ఆహార భద్రత, జీవనోపాధుల సాధనకు విత్తన స్వావలంబన కీలకం

విత్తన సంపద సామాజిక సొత్తు. వేలాది సంవత్సరాలుగా అతి జాగ్రత్తగా పోషించి, భద్రపరచి, సురక్షితంగా ఒక తరం నుంచి మరో తరానికి అందుతున్న వారసత్వ సంపద ఇది. కాని ఇప్పుడు అది వాణిజ్య హక్కు భుక్తంగా మారిపోయింది. అంటే ఒక రకంగా వ్యాపార వస్తువు అయింది. అన్నదాతల చేతుల్లో ఇంతకాలం సురక్షితంగా కాపాడిన ఈ విత్తన సంపద మరింతగా మెరుగుపరచిన వైవిధ్య వంగడాలుగా రూపుదిద్దుకున్నాయి. జీవవైవిధ్యంతో కూడిన వ్యవసాయ విధానాలు భద్రంగా నిలిచేందుకు మాత్రమే కాకుండా దేశ ప్రజలందరికీ ఆహారభద్రతను ఇస్తుంది. వారి జీవనోపాధులను చిర కాలం పాటు స్థిరంగా నిలబెడుతుంది.

మహారాష్ట్రలోని థానే జిల్లాలోని జవహర్ తాలూకా (బ్లాక్) ఒక కొండ ప్రాంతం. పశ్చిమ కనుమల్లో భాగమైన ఈ ప్రదేశం జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు. వివిధ రకాలైన పంటలు ఇక్కడ సాగవుతూ ఉంటాయి. వరి, తైదులు (ఫింగర్ మిల్లెట్స్), జొన్నలు (సొర్గమ్), పీజియన్ పీ, మినుములు వంటి ఇతర ఆహార ధాన్యాలు సమృద్ధిగా సాగవుతాయి.

వరి, ఇతర ఆహార ధాన్యాల సాగులో వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు బిఎఐఎఫ్ పరిశోధనల అభివృద్ధి సంస్థ (ఫౌండేషన్) కృషిచేస్తోంది. ఈ కృషిలో మహరాష్ట్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ ఫరి రూరల్ ఏరియాస్ (మిత్రా) పూర్తి సహకారం అందిస్తోంది. ఈ రెండు సంస్థలు సమైక్యంగా పనిచేస్తూ, స్థానిక జన సమాజం తోడ్పాటుతోనే సంరక్షణకు నడుంకట్టాయి. అదే సమయంలో పంటల సాగు క్షేత్రాలను తిరిగి పునరుద్ధరించేందుకు శ్రమిస్తున్నాయి. ఇందుకోసం స్థానికంగా వాడుకలో ఉన్న సాగు పరిజ్ఞానాన్ని మరింత పటిష్టం చేసేందుకు, అందులో భాగంగా ప్రయోగాలను చేపట్టడం, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు అనుసరించేలా రైతులను ప్రోత్సాహించే చర్యలపై దృష్టి కేంద్రీకరిస్తోంది.

