అటవీ ఉత్పత్తులకు అదనపు విలువల కూర్పు – గిరిజన తెగల సాధికారతకు శక్తివంతమైన సాధనం

మైనర్ ఫారెస్టు ప్రోడక్ట్స్ – ఎం ఎఫ్ పీ – అడవులలో లభించే సాదా ఉత్పత్తులు గిరిజనుల జీవితాలలో చాలా ప్రధానమైన జీవనాధారం. అలాంటి అటవీ ఉత్పత్తులకు అదనపు విలువలు సమకూర్చగలిగితే గిరిజనుల జీవితాలలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. సామాజికంగా, ఆర్థికంగా గిరిజనుల జీవితాలలో ఎంతో అభివృద్ధి వస్తుంది. అట్టడుగు స్థాయి నుంచి పనిచేస్తున్న సంస్థలకు ప్రభుత్వ సహకారం తోడైతే గిరిజనులకు, అవకాశాలకు దూరంగా జీవిస్తున్న పేద ప్రజానీకానికి మరిన్ని జీవనోపాధి మార్గాలు అందించడం సాధ్యమవుతుంది. 

వయనాడ్ జిల్లాలో గిరిజన తెగలు (ఆదివాసీలు) అత్యధికంగా జీవిస్తుంటారు. దాదాపు 12 తెగల పేదలు ఇక్కడ జీవిస్తున్నారు. అయితే వారి జీవిత విధానాలలోనూ, సంప్రదాయాలలోనూ, భాష, భావప్రకటన శైలిలోనూ, సామాజిక-ఆర్థిక అంశాలలోనూ ఎన్నో వైవిధ్యాలు కనిపిస్తాయి. గిరిజన తెగల్లో ఆదివాసీల ఆర్థిక స్థితిగతుల ప్రత్యేకతల ఆధారంగా అనేక గ్రూపులుగా పరిగణిస్తారు. వారి నిత్య జీవితాలలో అటవీ ఉత్పత్తులు చాలా ప్రయోజనాలకు కారణమవుతుంటాయి. చాలా కాలంగా నిర్వహించిన అనేక అధ్యయనాలను గమనిస్తే, వారి జీవితాలు క్లిష్ట పరిస్థితులలో పడ్డాయి. వారి మనుగడే పెద్ద సవాలుగా తయారైంది. వారి సమస్యలకు అనేక కారణాలున్నాయి. వాటిలో వాతావరణంలో చోటు చేసుకునే విపరీత మార్పులు, అటవీ ఉత్పత్తుల సేకరణలో ఇబ్బందులు, మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించకపోవడం ముఖ్యమైనవి. ఫలితంగా గిరిజనుల ఆదాయ వనరులు దారుణంగా దెబ్బతిన్నాయి.

మైనర్ ఫారెస్టు ప్రోడక్ట్స్, అటవీ ఉత్పత్తుల సేకరణ అనేది చాలా చిక్కులతో కూడుకున్న ఉపాధి మార్గం. సేకరించడమే కష్టమైన పనైతే, వాటిని సరైన తీరులో శుద్ధి చేయని పక్షంలో ధర ఏ మాత్రం గిట్టుబాటు కాదు. 

వారు ఎంత కష్టపడినా, వారి శ్రమకు తగిన ఫలితం మార్కెట్ లో దక్కదు. తూకాల్లో మోసం, మధ్య దళారీల అధిక కమిషన్ కోరికలు, కొన్ని ఉత్పత్తుల నాణ్యత రోజులు గడిచేకొద్దీ తగ్గిపోయే ప్రమాదం ఏడాదిలో కొన్ని సమయాల్లో అధికోత్పత్తి, కొన్ని సమయాల్లో అతి స్వల్ప ఉత్పత్తి, సరుకుల నిల్వకు సరైన వసతులు లేకపోవడం, మార్కెట్ ఆమోదానికి అనువుగా సరుకును ప్యాకేజీ చేయడంలో మార్కెట్ పరంగా ఎదురయ్యే సమస్యలు వారికి పెద్ద అడ్డంకులుగా ఎదురవుతుంటాయి. అన్నిటికన్నా ఎక్కువగా కొన్న సరుకులు కాలం గడిచే కొద్దీ నాణ్యత కోల్పోతాయి. అలాంటి సమయాలలో ఆదివాసీ పేదలు తాము సేకరించిన అటవీ ఉత్పత్తులకు అతి తక్కువ ధరలకే అమ్మివేసుకోవలసి వస్తూ ఉంటుంది. ఫలితంగా వారిని నిరంతరం పేదరికం వెక్కిరిస్తూనే ఉంటుంది. కానీ వ్యాపారులు అదే సరుకుని కొన్ని రెట్లు అధిక ధరలకు విక్రయించుకోగలుగుతున్నారు. అధిక లాభాలు సంపాిదించుకుంటున్ననారు.

