ఆహారంలో మరిన్ని పప్పు ధాన్యాలు – పోషకాహార లోపం నుంచి గట్టెక్కిస్తాయా ?

మన దేశంలోని నిరుపేదల్లో అత్యధికుల ఆహారంలో కీలకమైన ప్రొటీన్లను అందించే ఏకైక పదార్థం పప్పు ధాన్యాలు మాత్రమే. అందువల్ల పప్పు ధాన్యాలను అధికంగా ఉత్పత్తి చేయడం, వాటిని పేదలకు అందుబాటులో ఉంచడం వారిలో, ముఖ్యంగా స్త్రీలలో, పోషకాహార లోపం సరిదిద్దడానికి ఎంతగానో తోడ్పడుతుంది. మన దేశపు తూర్పు ప్రాంతాల రాష్ట్రాల్లో పప్పు ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నారు. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు చేపట్టిన చర్యల కారణంగా – పేదలకు అదనపు ఆదాయం లభిస్తోంది. భూసారం మెరుగుపడుతోంది.  ఉపాధి కోసం వారు వలస వెళ్ల వలసిన అవసరాన్ని నివారిస్తున్నాయి.

ప్రపంచం మొత్తం మీద ఉన్న పేదల్లో 75 శాతం మంది దక్షిణ ఆసియాలోనే ఉన్నారు. పల్లె సీమల్లోనే కాక పట్టణ ప్రాంతాల్లో కూడా పేదలు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రాంతం ఇది. వాళ్ల సంపాదన మొత్తం పొట్ట నింపుకునేందుకే సరిపోతుంది. 2014 నాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆకలి కేకల సూచిక (Global Hunger Index (GHI) ప్రకారం 75 దేశాలు ఆకలి రక్కసి కోరల్లో గిలగిలలాడుతున్నాయి. వాటిలో మన దేశానికి 55వ స్థానం దక్కింది. ఆందోళన పడవలసిన స్థితిలో లేకపోయినా 2014 నాటి జిహెచ్ఐ నివేదిక ప్రకారం మన దేశంలో పరిస్థితి తీవ్రస్థాయిలోనే ఉందని హెచ్చరించింది.

ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం ప్రపంచం మొత్తంలో చిన్నారులకు పోషకాహార లోపం ఎక్కువగా ఉన్న దేశాలలో ఇండియా ఒకటి. ఇక్కడ తక్కువ బరువు ఉన్న చిన్నారుల సంఖ్య అత్యధికంగా ఉంటోంది. దేశంలోని బాలబాలికల దాదాపు 600 లక్షలు కాగా, వారిలో సగం మంది తక్కువ బరువు ఉన్న వారే. కనీసం నూటికి 45 మందిలో పెరుగుదల నిలిచిపోయింది. (అంటే వయసుకు ఉండవలసిన పరిమాణం కన్నా తక్కువగానే పెరుగుదల కనిపిస్తుంది.) ఇక నూటికి మరో 20 మంది ఎత్తుకు తగిన స్థాయిలో వారి సారీరిక బరువు ఉండటం లేదు. అంటే వాళ్లంతా తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న వారే. రక్తహీనతతో బాధపడుతున్న వారు నూటికి 75 మంది. విటమిన్ ఎ లోపఁ ఉన్న వారు నూటికి 57 మంది అని లెక్కలు చెబుతున్నాయి.

పోషకాహార లోపం రెండు రకాలుగా ఉండవచ్చు. అవసరమైనంత పోషకాలు లభించకపోవడం కొందరి సమస్య కాగా అధిక మోతాదులో పోషకాలు లభించడం మరో రకం సమస్య. మన దేశంలో అత్యధికులు పోషకాహార లేమితో బాధపడుతున్న వారే. కాగా, సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత వర్గాలకు చెందిన వారిలో పోషకాహారాలు ఎక్కువ కావడంతో సమస్యలను ఎదుర్కొంటున్నారు.అంటే రెండు సందర్భాలలోను వారు తీసుకుంటున్న ఆహారంలో అసమతుల్యత ఉంటోంది. ఇలా పోషకాహార అసమతుల్యతకు అందరికీ తెలిసిన ముఖ్యమైన కారణం – సరైన అవగాహన లేకపోవడం, ఇంకా సాసంస్కృతిక, ఆర్థిక, మతపరమైన కారణాలున్నాయి. ఇవి కాక, భారతీయ మహిళలు చాలా తక్కువ మోతాదులోనే పోషకాహారం తీసుకుంటారు. పురుషులకు ఎక్కువ వాటా ఇచ్చేస్తుంటారు. ఫలితంగా, వాళ్ల ఆరోగ్యం మాత్రమే దెబ్బతినడం లేదు. వారి పిల్లల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది.

