కోవిడ్ – 19 కరోనా వైరస్ పెనుభూతం మన దేశంలో విజృంభించిన అనంతర కాలంలో లాక్ డౌన్ నిబంధనలు, ఆంక్షలు మళ్లీ మళ్లీ విధించకతప్పలేదు. ఫలితంగా వ్యవసాయ రంగం అత్యంత తీవ్ర స్థాయిలో దుష్ఫలితాలను ఎదుర్కోవలసి వచ్చింది. వాస్తవ పరిస్థితి ఏమిటంటే మన దేశంలోని 55 శాతం జనాభాకు ఆహార రంగమే ఉపాధి కల్పిస్తోంది. మన దేశపు మొత్తం స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి)లో 17 శాతం ప్రయోజనాలు సేద్య రంగం నుంచే లభిస్తోంది. ఇంత కీలకమైన వ్యవసాయ ఉత్పత్తులను సాఫీగా, సజావుగా దేశ ప్రజలందరికీ సరైన సమయానికి చేరవేయడం చాలా అవసరం. ఈ ఒక్క అంశంపైనే ప్రజలందరికీ ఆహార భద్రత, పోషక పదార్థాల భద్రత ఆధారపడి ఉంటుంది.
ఆరోగ్యపరంగాను, విద్యారంగ పరంగానూ మాత్రమే కాకుండా మరెన్నో విధాలుగా సేద్య రంగం కీలకంగా మారింది. భారత దేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ 2030 నాటికి సాధించాలని కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నాయి. సస్టయినబుల్ డెవలప్ మెంట్ గోల్స్ పేరుతో చాలా దేశాలు 2030 నాటికి కొన్ని లక్ష్యాలు సాధించాలనే సంకల్పంతో ఉన్నాయి. ఈ సమయంలో ఇండియా కానీ, మరే ఇతర దేశమైనా అక్కడి ప్రభుత్వాలు ఆహారోత్పత్తుల సక్రమ సరఫరా వ్యవస్థలను నడిపించగలవు? అనేది చాలా పెద్ద ప్రశ్న. కోవిడ్ 19 దుష్పరిణామాలనుంచి తమ దేశ ప్రజలకు ఆహార, పోషక పదార్థాల భద్రతను అందించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది మరో ప్రశ్న.
మొబైల్ ఫోన్ సాయంతో సేద్య విస్తరణ చర్యలు
సాంకేతిక రంగం మెళకువలను వ్యవసాయదారుకు చేర్చడంలో ఒక వర్గం ప్రజలు కీలక పాత్ర నిర్వహిస్తూ ఉంటారు. సేద్య రంగంపై పూర్తి అవగాహన ఉండి రైతుకు చేదోడుగా నిలిచే వర్గమే ఫీల్డ్ ఎక్స్ టెన్షన్ వర్కర్స్ లేదా అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లు గా గుర్తింపు పొందారు. ఎన్నో రాష్ట్రాలలో వ్యవసాయ శాఖ వీరిని నియమిస్తుంటుంది. ఇటీవలి కాలంలో కొన్ని సంస్థలు అభివృద్ధి సాధనకు చేయూతం ఇస్తున్నాయి. ఇవి కూడా ఇలాంటి నిపుణులను ఆయా చోట్ల నియమిస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వం నియమించిన విస్తరణ అధికారులు లేదా కార్యకర్తలు ఇంకా అడుగు పెట్టని మారుమూల ప్రదేశాలలో వీరి కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి.