తొలి అడుగులు

కేరళలోని వయనాడు జిల్లా పూతడి పంచాయతీ పరిధిలో ఉన్న చీయంబమ్ 73 సెటిల్ మెంట్ ఏరియాలోని గిరిజనుల జీవితాలలో మార్పు తెచ్చిన సంఘటన అది. ఇక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో తోటల పెంపకం సాగుతోంంది. తరువాతి కాలంలో దానిని 302 మంంది భూమి లేని నిరుపేద కుటుంబాలకు పంచిపెట్టడం జరిగింది. ఇక్కడ నివసించే గిరిజనుల్లో పాణియన్, కాటునాయకన్, ముల్లుక్రుమ తెగల వారు ఎక్కువ. వారిలో కాటునాయకన్ తెగలోని వారంతా మైనర్ ఫారెెస్టు ఉత్పత్తులను సేకరించి, వాటి అమ్మకంపైనే జీవితాలు సాగిస్తుంటారు. అదే వారి జీవనోపాధి. కాకపోతే అడవీ ఉత్పత్తుల సేకరణ అనేది వారి సంప్రదాయక జీవనోపాధి కాదు. ప్రకృతికి సన్నిహితంగా వారి జీవనం సాగుతూ ఉంటుంది. మిగిలిన రెండు తెగల వారు కూడా దీనిపైనే ఆధారపడి జీవితాలు సాగిస్తున్నారు. ఇక్కడ భూమి పంచిపెట్టిన 302 కుటుంబాలలో 53 కుటుంబాలు పూర్తిగా అడవీ ఉత్పత్తుల సేకరణపైనే ఆధారపడినాయి. ఇలా అడవులలో నుంచి సేకరించి తెచ్చుకున్న వాటితోనే ఆ కుటుంబాల రోజువారీ అవసరాలు తీరుతుంటాయి. ఒక రకంగా అధి వారికి అత్యంత ప్రధానమైన జీవనోపాధి. ఇలా వాటిని సేకరించే మాసాలలో వారి నెలవారీ ఆదాయం 99 శాతం కన్నా ఎక్కువే ఉంటుంది. ఈ విధంగా సేకరించే అటవీ ఉత్పత్తులకు మరి కొనన్ని అదనపు విలువలు సమకూర్చగలిగితే వారి ఆదాయం ఎన్నో రెట్లు పెరిగి, వారి జీవితాలు ఎంతో అభివృద్ధి సాధించగలవని అద్యయనాలలో స్పష్టమైంది.

వయనాడ్ లోని ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చి ఫౌండేషన్ సేవలు ప్రధానంగా కమ్యూనిటీ పరంగా జీవసంబంధ వ్యవసాయ కార్యకలాపాలకే వినియోగిస్తోంది. ఈ సంస్థ మైనర్ ఫారెస్టు ఉత్పత్తులకు అదనపు విలువలు సమకూర్చే అంశంపై తమ దృష్టి మళ్లించింది. సరైన మార్కెట్ అనుసంధానం లేకపోవడం వల్ల ఎదురవుతున్న కష్టనష్టాలను తగ్గించడమే ఈ ఫౌండేషన్ లక్ష్యం. మధ్య దళాల ప్రమేయాన్నితొలగించడం మరో ఆశయం. ఆ విధంగా నిరుపేదలకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడడం ఫౌండేషన్ ఉద్దేశం. అందుకు వీలుగా అడవుల నుంచి సేకరించి తెచ్చిన ఉత్పత్తులు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా అవసరమైన అదనపు విలువలను సమకూర్చేందుకు ఇది కృషి చేస్తోంది. అదే సమయంలో అటవీ ఉత్పత్తుల సేకరణను వారికి ప్రయోజనకరమైన జీవనోపాధిగా తీర్చిదిద్దడం కోసం ఫౌండేషన్ వారికి తోడు నీడగా వ్యవహరిస్తున్నది. ఈ కార్యక్రమానికి నాబార్డు నుంచి, కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది.

