవసాయ కుటుంబాలకు సుస్థిర జీవనోపాధి పేరుతో చేపట్టిన కార్యక్రమం పాడేరు సమీపంలోని రైతులకు సరైన మార్గం చూపించింది. గిరిజన మహిళల పోషకాహార లోప సమస్య పరిష్కారం వారు చేపట్టిన మొదటి ఆశయం. అదే సమయంలో పరిసర ప్రాంతాలలోని భూముల భూసారం పెంపొందించడం మరో లక్ష్యం. పద్మశ్రీ గ్రహీత, ప్రకృతిసహజ సేద్య విధానాల ఉద్యమకారుడు సుభాశ్ పాలేకర్ ప్రతిపాదించిన జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ తరహా సేద్య విధానం ప్రోత్సహించేందుకు టెక్నో సెర్వ్ సంస్థ నడుం కట్టింది. ముందుగా, ఈ కార్యక్రమంలో భాగంగా, వంటింటి అవసరాలను తీర్చివేసే మొక్కల పెంపకంపై (కిచెన్ గార్డెన్) ఈ సంస్థ గిరిజన మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. శిక్షణ తరువాత వారు ఇంటి పెరడులోనే కుటుంబ అవసరాలకు సరిపడే ఆహారం పండించుకునేందుకు వీలవుతుందని, ఆ విధంగా వారిలో పోషకాహార లోపం సమస్య పరిష్కారమవుతుందని వారు ఆశించారు. ఈ విధానం చిన్న కమతాలున్న రైతులకు ఉపయోగకరమే కాకుండా ఆర్థిక కార్యక్రమాలలో మహిళలకు మరింత అధిక ప్రాధాన్యం చేకూర్చవచ్చని వారు ఆశించారు. మహిళలు కూడా తమ శ్రమశక్తి ఆధారంగా కుటుంబ ఆదాయానికి మరింత ఆదాయం అందించగలుగుతారని భావించారు.

టెక్నో సెర్వ్ బృందం 2019 సెప్టెంబర్ లో రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. అదే సమయంలో రైతులకు అవసరమైన విత్తనాలు, కొద్ది పాటి చేతి సాయం అందించింది. ఈ విధంగా పాడేరు, చింతపల్లి పరిసరాలలోని 41 గ్రామాలకు చెందిన 1000 మంది గిరిజన మహిళలు లబ్ధి పొందారు. వారికి అందించిన విత్తనాలలో కూరగాయలకు సంబంధించిన 8 రకాలున్నాయి. అవి – వంకాయ, టమేటా, పచ్చి మిర్చి, ఫ్రెంచి బీన్స్, కౌపీ (అలసంద), ముల్లంగి, ఉసిరి, పాలకూర. 

ద్రవరూప ఎరువు – జీవామృతం

చిన్న కమతాల రైతులు, వారి కుటుంబాల ఆర్థిక స్థితి గమనిస్తే ఖరీదైన ఎరువులు, క్రిమిసంహారకాలు అమర్చుకోవడం వారికి చాలా కష్టమైన వ్యవహారం. అందుకని, ఈ బృందం వారికి సేంద్రీయ ద్రవ రూపక ఎరువు అయిన జీవామృతం తయారీలో కూడా శిక్షణ ఇచ్చింది. ఇది పంటలకు కావలసిన చేవను, పోషకాలను అందించడమే కాకుండా భూసారాన్ని పెంపొదించగలదు. 

