మట్టి మాట్లాడితే ….

మీ అందరికీ నేను బాగా పరిచయమే. ప్రతి రోజూ నన్ను పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకూ, నిత్యం చూస్తూనే ఉంటారు. అయినా చాలా మందికి నా గురించి ఏమీ తెలియదు. ఎంతో మంది నన్నో జీవం లేని పదార్థం అనుకుంటారు. వారు నన్ను సరిగా అర్థం చేసుకోనేలేదు. నిర్జీవ పదార్థంగా నన్ను పరిగణించడమే కాదు, ఇతరులను చీదరించుకునే సమయంలో నా పేరెత్తి ఛీ అంటారు. ఉదాహరణ చెప్పాలంటే నీకేం తెలుసు మట్టి ముద్ద అంటుంటారు. ఇష్టం వచ్చినట్టు కాలితో తన్నుతుంటారు. గుంతలుగా తవ్వి పారేస్తారు. ముక్కలు చేసేస్తారు. నా గుండెలు పగులకొడతారు. పిండి చేస్తారు. కాల్చివేస్తుంటారు. నీళ్లలో ముంచి ముద్ద చేస్తారు. ఇటుకలు తయారు చేసుకుంటారు. పదులు, వందలు సంవత్సరాల పాటు ఒక చోట కట్టి పడేస్తారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు వారి దృష్టిలో నేనో జడ పదార్థాన్ని. వాళ్లెంతగా హింసించినా నాకు చావు లేదు. నేను బతికే ఉంటాను. శాశ్వతంగా నిలిచే ఉంటాను. ఆశ్చర్యంగా ఉందా ? నన్ను ఇలా నిత్య చిరంజీవిగా మార్చివేసే మిత్రులు, బంధువులూ ఎవరా అనుకుంటున్నారా ? దశాబ్దాలు గడిచినా, శతాబ్దాలు  సాగినా నన్ను సజీవంగా బతికి ఉంచే వాళ్ల గురించి తెలుసుకోవలానుందా ? వాళ్లని గురించి మీకు కూడా పరిచయం చేయనా ?

నా గురించి బాగా తెలిసిన వాళ్లు – సూర్యచంద్రులు, గాలి, నీరు, పచ్చని ఆకులు, పచ్చని వాతావరణం అంతటా కనిపించే చెట్టూ చేమ, మొక్కా, గడ్డీ, సకల జీవకోటి. (అంతే కాదు, మానవాళి కూడా) ప్రకృతిలో కనిపించే సకల జీవాలు నిస్వార్థంగా జీవనం సాగిస్తాయి. ఒక మానవ జాతికి మాత్రమే అంతులేని స్వార్థం నిలువెల్లా పేరుకుపోయుంటుంది.  మిగిలిన జీవజాలం నాకు అవసరమైన ప్రతీ పదార్థాన్ని ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నాకు అందజేస్తాయి. తెలిసి కానీ తెలియక కానీ మానవుడు తన చుట్టూ ఉన్న పచ్చని పర్యావరణాన్ని సర్వ నాశనం చేస్తున్నాడు. దాని ఫలితాలు నా శ్రేయోభాలాషుల మీద కూడా పడుతుంది. నా మనుగడే సమస్యగా మారిపోతుంది. నా పురోగతికి అడ్డంకులు ఏర్పడతాయి. నా మిత్రుల పురోగమనానికి, వాటి సంఖ్య ఎదుగుదలకు ఆటంకాలు ఎదురవుతాయి. నేను నిస్సారంగా మిగిలిపోతాను. నాతో పాటు ఇన్ని సమస్యలకు కారణమైన మనిషి కూడా నిరుపేదగా మారిపోతాడు. జంతు సంతతి సర్వమూ కోల్పోతుంది. ఇచ్చిపుచ్చుకోవడం ఈ ప్రకృతిలోని సకల జీవ రాశిలోనూ నిరంతరం కనిపించే ఉత్తమ లక్షణం. ఇలాంటి సహజసిద్ధమైన పరస్పర సహకారం భావంతో కలిసిమెలసి జీవించినప్పుడే ఒకరి అవసరాలను మరొకరు నెరవేర్చగలుగుతారు. ఇది ఈ రోజు కొత్తగా వచ్చిన పరిణామం కాదు. భూగోళం మీద ప్రాణులు అవతరించిన నాటి నుంచి ఒకరి ప్రయోజనాలకు మరొకరు రక్షగా నిలుస్తున్నారు. ఈ మహోత్తమ ఉదారతత్వాన్ని నిత్యం ఉల్లంఘించే జీవి మనిషి మాత్రమే. ఒక్క మాటలో, అది కూడా స్పష్టంగా చెప్పాలంటే మానవాళి నుంచి ఎదురయ్యే అన్ని రకాలైన బాధలకు, వేదనలకు ఇతర జీవకోటి నుంచే నాకు ఊరట కలుగుతుంది.ఉపశమనం లభిస్తుంది. ప్రశాంతత ఏర్పడుతుంది. నా మిత్రుల గురించి కూడా చెప్పాలని ఉంది. అయితే ఆ విషయాలు కూడా తెలుసుకుందాం.

