అమూల్యమైన చిన్న కమతాలు

ఒడిశాలో జలప్రళయంలో సర్వం కోల్పోయిన చిన్న రైతులు తమ కుటుంబాలకు ఆహారభద్రతను, పోషకాహారాన్ని సమకూర్చేందుకు సరికొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఆ ప్రయత్నంలో వాతావరణంలో ఎదురయ్యే ఒడిదుడుకులను సమర్థవంతంగా తట్టుకునే ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించారు. కాయగూరల తోటల పెంపకం, వరి సాగుతో పాటు చేపల పెంపకం అక్కడి వ్యవసాయదారులకు అవసరమైన ఆహారాన్ని, పోషక పదార్థాలను, ఆదాయాన్ని కూడా సంపాదించిపెడుతున్నాయి.

సన్నకారు రైతుల్లో చాలా మంది,   తాము స్వయంగా ఆకలి బాధతో అలమటిస్తూనే ప్రపంచంలోని అత్యధిక ప్రజానీకానికి అత్యవసరమైన ఆహార పదార్థాలను సమకూరుస్తున్నారు. వాస్తవానికి ఇలా కుటుంబాలు యావత్తూ వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నవాళ్లే. వాళ్లు ఆహారం పండించడంతో పాటు మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు కూడా. వారిని అనేక సమస్యలు నిత్యం పీడిస్తున్నాయి. అలాంటి వాటిలో ముందుగా చెప్పవలసినవి –అదుపు లేని ఉత్పత్తి ఖర్చుల భారం, ఆశించిన దాని కన్నా చాలా తక్కువగా లభిస్తున్న దిగుబడులు, పాలకపక్షాల నుంచి నామమాత్రంగా అందుతున్న మద్దతు, నిలకడ లేని వాతావరణం. వీటిని ఎదుర్కొంటూ కూడా వారు నేల తల్లిని నమ్ముకుని వ్యవసాయం చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఇక ఒడిశాలోని రైతన్నలు వ్యవసాయ రంగంలో నిలదొక్కుకునేందుకు  నిరంతరం అనిశ్చితమైన వాతావరణ పరిస్థితులతో పోరాటం చేయాల్సిందే. నౌపడా జిల్లాలో నిత్యం కరువు రక్కసి భయపెడుతుంది. ఇక కోస్తా ప్రాంతపు జిల్లాలైన కేంద్రపర వంటి చోట్ల నిరంతరం ముంచెత్తే వరదల ముప్పుతో సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి విపరీత వాతావరణపరమైన సవాళ్లను తట్టుకుంటూ కాయగురల తోటల పెంపకంతో పాటు సమీకృత వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. ఈ నిరంతర కృషీవలురు అనుసరిస్తున్న విధానాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రెండు విభిన్నమైన వాతావరణ సమస్యల మధ్య నలిగిపోతున్నప్పటికీ ఆయా ప్రాంతాలలోని సేద్యగాళ్లు ఏ రకంగా తమగండెల నిండుగా విశ్వాసపు బీజాలను ధృఢంగా నాటుకున్నారో తెలుసుకుందాం.

