మహారాష్ట్రలో అమలు చేసిన “బోధి “ ఆధారిత సమీకృత వ్యవసాయ విధానం చిన్న తరహా రైతుల జీవనోపాధిని మెరుగుపరిచింది. దీనిలోని వివిధ సమీకృత అంశాల ద్వారా ఈ నమూనా ఆదాయం, కుటుంబ పోషణ, వ్యవసాయ స్థితిస్థాపకత మరియు సుస్థిరతను మెరుగుపరుస్తుందని నిరూపించబడింది.
భారతదేశంలోని చిన్న తరహా రైతులకు పోషణ మరియు జీవనోపాధిని అందించడంలో మత్స్య పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది భారతదేశంలో సుమారు 14.5 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తుంది. సముద్ర మరియు మహాసముద్ర మత్స్య సంపదతో పాటు మంచినీటి మత్స్య సంపద కూడా జీవనోపాధికి తోడ్పడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే క్షీణిస్తున్న నీటి వనరులు మరియు పెరుగుతున్న నీటి కాలుష్యం వంటి కారణాలు అంతర్గతంగా దేశంలో ఉన్న మత్స్య పరిశ్రమకు సవాళ్లు విసురుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని అనేక జలాశయాలలో మత్స్య పరిశ్రమను ప్రోత్సహించడానికి తగినంత సామర్థ్యం ఉన్నా అవి తక్కువగా వినియోగించబడుతున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఉన్న ఎటపల్లి మరియు భంబ్రాగడ్ అలాంటి ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ మత్స్య పరిశ్రమను ప్రోత్సహించడానికి గణనీయమైన సామర్థ్యం ఉంది.
80 శాతానికి పైగా గిరిజన వర్గానికి చెందిన ఎటపల్లి మరియు భంబ్రాగడ్ ప్రాంతాలు తీవ్ర పేదరికంలో జీవిస్తున్నాయి. ఈ ప్రాంతంలో అధిక భాగం అటవీ ప్రాంతం. చాలా కుటుంబాలు తమ జీవనోపాధి కోసం జీవనాధార వ్యవసాయం మరియు కొన్ని అటవీ వనరులపై ఆధారపడి ఉన్నాయి. అయితే వాతావరణ మార్పుల కారణంగా ఇవి మరింతగా ప్రభావితమవుతున్నాయి. సంవత్సరాలుగా క్షీణించిన సహజ వనరులు మరియు తగ్గిన పంటల వైవిధ్యం రైతుల దుర్బలత్వాన్ని మరింత పెంచాయి.
మత్స్య ఆధారిత సమగ్ర వ్యవసాయం: ఒక ముఖ్యమైన అవకాశం
ఈ ప్రాంతంలోని గిరిజన సముదాయాలు ‘బోధి’తో సహా కొన్ని గొప్ప సంప్రదాయ వ్యవస్థలను ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. భూమిని కలిగి ఉన్న కుటుంబాలలో అత్యధిక శాతం మంది ఈ ప్రాంతంలో ‘బోధి ‘లుగా పిలువబడే చిన్న నీటి వనరులను సొంతం చేసుకుని ఉన్నారు. వ్యవసాయ భూములలో ఈ బోధి లు ఉండటం అనేది ఈ ప్రాంతపు యొక్క ఒక విశిష్ట లక్షణం. ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు, ఈ బోధి లు వరి పంటకు రక్షణాపరమైన నీటిని (protective irrigation) అందిస్తాయి. కొంతమంది రైతులు తమ ఇంటి అవసరాల కోసం ఈ బోధి లనుండి చేపలను కూడా పట్టుకుంటారు.
ప్రాథమిక సర్వేలో, బోడీల నిర్వహణ సరిగా లేదని తేలింది. అలాగే, పంటల సాగు పద్ధతులను మెరుగుపరచాల్సిన అవసరం కూడా ఉంది. అందువల్ల, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) సహకారంతో BAIF డెవలప్‌మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్, బోడీ ఆధారిత సమీకృత వ్యవసాయ వ్యవస్థను ప్రోత్సహించింది. వ్యవసాయ వైవిధ్యీకరణను ప్రోత్సహించడం ద్వారా పేద కుటుంబాల జీవనోపాధిని, వారి స్థైర్యాన్ని మెరుగుపరచడమే దీని లక్ష్యం. ఈ కార్యక్రమం 8 గ్రామాలలో అమలు చేయబడుతోంది.