సూర్యుడు

నా స్వరూపం, మనుగడ, పురోగతి, అనువైన వాతావరణం పూర్తిగా సూర్య కాంతిపైనే ఆధారపడి ఉన్నాయి. నాతో పాటు నాపైనే ఆధారపడిన ఇతర జీవరాశి మొత్తానికి, వాటి పెరుగుదలకు, మనుగడకు సూర్యరశ్మి అత్యవసరం. అసంఖ్యాకమైన జీవులన్నిటికీ ప్రయోజనం కలిగించే ఉపయోగపడే శీతోష్ణస్థితులు ఏర్పడేందుకు సూర్య కిరణాలు తోడ్పడతాయి. కాంతినిస్తాయి. మార్గం చూపిస్తాయి. నాకన్నా ముందుగానే ఆవిర్భవించిన సూర్యుడికి తన కాంతులతో చీకటి రేఖలను తొలగించడంలో సూర్యుడి పాత్ర చాలా ముఖ్యమైనది. నిజానికి చేతులెత్తి మొక్కవలసినదీ సూర్యుడికే. నిత్యం పగటి వెలుగులు ఉన్నా జీవకోటికి కష్టమే. అదే విధంగా నిరంతరం చీకటి రాత్రులు ఉన్నా కష్టమే. ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న సూర్యుడు ఏ జీవికీ ఇబ్బంది కలగకుండా ఎలాంటి ప్రమాదం ఎదురుకాకుండా - రాత్రింబగళ్లు రూపంలో సగం కాలం తన కాంతులను ప్రసరింపజేస్తూ సగం కాలం దూరంగా జరిగిపోయినట్టుగా కనుమరుగవుతాడు. మళ్లీ సకాలంలో దర్శనం ఇస్తాడు. ఇలా ఖచ్చితంగా సకాలంలో ఉదయించడం, అస్తమించడం అన్న కార్యక్రమాలు యాంత్రికంగా మారిపోయి ఆయనకు విసుగు పుట్టించవా అనే ప్రశ్న రాకమానదు. అప్పుడప్పుడు మేఘాల చాటుకు వెళతాడు. అప్పుడప్పుడు తనకూ, నాకు మధ్య చంద్రుడు వచ్చేలా చూసుకుంటాడు. ఆ క్రమంలో గ్రహణకాలం వస్తుంది. అదో అద్భుతం. చూసేందుకు రెండు కళ్లు చాలవు. సువిశాలమైన ఈ భూగోళంపై ఒక్కో సమయంలో ఒక్కో రకంగా ఈ గ్రహణ సన్నివేశం కనువిందు చేస్తుంది. మనలోని వేదనలను తొలగించేస్తుంది. ఇక శాస్త్రవేత్తలకు చేతి నిండా పని కల్పిస్తుంది. వాళ్లు ఆయన ప్రతీ కదలికపైనా అధ్యయనాలను నిరంతరం చేస్తూనే ఉంటారు. వారి మనసులో అంతులేని ఆలోచనలకు సూర్యుడే కేంద్ర బిందువు. సమజాభివృద్ధికి తన వంతు చేయూతనిస్తాడు. సూర్య ప్రతాపం కారణంగానే సముద్ర జలాలలను సాధనంగా చేసుకుని మేఘాలను సృష్టిస్తాడు. అందులోకి నీటిని ఆవిరి రూపంలో చేరుస్తాడు. తిరిగి సకాలంలో ఈ నేలపైకి వర్షం రూపంలో అందిస్తాడు. భూసారాన్ని కాపాడుతూ ఉంటాడు. ప్రాణికోటి మనుగడకు అండగా నిలుస్తాడు. సూర్యుడి మరో ప్రత్యేకత ఏమిటంటే తన మిత్రుడైన చంద్రుడితో కలిసి చీకటి పడిన సమయంలో సూర్య రశ్మికి సాటికాకపోయినా చిరుకాంతి అందిస్తాడు. ఆ విధంగా గాఢమైన చీకటిలో ప్రయాణాలు చేసేవారికి దిక్సూచిగా సహకరిస్తాడు. నూతన దంపతులకు ఆశావహజీవితం అందిస్తాడు. ఆ రకంగా ఎప్పుడూ చీకటి రాత్రులు ఉండవని మనకు చెప్పకనే చెబుతున్నాడు. చంద్ర కాంతులు మనకు ఎంతో ఆహ్లాదానిస్తాయి. హాయినిస్తాయి. అందుకు కూడా సూర్యగమనమే ప్రధానమైన ప్రేరకశక్తి. అంతేకాదు. చంద్ర కాంతి అయినా సరే ఏకరూపంలో ఎప్పుడూ ఉంటే అంతటి ఆనందానుభూతిని అందించదు. దానికంటూ ఏ విశేషమూ ఉండదు. అందుకే మధ్యలో మేఘాల తెరలను కప్పుతూ ఉంటాడు. మబ్బుల చాటున చంద్రుడి కోసం మనం ఎదురుచూడవలసిన ఆహ్లాదకరమైన సన్నివేశం ఎదురవుతుంది.

