పంట చేల నుంచి నోటి ముద్దగా – సహజ ఆర్గానిక్స్ కృషి ఫలితం

ఆర్థికంగా రైతన్నను బలపరిచేందుకు మార్కెట్ తో సన్నిహిత సంబంధాలను సమకూర్చడం చాలా ముఖ్యం. పట్టణ-పల్లె ప్రాంతాల మధ్య సాన్నిహిత్యం నెలకొల్పడానికి రైతు బజార్లది చాలా కీలక పాత్ర. పండించిన చోటి నుంచి నేరుగా వినియోగదారుకు నాణ్యమైన సరుకును చేరవేయడంలో రైతు బజార్లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. రైతులకు, వినియోగదారులకు మధ్య వారధిగా రైతు సోదరులు, వ్యవసాయ నిపుణులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థే సహజ సమృద్ధ.

సహజ సమృద్ధ అంటేనే అందమైన ప్రకృతి వరం అని అర్థం. ఇది రైతన్నలతో కలిసి పనిచేస్తుంది. దేశీయ వంగడాలను కాపాడుతూ వాటిని మరింతగా మెరుగుపరచడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. మన దేశంలో సమృద్ధిగా ఉన్న సహజసిద్ధమైన జీవ వైవిధ్యాన్ని కాపాడవలసిన అవసరం గురించి సర్వత్రా అవగాహన కలిగించడమే ఈ సంస్థ ఆశించిన ప్రధానమైన లక్ష్యం. తొలి దశలో రైతులు సోదరులు తమ ఆలోచనలను, విత్తనాలను, విజ్ఞానాన్ని పరస్పరం అందచేసుకుంటూ సుస్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి కృషి చేసేందుకు ఈ సంస్థ ఆవిర్భవించింది.

సేంద్రీయ సేద్యం ద్వారా ఉత్పత్తి చేసిన ఉత్పాదనలను విక్రయించుకునేందుకు సరైన మార్కెట్ అవకాశాలు కర్ణాటకలో లేవు. ఈ కారణంగా సేంద్రీయ సేద్యం చేస్తున్న ఇక్కడి రైతు సోదరులు తమ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించుకునేందుకు అవకాశాలు ఉండేవి కావు. ఫలితంగా వారు స్థానిక మార్కెట్ పైనే ఆధారపడవలసివచ్చేది. అది అది వారి ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీసింది.

సహజ సమృద్ధ సంస్థ రంగంలోకి వచ్చిన తరువాత ముందుగా వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు మధ్య ఉభయ తారకమైన సాన్నిహిత్యానికి బాటలు వేసింది. ఇందుకు సహజ ఆర్గానిక్స్ ప్రొడ్యూజర్స్ కంపెనీ పేరుతో సంస్థ ప్రారంభించిన బ్రాండ్ రూపుదిద్దుకుంది. ఈ బ్రాండ్ ద్వారా సేంద్రీయ ఉత్పాదనలు మార్కెట్ లో ప్రవేశించాయి. ఈ సంస్ధలో దాదాపు 750 మంది సేంద్రీయ సేద్యగాళ్లు సభ్యులుగా, ప్రధాన వాటాదారులుగా చేరారు. వీరు కాక 2500 వ్యవసాయ కుటుంబాలు (అవి కూడా 30 రైతు సమాఖ్యలుగా) ఇందులో భాగస్తులుగా చేరారు.

