కుళ్లిపోయిన గడ్డితో భూసార రక్షణ

సంప్రదాయక సాంస్కృతిక విధానాలను విస్మరించి ఏలక్కాయల సాగును విస్తృతంగా చేపట్టడం కారణంగా పడమటి కనుమల ప్రాంతంలోని వ్యవసాయదారులకు నిరంతరం నష్టాల భారమే మిగులుతోంది. పౌలోస్ ఒక ముందుచూపు ఉన్న వ్యవసాయదారుడు. ఆయన చేసిన ప్రయోగం కారణంగా భూ సారం పెరిగి చేనులోని మట్టిలో కార్బన్ పోషకాలు వృద్ధి చెందుతాయి. అంతేకాక, దిగుబడాలు సమృద్ధిగా ఉంటాయి. అది కూడా నిలకడగా.

దక్షిణ భారత దేశంలోని పడమటి కనుమల ప్రాంతాలలో చిన్న ఏలకుల సాగు నిరంతరం సాగుతున్న కారణంగా అక్కడ విస్తృతంగా ఉన్న నిత్యం పచ్చని చెట్లతో దట్టమైన జీవారణ్యాలుగా వృద్ధి చెందుతున్న ప్రాంతాలలో భూమి కోత సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోంది. మన దేశంలో దాదాపు వంద సంవత్సరాలుగా ఏలకుల సాగును మన రైతు బిడ్డలు నిరాటంకంగా సాగిస్తున్నారు. అందుకు వారు ఎక్కువగా సంప్రదాయక విధానాలనే అనుసరిస్తున్నారు కూడా. ఇందువల్ల పడమటి కనుమల ప్రాంతంలో పర్యావరణం కాలుష్యపు కోరలకు చిక్కకుండా సురక్షితంగా ఉండగలుగుతోంది. అక్కడి నేలలకు చాలా తక్కువ స్థాయిలో హాని కలుగుతోంది. అక్కడి సూక్ష్మజీవజాలం భద్రంగా రక్షింపబడుతోంది. జీవవైవిధ్యం సజీవంగా ఉంటోంది. అయితే ఇటీవలి కాలంలో ఏలకుల సాగును పెద్ద ఎత్తున చేపడుతున్నందున పైరుకు సోకే చీడపీడలు, క్రిమికీటకాల దాడుల కారణంగా రైతు చాలా నష్టాలను ఎదుర్కోవలసి వస్తోంది. దీనికి తోడు వ్యవసాయ కూలీలకు కొరత ఏర్పడింది. సాగు ఖర్చుల భారం విపరీతంగా పెరిగింది. ఇవి రైతన్నను మరిన్ని కషాటల సుడిగుండాల్లోకి నెట్టివేస్తున్నాయి.

వినూత్నమైన ఆలోచనలతో ప్రయోగాలు

కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా కంజనపర గ్రామానికి చెందిన రైతు సోదరుడు కె.వి. పౌలోస్. ఆ ప్రాంతంలోని ఇతర రైతులతో పాటు ఆయన కూడా ఏలకుల సాగు చేస్తున్నాడు. అయితే ఆయనకు ప్రత్యేకత ఏమిటంటే తనకున్న కొద్దిపాటి పొలంలో కొత్త కొత్త ఆలోచనలతో రకరకాలైన ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ప్రయోజనకరమైన వాటిని అనుసరిస్తాడు. ఉపయోగం లేదనుకున్న వాటిని వదిలేస్తాడు. రసాయనిక ఎరువుల వాడకంపై ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత వాటి వల్ల ఉపయోగం లేదని గుర్తించి వదిలిపెట్టేసాడు కూడా. చివరికి పర్యావరన అనుకూలమైన, తక్కువ ఖర్చు అయ్యే సంప్రదాయక విధానాలను అనుసరించడం మేలని వాటినే అమలుచేయటం మొదలుపెట్టాడు.ఇలా చేయడం వల్ల ఏలకుల సాగు వ్యయం తగ్గిపోవటమే కాకుండా గరిష్టంగా దిగుబడి వస్తుందని ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. నిర్ధారించుకున్నాడు.

