ఎరువుల్లోవు, క్రిమిసంహారకాలు లేవు -సౌరశక్తితో కర్నాటక రైతు విజయపథం

కైలాశ్ మూర్తి ప్రయోగం ప్రకృతి సిద్ధమైన సేద్యం అందరికీ అదర్శనీయం. ముఖ్యంగా దేశంలోని చిన్న, సన్నకారు వ్యవసాయదారులకు ఆశాదీపం

పర్యావరణం సజావుగా సాగేందుకు ఆర్థిక పరంగా ఎలాంటి సహకారమూ అవసరం లేదు. కానీ, ఆర్థిక రంగం సవ్యంగా ముందుకు సాగాలంటే మాత్రం పర్యావరణం తోడ్పాటు తప్పనిసరి. ఈ వాస్తవాన్ని ఎం. కే. కైలాశ్ మూర్తి చాలా కఠిన పరిస్థితుల తరువాతే గుర్తించాడు. చామరాజ్ నగర్ జిల్లాలోని దొడ్డనహళ్లి గ్రామానికి చెందిన సాధారణ రైతు ఆయన. కరువు కాటకాలకు పేరుమోసిన ప్రాంతంలో ఆయన తనకున్న 22 ఎకరాల భూమిని ఇప్పుడు నిత్య హరిత వనాలకి దీటైన దట్టమైన అడవిలో మార్చేశాడు. పంజాబ్ వంటి వ్యవసాయ రాష్ట్రాలు సైతం రసాయన ఎరువుల, క్రిమిసంహారకాల వినియోగం తగ్గించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సమయంలో కైలాశ్ మూర్తి చేపట్టిన ప్రయోగం వారికి కూడా ఆకర్షించింది. సహజ సిద్ధమైన సేద్యం ఆయన చేపట్టారు. ఇప్పుడు ఆయన సాధించిన విజయం దేశంలోని చిన్న, సన్నకారు రైతులందరినీ ఆకట్టుకుంటోంది.

 వాస్తవానికి ఆయన కూడా అందరి బాటలోనే 1984లో రసాయన ఎరువులతో వ్యవసాయం చేపట్టాడు. అయితే నాలుగేళ్లలోనే ఈ విధానం వల్ల జీవ వైవిధ్యానికి ఎదురవుతున్న సవాళ్లను గుర్తించాడు. భూసారం క్షీణించిపోసాగింది. మొక్కలకు నీరు ఎక్కువగా అందించాల్సి వచ్చేది. వాటితో పాటు ఎరువుల వాడకం కూడా క్రమంగా పెరుగుతూనే ఉందని గమనించాడు.

 “పంటలకు పట్టే చీడపీడలు అనేవి సహజసిద్ధమనే విషయాన్ని రైతులు ముందుగా గుర్తించడం చాలా అవసరం. వాటి దారిన వాటిని వదిలేస్తే పంటకు స్వయంగా నిరోధక శక్తి పెరుగుతుంది. కేవలం మళ్లీ మళ్లీ అధిక మోతాదుల్లో స్ప్రే లను వెదజల్లడం వల్ల అవి నశించిపోవు. ప్రారంభంలో చీడల బెడద తగ్గినట్టు కనిపిస్తుంది. కానీ పంటకు రోగ నిరోధక శక్తి రాకపోగా, చీడలకు స్ప్రే ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. నాకు కూడా ప్రారంభంలో ఇలాగే సానుకూలంగా పనిచేసిన స్ప్రే వంటివి క్రమంగా వాటి సామర్థ్యం పోగొట్టుకున్నాయి. అన్ని రకాల పంటల విషయంలోనూ ఇదే జరిగింది. స్ప్రే ప్రభావాన్ని తట్టుకుని నిలవగల శక్తిని చీడలు సంపాదించుకున్నాయి. తప్పితే పంట సామర్థ్యం పెరగలేదు. అందువల్ల ఇంకా ఎక్కువ మోతాదుల్లో ఎన్ పీ కే, యూరియా, పొటాషియం, నీరు అందించాల్సి వచ్చింది” అని వివరించారు కైలాశ్ మూర్తి.