సహజ సమృద్ధ సంస్థ సమన్వయకర్తగా ఉత్పత్తిదారులు తమ ఉత్పాదనలను వినియోగదారులకు పరిచయం చేసేందుకు వీలుగా ప్రదర్శించేందుకు, ఆ విధంగా విక్రయించుకునేందుకు అవకాశాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. పంట ఉత్పత్తులను అమ్ముకోవడంలో రైతులకు గిట్టుబాటు ధర వచ్చేందుకు అవకాశం ఏర్పడింది. రైతు నుంచి నేరుగా సేకరించిన ఉత్పాదనలను తమ అధీనంలో ఉన్న విక్రయకేంద్రాలకు తరలించి అక్కడ వినియోగదారులకు అందించడం ఈ సంస్థ చేపట్టిన బాధ్యతలు. వినియోగదారులకు నేరుగా చేరవేయడానికే ఈ రకమైన వ్యవస్థను రూపొందించడం జరిగింది. సంప్రదాయక మార్కెట్ లో లభించే ధరకన్నా దాదాపు 15 – 20 శాతం అధిక ధరను ఈ సంస్థ ఉత్పత్తిదారుకు అందిస్తుంది. సంస్థ నిర్వహనకు అవసరమైన మేరకు అదనపు మొత్తాన్ని కలిపి, వినియోగదారులకు విక్రయిస్తుంది. ఈ సంస్థ సేంద్రీయ సేద్యాన్ని, సంప్రదాయక వరి, జొన్నలు, రాగులు, సజ్జలు వంటి చిరు ధాన్యాలు (millets), పప్పు ధాన్యాల సాగును మాత్రమే ప్రోత్సహిస్తుంది. పోషకాహార విలువలు అధికంగా ఉన్న కారణంగానూ, ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నందున ఈ ఉత్పాదనలకు పట్టణ ప్రాంతాలలో మంచి గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా జొన్న, ఎర్రన్నం పట్టణ ప్రాంత వినియోగదారులకు చాలా రాష్ట్రంలో సేంద్రీయ ఉత్పాదనలను టోకుగా విక్రయించే సంస్థగా పేరు సంపాదించుకుంది. ఈ కారణంగా బెంగళూరు పరిసరాలలోని విక్రయశాలలకు దాదాపు 80 శాతం సరుకును అందజేయగలుగుతోంది. అయితే ఈ సంస్థకు సరుకులు నిర్వచేసేందుకు ఒక గిడ్డంగి ఉంది. ఒకే ప్రధాన విక్రయ కేంద్రం ఉన్నాయి.

ఇలా నేరుగా వినియోగదారులకు సరఫరా చేయడంతో పాటు ఏడాదికోసారి వివిధ నగరాలలో ఎర్రన్నంతో సిద్ధంచేసిన భోజనం సిద్ధంచేసి వాటి గురించి ప్రచారం చేసేందుకు కృషిచేస్తుంది. ఇంకా విత్తన ఉత్సవాలను నిర్వహిస్తుంది. సురక్షితమైన ఆహారం అంటే ఏమిటో ప్రజలలో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా 2 టైర్, 3 టైర్ పట్టణాలలో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలలో రైతులు స్వయంగా వచ్చి పాల్గొంటారు. అక్కడే ఆసక్తి గల కొనుగోలుదారులకు వారు తమ ఉత్పత్తిని సరసమైన ధరలకే అమ్ముకుంటూ ఉంటారు. ఈ రకంగా నిర్వహించే కార్యక్రమాలలో సుమారు 10 వేల నుంచి 20 వేల మంది పాల్గొంటారు. కేవలం సేంద్రీయ వ్యవసాయ ఉత్పాదనలకోసం నిర్వహించే ఈ కార్యక్రమాలు స్థానికంగా పండించిన, నాణ్యమైన తాజా సరుకును వినియోగదారులకు అందించే కేంద్రాలుగా మారిపోతున్నాయి. అదే సమయంలో రైతులకు, వినియోగదారులకు మధ్య పరస్పరం మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. వినియోగదారు ప్రయోజనాలకు హామీ లభిస్తుంది. ఇలా వినియోగదారులకు నేరుగా పంట దిగుబడిని చేరవేయడానికి ఇలాంటి రైతు బజార్లు దేశమంతటా విస్తరించడం వల్ల అందరికీ లాభదాయకంగా ఉంటుంది.

రైతు బజార్ల ద్వారా వ్యవసాయ ఉత్పాదనలను నేరుగా వినియోగదారుకు చేరవేసే ఈ రకమైన మార్కెట్ సదుపాయాలు దేశమంతటా విస్తరించడం అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది.

కీలక మలుపు

ప్రారంభంలో ఉత్పత్తిదారుల సంస్థగా ఏర్పడిన సహజ సమృద్ధ రైతుల కృషినే నమ్ముకుని రూపుదిద్దుకుంది. 2010లో ఈ సంస్థ రూ. 5 లక్షల పెట్టుబడితో ఏర్పాటైంది. రైతుల నుంచి, రైతు సమాఖ్యల నుంచి సేకరించిన మొత్తమే ఇదంతా.