క్షామ పరిస్థితుల్లో కాయగూరల పెంపకం

నౌపడా జిల్లా ఖరియార్ తాలూకా దొహెల్పడ గ్రామానికి చెందిన వనమాలి బెహరాకు రెండు ఎకరాల పొలం ఆసామీ. ఏడాది పొడవునా అర ఎకరా స్థలంలో కాయగురల పెంపకం చేస్తుంటాడు. పొలంలో తవ్వుకున్న నేల బావి నుంచి లభించే నీటితో పంటలు పండిస్తాడు. బావిలో నుంచి నీటిని తోడేందుకు సంప్రదాయక సాధనం తెండా (మోట బావి) ఉపయోగిస్తాడు. పొలం పనుల్లో కుటుంబ సభ్యులందరూ పాల్గొంటారు. రోజుకు రెండు గంటల పాటు కష్టపడితే వారు తినిడానికి మాత్రమే కాక అమ్ముకునేందుకు కూడా వీలుగా సమృద్ధిగా కాయగూరలు పండుతాయి. “పొలానికి నీరు పెట్టడానికి రోజూ ఓ గంట కష్టపడాలి. మరో గంట పాటు ఇతర పనులు అంటే కలుపు ఏరివేత, మొక్కల మొదళ్ల దగ్గర మట్టి సర్దడానికి వినియోగించాలి. ” అంటారాయన. “అలా నిక్కచ్చిగా పనిచేస్తే మా కష్టానికి తగిన ఫలితం అందుతుంది. ఎంత ఎక్కువ కష్టిస్తే అంత ఫలితం అందుతుంది. ఈ మాత్రం సేద్యం చేసే అవకాశం లభించింది. అదే పది వేలు. మేం ఇంత తినగలుగుతున్నాం. సగానికి సగం సరుకును సమీపంలోని మార్కెట్ కు తీసుకెళ్లి అమ్ముకుని ఎంతో కొంత ఆదాయం పొందుతున్నాం. ” అంటున్నది ఆయన భార్య సంయుక్త.

ఇదే విధంగా వనమాలి అడుగుజాడల్లో మరెంతో మంది ఖచ్ఛితంగా చెప్పాలంటే 30 మంది కాయగురల పెంపకంపై జీవితం సాగిస్తున్నారు. వాళ్లంతా తమ కుటుంబాలకు పుష్టికరమైన ఆహారం అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అదనంగా ఆదాయం సంపాదించుకుంటున్నారు. “ఈ గ్రామం పరిసరాల్లోని గ్రామాలన్నిటికీ ఆదర్శంగా నిలుస్తోంది. ” అంటున్నారు అశోక్ పట్నాయక్. ఆయన స్థానికంగా ఇలాంటి రైతన్నలకు తోడ్పాటు అందిస్తున్న రెండు స్వచ్ఛంద సంస్థలలో కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆయన పని చేస్తున్న రెండు సంస్థల పేర్లు కరబ్యా, వికాశ్. సమీపంలోని మరో గ్రామం మోడిసిల్ లో పరిస్థితి కూడా ఇదే విధంగా గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపుకున్న రైతన్నలతో కళకళలాడుతూ ఉంటుంది.

ఈ గ్రామాలలో వర్షాధార వరి సాగు చాలాకాలంగా ఆటుపోట్ల మధ్య సాగేది. గత్యంతరం లేని సందర్భాలలో వారు ఇతర ప్రాంతాలకు బతుకు తెరువు వెతుక్కుంటూ వలసపోయేవారు. కరువుకాటకాలు తీవ్రంగా ఉండడం, పంటలు వరుసగా దెబ్బతినడం వారికి మరో మార్గం లేకుండా మార్చివేసేవి. ఇది ఒకప్పుడు ఏటా సర్వసాధారణంగా ఉండేది. అయితే గ్రామీణులు ఆ సమస్యను విజయవంతంగా పరిష్కరించుకోగలిగారు. అందుకుకుటుంబ సభ్యులకు పోషక విలువలతో కూడిన ఆహారం సమకూర్చడంతో పాటు సమీకృ వ్యవసాయ విధానాలు రైతన్నల ఆర్థిక స్థితిగతులను కూడా మెరుగు పరచగలిగాయి. అందుకు కాయగురల పెంపకం రాచబాట వేసింది. ఈ రెండు స్వచ్ఛంద సంస్థలు గ్రామీణులకు ప్రభుత్వ పథకాలను చేరువ చేయడంలో తమ వంతు సాయం అందించాయి.