దేశీయ పప్పు ధాన్యాలు : ఎంతో సాధించినా, మరెంతో సాధించాలి

పేదరికంలో మగ్గిపోతున్న అనేక కుటుంబాలు మాంసాహారం తీసుకునే అవకాశాలు అంతగా లేనివాళ్లు. వాళ్లకి పప్పు ధాన్యాలు మాత్రమే పోషకాలను అందించే ఏకైక ఆహారం. అందువల్ల, ఇంట్లో అవసరాలకు సరిపడా పప్పు ధాన్యాలను సాగుచేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అందుకు పప్పు ధాన్యాలను సాగుకు మరింత భూమిని సమకూర్చాలి. పప్పు ధాన్యాల దిగుబడిని అధికం చేయాలి. 2013 నాటి ఆహారం, వ్యవసాయ సంస్థ (FAO) అంచనాల ప్రకారం మన దేశంలో 280 లక్షల హెక్టార్ల భూమిలో పప్పు ధాన్యాలను సాగుచేస్తున్నారు. ఏటా 180 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. అంటే హెక్టారుకు 650 కిలోలు. పప్పు ధాన్యాల సాగు ఎక్కువగా ఉండడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా ఇలా సాగుచేసే విస్తీర్ణంలో దాదాపు 85 శాతం వర్షాధార భూములలోనే సాగుతోంది. అది కూడా పరిమిత వనరులున్న నేలల్లోనే సాగు చేస్తున్నారు. వాటి భూసారం చాలా తక్కువ. వాటిని సాగుచేసే వాళ్లంతా పేదరికంలో మగ్గిపోతున్న సామాన్య రైతు కుటుంబాల వారే. వారు వ్యవసాయానికి అవసరమైన ముడి సరుకు కోసం ఎక్కువగా నిధులు వెచ్చించలేని వాళ్లే. వారికి మేలు రకం విత్తనాలు, అక్కడి నేలలకు అనువైన వంగడాలు సాధారణంగా అందుబాటులో ఉండవు. నష్టపోయిన విత్తుల స్థానంలో విత్తడానికి అవకాశం లేనివాళ్లే. చీడపీడల బెడదను ఎదుర్కొనే స్థోమత లేనివాళ్లే. మార్కెట్ అవకాశాలు ఏ మాత్రం దరిచేరని వాళ్లే.

అయినా కూడా మన దేశంలోని ప్రజలందరి అవసరాలకు సరిపడా పప్పు ధాన్యాలు లభించడం లేదు. ఈ కారణంగానే ఏటా 30 నుంచి 40 లక్షల టన్నుల వరకు దిగుమతి చేసుకోకతప్పడం లేదు. దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి అవసరాన్ని ఆధారం చేసుకుని చర్యలు తీసుకుంటోంది. అలాంటి వాటిలో ఆయిల్ సీడ్, పప్పు ధాన్యాల విషయమై ఒక టెక్నాలజీ మిషన్ (Technology Mission on Oilseed and Pulses), సత్వర పప్పుధాన్యాల ఉత్పత్తి కార్యక్రమం (Accelerated Pulse Production Programme (A3P), ఇటీవల 2007-08లో ప్రవేశపెట్టిన పప్పు ధాన్యాల జాతీయ ఆహార భద్రత మిషన్ (National Food Security Mission on Pulses (NFSM) ముఖ్యమైనవి. ఫలితంగా 2012-13లో వీటి ఉత్పత్తి 184 లక్షల టన్నులకు పెరిగింది. ఇందుకు ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఆహార భద్రత మిషన్ ఎంతగానో తోడ్పడింది. ఈ మిషన్ ప్రభావంతో మన దేశంలోని రైతులు మెరుగైన వంగడాలను ఉపయోగించారు. నాణ్యమైన విత్తనాలను ఉపయోగించారు. ఇంకా అనేక ఆధునిక ముడి సరుకులను వినియోగించారు. పప్పు ధాన్యాల దిగుబడిలో కొరతను అధిగమించేందుకు మేలు రకపు సాగు పద్ధతులను, ఆధునిక పద్ధతులను గురించి విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా సామర్థ్యం పుష్కలంగా ఉన్నప్పటికీ, తక్కువ దిగుబడి వస్తున్న జిల్లాలపై ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరించింది.