200 లీటర్ల జీవామృతం తయారీకి అవసరమైన దినుసులు

స్థానికంగా లభించే ఆవు పేడ 10 కిలోలు
గోమూత్రం 10 లీటర్లు
బెల్లం  2 కిలోలు
శెనగ పిండి (బేసన్) 2 కిలోలు
పొలం గట్లపై మట్టి  2 కిలోలు
నీరు  190 లీటర్లు

 

కార్యక్రమం ప్రారంభంలోనే మహిళలను ఆరేసి మందితో ఒక్కో బృందంగా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ (సీఆర్పీ) వారితోకి తోడుగా ఉన్న టెక్నో సెర్వ్ సిబ్బంది ఏర్పాటుచేశారు. మొత్తం శిక్షణ సమయంలో వారికి చేయూతనిచ్చారు. శిక్షణ పూర్తయిన తరువాత, ఆ మహిళలు తమకు అవసరమైన ఎరువుల కోసం మార్కెట్ వనరుపై ఆధారపడే పరిస్థితి రాకూడదు అన్నదే వారి ఉద్దేశం. ఆవు పేడ, గోమూత్రం, నల్ల బెల్లం, సెనగ పిండి, పొలం మట్టి, నీరు మిశ్రమంతో వారు తయారు చేసిన జీవసంబంధ ఎరువే జీవామృతం. ఇది వారికి అందుబాటులోనే లభిస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు సమకూర్చుకోవచ్చు. తక్కువ ఖర్చు. 

శిక్షణలో ఉపయోగించేందుకు బెల్లం, శెనగ పిండిని టెక్నె సెర్వ్ బృందమే సమకూర్చింది. ప్రతీ మహిళకు 200 గ్రాముల బెల్లం, శెనగ పిండిని అందించారు. వీటితో 20 లీటర్ల వరకు జీవామృతం తయారు చేసుకోవచ్చు. వీటికి ఒక్కో వ్యక్తికి రూ. 11 లు ఖర్చయింది. 

మిగిలిన పదార్థాలు స్థానికంగానే లభించాయి. వాటిని మహిళలే సమకూర్చుకోగలిగారు. టెక్నె బృందం ఆరేసి కుటుంబాలతో ఒక బృందంగా రైతులను ఏర్పాటు చేయగా, మహిళలు మళ్లీ తమలో తాము రెండేసి కుటుంబాలు ఒక చిన్న గ్రూపుగా ఏర్పడ్డారు. అలా చిన్న బృందాలుగా ఏర్పడిన మహిళలు ఆవు పేడ, గోమూత్రం, పొలం మట్టి సేకరించే బాధ్యతలు పూర్తిచేశారు. అలా కలిసికట్టుగా సేకరించిన వాటిని సేకరించుకోలేకపోయిన ఇతరులతో కలిసి ఉపయోగించుకునేదుకు ముందుకు వచ్చారు. 

అవసరమైన పదార్థాలు సిద్ధమైన తరువాత, అసలు సిసలు శిక్షణ మొదలైంది. సిమెంటు ట్యాంకులలో కానీ, పెద్ద పెద్ద మట్టి కుండలలో కానీ జీవామృతం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే మారుమూల గ్రామాలకు చెందిన ఈ గిరిజన మహిళలు ఇందుకు ప్లాస్టిక్ బ్యారెల్స్ (పెద్ద పీపాలు) ఉపయోగించేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే వారి దృష్టిలో ఇలా పీపాల వినియోగం తేలిక అని వారు భావించారు. నిపుణులు, సీఆర్పీల పర్యవేక్షణలో శిక్షణ కార్యక్రమం సవ్యంగా సాగిపోయింది.

జీవసంబంధిత 20 లీటర్ల జీవామృతం తయారీకీ అవసరమైన నీటిని ముందుగా పీపాలలో నింపారు. తరువాత ఆవు పేడ, గోమూత్రం కలిపారు. వాటిని బాగా కలియతిప్పారు. ఆ తరువాత మిగిలిన వాటిని అంటే బెల్లం, శెనగ పిండి, పొలం మట్టిని ఆ మిశ్రమంలోకి చేర్చారు. పెద్ద చేతి కర్ర సాయంతో ఆ మిశ్రమాన్ని మరింతగా బాగా కలియతిప్పారు. ఆ తరువాత ఆ పీపాకు గోనె పట్టాతో గట్టిగా మూతలా బిగించారు. అనంతరం లోపలి మిశ్రమం బాగా పులిసేందుకు వీలుగా నీడ ఉన్న చల్లటి ప్రదేశంలో భద్రపరిచారు. 