వృత్తాకారచక్రంలో స్థితిస్థాపకత భావనను తెలియజేయడం
జలాశయాల ఆధారిత వ్యవస్థ వ్యవసాయ విధానంలో చక్రీయతను నెలకొల్పడానికి సహాయపడుతుంది. ఈ చక్రీయత జలాశయాల ఆధారిత వ్యవసాయ వ్యవస్థ చుట్టూనే తిరుగుతుంది. జలాశయాలను లోతుగా చేయడం వల్ల వాటి నీటి నిల్వ సామర్థ్యం, ప్రక్కనే ఉన్న పొలాల్లోని నేల తేమ శాతం మెరుగుపడతాయి. జలాశయాలలో నీటిలో మొక్కల పెరుగుదలను మెరుగుపరచడానికి వివిధ చర్యలు ప్రోత్సహించబడుతున్నాయి. ఇది అంతర్గత మత్స్య పరిశ్రమకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుంది. జలాశయాల వెంబడి కోళ్లు, బాతుల పెంపకాన్ని ప్రవేశపెట్టారు. కోళ్లు, బాతుల రెట్టలు జలచరాలు, చేపల పెరుగుదల కోసం జలాశయాలలోని నీటిని మరింత సారవంతం చేయడానికి సహాయపడతాయి. మత్స్య వ్యర్థాలు నీటిలో మొక్కల పోషకాల లభ్యతను మరింత మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఈ నీటిని ఉద్యానవన మొక్కలు, కూరగాయల పంటలకు ఉపయోగిస్తారు. పోషకాలు సమృద్ధిగా ఉన్న ఈ నీరు మొక్కల పెరుగుదలను మరింత మెరుగుపరుస్తుంది, పంటల దిగుబడిని పెంచడంలో సహాయపడుతుంది, అదే సమయంలో కృత్రిమ ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
సామాజిక వ్యవస్థీకరణ మరియు సామర్థ్య నిర్మాణం
రైతులను “గ్రామ నియమావళి సమితి”గా పిలువబడే 8 గ్రామ ప్రణాళికా కమిటీలుగా సంఘటితం చేశారు. ఈ గ్రామ ప్రణాళికా కమిటీలు బోధి రైతుల కోసం గ్రామ స్థాయిలో చేపట్టే కార్యక్రమాల ప్రణాళిక మరియు తదుపరి చర్యలలో చురుకుగా పాల్గొంటాయి. శిక్షణ మరియు సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల కోసం రైతులను ఒకచోట చేర్చడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయి. క్లస్టర్ స్థాయిలో ఈ కమిటీలను ఏకీకృతం చేసి ఒక రైతు ఉత్పత్తిదారుల సంస్థ (FPO)ను ఏర్పాటు చేయాలని కూడా ప్రణాళిక చేయబడింది. భవిష్యత్తులో ఈ FPO సామూహికంగా సాగుకు అవసరమైన ముడిసరుకులను సేకరించి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ అనుసంధానాలను ఏర్పాటు చేస్తుంది.
చేపల పెంపకంలో వివిధ మెరుగైన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించి, శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలలో “బోధి” తయారీ, నీటి నాణ్యత అంచనా, చెరువులలో చేప పిల్లలను వదలడం, మేత నిర్వహణ, వ్యాధులను గుర్తించడం, చేపల పెరుగుదలను పర్యవేక్షించడం మొదలైన అంశాలపై క్షేత్రస్థాయి ప్రదర్శనలు ఉన్నాయి. ఈ విధానంలో సుమారు 300 మంది రైతులకు శిక్షణ ఇవ్వబడింది. ప్రారంభంలో, శిక్షణ ఇచ్చేవారు, శిక్షణార్థులకు వారు మాట్లాడే సాధారణ భాష అయిన మాడియాలో మాట్లాడలేకపోయారు. ఈ సవాలును అధిగమించడానికి, మరాఠీ అర్థం చేసుకోగల గ్రామాలకు చెందిన కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌లను (CRP) BAIF గుర్తించింది. ఈ CRP లు శిక్షణలు మరియు ప్రదర్శనల సమయంలో అనువాదంలో సహాయపడ్డారు. శిక్షణా సామగ్రిని కూడా సులభంగా అర్థమయ్యే చిత్రాలతో మాడియా భాషలోకి అనువదించారు.
క్షేత్రస్థాయిలో అమలు
సాంప్రదాయకంగా వరి పొలాలకు రక్షణాత్మక నీటిపారుదల కోసం బోధి లను నీటి వనరుగా ఉపయోగిస్తున్నారు. చాలా బోధి లు పూడికతో నిండిపోయి ఉన్నాయి, దీనివల్ల వాటి నిల్వ సామర్థ్యాలు పరిమితమవుతున్నాయి. ముందుగా బోధి లలోని పూడికను తొలగిస్తారు. తవ్విన పూడికను పొలాలకు వేస్తారు. మెరుగైన చేపల పెంపకం కోసం కూడా బోధి లను ఉపయోగిస్తారు.