2018 నుంచి వేర్వేరు సందర్భాలలో నిర్వహించిన క్షేత్రస్థాయి అధ్యయనాలు, శిక్షణ కార్యక్రమాలలో గిరిజనుల సమస్యలు, వారి ఇబ్బందులు పరిష్కరించేందుకు మార్గాలపై క్షుణ్ణంగా పరిశీలన జరిగింది. వాటిలో అదనపు విలవల కూర్పు, సేకరణ అంశాల విషయం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. శిక్షణ కార్యక్రమాలను వివిధ దశలలో నిర్వహించారు. ముందుగా మైనర్ అటవీ ఉత్పత్తులపై పూర్తి సమాచారం ఇచ్చి, వారికి అవగాహన కలిగించేందుకు కృషిచేశారు. తరువాత అదనపు విలువల కూర్పు (అభ్యాసం రూపంలో అధ్యయనం )పై వారి నైపుణ్యాలు పెంపొందించేందుకు కేటాయించారు. చివరిగా, ఉత్పత్తి, మార్కెటింగ్ అంశాలపై అవగాహన కలిగించారు.

వన మల్లిక పేరుతో ఒక స్వయంసహాయక గ్రూపును ముందుగా ఏర్పాటు చేశారు. అందులో ఆరుగురు మహిళలు కాగా నలుగురు పురుషులు ఉన్నారు. పోషక విలువలకు ఎలాంటి నష్టం లేకుండా అదనపు విలువలు సమకూర్చడం, సరుకు నిల్వ కోసం ప్రిడర్వేటివ్స్ వాడకాన్ని తగ్గించడం, నాణ్యతకు భద్రతగా కల్తీ అవసరాన్ని నివారించడం, ఆహార పదార్థాలను సరైన విధంగా ప్రాసెస్ చేయడం, అలాగే సీజనల్ వారీగా లభ్యమయ్యే వాటికి అదనపు విలువలు చేర్చడం, త్వరగా చెడిపోయే అవకాశం ఉన్న అటవీ ఉత్పత్తుల గురించి వారికి సమగ్రమైన శిక్షణ ఇచ్చారు. బోధనావళిలో కుటుంబ సభ్యుల పోషక ప్రాధాన్యతలు, సాధించగలిగే అదనపు ఆదాయాల గురించి వివరించేదుకు శ్రద్ధ తీసుకున్నారు. అయితే అత్యధిక ప్రాధాన్యతను మైనర్ ఫారెస్టు ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడం, అదనపు విలువలు చేర్చడానికి ఇచ్చారు. 

ఆహార పదార్ధాల శుద్ధి (ప్రాసెసింగ్), అదనపు విలువలు కూర్చడానికి వీలుగా ఒక యూనిట్ ఏర్పాటు చేశారు. దానిని పరిమిత వనరులున్న బడ్జెట్ ఆధారంగా సమకూర్చుకున్నారు విలువల కూర్పు అనేది అదనపు ఆదాయానికి మాత్రమే తోడ్పడుతుంది. అంతే కానీ స్వయంసహాయక గ్రూపులోని వారికి అదే జీవనోపాధిగా ఉపయోగపడదు. అయినా కూడా ఈ రకంగా ఆహార పదార్థాలను శుద్ధి చేసే ప్రక్రియను కూడా నిరంతరం కొనసాగుతూ సుస్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ఉపాధి మార్గంగా రూపొందించేందుకు కృషి జరుగుతోంది. ప్రస్తుతానికి ఇలా అదనపు విలువల కూర్పు విధానాన్ని బొప్పాయి, అల్లం, పనస (జాక్ ఫ్ర్రూట్), కాఫీ విషయంలో చురుగ్గా సాగుతోంది. ఈ విధంగా శుద్ధి యూనిట్ నిరంతరం పనిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ గ్రూపు ఆద్వర్యంలో అదనపు విలువతో మార్కెట్ కు చేరుతున్న ఉత్పత్తుల వివరాలను టేబుల్ 1 లో గమనించవచ్చు.