అదృష్ట రేఖలుగా నిలిచిన చెరువులు

అదే జిల్లాలోని కుసుమకుంట గ్రామంలో చత్తర్ మాఝీ, ఉజ్వల్ మాఝీల అనుభవం అందరూ తెలుసుకోవడం అవసరం. ఇద్దరూ సన్నకారు రైతులే. కూలీ పనులు చేసుకుని బతుకు బండి లాగుతూ ఉండేవారు. అయితే వారికి కొద్దిపాటి పొలం కూడా ఉంది. వర్షాధారితమైన ఆ కొద్ది పాటి పొలం వాళ్ల కుటుంబాలకు అవసరమైన కనీస అవసరాలు కూడా తీర్చలేకపోయేవి. అయితే ఏడాది క్రితం వారి జీవితాల్లో సరికొత్త ఆశా రేఖ చోటు చేసుకుంది. ఆ సమయంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) లబ్దిదారులుగా వాళ్లను వారు నివసించే పల్లె సభ ఎంపిక చేసుకుంది. ఈ పథకం కింద వ్యవసాయ క్షేత్రాల్లో బావులు లేక చెరువులు తవ్వడానికి ఆస్కారం ఉంది. ఆ రకంగా చెరువుల తవ్వకం పథకం (Mo Pokhari Yojana) కింద వాళ్లకి ఒకొక్కరికి రూ. 20000 ఆర్థిక సహాయం లభించింది. వాటితో తమ పొలాల్లో నీటి సదుపాయం ఏర్పాటు చేసుకున్నారు.

 ఆ రకంగా లభించిన ఆర్థిక సహాయంలో అవసరమైన ముడి సరుకులు, ఇంకా ఇతర అనుబంధ ఖర్చులను తీసేసిన తరువాత చత్తర్ కు రూ. 15 వేలు, ఉజ్వల్ కు రూ. 14 వేలు చేతికి వచ్చాయి. చత్తర్ తన 70 డెసిమల్స్ పొలంలో నుంచి 4 డెసిమల్స్ విస్తీర్ణంలో బావిని తవ్వించాడు. పొలం చుట్టూ కంచె నిర్మించాడు. కాయగూరలు పండించాలని నిర్ణయించాడు. ఉజ్వల్ తన 45 డెసిమల్స్ నేలలో టొమాటో పండించేందుకు కేటాయించాడు. మిగిలిన దానిలోను, చెరువు గట్టున బెండకాయలు, సన్ ఫ్లవర్, ఇంకా ఇతర కాయగూరలను పండించేందుకు సిద్ధమయ్యాడు. “ఏడాది పొడవునా కాయగూరలు మేం కడుపు నిండా తినగలుగుతున్నాం. మిగిలిన వాటిని విక్రయిస్తున్నాం. ఆ రకంగా ఈ సంవత్సరం రూ. 15000 సంపాదించాం. నేను ఇప్పుడు పొట్ట చేతపట్టుకుని పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు వెళ్ల వలసిన అవసరం లేదు. ”అంటూ ఎంతో ఆనందంగా మరెంతో ఉత్సాహంగా చత్తర్ చెబుతున్నాడు.

ఉజ్వల్ కూడా ఇప్పుడు 50 డెసిమల్స్ భూమిలో ఉల్లి సాగుచేస్తున్నాడు. పొలం గట్లపై ఇతడు అర్హర్ సాగు ప్రారంభించాడు. ఈ ఏడాది ఉజ్వల్ రూ. 14000 సంపాదించినట్టు చెబుతున్నాడు. వలస బాధ నుంచి బయటపడ్డాడు. వీళిల్ద్దరూ కూడా తమ కుటుంబ సభ్యుల శ్రమ ఆధారంగానే పొలంలో బావులను తవ్వుకున్నారు. అంటే ఆ విధంగా ఉపాధి హామీ పథకం కింద సంపాదించిన కూలీ సొమ్ములను అదనంగా పొందారు. వారి గ్రామంలోనే మరో ఎనిమిది మంది కూడా ఇదే మార్గంలో ముందుకు వెళ్లారు. ఇప్పుడు ఈ గ్రామం ఇతర గ్రామాల వారికి ఆదర్శంగా మారింది.