1960-61 నాటికి రోజుకు తలసరి లెక్కన 70 గ్రాముల పప్పు ధాన్యాలు అందుబాటులో ఉండగా   2009-10 నాటికి ఇది 33 గ్రాములకు తగ్గిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు ప్రకారం రోజుకు తలసరి పప్పుధాన్యాల వాడకం అవసరం.

పశ్చిమ బెంగాల్ లోని బీర్భమ్ జిల్లాలో వరి సాగు తరువాత వ్యవసాయ భూములు నిరుపయోగంగా బీడు పడి ఉండేవి. మొట్టమొదటి సారి జిల్లా రైతులు మానవ్ జమీన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రోద్బలంతో లెంటిల్ (అలసందలుగా వ్యవహరించే ఒక రకం చిక్కుడు ధాన్యం) విత్తనాలను అందుకున్నారు. ఈ సంస్థ మెట్ట భూముల్లో వరి సాగు అంతర్జాతీయ పరిశోధనల కేంద్రం – ఐకార్డా  (International Center for Agricultural Research in the Dry Areas -ICARDA) భాగస్వామిగా వ్యవహరిస్తుంది. వారికి సుబ్రత, మియొట్రీ విత్తనాలను ఆ సంస్థ సరఫరా చేసింది. ఎనిమిది నుంచి పది గ్రామాలకు చెందిన 100 మంది వ్యవసాయదారులు వాటిని ఉపయోగించి సాగుచేశారు. అలాంటి బీడు భూముల్లో రైతులకు హెక్టారుకు 610 కిలోల నుంచి 1100 కిలోల వరకు దిగుబడిని సాధించారు. అంటే సగటున హెక్టారుకు అప్పటి ధరల ప్రకారం 700 డాలర్ల మేరకు ఆదాయం సంపాదించారు.

మేఘలాల్  బర్మన్ అనే రైతన్న ఒక ఎకరాలో మూడో వంతు భూమికి మాత్రమే ఆసామీ. అతడు తనకున్న కొద్ది నేలలో 110 కిలోల అలసందలను పండించాడు. అందులో నుంచి 7 కిలోలను వచ్చే ఏడాది సాగుకు విత్తనాలుగా ఉపయోగించేందుకు భద్రపరుచుకున్నాడు. మిగిలిన దానిని ఇంటి అవసరాలకు దాచుకున్నాడు. అతడి మాటల్లో చెప్పాలంటే – కలలో కూడా నేను ఊహించలేదు. ఇంత కొద్ది నేలలో ఇంత దిగుబడి వస్తుందని … . ఇప్పుడు అతడు వచ్చే ఏడాది కూడా అలసందల సాగునే చేపట్టాలని నిర్ణయించుకున్నాడు.

శ్రీమతి లక్ష్మి గిరిజన మహిళ. రోజుకూలీగా బతుకు బండి లాగుతోంది. రోజంతా చేసిన పని కూలీగా డబ్బులకు బదులుగా అలసెంద గింజలను మాత్రమే ఇచేచవారు. చాలా బలహీనంగా ఉన్న తన కుమార్తెకు వాటినే ఆహారంగా అందిస్తోంది. ఇప్పుడు ఆ చిన్నారి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది.