చంద్రుడు – నక్షత్రాలు

నా మంచి చెడులు చూసే మరో నేస్తం - చంద్రుడి గురించి ఇప్పటికే కొంత చెప్పాను కదా ! ఒక్కరుగా సాధించలేని కార్యాలను కూడా సమష్టిగా పరస్పర సహకారంతో సాధించవచ్చుననే జీవన సూత్రాన్ని సూర్య-చంద్రులు మనకి ఆచరించి చూపిస్తున్నారు కదూ ?

అద్భుతమైన తమ కాంతి కిరణాలతో ఈ రెండు నక్షత్రాలు చూసేవాళ్ల కళ్లకి అంతులేని ఆనందం అందిస్తాయి. మనసుకు ఆహ్లాదం ఇస్తాయి. కొన్ని సమయాలలో అవి మన పైనే వచ్చి మీదపడబోతున్నాయనే భయాందోళనలకు కూడా అవి కారణవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో మానవాళి అంతమైపోతుందేమోనన్నంత విధ్వంసం, ఆస్తులకు తీరని నష్టం కలిగించేస్తాయి - అంతటి భయోత్పాతం కలిగించినా అంతలోనే అంతర్ధానమవుతాయి. వాటి అద్భుతాలను కనులారా చూసేందుకు మనం పైసా ఖర్చు పెట్టనక్కరలేదు. ఎలాంటి టికెట్టూ తీసుకోవలసిన అవసరం లేదు. ఎప్పుడూ ఈ నక్షత్రాలు అలా కంటికి ఆనందం కలిగిస్తే వాటికి ఎలాంటి విలువా ఉండదు కదా ?  అవునా ? అందుకనే ... అప్పుడప్పుడు అని మబ్బుల చాటున దాక్కుంటాయి. ఆ సమయంలో చుక్కలు అన్నీ మాయమైపోయాయనే అనిపిస్తుంది. కోటానుకోట్ల సంఖ్యలో ఉన్నప్పటికీ అవి ఒక దానితో మరొకటి దెబ్బలాడుకోవు. మన చుట్టూ ఉండే రాజకీయ నేతల్లా కప్పల తక్కెడలా ఒకరి స్థలంలోకి మరొకటి గెంతులు వేయవు. నక్షత్రాలు ఎప్పుడు తమకు నాయకుడిగా కదలకుండా నిలిచి ఉన్నట్లు కనిపించే ధ్రవ నక్షత్రం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఆ రకంగా ఈ నేల మీద ఉండే మానవాళికి దిక్కులను గుర్తించేందుకు సహాయపడతాయి.