సాగు విస్తరణ కృషిలో కోవిడ్ – 19 కారణంగా సామాజిక దూరం పాటించాలన్న నిబంధన పెద్ద అడ్డంకిగా ఉంటుంది. గ్రామాలలో పర్యటిస్తూ రైతులను సమీకరించి ఈ అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. సామాజిక దూరం పాటించాలని నిర్బంధిస్తే వారి కార్యకలాపాలు సాఫీగా సాగవు. రైతులను సమీకరించి వారికి శిక్షణ ఇవ్వాలన్నా, వ్యవసాయదారుల సామర్థ్యం పెంపు అవగాహన కల్పించాలన్నా కష్టమే అవుతుంది. అయితే మొబైల్ ఫోన్ లు ఈ సమస్యకు పరిష్కారంగా నిలుస్తున్నాయి. భవిష్యత్తుకు ఆశాదీపంలా కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ఇటీవల జరిపిన అధ్యయనాలు ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. ఇటీవలి కాలంలో మన దేశంలో ఇలా ఫోన్ ల ఆధారిత ఈ-ఎక్స్ టెన్షన్ కార్యకలాపాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఇంకా ఆవిష్కరణ దశలోనే ఉన్నాయి. రైతులకు సమాచారం చేరవేసేందుకు కానీ, శిక్షణ ఇచ్చేందుకు కానీ ఇదే ఏకైక మార్గం అనే స్థితి ఇంకా రాలేదు. నేటి పరిస్థితులలో ఫోన్ లు, మొబైల్ నెట్ వర్క్ ద్వారా మాత్రమే రైతులకు సరైన సూచనలు సరైన సమయానికి అందించడం సాధ్యమవుతోంది.
ఒక్క ఫోన్ – ఎన్నో సేవలు
కూలీల సేకరణ, యంత్ర సాయం, ఇంకా ఎన్నో …
రైతుల పంట చేనులో ఉత్పత్తి అయిన ఆహారం ప్రజల నోటి ముందుకు చేరే లోపున ఎంతో మంది ఎన్నో రకాలైన సేవలు అందించాల్సి ఉంటుంది. ఉత్పత్తిదారులు, వినియోగదారులు, వ్యవసాయ లేదా చేపల పెంపకం అవసరాలు తీర్చే వాళ్లు, వాటిని శుద్ధి చేసే వర్గం, రవాణా వ్యవస్థలు, ఇలా ఎందరి ప్రమేయమో తప్పనిసరి. ఇండియా లాంటి దేశాలలో 80 శాతం రైతులు చిన్న కమతాలు ఉన్న వాళ్లే. (గట్టిగా రెండు ఎకరాలు కూడా లేని వాళ్లే.) అదే సమయంలో వారి అవసరాలను తీర్చే వ్యవస్థలు అంటే ఇన్ పుట్స్ సరఫరా చేసే వాళ్లు (అది విత్తనాలు కానీ, ఎరువులు కానీ, రసాయనాలు కానీ) ఇంకా ఉత్పత్తిని వినియోగదారులకు చేరవేయవలసిన వాళ్లు చాలా ఎక్కువ ప్రభావం ఉన్న వాళ్లు. ఒక రకంగా వీరంతా మధ్య దళారీల స్థాయిలోనే అనుసంధానం కలిగి ఉండి అటు రైతుకు, ఇటు వాడకందారుకు మధ్య ప్రధానమైన లింకుగా వ్యవహరిస్తుంటారు.
ప్రధానంగా ఆహార సరఫరా వ్యవస్థ పట్టణ ప్రాంతాలకే పరిమితమై ఉంటుంది. అందువల్ల మొదలంటా ఆటోమేషన్ వ్యవస్థ కానీ, యాంత్రికీకరణ కానీ ఏర్పడి ఉండవు. అందువల్ల ఎక్కువ భాగం మానవ ప్రమేయంతో కార్మిక శక్తిపైనే ఆధారపడి ఉంటుంది. ఫలితంగా అది స్థానికంగా లభించే కార్మిక శక్తి వనరులపైనే ఆధారపడి పనిచేస్తుంది.