భాగస్వామ్య వైవిధ్య విధానాలు

ముందుగా వ్యవసాయదారులను బృందాలుగా రూపొందించారు. ఒక్కో బృందంలో అయిదు నుంచి పది మంది రైతులు భాగస్వాములుగా ఉంటారు. వివిధ రకాలైన పంటల సాగులో అనుసరించవలసిన రకరకాలైన విధానాలు, పద్ధతులపై వారికి పూర్తి అవగాహన కల్పిస్తారు. ప్రకృతి సహజమైన వాతావరణంలో వృక్షసంపద సమృద్ధిగా ఉన్న వ్యవసాయ క్షేత్రాలను (ఇన్ సైట్ జెర్మ్ ప్లాజమ్ వారు సందర్శించారు. అక్కడ ఉన్న నేలల్లో వరి, తైదలు, కోడి సామలు (ప్రోసో మిల్లెట్స్) వంటి వాటిని సాగు చేసే విధానాలు వివరించడం జరిగింది. వివిధ ప్రాంతాల రైతుల మధ్య పరస్పరం ఒకరి అనుభవాలను మరొకరకి తెలియజేసుకున్నారు. పంటల ఎదుగుదల తీరును స్వయంగా పరిశీలించారు. ధాన్యపు నాణ్యత, పశువులకు లభిస్తున్న మేత విశిష్టతలు, చీడపీడలను, చీడపీడలను  తట్టుకోగల సామర్థ్యం, దుక్కి దున్నే పద్ధతులు, ఏయే పంటలకు అక్కడి నేలలు అనువుగా ఉంటాయనే సమాచారం, కరువుకాటకాలను తట్టుకోగల నేల ప్రత్యేక లక్షణాలను గమనించి వాటికి ప్రాధాన్యతల ప్రకారం పాయింట్లు ఇచ్చారు. వారిచ్చిన స్కోరింగ్ వారు నేర్చుకున్న కొత్త విషయాలకు అద్దం పడతాయి.

 భాగస్వామ్య విత్తన ఎంపిక, పంటల సాగు వైవిధ్యం గురించిన ఈ అవగాహనా కార్యక్రమంలో సుమారు 225 మంది రైతులు పాల్గొన్నారు. వారిలో యువకులు, మహిళలు కూడా ఉన్నారు. విత్తన శుద్ధతను కాపాడే విధానాలను వారికి వివరించడం జరిగింది. మొత్తం మీద 360 మంది రైతులకు తైదలు, కోడి సామల సేద్య విధానాలపై శిక్షణ అందించారు. విత్తనాలను శుద్ధి చేసే పద్ధతులను, వాటిని వ్యవసాయ క్షేత్రాలలో ఉత్పత్తి చేసే విధానాలను, వరి సాగులో ఒకేసారి విత్తనాలను నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను, నేలను సిద్ధం చేయడంలో ఎత్తుపల్లాలను అమర్చే క్రమాన్ని వివరించడం జరిగింది.

శుద్ధిచేయడం, స్వాభావికవాతావరణం అమరికలో అనేక రకాలైన ప్రయోగాలను చేపట్టడం జరిగింది. ఆ తరువాత, స్థానిక సేద్యానికి అనుగుణమైన విధానాలను, పద్ధతులను సాధ్యమైనంత వరకు మెరుగుపరచడం జరిగింది. వాటిని ఎంపిక చేసిన కొంతమంది రైతుల పొలాల్లో అనుసరించేందుకు ప్రోత్సహించడం జరిగింది. వారు తమ చేలల్లో మేలు రకం విత్తులను ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది. సేంద్రీయ ఎరువులతోనే సాగు పనులు పూర్తిచేసేలా వారికి సూచనలు ఇచ్చారు. 26 మంది వ్యవసాయదారులకు 2013 ఖరీఫ్ పంట కాలంలో ఇందుకు ఎంపికచేసుకున్నారు.  వాళ్లంతా తమ పొలాల్లోనే వరి, తైదలు, కోడి సామల విత్తనాలను ఉత్పత్తి చేయాలని సూచించారు. కొన్ని ప్రామాణిక అంశాలను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుకూలంగా ఉండే విత్తన రకాలను ఎంపిక చేయడం జరిగింది. ఈ మొత్తం కార్యక్రమాన్ని భాగస్వామ్య పద్ధతిలోనే చేపట్టారు. ఫలితంగా ఆయా ప్రాంతాల రైతన్నలందరికీ ఉపయోగపడే విత్తన బ్యాంకును నెలకొల్పడం జరిగింది.