ఈ మిషన్ చేపట్టిన ఈ కృషిలో అంతర్జాతీయ స్థాయి సంస్థలకు చోటు కల్పించింది. ఇప్పుడు ఈ మిషన్ చేపడుతున్న కార్యకలాపాల్లో పైన మనం చెప్పుకున్న ఐకార్డా, ఇక్రిశాట్ వంటివి జాతీయ వ్యవసాయ పరిశోధనల సిస్టమ్స్ (NARS) తో కలిసి దిగుబడిని అధికం చేసే విషయంలోఒకరి అనుభవాలను మరొకరికి తెలియజేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నది. ఈ విధంగా అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థలతో కలిసి చేపట్టిన కృషి అత్యాధునిక సాఁకేతికత సాయంతో భారతీయ రైతులు అధిక దిగుబడిని సాధించగలిగారు. అదే సమయంలో వారి సాగు నైపుణ్యాలు మెరుగుపడ్డాయి. శాస్త్రవేత్తల సామర్థ్యం పెంపు సత్తా పెరిగింది.

పప్పుధాన్యాలను ఆహారంలో చేర్చడం వల్ల లభించే పోషక విలువల గురించి విశ్వవ్యాప్తంగా అవగాహన పెరిగింది. రానున్న సంవత్సరాల్లో పప్పు ధాన్యాల సాగు ప్రయత్నాలు జోరు అందుకోగా, పరిశోధనలకు ఊపు వచ్చింది. ఫలితంగా ఐక్యరాజ్య సమితి 2016వ సంవత్సరాన్ని అంతర్జాతీయ పప్పుధాన్యాల వత్సరంగా ప్రకటించింది.

పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంపు చర్యలు

మెట్ట ప్రాంతాలలో వ్యవసాయ పరిశోధనల అంతర్జాతీయ కేంద్రం (ICARDA) మన దేశంలోని జాతీయ సంస్థలతో చేతులు కలిపి పరిశోధనలకు, ఆధునిక అలసెందల (lentil) సేద్య విధానాలకు కృషి చేస్తోంది. రైతుల్లో ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి అవగాహన కలిగించేందుకు దృష్టి కేంద్రీకరిస్తోంది. పోషకాల భద్రతను ప్రజలకు చేకూర్చడం, వరి ఆధారిత సుస్థిర వ్యవసాయ విధానాలను రూపొందించడం లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తోంది. న్యూఢిల్లీ కేంద్రంగా ఈ అంతర్జాతీయ కేంద్ర కార్యాలయం దక్షిణాసియా, చైనా ప్రాంత అవసరాలను పర్యవేక్షిస్తోంది. ఈ కేంద్రానికి 1977 నుంచి అంతర్జాతీయ అలసెందల వ్యవసాయ పరిశోధనల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇది మన దేశపు వ్యవసాయ పరిశోధన సంస్థ (NARS) తోడ్పాటు అందిస్తోంది. వీటి సేద్యంలో ఈ ప్రాంతం స్వయంసమృద్ధి సాధించేందుకు సహాయపడుతోంది. అంతర్జాతీయ స్థాయిలోని కేంద్రం మన దేశంలో చేపట్టే అన్ని కార్యక్రమాలలోను చురుగ్గా పాల్గొంటోంది. ముఖ్యంగా జెర్మ్ ప్లాజమ్ తో పాటు అంతర్జాతీయ స్థాయిలోని వ్యవసాయ క్షేత్రాల గురించిన మౌలిక సమాచారం సేకరణ, వ్యాప్తి కోసం కృషిచేస్తోంది. ఇందులో భాగంగా, ఆధునీకరించిన పెంపకం విధానాలను, మెరుగు పరచిన వంగడాలను విశ్వవ్యాప్తంగా రైతులకు అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కేంద్రం కృషి ఫలితంగానే అధిక దిగుబడినిచ్చే విధంగా, స్థానిక అవసరాలకు అనువైన ఎలాంటి చీడపీడల బెడద లేని వంగడాల రూపకల్పనలో ప్రయోజనకరమైన కృషి జరుగుతోంది. వీటి వల్ల ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో వర్షాధారిత మెట్ట భూముల్లో సాగు పనులు చురుగ్గా సాగుతున్నాయి.