లాక్ డౌన్ ల కారణంగా ఈ కార్మిక సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మనం తరచుగా కూలీల కొరత రైతులను వేధిస్తుండడం గమనిస్తూనే ఉంటాం. ఈ సమస్య కారణంగా కోతలు సకాలంలో చేపట్టలేకపోవడం కూడా వినిపిస్తూనే ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవడం ఒక కారణంగా. కాగా స్థానికంగా ఉండే కూలీల విషయంలో అమలులో ఉన్న ఆంక్షలు మరో కారణం. ఈ రెండు కారణాల వల్లనే ఈ సమస్య తీవ్రమయింది.
గత కొద్ది సంవత్సరాలుగా రైతులకు అవసరమైన వేళల్లో మాత్రమే యంత్రాలను అందజేసే సేవారంగం వాడుకలోకి వచ్చింది. అది కూడా దేశంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంటోంది. వీటిలో ఎక్కువ భాగం స్టార్ట్ అప్ సంస్థలే. వాటికి ఉన్న గిరాకీ లేదా సరఫరా అవకాశాలు డిజిటల్ ప్లాట్ ఫారమ్స్ పైనే ఆధారపడి ఉన్నాయి. అవసరమైన చోటికి మాత్రమే అందించగలిగినప్పుడే వారికి లాభసాటిగా ఉంటుంది. రైతులకు కూడా తక్కువ ఖర్చులో వాటి లభ్యత ఉంటుంది. చాలా కొద్ది చోట్ల మాత్రమే డ్రోన్ ఆధారిత సేవలు లభిస్తున్నాయి. ముఖ్యంగా రసాయనిక ఎరువులను వెదజల్లే విషయంలో డ్రోన్లు ఉపయోగిస్తున్నారు.
అయితే ఈ తరహా సేవలు ఆర్థికంగా అందుబాటులో లేకపోవడం ఇబ్బందులు కలిగిస్తోంది. అదే సమయంలో స్థానికంగా లభించే కార్మికులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు సమకూర్చుకోవచ్చు. కానీ ఈ యాంత్రిక సాయం ఒకరి తరువాత మరొకరు మాత్రమే అందుకోగలుగుతారు. ఈ రకంగా చిన్న కమతాల రైతులకు ఇవే ఉపయోగకరంగా కనిపిస్తున్నాయి. కానీ తాజాగా కూలీల సమస్య వచ్చిన తరువాత అడిగిన వేళల్లోనే లభించే ఈ సేవలకు కాస్త గిరాకీ పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, లేదా అభివృద్ధి దోహద సంస్థలు డిజిటల్ ప్లాట్ ఫారమ్స్ ఆధారిత సేవల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చే అంశాన్ని తక్షణ పరిష్కారంగా పరిశీలించాల్సి ఉంది. అప్పుడే కూలీల సమస్యకు కొంత పరిష్కారం ఉంటుంది. ఉదాహరణకు అవసరమైన రైతుకు అవసరమైన కూలీల సరఫరా విషయంలో డిజిటల్ ప్లాట్ ఫారమ్ ఉపయోగపడుతుంది. ఈ ప్లాట్ ఫారమ్ సాయంతో సామాజిక దూరం పాటిస్తూనే కావలసినంత మందిని కూలీకి నియమించుకోవచ్చు. ఆ విధంగా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. ఇలా చేయడం వల్ల స్థానిక కూలీల మార్కెట్ లో ఎక్కువ మంది గుమికూడడం, వారిలో వైరస్ వ్యాప్తి భయాలు ఉండవు.
డిజిటల్ ప్లాట్ ఫారమ్ వాడకం వల్ల మరో ప్రయోజనం అనుకోకుండా కలుగుతున్నట్లు గమనించారు. అవ్యవస్థీకృత మార్కెట్లను వ్యవస్థీకృతంగా సంఘటితంచేయవచ్చని తెలిసింది. ఆయా ప్రాంతాలలోని ఆర్థిక వ్యవస్థ అదే స్థాయిలో పటిష్టమవుతుంది. ప్రభుత్వాలకు ఆసక్తి ఉన్న సమాచారం తేలికగా అందుతుంది. వ్యవసాయ కూలీల సంక్షేమానికి అవసరమైన మరికొన్ని చర్యలను చేపట్టేందుకు తోడ్పడుతుంది.
