పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాలకు చెందిన రైతులు ఎంతో చైతన్యవంతులుగా, ఉత్సాహవంతులుగా కనిపిస్తున్నారు. నిజానికి వారి చుట్టూ చాలా సమస్యలున్నాయి. లాక్ డౌన్ సమయంలో రవాణా సౌకర్యం పూర్తిగా స్థంభించిపోయిందది. అవికాక, మిడుతల దండు దాడి చేసి పంటలను సర్వనాశనం చేసే స్థాయికి పెరిగాయి. ఇంకా చాలా ఇబ్బందులే ఉన్నా వారు సేద్య రంగంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు.
“2020 సంవత్సరం మాకు ఎన్నో సమస్యలను, కష్టనష్టాలను తెచ్చిపెట్టిన దురదృష్టకరమైన సంవత్సరం. ” అంటున్నారు బికనూర్ జిల్లా గోడు గ్రామానికి చెందిన సదాసుఖ్ బెనివాల్. కోవిడ్-19 వైరస్ తీవ్రత దేశమంతటా భయంకరమైన పరిస్థితులకు దారితీసింది. అయితే ఈ సమస్య భారత్-పాక్ సరిహద్దు గ్రామాల ప్రటలకు మరింత దారుణ ప్రభావానికి కారణమైంది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసాయి. నిజానికి ఈ ప్రాంతమంతా రాజస్తాన్ లోని ఎడారి ప్రదేశంలో ఉంటుంది. జై సల్మేర్ జిల్లాలో వర్షపాతం సాధారణ స్థాయి కన్నాఅధికంగా అంటే మిగులు స్థాయిలో కురిసిందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది.
జైసల్మేర్ జిల్లాలోని, ఇంకా సరిహద్దుల పరిసరాలలోని రైతులు మార్చి నెల వచ్చే సరికి వర్షాలు సమృద్ధిగా కురవడంతో మంచి ఊపు మీద ఉన్నారు. కానీ అదే నెలలో దేశమంతటా లాక్ డౌన్ ప్రకటన వెలువడింది. ఒధనియా గ్రామానికి చెందిన మహిళా రైతు లక్ష్మీ దేవి తనకు ఎదురైన పరిస్థితిని ఇలా వివరించారు. ‘లాక్ డౌన్ ప్రకటన రాగానే స్థానికంగా నిరంతరం నిర్వహించే మండీలు మూతబడ్డాయి. సమీపంలోని బికనీర్ లేదా జైసల్మేర్ మండీలలో ఖరీఫ్ సీజన్ కు అవసరమైన విత్తనాల క్రయవిక్రయాలు అసాధ్యంగా మారింది. పూర్తిగా ఇతర పరిసర గ్రామాలపైనే ఆధారపడవలసి వచ్చింది. పోఖారన్ మండీ కొంత వరకు అండగా నిలిచింది.’
లక్ష్మీ దేవి, మరెందరో రైతులు తమ పొలాల్లో ఒకదాని తరువాత మరొకటిగా పంటలు పండించే విధానం (సీక్వెన్షియల్ క్రాపింగ్) అనుసరిస్తున్నారు.ఈ ఏడాది ఈ విధానం బాగా కలిసొచ్చింది. ‘లాక్ డౌన్ వరకు అంతా సవ్యంగా సాగింది. ఆ తరువాత సరిహద్దు ప్రాంతాలపై మిడతల దాడి గురించి సమాచారం అందింది. మేమంతా చాలా అందోళన పడ్డాం. అది ఇంకా ఖరీఫ్ సీజన్ ప్రారంభ సమయం. చేనులో మేమంతా విపరీతంగా కష్టపడి సాగు చేస్తున్నాం. ఆ సమయంలో పంటలు మిడుతల దాడి కారణంగా నష్టపోవడాన్నిన ఊపించుకోలేకపోయాం.’ అయితే అదృష్టవశాత్తూ, లక్ష్మీ దేవి పొలంలో కానీ, మొత్తం గ్రామంలో కాని అంతగా వాటి ప్రభావం కనిపించలేదు. ఇతర గ్రామాలలో వారికి అవి తీవ్ర నష్టాలు కలిగించాయి. తాము అనుసరించిన వరుసక్రమంలో సాగు విధానమే తమ పంటను కాపాడిందని ఆమె ఎంతో నిబ్బరంగా ఇప్పుడు చెబుతున్నారు. ‘ఇదివరలో ఈ విధంగా మిడుతల దాడులు చాలా తక్కువ స్థాయిలో ఉండేవి. ఎప్పుడైనా, ఏదైనా చీడపీడలు ప్రమాదకరంగా ఎదురైతే, ఏవో కొన్ని పంటలు మాత్రమే నష్టపోయేవాళ్లం. అందుకు కారణం, అప్పట్లో మా పూర్వీకులు అనుసరించిన విధానమే. వారు మాకు బహుళ పంటల సాగు పద్ధతులనే నేర్పారు. కొన్ని పంటలకు చీడల బెడద ఎదురయ్యేది. మరి కొన్ని పంచలువాటిని సమర్థవంతంగా తట్టుకుని పారద్రోలగలిగేవి. అలా కొన్ని పంటల ఫలితాలైనా మాకు చేతికి వచ్చేవి.’ అని లక్ష్మీ దేవి వివరించారు. ఈ అభిప్రాయంతో అక్కడి రైతులు చాలామందే అంగీకరించారు. ఈ ఏడాది ఇలా బహుళ పంటల విధానం అనుసరించిన రైతుల పొలాలకు చీడలు సోకాయి. వారంతా పెద్ద ఎత్తున క్రిమిసంహారకాలు ఉపయోగించినవారే. బీకనూర్ జిల్లా ఫులాసర్ గ్రామానికి చెందిన రైతు ప్రేమ్ రామ్ (62 సంవత్సరాలు) తన అనుభవాన్ని ఇలా వివరించారు. ‘ఇలా చీడల సమస్యను చాలా సీజన్లలోనే ఎదుర్కొన్నాం. ఎడారి ప్రాంతమైన మా భూములలో ఏదో విధంగా సత్ఫలితాలనే సాధించాం. కానీ, బహుళ పంటల సాగు చేపట్టినప్పుడు వీటి ప్రమాదం తక్కువగా ఉండేది. మార్కెట్ లో లభించే విత్తనాలను ఉపయోగించేవాళ్లం కాదు. వేప విత్తనాలతోనూ, ఆవు మూత్రంతోనూ తయారుచేసిన నీమాస్త్ర్ర మా పంటలకు ఎంతో రక్షణ కల్పించేది. సేంద్రీయ ఎరువులుగా క్రిమిసంహారకాలుగా ఇలాంటివాటినే ఉపయోగించేవాళ్లం. అవి మా పంటలకు శ్రీరామ రక్షలా కాపాడేవి.’
లక్ష్మీ దేవి ఇంకా మరి కొందరు రైతులు తమకున్న కనీసపు 25 బిఘాల పొలంలో సేద్యం చేసేవారు. లాక్ డౌన్ పరిణామాలపై వాళ్లందరిలో చాలా భయాందోళనలు ఉండేవి. ‘మాకుటుంబం అంతా సేద్యంలో లభించే ఫలసాయంపైననే ఆధారపడింది. అప్పుడప్పుడు ఇతరుల చేనుల్లో కూలీ పనులు చేసుకునే వారు. అయినా కూడా మా జీవితాలపై కరోనా ఎలాంటి దుష్పరిణామాలు చూపించలేకపోయింది. మాకెదురైన ఏకైక సమస్య అల్లా మార్కెట్ కు వెళ్లి మా ఉత్పత్తులను విక్రయించలేకపోయాము. అలాగే మార్కెట్ నుంచి విత్తనాలు కొనుగోలు సాధ్యం కాలేదు. ’ అని ఆమె తెలియజేశారు.
ప్రపంచమంతటా కరోనా కారణంగా భయాందోళనలు చెలరేగుతుంటే, రాజస్తాన్ లోని ఎడారి ప్రాంతాలకు చెందిన ఈ రైతులు సంప్రదాయక సేద్య విధానాల ద్వారా తమ కష్టాలకి తగిన ఫలితాలు అందుకోగలుగుతు తమ కాళ్లపై తాము నిలబడ్డారు. సొంత విత్తనాలు, నీమాస్త్ర్ర లాంటి సంప్రదాయక ఎరువులు, కాటనాశక్ వంటి క్రిమిసంహారకాలు ఉపయోగించి ఉత్తమ ఫలితాలు సాధించారు. తమ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లలోనే విక్రయించుకుంటా ఆదాయం స్థిరంగా ఉండేట్లు చూసుకోగలిగారు.