అయితే మొదటి సంవత్సరం నష్టాలే ఎదురయ్యాయి. ఆ మొత్తం ఖర్చయిపోయింది. దాంతో 2011-12లో మళ్లీ రూ. 3 లక్షలు సమకూర్చుకోక తప్పలేదు. ఇదికాక, మరో రూ. 5 లక్షల ఆర్థిక సహాయం బ్యాంకుల నుంచి లభించింది. ఈ మొత్తం నిధులతో సంస్థ తన కార్యకలాపాలను విస్తరించుకోగలిగింది. ఒక దశలో రూ. 53 లక్షల వరకూ టర్నోవరు పెరిగినప్పటికీ నష్టాలు తప్పలేదు. దాదాపు రూ. 1.5 లక్షలు నష్టపోయింది. 2012-13లో నాబార్డ్ సహకారం కూడా లభించింది. దాంతో సంస్థ విలువ రూ. 83 లక్షలకు చేరింది. అప్పటికి కోటి రూపాయలను సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యం ఇంకా దూరంగానే ఉండిపోయింది. నిరంతరం కరువుకాటకాలు రావడంతో మళ్లీ నష్టాలు తప్పలేదు. దాంతో మొత్తం రూ. 10 లక్షల వరకూ నష్టాలు ఎదురయ్యాయి. నాలుగో సంవత్సరంలో మాత్రమే కంపెనీకి కొంత సానుకూల వాతావరణం కనిపించింది. టర్నోవరం రూ. 1.27 కోట్లకు చేరింది. 2014-15లో సంస్థ టర్నోవర్ రూ. 3.6 కోట్లకు చేరుకుంది. ఈ కారణంగా రూ. 30 లక్షలు లాభాలుగా కనిపించాయి. ఇందులోనుంచి రూ. 5 లక్షలను రైతుల వాటాగా పంపిణీ చేయగా, కొంత మొత్తాన్ని సంస్థ వ్యాపారావసరాలకు ప్రత్యేకించుకోవటం సాధ్యమైంది.

ఈ మధ్య కాలంలో సంస్థ చాలా రకాలైన వ్యాపార నమూనాలను ప్రయత్నించింది. రిటైల్ వ్యాపారం నుంచి టోకు వ్యాపారం వరకు చేపట్టి ఫలితాలను అధ్యయనం చేయడం జరిగింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా రైతులకు చెల్లించే మొత్తాలను మాత్రం ఏమాత్రం తగ్గించలేదు. లాభాలు తక్కువే అయినా సరే వ్యాపారం పెంచుకోవడం మీదే దృష్టి కేంద్రీకరించింది.

కాయగూరల సేద్యంలో సేంద్రీయ విధానం – అధ్యయనం

బెంగళూరు శివారుల్లోని కొన్ని గ్రామాలలో కాయగూరల పెంపకానికి సేంద్రీయ విధానం అనుసరించారు. ముఖ్యంగా అనేకల్ తాలూకాలోని మయాసాంద్ర గ్రామం దీనికి కేంద్రంగా నిలిచింది. ఇక్కడి రైతులంతా సంప్రదాయకంగా కాయగూరలను, పూల తోటలను పెంచడమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నవారు. వీళ్లంతా నిత్యం ఏదో ఒక రకం కూరగాయల పెంపకం మీదే ఆధారపడేవారు. చాలా గ్రామాలలో పరిస్థితి ఇలాగే ఉండేది. ఇక్కడ బీట్రూట్, క్యారెట్ సాగు ఎక్కువగా ఉండేది.

మొట్టమొదట 150 మంది రైతులను సేంద్రీయ సాగు విధానం చేపట్టేందుకు ప్రోత్సహించడం జరిగింది. మూడేళ్ల వ్యవధిలో ఆ సంఖ్య చాలా దారుణంగా తగ్గిపోయింది. చాలా కొద్ది మంది మాత్రమే సేంద్రీయ సాగు కొనసాగిస్తూ వచ్చారు.

