అదనపు విలువల కూర్పుతో అదనపు ఆదాయం

చిన్న, సన్నకారు రైతులకు ఎదురయ్యే అనేక సమస్యలను పరిష్కరించడంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు చాలా కీలకమైన పాత్రను పోషించగలవు. ఈ దిశగా సాగించే ప్రయత్నాలలో రైతు ఉత్పాదనలకు అదనపు విలువలను సమకూర్చే విషయంలో వాటి సామర్థ్యాల పెంపు చాలా విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా, నాణ్యత మెరుగవుతుంది. బేరసారాలలో దీటుగా పాల్గొనే సాధన సంపత్తి లభిస్తుంది. ఉపాధి అవకాశాలు మరిన్ని లభిస్తాయి. వాటితో పాటు ఆదాయం మరింత అధికంగా సంపాదించే అవకాశాలు పెరుగుతాయి.

మన దేశంలోని వ్యవసాయదారులలో చాలా ఎక్కువ భాగం చిన్న, సన్నకారు రైతులే. సాధారణంగా వారికి ఎదురయ్యే సమస్యలలో పంట వైఫల్యం, నిలకడ లేని వర్షపాతం, సరైన పరిజ్జ్ఞానం, మార్గదర్శకత్వం అందకపోవడం, రుణాల భారం, పెట్టుబడి కొరత వంటివి ముఖ్యమైనవి. ఈ కారణాల వల్ల రైతుల జీవితం ఆటుపోట్ల మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. పైగా వారు పటిష్టమైన వ్యవస్థగా సంఘటితం కాకపోవడం వల్ల అవసరమైన ముడి వనరులు సకాలంలో అందవు. మార్కెట్ సవాళ్లను ఎదుర్కోలేక నిస్సహాయులుగా మిగిలిపోతూ ఉంటారు.

చిన్న చిన్న బృందాలుగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా వారిని పటిష్టపరచి, సహకార సంస్థల రూపంలో చట్టబద్దం చేసినట్లయితే ఎన్నో విధాలుగా వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఉత్పత్తి చేసే రైతులు, చేపలు పట్టే మత్స్యకారులు కానీ, పాడి పశువులను పెంచుతూ పాల ఉత్పత్తి చేసే వాళ్లు, నేత పనిచేసేవాళ్లు, ఇంకా ఇతర రంగాల వారు సంఘటితమైన విధంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడడం అవసరం. వారు తమ సంఘాన్ని ఉత్పత్తిదారుల బృందంగా కానీ, సహకార సూత్రాల ప్రాతిపదికన కానీ సమైక్యమవడం చాలా ప్రయోజనకరం. అలా సంఘటితమైనప్పుడు లాభాలనే కాకుండా ప్రయోజనాలను కూడా అందరూ సమానంగా పంచుకునేందుకు అవకాశాలు మెరుగవుతాయి. సొంతంగా ఏర్పాటు చేసుకున్న సంఘంగా, శక్తివంతమైన సంస్థ రూపంలో, ఏర్పడడం వల్ల వారు అదనపు ఆదాయాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా, తమ సాగు ఖర్చులను తగ్గించుకోగలుగుతారు. సమష్టిగా లావాదేవీల ప్రయోజనం అందుకోగలుగుతారు. జీవనోపాధులు కూడా గణనీయంగా పెరుగుతాయి. పెరిగిన ఉపాధి అవకాశాల సాయంతో తమ ఉత్పత్తులకు ప్రాసెసింగ్, పంపిణీ, మార్కెటింగ్ రూపంలో అదనపు విలువలను చేకూర్చకోవచ్చు. మార్కెట్ లో పోటీపడి మెరుగైన ధరలకు తమ ఉత్పత్తులను విక్రయించుకునే సామర్థ్యం పెంచుకోవచ్చు. వ్యవస్థాగత రుణాలను కలిసికట్టుగా సాధించుకోవచ్చు. అయితే ఇలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడిన తరువాత సభ్యుల విశ్వాసాన్ని సంపాదించుకునే క్రమంలో చాలా సవాళ్లనే ఎదుర్కోవలసి ఉంటుంది. సాధరణంగా సభ్యులకు తమ వ్యవస్థ పనితీరు గురించిన స్పష్టత కొరవడుతుంది. స్పష్టత లేని కారణంగా అలాంటి వాటిలో సభ్యత్వం తీసుకునే విషయంలో కూడా ఊగిసలాట ధోరణి చూపిస్తారు. ప్రస్తుతానికి ఈ విషయంలో రైతులకు కొండంత అండగా ఉన్న ఏకైక సంస్థ నాబార్డ్ లేక జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంకు ఒక్కటే ప్రధానమైనది. ఉత్పత్తిదారుల సంఘాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు సాంకేతిక, నిర్వహణాపరమైన చేయూతనిస్తోంది. ఉదాహరణగా శ్రీ బాలాజీ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ గురించిన వివరాలను బాక్సు నెం. 1లో గమనించవచ్చు.