అలా తయారైన జీవామృతాన్ని నేరుగా పొలంలో మొక్కలకు ఉపయోగించుకోవచ్చు. లేదా లీటరు జీవామృతాన్ని 10 లీటర్ల నీటితో కలిపి పొలంలో పిచికారి చేయవచ్చు. ఇలా పిచికారీ చేసే విధానాన్ని ఫోలియర్ అప్లికేషన్ అంటారు.

సాధించిన సత్ఫలితాలు

ఇలా శిక్షణలో భాగంగా తయారుచేసిన జీవామృతాన్ని శిక్షణలో పాల్గొన్న మహిళలందరికీ పంచిపెట్టారు. దీనిని చేపట్టిన తరువాత ఇప్పటికీ ఇంకా ఒక్క పంటకాలమే గడిచిపోయినందున పూర్తి ఫలితాలు తెలియడం లేదు. కానీ అందిన సూచనలన్నీ సానుకూలంగానే కనిపించాయి. శిక్షణ పూర్తిచేసుకున్న మహిళల్లో ఒకరైన మంగమ్మ తన అభిప్రాయాన్ని ఈ విధంగా వివరించింది. ఇంటి వెనక ఉన్న పెరడులో కూరగాయల పెంపకాన్ని ఎప్పుడో చేపట్టాను. కానీ అప్పుడెప్పుడూ మొక్కలు ఇంత ఆరోగ్యవంతంగా, తాజాగా కనిపించలేదు. ఈ మంచి లక్షణాలు జీవామృతం వినియోగం తరువాతనే స్పష్టంగా కనిపించాయి. సీఆర్పీ లక్ష్మి సూచనల మేరకే జీవామృతం సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు చీడపీడల సమస్య పూర్తిగా పరిష్కారమైపోయింది. ఇదివరలో నిత్యం వీటి బెడద ఎక్కువగా ఉండేది.

ఇక టెక్నో సెర్వ్ సిబ్బందిలో ఒకరైన విశాల్ ఈ మొత్తం కార్యక్రమం పర్యవేక్షణ విధులు నిర్వహించేవారు. మహిళలు జీవసంబంధ ఎరువుల వాడకం విషయంలో మహిళలు చాలా ఆసక్తి చూపించారని ఆయన చెప్పారు. వీటి ప్రయోజనాలను, సేంద్రీయ సాగు విధానాలను వారు బాగా అర్థం చేసుకుంటున్నారన్నారు. గతంలో చాలా మంది వ్యవసాయదారుల నుంచి ఎరువులను, క్రిమిసంహారకాలను సమకూర్చుకోవడంలో తమకు ఎదురైన ఇక్కట్లను ఫిర్యాదు రూపంలో వివరించేవారు. అలాంటి సందర్భంలో మేము జీవామృతం తయారీపై శిక్షణ ఇస్తామని వివరించాము.మొదట్లో వారికి నమ్మకం లేకపోయింది. శిక్షణకు హాజరు కావడం మొదలయ్యాక, దానిని ఉపయోగించడం కూడా ప్రారంభించిన తరువాత వారిలో గట్టి నమ్మకం ఏర్పడింది. జీవామృతం లాంటి సేంద్రీయ ద్రవ పదార్థం తమ పంటలకు ఏ స్థాయిలో రక్షణ ఇవ్వగలవో అర్థం చేసుకోగలిగారు. తయారీ సులభం. తక్కువ ఖర్చు. ఎంతో ప్రభావవంతం అని గుర్తించారు. అని తెలిపారు.