జీవ వైవిధ్య సంరక్షణ, జీవనోపాధుల పెంపు

ఈ రకంగా సమష్టి ప్రయోజనాలకోసం కృషి ప్రారంభించడానికి ముందు వరకు అక్కడి రైతులు తమ విత్తన అవసరాల కోసం మార్కెట్ పైనే ఆధారపడవలసి వచ్చేది. కాని ఇప్పుడు వారికి వివిధ రకాలైన పంటలను సాగుచేయడానికి కావలసిన వరి, తైదలు, కోడి సామల విత్తనాలు నాణ్యమైనవి   తమకు తామే తయారుచేసుకోగలుగుతున్నారు . కరువు కాటకాలను తట్టుకోగల విత్తనాలను సిద్ధం చేసుకోగలుగుతున్నారు. చీడపీడలు, క్రిమి కీటకాల బెడద తగ్గింది. వారి పొలాల్లో పండే పంటల నుంచి వచ్చిన దిగుబడిలో పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటున్నాయి. వరి సాగుకు అనుకూలమైన విత్తు రకాలు – కొల్పి (తొలి దశ), కస్బీ, లాల్య, జునా కోలం, రాజ్ గుదియా, మసూరి, దహ్వల్, బాంగల్యా రకాల విత్తులను ఎంపిక చేసుకుంటున్నారు. ఇక తైదలు సాగుకు కల్పేరి, ధవళ్ పేరి, శితోలి, నగలి (లేట్),  దసరబెంది విత్తులను, కోడి సామల సాగులో దూద్ మోగ్రా, ఘోశి, సకలి వారై రకాలు రైతుల అభిమానాన్ని సంపాదించుకున్నాయి.

ఇప్పుడు వివిధ రకాలైన  వరి, తైదలు, కోడి సామ వంగడాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ఇవి కరువుకాటకాలను, చీడపీడలను, వ్యాధిపీడలను తట్టుకుని నిలబడతున్నాయి. పోషక విలువలపరంగా ఇవి మరింత మేలైనవి.

మేలైన సాగు పద్ధతులను తెలుసుకోవడంతో పాటు అధికోత్పత్తిని సాధించే విధానాలను రైతులు అవగాహన చేసుకున్నారు. వరి దిగుబడి ఎకరాకు 20-25 క్వింటాళ్ల వరకు ఎక్కువైంది. తైదల దిగుబడి ఇదివరలో ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకే ఉండేది. అది కాస్తా ఇప్పుడు 17 నుంచి 22 ఎకరాల వరకు వస్తోంది.

ఇప్పుడు రైతులు నాణ్యమైన సేంద్రీయ ఎరువులను సొంతంగా సిద్ధం చేసుకుంటున్నారు. వాటిలో వర్మీకంపోస్ట్ (వానపాముల ఎరువు), వర్మీవాష్ (క్రిమినాశిని), సహజసిద్ధమైన క్రిమి నివారకాలు ముఖ్యమైనవి. ఇప్పుడు రైతన్నల సాగు వ్యయం కూడా చాలా తగ్గిపోయింది. బయట నుంచి ఎంతో ఖర్చు, శ్రమలతో ఎరువులు లేదా క్రిమి సంహారకాలను కొని తెచ్చుకోవలసిన ఇబ్బంది తగ్గిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే సేద్యానికి అయ్యే ఖర్చు ఎకరాకు రూ. 12400 అయ్యేది ఇప్పుడు కేవలం రూ. 7500 కు తగ్గిపోయింది. ఇక తైదల సాగు విషయంలో ఖర్చు ఎకరాకు రూ. 7500 నుంచి రూ. 5300కు తగ్గింది. సేంద్రీయ ఎరువుల వాడకం కారణంగా భూసారం కూడా మెరుగు పడింది. నీటి నిల్వ శాతం కూడా మెరుగైంది.