అదే మొదలు 

 అదే సమయంలో జపాన్ కు చెందిన వ్యవసాయదారు మసనాబో ఫుకోకా అనే  ఆయన మొట్టమొదటి సారిగా సహజసిద్ధ వ్యవసాయం విధానాన్ని ఆవిష్కరించాడు. ఆయన విధానం కైలాశ్ మూర్తిని బాగా ఆకర్షించింది. ఫలితంగా 1988 నుంచి ఆయన సహజ సేద్యం ప్రారంభించాడు. ఈ పద్ధతిలో రసాయన ఎరువులు ఉండవు. క్రిమిసంహారకాలు ఉండవు. ఇప్పటికి ఆయన వాటి జోలికి వెళ్లడం లేదు. భూమిని దున్నడం అనే ప్రక్రియను ఆయన పూర్తిగా మానివేశాడు. కలుపు ఏరివేత అనే పద్ధతిని కూడా వదిలిపెట్టేశాడు. “సేంద్రీయ ఎరువులను కూడా వాడటం లేదు. పంచగవ్య, జీవామృత వంటివి కూడా వాడటం లేదు. నేను అనుసరిస్తున్న విధానం ఒక్కటే. అది ఫోటో సింథసిస్. అంటే – సూర్యరశ్మి ఆధారంగా అత్యంత సహజసిద్ధమైన కిరణజన్య సంయోగ క్రియకు అన్ని అవకాశాలు కల్పించాను. అంతే.” అని తెలిపారు కైలాశ్ మూర్తి. ఈ మాటల్లోనే ఏ రకమైన బాహ్య ముడి సరుకులు అవసరం లేని జీరో ఇన్ పుట్ సేద్యం చేస్తున్నట్లు తెలిపారు.

 ఇవాళ ఆయన పొలంలో 2069 చెట్లు ఉన్నాయి. వాటిలో వక్క చెట్టు, మామిడి చెట్లు, వాల్ బీన్స్, అరటి చెట్లు, బొప్పాస కాయ చెట్లు, ఇంకా మరెన్నో రకాల ఔషధ చెట్లు ఉన్నాయి.

 మరి క్రిమిసంహారకాలను ఉపయోగించకుండా చీడపీడల బెడద నుంచి ఎలా పంటలను కాపాడగలుగుతున్నాడు? ఈ ప్రశ్న సహజమే. దానికి సమాధానం ఆయన మాటల్లోనే … “మనం చిన్నతనంలోనే నేర్చుకున్న ప్రాథమిక సైన్స్ సూత్రం ఇది. మొక్కలు తమకు అవసరమైన ఆహారాన్ని తామే సంపాదించుకుంటాయి. అవసరమైన రోగనిరోధక శక్తిని సాధించుకుంటాయి. అంతకంటే ఎక్కువగా ప్రకృతి తనకు తానుగా ఏ ఒక్క జాతి ఈ ప్రపంచాన్ని శాసించే నియంతగా ఎదగడాన్ని అనుమతించదు.”  మరింత వివరంగా పంటల సాగులో వైవిధ్యం అవసరాన్ని గురించి చెబుతూ “వేర్వేరు రకాలైన పంటలను అంటే కూరగాయలను, మొక్కలను, పండ తోటలను ఒక చోట పెంచగలిగితే ప్రతి పంట కూడా చీడపీడల బెడద నుంచి అంత పటిష్టంగా తమను తాము కాపాడుకోగలుగుతాయి. ఎందుకంటే చీడపీడలకు కూడా సహజ శత్రు పక్షాలు ఉన్నాయి. అవి వాటి పెరుగుదలను అడ్డుకుంటాయి. ” ఈ సందర్భంలో ఆయన తాను గుర్తించిన ఒక వాస్తవాన్ని గురించి ఇలా చెప్పారు. అరటి చెట్ల పెరుగుదలకు హాని కలిగించే చెట్లు కొన్ని ఉన్నాయి. అయితే వాటి పెరుగుదలను నిరోధించే చెట్లు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని గుర్తించాను. వాటిని పెంచి, అరటి తోటల పెంపకానికి ఎలాంటి అడ్డంకి లేకుండా చేసుకున్నాను. అంటే అరటికి హాని చేసే వృక్షాలకు హాని కలిగించే వాటిని పెంచడం ద్వారా అరటి చెట్లను కాపాడుకోవచ్చు.

 ఇప్పుడు ఆయన అనుసరించే సేద్య విధానంలో అరటి చెట్లకు పైన అరటి ఆకులతోటే కవర్ చేసి ఉంటుంది. ఇది చెట్ల పెరుగుదలకు సహకరిస్తుంది. మట్టిలో వృద్ధి చెందే సూక్ష్మజీవజాలాన్ని కూడా కాపాడుతుంది. అరటి మొక్కలకు తోడ్పడే మొక్కల నుంచి రాలిపడే ఆకుల వంటి వ్యర్థాలు ఈ సూక్ష్మజీవాలకు ఆహారంగా ఉపయోగపడతాయి. అంతేకాక, ఎండ వేడికి మట్టిలోని నీటి తేమ శాతం తగ్గిపోకుండా ఇది రక్షణ ఇస్తుంది. ఫలితంగా నేలలో నీటి తేమ శాతం స్థిరంగా నిలుస్తున్నది.