ఇందుకోసం, రూపొందించిన కార్యక్రమాలలో కొన్నిటిని ఇప్పుడు తెలుసుకుందాం. 1. దేశీయ/స్థానిక వంగడాలను మెరుగు పరచడం, భాగస్వామ్య పద్ధతిలో రైతులకు ఉపయుక్తమైన వంగడాల రూపకల్పనలో వెర్టికల్ విస్తరణకు కృషి చేయడం 2. వరి సాగు చేసే మెట్ట ప్రాంతాలలోను, ఈశాన్య రాష్ట్రాలలో హారిజాంటల్ విస్తరణ పనులను చేపట్టడం 3. గ్రామ స్థాయిలో విత్తన సంస్థలను (VBSEs)  ప్రోత్సహించడం 4. రైతుల్లో సామర్థ్యం పెంపు చర్యలు చేపట్టడం.

అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల వ్యవసాయ పరిశోధనల కేంద్రం మన దేశ ప్రభుత్వం చేపట్టిన జాతీయ ఆహార భద్రత మిషన్ (NFSM)లో భాగం పంచుకుంటోంది. అయిదు రాష్ట్రాలలోని 9 జిల్లాలలో  మూడేళ్లుగా ఈ కేంద్రం తన సేవలను నిరంతరం కొనసాగిస్తోంది.

వెర్టికల్ విస్తరణ చర్యలు

ఈ అలసెందల సాగులో రైతులకు ఎదురయ్యే పెద్ద సమస్య మేలు రకపు విత్తనాలు లభించడమే. గత మూడు సంవత్సరాలుగా అంతర్జాతీయ వ్యవసాయ కేంద్రం అధ్యయనం ప్రకారం ఆరు ఎడు సంవత్సరాల పాటు రైతులు ఒకే విత్తనాలను ఉపయోగిస్తుంటారని తెలుస్తోంది. అందువల్ల దిగుబడిని పెంచాలంటే మెరుగైన విత్తనాలను వారికి అందుబాటులో ఉంచడం తప్పనిసరి. ఈ విషయాన్ని గుర్తించిన అంతర్జాతీయ కేంద్రం ముందుగా విత్తనాల మెరుగుదలకు, వాటిని రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషిని తీవ్రంచేసింది.

అందులో భాగంగా, 300 గ్రామాలలోని 4307 మంది వ్యవసాయదారులకు మెరుగుపరచిన 12 రకాల వంగడాలను అందుబాటులోకి తెచ్చింది. భాగస్వామ్య పద్ధతిలో సాగు చేసిన రైతులు 1344 క్వింటాళ్ల మేలురకం విత్తనాలను ఉత్పత్తి చేయగలిగారు. వాటిని ఇతర రైతులకు పంచిపెట్టారు.

 మేలు రకం వంగడాలతో పాటు సాంకేతికంగా కొన్ని ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు సమకూర్చారు. ఉదాహరణకు మోయిత్రీ, హెచ్.యు.ఎల్-57 రకాల వంగడాలు స్థానిక వంగడాలను అక్కడి రైతుల సంప్రదాయక సాగు పద్ధతుల్లో సాగుచేసినపుడు వచ్చిన దిగుబడితో పోల్చినపుడు  30 నుంచి 60 శాతం వరకు అధిక దిగుబడినిచ్చాయి.  ఈ వంగడాలను దుక్కి దున్నే ప్రక్తియ ఉపయోగించకుండా విరామ పంటలుగా లేదా ఏక పంటగా సాగుచేసినపుడు ఫలితాలను పరిశీలించడం జరిగింది. అదనపు దిగుబడుల కారణంగా రైతులకు అదనపు ఆదాయం లభించింది.

అలా మామూలుగా వచ్చే ఆదాయం కన్నా ఎక్కువగా దాదాపు 20 లక్షల డాలర్లు వారి చేతికి అందింది. ఇది కాక దీర్ఘకాలం ప్రయోజనాలు చేకూర్చే విధంగా భూసారం గణనీయంగా పెరిగిపోయింది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే చిన్న, సన్నకారు రైతులకు గృహావసరాలకు తగినంత మాత్రమే కాక దేశంలో తమ కుటుంబానికి అవసరమైన పోషక పదార్థాల భద్రతను కూడా అందించారు.