మార్కెట్ల వికేంద్రీకరణ, సామాజిక దూరం పాటింపు సాధ్యం
కార్మిక సంబంధ వివాదాలు ఉత్పత్తి రంగాన్ని మాత్రమే కాకుండా పరిసరాలలోని ఇతర అంశాలు, మార్కెటింగ్ రంగాలను కూడా ప్రభావితం చేస్తుంటాయి. ఈ విషయం ఆహార సరఫరా చెయిన్ లో ప్రధానమైన స్థానిక మార్కెట్లు లేదా మండీలలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది.
మన దేశంలో సంప్రదాయక మండీలలో జనసమ్మర్ధం ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. పంటల కోత సమయంలో ఈ రద్దీ మరీ ఎక్కువ. ప్రభుత్వాలు రద్దీని క్రమబద్ధీకరించేందుకు తమ వంతు చర్యలు తీసుకుంటున్నాయి. రైతులు, వ్యాపారులు, దుకాణాదారులు గుమికూడదంటూ ఆంక్షలు విధిస్తున్నాయి. ఉదాహరణకు పంజాబులోను, హర్యానాలోనూ మండీలలోకి వచ్చే వారికి టోకెన్లు జారీ చేస్తున్నారు. వాటిలో పేర్కొన్న సమయానికే రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ కి చేర్చాలి. అలాగే మండీలలో అమ్మకానికి పెట్టే సరుకు పరిమాణంపై కూడా పరిమితులు విధిస్తున్నారు. అయితే ఇది రైతులకు ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా రైతులు తమ ఉత్పత్తులను మండీలకు తరలించేందుకు కూలీలపై ఆధారపడాలి. పంట బండ్లకు ఎక్కించడం, తిరిగి మండీ దగ్గర దించడం వంటి పనులకు కూలీలు అవసరం. ఈ క్రమంలో మండీలలో పనులు గందరగోళంగా మారుతున్నాయి. ఇలా రకరకాలుగా ఎదురయ్యే సమస్యలను మొత్తంగా చూసినప్పుడు మాత్రమే ప్రజలకు ఆహార భద్రత కల్పించడంలో ఇలాంటి చిన్న చిన్న సమస్యల అంతిమ ప్రభావం అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. వేటికవి చూస్తే చిన్నవిగానే కనిపిస్తాయి.
మన దేశంలో వ్యవసాయాధారిత ఆర్థిక అంశాల నిపుణుడు డాక్టర్ రమేశ్ చంద్ విధాన నిర్ణయాల రూపకల్పనలో కూడా ప్రముఖ పాత్ర నిర్వహిస్తూ ఉంటారు. ఆయన ఇచ్చిన ముఖ్యమైన సలహా ఏమిటంటే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (APMC) చట్టంలో మార్పు చేయాలని. ఈ సలహా ప్రకారం – చట్టంలో తగిన విధంగా మార్పు చేస్తే వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను తమ పంట పొలంలోనే విక్రయించుకునేందుకు చట్టబద్ధమైన అనుమతి లభిస్తుంది. ఇలా చేయడం వల్ల ఆహార సరఫరా చెయిన్ లో ఎదురయ్యే ఎన్నో ఆటంకాలను నివారించవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. మండీల పని తీరు, జన సమ్మర్దం అన్న రెండు సమస్యలు పరిష్కరించవచ్చు.