ఈ కార్యకలాపాన్ని ప్రారంభించే ముందు రైతులకు చెరువు కొలత మరియు తయారీకి సంబంధించిన సరైన పద్ధతులలో శిక్షణ ఇవ్వబడింది. చెరువు తయారీలో భాగంగా దున్నడం మరియు సున్నం వేయడం వంటి సరైన పద్ధతులు చేపట్టబడ్డాయి. సాగు చేసే ప్రధాన చేపలలో రోహు, కట్ల, గ్రాస్ కార్ప్ మరియు కామన్ కార్ప్ ఉన్నాయి. ఈ కార్యకలాపం నుండి గరిష్ట రాబడిని సాధించడానికి ఉపరితలంపై ఆహారం తీసుకునేచేపలు, అడుగున ఆహారం తీసుకునేచేపలు మరియు మధ్యస్థాయిలో ఆహారం తీసుకునే చేపల కలయికను ప్రవేశపెట్టారు. ప్రతి చెరువులో నీటి లభ్యత ఆధారంగా చేప పిల్లల సంఖ్యను లెక్కించేలా రైతులకు శిక్షణ ఇవ్వబడింది. ఆవు పేడ, నూనె గింజల పిండి మరియు ఎరువులను ఉపయోగించి చేపల మేతను సరైన పద్ధతిలో నిర్వహించడానికి రైతులకు మార్గదర్శనం చేయబడింది. ఆ ప్రాంతంలో సకాలంలో మరియు నాణ్యమైన చేప పిల్లలు లభించేలా చూసేందుకు ఆ క్లస్టర్‌లో ఒక చేపల హేచరీని(చేపలు లేదా పౌల్ట్రీ (కోళ్లు) గుడ్లను కృత్రిమంగా పొదిగే ప్రదేశం) ప్రోత్సహించారు.
‘బోధి ‘ల (Bodis) పై ‘మాచాన్’ల (machans) రూపంలో కోళ్ల షెడ్లను ఏర్పాటు చేశారు. చేపల పెంపకానికి ఈ కోళ్లు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఈ కోళ్ల విసర్జితాలు చేపలకు ఆహార లభ్యతను పెంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా కోడి గుడ్లు మరియు కోళ్ల విక్రయం రైతులకు అదనపు ఆదాయ వనరుగా కూడా ఉపయోగపడతాయి. ఈ కోళ్ల కోసం తగిన టీకా కార్యక్రమాలు మరియు నిర్వహణ పద్ధతులను ప్రవేశపెట్టారు.
ఈ ప్రాంతంలో వరి ప్రధాన పంట కావడంతో మెరుగైన రకాలతో సహా మెరుగైన సాగు పద్ధతులను ప్రవేశపెట్టారు. పొలాల గట్ల వెంబడి మరియు బోధి గట్ల మీద సీతాఫలం, నిమ్మ వంటి ఉద్యానవన పంటలను నాటారు. వారి వ్యవసాయ భూమిలోని చిన్న కమతాలలో పోషక తోటల రూపంలో వివిధ రకాల కూరగాయల పంటలను ఏర్పాటు చేస్తారు. చేపల పెంపకం కారణంగా బోధి లలో ఉన్న నీరు కొన్ని పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఈ నీటిని పంటలకు మరింతగా ఉపయోగించడం ద్వారా మొక్కలకు అవసరమైన పోషకాలు అందుతాయి. కంపోస్టింగ్ పద్ధతులు మరియు వర్మీకంపోస్ట్ ఉత్పత్తి ద్వారా సేంద్రియ పదార్థాల పునర్వినియోగం కోసం వివిధ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇచ్చారు. అటవీ వృక్షాల నిర్వహణ మరియు అటవీయేతర ఉత్పత్తుల (NTFPs) సుస్థిర సేకరణపై అవగాహన మరియు సామర్థ్య పెంపు కార్యక్రమాలను నిర్వహించారు.
ఫలితాలు
బోధి ఆధారిత సమీకృత వ్యవసాయం యొక్క ప్రధాన ఫలితాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ప్రతి బోధి లో ఒక కుటుంబానికి సగటున 30 కిలోల చేపలు ఉత్పత్తి అయ్యేవి. మెరుగైన పద్ధతులను అవలంబించడం ద్వారా రైతులు సంవత్సరానికి ఒక బోధి లో సుమారు 128 కిలోల చేపలను పండించగలిగారు. దీని ఫలితంగా వారి ఆదాయం మరింత పెరిగింది. సగటు వ్యవసాయ రాబడి సంవత్సరానికి రూ. 45,000/- నుండి దాదాపు రూ. 1 లక్షకు పెరిగింది. భవిష్యత్తులో పండ్ల చెట్లు ఈ రాబడికి మరింత తోడ్పడతాయి. రైతులు మెరుగైన నైపుణ్యాలను సంపాదించడంతో మత్స్య మరియు కోళ్ల పెంపకం నుండి వచ్చే ఆదాయం కూడా మెరుగుపడుతుంది. ఈ చర్యకు ముందు మరియు తర్వాత వనరుల వారీగా వచ్చిన రాబడులను పట్టిక 1లో పొందుపరిచారు.