గాలి

అన్ని జీవాలకు ప్రాణాధారం గాలే అని అందరికీ తెలుసు కదా! గాలి ప్రభావం కారణంగానే అవసరమైనవీ, అవసరం లేనివీ – అంచే చెత్త, చెదారం, దుమ్మూ, ధూళీ - ఎక్కడికక్కడ పేరుకుపోకుండా వాటి దుష్ప్రభావం కారణంగా జీవజాలానికి ఎలాంటి హాని జరగకుండా రక్షణ లభిస్తోంది.  గాలి వీచడం ద్వారా మాత్రమే మన చుట్టూ ఉష్ణోగ్రతలు సమతుల్య స్థితిలోనే ఉంటాయి. వాతావరణం అలా సమతుల్య స్థితిలో ఉంటేనే ఏ ప్రాణి అయినా ఒక చోట నుంచి మరో చోటికి సురక్షితంగా వెళ్లగలుగుతోంది. అన్ని ప్రాణులకూ గాలి పీలిస్తేనే ప్రాణం నిలుస్తుంది. ఈ శ్వాస క్రియనే సజీవంగా ఉన్నట్లు సూచిస్తుంది. పుప్పొడి పరాగమం వాయువు వల్లనే సాధ్యమవుతుంది. విత్తులను ఒక చోటి నుంచి మరో చోటికి వ్యాపిస్తూ ఉంటాయి. వాతావరణంలో నీటి తేమ పరిమిత స్థాయిలో ఉంటుంది. పర్యావరణం కలుషితం కాకుండా పరిశుభ్రంగా ఉంటుంది. నిరంతరం ఒక చోట నిలవకుండా కదులుతూనే ఉండే గాలి మనకు చెబుతున్న గుణపాఠం ఏమిటో తెలుసా ? – మానవాళి నిత్య చైతన్యంతో క్రియాశీలంగా ఉండాలి.

నీరు

నీరు నాకు చాలా మంచి నేస్తం. అది లేకపోతే నేనే కాదు ఏ ప్రాణి సజీవంగా ఉండలేదు. నిర్జీవంగా మిగిలిపోవలసిందే. నేను కూడా ఎండిపోయి, బీడుగా మారిపోతాను. నాకు చాలా దగ్గరగానే గంగ ముందుకు సాగుతుంది. ఎక్కడెక్కడి నీటిని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లి అది చిన్న కాల్వలుగా, సెలయేళ్లుగా, నదులుగా, సముద్రాలుగా, మహా సముద్రాలుగా మార్చడంలో నా వంతు సాయం నేను అందిస్తాను. నీటి బిందువులు తగిలితే చాలు. మృదువుగా మారిపోతాను. ఏ రూపంలో మారిస్తే ఆ రూపంలోకి మారిపోతాను. అలా మృదువుగా మెత్తటి ముద్దలా ఉన్న సమయంలోనే మీకు ఏ దేవత రూపం కావాలంటే ఆ రూపంలో మీ ముందు నిలుస్తాను. అంతేకాదు, మీరు నాగలిపట్టి నా గుండెలు చీల్చి విత్తు చల్లి పంట పండించాలనుకున్నప్పుడు నాకు ఎంత బాధ కలిగినా సహిస్తాను. పంట చేలు పచ్చగా కళకళలాడేందుకు కారణమవుతాను. అలా పంటలు పండాలంటే నీరు నాకు చాలా అవసరం. ఇన్ని విధాలుగా మీకు ఉపయోగపడే నీటిని వేడి వేడి మంటల్లో వేడిచేసి ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంటారు కదా మీరు. నీళ్లు ఇంటికి తీసుకెళ్లాలన్నా, నిల్వ చేసుకోవలన్నా కుండలు కావాలి కదా. కుండలు చేయడానికి కుమ్మరికి నేను అవసరమే. నాతో పాటునీరూ అవసరమే. మేం ఇద్దరం లేకపోతే మీరు నీరు ఎలా దాచుకోలరు ?