కరోనా నేపథ్యంలో ఏపీఎంసీ చట్టంలో మార్పులు తీసుకువస్తే డిజిటల్ ప్లాట్ ఫారమ్ ల ప్రాధాన్యం మరింత పెరుగుతుంది. మార్కెట్ వికేంద్రీకరణకు, పొలంలోనే ఉత్పత్తుల విక్రయ సదుపాయాలు ఏకకాలంలో సాధ్యమవుతుంది. ఉదాహరణకు, డిజిటల్ ప్లాట్ ఫారమ్స్ సాయంతో సేద్య రంగం పురోగతిని, ఉత్పత్తి నాణ్యతను సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యవేక్షించడం సాధ్యమవుతుంది. సేకరణ, ప్యాకింగ్, రవాణా, సరఫరా వంటి అనేక కార్యకలాపాలను ఒక క్రమ పద్ధతిలో నిర్వహించవచ్చు. ఆ రకంగా కార్మికుల ఆరోగ్యం కాపాడవచ్చు. పనులు సకాలంలో పూర్తిచేయవచ్చు. రైతులు మండీలకు పరుగు పెట్టనక్కరలేదు. డిజిటల్ ప్లాట్ ఫారమ్ మీదే తన ఉత్పత్తులను విక్రయించేసుకోవచ్చు.
డిజిటల్ గా క్వాలిటీ అంచనాలకు, వాటిని గ్రేడింగ్ చేయడానికి, అంచనా వేయడానికి, విశ్వసనీయత పెంపునకు డిజిటల్ వేదికలవైపు మళ్లడం చాలా అవసరం. నాణ్యతా పరిరక్షణ, అంచనా అన్న అంశాలు ఆయా ఉత్పత్తులపై ఆధారపడి ఉంటాయి. ఈ విషయంలో మండీలలో లాబ్స్ ఏర్పాటుచేసి తోడ్పడేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మానవ ప్రమేయం ప్రధానమైన ఈ లాబ్ సాయం నుంచి వేరే మార్గాల కోసం ప్రయత్నిస్తున్నాయి. అయినా చాలా మంది వ్యాపారులు స్వయంగా ఉత్పత్తులను పరిశీలించి నిర్ధారించుకునేందుకే ఎక్కువ ఆసక్తిచూపిస్తున్నారు. పొలంలోనే విక్రయాలను అనుమతించాలంటే ముందుగా గ్రేడింగ్ ఏర్పాట్లు సమకూర్చాలి. అప్పుడే వ్యాపారులు గుమికూడే అవసరం తగ్గుతుంది. ఈ సమస్యకు పరిష్కారం దొరికే వరకు డిజిటల్ వేదికలు కొంత వరకు పరిష్కారంగా భావించవచ్చు.
ఇటీవలి కాలంలో రైతులు నేరుగా పట్టణ వాడకందారులతో అనుసంధానం అవుతున్న సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాలలోని కొన్ని స్టార్ట్ అప్ సంస్థలు చొరవ తీసుకుని పట్టణ పరిసరాలలో సాగు చేస్తూ తాజా సరుకు అందించేందుకు మార్గం సుగమం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట ప్రాంతంలో సుమారు వంద మంది రైతులు వాట్సప్ వేదిక ఆధారంగా హైదరాబాద్ లో ఉండే వినియోగదారులను ఆకట్టుకోగలిగింది. వీరికి మార్గదర్శిగా ఉన్న ఒక ప్రముఖుడు ఆర్డర్లను సమీకృతపరచి, వారికి సరఫరా చేయడానికి కృషి చేస్తున్నాడు. ఇలాంటి ఉదాహరణలను జాగ్రత్తగా గమనిస్తే సాదా సీదా డిజిటల్ వేదిక ఏ విధంగా ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు సంధానకర్తగా ఉపయోగపడగలదన్న అంశం నిర్ధారించుకోవచ్చు. సరళీకృత పద్ధతులు రూపొందిస్తే సాధారణ రైతు కూడా లబ్ధి పొందవచ్చు.