కొన్ని విజయ గాథలు

అదనపు విలువలను చేర్చడం అనేది ఎన్నో రైతు సంఘాలకు లాభదాయక వ్యూహంగా మారింది. ఈ విధానం అనుసరించిన రైతులకు పంట నష్టాల భారం తగ్గింది. ఆదాయం పెరిగింది. ఈ విషయాన్ని నిరూపించేందుకు చాలా ఉదాహరణలే చెప్పుకోవచ్చు. ఏక పంట సేద్యం, అది కూడా స్థానికంగా విరివిగా అందుబాటులో ఉన్నదే, అనుసరించడం వల్ల కలిగే అదనపు ప్రయోజనాలను సాధించిపెడుతాయని స్పష్టమైంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇలాంటి  రైతు సంఘాలలోని సభ్యుల సామర్థ్యాన్ని ముందుగా పెంపొందించడం అవసరం. వారి నైపుణ్యాలను మెరుగుపరచాలి. అదనపు విలువలను చేకూర్చడంలో అనువైన ప్రాసెసింగ్ పద్ధతులపై అవగాహన కలిగించాలి.

 

బాక్సు 1: శ్రీ బాలాజీ ఫార్మర్స్ ప్రొడ్యూజర్ కంపెనీ లిమిటెడ్ 

శ్రీ బాలాజీ ఉత్పత్తిదారుల సంఘం బీహార్ రాష్ట్రంలోని గయ జిల్లా మురేరా గ్రామంలో 2019 లో ఏర్పాటైంది. తొలి దశలో వ్యవసాయ సాంకేతికత నిర్వహణ సంస్థ (అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ – ఏటీఎంఏ – ఆత్మ) రూపంలో అవతరించింది. అప్పట్లో శ్రీ బాలాజీ కృషి ఉద్యమి సమూహ్ అని దీనిని వ్యవహరించేవారు. ఇందులో అతి తక్కువ మంది అంటే 30 మంది మాత్రమే సభ్యులుగా చేరారు. అనంతర కాలంలో, రూ. 3,20,000 ప్రాథమిక పెట్టుబడితో కస్టమ్ హైరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. దీని సాయంతో మరో రూ. 10 లక్షల పెట్టుబడితో ఉపయోగపడే వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేసి, ఉపయోగించడం

ప్రారంభించారు. మొదటి సంవత్సరంలో ఏకంగా రూ. 4 లక్షల లాభాలను ఆర్జించగలిగారు. ఈ సంస్థకు ఎదురైన అతి పెద్ద సమస్య సభ్యత్వాలను పెంచుకోవడమే. ఆ సమస్య పరిష్కారంలో పరిసరాలలోని కృషి విజ్జ్ఞాన్ కేంద్రాలు, ఆత్మా బృందాలు తోడ్పాటును అందించాయి. ఇప్పుడు మరి కొన్ని విషయాలను కూడా ప్రోత్సహిస్తున్నారు. వాటిలో నిమ్మ గడ్డి సాగు ఒకటి. జి-9 అరటి, ఎర్ర బెండ కాయలు, పుచ్చకాయ సాగుతో పాటు చేపల పెంపకాన్ని కూడా చేపడుతున్నారు. బాస్మతి వరి రకాల (1121, 1509)  సాగు కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు దిగుబడిని బెంగాల్, పంజాబ్ మార్కెట్లకు అధిక ధరలకే సరఫరా చేయగలుగుతున్నారు.