ఒక నిజం చెప్పనా ? గడ్డీ, మొక్క, చెట్టూ, చేమ, చిన్న చిన్న పురుగులూ, పశువులూ, పక్షులూ, జంతువులూ, చివరికి మనుషులు కూడా నా బిడ్డల్లాంటి వాళ్లే. నాకు ఏ తేడా ఉండదు. అయితే నాకు ఇంత మంది బిడ్డలున్నా, మనిషికి ఉన్నంత స్వార్థం మరే ఒక్కరిలోనూ లేదు. అయినా అందరినీ నేను సమానంగానే చూస్తాను. వాళ్లకి కావలసిన ప్రతి అవసరం గుర్తించి ముందే సిద్ధం చేసి అందిస్తాను. ఒక్క క్షణం కూడా నా బిడ్డల యోగక్షేమాలను నేను మరువను. కానీ దురాశతో స్వార్థం ఎక్కువైపోయి కొంత మంది ఇతరుల వాటాను కూడా తామే లాగేసుకుంటూ ఉంటారు. వాళ్లలోని ఆ స్వార్థ బుద్ధి చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. వాళ్లు మిగిలిన సోదర జీవకోటికి దక్కవలసిన దానిని దక్కకుండా చేయాలని చూస్తారు. అందుకోసం దాచేసుకుంటూ ఉంటారు. అమాయకంగా నోరు లేని నా మిగిలిన బిడ్డల్ని నానా విధాలుగానూ బాధిస్తారు. మిగిలిన జీవకోటి యావత్తూ నా పైనే ఆధారపడి జీవించేందుకు సిద్ధంగా ఉంటాయి. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి. నన్ను ప్రేమతో కాపాడుకుంటాయి. మనిషి ఒక్కడే మరెవ్వరికీ ఏ మాత్రం సహకరించడు. నాలో లోలోపల భూగర్భంలో భద్రంగా కాపాడుతూ వచ్చిన నీటి జాడలు పుష్కలంగా ఉండాలి. అలా నీటి వనరులను నేను కాపాడకపోతే ఈ బిడ్డలందరికీ ఏమీ దక్కదు. ఎందుకంటే నేను పచ్చగా కళకళలాడాలి అంటే నీరు చాలా అవసరం. నీరు లేకపోతే నేను సుభిక్షంగా నిలబడలేను. నేను సుభిక్షంగా లేకపోతే ఎవరికీ ఏమీ ఉండదు. ఏ జీవి బతికి బట్టకట్టలేదు. దురదృష్టం. నీటి వనరులను నాలో నాకు కూడా అందనంత అట్టడుగుకు నెట్టివేస్తున్నారు. అలాంటి నా ప్రియమైన నేస్తాన్ని నాకు కూడా అందనంత దూరం చేసేస్తున్నారు. దాని నీడ కూడా కనిపించటంలేదు. అట్టడుగుగు నెట్టేస్తున్నారు. దానికి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోతోంది. శాస్త్రీయ పద్ధతులను అనుసరించి తెలివితేటలను ఉపయోగించి నీటి మట్టాలను పైకి అందించే స్థాయికి తీసుకువస్తే జీవులందరూ సుఖమయంగా మనుగడ సాగించగలుగుతారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.