గిడ్డంగులను ఎక్కడికక్కడ ఏర్పాటుచేసి ఈనాం (eNAM) వేదికపై అమ్మకాలకు ప్రభుత్వం అవకాశాలు విస్తృతపరచవచ్చు. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న సంప్రదాయక పద్ధతులలో ఇది ఒకటి. అందుకు గ్రామాలలోను, మార్కెట్ కమిటీలోనూ చిన్నా, పెద్దా గిడ్డంగులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కూడా ముందుకు రావలసి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం వ్యవసాయ – గ్రామీణ అభివృద్ధి సంస్థ (నాబార్డు) విధానపరమైన చర్యలలో భాగంగా పరిశీలించాలి. ఇప్పటివరకు పల్లె ప్రాంతాలలో గిడ్డంగుల ఏర్పాటు ఇంకా వేగంగా సాగడం లేదు.
డిజిటల్ వేదికలతో అనుసంధానమైన గిడ్డంగులు ఏర్పడితే కనీస మద్దతు ధరలకే వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించడం మరింత తేలికవుతుంది. అలాగే విక్రయ ధరలను నేరుగా రైతుల ఖాతాలకు బదిలీ చేయవచ్చు.
డిజి సాధనంగా ఇన్ పుట్ సరఫరా చెయిన్ మార్పు
ఇన్ పుట్ సరఫరా చెయిన్ ద్వారానే రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, రసాయనాలు సకాలంలో అందుతాయి. ఈ రంగంలో అంతగా డిజిటల్ విప్లవం చొరబడలేదు. కారణాలలో – కరోనా వ్యాప్తి ఒకటి. పొలం నుంచి నోటికి ఆహారం అందించే సరఫరా చెయిన్ తో సమానంగా వీటి విషయంలో కూడా మధ్యవర్తిత్వ ధోరణి ఎక్కువ. విత్తనాల విషయంలో వ్యవస్థ సక్రమంగా లేదు. ఇతర ఇన్ పుట్ల విషయంలో లాక్ డౌన్ ప్రభావం అంతగా లేదు. కానీ కూలీల విషయంలో ఉన్న ఆంక్షలు, నిర్బంధాల ఒత్తిడి హెచ్చుగానే ఉంది. రవాణా రంగం కూడా ఒత్తిడికి గురయింది. వీటి ప్రభావాన్ని అదుపు చేసేందుకు ఈ-కామర్స్ వేదికలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. డేటా సేకరణకు, ఈ కష్టనష్టాల ప్రభావం తగ్గించేందుకు ఈ రంగాలలో కూడా డిజిటల్ వేదికలను ప్రోత్సహించడం అవసరం.
మరెన్నో సేవలు, ఈ-ఎక్స్ టెన్షన్ పనులు రైతులకు మరింత తేలికగా చేరవేసేందుకు ఈ-కామర్స్ వేదికలు చాలా ఉపయోగకరం. ఆర్థిక సంస్థలతో కూడా ఈ వేదికలను అనుసంధానం చేసినట్లయితే చిన్న కమతాలు ఉన్న రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చినట్లు అవుతుంది. మానవ ప్రమేయం తప్పనిసరి అయిన సంప్రదాయక వ్యవస్థలకు తోడుగా డిజిటల్ వేదికలను అందుబాటులోకి తీసుకువస్తే, కరోనా కారణంగా ఎదురవుతున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
మొత్తం మీద డిజిటల్ సాధనాలు, వేదికలు ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పాలి. చిన్న కమతం గాళ్లకు ఉపయోగపడే మరోన్నో సూచనలు వినిపిస్తున్నాయి.
గమనిక – విస్తృత అవకాశాల గురించి వివరించే సీజీఐఏఆర్ ప్లాట్ ఫారమ్ పై వెలుగులోకి వచ్చిన వ్యాసానికి ఇది సంక్షిప్తరూపం.
రామ్ ధూళిపాళ థీమ్ లీడర్ - డిజిటల్ అగ్రికల్చర్ & యూత్ ