పల్లె సీమల్లో కోళ్ల పెంపకం (పౌల్ట్రీ పరిశ్రమ) తరతరాలుగా వస్తున్న సంప్రదాయక జీవనోపాధి మార్గం. పేదరికం నుంచి విముక్తి కలిగించేందుకు, పేద వర్గాలలో పోషకాహార లోపాన్ని సరి చేయడంలోను ఇది చాలా ఉపయోగకరమైన సాధనంగా ప్రఖ్యాతి సంపాదించింది. గ్రామీణ పౌల్ట్రీ నిర్వాహకులు, పట్టణ ప్రాంత వినియోగదారుల మధ్య నిలకడైన సత్సంబంధాలను సాధించడమే తక్షణ అవసరం.
సర్దార్ జనక్ సింగ్ జమ్ము జిల్లాలోని రణబీర్ సింగ్ పురా తాలూకా తాండా అనే మారుమూల గ్రామానికి చెందిన సాదా కుటుంబీకుడు. జమ్ము, కాశ్మీర్ రాష్ట్ర పశు సంవర్థక శాఖ నిర్వహించిన రెండు వారాల శిక్షణలో ఆయన పౌల్ట్రీ ఫారమ్ నిర్వహణలో నైపుణ్యాలను అలవరచుకున్నాడు. సుశిక్షితుడైన తరువాత 1991లో రూ. 1.25 లక్షల పెట్టుబడితో 8000 కోడి పిల్లలతో కోళ్ల పెంపకం ప్రారంభించాడు.
ఆయన నెలకొల్పిన కోళ్ల ఫారమ్ తూర్పు-పడమరలుగా అన్ని సదుపాయాలతో ఏర్పాటై ఉంటుంది. కోళ్ల పెంపకానికి అవసరమైన అన్ని సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో నిర్వహించే కోళ్ల ఫారమ్ అన్ని విధాలుగా లాభసాటి వ్యాపారానికి అనువుగా ఉంటుంది. అవసరమైన కోడి పిల్లలను పొరుగున ఉన్న పంజాబ్, హర్యానాల నుంచి కౌనుగోలు చేసేవాడు. వాటికి అవసరమైన దాణాను పంజాబ్ నుంచి తెప్పించేవాడు. తాను పెంచే కోడి పిల్లలకు మూడు రకాలైన ఆహారం అందించేవాడు. వాటిలో మొదటిది పది రోజుల పాటు అందించే తొలి దశ ఆహారం. రెండో దశలో 23 రోజుల పాటు, మూడోది ఆఖరుది చివరి రోజుల్లో అందించేవాడు. ఇక వ్యాక్సీన్లకి సంబంధించి బ్రాయిలర్స్ కి నిర్దేశించిన సమయపాలనను నిక్కచ్చిగా పాటిస్తాడు. పెంపకానికి ఉద్దేశించిన కోడి పిల్లలను తన షెడ్డులోనికి సరిగా రెండు వారాల వయసులో ఉన్న వాటినే సేకరిస్తాడు. ఒక సారి పక్షులను అమ్మివేసిన తరువాత షెడ్లను పూర్తిగా వ్యాధికారక క్రిముల నుంచి పూర్తి రక్షణ కలిగించేలా శుభ్రపరుస్తాడు.
సత్సంబంధాలు సుస్థిరతకు ప్రాతిపదిక
సర్దార్ జనక్ సింగ్ తన పరిశ్రమను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని పక్షాలతోను ప్రయోజనకరమైన సత్సంబంధాలను నెలకొల్పుకునేవాడు. అదే అతని పురోగతికి తోడ్పడింది. పొరుగు రాష్ట్రాలలోని ఇతర కోళ్ల పెంపకందారులతోను, వైద్య నిపుణులతోను, మేత తయారీదారులతోను, దాణా సరఫరాదారులతోను, మందులు అందించే సంస్థలతోను, పరిశ్రమకు ఉపయోగపడే పరికారాలను సరఫరాచేసే వారితోను, తన పరిసర ప్రాంతాలలోని ఇతర కోళ్ల పెంపకందారులతోను ఆయనకు ఉపయోగకరమైన సంబంధాలు ఉండేవి. అంతేకాక, స్థానికంగా ఉండే పశు సంవర్థక శాఖ అధికారి, పౌల్ట్రీ విస్తరణ అధికారి నుంచి నిత్యం సలహాసూచనలు తీసుకుంటూ ఉంటాడు. వాళ్లను ఆయన నెలకు ఒక్కసారి అయినా తప్పనిసరిగా కలిసి వారిని సంప్రదించడం అలవాటుగా చేసుకున్నాడు. వివిధ ఔషధ కంపెనీలకు చెందిన మెడికల్ రిప్రెజెంటేటివ్స్ తో కూడా చర్చిస్తూ ఉంటాడు. అందువల్ల ఆయనకు కోళ్లకు అవసరమైన మందుల గురించి, పోషకాల గురించి ఎప్పటికప్పుడు ఖచ్ఛితమైన సమాచారం అందుతూ ఉంటుంది.