దర్భ గడ్డి

నన్ను ఆధారం చేసుకుని ఎన్నో మొక్కలు, చెట్లు, పచ్చటి మైదానాలు పెరుగుతున్నాయి. అవన్నీ నాకు పెట్టని కోటలా నిలుస్తాయి. వాటి పేర్లు అన్నీ చెప్పాలంటే చాలా పెద్ద చిట్టా అవుతుంది. కానీ – ఒక్కదాని గురించి చెప్పుకోవాలి. దానిని దర్భ గడ్డి అంటారు. దీనినే హరియాలీ అని కూడా అంటారు. ఈ గడ్డి నాకు పెద్ద కవచంలా నిలిచి కాపాడుతుంది. ముఖ్యంగా వర్షాలు ముమ్మరంగా కురుస్తున్న సమయంలో నేను ఆ నీటి వేగానికి కొట్టుకుపోయే ప్రమాదం చాలా ఎక్కువ. ఈ గడ్డి రెమ్మలు నాకు అలాంటి ముప్పు రాకుండా రక్షణ ఇస్తాయి. మట్టి రూపంలో ఉన్న నాకు గుండెకోత లేకుండా కాపాడతాయి. ఇంత ప్రాధాన్యత ఉన్న గడ్డి పేరు చెబితే చాలా మందికి అర్థమే కాదు. పర్యావరణాన్ని, భూసారాన్ని కాపాడడంలో గడ్డికి ఉన్న విశేష ప్రయోజనాలను వారు గుర్తించటం లేదు. పట్టణ ప్రాంతాలలో రోడ్లకు పక్కగా పెరుగుతున్న గడ్డి మొలకలను నిర్దాక్షిణ్యంగా పీకిపారేస్తుంటారు. అలా చేయటం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని వారు అనుకుంటారు. నిజానికి అలా చేయటం వల్ల చాలా హాని జరుగుతుంది.  వర్షపు నీటి కారణంగా నేను అడ్డంగా, నిలువుగా కోతకు గురవుతాను. గాలి గట్టిగా వేస్తే నేను ఎక్కడికో కొట్టుకుపోతాను. అది నాకున్న మంచి లక్షణం – మరిన్ని మొక్కలు లేదా పంట పెరగేందుకు నాలో ఉండే సారవంతమైన శక్తిని కోల్పోతాను. ఇది చాలా అశాస్త్రీయమైన పద్ధతి. మనుషుల్లో సరైన అవగాహన లేకపోవటం వల్లనే ఇలాటి దురాలోచనలు వస్తున్నాయి. ఏ కారణం వల్లనైనా ఇతర మొక్కలను లేదా చెట్లను తీసేయవలసి వస్తే అది వేరే సంగతి. ఎట్టి పరిస్థితులలోనూ గడ్డిని మాత్రం అలా పీకేయకూడదు. ఈ వాస్తవాన్ని ఇప్పటికైనా మనిషి తెలుసుకుంటే చాలా మంచిది. అలా గడ్డిని కాపాడినప్పుడే నేను సురక్షితంగా మనుగడ సాగించగలుగుతాను. అన్ని జీవాలకు అండగా నిలుస్తాను. పచ్చటి గడ్డి మైదానాలు నిజానికి చూసే వాళ్ల కళ్లకి చాలా ఆనందం, ఆహ్లాదం కలిగిస్తాయి కదా! అంతేకాదు, మనుషులకు లేదా ఇతర జీవాలకు ఆరోగ్యం అందించే ఎన్నో ఔషధ గుణాలు ఈ గడ్డిలో ఉన్నాయి. వాళ్లు చేసే ఎన్నో రకాల పూజల్లోనూ, ప్రార్థనల్లోనూ గడ్డికి విశేషమైన ప్రాధాన్యం ఉంది కదా? ఈ వాస్తవాలను తెలుసుకుని ప్రతి ఒక్కరూ పరస్పరం సహకరించుకుంటూ సహజీవనం చేసేందుకు సిద్ధపడితే నాకూ, గడ్డికి, అందరికీ ఎంతో మేలు జరుగుతుంది.

ఆకులు-అలములు-పచ్చటి ఎరువు

నాకు నిత్యం సహాయకారిగా ఉండే మరో నేస్తం ఈ భౌతిక జీవ వ్యర్థ పదార్థాలు. ఇవి నన్ను నిత్యం సారవంతంగా కాపాడేందుకు తోడ్పడుతూ ఉంటాయి. వీటి ప్రాధాన్యత చాలా కొద్ది మందికే తెలుసు. విలువ తెలియని వాళ్లు చాలా నష్టపోతారు. ఈ మిత్రుడిని కాపాడటం చాలా సులువు. దీనిని మనం తీసి అవతల పారేయకుండా ఉంటే చాలు. వాటి చాటున ఎన్నో సూక్ష్మజీవాలు వృద్ధి చెందుతాయి. వాటి కదలికలు నన్ను సుభిక్షంగా నిలబెడతాయి.

నా బిడ్డల గురించి ...