హారిజాంటల్ విస్తరణ

మన దేశంలోని వరి సాగు చేసే విస్తీర్ణంలో 78.8 శాతం వర్షాధారంపైనే సాగవుతుంది. ఈ ప్రాంతాల్లో అందువల్ల వర్షాకాలంలోనే అంటే జూన్-సెప్టెంబర్ మాసాల మధ్యనే సాగు చేయడం సర్వసాధారణం. వరి సాగు అనంతరం భూములను బీడుగా వదిలేస్తారు. ఇలా బీడుగా వదిలేసే భూముల విస్తీర్ణం దాదాపుగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలతో పాటు మొత్తం పశ్చిమ ఉత్తరప్రదేశ్ మొత్తంతో సమానంగా ఉంటుంది. అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, జాతీయ వ్యవసాయ పరిశోధనా సొసైటీ సంయుక్తంగా స్వల్పకాలిక లెంటిల్ వంగడాలను ప్రవేశపెట్టింది. వాటిలో మొయిత్రీ, హెచ్.యు.ఎల్-57 రకాలను ఈ ప్రాంతంలో రైతులకు అందచేశారు. ఇంతవరకు ఈ విరామ సమయాల్లో రైతులు మరే పంటలను సాగుచేసేవారు. ఇప్పుడు ఈ కొత్త వంగడాలను సాగు చేయడం ప్రారంభించాక లభించిన ఫలితాలు ఇక్కడి రైతాంగంలో సంతోషం నింపాయి.

లెంటిల్ సాగు గురించి ప్రచారం చేసేందుకు గాను పెద్ద ఎత్తున ప్రచారాలను చేపట్టడం జరిగింది. బీడుగా వదిలేసిన భూములలో దుక్కి దున్నే అవసరం లేకుండాను, కొద్ది మాత్రపు దున్నే పద్ధతిలోను సురక్షిత వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసే విధానాలను రైతులకు పరిచయం చేయడం జరిగింది. ఈ రెండు పద్ధతుల్లోను లెంటిల్ సాగు మంచి ఫలితాలను ఇచ్చింది. దుక్కి దున్నడం పరిమితంగా చేపట్టిన సందర్భాలలో విత్తనాల దిగుబడి (హెక్టారుకు 513 కిలోలు), పశువుల మేత (హెక్టారుకు 1624 కిలోలు), గరిష్ట ప్రతిఫలం (హెక్టారుకు 272 అమెరికన్ డాలర్లు) లభించింది. దున్నే అవసరమే లేని సమయంతో పోలిస్తే, బి-సి నిష్పత్తి (2:3) గా నిర్ధారణ అయింది. అందుకు దుక్కి అవసరమే లేని భూములలో విత్తనాలు మొలకెత్తే వేళ లేదా గింజ పుష్టిగా తయారయే సమయంలో తేమ ప్రభావం లేదా ఒత్తిడి తక్కువగా ఉండడమే కారణం కావచ్చు.

అయితే జీరో టిల్లేజి అంటే అసలు దుక్కి దున్నవలసిన అవసరమే లేని సాగు పద్ధతిలో ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రదర్శనలను మన దేశంలోని త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోని 7 జిల్లాలలో ఓసిపిఎఫ్ (Office of campaign and political finance) నిధుల సహాయంతో చేపట్టడం జరిగింది.

ఈ కార్యక్రమం వల్ల 1900 మంది వ్యవసాయదారులకు లబ్ధి లభించింది. మొత్తం మీద ఈ లెంటిల్ సాగు కారణంగా హెక్టారుకు 194 నుంచి 272 డాలర్ల వరకు ఆదాయం చేకూరింది. ఇదికాక సాగు విస్తీర్ణం రెట్టింపైంది.