 సహజ పద్ధతిలో సేద్యం పై ఆయన స్వయంగా ఒక అకాడమీని – నేషనల్ అకాడమీ ఆఫ్ నాచురల్ ఫార్మింగ్ – ను కోల్లెగల్  తాలూకాలో ఏర్పాటు చేశారు. ఇందులో ఎరువుల వాడకం దుష్ఫలితాలను, ఒకప్పటి సహజ సేద్య పద్ధతి ప్రయోజనాలను గురించి రైతుల్లో చైతన్యం తీసుకురావడమే ఈ అకాడమీ ప్రధాన ఉద్దేశం. ఫ్రొఫెసర్ ఎం. డి. నంజుండస్వామి సహకారంతో జీరో ఇన్ పుట్ వ్యవసాయ విధానాలను ఆయన కర్నాటక పరిసరాలలో ప్రచారం చేస్తున్నారు. వాతావరణపరంగా ఎదురయ్యే సవాళ్లను ఈ పద్ధతి ద్వారా ఎదుర్కోవచ్చునని, అదే సమయంలో జన్యు క్రమం చెడిపోకుండా దేశీయ విత్తన సంపదను కాపాడుకోవచ్చునని ఆయన పరిసర రైతులకు వివరిస్తున్నారు. దేశం మొత్తం మీద సౌరశక్తి ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహిస్తున్న వ్యక్తి ఆయన ఒక్కరే. మరెవ్వరూ లేరు.

ప్రాణాంతకమైన ఇన్ పుట్ లతో ప్రకృతిలోని జీవ వైవిధ్యాన్ని మనం నాశనం చేస్తే నీవు చేస్తున్నది సేద్యం కాదు. సేద్య రూపంలో ఘోరమైన నేరం.

శాస్త్రవేత్త నోటి మాటలు

కొన్ని సంవత్సరాల క్రితం దేశంలోని వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన కొంత మంది శాస్త్రవేత్తలను ఆయన తన వ్యవసాయ క్షేత్రానికి ఆహ్వానించారు. తన వ్యవసాయ క్షేత్రంలో స్పష్టంగా కనిపిస్తున్న హరిత సంపదలోని లోటుపాట్లు, మంచి చెడులు తెలియజేయాలని వారిని అభ్యర్థించాడు. వారు జరిపిన పరిశోధనలో ఆ క్షేత్రంలోని మొక్కలు కానీ, చెట్లు కానీ ఆరోగ్యవంతంగా ఎలాంటి లోపాలు లేకుండా ఎలాంటి వ్యాధుల బెడద లేనివిగా తేలింది. బెంగళూరులోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ కు చెందిన  ఎం. ఎన్. రమేశ్ తన అభిప్రాయం తెలియజేస్తూ, మూర్తి పండిస్తున్న తోటల్లోని మొక్కలకు ఎలాంటి చీడపీడల సమస్య లేదని, వాటి పండ్లు, గింజలు పూర్తి ఆరోగ్యదాయకమని అన్నారు.

 దాదాపు 138 రకాల ఔషధ మొక్కలు, 28 రకాల చెట్లు ఒక అడవిలోలా అక్కడ సహడీవనం సాగిస్తున్నాయి. ఇక్కడి పర్యావరణం చాలా పరిశుద్ధంగా కాలుష్య రహితంగా ఉంది. అక్కడ సౌరశక్తితో పర్యావరణ రక్షణ సజావుగా సాగుతోంది. మరి కొందరు శాస్త్రవేత్తలు అక్కడి మట్టిలో దాదాపు 9 అంగుళాల మందంతో చెత్త చెదారంతో కూడిన వ్యర్థాలు పైపొరగా రూపుదిద్దుకున్నట్లు గుర్తించారు. వాటిలో కలుపు మాత్రమే కాకుండా చెట్ల నుంచి రాలిపడిన ఆకులు, చిన్న చిన్న కొమ్మలు కూడా ఉన్నాయి. ఇలాంటి మట్టి భూసారాన్ని కాపాడుతుందని, మొక్కల ఎదుగుదలకు దోహదపడుతుందని వారు నిర్ధారించారు. కలుపు మొక్కలు, లేదా చెట్ల నుంచి రాలిన ఆకులు ప్రకృతి సహజ పద్ధతిలో మట్టిలోనే జీవించే వానపాములు, పురుగులు, ఫంగీ వంటి వాటి వృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు.

