పచ్చని చేలతో నేల తల్లి కళకళలాడాలంటే అక్కడి మట్టిలో తగిన మోతాదులో కార్బన్ (కర్బనం) పోషకాలు అత్యవసరం. తమిళనాడు రైతన్నలు ఇందుకోసం బయోచార్ (నల్ల మట్టి) వాడకాన్ని పరీక్షించి మంచి ఫలితాలు సాధించారు. మట్టిలో బయోచార్ కలపడం ద్వారా భూసారం భౌతికంగానే కాక, దాని రసాయనిక లక్షణాలు కూడా గణనీయంగా మెరుగుపడతాయని వారు గుర్తించారు. ఒకసారి బయోచార్ కలిసిన నేలల్లో మూడు పంటలకు సరిపడే కర్బన పోషకాలు నిలకడగా ఉంటున్నాయని వారు నిర్ధారించుకున్నారు. బయోచార్ వాడకం వల్ల మరో ప్రయోజనాన్ని కూడా వారు గమనించారు. పొలాలపై నిత్యం దాడి చేసి ఆక్రమించికుంటున్న ప్రొసోపిస్ జూలిఫ్లోరాకు అది విరుగుడుగా పనిచేస్తుందని తెలుసుకున్నారు.
మెట్ట ప్రాంతాలలోని వాతావరణం వానల రాకపోకలకు అంతగా అనుకూలంగా ఉండదు. ఆ కారణంగా అలాంటి నేలల్లో సాగు పనులు నిలకడగా చేపట్టడం సాధ్యం కాదు. గడ్డి జాతి మొక్కలు, ఓ మోస్తరు మొక్కలు, పెద్ద చెట్లు వంటివి ఇలాంటి ప్రాంతాలలో స్థానికంగా కనిపించే పచ్చధనం. అక్కడి నేలల్లో ఏడాది మొత్తంలో ఇంకిపోయే నీటి పరిమాణం కేవలం 200-250 మిల్లీ మీటర్ల నుంచి 500-600 మిల్లీ మీటర్ల మధ్య ఉంటుంది. గడచిన 30 ఏండ్ల కాలంలో విరుధ్ నగర్, రామనాథ పురం, శివగంగ జిల్లాల్లో అరకొర వానల కారణంగా భూసారాన్ని దెబ్బతీసే ప్రొసోపిస్ జూలిఫ్లోరా మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫలితంగా సేద్యయోగ్యమైన పొలాలు కూడా ఎందుకూ పనికి రాకుండా పోయాయి. ఎడారి నేలలుగా మిగిలిపోయాయి. పశువులకు ఆహారంగా గడ్డి పెంపకం కూడా తగ్గిపోయింది. దాంతో పశు సంపద కూడా తగ్గిపోతూ వచ్చింది. పశు సంపద వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వేరే చెప్పనక్కరలేదు. ఎప్పుడైతే పశు సంపద క్షీణించిపోయిందో పెరటి ఎరువుల (ఫార్మ్ యార్డ్ మాన్యయర్) తయారీ, దాని వాడకం కూడా కనుమరుగైపోయింది. వాస్తవానికి పెరటి ఎరువుల వాడుక, తయారీ తరతరాలుగా వస్తున్న సేంద్రీయ ఎరువుల విధానమని మన అందరికీ తెలిసినదే.
వ్యవసాయ పనుల్లో నల్ల మట్టి (దీనిని పోర్చుగీసు భాషలో టెర్ర ప్రేటా అంటారు) ఉపయోగాన్ని ఆర్గనైజేషన్ ఆఫ్ డెవలప్ మెంట్ యాక్షన్ అండ్ మెయిన్ టెనెన్స్ (ODAM) గురించి స్పష్టమైన అవగాహనకు వచ్చింది. స్వచ్ఛంద ప్రభుత్వేతర సంస్థ అయిన ఓడిఎఎం ఈ ప్రాంతపు రైతుల్లో బయోచార్ ఉపయోగాలను గురించి చైతన్యపరిచే బాధ్యతను చేపట్టింది. పోషకలోపంతో పొడిబారిన నేలలకు బయోచార్
అద్భుతమైన ఔషధంగా మాత్రమే కాక భూసారాన్ని పెంపొందించడంలో అత్యుత్తమ సాధనంగా రైతులకు నమ్మకం కలిగించింది. అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోయే ప్రొసోపిస్ జూలిఫ్లోరా మొక్కలను ఉపయోగించి ఈ బయోచార్ తయారు చేసుకోవచ్చని వారికి తెలియజేసింది.