టేబుల్ 1 – వనమాలిక రైతు బృందం కృషితో అదనపు విలువ సమకూర్చకున్న ఎం ఎఫ్ పీ ఉత్పత్తులు

క్రమ సంఖ్య  ఎం ఎఫ్ పీలు  అదనపువిలువసాధించిన ఉత్పత్తులు
1 ఉసిరి ఉసిరి పచ్చడి, ఉసిరి తేనె, ఉసిరికాండీ, ఎండబెట్టిన ఉసిరి పండ్లు, ఉసిరి పౌడర్, వైద్య చికిత్సకు వీలుగా ఉసిరి గింజలు
2 తేనె శుద్ధి చేసిన తేనెలు (హీటింగ్, ఫిల్టరింగ్, డబుల్ బాయిల్ంగ్ మెథడ్స్)
3 పనసకాయ పనస కాయ పాయసం, జాక్ వరట్టి, జాక్ బిర్యానీ, జాక్ ఫ్రిట్టర్స్, జాక్ సమోసా, జాక్ సీడ్ పౌడర్
4 అల్లం ఎండబెట్టిన అల్లం, అల్లం పౌడరు, అల్లం కాఫీ
5 యామ్ (కంద, పెండలం వంటి దుంపలు) యామ్ మిక్చర్
6 కరివేపాకు కరివేపాకు పౌడరు, కరివేపాకు చింతపండు కలిపిన కారప్పొడి
7 మునగ మునగాకు పౌడరు

 

ఈ విధంగా వివిధ అంశాలలో శిక్షణ ఇవ్వడమే కాకుండా, మార్కెటింగ్ అనుసంధానం కూడా కూదిర్చేందుకు రిసోర్స్ పర్సన్స్ కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఇలా ఉత్పత్తులకు అదనపు విలువలను కూర్చడంలో పెద్ద ఎత్తున పనిచేస్తున్నపెద్ద పెద్ద సంస్థల సహకారాన్ని ఈ రైతు గ్రూపులకు చేకూర్చగలిగారు. ఈ సహకారం తోడు కావడంతో గిరిజనులు తమ ఉత్పత్తులకు తామే మార్కెటింగ్ ప్రయోజనాలు సాధించుకుంటున్నారు. ప్రస్తుతానికి రెండు రకాలుగా మార్కెట్ ప్రవేశానికి సన్నద్ధమవుతున్నారు. ముందుగా వారు నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకుంటున్నారు. రెండో మార్గం తోటి అమ్మకందారులు/సేంద్రీయ ఉత్పత్తుల విక్రేతల సాయం తీసుకుని విక్రయాలు చేయగలుగుతున్నారు.  వారి ప్రయత్నాలన్నీ తొలి దశలోనే ఉన్న కారణంగా, రానున్న కాలంలో మరింత సమర్థవంతంగా పనిచేసి విజయం సాధించగలరని భావిస్తున్నారు.

కనిపిస్తున్న ఫలితాలు

ఈ ప్రయత్నం ప్రారంభమే కాబట్టి, కుటుంబాల స్థాయిలో వాటి ప్రభావాన్ని అంచనా వేయడం కొంచెం కష్ఠమే. అయితే ఆనాటి అధ్యయనాలలోనే ఆరో రూట్ (పాలగుండ/బాణం దుంప)  పౌడరుకు చాలా గిరాకీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అందుకు ముఖ్య కారణం -మార్కెట్ లో లభించే ఈ పౌడరు నాణ్యత లేకపోవడంతో పాటు కల్తీ సరుకుగా మారింది.దీని విషయంలో ముఖ్యమైన సమస్య కూడా ఉంది. అది దానిని శుద్ధి చేసే (ప్రాసెసింగ్) యూనిట్ల కొరత చాలా ఎక్కువ. గిరాకీ ఎక్కువగాననే ఉన్నా అందుకు తగినంతగా ఉత్పత్తి కావడం లేదు. సంప్రదాయక విధానంలో శుద్ధి చేయడానికి చాలా సమయం వెచ్చించాలి. నాటు పాలగుండ దుంపలు అడవులలో సమృద్ధిగా లభిస్తుంటాయి. ఇలాంటి నాటు దుంపలకు ధర చాలా తక్కువగా లభిస్తుంది. ధర గిట్టుబాటు కాదు. అందుకే స్థానిక గిరిజనులు వటిపై అంత శ్రద్ధ చూపించరు. ఇప్పుడు యాంత్రిక పారిశుద్ధ్య యూనిిట్లు అందుబాటులోకి వచ్చాయి. దాంతో ప్రాసెస్ చేయడం తేలిక. మార్కెట్ లో అధిక ధరలకే అమ్ముకోవడం తేలిక. గత ఏడాదిలో 20 కిలోల ఆరో రూట్ శుద్ధి చేసిన తరువాత కిలోకు 1500 రుపాయల ధర పలికింది. మొత్తం మీద, గత ఏడాదిలో అదనపు విలువలు సమకూర్చిన అటవీ ఉత్పత్తుల విక్రయం ద్వారా లక్ష రుపాయలు ఆదాయం సంపాదించగలిగారు.

