పోషకాహార పెరటి తోటలు- కుటుంబ పోషణ మరియు ఆదాయం

వర్షాధార వ్యవసాయంలో, వాతావరణ మార్పులకు వ్యవసాయ జీవనోపాధి ఎక్కువగా దెబ్బతింటుంది, ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో వ్యవసాయ ఆధారిత సంస్థలు రైతులు వ్యవసాయంలో కొనసాగడానికి అవసరమైన సహాయాన్ని అందించడంలో చాలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. పెరటి తోటలు అనేది మహిళలకు సాధికారత కల్పించడంతో పాటు ఆహారం, ఆదాయం మరియు పోషకాహార భద్రత వంటి బహుళ అవసరాలను తీర్చేటటువంటి సంస్థ.

కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా హుబ్బళ్లి తాలూకాలో చన్నపూర్ మరియు చౌరగుడ్డ గ్రామాలు ఉన్నాయి. ఎక్కువ మంది రైతులు చిన్న చిన్న కమతాలను కలిగి ఉన్నారు మరియు వర్షాధార వ్యవసాయాన్ని ఆచరిస్తున్నారు, నీటిపారుదల కోసం దాదాపు పూర్తిగా వార్షిక రుతుపవనాలపై ఆధారపడి ఉన్నారు. పేలవమైన నేలలు, ఎరువులు మరియు పురుగుమందుల విచక్షణారహిత వినియోగం ఉత్పత్తి ఖర్చును పెంచడమే కాకుండా, పంటకు కావలసిన ఇతర పెట్టుబడులపై ఎక్కువ ఆధారపడటం, తక్కువ ఉత్పాదకత, అనిశ్చిత ఆదాయాలు మరియు రసాయనాలతో నిండిన ఆహార ఉత్పత్తికి కూడా దారితీశాయి. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడిన అస్థిర వాతావరణ పరిస్థితులు వారి ప్రమాదకర జీవనోపాధిని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయి. గృహ ఆహారం మరియు పోషకాహార భద్రత ప్రమాదంలో ఉంది. వ్యవసాయ శాఖ మరియు సంబందిత  సంస్థల నుండి పర్యావరణ అనుకూల వ్యవసాయంపై సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో, రైతులు, ముఖ్యంగా యువత వ్యవసాయం నుండి దూరమవుతున్నారు.

ఈ సందర్భంలో 2023లో AME ఫౌండేషన్, రోటరీ క్లబ్ ఇందిరానగర్ సహకారంతో రైతుల జీవనోపాధిని మెరుగుపరచడానికి స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడంపై ఒక ప్రోజెక్ట్ అమలు చేసింది. మెట్ట భూములలో వ్యవసాయం చేసే రైతులకు క్రమబద్ధంగా మరియు ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులను అవలంబించడానికి మద్దతు ఇవ్వడానికి ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. మొక్కజొన్న, సోయాబీన్ మరియు జొన్న వంటి క్షేత్ర పంటలలో స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై రైతులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు, గృహాలకు పోషకాహారం మరియు ఆదాయాన్ని పొందేందుకు వీలుగా కిచెన్ గార్డెన్‌లను కూడా ప్రోత్సహించారు.

పెరటి తోటల పెంపకం

వ్యవసాయ మహిళలు తమ పెరటిలో కిచెన్ గార్డెన్లను పెంచుకోవడంలో సహాయపడటం ఒక ముఖ్యమైన విషయం. ఈ పెరటి తోటల పెంపకంలో పాల్గొనే కుటుంబాల ఆహారంలో ఆహార వైవిధ్యాన్ని పెంచడానికి మరియు ప్రవేశపెట్టిన కూరగాయల కోసం మార్కెట్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడ్డాయి. ఆసక్తి ఉన్న ప్రతి ఇంటికి సుమారు 10-13 రకాల కూరగాయల విత్తనాలను కలిగి ఉన్న కిచెన్ గార్డెన్ కిట్ అందించబడింది. కిచెన్ గార్డెన్లను పెంచడం ద్వారా, మహిళలు అనేక రకాల కాలానుగుణ కూరగాయలను పండించగలిగారు.

