స్వయంకృషికి సమానమైనది లేనేలేదు-ఆర్థిక సంక్షోభ సమయంలో నిలదొక్కుకున్న స్థానిక రైతులు

ఫార్మ్ ఆన్ వీల్స్ – సంచార వ్యవసాయ శాల – ఆవిష్కరణ రైతు సంఘాలు తమ ఉత్పత్తులను విభిన్నమైన స్థానిక మార్కెట్లలో వికేంద్రీకరణ పద్ధతిలో విక్రయించుకునేందుకు అవకాశాలు కల్పిస్తోంది. మేఘాలయ రైతులకు ఈ అవకాశాలు చేకూర్చడంలో (నార్త్ ఈస్టు స్లో ఫుడ్ అండ్ అగ్రో బయో డైవర్శిటీ సొసైటీ – NESFAS – దీనిని నెస్ ఫాస్ అని వ్యవహరిద్దాం.)  సహకారం అందిస్తోంది. ఈ అవకాశాలను ఉపయోగించేలా రైతులను ప్రోత్సహించడమే కాకుండా తమ పరిసరాలలోని ఇతర రైతులకు కూడా దీనిపై అవగాహన పెంచేందుకు కృషి కొనసాగిస్తోంది.

ప్రపంచమంతటా కోవిడ్ 19 కరోనా వైరస్ విషపు కోరలు వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో అన్ని ప్రాంతాలు అల్లకల్లోలమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడంతో విశ్వవ్యాప్తంగా చిన్న రైతులు మరిన్ని ఇక్కట్లలో పడ్డారు. వారికి మూలధనం అనేది ఏమీ ఉండదు. అందువల్ల వారికి వెన్నుదన్ను అనేది ఏమీ ఉండదు. నిత్యం వారికి తోడ్పడుతుంటే స్థానిక మార్కెట్లు చాలా వరకు మూతబడ్డాయి. కొన్ని పాక్షికంగా మాత్రమే పనిచేస్తున్నాయి. అవి కూడా ప్రభుత్వం నిర్దేశించిన ఆంక్షల పరిధిలోనే పనిచేసే స్థితి. ఇవన్నీ రైతులకు చాలా సమస్యలు తెచ్చిపెట్టాయి. కానీ, స్వయం సమృద్ధి సాధించిన స్థానిక రైతులు మాత్రం ధైర్యం కోల్పోలేదు. కాలం తెచ్చిన సమస్యలను, పరీక్షలను ఎదుర్కొనేందుకే సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అనేక వినూత్న పరిష్కార మార్గాలను ఆవిష్కరించుకున్నారు. ఈ ప్రయత్నంలో వారికి ఈశాన్య ప్రాంత స్థానిక ఆహార ఉత్పత్తి, సేద్య