మట్టి తొక్కుడు (షీప్ పెన్నింగ్) స్థానికంగా ప్రచారంలో ఉన్న సంప్రదాయక భూసార పరిరక్షణ విధానం. పశుపోషకులు, వ్యవసాయదారులు పరస్పరం సహకరించుకుంటూ చేపట్టే ఈ మట్టి తొక్కుడు విధానం చాలా ప్రయోజనకరమైనది. దాదాపు మరుగున పడిపోయిన ఈ విధానం ఇప్పటికీ తెలంగాణలోని రైతన్నల పంట చేలకు ప్రాణదాయినిగా ఉపయోగపడుతోంది.
జౌలి ఉస్మాన్ సాహెబ్ 55 ఏండ్ల రైతన్న. ఆంధ్రప్రదేశ్ లోని కరూనలు జిల్లా దేవనకొండ ఆయన స్వగ్రామం. ఆయనకు 7 ఎకరాల పొలం ఉంది. అందులో 4 ఎకరాలకు సాగునీటి వసతి ఉండగా, మిగిలిన భూమి వర్షాధారితమైనది. ఇవి కాక, ఆయనకు జత ఎడ్లు, 3 గేదెలు, 4 గొర్రెలు, 2 కోళ్లు ఉన్నాయి. ఆయన కుటుంబానికి ప్రత్యామ్నాయ జీవన ఉపాధి మార్గంగా ఈ డెయిరీ ఉత్పాదన నిలుస్తోంది.
ఉస్మాన్ సాహెబ్ కు తన పొలంలో వైవిధ్యంతో కూడిన పంటలు సాగు చేయడం మీద ఆసక్తి ఎక్కువ. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, “పత్తి ఎగిలి, మిరప ఎగిలి, సెనగ ఎగిలి వల్ల ఆకురాలి భూమికి బలం వస్తుంది. ” పంటను కోసివేసిన తరువాత మిగిలే దుబ్బు, గడ్డి వంటి వ్యర్థపదార్థాలు కుళ్లి శిథిలమైపోయి నేలలోనే కలిసిపోతాయి. వీటి వల్ల కూడా నేలలోని మట్టి మరింత సారవంతమవుతుంది. ఈ రకమైన వ్యర్థపదార్థాల కారణంగా కలిగే ప్రయోజనాలు కాంప్లెక్స్ ఎరువుల వాడకంతో వచ్చే ఫలితాలతో సమానంగా ఉంటాయని ఆయన అంటారు.
చుట్టుపక్కల ఉండే ఇతర రైతన్నల మాదిరిగానే ఉస్మాన్ కూడా తన పొలంలోని భూసారాన్ని తనకు తానుగానే అంచనా వేయగలడు. వాళ్లకి ఈ విషయంలో కొన్ని బండ గుర్తులున్నాయి. అనేకంటే వారికి అనుభవపూర్వకంగా భూసారాన్ని లెక్కించే పరిజ్ఞానం తగినంత ఉన్నదని చెప్పాలి. మట్టిని చూడగానే కలిగే అనుభూతి, మట్టి రంగు, రూపం చూడగానే ఒక అవగాహన వస్తుంది. మట్టిని చేతితో తాకినప్పుడు వారికి ఆ విషయంలో ఒక స్పష్టమైన అనుభూతి కలుగుతుంది. వాటన్నిటిని ఆధారం చేసుకుని వారు తమ చేలలో మట్టికి ఉన్న సారవంతమైన శక్తిని అంచనా వేసుకుంటారు. ఉదాహరణకు, సారవంతమైన మట్టిని చేతిలోకి తీసుకున్నప్పుడు అది మృదువుగా ఉంటే మంచి సారవంతమైన నేలగా భావిస్తారు. అదే భూసారం తగ్గిపోయి ఉన్న నేలల్లో మట్టిని దున్నినప్పుడు మట్టి ఉండలు ఉండలుగా వస్తుంది. ఆ ఉండలు విరిగిపోయినా, వదులుగా విడిపోయినా అక్కడి నేల సారవంతం కాదని తెలుసుకుంటారు. ఎందుకంటే సారవంతమైన భూమిని దున్నినప్పుడు కూడా మట్టి ఉండలుగానే వచ్చినా అది అంత తేలికగా విడిపోదు. చితికిపోదు. ఇవి కాక, అక్కడి మట్టిలో పెరిగే కొన్ని రకాల మొక్కలను బట్టి కూడా వారు ఒక అభిప్రాయానికి రాగలుగుతారు. తుంగ, పెద్ద గుణక, జొన్న ఆకుల గడ్డి వంటివి పెరుగుతున్నట్లయితే అక్కడి భూమి అన్ని విధాలుగా సారవఁతమైనదేనని నిర్ధారించుకుంటారు. అదే ఉప్పు గడిడ, బూ అమ్మ గడ్డి, బంక గడ్డి వంటివి భూసారం అంతగా లేదనేందుకు నిదర్శనం.