నా బిడ్డలందరి మీద నాకు సమానమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. అవి ఎన్నో రకాలు . ఒక దానికి మరో దానికి పోలిక ఉండదు. అంత విభిన్నంగా ఉంటాయి. సూక్ష్మక్రిములు మామూలు కళ్లతో చూడటం సాధ్యకాదు. ఎందుకంటే అవి అంత చిన్నవిగా ఉంటాయి. వీటిని వైరస్ అని కూడా వ్యవహరిస్తారు. మరి కొన్ని ఉన్నాయి. అవి చాలా పెద్దవిగా ఉంటాయి. అలాంటి వాటికి మంచి ఉదాహరణ ఏనుగులే. ఈ రెండు విభిన్నమైన జీవకోటికి మధ్య ఉన్న ప్రాణకోటి కోట్లాదిగా ఉన్నాయి. వాటిలో కొన్ని హానికరమైనవి. మరికొన్ని హితవు చేసేవి. హానికరమైన వాటిలో కొన్ని ప్రాణులు ఉన్నాయి. వాటిలో అన్నిటికన్నా ప్రమాదకరమైన జీవి – మనుషులే. మనిషిలా ప్రమాదకరమైన జీవాల్లో లాంటానా, ప్రాసోఫిస్, ఉపటోరియా, అజరాటస్ వంటివి చాలా ఏళ్లుగా మన మధ్యనే జీవిస్తున్నాయి. అయిదు దశాబ్దాల క్రితం వీటిలో చాలా హానికరమైన పార్థీనియం అనే విషపు మొక్క లాటిన్ అమెరికా నుంచి మన దేశంలోకి ప్రవేశించాయి. దీనిని చాలా ప్రాణాంతకమైన గడ్డి మొక్కల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఒకే ఒక్క మొక్క నుంచి దాదాపు 15000 విషపు విత్తులు వెలువడుతాయి. ఇది పెరిగిన చోట మరే మొక్కా బతికడం సాధ్యంకాదు. ఇందులోనుంచి వెలుపలికి వచ్చే విష ద్రవం నాలోకి ప్రవేశపెట్టి దానిని విషతుల్యంగా మార్చివేస్తుంది. మనుషులు లేదా పశువులు దీనిని తాకినా చాలు తీవ్ర అస్వస్థతకు గురవుతాయి. చాలా వ్యాధులకు కారణమవుతుంది. ఈ ప్రమాదకరమైన మొక్కల నుంచి ఎదురయ్యే హానికి విరుగుడు కూడా నా బిడ్డల్లోనే లభిస్తుంది. అయితే మనిషికి మాత్రం ఈ విషయం తెలియడం లేదు. అలాంటి విరుగుడు మొక్కలను అజ్ఞానంతో పీకిపారేస్తున్నాడు. ఆ రకంగా పర్యావరణానికి మేలు కలిగించే వాటినే అక్కరలేనివి అనే భ్రమతో పీకిపారేస్తున్నాడు. ఆ రకంగా అందరికీ ప్రమాదం కలిగించే పార్థీనియం వంటి మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతున్నాడు. ప్రతి మాతృమూర్తిలాగే నేను కూడా నా బిడ్డలందరూ క్షేమంగా ఉండాలని, కలకాలం నిలిచి ఉండాలని కోరుకుంటాను.