ఆరంభంలో సేంద్రీయ సాగుకు ఎవరికీ అంత ఆసక్తి ఉండేది కాదు. ఎందుకంటే ఇలా సేంద్రీయ విధానంలో పండించిన ఉత్పాదనను విక్రయించేందుకు సిటీ మార్కెట్ కు వెళ్లడానికి వాళ్లు సుమారు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి వచ్చేది. అయితే కొద్ది మంది అందుకు కూడా సిద్ధపడ్డారు. అలాంటి వారి సంఖ్య గట్టిగా పది మంది ఉండేది. వారి కృతనిశ్చయం కారణంగానే మిగిలిన వారంతా కమ్యూనిటీ మార్కెటింగ్ ప్రక్రియ వైపు మళ్లడం సాధ్యమైంది. మొదట్లో 20 మంది అయ్యారు. తరువాత ఆ సంఖ్య 70కి చేరింది. వాళ్లంతా సేంద్రియ విధానంలో పండించిన కూరలను మార్కెట్ కు చేరవేయడం ప్రారంభించారు. వాళ్లంతా కలిసి సహజ సవయవ తరాకరి బేలాగరార సంఘం పేరుతో ఒక సమాఖ్యగా ఏర్పడ్డారు. వాళ్లంతా ముందుగా తమ పంటను ఒకచోటికి చేర్చడం మొదలెట్టారు. అక్కడి నుంచి అందరి ఫలసాయాన్ని ఏక మొత్తంగా మార్కెట్ కు తరలిస్తూ వచ్చారు. ఫలితాలను, మార్కెట్ అవసరాలను చూసిన తరువాత వారు ఇలా ఒక పంట కాకుండా వివిధ రకాల కూరగాయల సాగు చేపట్టడం ప్రారంభించారు. దాదాపు 40 రకాల వేర్వేరు కూరను పండించసాగారు. బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాలకు వాటిని సరఫరా చేస్తూ వచ్చారు. మొత్తం మీద రైతన్నల రోజుకి టర్నోవర్ కేవలం రూ. 700 నుంచి నెల తిరిగేసరికి రూ. 5 లక్షలకు చేరింది.

సొంతంగా భూమి లేని వారు కూడా కాయగూరల పెంపకం చేపట్టారు. ఆ రకంగా వారికి తగిన జీవనాధారం చూపించడం సాధ్యమైంది. భూమి సెంటు కూడా లేని మంగళ అనే మహిళా రైతు కరివేపాకు, ఇంకా ఇతర ఆకు కూరల సాగు ద్వారా నెలకు  రూ. 1500 సంపాదించే స్థాయికి చేరింది. సొంతంగా భూమి లేని ఈమె తన ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ జాగానే ఆధారం చేసుకుని ఆకుకూరల పెంపకం చేస్తోంది.

సహజ సమృద్ధ ఆరాగనిక్ ప్రొడ్యూజర్ కంపెనీ సహకారంతో రైతు సమాఖ్యలు తమ మార్కెట్ అవకాశాలను విభిన్నమైన ప్రాంతాలకు, వస్తువులకు విస్తరించుకోగలిగాయి. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు, ప్రత్యేకంగా సేంద్రీయ ఉత్పత్తులను మాత్రమే విక్రయించే దుకాణాలకు లేదా సేంద్రీయ సాగుదారుల ఆదరణ సంపాదించిన వినియోగదారులకు నేరుగా వీరు తమ ఉత్పాదనలను సరఫరా చేస్తుంటారు. వేర్వేరు ప్రాంతాలలో వేరు వేరు రోజులలో ఏర్పాటు చేసే ఈ ఆర్గానిక్ మార్కెట్లను నెలకోసారి నిర్వహిస్తుంటారు. ఇలా చేయడం వల్ల వారి ఉత్పాదనలకు ఓ ప్రత్యేకమైన బ్రాండ్ నేమ్ లభించింది. వాటిని వినియోగదారులు సహజ వెగ్గీస్ (కూరగాయలు) అని వ్యవహరిస్తారు.