2023-24లో, 70 మంది గ్రూప్ సభ్యులకు 13 రకాల కూరగాయలతో కూడిన కిచెన్ గార్డెన్ కిట్‌లను అందించారు. అధిక వర్షాల కారణంగా సీజన్ ప్రారంభంలో విత్తనాలు వేసిన వారికి, విత్తనాలు మొలకెత్తలేదు. కానీ ఆలస్యంగా విత్తడం ప్రారంభించిన దాదాపు 40% మంది మహిళలు తోటల నుండి కూరగాయలను కోయగలిగారు. మహిళలు వంటగది వ్యర్థాలు, చెట్ల కొమ్మలు మరియు ఎండిన ఆకులతో కంపోస్టింగ్ చేసి గొప్ప సేంద్రీయ కంపోస్ట్‌ను తయారు చేశారు. ఈ కంపోస్ట్ పూల తోటలను సారవంతం చేయడానికి ఉపయోగిస్తారు. రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు మొక్కల పెరుగుదలను ప్రోత్సహించడానికి వారు పంచగవ్య మరియు జీవామృతం వంటి సేంద్రీయ ద్రవ ఎరువులను కూడా తయారు చేశారు. తెగుళ్ళు మరియు వ్యాధులను నిర్వహించడానికి, వారు సహజ పురుగుమందులుగా వేప నూనె స్ప్రేను ఉపయోగించారు. నేల తేమను నిలుపుకోవడానికి, కలుపు మొక్కలను అణిచివేయడానికి మరియు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మొక్కల చుట్టూ గడ్డి మరియు ఎండిన ఆకులు వంటి సేంద్రీయ మల్చ్‌ను పూశారు. ప్రతి ఇంటిలో వంకాయ, బెండ, టమోటా, పొట్లకాయ, దోసకాయ, ముల్లంగి మరియు ఆకుకూరలు మొదలగు కూరగాయలు ఉత్పత్తి చేయబడ్డాయి. సగటున ప్రతి ఇంటిలో ఒక సీజన్‌లో రూ.2500-3500 విలువైన కూరగాయలు ఉత్పత్తి చేయబడ్డాయి.

2024 సంవత్సరం దేశంలో ధార్వాడ్ జిల్లాకు మళ్ళీ భారీ వర్షపాతం నమోదైన సంవత్సరం. అకాల వర్షాలు పంటలను నాశనం చేసి, నష్టపరిచాయి. రైతులు పంట నష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది మరియు అలాంటి పరిస్థితిలో దాదాపు 25 మంది మహిళా రైతులు తమ పెరట్లో పెరటి తోటలను పెంచారు. ప్రతి కుటుంబం ఒక సీజన్‌లో రూ.3000-4000 విలువైన కూరగాయలను ఉత్పత్తి చేసింది. పంట నష్టం కారణంగా ఆహార కొరతను ఎదుర్కొంటున్న ఈ కుటుంబాలకు కిచెన్ గార్డెన్లు ఒక వరంలా పనిచేశాయి.

బాక్స్ 1: సైనాజా కేసు

శ్రీమతి సైనాజా ఎం షెతసనాది ధార్వాడ్‌లోని హుబ్బళ్లి తాలూకాలోని చన్నాపూర్ గ్రామంలో 4 మంది సభ్యుల కుటుంబంతో నివసిస్తున్నారు. ఆమె కుటుంబం జీవనోపాధి కోసం ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడుతుంది. వారికి 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆమె తన పెరటిలో ఒక చిన్న స్థలం కలిగి ఉండటం వలన ఆమె తన కుటుంబం కోసం తాజా సేంద్రీయ ఉత్పత్తులను పండించాలని కోరుకుంది. అందువల్ల స్థిరమైన తోటపని పద్ధతులను అవలంబించింది. స్థిరమైన పద్ధతులు చిన్న స్థలాలను ఉత్పాదక మరియు పర్యావరణ అనుకూల తోటలుగా ఎలా మారుస్తాయో తెలుసుకోవాలని ఆమె చాలా ఆసక్తిగా ఉంది.

కిచెన్ గార్డెనింగ్‌లో శిక్షణ పొందిన మహిళల్లో సైనాజా ఒకరు మరియు ఆమెకు వివిధ కూరగాయల విత్తనాలతో కూడిన కిచెన్ గార్డెన్ కిట్ అందించబడింది. ఆమె తన ఇంటి వెనుక ప్రాంగణంలో తగినంత సూర్యకాంతి పొందే ప్రాంతాన్ని ఎంచుకుంది. ఇంట్లో తయారుచేసిన కంపోస్ట్ మరియు సేంద్రియ ఎరువును జోడించింది. స్థలాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవడానికి ఎత్తైన పడకలు, నిలువు తోటపని నిర్మాణాలు మరియు కంటైనర్లను చేర్చడానికి ఆమె తోట లేఅవుట్‌ను ప్లాన్ చేసింది.