వివిధ సందర్భాలలో ఈ పద్ధతులను అనుసరించి, సత్ఫలితాలు సాధించిన కొద్ది మంది గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మేఘాలయ రాష్ట్రంలోని బోల్కింగ్రీ మహిళా కమ్మోడిటీ ఇంట్రెస్టు గ్రూపు అరటి తోటల పెంపకం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించింది. అరటి పండ్లలో ఎన్నో విటమిన్ లు, మినరల్స్ ఉంటాయి. మేఘాలయలో ఉన్న గారో హిల్స్ పరిసరాలలో అరటి తోటల పెంపకం విస్తృతంగా సాగుతుంది. స్థానిక వెరైటీలు బిటగురి (నెద్రాన్) అరటి సాగు హెచ్చు. ఈ అరటి పెద్దదిగా కనిపించడమే కాకుండా, చిప్స్ తయారీకి అనుకూలమైన నాణ్యతతో ఉంటాయి. ఈ కారణంగా వీటికి గిరాకీ ఎక్కువే. జిల్లా స్థాయి వాణిజ్యం, పరిశ్రమల కేంద్రం సహకారంతో అరటి చిప్స్ తయారీలో కూడా నైపుణ్యం సంపాదించుకున్నారు. ఇంకా వీటితో కొన్ని రకాలైన పచ్చళ్లు కూడా చేసుకుంటారు. ఫలితంగా వారికి వారం వారం, ప్రతి నెలా నికరంగా ఆదాయం లభిస్తోంది.

చేపల పెంపకంలో అదనపు విలువల కూర్పు – శ్రీ రేణుకా దేవి ఆత్మ గ్రూపు దూరదృష్టి ప్రదర్శించి, వారి ఉపాధి మార్గాన్ని మరింత ఆదాయం వచ్చే దిశగా నడిపించారు. వారు అనుసరించిన ప్రధానమైన విధానం – సమష్టిగా అదనపు విలువలను తమ ఉత్పత్తులకు చేకూర్చడమే. విలువల కూర్పుతో పాటు దిగుబడి వచ్చిన తరువాత అనుసరించే సాంకేతిక పద్ధతులు కూడా మెరుగు పరచుకున్నారు. తమిళనాడుకు చెందిన ఫిషరీస్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ జయలలిత సహాయంతో శిక్షణ తరగతులు నిర్వహించుకున్నారు. ఈ శిక్షణలో భాగంగా, ఫిష్ ప్రాసెసింగ్ పద్ధతులు తెలుసుకున్నారు. ఫలితంగా వారు ఇప్పుడు చేపల ఉత్పత్తిలోనూ, ప్రాసెసింగ్ (డ్రై ప్రోడక్ట్స్, బేక్ డ్ ఐటెమ్స్, నిల్వ ఉంచదగిన చేపల ఉత్పాదనలు) లోనూ ప్రతిభ చూపించగలుగుతున్నారు. మార్కెట్ పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే వ్యూహప్రతివ్యూహాలను కూడా అలవరచుకున్నారు. అయితే వీరు తాము నేర్చుకున్న మెళకువలను ఆధారం చేసుకుని అదనపు విలువలతో కూడిన ఉత్పాదనలను సిద్ధం చేయవలసి ఉంది.

మామిడి సాగులో అదనపు విలువల కూర్పు – ఉన్నావో లోని కృషి విజ్జ్ఞాన్ కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ సహాయంతో శ్రీమతి తారావతి కి సేద్యం పనుల్లో అవసరమైన సాంకేతిక సహాయం లభించింది. తరువాతి కాలంలో ఆమె ఏకంగా ఒక ప్రాజెక్టులో కీలక పాత్ర చేపట్టారు. ఆ ప్రాజెక్టు పేరు ‘మామిడి పండ్ల సాగులో అదనపు విలువల కూర్పు ద్వారా గ్రామీణ మహిళలకు సాధికారికత’ కల్పన (ఎంపవర్ మెంట్ ఆఫ్ రూరల్ వుమెన్ త్రూ వాల్యూ అడిషన్ ఆఫ్ మాంగో ఫ్రూట్). ఇంతకీ ఆమె స్వయంగా తమ వ్యవసాయ క్షేత్రంలో ఈ అదనపు విలువలతో మామిడి సాగు చేపట్టారు. పచ్చళ్లు తయారుచేశారు. మామిడి పౌడర్ తయారు చేసారు. మొత్తం మీద మరింతగా ఆదాయాన్ని సంపాదించుకోగలిగారు.