బయోచార్ అంటే ఏమిటి ? బయోమాస్ ఎరువులలో కర్బనీకరణ ప్రక్రియ ద్వారా కర్బన పోషకాలను తయారు చేయడాన్నే బయోచార్ అంటారు. ఈ పోషక పదార్థాన్ని భూసారం పెంపొందించేందుకు ఉపయోగిస్తారు. అంతేకాక, బయోమాస్ వాడినప్పుడు ఎదురయే కొన్ని హానికర వాయువులను నియంత్రించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ వాయువులను నియంత్రించకపోతే మన పర్యావరణలో ఉండే సహజసిద్ధమైన గ్రీన్ హౌస్ వాయువులకు హానికలిగిస్తాయి. బయోచార్ వాడకం వల్ల కర్బనీకరణ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. |
జపాన్ లోను, అమెరికాలోను కొన్నేండ్లుగా సాగిన పరిశోధనల కారణంగా వ్యసాయపరంగా చాలా కీలకమైన మైక్రో ఆర్గానిజమ్ ను కాపాడేందుకు బయోచార్ తోడ్పడుతుందని నిర్ధారణ అయింది. బయోచార్ లోని సూక్ష్మరంధ్రాలు మరెన్నో ఇటువంటి మైక్రో ఆర్గానిజమ్ కు సురక్షితమైన ఆశ్రయాలుగా మారతాయి. వాటిని ఆహారంగా తీసుకునే ఇతర జీవాల నుంచి వాటికి రక్షణ కల్పిస్తాయి. అంతేకాక అవి వాతావరణ ప్రభావంతో నిర్జీవంగా మారిపోకుండా కాపాడతాయి. అంతేకాదు. వాటికి అత్యవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. ఈ అంశంపై సీమెన్ పూ ఫౌండేషన్ జరిపిన పరిశోధనలు, ప్రయోగాలు, చర్చలు ఓడిఎఎంకు స్ఫూర్తిగా నిలిచాయి. రకరకాలుగా చేపట్టిన ప్రయోగాలు ఆధారంగా బయోచార్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై ఒక నిర్ధారణకు వచ్చింది.
క్షేత్ర స్థాయి ప్రయోగాలు
తిరుచూలికి ఈశాన్యంగా 8 కిలోమీటర్ల దూరంలో ఓడిఎఎం ఏర్పాటుచేసిన బయోడీజిల్ డిమాన్ స్ట్రేషన్ యూనిట్ లో క్షేత్ర స్థాయి ప్రయోగాలు చేపట్టింది. ఈ ప్రాంతాన్ని మెట్ట ప్రాంతంగానే పరిగణిస్తారు. ఇక్కడ సగటు వార్షిక వర్షపాతం కేవలం 500 నుంచి 600 మిల్లీ మీటర్లు మాత్రమే. అందులో కూడా ఎక్కువ భాగం వర్షపాతం అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో మాత్రమే పడుతుంది. ఇక్కడి నేలలను పొడిబారిపోయిన ఆక్సిశాల్ ఎర్ర నేలలుగా పరిగణిస్తారు. ఇక్కడి నేల ముతకగా, మీడియం రంగులో ఇసుకతో కూడి ఉంటుంది. నీటి సదుపాయం చాలా తక్కువ. వాటిలో పోషక విలువలు దాదాపు శూన్యం.
ప్రొసోపిస్ జూలిఫ్లోరా ఆధారిత చార్ కోల్ ను స్థానికంగా ఉండే సుద్ద తయారీదారుల నుంచి కొనుగోలు చేస్తారు. దానిని ఓడిఏఎం బయో చార్ గా మార్చివేస్తుంది. ప్రయోగాలు చేపడుతుంది. చార్ కోల్ ముక్కలను వాటి రంగు, ప్రత్యేకతల ఆధారంగా గ్రేడ్లుగా వర్గీకరిస్తారు. ముందుగా దానిని మెత్తటి పొడిగా చేస్తారు. అలా పౌడర్ రూపంలో ఉన్న చార్ కోల్ పౌడర్ ను గాలి ప్రవేశించే అవకాశంలేని ఎయిరం టైట్ గోనె సంచుల్లో భద్రపరుస్తారు. అలా కాకుండా గాలి తగినట్లయితే చార్ కోల్ లక్షణం ప్రకారం తేమను పీల్చుకుంటుంది. ఫలితంగా చార్ కోల్ పౌడర్ నాసిగా మారిపోతుంది.