అశోకం పట్నాయక్ మాటల్లో చెప్పాలంటే – పెరటి తోటల పెంపకం తరతరాలుగా వస్తున్నదే. గతంలో ఇళ్ల ముందూవెనుకా ఉన్న స్థలంలో ఇలా కాయగూరలు పండించడం ఒక అలవాటుగా ఉండేది. ఆ విధంగా కుటుంబ సభ్యులకు పోషక విలువలున్న ఆహారం లభించేది. కాలక్రమంలో ఈ అలవాటు మరుగున పడింది. అందుకు ప్రధానమైన కారణంగా కూలీలు దొరకడంలో ఇబ్బంది ఏర్పడడమే అని చెప్పవచ్చు. ఇప్పుడు స్వచ్ఛంద సంస్థల తోడ్పాటు, ప్రేరణల ఫలితంగా ప్రతీ గ్రామంలోను కనీసం 20, 30 శాతం కుటుంబాలు పెరటి తోటల్లో కాయగురల పెంపకం చేపడుతున్నాయి. వాళ్లలో చాలా మంది మిగులు దిగుబడిని మార్కెట్ కు చేర్చి అదనపు ఆదాయం సంపాదించ గలుగుతున్నారు.

సమీకృత వరి సాగు, చేపల పెంపకం

కేంద్రపర జిల్లా రాజ్ నగర్ తాలూకాలోని పద్మనవ పట్నం అనే గ్రామంలో నిత్యం వరదల తాకిడి వరి సాగు చేసే రైతుల జీవితాలను అల్లకల్లలోలం చేసేవి. కానీ, ఇప్పుడు, అనేక దేశాల సమష్టి కలయికతో చేపట్టిన కార్యక్రమం ‘పరివర్తన్’ వాళ్ల జీవితాలకి వారికి కొండంత అండగా నిలిచింది. అందుకు కన్సర్న్ వరల్డ్ వైడ్, యూరోపియన్ యూనియన్ మద్దతుగా నిలిచాయి. ఈ కార్యక్రమం అమలు చేయడంలో స్థానికంగా ఉన్న మరో స్వచ్ఛంద సంస్థ ఆర్సీడీసీ సహకారం అందించింది. కాంచన సామల్ వంటి సన్న కారు రైతులు వీరి ప్రోత్సాహంతో చేపల పెంపకం చేపట్టారు. అంతేకాకుండా  తమకు ఉన్న చిన్న కమతాల్లో కాయగూరలు పెంపకం కూడా ప్రారంభించారు.

కాంచనకు 2000 చేప పిల్లలను అందించారు. అవసరమైన చేపపిల్లల ఆహారం కూడా అందించారు. ఇంకా కాయగూరల విత్తనాలు, మొక్కలను కూడా అందించారు. జూన్ 2013లో ఆమె తనకు ఉన్న 50 డెసిమల్ భూమిలో సొంతంగా సమీకృత సాగు ప్రారంభించింది. దానిని ఒక భాగం పొలంగానూ, మరో భాగాన్ని చెపల చెరువుగాను మార్చివేసింది. అందులో వరి సాగు చేయవచ్చు. చేపలను పెంచవచ్చు. నీరు లోపలికి రావడానికి, మురికినీరు లేదా అదనపు నీరు బయటకు పోవడానికి వీలుగా సదుపాయాలు ఏర్పాటు చేసింది. చేపలు మాత్రం గట్లు దాటకుండా జాగ్రత్తలు తీసుకుంది. పొలం గట్లను కాయగూరలు పండించేందుకు ఉపయోగించింది. పొలానికి, తోటలకు సేంద్రీయ ఎరువులనే వినియోగించింది.