సమష్టి విత్తన ఉత్పత్తి

సుస్థిర విత్తన సంరక్షణ కార్యక్రమం (సస్టెయినబిలిటీ ఆఫ్ సీడ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్) విజయవంతం కావాలంటే అందుకు స్థానికంగా గ్రామస్థాయి లోనే విత్తనాల ఎంపిక, విత్తన ఉత్పత్తి, పరస్పరం సరఫరా చేసుకోవడం, విత్తన భద్రత వ్యవస్థ ఏర్పడడం అత్యవసరం. ఇందుకు గాను, విత్తన రక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఉత్పత్తి అవుతున్న విత్తనాల నాణ్యత, విత్తనాల పరస్పర సరఫరా పర్యవేక్షణ, మార్కెట్ తో అనుసంధానం వంటి వ్యవహారాలపై నిఘా వేసి ఉంచుతుంది. విత్తన ఉత్పత్తి, విత్తన ఎంపికలకు అనుసరించే విధానాలపై ఈ కమిటీ అజమాయిషీ ఉంటుంది. ఈ విధి నిర్వహణలో భాగంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేపడుతుంది. ఈ పర్యటనల సమయంలో భాగస్వామ్య రైతులకు మెరుగైన విధానాల గురించిన అవగాహన కలిగిస్తారు. మేలు రకమైన విత్తోత్పత్తికి వీలుగా వాటిని ఉత్పత్తి చేస్తున్న క్షేత్రాల నాణ్యతను కూడా పరిశీలిస్తూ ఉంటుంది. ఆ విధంగా వరి, తైదలు, కోడి సామ సాగుకు తోడ్పడేందుకు వీలుగా క్షేత్ర స్థాయిలో విత్తన రకాల పరిరక్షణ కేంద్రాలపై కూడా నియంత్రణ కలిగి ఉంటుంది. ప్రస్తుతానికి 11 గ్రామాల అవసరాలను తీర్చేందుకు మూడు విత్తన సంరక్షణ కమిటీలు కృషిచేస్తున్నాయి. వరి, తైదలు, కోడి సామలు, మొక్క జొన్న (మెయిజ్), జొన్న పంటలకు సంబంధించి 250 రకాల వంగడాలను వీరు తమ విత్తన బ్యాంకులలో సురక్షితంగా కాపాడుకుంటూ వస్తున్నారు.

ఇలా కమిటీల పర్యవేక్షణలో ఉన్న 11 గ్రామాల నుంచి 724 మంది రైతులు ఈ కార్యక్రమంలో చురుగ్గా, ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు.  ఈ కార్యక్రమానికి మరింత మందికి వ్యాప్తి చేసేందుకు 10 మంది యువకులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. వారు దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వేర్వేరు గ్రామాల వారికి వివరించి వారిని కూడా చైతన్యపరిచేందుకు వారు కృషి చేస్తున్నారు. ప్రత్యక్షంగా చూస్తే కాని నమ్మడం కష్టం. అందుకే క్షేత్రస్థాయి పర్యటనలకు అవకాశం తరచుగా కల్పించడం జరిగింది. ఇందుకు గాను మరో మార్గంగా ఎక్కడికక్కడ విత్తనాల ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఆ రకంగా తమ పరిసర ప్రాంతాలలో వాడుకలో ఉన్న పంటల సాగులో వైవిధ్యం గురించి, విత్తన రక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి వివిధ గ్రామాల వారికి అవగాహన కల్పించే ప్రయత్నం జరిగింది. సమష్టిగా నిర్వహిస్తున్న విత్తన ప్రదర్శనలు, జాతరలు, క్షేత్ర పర్యటనలు నిర్వహించారు. ఈ విధమైన కార్యక్రమాల ద్వారా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు చెందిన 4200 మంది రైతులను చైతన్యవంతులను చేయడం జరిగింది.

టేబుల్ 1 : భద్రపరచిన వరి వంగడాలు – వాటి ప్రత్యేకతలు

ప్రత్యేకతలు        వంగడాల రకాలు
కరువుకాటకాలను తట్టుకునే శక్తి కాలీ కుడాయ్ (Kali Kudai), కాలీ కడ్సీ (Kali Khadsi), దులా 1, దులా 2
స్వల్పవ్యవధి పంటలు  

దులా 1 (Dula-1), దులా 2 ( Dula-2), హరి భట్ ధావల్ (Hari bhat Dhaval), డాంగీ (ఎర్ర – Dangi (Red)), డాంగీ (తెల్ల – Dangi (White)), ధావల్ (Dhaval)