వివిధ రకాలైన ప్రయోగాలను ఓడిఏఎం చేపట్టింది. (బాక్సు గమనించగలరు.) 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల పొడవు, ఒకటిన్నర అడుగుల లోతు గోతులు తీస్తారు. వీటిని మనం మన వాడుక భాషలో మొక్కలు పెంచడానికి సిద్ధం చేసే పాదులు కట్టడం అంటాం. తరువాత అందులోనికి పై మట్టిని సగం వరకు మళ్లీ భర్తీ చేస్తారు. ఆ తరువాత ఈ ఎరువుల పొడిని రెండు మూడు అంగుళాల వరకు నింపుతారు. మళ్లీ దానిపై కొంత మట్టిని వేసి కప్పుతారు. ఈ క్రమంలో ఎరువులను నల్ల మట్టితో శుద్ధి చేస్తారు.
విత్తనాలు నాటడం, మొక్కలు పెంచడం
ఇలా ఎరువులతోను, మట్టితోను నింపిన గోతులలో లేదా పాదులలో బెండ, టమోటా, వంకాయ వంటి కూరగాయల విత్తనాలు నాటుతారు. ఒక్కో పాదులో నాలుగేసి మొక్కల గింజలను పాతుతారు. ఆ తరువాత వచ్చే వర్షాల కారణంగా వంకాయ, టమోటా గంజలు నీటికి కొట్టుకుపోతాయి. బెండ గింజలు మాత్రమే మొలకెత్తుతాయి. రెండు వారాల తరువాత, ఇరుగుపొరుగు దగ్గర మొలకెత్తిన వంకాయ, టమోటా మొక్కలను తీసుకువచ్చి వీటిల్లోనే నాటుతారు. ఇలా చేయడం వల్ల మొత్తం 12 మొక్కలు అంటే బెండ, టమోటా, వంకాయ మొక్కలు నాలుగేసి గింజలను నాటాం కదా. అవన్నీ సురక్షితంగా ఎదుగుతాయి.
ఇలా అన్ని రకాల కాయగూరల పెంపకానికి సుమారుగా 50 సెంట్ల భూమిని వినియోగించడం సర్వసాధారణం. ఇవి మాత్రమే కాకుండా మిరప, ఉల్లి, చిక్కుడు, బీన్స్ మొక్కలను ఇదే విధంగా ఆ కొద్ది పాటి స్థలంలో పెంచవచ్చు. ఇంకా, ములక్కాడ కూడా పండించవచ్చు. వీటన్నిటికీ బయో చార్ ఎరువును ఉపయోగించి మంచి ఫలితాలు సాధించవచ్చు.
ఇలా కాయగూరల పెంపకానికి ఉద్దేశించిన కొద్దిపాటి జాగాకు అవసరమైన నీటిని అవసరమైనప్పుడల్లా మనమే స్వయంగా నీరు అందించవచ్చు. రోజూ మొక్కల ఎదుగుదలను మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండవచ్చు. అవసరమైన సర్దుబాటు చర్యలను తొలి దశలో మాత్రమే చేపట్టడం సాధ్యమవుతుంది. బయో చార్ ఉపయోగించిన తొలి నాళ్లలో విత్తనాలకు రక్షణ లభించింది. ఆ తరువాత మనం ఉపయోగించిన పెరటి ఎరువులతో బయో చార్ రసాయనిక సంయోగం చెందుతుంది. ఇందుకు వివిధ రకాలైన నాన్ ఎడిబుల్ ఆయిల్ కేక్ ను అంటే ఆహారంగా ఉపయోగపడేందుకు అవకాశం లేని నూనెలను తీసిన తరువాత మిగిలే వ్యర్థపదార్థాలను నీటిలో కలిపి, వాటికి జతచేయాల్సి ఉంటుంది. ఈ మిశ్రమాన్ని తరచు కలిపుతూ ఉండడం వల్ల అది మరింత శక్తివంతమైనదిగా తయారవుతుంది. దానిని మరింత పులియబెట్టే ప్రక్రియ ఇది.
సాగు ఫలితాలు – పంట దిగుబడి
బెండ దిగుబడి రావడానికి కనీసం మూడు నెలలు పడుతుంది. టమోటా, వంకాయ మొక్కల నుంచి మాత్రం రెండు నెలలలోపే దిగుబడి వస్తుంది. ఇలా చార్ కోల్ ఆధారిత సాగు కారణంగా, మంచి దిగుబడి లభించే సీజన్ లో దాదాపుగా 4.70 కిలోలు, బెండ దిగుబడి అత్యధికంగా ఉంటుంది. అయితే బెండ రెండో సారి సాగు చేసినప్పుడే ఇలా గరిష్టంగా దిగుబడి వచ్చింది. తరువాత తగ్గుతూ వచ్చింది.