కాంచన ఇప్పుడు సగర్వంగా తల ఎత్తుకు తిరుగుతున్న రైతు బిడ్డ. తనకున్న చిన్న కమతంలో 200 శాతం ఆదాయం సంపాదించగలుగుతోంది. ఏడాది వ్యవధిలో “వరి సాగు ద్వారా రూ. 5000 వస్తోంది. ఈ ఏడాది చేపల ద్వారా రూ. 8000 వచ్చింది. కాయగూరలను అమ్మడం ద్వారా మరో రూ. 3000 సంపాదించాను. ” అని చెప్పింది కాంచన. “ఇప్పుడు మేము మా కుటుంబం కోసం కాయగూరలు, చేపలు కొనవలసిన అవసరం లేదు. ” అని సగర్వంగా చెప్పిందామె. పిల్లలకు బైసికిల్స్ కొనిచ్చింది. వారు చదువుకు అయ్యే ఖర్చులను భరించగలుగుతోంది. ఇంకా మరెన్నో రకాలుగా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటోంది. స్థానిక స్వచ్ఛంద సంస్థకు చెందిన జనమేజయ ఈ విధంగా తెలియజేస్తున్నారు. “ఈ కార్యక్రమం ద్వారా చేయూత అందించిన సన్నకారు రైతులందరూ ఇలాంటి సత్ఫలితాలనే సాధించారు. కుటుంబానికి పోషకాలు అందించడమే కాక, సమీకృత వ్యవసాయం వారి ఆర్థిక స్థితిని మెరుగు పరిచింది.”

కన్సర్స్ వరల్డ్ వైడ్ సంస్థలో సాంకేతిక సలహాదారుగా (వాతావరణ మార్పులపై) పనిచేస్తున్న సరోజ్ దాస్ ఈ రకమైన ప్రయత్నాలు ఆహ్వానించదగినవన్నారు. “తుపాను, వరదల ముప్పు అధికంగా ఉండే కోస్తా ప్రాంతంలోని జగతంసింగ్ పూర్, కేంద్రపరా జిల్లాల సన్నకారు రైతులు ఈ విధానాలను విజయవంతంగా ఉపయోగించుకున్నారు. ఆ రకంగా విపత్తు సమయాలలో తమ కుటుంబాలకు పోషకాహారం, ఆహారం, ఆదాయం మకూర్చుకోగలిగారు. ఈ పద్ధతులు మన భారత దేశపు తీర ప్రాంతాలలోనే కాదు, బంగ్లాదేశ్ లో కూడా ఆచరణీయమైనవే. వరి- చేపల పెంపకం కలిపి చేపట్టడం వల్ల వరి సాగు కారణంగా పర్యావరణానికి ఎదురయ్యే కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చు.” అని దాస్ తెలిపారు.

ఈ రైతన్నలందరూ విపత్తులను, పేదరికాన్ని జయించారు. కుటుంబానికి కడుపు నిండా తిండి గింజలు అందించారు. పోషక విలువలతో కూడిన ఆహారం అందించారు. అదనంగా ఆదాయం సంపాదించుకోగలిగారు. ధన సంపాదన రూపంలో వారు పేదలే కావచ్చు. కానీ, తమకున్న కొద్దిపాటి భూమిని సద్వినియోగం చేసుకుని గొప్ప ఫలితాలను అందుకోగలిగారు. చిన్న కమతాలు అవి ఎంత చిన్నవే అయినా వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో తమ వంతు పాత్ర నిర్వహించగలవనే సత్యం మనం గుర్తించాలి.

రంజన్ కె పాండా
బసేరీ, ఆర్/3-ఎ-4, జెఎం కాలనీ, బుధరాజ సంబల్ పూర్, 768 004
ఒడిశా, ఇండియా
e-mail: ranjanpanda@gmail,com

అజిత్ కుమార్ పాండా
కో-కన్వీనర్,
వాటర్ ఇనీషియేటివ్స్, ఒడిశా

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి ౧౬, సంచిక ౪, డిసెంబర్ ౨౦౧౪

 

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...