గ్రామ స్థాయి విత్తన సంస్థలు

నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు రైతన్నకు అందించడం కోసం అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం గ్రామ స్థాయిలో విత్తన సంస్థల ప్రతిపాదనను రూపొందించింది. ఇది రైతులకు అన్ని విధాలా ఉపయోగకరమైన ఉత్పత్తి, పంపిణీ కేంద్రం. ఇందుకోసం ఈ పరిశోదనా కేంద్రం స్థానికంగా ఉన్న జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తుంది. అందులో భాగంగా, ప్రగతిశీల దృక్పథం ఉన్న రైతు సోదరులను ముందుగా గుర్తించే ప్రక్రియను చేపడుతుంది. వారి అధీనంలో ఉన్న భూములను విత్తనాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ధ్రువీకరణ సంస్థల దగ్గర వారి పేర్లను ముందుగా నమోదు చేయిస్తుంది. ఆ సంస్థల పర్యవేక్షణలో శాస్త్రీయ అవగాహన ఉన్న సిబ్బంది విత్తనాల ఉత్పత్తి, ఇతర రైతులకు పంపిమీ బాధ్యతలు సక్రమంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటుంది. సరసమైన ధరలకే వాటిని స్థానికంగా ఉన్న రైతాంగానికి అందించడం ఈ మొత్తం ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. ఈ పద్ధతి వల్ల గ్రామంలోని రైతులకు వారి సొంత గ్రామంలోనే అవసరమైన విత్తనాలు లభిస్తాయి. వాటిని ఉత్పత్తి చేసే రైతు సోదరులకు తగుమాత్రం లాభాలు లభిస్తాయి.

జాతీయ సంస్థల సహకారంతో వివిధ రాష్ట్రాలలో దాదాపు 16 విత్తన ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పడం సాధ్యమైంది. ఈ విత్తనోత్పత్తి కేంద్రాల స్ఫూర్తి అక్కడి రైతన్నలలో సంతోషానికి తోడ్పడింది. ఈ విధంగా ఉత్పత్తి చేసిన విత్తనాలను పరిసర గ్రామాలలోని వ్యవసాయదారులకు కూడా పంపిచంపెట్టడం సాధ్యమవుతోంది.

సామర్థ్యం పెంపు చర్యలు

ఆయా ప్రాంతాలలోని రైతన్నల సామర్థ్యం పెంచడానికి తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమైన మరో కార్యక్రమం. ముందుగా ఎంపిక చేసిన కొందరు రైతులకు విత్తనాల ఉత్పత్తి విషయంలో శిక్షణ ఇవ్వడం ఇందులో మొదటి దశ. వాటిని తగిన విధంగా ప్యాకింగ్ చేయడం, సురక్షితంగా నిల్వ చేసి ఉంచడం వంటి విషయంలో  వాటికి అవసరమైన విధానాలను నేర్పడం దీనిలోని మరో దశ. ఉత్పత్తి చేసిన విత్తనాలకు (పప్పులు, పాన్ కేక్, నంకీన్)  మరింత విలువను సమకూర్చేలా చేయడం కూడా అవసరం. ఇంకా విత్తనాలను ఉత్పత్తి చేసిన తరువాత చేపట్టవలసిన మరి కొన్ని కార్యక్రమాలు అంటే నిల్వ చేయడం, శుద్ధి చేయడం, వాయు సహాయక శుద్ధి, ప్యాకేజింగ్, విత్తనాలపై పొట్టును తొలగించడం, వేరుచేయడం, అవసరమైన విధంగా వాటికి పూర్తిగా సిద్ధం చేయడం కూడా తప్పనిసరి. ఈ బాధ్యతల నిర్వహణలో ఎక్కువగా మహిలలకే శిక్షణ ఇవ్వవలసి వచ్చింది. అలా సుశిక్షితులైన వారి సంఖ్య మహిళలు 551 మంది కాగా, మొత్తం 7600 మందికి రైతు శిక్షణా కేంద్రాలలో (ఫార్మర్ ఫీల్డ్ స్కూలు) వాటిని నేర్పించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి మరింత అవగాహన కోసం ప్రత్యేకంగా సెమినార్లు నిర్వహించారు. పర్యటన, సందర్శనలకు ఏర్పాట్లు చేయవలసి వచ్చింది. పంట చేతికి అందడానికి ముందు, అందిన తరువాత చేపట్టవలసిన జాగ్రత్తలను వివరించారు. ఇంతటితో కృషి ఆగలేదు. దాదాపు 1600 మంది రైతులకు ఓసిపిఎఫ్ (ఆఫీస్ ఆఫ్ కాంపెయినింగ్ అండ్ పొలిటికల్ ఫైనాన్సింగ్ – ఓసిపిఎఫ్) చర్యలు తీసుకుంది.