బాక్సు 1: చేపట్టిన ప్రయోగాలు – నల్ల మట్టి ప్రయోజనాలు
|
చార్ కోల్ కాకుండా ఇతరత్రా అనుసరించే పద్ధతుల్లో నూనె తీసేసిన కేకులను (జత్రోఫా, వేప) ఉపయోగించినప్పుడు బెండ దిగుబడి 1.32 కిలోల వరకు, టమోటా 2.5 కిలోల వరకు లభిస్తుంది. జత్రోఫా కేకును ఉపయోగించినప్పుడు వంకాయ దిగుబడి గరిష్టంగా 1.15 కిలోలు ఉంటున్నది. సగటును బెండ 338 గ్రాములు, టమోటా 100 గ్రాములు, వంకాయ 55 గ్రాములు ఉంటున్నది.
మనం అందరం ఊహించిన విధంగానే, చార్ కోల్ ఆధారిత వినియోగం కారణంగా ఎక్కువగానే ఫలసాయం లభించింది. ముఖ్యంగా ఇతర రకాలైన కంట్రోల్ ప్లాట్ పద్ధతిలో పోల్చినప్పుడు మంచి దిగుబడి వచ్చింది. ఇందుకు కారణం పోషకాలను కాపాడేందుకు, ఎక్కువ మోతాదులో నీటి తేమను కాపాడేందుకు ఇందులో ఉన్న సదుపాయాలే. ఫలితంగా చార్ కోల్ పౌడర్ సాయంతో భూమిని సుసంపన్నం చేయడం సాధ్యమవుతోంది.
నూనె తీసేసిన జత్రోఫా కేకును, చార్ కోల్ ను, తగినంత నీటితో కలిపి ఉపయోగించినప్పుడు మెరుగైన ఫలితాలు వచ్చాయి. అదే నీటితో నానపెట్టకుండా ఇలాంటి కేకు పౌడర్ ను, చార్ కోల్ ను కలిపి ఉపయోగించినప్పుడు ఓ మోస్తరుగా మాత్రమే దిగుబడి వచ్చింది. అయితే కొన్ని పద్ధతులను అనుసరించినప్పుడు నూనె తీసేసిన విత్తనాల కేకులను ఉపయోగించినప్పుడు, ముఖ్యంగా టమోటా, వంకాయ సాగులో, దిగుబడి చాలా కొద్దిగా దాదాపు ఏమీ రాలేదు. ఇందుకు కారణం వాటిలో టాక్సిక్ పదార్థాలు అధికంగా ఉండడం లేదా, వాటిని అధిక మోతాదులో ఉపయోగించడం కానీ కావచ్చు.
నీటితో మిళితం చేసిన బయో చార్ ఉపయోగించిన నేలల్లో మట్టిలో ఉల్లి, మిర్చి, చిక్కుడు, మునగ, వేరు సెనగ, లేక సపోటా, ఉసిరి, జాస్మిన్ (బొండు మల్లి) వంటివాటి పెంపకంలో కూడా ఈ రకమైన బయో చార్ ఉపయోగించి భూసారం పెంపొందించవచ్చు. బయోచార్ ఉపయోగించిన తరువాత అన్ని రకాల మొక్కల్లోను పెరుగుదల మెరుగ్గా ఉంది. మొక్కల ఎదుగుదల బాగుంది. వాటి వేర్లు బలంగా కనిపించాయి. ఇది సాధారణంగా రసాయనిక ఎరువులను వాడినప్పటి కన్నా మెరుగైన ఫలితాలు చూపించాయి.
భూమి పొరలలో ఈ విధంగా బయో చార్, ఇతర సేంద్రీయ ఎరువులను ఉపయోగించినప్పుడు భూమి భౌతిక లక్షణంలో (మట్టి సాంద్రత మెరుగైంది) కూడా మార్పు కనిపించింది. అక్కడి మట్టిలో రసాయనిక లక్షణాలు (పిహెచ్, సీఈసీ, ఇతర పోషకాలు) మెరుగయ్యాయి. ఫలితంగా మూడు సైకిల్స్ అంటే మూడు పంటలకు ఆ భూమి సారవంతంగా నిలిచింది.