అప్పట్లో, అంటే 2005 నాటికి ఇలా పౌల్ట్రీ పరిశ్రమలో పెంచి పోషించిన కోళ్లకు సరైన మార్కెట్ అవకాశాలు సంపాదించడం అంత సులభసాధ్యమయ్యేది కాదు. అందుకోసం జనక్ సింగ్ పట్టణ ప్రాంతాలకు వెళ్లి తన కోళ్ల గురించి తానే ప్రచారం చేసుకోవలసి వచ్చేది. ఇంకా అందరికీ సహాయం అందించే సన్నిహితుల సాయం కూడా తీసుకోవలసి వచ్చేది. చాలా సందర్భాలలో హోల్ సేల్ డీలర్లు కూడా కోళ్లను కొనేందుకు ఉత్సాహం చూపించేవారు కాదు. అందుకు కారణం వారికి తగినంత గిరాకీ ఉండేది కాదు. ముఖ్యంగా, హిందువులకు అతి పవిత్రమైన నవరాత్రుల సమయంలో చాలా రోజుల పాటు జనక్ సింగ్ తన షెడ్డులోనే కోళ్లను జాగ్రత్తగా కాపాడుకోవలసి వచ్చేది. అలాంటి సమయాల్లో నష్టాలు తప్పేవి కావు. అదే విధంగా మండు వేసవిలో కూడా గిరాకీ లేకపోవడం వల్ల ఆర్థికంగా నష్టపోవాల్సివచ్చేది.
అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఆయనకు అన్ని చోట్లా మంచి సత్సంబంధాలు ఉండడం ఇప్పుడు చాలా తోడ్పడింది. దానికి తోడు కమ్యూనికేషన్ సదుపాయాలు విస్తరించాయి. ఇప్పుడు ఆయన మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నాడు. అందులోని సాంకేతిక పరిజ్ఞానం ఆయనకు అండగా నిలుస్తోంది. ఫలితంగా పరిసరాలలోని వినియోగదారులనుంచి ఫోన్ సందేశాలు వస్తున్నాయి. పౌల్ట్రీ పరిశ్రమదారుల అసోసియేషన్ నుంచి కూడా ఆయనకు నేరుగా సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఆయా ప్రాంతాలలోని మాంసం ధరవరలు ఆయనకు తెలిసిపోతున్నాయి. అందువల్ల ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ రకమైన ధరలు ఉంటున్నదీ ఆయన తెలుసుకోగలుగుతున్నాడు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ధరల పరిస్థితి ఆయనకు ఫోన్ సందేశాల రూపంలో అందుతున్నాయి. అలా ఆయనకు అన్ని వైపుల నుంచి అందుతున్న విస్తృత సమాచారం సహాయంతో తన కోళ్లకు తగిన గిట్టుబాటు ధరలను ఆయనే నిర్ణయించుకోగలుగుతున్నాడు. గిరాకీని బట్టే అమ్మకాలు ఉంటాయి. ఎక్కువ గిరాకీ ఉన్న ప్రాంతాలకు ఆయన తన కోళ్లను విక్రయిస్తూ ఉంటాడు. నాణ్యమైన, ఆరోగ్యవంతమైన కోళ్లను ఆయన సరఫరా చేస్తాడు. ఆ కారణంగా హోల్ సేల్ డీలర్లు ఆయన దగ్గరే కొనడానికి ఇష్టపడతారు. ఆయనకే ఫోన్ చేస్తారు. అంతేకాదు, కోళ్లను తరలించే బాధ్యతలను కూడా వాళ్లే సంతోషంగా స్వీకరిస్తూ ఉంటారు. క్క మాటలో చెప్పాలంటే సర్దార్ జనక్ సింగ్ మార్కెట్ రాష్ట్రవ్యాప్తంగా సాంబా, కథువా, ఉధంపూరం, రియాసీ, పూంచ్, రజౌరీ జిల్లాలకు మాత్రమే కాకుండా సుదూరంలోని శ్రీనగర్ వరకూ విస్తరించింది. అదే విధంగా కొంత మంది హోటల్ యజమానులు, రెస్టారెంట్ల యజమానులు నేరుగా ఆయన దగ్గర నుంచే తమకు కావలసిన సరుకును కొనుగోలు చేస్తారు.