భవిష్యత్తు కార్యక్రమాలు

ఈ విధంగా అలసెందలు (లెంటిల్స్) ఉత్పత్తి విషయంలో రైతు కుటుంబాలకు పోషకాలతో కూడిన ఆహారం అందించడంతో పాటు, వారికి అదనపు ఆదాయ మార్గాలను చేకూర్చడం సాధ్యమైంది. ఈ కార్యక్రమాలు చేపట్టిన ప్రాంతాలలో వీటిని అధికంగా ఉత్పత్తి చేయడం వల్ల పోషకాహార లోపం సమస్యకు పరిష్కారం దొరికింది. భూ సారం మెరుగుపడింది. ఉపాధి కోసం వలస పోవలసిన బెడద తప్పింది. పశువులకు అవసరమైన మేత సమృద్ధిగా లభించింది.

ఇది ఈ విధంగా స్థానిక రైతన్నలకు లాభదాయకంగా మారినప్పటికీ, కొన్ని సమస్యలకు ఇంకా పరిష్కారం వేతకడం అవసరం. ముందుగా స్థానికంగా ఎదురవుతున్న కరవు పరిస్థితులను తట్టుకోగలిగిన విత్తనాలను అభివృద్ధి  చేయాలి. అక్కడి ఉష్ణోగ్రతలను తట్టుకునేవిగా వాటిని సిద్ధం చేయాలి. చీడపీడలను తట్టుకునేలా ఉండాలి. వేర్వేరు పంట కాలాలకు అనువైన వంగడాలు తయారు కావాలి. ఇక ఈ రకమైన పప్పు ధాన్యాల మార్కెట్ ఏకీకృతం చేయాలి. వాటి నిర్వహణలోని లోపాలను సరిచేయాలి. ప్రభుత్వం నుంచి సరైన గిట్టుబాటు ధరలు వచ్చేలా చూసుకోవాలి. సాధారణంగా శీతాకాలపు పంటలకు తగిన గిట్టుబాటు ధరలు అందడం లేదు. సాధారణంగా ఇలా సరైన ధరలు లభించకపోవడం వల్లనే రైతులు తప్పనిసరి పరిస్థితులలో ఇతర తృణ ధాన్యాల సాగును చేపట్టవలసి వస్తుంది. అందువల్ల తక్షణం ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలి. అదే సమయంలో ఈ రకమైన పప్పు ధాన్యాలకు పోషకాల పరంగా ఉన్న విలువల గురించి ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా మహిళల్లో అవగాహన పెంచడం అన్నిటికన్నా ముఖ్యమైన కర్తవ్యం.

పరిశీలించిన పుస్తకాలు :

గులాటి. ఎ., గణేశ్ కుమార్ ఎ, శ్రీధర్, జి మరియు నందకుమార్, టి (2012) లో రాసిన అగ్రికల్చర్ అండ్ మాల్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా. ఇది కాక ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బులెటిన్ (33)1, 74-86

చాంద్ ఆర్, జమురాణి జె (2013)లో రాసిన ఫుడం సెక్యూరిటీ అండ్ అండర్ నరిష్ మెంట్ ఇన్ ఇండియా : అసెస్ మెంట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ నార్మ్స్ అండ్ ది ఇన్ కమ్ ఎఫెక్ట్. ఇండియనం జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ 68 (1) : 39-53)

అతుల్ దోగ్రా, అశుతోశ్ సర్కార్ ,పూజా షా, అక్వీల్ హసన్ రిజ్వి
అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనల కేంద్రం (ICARDA)
దక్షిణ ఆసియా, చైనా ప్రాంత ప్రోగ్రామ్,
సిజిఐఎఆర్ బ్లాక్స ఎన్ఎఎస్సి కాంప్లెక్స్, న్యూఢిల్లీ
ఇ-మెయిల్ : A.Dogra@cgiar.org

ఎడెన్ ఎడబ్ల్యు. హసన్
ICARDA, అమ్మాన్, జోర్డాన్

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి 16, సంచిక 4, డిసెంబర్ ౨౦౧౪

 

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...