వేరు సెనగ సాగు చేసిన వ్యవసాయ క్షేత్రాల్లో బయోచారం వాడిన తరువాత మట్టి స్వరూపస్వభావాల్లో గణనీయమైన మార్పు స్పష్టంగా కనిపించింది. అంతకముందు కన్నా మట్టి చాలా సున్నితంగా తయారైంది. వేరు సెనగ గుత్తులు రాలిపోవడం చాలా వరకు తగ్గిపోయింది. అందుకు కారణంగా మట్టి గట్టితనం తగ్గిపోవడం ఒక కారణం కావచ్చు. అంతేకాక బయో చార్ ఉపయోగించిన తరువాత అక్కడి నేలల్లో నీటి తేమను కాపాడుకునే సామర్థ్యం మెరుగుపడడం కూడా కావచ్చు. మట్టి పొరల్లోకి బయోచార్ ను, ఇతర సేంద్రియ ఎరువులను ప్రవేశపెట్టిన కారణంగా మట్టి సాంద్రత మెరుగైంది. భూమికి ఉండే భౌతిక లక్షణాలలో మార్పు కనిపించింది. ఆ నేలలో రసాయనిక పోషకాలు (పిహెచ్, సీఈసీ, ఇతర పోషకాలు) మెరుగయ్యాయి.
| ప్రారంభంలో వేరు సెనగ సాగుచేసి రైతన్న ఒకరు ప్రయోగాత్మకంగా చేపట్టిన పరీక్షలను స్వయంగా పరిశీలించారు. ఆయన తన చేనులో పండిస్తున్న వేరు సెనగకు ఈ బయోచార్ సామగ్రిని అందించడంజరిగింది. మొక్క పక్వానికి వచ్చే సమయంలో బయోచార్ ను ఆయన తన చేనులో ఉపయోగించాడు. పంట చేతికి వచ్చిన తరువాత ఆయనే స్వయంగా చెప్పాడు. ఇదివరకటి కన్నా ఎక్కువగా వేరు సెనగ గుత్తులు వచ్చాయని. బయోచార్ వాడకుండా ఉన్న చోటి కన్నా దానిని ఉపయోగించిన చోటే ఈ ప్రయోజనం చాలా స్పష్టంగా కనిపించింది. మరో రైతు బొండు మల్లి మొక్కల పెంపకం చేపట్టాడు. ఆయనకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. మొగ్గలు పెద్దవిగా ఉన్నాయి. ఆ తరువాత చేతికి వచ్చిన పూలు మరింత పెద్దవిగాను, బరువుగాను ఉన్నట్టు స్పష్టమైంది. వాటి నుంచి వచ్చే సువాసన కూడా మరింత ఆకట్టుకునేలా ఉంది. ఇతరుల పొలాల్లో వచ్చిన మల్లెల కన్నా ఈయన పొలంలోని మల్లెలు ఎక్కువ నాణ్యమైనవిగా గుర్తింపు పొందాయి. ఈ రెండు ఉదాహరణలు గమనించిన తరువాత వాళ్లు తరువాతి సేద్యంలో బయోచార్ వాడకాన్ని విధిగా చేపడుతున్నారు. |
ఇదే విధంగా బయో చార్ ఉపయోగించిన నేలల్లో ఉల్లి దిగుబడి సాధారణ పద్ధతిలో వచ్చిన దాని కన్నా 25 శాతం అధికంగా ఉంది. బీన్స్ దిగుబడి 30 శాతం నుంచి 50 శాతం వరకు అదనంగా వచ్చింది. టమోటా విషయంలో 30 నుంచి 40 శాతం అధికంగా దిగుబడి వచ్చింది. బొండు మల్లె సాగులో కూడా బయో చార్ వాడిన తరువాత ఫలసాయం చాలా ఎక్కువగా, బరువు ఎక్కువగా ఉన్నట్టు రైతన్నలు చెబుతున్నారు.
బయో చార్ వాడకాన్ని రైతన్నల ప్రోత్సాహం
ప్రయోగాల సమయంలో బయో చార్ ఉపయోగాలు గమనించిన తరువాత రైతన్నలు ఉత్సాహంగా ఈ పద్ధతిని అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు. ఎర్ర మట్టికి తేమను కాపాడుకునే శక్తి తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మెట్ట ప్రాంతాలలో ఈ సమస్య ఎక్కువ. అందువల్ల ఇలా నల్ల మట్టిని, ఎర్ర మట్టిని కలిపి ఉపయోగించడం వల్ల కలిగే లాభాలను రైతన్నలు బేరీజు వేసుకున్నారు. ఎర్ర మట్టి నేలల్లో నల్ల మట్టిని జతచేయడం వల్ల అంటే అందులోనికి నల్ల మట్టి (బయో చార్) చేర్చడం వల్ల ఎర్ర మట్టికి నల్ల మట్టికి ఉండే మంచి లక్షణాలు సమకూరుతున్నాయని వారు అర్థం చేసుకున్నారు. తేమను పట్టి నిలబెట్టడం సాధ్యమవుతుందని తెలుసుకున్నారు.