అధిక దిగుబడి కోపి (తొలి – Kopi(Early)) కస్బయి (Kasbai), రగుద్యా (Raghudya), సుర్తి కోలం (Surti Kolam), లాల్య (Lalya), జవ్యాచి గుండి (Javyachi Gundi)
మార్కెట్ విలువ బంగ్ల్యా (Banglya), కస్బీ (Kasbai), చిమన్ సాల్ (Chimansal), సుర్తి కోలం (Surti Kolam), జీనీ (వాడా – Zini(Wada)), కొల్పి (Kolpi), డాంగీ (తెల్ల -Dangi (White)), రగుద్యా (Raghudya), మహాదీ (Mahadi)
ఔషధ విలువలు

మహదీ (Mahadi)(బలహీనత తగ్గంచడానికి, గాయాల మాన్పడానికి, విరిగిన కాళ్లు, చేతులు సర్దుకునేందుకు), కాలీ ఖద్సీ (Kali khadsi)(బలహీనత తగ్గించేందుకు), దాంగీ (తెల్ల – Dangi (White)) (ద్రవరూపంలోని కషాయం తయారీకి), దాంగీ (ఎర్ర) (Dangi (Red))(శిశువుల తల్లుల్లో పాలు పెరగేందుకు), మాల్ గుదియా (Malghudya)(ప్రసవానంతరం నీరసం తగ్గించేందుకు), పశువుల మేతకు    కొల్పి (Kolpi), రగుద్యా (Pacheki), పచేకి (Pacheki, ), వాక్వెల్ దాంగీ (Vakvel Dangi (Red and white),), కస్బీ(,Kasbai,), జీనీ (వాడ – Zini (Wada)), బాంగ్ల్యా ( Banglya), మహదీ (Mahadi) డీప్ వాటర్     కాస్వెల్ (Kasvel)

తుది ప్రయోజనం  బిర్యాని, పులావ్, ప్రత్యేక వంటకాలు – బాంగ్ల్యా(Banglya), కస్బయి ( Kasbai,), కొల్పి(Kolpi,), మసురా ( Masura), రాజ్ గుడియా (Rajghudya), సుర్తి కొలం (Surti Kolam), రగుడియా (Raghudya), లిక్విడ్ గ్రూయెల్ (కంజి) Liquid Gruel (kanji),  దాంగీ (ఎర్ర) ఇంకా దాంగీ (తెల్ల -Dangi (Red)) మహదీ పాపడ్, – దుంధున్ (MahadiPapad – Dhundune), రాజ్ గుడియా (Rajghudya), మాల్గుడియా (Malghudya), అటుకులు (Beaten rice (poha)), మరమరాలు (puffed rice (kurmura)), దూలా 1, దూలా 2(Dula-1,Dual-2), సాగ్ బట్ (Sagg bhat)

పెరటి తోటల్లో వైవిధ్యానికి ప్రోత్సాహం

గిరిజనుల పెరటి తోటల్లోనే సమృద్ధిగా  పోషకాలు లభించే వివిధ రకాలైన ఆహార పదార్థాలను వారు స్వయంగా పెంచుకుంటూ ఉంటారు. వాటి ద్వారా పోషకాలు, ఆరోగ్యకరమైన ఆహారం వారికి నిత్యం లభిస్తూ ఉంటాయి. సంప్రదాయకంగా తరతరాలుగా గిరిజనులు పెరటి తొటల పెంపకాన్ని ఒక పద్ధతి ప్రకారం కాపాడుకుంటున్నారు. ఒకొక్కరి ఇంట్లో ఒక్కోలా ఉంటుందీ తోటల పెంపకం. చిన్న చిన్న ఇళ్లలో ఉన్న కొద్ది పాటి జాగాలో వివిధ అంతస్థులలో ఆనవాయితీగా వస్తున్న వృక్షాలు, మొక్కలు, చిన్న చిన్న పొదలు మనం చూడవచుచ. సీజన్ ల వారీగా పెంచుతారు. పోషక విలువలున్న కూరలు, పళ్లు, కాయలు, చిన్న చిన్న జబ్బులకు మందులుగా ఉపయోగపడే మొక్కలు మొదలైనవి వారి ఇంటి పెరళ్లలోనే పెంచడం గిరిజన జీవన విధానంలోని ఒక ప్రత్యేకత. అవన్నీ స్థానికంగా లభించే చెట్లు, కాయగూరలే. ఆ చిన్న జాగాలోనే ఏడాది పొడవునా అవసరమైన పోషకాలను సమకూర్చుకుంటారు. ఆహార కొరత లేకుండా తమకు తాము ఆహార భద్రతను సమకూర్చుకుంటారు.