ముగింపు వాక్యాలు

ఫార్మర్ ప్రొడ్యూజర్ ఆర్గనైజేషన్ లకు చిన్న, సన్నకారు రైతులకు తోడ్పడే విషయంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వారికి ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం  చూపగలవు. ఎన్నో విధాలుగా వారికి ప్రయోజనం చేకూర్చగలవు. ముఖ్యంగా వ్యాపార పరంగా మార్కెట్ వర్గాలతో బేరసారాలలో దీటుగా వ్యవహరించగలిగే సామర్థ్యం పెంపొందుతుంది. మెరుగైన సాగు పరికరాలను సకాలంలో అందుకోగలుగుతారు. అయితే ఈ ఆర్గనైజేషన్ లకు వాటి సామర్థ్యం పెంపొందించేందుకు మరిన్ని శిక్షణ తరగతులు అవసరం ఉంది. నాణ్యమైన ఉత్పత్తిని సాధించడం, దిగుబడి చేతికి వచ్చిన తరువాత నష్టాలను తగ్గించుకునే మార్గాలపై అవగాహన పెంచాలి. మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఆ రకంగా, అదనపు విలువల కూర్పు రూపంలో అదనపు ఆదాయం సంపాదించుకునేందుకు తోడ్పడాలి. ప్రస్తుతానికి, వారికి నాబార్డ్ సంస్థ నుంచి చిన్న రైతుల వ్యవసాయ-వాణిజ్య మండలి (స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియమ్ – ఎస్ఎఫ్ఎసీ), కృషి విజ్జ్ఞాన్ కేంద్రాలు, ఆత్మ గ్రూపులు ఇతర ప్రభుత్వేతర సంస్థలు చేయూతనిస్తున్నాయి.

రిఫరెన్సెస్

  1. బిక్కిన, ఎన్, తురగా, ఆర్.ఎం.ఆర్ & భమోరియా వి – ఫార్మర్ ప్రొడ్యూజర్ ఆర్గనైజేషన్స్ యాజ్ ఫార్మర్ కలెక్టివ్స్: ఎ కేస్ స్టడీ ఫ్రమ్ ఇండియా, 2018, డెవలప్ మెంట్ పాలసీ రివ్యూ, 36(6), 669-687.
  2. ఇన్ స్పైరింగ్ స్టోరీస్ ఆఫ్ ప్రోగ్రెసివ్ వుమెన్ ఫార్మర్స్, 2020, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్టుమెంటు ఆఫ్ అగ్రికల్చర్, కో-ఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్,
https://agricoop.nic.in/sites/default/files/Success/20Story/20/208.pdf
  1. నాబార్డ్, ఫార్మర్ ప్రొడ్యూజర్ ఆర్గనైజేషన్స్, 2015, https://www.nabard.org/demo/auth/writereaddata/File/
FARMER%20PRODUCER%20ORGANISATIONS.pdf

 

 

అయ్యగారి రామ్ లాల్ – అంబికా రాజేంద్రన్
జివిజన్ ఆప్ జెనిటిక్స్, ఐకార్-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (ఐఏఆర్ఐ), పూసా క్యాంపస్
ఢిల్లీ – 110012
E-mail: rambikarajendran@ gmail.com

దండపాణి రాజు
డివిజన్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ, ఐకార్-ఐఏఆర్ఐ ఇనిస్టిట్యూట్, పూసా క్యాంపస్
ఢిల్లీ, - 110012

మధూలికా సింగ్, అజయ్ కుమార్
సిరియల్ సిస్టమ్స్ ఇనీషియేటివ్ ఫర్ సౌత్ ఏసియా (సీఎస్ఐఎస్ఏ – సీఐఎంఎంవైటి), బీహార్

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...