ఫలితాలను అంచనా వేసుకున్న తరువాతనే వారంతా బయో చార్ వాడకానికి ముందుకు వచ్చారు. ఆ రకంగా 10 గ్రామాలకు చెందిన 50 మంది వ్యవసాయదారులు ముందుగా ఎంపికయ్యారు. వారిని కుటుంబ సేద్యం చేస్తున్న వాళ్లు, ఎర్ర మట్టి నేలలతో కూడిన సొంత భూములున్న వాళ్లు, సాగు నీటి సదుపాయం ఉన్నవాళ్లు, కాయగూరలు పండిస్తున్న వాళ్లు, సేంద్రీయ వ్యవసాయం మీద ఆసక్తి ఉన్న వాళ్లు, చార్ కోల్ లభ్యత ఉన్న వాళ్లు అనే రకరకాల వర్గాల వారి నుంచి ఈ 50 మందిని ఎంపిక చేయడం జరిగింది.
ఇలాఎంపిక చేసిన వాళ్లకు బయో చార్ నల్ల మట్టిని సమకూర్చడం జరిగింది. కాయగూరలు, పూలు పెంచే వారికి వాటిని అందించారు. ఈ 50 మందిలో 26 మందికి 10 కిలోల చొప్పున బయో చార్ మట్టిని అందించారు. దీనిని 2 చదరపు మీటర్ల పరిధిలో ఉపయోగించాలని సూచించారు. ఈ 26 మందిలో ముగ్గురు బొండు మల్లె తోట చేపట్టారు. మిగిలిన వారంతా కాయగూరలను సాగు చేసారు. వీళ్లందరికీ మంచి ఫలితాలు వచ్చాయి.
భవిష్యత్తు విస్తరణ ప్రయత్నాలు
ప్రగతి శీల దృష్టి ఉన్న వారిని, వినూత్నమైన విధానాలను స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్న వారిని ఇతర పంటల సాగులో కూడా బయో చార్ వాడకం వైపు ఆకట్టుకోగలిగితే, ఈ నూతన విధానం మరింతగా వ్యాప్తిచెందుతుంది. అయితే, తక్కువ ఖర్చుతో బయో చార్ తయారీ విధానం రూపొందించగలిగితే మరింత ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకువెళ్లవచ్చును. అప్పుడే చిన్న, సన్న కారు రైతులు కూడా ఈ పద్ధతిని అనుసరించేందుకు వీలవుతుంది. ప్రస్తుతం, సేంద్రీయ వ్యవసాయదారుల అసోసియేషన్ లను ఏర్పాటు చేసే కృషి చురుగ్గా సాగుతోంది. అంతేకాక, భాగస్వామ్య పద్ధతిలో రైతులకు అవగాహన కలిగించేందుకు ఫార్మర్స్ ఫీల్డ్ స్కూల్స్ నిర్వహించేందుకు ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి.
ధన్యవాదాలు
సీమెన్పు ఫౌండేషన్, ఫిన్ ల్యాండ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వారే బయో చార్ వాడకంపై ప్రయోగాలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని వాళ్లే చేకూరుస్తున్నారు. అంతేకాదు, తమ పొలాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు అనుమతి ఇచ్చిన రైతన్నలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
జే. ఎలాంగో – వి.ఎం. కరుణాకరన్
ఆర్గనైజేషన్ ఫర్ డెవలప్ మెంట్ యాక్షన్ అండ్ మెయిన్ టెనెన్స్ (ఓడిఏఎం)
విరుధ్ నగర్ జిల్లా, తిరుచులి – 626 729
తమిళనాడు
ఈ-మెయిల్ : odamlango@gmail.com; karunagaranvm@gmail.com
ఆంగ్ల మూలం:
లీసా ఇండియా సంపుటి 17, సంచిక 1, మార్చ్ ౨౦౧౫
లీసా ఇండియా, సంపుటి ౨౪ , సంచిక 1 , మార్చ్ ౨౦౨౨