విత్తనమే నేటి నమ్మకం, విత్తనమే రేపటి ఆశ

థానే జిల్లా, జవహర్ తాలూకాలోని ఓ గ్రామం కమడిపడ. ఆ గ్రామానికి చెందిన యువ రైతు 35 ఏండ్ల సునీల్ కమాడి. అతడి కుటుంబం చాలా పెద్దది. మొత్తం ఏడుగురు ఆతని కుటుంబ సభ్యులు. వాళ్లంతా కలిసి వారికి ఉన్న 3 ఎకరాల చిన్న పొలంలో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. 2008లో సునీల్ కు చాలా ఆందోళన కలిగించే సత్యం తెలిసిపోయింది. తమ కొద్దిపాటి పొలంలోని నేలలు భూసారం తగ్గిపోతోందని, అక్కడి నేలల్లో తేమను నిల్వ ఉంచుకునే సామర్థ్యం క్షీణించిపోతోందని తెలిసి చాలా బాధ పడ్డాడు. అందుకు కారణం కూడా గుర్తించాడు. రసాయన ఎరువుల వాడకమే ఇందుకు కారణమని తెలుసు కున్నాడు. వెంటనే బిఎఐఎఫ్ – మిత్రా ను ఆశ్రయించాడు. వారి సలహా సూచనల ప్రకారం, భూసారాన్ని పెంపొందించే పద్ధతులతో పాటు సేంద్రీయ ఎరువుల వాడకం గురించి అవగాహన చేసుకున్నాడు. అలాంటి సేంద్రీయ ఎరువుల తయారీ విధానంలో శిక్షణ పొందాడు. అధికోత్పత్తి సాధనకు సహకరించే శ్రీ వరి సాగు పద్ధతులను నేర్చుకున్నాడు.

ఆ సంస్థ చేపట్టిన పంటల జన్యు సంబంధ మూలకాల పరిరక్షణ కార్యక్రమంలో (Crop Germplasm Conservation Programme) 2008లో సునీల్ కూడా పాల్గొన్నాడు. క్షేత్ర స్థాయిలో చేపట్టిన ప్రయోగాల్లో 21 రకాలైన వరి వంగడాలను కనుగొనడంలో సునీల్ కీలకపాత్ర వహించారు. అంతేకాదు, ఈ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గనడం వల్ల వరి, తైదలు, కోడి సామల సాగుకు లాభదాయకమైన భాగస్వామ్య విత్తన ఎంపిక నిపుణుడుగా తయారయ్యాడు.

వివిధ రకాలైన దుంపలు లేక గడ్డలు (tubers)సాగుకు సంబంధించిన కరాండే, కోచి, సూరన్ వంటివాటి గురించి, పండ్ల జాతులైన సొరకాయ (bottle gourd), కాకర కాయ (bitter gourd), బూడిద కాయ (ash gourd), వంకాయ (brinjal), తీయ గుమ్మడి కాయ (pumpkin) గురించి, ఆకు కూరల రకాలైన కౌ పీ (cow pea) ), ఆలూ, లబ్ లబ్ గింజలు, తొండ్లి (tondli), వాటిలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. వాటిని తమ కుటుంబ అవసరాల కోసమే సాగుచేసేవాడు. ఆ పనుల్లో కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందించేవారు.