ఆమె వంటగది వ్యర్థాలు, చెట్ల కొమ్మలు మరియు ఎండిన ఆకులతో కంపోస్టింగ్ చేసి గొప్ప సేంద్రీయ కంపోస్ట్‌ను  తయారు చేసింది. ఈ కంపోస్ట్‌ను పెరట్లో తోటలను సారవంతం చేయడానికి ఉపయోగిస్తారు. రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు మొక్కల పెరుగుదలను ప్రోత్సహించడానికి ఆమె పంచగవ్య, జీవామృతాలను సేంద్రీయ ద్రవ ఎరువులుగా ఉపయోగించారు. సహజ తెగులు నియంత్రణ కోసం ఆమె వేప నూనె, స్ప్రే, నీటిని సహజ పురుగుమందులుగా ఉపయోగించారు. నేల తేమను నిలుపుకోవడానికి, కలుపు మొక్కలను అణచివేయడానికి మరియు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆమె మొక్కల చుట్టూ గడ్డి మరియు ఎండిన ఆకులు వంటి సేంద్రీయ రక్షక కవచాన్ని వేసింది.

ఇంటి అవసరాలకు కూరగాయల కోసం ప్రతి నెలా దాదాపు రూ.800-1000 ఖర్చు చేసేదానినని, ఇప్పుడు వాటిని తన పెరట్లో ఉత్పత్తి చేసుకోగలుగుతున్నానని షైనాజా చెప్పింది. తాను సొంతంగా ఉత్పత్తి చేయడం ద్వారా రూ.3800 విలువైన కూరగాయలను పండించగలిగాను.

ఆమె విధానం ఆమె కుటుంబానికి తాజా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే కాకుండా పర్యావరణ స్థిరత్వం మరియు సమాజ భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ఆమె తన తోటపని జ్ఞానాన్ని పొరుగువారితో చురుకుగా పంచుకుంటుంది. తన అనుభవాలు మరియు జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ఆమె ఇతరులను స్థిరమైన తోటపని పద్ధతులను అవలంబించడానికి ప్రేరేపిస్తూనే ఉంది, ఇది పచ్చని మరియు ఆరోగ్యకరమైన వాతావరణానికి దోహదం చేస్తుంది. ఆమె విజయవంతమైన కిచెన్ గార్డెన్ అనేక మంది కమ్యూనిటీ సభ్యులకు స్థిరమైన జీవన సంస్కృతిని పెంపొందించే వారి స్వంత తోటలను ప్రారంభించడానికి ప్రేరణనిచ్చింది.

 

AME Foundation
No. 204, 100 Feet Ring Road,
3rd Phase, Banashankari 2nd Block, 3rd Stage
Bangalore - 560 085, India
www.amefound.org
E-mail: leisaindia@yahoo.co.in

Source: LEISA India, English Edition, September 2025

Recent Posts

గ్రామీణ ప్రజలలో నూతన ఆవిష్కరణలను అవగతంచేసుకొనే  సామర్థ్యాన్ని పెంపొందించడం

గ్రామీణ ప్రజలలో నూతన ఆవిష్కరణలను అవగతంచేసుకొనే సామర్థ్యాన్ని పెంపొందించడం

గ్రామీణ వ్యవసాయదారులకు  స్థిరమైన యాంత్రీకరణ కేవలం యంత్రాల గురించి కాదు - ఇది స్థానిక సామర్థ్యం, ​​సంస్థ మరియు...

భారతదేశంలో గుమ్మడికాయల సాగుకు కొత్త కేంద్రం మైన ఒడిస్సా రాష్ట్రం

భారతదేశంలో గుమ్మడికాయల సాగుకు కొత్త కేంద్రం మైన ఒడిస్సా రాష్ట్రం

తూర్పు ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఉన్న, అధికంగా గిరిజనులు నివసించే కరంజియా బ్లాక్‌లో కను చూపు దూరం వరకు...