వారం వారం జరిగే ఈ మార్కెట్లకు రైతులందరూ తమ ఉత్పత్తులను తరలించుకువస్తారు. సాధారణంగా ఏ వారంలో ఏ ప్రాంతంలో ఏ రకం కూరగాయలకు ఎక్కువ గిరాకీ ఉంటుందో గమనించడం వారు తీసుకునే మొదటి జాగ్రత్త. ముఖ్యంగా నాణ్యమైన వాటికే వారు ప్రాధాన్యం ఇస్తారు. నాణ్యతను బట్టి వారు తాము తీసుకువచ్చిన కూరలకు గ్రేడింగ్ నిర్ణయించుకుంటారు. ఆ తరువాత సరుకును లెక్కకట్టి వివిధ వ్యాపార దుకాణాలకు చేరవేస్తారు. వారు తీసుకువచ్చిన కూరలకు చెల్లింపులు కూడా వారానికి ఒకసారి జరుగుతాయి. ఇక్కడి రైతులకు ఐఎంఓ ధ్రువీకరణలు జారీచేస్తుంది. ఈ సంస్థ చాలా ప్రతిష్టాత్మకమైనది. చాలా పకడ్బందీగా రూపొందించిన ప్రామాణికాలు ఆధారం చేసుకుని ఖచ్చితమైన పర్యవేక్షణ తరువాత ఈ సంస్థ రైతులకు సర్టిఫికెట్లను అందజేస్తుంది.

హోసల్లి గ్రామానికి చెందిన 66 ఏళ్ల నాగరాజు అనే రైతు తన అభిప్రాయాలను తెలియచేస్తూ, నేరుగా మార్కెట్ తో అనుసంధానం కారణంగా తనకు ఎంతో లాభం కలిగింది అంటున్నాడు. గడచిన నాలుగేండ్లలో తన ఆదాయం రెట్టింపు అయిందని ఆయన గర్వంగా చెప్పాడు. “క్యారెట్లు, బీట్రూట్ పండించే నేను మార్కెట్ లో అడుగు పెట్టిన తరువాత, సాధారణ రకానికి రూ. 12 నుంచి రూ. 18 లు లభిస్తుంటే నేను రూ. 25 నుంచి రూ. 35 వరకు రేటు పొందేవాడిని. అందుకు కారణం నేను పండించే కూరలు సేంద్రీయ సాగు పద్దతిలో పండించడం ఒక కారణమైతే సహజ బ్రాండ్ తో విక్రయించడం మరో కారణం. మాకు అండగా నిలిచిన సహజ సంస్థకు కొంత చెల్లించినప్పటికీ, మాకు కనీసం 60 నుంచి 80 శాతం వరకు అధికంగా ఆదాయం సంపాదించగలుగుతున్నాం. ”

ఈ ప్రాంతంలోని రైతులకు ఉన్న భూ వసతి చాలా తక్కువే. 0.5 ఎకరాల నుంచి గట్టిగా 2.5 ఎకరాల వరకూ మాత్రమే వారిలో భూమి ఉన్న రైతుల సంఖ్య ఎక్కువ. అయినా వారంతా గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నారు. సేంద్రీయ విధానంలో రకరకాలైన కూరలను వారు సాగు చేస్తున్నారు. వారు పశుపోషణపై కూడా తమ దృష్టిని కేంద్రీకరించారు. ఆ కారణంగా వారు తమ చేలకు సంపూర్ణంగా పోషక విలువలు ఉన్న సేంద్రీయ ఎరువులనే ఉపయోగించగలుగుతున్నారు. అదే సమయంలో అధిక ఆదాయం కూడా సంపాదించుకోగలుగుతున్నారు.

జి. కృష్ణప్రసాద్ – బి. సోమేశ్
సహజ సమృద్ధ
నెం – 7, క్రాస్ 2, మెయిన్ రోడ్డు 7, సుల్తానాపాళ్య
బెంగళూరు – 560 032
E-mail: wwwsahajasamrudha.org

ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి 17, సంచిక 2, జూన్ ౨౦౧౫

 

 

 

Recent Posts

మార్పుకోసం బీజాలు నాటారు

మార్పుకోసం బీజాలు నాటారు

మిశ్రమ పంటల సాగు, దేశీయ విత్తనాలు మరియు సామూహిక వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలు  మరింత సుస్థిరమైన భవిష్యత్తుకు కీలకం....