సగం కుళ్లిన గడ్డిని ఉపయోగించడం ద్వారా సేంద్రీయ కర్బనం పోషకం పంట చేలకు సమృద్ధిగా అందుతుంది. అదే సమయంలో నేలకు ఉండే ఆమ్లతత్వాన్ని నియంత్రిస్తుంది. మట్టిని మరింత మృదువుగా మారుస్తుంది.

పనస చెట్లు (jack fruit), టేకు జాతికి చెందిన చెట్లు (silver oak) వంటి వాటిని ఏలకుల సాగుకు అత్యవసరమైన నీడనిచ్చే వాటిని పెంచడం సర్వసాధారణం. వీటి పెంపకంలో వర్షాకాలం రావటానికి ముందుగానీ, ఆ తర్వాత కానీ వాటి ఆకృతిని అవసరమైన తీరులో మలచడం ఒక అందరూ పాటించే కార్యక్రమం. అందుకోసం కొమ్మలను నరకవలసి ఉంటుంది. కానీ పౌలోస్ మరోలా ఆలోచించాడు. వర్షాకాలంలో కాకుండా ఈశాన్య రుతుపవనాల సమయంలో అంటే డిసెంబర్ – జనవరి మాసాల సమయంలో అతడు ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. అలా చేయటం వల్ల, పొలం దున్నే సమయంలో – ఇలా చెట్ల కొమ్మలను నరకే సమయంలో కొమ్మల వల్ల కానీ, ఎగిరి వచ్చే చిన్న చిన్న పుల్లల వల్ల కానీ – ఎలాంటి అడ్డంకి లేదా ఇబ్బంది ఎదురు కాకుండా ఆయన జాగ్రత్త పడగలిగాడు. కుళ్లిన గడ్డితో చేలను పూర్తిగా కప్పి ఉంచిన కారణంగా ఏలక మొక్కల వేళ్లు వర్షపు నీటి ఉధృతి నుంచి సురక్షితంగా ఉంచడం సాధ్యమవుతుంది. అంతేకాక, ఆ తర్వాత వచ్చే వేసవి కాలంలోని అధిక ఉష్ణోగ్రతల రూపంలో వాతావరణంలో వచ్చే అనూహ్యమైన విపరీతపు మార్పుల ప్రభావం వాటిపై ఏ మాత్రం ఉండదు.  ఏలక మొక్కలు సురక్షతంగా ఉంటాయి. అంతేకాక మరిన్ని మొలకలు పెరిగే అవకాశం కూడా మెరుగవుతుంది. అంతేకాక, చుట్టూ ఉండే పెద్ద పెద్ద చెట్ల నుంచి వచ్చే గాలి వాటి ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. అంతేకాక, సూర్యరశ్మి అతి తీవ్రత అన్నది లేకుండా ఏటవాలుగా పడేందుకు ఈ చెట్లు సహకరిస్తాయి. కిరణజన్యసంయోగ క్రియ సజావుగా సాగుతుంది. చేలను దున్నడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొక్కల ఎదుగుదల సాఫీగా సాగిపోతుంది. ఏలకుల గుత్తులు లేక ఫలకోశం ఎక్కువ ఫలాలను ఇచ్చేందుకు అనువుగా తయారయ్యాయి. ఏలకులు పుష్టివంతంగా ఏర్పడతాయి.