రంగ వైవిధ్య సాధన సంస్థ (నెస్ ఫాస్) చేయూత ఇస్తోంది. ఇది లాభాపేక్ష  లేని స్వచ్ఛంద సంస్థ. ఇది మేఘాలయ రాష్ట్ర రాజధీని పట్టణమైన షిల్లాంగ్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. మేఘాలయ, నాగాల్యాండ్ రాష్ట్రాలలోని 130 గ్రామాలలో నెస్ ఫాస్ కార్యకలాపాలు సాగుతున్నాయి. మేఘాలయ, నాగాల్యాండ్ రాష్ట్రాలలోని 130 గ్రామాలలో నెస్ ఫాస్ కార్యకలాపాలు సాగుతున్నాయి. దేశీయ ఆహార ఉత్పత్తిని, వినియోగాన్ని ప్రోత్సహిస్తూనే వాటిని సంరక్షించేందుకు ఈ సంస్థ కృషి చేస్తోంది. ప్రస్తుతం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ – ఆర్ఈసి) ఆర్థిక సహాయంతో నిర్వహిస్తున్న ఒక పథకం అమలులో నెస్ ఫాస్ పాలుపంచుకుంటోంది. ఈ పథకం పేరు – నో వన్ షల్ బి లెఫ్ట్ బిహైండ్ ‘బయో డైవర్శిటీ ఫర్ ఫుడ్, న్యూట్రిషన్ అండ్ ఎనర్జీ’. దీనిని అనువాదం చేసుకుంటే ఇలా ఉంటుంది. ఆహార ఉత్పత్తిలో జీవవైవిధ్యం, పోషకవిలువలు, ఇంధన రంగాలలో భరోసా. ఈ పథకం ప్రయోజనాలు 3000 కుటుంబాలకు చేరవేయాలనేది లక్ష్యం. ప్రస్తుతానికి 3,249 రైతు కుటుంబాలతో కలిసి వివిధ కార్యకలాపాలను ఈ సంస్థ చేపడుతోంది. ముఖ్యంగా చిన్న తరహా దేశీయ మహిళా రైతులకు మార్గదర్శకం చేస్తోంది. వీరిలో ఎక్కువ మంది షిఫ్టింగ్ పద్థతిలో సేద్యం చేస్తున్నారు. ప్రధానంగా వరి సాగు లేదా ఇండ్ల మిద్దెలపై సాగు చేపడుతున్నారు. వీరంతా స్థానిక విత్తన సంపదను కాపాడుతున్నారు. ఈ స్థానిక విత్తన సంపద అంతరించే ప్రమాదం ఎదుర్కొంటోంది. వాటిని పునరుద్ధరించడంతో పాటు విత్తన మార్పిడి కార్యక్రమాలు, స్థానికంగా కమ్యూనిటీ పరిధిలోనే విత్తన బ్యాంకుల నిర్వహణలో కూడా మహిళా రైతులు చురుగ్గా పాల్గొంటున్నారు.