వరిని సాగుచేస్తున్న సమయంలో అసహజమైన కంకులను (panicle) గమనించాడు. వాటికి ఎక్కువ సంఖ్యలో ధాన్యం ఉండడాన్ని గుర్తించాడు. వాటి సైజు కూడా ఎక్కువగానే ఉంది. అలా అతడు గమనించిన కంకులను జాగ్రత్తగా తొలగించి, వాటిలోని గింజలను నాలుగు వేర్వేరు సీజన్లలో భూమిలో నాటి వాటి పెరుగుదలను గమనించాడు. అంటే 2010 వేసవిలోను, 2011 ఖరీఫ్ కాలంలోను, 2012 వేసవిలోను, 2013 ఖరీఫ్ లోను వాటి సాగు ఫలితాలను గమనించాడు. మూడు సార్లు వాటిని శుద్ధి చేసిన తరువాత బిఎఐఎఫం నిపుణుల మార్గదర్శకంలో ఆతడు చేసిన కృషి ఫలించింది. కొత్త రకం వంగడాన్ని రూపొందించాడు. వాటికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి.

ఆ ప్రాంతంలోని వ్యవసాయదారులందరూ ఈ వంగడంపైనే ఎక్కువ ఆసక్తి చూపించారు. కారణాలు చాలా ఉన్నాయి. దిగుబడి రూపంలో వారికి అధిక ఫలసాయం లభిస్తోంది. పొట్టిగా ఉన్నా సున్నితంగా కనిపిస్తున్నా ధాన్యం. ప్రకృతి వైవిధ్యాలను తట్టుకోగలుగుతున్నాయి. క్రిమికీటకాల బెడద, ఇతర చీడపీడల సమస్య లేదని నిర్ధారణ అయింది. 2012 ఖరీప్ సీజన్ లో ఈ కొత్త రకం వంగడం ఉపయోగించి 5 క్వింటాళ్ల విత్తులను ఉత్పత్తి చేసి, స్థానికంగా ఉన్న విత్తన బ్యాంకుకు అప్పగించాడు. ఆ రకంగా ఇతర రైతులకు కూడా ఆతడు అందుబాటులోకి తెచ్చాడు.

ఇప్పుడు సునీల్ దేంగ్ చీమేతీ లోని బియానీ సంవర్థన్ సమితి అంటే విత్తన సంరక్షణ రైతుల బృందంలో యాక్టివ్ సభ్యుడు. జాగ్రత్తగా ఎంపిక చేసిన విత్తులను గుర్తించడంలో చూపిన  నైపుణ్యానికి, చేసిన కృషికి గుర్తింపుగా 2011-12 సంవత్సరానికి మొక్కల జన్యు సంరక్షణ అవార్డు (Plant Genome Savior Farmer Recognition Award) ను న్యూఢిల్లీలో అందించారు. సునీల్ రూపొందించిన వంగడానికి అశ్విని అని తన కుమార్తె పేర నామకరణం చేశాడు. ఇప్పుడు ఈ ప్రాంత రైతులందరికీ పంటల వైవిధ్యం కాపాడడంలో ఆదర్శంగా నిలుస్తున్నాడు.

వారికి తగిన గుర్తింపు కూడా దక్కింది

విత్తన సంరక్షణ కోసం కృషి చేస్తున్న ఈ రైతన్నల బృందానికి తగిన గుర్తింపు కూడా లభించింది. మొక్కల వైవిధ్యాన్ని కాపాడుతూ, రైతుల హక్కుల కోసం కృషిచేస్తున్న పిపివి & ఎఫ్ఆర్ఎ (ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ & ఫార్మర్స్ రైట్స్ అథారిటీ) 2011-12 సంవత్సరానికి మొక్కల వైవిధ్య రక్షణ రక్షకుడు (ప్లాంట్ జినోమ్ సావైర్ కమ్యూనిటీ అవార్డు) ప్రదానం చేసింది. ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ కు అనుబంధంగా పనిచేస్తుంది. పంటల జన్యు రక్షణకు చేసే ప్రయత్నాలకు గుర్తింపుగానే ఈ అవార్డును ఇస్తుంటారు. పంటల జన్యువులను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించిన ఇద్దరు రైతులకు – చౌక్ గ్రామానికి చెందిన మవాన్ జీ పవార్, కమిడిపడ గ్రామానికి చెందిన సునీల్ కమాడీ –  2011-12 సంవత్సరానికి మొక్కల రక్షక అవార్డు అందించారు.