వర్షపు నీరు మొక్కల మొదళ్లకు చేరేందుకు, భూగర్భ జలమట్టం పెంపునకు అనుకూలం. కార్బన్ విభజనకు తోడ్పడుతుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం వృక్షాల నుంచి వెలువడే వ్యర్థాలు ఏడాదికి 1085 టన్నుల వరకు ఉంటుంది. మట్టి తీరును పరిశీలించిన డాక్టర్ ఎన్. నందినీ (బెంగుళూరు యూనివర్సిటీలో పర్యావరణ విభాగంలో రీడర్, ప్రన్సిపల్ ఇన్ వెస్టిగేటర్)అధ్యయనం ప్రకారం కైలాశ్ మూర్తి పొలంలోని మట్టిలో హెచ్చు మోతాదులో ఎన్ పి కె) అంటే నత్రడని, ఫాస్ఫరస్, పొటాషియం ఉన్నాయి. అంతేకాక సూక్ష్మపోషకాలైన నికెల్, జింక్, ఐరన్, కాపర్, మాగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉన్నాయి.

మూర్తి పెంచుతున్న తోటలో 300 కు పైగా చెట్లు, టింబర్ చెట్లు ఉన్నాయి. ఇవి వర్షపు నీరు నేరుగా మట్టిపైకి పడకుండా గొడుగులా నిలుస్తాయి. ఫలితంగా భూమి కోతకు గురికాకుండా భద్రంగా ఉంటుంది.

ఈ క్షేత్రం వాతావరణ సవాళ్లు తట్టుకోగలదా?

“ఇక్కడి మామిడి చెట్టును చూడండి. అది వాతావరణంలో మార్పులకు అద్దం పడుతుంది. పూత నుంచి పరాగ సంపర్క ప్రక్రియ వరకు, పండు ముదిరే వరకు ప్రతి దశలోనూ, జాగ్రత్తగా గమనిస్తే, ముందుగానే వాతావరణంలో మార్పులను గుర్తించే అవకాశం ఉండేది. జనవరి మధ్య నుంచి పూత వస్తుందని, మే మధ్య నాటికి కాయ చేతికి అందుతుందని చెప్పగలిగేవారం. అయితే ఈ ఏడాది డిసెంబర్లోనే పూతకొచ్చింది. పైగా మామిడి పంటకు ఓ మోస్తరు ఉష్ణోగ్రత అవసరం. గత కొన్ని సంవత్సరాలుగా అధిక ఉష్ణోగ్రతలు హెచ్చుకాలం కొనసాగుతున్నాయి. ఈ వేడిమి వల్ల పూత మాడిపోతుంది. వాతావరణంలో మార్పు ప్రభావం ఇది. ఇలాంటి మార్పులను ముందుగా గుర్తించడం చాలా కష్టం.”

 ఆయనతో మాటల్లో మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. నిజానికి మామిడి చెట్ల గురించి ఏ మాత్రం బెంగలేదు. అలాగే మామిడి చెట్లను ఆశ్రయించి ఉండే సూక్ష్మజీవుల గురించి కానీ, ఇతర పురుగులపై కానీ ఆయనకెలాంటి ఆందోళన  లేదు. “వాతావరణంలో వచ్చే మార్పుల ప్రభావాన్ని తట్టుకునేందుకు ఈ చిన్న చిన్న జీవాలు ఏం చేస్తాయి అన్నది జాగ్రత్తగా గమనించాలి. అవి బతికి మనుగడ సాగించాలంటే పూర్తి జీవిత చక్రం తిరిగి రావాల్సిందే. మరో తరానికి అవకాశం ఇవ్వల్సిందే.” అంటారు ఆవేదనతో ఆయన.

“మనకు ఆరోగ్యం సాఫీగా ఉండాలంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కాదు అవసరం. ఆహారంలో వైవిధ్యం అనేది చాలా చాలా కీలకం. అందుకే ఇన్నేండ్లుగా నేల మీద మట్టిలో జీవించే సూక్ష్మ జీవుల బతుకు తీరును పరిశీలిస్తూ వచ్చాను. ఆ క్రమంలో మట్టికి అవసరమైన పోషకాలను అందించడంలో వాటికి ఉన్న విశిష్ట ప్రాధాన్యతను కూడా గుర్తించాను.”

ప్రస్తుత కాలంలో ప్రకృతి సహజ సేద్యమే సరైన విధానం. ఎందుకంటే చాలా మంది వ్యవసాయదారులు తమ సాగు వ్యయాన్ని తగ్గించుకోవాలనే ఆశిస్తున్నారు. ఈ పద్ధతిలో సేద్యం వల్ల ఎలాంటి నష్టాలు లేవు. పైగా లాభాలే వస్తున్నాయి.

ఈ వ్యాసం మొట్టమొదటిగా డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ లో ప్రచురింతమైంది. దీనికి సంబంధించిన లింకు ఇది:
https://www.downtoearth.org.in/news/agriculture/thiskarnataka-farmer-hasn-t-used-fertilisers-pesticides-forthree-decades-now-57443

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి 21 , సంచిక 4 , డిసెంబర్ 2019

 

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...