సాధారణంగా వారాంతంలో జరిగే స్థానిక సంతల్లో తమ ఉత్పత్తులను విక్రయించుకుంటూ ఉంటారు. అందుకు అవసరమైన జాగాను కొందరు అద్దెకు తీసుకుంటారు. మరి కొందరు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటారు. ఇతరులు నేలపైనా లేదా పేవ్ మెంట్ల పైనా సరుకు అమ్ముకుంటారు. తమ దగ్గరికి వచ్చిన వ్యాపారులకు కూడా విక్రియిస్తారు. అయితే కోవిడ్ 19 ప్రభావం వల్ల ఈ తరహా అమ్మకాలకు గండి పడింది. మార్కెట్లు వారికి ఉపయోగపడకుండా పోయాయి.

ఈ సమస్యకు పరిష్కారాన్ని, దానితో పాటు దెబ్బతిన్న తమ జీవనోపాధికి ప్రత్యామ్నాయం కనుగొనే ప్రయత్నంలోనే ఫార్మ్ ఆన్ వీల్స్ రూపు దిద్దుకుంది. ఆపత్కాలంలో అందుబాటులోకి వచ్చిన ఈ వేదిక సాయంతో నేరుగా వినియోగదారులకు తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశాలు మెరుగయ్యాయి. అదే సమయంలో సుస్థిరమైన ప్రత్యామ్నాయ జీవనోపాధిని సమకూర్చుకోగలిగారు. దీని గురించి సూటిగా చెప్పాలంటే ఇది వాహనంలపై ఏర్పాటు చేసిన ఒక సంచార శాల. తాజా తాజా ఉత్పత్తులను వినియోగదారులకు చేరువగా తీసుకెళ్లేందుకు వీలుగా కొందరు రైతులు సమష్టిగా కలిసి ఇలా వాహనాలు ఏర్పాటు చేసుకుంటారు. వారానికి ఒకసారి కానీ, ఉత్పత్తి చేతికి అందిన తరువాత కానీ ఇలా వాహనాలను తెచ్చుకుంటారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 200 మంది రైతులు / 30 వరకు రైతు బృందాలు ఈ విధంగా సంచార వ్యవసాయ మార్కెట్ ను నిర్వహిస్తున్నారు. వీరిలో ఎవరికీ సొంతంగా వాహనాలు లేవు. అద్దెకు తీసుకోవాల్సిందే. అయితే వాహనం సమకూర్చుకునే ఆలోచన అయితే ఉంది. మార్కెట్ అవసరాలను ముందుగా గుర్తించి, ప్రణాళిక ప్రకారం ఈ వాహనాలను నడిపిస్తారు. సాధారణంగా వారంలో రెండు సార్లు ఈ వాహనాలు వినియోగదారుల ఇండ్ల ముందుకు వస్తాయి. కేవలం ఒకరిద్దరు మాత్రమే వాహనం వెంట వస్తారు. వారే ఇతరుల ఉత్పత్తుల విక్రయం కూడా చేపడతారు.  అవసరమైన ప్రమోషనల్ మెటీరియల్ అందించడంలో నెస్ ఫాస్ సహాయం చేస్తోంది. అంతేకాకుండా బుక్ కీపింగ్ గురించి అవసరమైన శిక్షణ కూడా ఇప్పిస్తోంది. డబ్బు రూపంలో కూడా సాయపడుతోంది. ఈ రైతుల ఉత్పత్తులలో అనేక రకాలున్నాయి. వంటకు ఉపయోగించే అటవీ ఉత్పత్తులు, బంగాళా దుంపలు, క్యారెట్స్, బీన్స్ వంచి సీజనల్ కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలు వారు పండించే వాటిలో కొన్ని. ఇలా ఉత్పత్తి చేసిన వాటిని సంచార వాహనాల ద్వారా కానీ, ఇటీవల కొన్ని ఆంక్షలు సడలించిన కారణంగా స్థానిక మార్కెట్లలోనూ అమ్ముకుంటున్నారు. కోవిడ్ నేపథ్యంలో నిర్దేశించిన సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే వారు తమ వ్యాపారాన్ని నిర్వహించుకోగలుగుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మార్కెట్ ను వినియోగదారులకు మరింత దగ్గరగా తీసుకెళ్లగలుగుతున్నారు. కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడంలో తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నారు.

అయితే కొన్ని సమస్యలు మాత్రం ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అదేమిటంటే – అసలే చిన్న కమతాల రైతులు, వారు ఉత్పత్తి చేసే పరిమాణం వ్యాపార స్థాయి సరళిలో ఉండడం లేదు. సాగు చేయగా వచ్చిన కొద్ది పాటి దిగుబడిలో మిగులు ఏమైనా ఉంటే ఆ కొద్ది మాత్రమే మార్కెట్ కు తీసుకెడుతున్నారు. పది మంది రైతులు తమ ఉత్పత్తులను సమీకరించినా పెద్ద మొత్తంలో కూడటం లేదు. ఈ కారణంగా వారు అతి తక్కువ సమయాలలో మాత్రమే మార్కెట్ కు చేరుకోగలుగుతున్నారు.