బజ్జు తేజ్ పురా గ్రామానికి చెందిన యువకుడు ఓం ప్రకాశ్ స్థానికంగా పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తుంటాడు. ఆయన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ‘కోవిడ్ సమయంలో బతుకు తెరువు కోసం పట్టణాలకు వెళ్లిన వలస కూలీలు ఎదుర్కొన్న స్థాయిలో వ్యతిరేక పరిణామాలు ఏవీ రైతులను ఇబ్బింది పెట్టలేదు. కొంతమందికి వ్యవసాయ రంగంలో వెంటనే ఉపాధి దొరికింది. కొంత మంది పంటల కాలం దాటిన తరువాత లభించే అవకాశాల కోసం వేచి చూడవలసి వచ్చింది.’ కోలాయత్ తహసీల్ (బికనూరు జిల్లా) లేదా పోఖారన్ తహసీలుకు చెందిన గ్రామాలు ఇలాంటి వలస కూలీలను ఆదుకుని తమ పొలాల్లో పనులు కల్పించి చేయూతనిచ్చాయి. ఒకప్పుడు మరు భూములుగా ఎడారుల్లా ఉన్న గ్రామాలలో కూడా ఈ ఏడాది వ్యవసాయం మంచి ఊపు అందుకుంది. మినపపప్పు, వేరుశెనగ వంటి పంటలను సాగుచేయడం ప్రారంభించారని సదాసుఖ్ బెనివాల్ తెలియజేశారు. ‘పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులను గెంటివేస్తుంటే గ్రామీణ భారతం ప్రకృతి మాత సాయంతో వారిని అక్కున చేర్చుకుంది. చేర్చుకునేందుకు సిద్ధంగా ఉంది.’అంటూ ఆయన ఎంతో సంతోషంగా ప్రకటించారు. ‘అయినా చాలా మంది పట్టణాలవైపే చూస్తున్నారు. అలాంటి వారు గ్రామాలను నమ్మి అక్కడే ఉపాధి చూసుకోవడం అన్ని విధాలా మంచిదని’ ఆయన స్వాగతం పలికారు. ‘కొంత మంది పట్టణాలు విడిచి పల్లెలకు చేరుకుంటున్నారు. వారు మాకు ఇంటర్నెట్ ద్వారా మరిన్ని మార్కెట్ అవకాశాలు సమకూర్చడంలో తోడ్పడేందుకు ముందుకు వస్తున్నారని, అలాంటి వారి సహాయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని’ ఆయన తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఓం ప్రకాశ్ ఇలా వివరించారు. ‘కోవిడ్ ప్రభావం తరువాత, అంతకుముందూ కూడా థార్ ఎడారి ప్రాంతాల రైతులు ఖరీఫ్ పంటలను సాగుచేసేవాళ్లే. పంటలను తగులబెట్టుకోవలసిన పరిస్థితి ఎన్నడూ లేదు. ’అన్నిటికన్నా పెద్ద సమస్య కనీస మద్దతు ధర (ఎంఎస్ పి) లభించకపోవడమే. గోడు గ్రామానికి చెందిన దుర్జన్ సింగ్ తన అనుభవాలు వివరిస్తూ, ‘ఎప్పుడూ వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురవుతూనే వచ్చింది. అందుకు చీడపీడలను తప్పుపట్టాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరూ అలా చీడపీడలను ఒక సాకుగా చూపిస్తున్నారు.‘ చాలా మంది రైతులు తమ ఉత్పత్తులను ప్రభుత్వానికి విక్రయించుకోలేకపోయారు. అందుకు ఎంఎస్ పి కల్పనలో సహాయకారిగా ఉన్న ఆన్ లైన్ వేదికలన్నీ మూతపడడమే అని ఓం ప్రకాశ్ తెలిపారు. అలాంటి సమయంలో ఇక్కడి రైతులకు స్థానిక తాలూకా హెడ్ క్వార్టర్ లోని స్థానిక మండీలు, రైతులు ఏర్పాటుచేసుకున్న గ్రామస్థాయి ఎక్స్చేంజీలే. అండగా నిలిచాయి.
అనేక విధాలుగా ఈ ఏడాది సమస్యాత్మకంగానే సాగినా, అక్టోబర్లో జరగాల్సిన పంచాయత్ ఎన్నికల తరువాత ఎదురయ్యే కొత్త సమస్యలు ఎక్కువ భయపెడుతున్నాయి. అభ్యర్థులు రైతుల సమస్యలను గుర్తించి, పరిష్కారాల కోసం కృషి చేస్తామని హామీ ఇస్తున్నారని సదాసుఖ్ తెలియజేశారు. ఆధునిక సాంకేతికత అవసరాన్ని కూడా వారంతా గుర్తించి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఆన్ లైన్ వేదికలైన ఎంఎస్ పి పోర్టల్, అమెజాన్, తదితర వేదికలను అందుబాటులోకి తెచ్చేందుకు వారంతా ఉత్సాహం చూూపిస్తున్నారని ఆయన వివరించారు.
మొత్తం మీద థార్ ఎడారి ప్రాంతంలోని రైతులనుంచి ఒక పక్క ఆనందం, మరో పక్క ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంతవరకు తాము అనుసరిస్తున్న సంప్రదాయ సేద్య పద్ధతులలోనే పరిష్కారాల కోసం వారంతా ఎదురుచూస్తున్నారు.
రితూజా మిత్రా రీసెర్చి కన్సల్టెంట్, ఉర్ముల్ ట్రస్టు ఉర్ముల్ భవన్, బికనీర్ - 334 001 రాజస్తాన్ E-mail: rituja.mitra18_dev@apu.edu.in