పట్టిక 1: వనరుల వారీగా వార్షిక వ్యవసాయ రాబడి
జోక్యాలు | జోక్యానికి ముందు (రూ.) | జోక్యం తర్వాత(రూ.) |
మత్స్య పరిశ్రమ | 5313 | 22400 |
కోళ్ళ పెంపకం (గుడ్లు మరియు పక్షులు) | 0 | 19512 |
పోషణ తోటల నుండి కూరగాయలు (5 R) | 0 | 6653 |
ఖరీఫ్ వరి (3 ఎకరాలు) | 35320 | 47560 |
రబీ- శనగ | 0 | 4660 |
కలపేతర అటవీ ఉత్పత్తులు (NTFP) | 4500 | 4500 |
మొత్తం | 45133 | 105285 |
రైతులు మెరుగైన నైపుణ్యాలను పొందుతారు. జోక్యానికి ముందు మరియు తర్వాత వనరుల వారీగా రాబడులు పట్టిక 1లో ప్రదర్శించబడ్డాయి.
సవాళ్లను అధిగమించడం
ప్రారంభ దశలో సమీకృత బోధి వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించే క్రమంలో వివిధ సవాళ్లు ఎదురయ్యాయి. ఈ సవాళ్లలో పాల్గొనేవారిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం కూడా ఒకటి. చర్చలు మరియు ప్రదర్శనల ద్వారా దీనిని పరిష్కరించడం జరిగింది.
ఈ ప్రాంతంలో నాణ్యమైన చేప పిల్లల లభ్యత ఒక సవాలుగా ఉండేది. సమీప ప్రాంతాల్లోని పేరున్న చేపల హేచరీలతో అనుసంధానం కల్పించడం ద్వారా ఈ సమస్య పరిష్కరించబడింది. నాణ్యమైన చేప పిల్లలు దీర్ఘకాలం పాటు అందుబాటులో ఉండేలా చూసేందుకు, ఈ ప్రాంతంలో ఒక కొత్త హేచరీ కూడా అభివృద్ధి చేయబడుతోంది.
మేతకు వెళ్లే పశువులు ‘బోధి ‘ నిర్మాణాలకు అలాగే పంటలకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. గ్రామ స్థాయిలో నియంత్రిత పశుమేత విధానాన్ని అవలంబించేలా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. గ్రామ పంచాయతీలు తీసుకున్న ఈ నిర్ణయం మరికొంతమంది ఇతర రైతులు కూడా ‘బోధి ‘ ఆధారిత విధానాన్ని అలాగే రబీ పంటల సాగును చేపట్టేలా ప్రోత్సహించింది.
కొంతమంది రైతులు చేపలు, కూరగాయలు కోళ్ల దొంగతనాలతో పాటు కోళ్లపై అడవి జంతువుల దాడిని కూడా ఎదుర్కొన్నారు. రైతులు తమ నివాసాలను మార్చుకోవడం లేదా బోధి ల సమీపంలో తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. పొలాల చుట్టూ తక్కువ ఖర్చుతో కంచె వేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు.
ముందుకు సాగే మార్గం
సవాళ్లు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఈ కార్యక్రమం ద్వారా 226 కుటుంబాలు లబ్ధి పొందాయి. అదనంగా, విస్తరణ దశలో మరో 600 కుటుంబాలను చేర్చనున్నారు. బోధి ఆధారిత సమీకృత వ్యవసాయ విధానం రైతులకు బహుళ జీవనోపాధి వనరులను సృష్టించింది. ఇది వ్యవసాయ విధానంలో వైవిధ్యాన్ని, కుటుంబ స్థాయిలో పోషకాహార వైవిధ్యాన్ని పెంచింది. బోధి ఆధారిత సమీకృత వ్యవసాయ విధానం, దానిలోని వివిధ సమీకృత భాగాల ద్వారా, వ్యవసాయ క్షేత్రం యొక్క స్థితిస్థాపకతను పెంచి, సుస్థిరతను ప్రోత్సహించింది. ఇది ఈ ప్రాంతంలో మెరుగైన, సుస్థిరమైన జీవనోపాధి మరియు సుస్థిర మత్స్య సంపద కోసం బహుళ ఫలితాలను అందించే, అనుకరించదగిన ఒక నమూనా.
Yogesh Sawant
Chief Thematic Programme Executive
(Farm Based Livelihoods and Climate Action)
BAIF Development Research Foundation
BAIF Bhavan, Dr. Manibhai Desai Nagar Warje
Pune – 411058
E-mail: ygsawant@baif.org.in
Source: LEISA India, English Edition, March 2025