ఈ సమస్య కారణంగా ఫార్మ్ ఆన్ వీల్స్ పథకం కింద సమష్టిగా మార్కెట్ కు వెళ్లి తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు మెరుగైన పరిష్కారంగా నిలిచింది. ఇదే విధానం అనుసరించేలా రైతులను మెస్ ఫాస్ ప్రోత్సహిస్తోంది. పరిసరాలలోని రైతులకు కూడా అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో మేఘాలయలోనే జైన్తియా హిల్స్ ప్రాంతపు రైతులు సొసైటీ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎంపవర్ మెంట్ (SURE – గ్రామీణ, పట్టణ ప్రాంత సాధికారికత సొసైటీ) సహకారంతో రైతులకు, వినియోగదారులకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే కృషి ప్రారంభించారు. వీరికి స్థానికంగా ఉన్న ఆన్ లైన్ వేదిక ‘Sillad’ (https://syllad. com/store) కూరగాయల  విక్రయంలో తోడ్పడుతోంది. ఇది కూడా నెస్ ఫాస్ భాగస్వామ్యంతో పనిచేస్తున్న లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థయే. రైతులకు అండగా నిలుస్తున్న సల్లాడ్ వేదికతో అనుసంధనమై నెస్ ఫాస్ పర్యవేక్షణ చేస్తుంటుంది. రైతుల నుంచి వారి ఉత్పత్తుల సమీకరణకు తోడ్పడుతుంది. ఈ రకంగా సేకరించిన ఉత్పత్తులను ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పేరుతో సిల్లాడ్ ఆన్ లైన్ స్టోర్ ద్వారా విక్రయిస్తుంది. ఇతర వివరాలకు ఆ వెబ్ సైట్ సంప్రదించాల్సి ఉంటుంది. పట్టణ, గ్రామీణ ప్రాంత వినియోగదారుల ఇంటికి ఈ విధంగా చేరవేయడం సాధ్యమవుతోంది. రైతులు కూడా ప్రయోజనాలు గమనించిన తరువాత తమ పెరటి తోటల్లో లేదా మిద్దెలపై చేపట్టే తోటల పెంపకంలో మరింత ఆరోగ్యదాయకమైన ఉత్పత్తులను సాగుచేసేందుకు ముందుకు వస్తున్నారు. స్థానిక విత్తనాలనే వారంతా ఉపయోగిస్తున్నారు. అవసరమైన వారికి అందజేస్తున్నారు.

గారో హిల్స్ పరిసరాలలోని రైతు బృందాలు వైవిధ్యంతో కూడిన పెరటి తోటల పెంపకాన్ని ఇప్పుడు కమ్యూనిటీలకు కూడా విస్తరిస్తున్నారు. శుద్ధమైన, స్థానికమైన, పోషక విలువలతో సమృద్ధమైన ఆహారం అందించి ప్రజల రోగనిరోధక శక్తిని కూడా పెంపొందించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుత కోవిడ్ 19 కరోనా నేపథ్యంలో ఆహార భద్రత చేకూర్చేందుకు, జీవనోపాధులను కాపాడుకునేందుకు వారు చేపట్టిన కృషి మంచి ఫలితాలనిస్తోంది. వీరు అనుసరిస్తున్న విధానంలో స్థానికంగా లభించే ఆహారం, జీవనోపాధులకు పూర్తి భరోసా లభిస్తోంది. రైతులు స్వయం సమృద్ధిని సాధించేందుకు స్వయంకృషినే ఆసరాగా చేసుకున్న తీరు వారిలో సాధికారికతను మరింత చేస్తోంది. ఇక్కడి రైతుల ఆశయమూ ఇదే. అయితే ఇటీవల అందుకు సరైన అవకాశాలు కనిపించడం లేదు. అంతా భారీ స్థాయి ఉత్పాదన, కేంద్రీకృత పారిశ్రామిక పంథాలో వ్యవసాయ పంటలు పండించడం పెరుగుతున్న నేటి వాతావరణంలో వీరి కృషి ఆదర్శనీయం.

జనక్ ప్రీత్ సింగ్
సీనియర్ అసోసియేట్, జీవనోపాధులు (లైవ్ లీహుడ్స్)
నెస్ ఫాస్, షిల్లాంగ్
E-mail: janak.nesfas@gmail.com

Recent Posts

బీడు భూముల నుండి సంపద దిశగా  వాతావరణ స్థితిస్థాపకత వైపు ఒక ప్రయాణం

బీడు భూముల నుండి సంపద దిశగా వాతావరణ స్థితిస్థాపకత వైపు ఒక ప్రయాణం

సాలిక్స్ (విల్లో) తోటలను, పప్పుజాతి అంతరపంటలను మరియు అధిక విలువగల ఉద్యానవన పంటలతో అనుసంధానించే వ్యవసాయ అటవీ ఆధారిత...