ఇక నా ఆరోగ్యం

జీవం ఉన్న నాకు ఇతర జీవకోటికి మల్లే అనారోగ్య సమస్యలు రావటం సహజమే కదా! రసాయనాలను అధిక మోతాదులో వాడడం నా ఆరోగ్యాన్ని చాలా దెబ్బతీస్తుంది. ఇటీవల మానవుడిలో స్వార్థ బుద్ధి పెరిగిపోయింది. తన అంతు లేని కోర్కెలను తీర్చుకునేందుకు శాస్త్రం పేరుతో రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. ఫలితంగా నా పరిస్థితి చాలా ఆందోళనకరంగా తయారైంది. సరైన పోషకాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. నాకు సుస్తీ చేస్తోంది. ఈ మధ్య మరో దురాగతం విచ్చలవిడిగా సాగుతోంది. నా పరిస్థితిని అధ్యయనం చేస్తారట. ఆ రకంగా నా ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారట. ఆ పేరుతో ప్రయోగశాలల్లో నన్ను రకరకాలైన పరీక్షలకు గురిచేస్తున్నారు. కొంతవరకు ఇది నాకు తృప్తి కలిగిస్తోంది. నాకు ఎదురవుతున్న లోపాలను గుర్తించగలిగితే, వాటిని తిరిగి సమకూర్చగలిగితే ... అంతకన్నా కావలసింది ఏముంటుంది ?  ఈ విధంగా నా అనారోగ్యానికి కారణాలను తెలుసుకునే నైపుణ్యం ఉన్న వాళ్ల సంఖ్య చాలా తకుకవగానే ఉంది. నా ఆరోగ్యం బాగుండాలంటే కనీసం 16 రకాలైన పోషకాలు చాలా అవసరం. నా బిడ్డలకు ఒకొక్కరికి ఒక్కో రకమైన పోషకాలు అవసరం. వాటిని అందించగలగాలంటే నా దగ్గర అవి సమృద్ధిగా ఉండాలి కదా? అందుకు శాస్త్రీయ పద్ధతుల్లో నాకు అవసరమైన పోషకాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలి. అలాంటివాటిలో ఆకు పచ్చని ఆకులు, అలములతో తయారు చేసిన ఎరువు చాలా మేలు చేస్తుంది. నా ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ... ఎవ్వరూ ఏమీ ఎక్కువ కష్టపడనవసరంలేదు. నా బిడ్డల ఎదుగుదలను చూసి ఎవరైనా చెప్పేయగలుగుతారు. నా రంగు చూస్తే చాలు. తెలిసిపోతుంది. నా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బడిముబ్బడిగా ప్రతిఫలాన్ని అందిస్తాను. లాభసాటి అయిన పంట దిగుబడులు అందిస్తాను. నాలో పెరుగుతున్న లోపాలను నిర్ణయించేందుకు తోడ్పడుతున్న ప్రయోగశాలల కృషిని గుర్తించి కృషి విజ్ఞాన్ కేంద్రాలు, కృషి విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ వ్యవసాయ శాఖల నీడలో మానవులు నడిస్తే నా ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. నా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునే వాళ్లకి, కాపాడే ప్రయత్నం చేసే వాళ్లకి, అందుకు అండగా నిలిచే మీడియా రంగానికి నేను కృతజ్ఞురాలనై ఉంటాను.

ఒక విజ్ఞప్తి

నా అభర్థన చాలా మందికి అర్థం కాకపోవచ్చు. నా గురించి సరైన అవగాహన కలిగించే పుస్తకాలేవీ అందుబాటులో లేవు. ఇక మీడియా నన్ను పూర్తిగా విస్మరించింది. పిల్లలూ, పెద్దలూ కూడా సినీ తారలు, క్రికెట్ ఆటగాళ్ల గురించి ఎన్ని విషయాలైనా తెలుసుకుంటారు. నాగురించి తెలుసుకునేందుకు ఏ మాత్రం ఆసక్తి ఉండదు. ప్రయత్నం ఉండదు. ఈ దేశంలోని విద్యా సంబంధ పాఠ్య పుస్తకాలలో కూడా కొంచం కూడా సమాచారం ఉండదు. పాఠ్య ప్రణాళికలలో, ప్రాథమిక పాఠశాలలు కానీ, సెకండరీ స్థాయిలో కానీ, నా గురించి లేదా నా మిత్రులు – పర్యావరణం, మిగిలిన నా బిడ్డల గురించి - తెలియచెప్పే అంశాలు ఏమీ ఉండవు.  ఇది నాకు చాలా బాధ కలిగిస్తోంది. పాలకుల నిర్లక్ష్యం నాకు వేదననే మిగులుస్తోంది. ప్రతి ఒక్కరూ నా గురించి తెలుసుకుని నన్ను కాపాడేందుకు ప్రయత్నించినప్పుడే ఈ దేశంలో సుభిక్షం, సుఖశాంతులు, మంచి రోజులూ కలుగుతాయి.

ప్రొఫెసర్ ఎం. మహదేవప్ప
డైరెక్టర్ (గ్రామీణ అభివృద్ధి)
జేఎస్ఎస్ మహావిద్యాలయ
మైసూరు – 570004

మూలం:
లీసా ఇండియా కన్నడ, సంచిక 4, డిసెంబర్ ౨౦౧౫

 

 

 

 

Recent Posts

మార్పుకోసం బీజాలు నాటారు

మార్పుకోసం బీజాలు నాటారు

మిశ్రమ పంటల సాగు, దేశీయ విత్తనాలు మరియు సామూహిక వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలు  మరింత సుస్థిరమైన భవిష్యత్తుకు కీలకం....