కోవిడ్ 19 అనంతర ప్రభావాలు

ఇటీవలి కోవిడ్ 19 దుష్పరిణామాలు సరికొత్త అవకాశాలు అందించాయి. కోవిడ్ ప్రభావం, దరిమిలా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధింపు వల్ల చాలా పరిణామాలకు దారితీసాయి. వాటి ప్రభావం ఇప్పటికిప్పుడు మనకు కనిపించకపోవచ్చు. కానీ త్వరలో మనం కూడా వాటిని గమనించగలుగుతాం. పాడేరు ప్రాంత గిరిజన రైతులు లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోవడమే కాదు, వ్యవసాయ సంబంధిత టోకు మార్కెట్లు మూతపడ్డాయి. అంతేకాదు, రోజువారీ అవసరాలైన కూరగాయలు కూడా లభించక చాలా ఇబ్బంది పడ్డారు. అందుకు కారణం లాక్ డౌన్ కారణంగా కూరగాయల సరఫరా అస్తవ్యస్తం కావడమే. అదే సమయంలో చాలా ఆంక్షలు అమలులో ఉండేవి కదా. ఈ పరిస్థితులు వంటింటి అవసరాల కోసం పెరడు స్థలంలో కూరగాయల పెంపకం ప్రాధాన్యత వారికి బాగా తెలిసి వచ్చింది. అంతేకాకుండా మార్కెట్ ఆధారిత రసాయన ఎరువులు, క్రిమిసంహారకాల స్థానంలో తేలికగా తక్కువ ఖర్చుతో లభించే జీవ సంబంధ సస్యరక్షణ పదార్థాల విలువ కూడా వారికి బాగా తెలిసొచ్చింది. కాయగూరల వంటి వనిత్యావసరాలను కూడా బయటెక్కడా కొనడం సాధ్యం కాక రైతులు చాలా చాలా ఇబ్బంది పడ్డారు. కానీ అదే సమయంలో పాడేరు ప్రాంత గిరిజన మహిళారైతులు స్వయంసమృద్ధి సాధించడమే కాదు. తోటి గ్రామస్తులందరి అవసరాలను తీర్చగలిగే స్థాయికి చేరుకున్నారు. సాధారణ రోజులలో కూడా నాకు అవసరమైన పరిమాణం కన్నా ఎక్కువే నా ఇంటి వెనుక ఉన్న పెరడులో పండించగలిగేదాన్ని. అలా మిగులుగా ఉన్న పంట ఫలాలను అందరితో కలిసి పంచుకునేందుకు సిద్ధమయ్యాను. లాక్ డౌన్ సమయంలో అప్పటి ఆంక్షల పరిధిలో దూరంగా ఉన్న మార్కెట్ కు వెళ్లి చూస్తే అక్కడ తగినంతగా సరుకు ఉండేది కాదు. అని మంగమ్మ వివరించారు. అప్పటినుంచి చాలా మంది మహిళలు మంగమ్మ పండించిన సేంద్రీయ కూరగాయలను చూసిన తరువాత వారు కూడా వారి వారి ఇంటి పెరడులో కూరగాయల సాగుకు ఉత్సాహంగా ఉందుకు వచ్చారు. సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరగాయలు ఎంత ఆరోగ్యకరమో వారికి తెలిసివచ్చింది. ఇంత ప్రయోజనకరమైన కూరగాయలను నేను సాగు చేయగలిగానంటే జీవామృతం వల్లనే అని నిక్కచ్చిగా చెప్పగలను. లాక్ డౌన్ కారణంగా సేద్యానికి అవసరమైన ముడి సరుకులు కొనుగోలు చేయలేక మేము చాలా ఇబ్బంది పడుతున్న వేళ, జీవామృతం కనిపించింది. చాలా తేలికగా తయారుచేసుకోవచ్చును. అంతేకాదు. అది సస్య రక్షణలో చాలా ప్రభావవంతమైనది కూడా. అని ఆమె వివరించారు. 