ఇలా అదనపు విలువ చేర్చిన తరువాత గిరిజన మహిళల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. అందుకు గ్రూపు ఏర్పాటులో మహిళలను కూడా భాగస్వాములను చేయడంతో వారి వారి సమాజంలో వారికి సామాజిక, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడానికి కారణమయింది. ఈ విధంగా చేపట్టిన ప్రోత్సాహకాలకు తోడుగా మైనర్ ఫారెస్టు ప్రోడక్ట్స్ కొనుగోలుకు కమ్యూనిటీ పరంగా ఆసక్తి పెరిగింది. అదే సమయంంలో ముడి అటవీ ఉత్పత్తులను, మరింత అదనపు విలవలను చేర్చడంలో వారిలో నైపుణ్యాలు మెరుగుపడ్డాయి. వారిలో ఆత్మగౌరవ భావన మరింత బలపడింది. అంతేకాక వారిలో తమకు విశ్వసనీయమైన సుస్థిరమైన జీవనోపాధి లభించిందని సంతృప్తి స్థిరపడింది. శిక్షణ కార్యక్రమాలు, వారి సామర్థ్యం పెంపు కార్యక్రమాల కారణంగా వారిలో నైపుణ్యాలు, సంబంధిత పరిజ్ఢానం పెరిగే కొద్దీ వారిలో ఆత్మవిశ్వాసం కూడా బలపడింది. వారికి సంపూర్ణ సాధికారికత లభించింది.

కోవిడ్ సమయంలో గిరిజన ప్రాంతాలలో కూలీల లభ్యత బాగా దెబ్బతిన్నది. అలాంటి పరిస్థితిలో వనమాలిక స్వయంసహాయక గ్రూపులోని రైతులు ఉత్పత్తిలోనే కాకుండా అదనపు విలువల చేర్పులో కూడా నైపుణ్యం సంపాదించుకున్న కారణంగా, వారికి అదనంగా రోజువారీగా చూస్తే మంచి సంపాదనే (రోజుకు రూ. 600) అందుకున్నారు.  పోషక సమృద్ధమైన న్యూట్రి-రిచ్ ఆహార ఉత్పత్తులను అదనపు విలువలతో సహా అందిస్తూ వాటి ప్రచారం కోసం ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఫలితంగా వినియోగదారులలో తమ ఉత్పత్తులపై మరింత ఆసక్తిని పెంపొందించగలుగుతున్నారు. వినియోగదారులు కూడా వనమాలిక గ్రూపు ఉత్పత్తులు అనగానే సురక్షితమైనవనే విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. అందుకు వాటి సేకరణ, శుద్ధి, సేంద్రీయ పద్ధతిలో ఉత్పత్తి, తమ ఇండ్లకు చేరువగానే జరుగుతుండడమే అందుకు ముఖ్యమైన కారణం. 

ప్రస్తుత సవాళ్లు – భవిష్యత్తు అంచనాలు

కోవిడ్ క్లిష్ట సమయంలో పదే పదే విధించిన ఆంక్షలు ఈ రకంగా అటవీ ఉత్పత్తులకు అదనపు విలువలను కూర్చడం అనే ప్రక్రియ ఇబ్బందుల్లో పడింది. అదనపు విలువలు చేర్చవలసిన ఉత్పత్తులన్నీ సీజన్ లపై ఆధారపడి ఉంటుంది. అలాంటి వాటిలో ముడి ఆరో రూట్, ఉసిరి, అడవి పుట్ట తేనె, అడవి మామిడి, పనస విత్తనాలు, మొదలైనవి కొన్ని సీజన్ లలో మాత్రమే లభిస్తాయి. ఇలాంటి ముడి సరుకు సహజసిద్ధంగా కొంత కాలానికి చెడిపోతాయి. వాటిని ఏడాది మొత్తం నిల్వ ఉంచుకోవాలంటే ఖరీదైన సాంకేతికత అవసరం. అంతేకాకుండా, అదనపు విలువలు అనేవి లాభదాయకం ఎప్పుడవుతుందంటే, ముడి సరుకు చేరువలో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. తేలికగా సేకరించే సదుపాయం ఉండాలి. అప్పుడే ప్రాసెసింగ్ యూనిట్ లాభదాయకంగా నిరవహించడం సాధ్యమవుతుంది.