ఉస్మాన్ అనేక రకాలైన భూసార రక్షణ పద్ధతులను అనుసరిస్తాడు. అవన్నీ కూడా ప్రకృతి సహజమైన సేంద్రీయ విధానాలే. అలాంటి వాటిలో కొన్ని సెడువు చేయుట (summer ploughings), మట్టి తొక్కుడు లేదా గొర్లు ఆపడం (షీప్ పెన్నింగ్), పశువుల ఎరువు, ఆకుల రూపంలో భూసారం పెంచే ఉద్దేశంతో వేరు సెనగ సాగు (ఎగిలి) చేపట్టడం, పంటల వైవిధ్యం అంటే పంట మార్పిడి, మాగి దున్నటం అంటే చేలల్లో మిగిలి ఉన్న పంట వ్యర్థాలను అలాగే ఉంచి మడి దున్నడం, రకరకాల పంటలు సాగు చేయడం లేదా విశ్రమ పంటల విధానం, వరి సాగు చేసే భూముల్లో ఆకులు అలములు వంటివి వేసి భూసారం పెంచేందుకు వీలుగా వరి మడిలో ఆకులు తొక్కిడి వంటివి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇవి చాలవన్నట్లు పంది మలమూత్రాలు సేకరించి దానిలో వేప కేక్ ను కలిపి ఉండలుగా చుట్టి మడుబాయికి సమీపంలో ఉంచుతారు. మడుబాయి అంటే ఒక్కో ప్లాట్ పొలంలోకి నీరు ప్రవహించే ప్రారంభ స్థలం. అలా చేయడం వల్ల భూసారం మెరుగవుతుంది. కొన్ని రకాల క్రిమికీటకాలను నియంత్రించడం సాధ్యమవుతుంది. వీటన్నిటిలోనూ మట్టి తొక్కిడి విధానాన్నే ఉస్మాన్ ఎక్కువగా ఉపయోగిస్తాడు.
మట్టి తొక్కుడు (షీప్ పెన్నింగ్)
పశుపోషకులు, రైతన్నలు కలిసి సంయుక్తంగా పరస్పర సహకారం రూపంలో ఈ కార్యక్రమం చేపడుతుంటారు. సాధారణంగా ఈ విధానాన్ని నవంబర్, జూన్ మాసాల మధ్య పూర్తిచేస్తారు. మెట్ట భూములతో పాటు సాగు నీటి వసతి ఉన్న నేలల్లో కూడా మట్టి తొక్కుడు చేపడతారు. ఉస్మాన్ అభిప్రాయం ప్రకారం, దేవన్ కొండ గ్రామంలోని మొత్తం 400 ఎకరాల్లో కనీసం 25 శాతం ప్రతి ఏటా ఈ మట్టి తొక్కుడు విధానం అనుసరించడం సర్వసాధారణం.
సాధారణంగా ఒక మందలో వెయ్యి నుంచి 4000 వరకు గొర్రెలు ఉంటాయి. వాటిలో పది పదిహోను మందికి చెందిన పశువులు ఉండవచ్చు. ఈ కార్యక్రమాన్ని సాధారణంగా సాయంకాలం 6 గంటల సమయంలో ప్రారంభిస్తారు. చీకటి పడే ముందు మందను ఒక చోటికి చేరుస్తారు. మరీ చిన్న గొర్రె పిల్లలను వాటిని వాటి తల్లల వెంటనే ఉంచేయవలసి ఉంటుంది. అన్ని రకాల నేలల్లోను ఇది చేపట్టవచ్చు. ఇలా మట్టి తొక్కుడు విధానంలో నేలను చదును చేసిన తరువాత ఆ పొలంలో ఏరకమైన పంటలనైనా సాగుచేయవచ్చు.