ముందన్నది రాచబాటే

ఈ కార్యక్రమంలో మొత్తం 708 మంది మహిళలు పాల్గొన్నారు. వారంతా పరిసరాలకు చెందిన 32 గ్రామాల వారు. వారంతా జీవామృతం తయారీలో శిక్షణ పొందారు. జీవామృతం ఉపయోగించిన ప్రతి ఒక్కరు సంతృప్తికరమైన ఫలితాలు సాధించినట్లు తెలియజేశారు. కొద్ది పాటి చేతి సాయం, సరైన శిక్షణ అందించగలిగితే, పర్యావరణ అనుకూల సేద్య విధానాల గురించి రైతులకు తెలియజేయవచ్చునో ఈ పాడేరు ప్రాంత గిరిజన మహిళలు తాము అవగాహన చేసుకుని మాకు మరింత ప్రోత్సాహం ఇచ్చారు. వారి దగ్గర ఉన్నది కొద్ది పాటి వనరులే. అయినా, జీవామృతం తయారీ అనేది ఒక చిన్న ముందడుగు మాత్రమే. పచ్చని పంట పొలాలను చూడాలనుకుంటే ఈ కార్యక్రమాన్ని మరింత పెద్ద ఎత్తున చేపట్టవలసి ఉంటుంది. అందుకు వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్యలు కలిసికట్టుగా ముందుకు రావాలి. వారి వద్ద ఎక్కువ సంఖ్యలో రైతుల అండ ఉంటుంది. వనరులు కూడా సమృద్ధిగా ఉంటాయి. 

ఈ ప్రయత్నం విజయవంతం కావడానికి ముఖ్యమైన కారణం – కమ్యూనిటీ రిసోర్స్ పర్సెన్స్ అంతా కూడా స్థానిక కమ్యూనిటీ లేదా పరిసర గ్రామాలకు చెందిన వారే కావడం వల్ల వారి మధ్య పరస్పరం సంప్రదింపులు మరింత సరళమయ్యాయి. కమ్యూనిటీ స్థాయిలో సుస్థిర వ్యవసాయం అన్న లక్ష్య సాధనకు సహాయకారి అయింది. టెక్నె సెర్వ్ బృందం మొదలుపెట్టినా, కమ్యూనిటీ రిసోర్స్ పర్సెన్స్ ఉత్సాహం కారణంగా ఇది సాధ్యమైంది. ఈ సమయంలోనే ఒక ముఖ్యమైన అంశం ముఖ్యంగా చెప్పుకోవాలి. పరిమిత మానవ వనరులున్న ప్రాంతాలలో కమ్యూనిటీ సభ్యులనే భాగస్వాములుగా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చునన్న సత్యం బోధపడింది.

జీవ సంబంధ ఎరువుల వాడకాన్ని పాడేరు ప్రాంతంలో ప్రోత్సహించడంలో విజయం సాధించిన టెక్నో సెర్వ్ దేశవ్యాప్తంగా ఇప్పటికే అమలులో ఉన్న అనేక కార్యక్రమాలను ఏదో ఒక ప్రాంతంలో కాకుండా దేశమంతటా విస్తరించేందుకు నడుం బిగిస్తోంది.

రిఫెరెన్సెస్

లక్ష్మయ్య, ఎ. డైట్ అండ్ న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ టరైబల్ పాపులేషన్ ఇన్ ఐటీడీఏ ప్రాజెక్టు ఏరియా ఆఫ్ ఖమ్మం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. 2007, జర్నల్ ఆఫ్ హ్యూమన్ ఎకోలజీ

మోర్దార్ ఇంటెలిజెన్స్, ఆర్గానిక్ ఫుడ్ అండ్ బివరేజెస్ మార్కెట్ – గ్రోత్, ట్రెండ్స్, అండ్ ఫోర్ కాస్ట్స్ (2020-2025), 2020

 

టెక్నో సెర్వ్ 
బీ 1, 201, సెంటర్ పాయింట్ 243ఏ ఎన్ఎమ్ జోషి మార్గ్,
ముంబయ్, మహారాష్ట్ర, - 400013

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి ౨౩, సంచిక ౧, మార్చ్ ౨౦౨౧

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...