వివిధ సందర్భాలలో అదనపు విలువలు చేర్చిన న్యూట్రీ-రిచ్ ఆహార ఉత్పత్తులను ప్రదర్శించినప్పుడే వినియోగదారులలో వాటి పట్ల సరైన అవగాహన కలిగించడం సుసాధ్యమవుతుంది. 

ఇవి కాకుండా, నిల్వ సదుపాయాల కొరత, వినియోగదారులను ఆకట్టుకునే స్థాయిలో ప్యాకేజింగ్ లో నాణ్యత లేకపోవడం, వాణిజ్య స్థాయిలో ప్రకటనలు ఇచ్చే స్థోమత లేకపోవడం, ఇతరత్రా మార్కెటింగ్ సాధనాలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు కూడా నిలకడైన మార్కెట్ సాధించడం సమస్యాత్మకంగా మార్చివేస్తున్నాయి. పైగా పదే పదే కోవిడ్ పేరుతో విధిస్తున్న రకరకాల ఆంక్షలు సరఫరా ప్రక్రియకు పెద్ద సమస్యగా మారినాయి. ఈ సమస్యకు పరిష్కారం ప్రస్తుత వాతావరణంలో ఊహించడం కూడా కష్టమే.

గిరిజన తెగల ప్రజలు అడవులకు వెళ్లి అవసరమైన ఉత్పత్తుల సాగును, సేకరణను నిరంతరం కొనసాగించకపోవడం వల్ల అవి తగినంతగా లభ్యం కావడంలేదు. సంప్రదాయికంగా ఆదివాసీలు సమాజానికి దూరంగా జీవనం సాగిస్తున్న వారే. అందువల్ల వారికి తగినన్ని నైపుణ్యాలు సమకూర్చుకోవడం సాధ్యం కాలేదు. అవసరమైన నిపుణులను నియమించుకునే స్థోమత కూడా వారికి లేకపోయింది. ఉత్పత్తి, మార్కెటింగ్ వ్యవహారాలను ప్రతిభవవంతంగా నిర్వహించుకోలేరు, అందువల్ల ప్రారంభంలో వారికి అవసరమైన చేయూత తప్పనిసరి, దానికి అట్టడుగు వర్గాలకు చేయూత ఇవ్వడమే లక్ష్యంగా పనిచేసే సంస్థల భాగస్వామ్యం అన్నింటికన్నా చాలా ముఖ్యం. అలా సరైన చేయూత లభిస్తేనే ఆదివాసీ ప్రజల జీవనోపాధులు మెరుగవుతాయి. ప్రగతి మార్గంలో ముందుకు వెళ్లగలుగుతారు.

ధన్యవాదాలు

క్షేత్రస్థాయి ప్రక్రియలలో తమ వంతు సాయం అందించి, ఈ ప్రాజెక్టు విజయవంతం చేసి, భవిష్యత్తుపై ఆశావహ దృక్పథ కలిగిస్తున్న మహిళలు బుషారా, బిందు జోసెఫ్, పద్మిని శివదాస్, శ్రీ నౌషిక్ లకు ప్రత్యేకంగా రచయితలు ధన్యవాదాలను సమర్పిస్తున్నారు. 

అర్చ నా భట్
సైం టిస్టు , కమ్యూ నిటీ అగ్రో -బయో డైవర్శి టీ సెం టర్
ఎం ఎస్ఎస్ఆర్ఎఫ్, వయనా డ్, కేరళ
E-mail: archanabhatt1991@gmail.com

విపిన్ దా స్
డెవలప్ మెం ట్ అసో సియేట్
కమ్యూ నిటీ అగ్రో-బయో డైవర్సి టీ సెం టర్
ఎం ఎస్ఎస్ఆర్ఎఫ్, వయనా డ్, కేరళ

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా, సంపుటి ౨౩, సంచిక 2, జూన్ ౨౦౨౧

Recent Posts

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వర్టికల్ గార్డెనింగ్‌లో వినూత్న మార్గాలను సృష్టించడం

వినూత్న నిర్మాణాలు, రీసైక్లింగ్ మరియు పునర్వినియోగం యొక్క లోతైన భావాన్ని ప్రేరేపించడం ఈ రైతు-ఆవిష్కర్తను అనేక మంది...