ముందున్న లక్ష్యాలు

విత్తన ఉత్పత్తి, అధిక దిగుబడి విధానాల విషయంలో అన్నదాతల విజ్ఞాన సంపదను పెంపొందించే ప్రయత్నాలు విజయవంతంగా సాగుతున్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగానే వారి జీవనోపాధులను మెరుగుపరచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. రానున్న కాలంలో పప్పు ధాన్యాలు, కూరగాయలు, ముతక ఆహార వనరులను కాపాడే విషయంపై దృష్టిని కేంద్రీకరించనున్నారు. వీటన్నిటి ఫలితంగా, గిరిజన ప్రజలకు మరింత ఆహార భద్రతను చేకూర్చడంతో పాటు వారికి పోషకవిలువలు సమృద్ధిగా ఉన్న ఆహారం అందించడం సాధ్యమవుతుంది.

ఇలా ఎక్కడిక్కడ స్థానికంగా విత్తన నిల్వల బ్యాంకుల మధ్య పరస్పరం సమాచార మార్పిడికి స్పష్టమైన వ్యవస్థ రూపంలో అవకాశాలు పెంపొందించడం ద్వారా మరింత మంది రైతులకు ఈ రకమైన ప్రయోజనాలను అందించడం సులభమవుతుంది. అంతేకాక, ఈ రకమైన వ్యవస్థ సహాయంతో రైతులను మార్కెటుకు చేరువ చేస్తుంది. అందుకు వారిలో నెలకొనే సమష్టి భావన, సంఘటిత బలంగా మారి వారికి కొండంత ధైర్యం ఇస్తుంది. ఇలా కలిసికట్టుగా ఉండడం వల్ల కలిగే ధైర్యంతో నిల్వ (స్టోరేజి) సామర్థ్యాన్ని పెంచుకోవడం కూడా తప్పనిసరి అవుతుంది.  

భూ సారాన్ని, మొక్కల వైవిధ్యాన్ని గురించిన అవగాహన రైతన్నలలో పెరిగే కొద్దీ వారు ఇలా సమష్టి కృషితో సాధించుకున్న వనరులను కాపాడుకోవడంలో చేయూత అవసరమవుతుంది. అందువల్ల మనం పైన చూసిన పిపివి & ఎఫ్ఆర్ఎ చట్టం పరిధిలో అందించాలి. ముఖ్యంగా రైతులు తయారుచేసిన విత్తన రకాలను రిజిస్టర్ చేయడం ముఖ్యం. కెమికల్, మాలిక్యులార్ సంబంధిత శాస్త్రీయ పరిశోధనలు, అధ్యయనాలను చేపట్టాలి. అప్పుడే సామాన్య వ్యవసాయదారులు వివిధ రకాల పంటల గురించిన రకరకాల సమాచారం – పోషకాలు, డిఎన్ఎ నిర్ధారణ, బార్ కోడింగ్ వంటివి – సార్వత్రిక ఆమోదం పొందగలుగుతాయి.

సంజయ్ ఎం. పాటిల్ పూణేలోని బిఎఐఎఫ్ డెవలప్ మెంట్ రీసెర్చి ఫౌండేషన్ (డాక్టర్ మణి భాయ్ దేశాయ్ నగర్, ఎన్.హెచ్. 4, వార్జే) లో పనిచేస్తున్నారు. ఇ-మెయిల్ : sanjaypatil21@gmail.com

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి 16, సంచిక 1, మార్చ్ ౨౦౧౪

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...