పట్టణ ప్రాంతాలతో సన్నిహితమైన సంబంధాలు నెలకొల్పుకోవడం వల్ల కోళ్ల ఫారమ్ నిర్వాహకులు తమ గ్రామాలలోనే ఉంటూ అంటే ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేకుండా లాభదాయకంగా పరిశ్రమను నిర్వహించుకోగలుగుతున్నారు. దీని వల్ల పట్టణాల్లోని వినియోగదారులు కూడా నాణ్యమైన సరుకును అందుకోగలుగుతున్నారు.
అడిగిన వాళ్లందరికీ సరుకు సరఫరా చేయడం మాత్రమే కాదు. ఆయన తన దగ్గర సరుకులు కొనుగోలు చేసే వారిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కూడా ఆయన పూర్తిగా ఉపయోగించుకుంటారు. ఉత్సవాలు, పెండ్లిండ్ల సమయాలలో ఎవరికి ఎంత అవసరమో అంత మేరకు సరైన తూకంలో సరుకు సరఫరా చేస్తాడు. కొందరికి లేతగా ఉండే మాంసం ఇష్టం. కొందరికి పెద్ద మొత్తంలో సరుకు అవసరం. ఎవరికి ఎలా కావాలంటే అలాంటి సరుకునే వారికి ఆయన అందచేస్తాడని ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఇంత జాగ్రత్తగా వ్యాపారం చేస్తున్నప్పటికీ కొన్ని సమయాల్లో కోళ్లు అకారణంగా చచ్చిపోతూ ఉంటాయి. లేదా తగిన సంఖ్యలో కోళ్లు ఆయన దగ్గర ఉండవు. అలాంటప్పుడు ఆయన ఇబ్బంది పడకతప్పటం లేదు. అయినా సరే, ఆయనకున్న సత్సంబంధాల కారణంగా అలాంటి అడ్డంకులను దాటి మళ్లీ కొత్త బ్యాచ్ పెంపకం చేపడుతూ ఉంటాడు. ఈ రకంగా ఆయన తన వ్యాపారాన్ని ఆర్థికంగా గిట్టుబాటయ్యేలా చూసుకుంటూ ఉంటాడు. ఫలితంగా ఆయనకు సామాజికంగా కూడా మంచి గౌరవమన్ననలు దక్కుతున్నాయి.
ముగింపు
ఇవాళ సర్దార్ జనక్ సింగ్ ఆదాయం నెలకు రూ. 37,000 నుంచి రూ. 40,000 మధ్య ఉంటోంది. ఏడాదికి ఆరు బ్రాయిలర్ మేరకు కోళ్ల పంటను సంపాదిస్తున్నాడు. ఆయన సాధించిన విజయాలు గమనించి ఇతర కోళ్ల ఫారమ్ పెంపకందారులు వచ్చి ఆయన దగ్గర సలహాసూచనలు తీసుకుంటారు. మరి కొందరు తమంత తాము కోళ్ల పరిశ్రమ ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
సర్దార్ జనక్ సింగ్ సాధించిన విజయాల వెనుక ఆయన అనుసరించిన మార్కెటింగ్ నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పౌల్ట్రీ పరిశ్రమ పురోగతికి, పట్టణ ప్రాంతాలతో సత్సంబంధాలకు, ఆయన స్ఫూర్తినిస్తున్నాడు. ఆయనను చూసిన తరువాత ఎవరికైనా, సొంత గ్రామాలలోనే ఉంటూ లాభదాయకమైన వ్యాపారం చేయడం ఎవరికైనా తేలికే అనిపించకమానదు. అదే సమయంలో ఈ రకమైన వ్యాపారం కారణంగా పట్టణ ప్రాంతాలలోని వినియోగదారులకు నాణ్యమైన సరుకు అందుబాటులోకి వస్తుంది.
అమన్ దీప్ సింగ్
విద్యార్థి, (3వ సంవత్సరం) బి.వీఎస్సీ మరియు ఎ.హెచ్డా.ప్రవీణ్ కుమార్
అసిస్టెంట్ ప్రొఫెసర్,
వెటర్నరీ డివిజన్ & పశు సంవర్థక విస్తరణ విద్య
వెటర్నరీ సైన్సెస్ & పశు సంవర్థక విభాగం
ఆర్.ఎస్ పురా, ఎస్ కె యు ఎస్ టీ – జమ్ము (జమ్ము, కాశ్మీర్)ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి 17, సంచిక 2, జూన్ ౨౦౧౫