కుళ్లిన గడ్డి వాడకం

చెట్ల ఆకుల నుంచి రాలిన ఆకులు ఇతర చెత్తాచెదారంతో కప్పి ఉంచిన చోట మట్టి ఎక్కువ సారవంతంగా ఉంటుందని పౌలోస్ గుర్తించాడు. అక్కడ పెరిగిన ఏలక మొక్కలు మరింత ఏపుగా చీడపురుగులు లేకుండా ఉంటాయని కూడా ఆయన గమనించాడు. అందువల్ల ఇలాంటి చెత్తాచెదారం, ఆకులు అలములతో కప్పి మట్టికి రక్షణ ఇస్తే ప్రయోజనం ఉంటుందని తెలుసుకున్నాడు. ఇలాంటి వ్యర్థ పదార్థాలు నేలల్లోని తేమ కారణంగా కుళ్లి మట్టిలో చేరిపోయి సేంద్రీయ ఎరువుగా మారుతుందని నిర్ధారించుకున్నాడు. దేశంలో ఏలకుల సాగు పరిశోధనల జాతీయ సంస్థ (National cardamom Research Institute – ICRI) పౌలోస్ వ్యవసాయ క్షేత్రంలోని మట్టి నాణ్యతను అధ్యయనం చేసింది. అందులో సేంద్రీయ కర్బన పోషకాలు / ఆకు పెంట లేదా పచ్చ ఎరువు (humus content) సమృద్ధిగా ఉన్నట్టు నిర్ధారించారు. ముఖ్యంగా పరిసరాలలోని ఇతరుల పంట పొలాలతో పోల్చినప్పుడు పౌలోస్ నేలల్లో అధికంగా ఈ పోషకాలున్నట్టుగా గమనించారు. మట్టి సాంద్రత కూడా చాలా స్వల్పమేనని తేలింది. ఇలా కుళ్లిన గడ్డి, తదితర వ్యర్థ పదార్థాలను ఉపయోగించిన కారణంగా మట్టిలోని ఆమ్ల గుణం చాలా తక్కువగానూ, కర్బన పోషకాలు అధికంగానూ ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇలా కర్బనం ఎక్కువగా ఉండటం వల్ల రసాయనిక ఎరువుల వాడకాన్ని పౌలోస్ గణనీయంగా తగ్గించివేశాడు. కేవలం ఒక్కసారి మాత్రమే వాటిని ఉపయోగించేవాడు. సాధారణంగా ఈ ప్రాంతంలోని రైతులు 4 నుంచి 7 సార్లు రసాయనిక ఎరువులను ఉపయోగిస్తుంటారు.

ఈ విధంగా కుళ్లిన ఎండుగడ్డి ఉపయోగం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కల ఎదుగుదల ఆరోగ్యవంతంగా సాగింది. ఏలకుల ఫలకోశాలు (capsules) పుష్టిగా కనిపిస్తాయి. క్రిముల బెడద చాలా వరకూ తగ్గిపోతుంది. కాండం బలంగా ఉంటుంది. 17 ఏళ్ల వయసున్న మొక్కలు 15 నుంచి 20 అడుగులు ఎత్తు వరకూ ఎదుగుతాయి. ఒక్కో ఏలక మొక్కల పొదలో దాదాపు వంద వరకూ చిన్న చిన్న మొలకలు పెరుగుతాయి. ఏలకుల సాగులో అనుసరించే ఒక విధానం ప్రకారం ఏలకులు సాగుచేసే పొలాల్లో 8 లేక 10 సంవత్సరాలకు ఒకసారి కొత్త మొక్కల పెంపకం అంటే కొత్తగా పిలక మొక్కలను నాటుతూ ఉంటారు.  అది అక్కడి రైతులు అందరూ అనుసరించే విధానం. అయితే పౌలోస్ మాత్రం ఒకసారి మొదలుపెట్టిన ఏలకుల మొక్కలను నుంచి దాదాపు 17 ఏళ్ల వరకూ దిగుబడి సాధించేందుకు వీలుగా కొనసాగించాడు. అందుకు గాను ఆయన పిలక మొక్కలను చాలా దగ్గరదగ్గరగా పెంచేవాడు. మామూలుగా అయితే ఎక్కువ కాలం నాటిన పిలక మొక్కలకు తొందరగా మట్టిలో కలిసిపోతాయి. అవి ఎండిపోవటం అంటూ ఉండదు. అందుకు మట్టిలో ఉండే ఆమ్ల గుణం పూర్తిగా అదుపులో ఉండడమే.  కాండం మధ్యలో కూడా మొలకలు పెరుగుతాయి. ప్రత్యేకం కలుపు ఏరే అవసరం ఉండదు. ఎందుకంటే నేలపై భాగం మన కంటికి కనిపించేలా ఉండదు. మొక్కల నీడ చాలా దట్టంగా ఉన్న అలాంటి వాతావరణంలో క్రిమికీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉండదు.