దేవన్ కొండ గ్రామంలో ఈ కార్యక్రమం తరువాత సాధారణంగా వేరు సెనగ సాగు చేస్తారు. సాధారణ నేలల్లో సాగు చేసిన పంటతో పోల్చినప్పుడు ఇలా మట్టి తొక్కుడు పూర్తయిన నేలల్లో పండిన వేరు సెనగ పంట చూడడానికి భిన్నంగా ఉంటుంది. “డిఏపీకి ఎంత పవరుంటుందో గొర్రెల ఎరువుకు కూడా అంత బిర్రున అందిస్తుంది” అంటారు ఉస్మాన్. గొర్రెల ఎరువు ఉపయోగించిన నేలలో దిగుబడి ఎకరాకు 25 నుంచి 30 బ్యాగుల వరకు ఉంటుంది. అదే మామూలు నేలల్లో అయితే దిగుబడి 15 నుంచి 20 బ్యాగులు మాత్రమే. ఈ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను ఉస్మాన్ ఈ విధంగా వివరిస్తున్నారు. “గొర్రెల ఎరువుతో పాటు సేంద్రీయ ఎరువును కూడా ఉపయోగించినట్లయితే వేరు సెనగ గుత్తుల బరువు అధికంగా ఉంటుంది.”
భూమి స్వరూపాన్ని, స్వభావాన్ని మెరుగుపరచడంలో ఈ రకమైన గొర్రెల ఎరువు ప్రయోజనాలను, ఉపయోగాలను ఆయన వివరిస్తూ “తువ్వ చేనులో ఆపితే గొర్రెలు తొక్కి భూమి బిగువొస్తది. వర్షంలో కూడా ఆపితే వేరు పురుగు కొడ్తది.” వేరు పురుగు గొర్రెల మూత్రం ప్రభావంతో చచ్చిపోతది. తువ్వ (మెత్తటి) నేలల్లో గొర్రెల ఎరువు తరువాత చిక్కుడు (హార్స్ గ్రామ్) పండిస్తే పశువులకు సమృద్ధిగా మేత లభిస్తుంది. రైతులు కేవలం గింజలు నాటితే చాలు. ఏరువేత అవసరం ఉండదు. అయినా కూడా మాకు 5 క్వింటాళ్ల వరకూ ధాన్యం వస్తుందంటున్నారాయన.
మట్టి తొక్కుడు ఒడంబడిక
ఈ విధంగా తమ పంట చేలను సారవంతంగా చేసుకునేందుకు గొర్రెల యజమానుల సహకారం తీసుకున్నందుకుగాను రైతులు కూడా తమకు తోచిన విధంగా పశు పెంపకందారులకు తోడ్పాటు లేదా పరిహారం అందిస్తారు. అది నగదు రూపంలో కావచ్చు. లేదా వస్తు రూపంలో కావచ్చు. లేదా రెండు విధాలుగా కావచ్చు. ముఖ్యంగా రైతన్న పశు పెంపకందారులకు ఆతని పశువుల పోషణకు అవసరమైన మేత రోజుకు రెండు సార్లు అందిస్తారు. ఉదయం 20 కిలోల కొర్రలను (ఫాక్స్ టెయిల్), చింతపండు పులుసు (చట్నీ) అందిస్తారు. సాయంకాలం వేళ పశువుల పెంపకందారులు తమ కుక్కల ఆకలి తీర్చవలసి ఉంటుంది కనుక కొంత అదనంగా అందిస్తారు. మట్టి తొక్కుడు సమయంలో వారు పెంచుతున్న కుక్కలు వాటికి కాపలాగా ఉంటాయి. దాదాపు కిలోమీటరు వ్యాసంలో కుక్కలు నిఘా వేసి ఉంచుతాయి. అవి మిగిలిన గొర్రెలతో పాటే కలిసి జీవిస్తూ ఉంటాయి. వాటికి నక్కలను, తోడేళ్లను, ఎలుకలను చంపడంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉంటారు.
భూసారం అక్కడి భూముల్లో పెరిగే గడ్డి ఆధారంగా నిర్ధారణ అవుతుంది. తుంగ, పెద్ద గుణక, జొన్న ఆకుల గడ్డి వంటివి భూసారానికి సూచికలుగా ఉంటాయి. అదే ఉప్పు గడ్డి, బూ అమ్మ గడ్డి, బంక గడ్డి వంటివి అక్కడి నేలలు అంత సారవంతమైనవి కావని సూచిస్తాయి.
ఎక్కువ సంఖ్యలో గొర్రెలు ఉన్న యజమాని పశువుల కాపరిని కూడా ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. అది కూడా కేవలం ఒక్క నెల రోజుల వ్యవధికి మాత్రమే. ఎందుకంటే మిగిలిన 11 నెలలు ఆతడి గొర్రెలను తమ పొలాల్లో మట్టి తొక్కుడు కోసం తీసుకెళ్లిన రైతులే అందుకయ్యే ఖర్చును భరించవలసి ఉంటుంది.
గొర్రెల తొక్కుడు – ప్రయోజనాలు, ఇబ్బందులు
- ఇలా గొర్రెల తొక్కుడు విధానం వల్ల మట్టి మరింత సారవంతమవుతుంది. వాటి మలమూత్రాల కారణంగా 10 రకాల ఆర్గానిజమ్స్ మట్టికి లభిస్తాయి. వాటి కారణంగా మట్టి మరింత మృదువుగా తయారవుతుంది.
- పొలంలోని చాలా వరకు గడ్డిగాదం వంటి అక్కరలేని మొక్కలు ఏరివేత జరుగుతుంది. అక్కడక్కడ ఉండిపోయే కొద్ది పాటి ఎకాసియా తరహా గడ్డి మాత్రమే మిగిలి ఉంటుంది. దానిని తేలికగానే తీసేయవచ్చు.
- క్షార గుణం అధికంగా ఉన్న నేలలను గొర్రెలు తేలికగానే గుర్తించగలవు. ఆ కారణంగా అలాంటి చోట్ల అవి మూత్ర విసర్జన చేస్తాయి. ఫలితంగా ఆ క్షార గుణం బలహీనమైపోతుంది.
- సేంద్రీయ ఎరువుల కోసం పెరట్లో పెంచే హిబీకస్ గడ్డికి తోడు ఇలా గొర్రెల మలమూత్రాలు పొలాన్ని తడిపడం ద్వారా పండించిన పంట వండడం చాలా తేలిక. అంటే తేలికగా పచనమవుతుంది. వాటిని వండేందుకు ఆయిల్ వాడవలసిన అవసరం ఉండదు. రుచికరంగా ఉంటుంది. ఈ మంచి లక్షణాలు రసాయనాలతో పండించిన పంట దిగుబడిలో కనిపించవు.
- మట్టి తొక్కుడు పొలంలో పండించిన ధాన్యం ఎక్కువ తూకం తూగుతాయి.
- ఈ విధంగా సారవంతం చేయకుండా ఉన్న భూములలో పండించిన పంటకు, రసాయనాలతో పండించిన పంటకు మధ్య చాలా స్పష్టమైన తేడాలను మనం తేలికగానే గుర్తించవచ్చు.
ఇలా గొర్రెలను ఉపయోగించి మట్టి తొక్కుడు చేయించేందుతు అయ్యే ఖర్చు సాధారణంగా ఎకరాకు రూ. 1000-రూ. 1200 మధ్య ఉంటుంది. భూసారం పెరగడంతో పాటు పశుపోషకులకు రెడీ క్యాష్ గా అవి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఎప్పుడు నగదు కావాలనుకుంటే అప్పుడు వాటిని అమ్మివేయవచ్చు. గొర్రెల పెంపకం ప్రయోజనాల గురించి మాట్లాడుతూ, ఉస్మాన్ ఇలా అంటారు. “పది ఎకరాల భూమి ఉడేదీ ఒకటే. నలభై గొర్రెలుండేదీ ఒకటే”. విధాన నిర్ణతలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సంప్రదాయక విధానాలను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉస్మాన్ అంటున్నారు.
బి. శ్రీవేద విద్యార్థి – బిఏ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్స్ (2వ సంవత్సరం) సెయింట్ ఫ్రాన్సిస్ మహిళల కాలేజీ బేగంపేట, హైదరాబాద్, తెలంగాణ E-mail:Veda_baswapoor@yahoo.com
బి. శ్రీహిత బిఏ (హానర్స్) ఎకనామిక్స్ (1వ సంవత్సరం) లేడీ శ్రీరాం మహిళల కాలేజీ యూనివర్సిటీ ఆఫ్ ఢిలీల న్యూఢిల్లీ E-mail: bsrihithareddy@gmail.com ఆంగ్ల మూలం: లీసా ఇండియా సంపుటి 17, సంచిక 1, మార్చ్ ౨౦౧౫