మరిన్ని ప్రయోజనాలు

ఈ విధంగా కుళ్లిన గడ్డిని, చెత్తాచెదారాన్ని ఉపయోగించడంతో పాటు భూసార రక్షణకు చేపట్టే ఇతర ప్రక్రియలను అనుసరించి పౌలోస్ అద్భుతమైన ఫలసాయం అందుకోగలుగుతున్నాడు. సగటున వంద మొక్కలున్న పొద నుంచి 2 – 5 కిలోల వరకూ ఏలకులు ఆయన దిగుబడి సాధించగలుగుతున్నాడు. ఏలక్కాయలు గుండ్రంగా, గట్టిగా రూపుదిద్దుకుంటాయి. ఎండిన ఏలక్కాయల గుత్తి బరువు 420 నుంచి 450 గ్రాముల వరకూ ఉంటుంది. ఇక విత్తుల బరువు శాతంలో చూస్తే 83 కన్నా ఎక్కువగా ఉంటుంది. ఆయన దిగుబడి నాణ్యతను, అధిక దిగుబడిని గమనించిన తర్వాత సుగంధ ద్రవ్యాల బోర్డు ఆయనకు 1995 నుంచి 2009-10 మధ్య కాలానికి ప్రథమ బహుమతి ప్రకటించింది.

ఇవి మాత్రమే కాకుండా, సాగు వ్యయం చాలా తగ్గిపోయింది. కలుపు ముప్పు లేకుండా పోయింది. అందువల్ల కూలీలను వినియోగించవలసిన అవసరం చాలా వరకూ తగ్గిపోయింది. బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన ముడి సరుకుల వాడకం దాదాపు శూన్యం. రసాయనిక ఎరువుల అవసరం పరిమితమే. ఇది కూడా సాగు ఖర్చులను బాగా తగ్గించడానికి ఉపయోగపడింది. అంతేకాక చీడపీడలను నియంత్రించే ప్రకృతి సహజమైన కవచం వృద్ది చెందింది. 2012 ఆగస్టు మాసంలో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, పరాన్నజీవుల ఉనికి ఆయన వ్యవసాయ క్షేత్రంలో 47 శాతం ఉన్నదనీ, అదే ఏలకుల పరిశోధనా ఇనిస్టిట్యూట్ క్షేత్రాల్లో 12 శాతమే ఉండగా, ఇతర రైతుల పొలాల్లో కేవలం 2 శాతమే ఉంటున్నదనీ నిర్ధారణ అయింది. ఈ కారణంగా ఆయన పొలాల వద్ద తేనెటీగలు సమృద్ధిగా తిరుగుతూ తేనె పుష్కలంగా అందిస్తున్నాయి. అంతేకాక, ఆ తేనెటీగల కారణంగా పరపరాగ సంపర్క ప్రక్రియ చురుగ్గా సాగుతుందని స్పష్టమైంది.

ఇప్పుడు ఆ ప్రాంతంలో పర్యావరణహితమైన వ్యవసాయ పద్ధతుల్లో ఏలకుల సాగు చేసే రైతన్నలందరికీ పౌలోస్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎంతో మంది రైతులు ఆయన అడుగుజాడల్లో సేద్యం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఎస్. వరదరాసన్
మాజీ శాస్త్రవేత్త, (ICRI)
మైలాదుంపర
ఇడుక్కి జిల్లా, కేరళ
E-mail:shanvarad@gmail.com

పి. వివేకానందన్
ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ (SEVA)
45, టీపీఎం నగర్,
విరాటిపట్టు, మదురై – 16

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి 17, సంచిక ౪, డిసెంబర్ ౨౦౧౫

 

 

 

 

 

 

 

 

 

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...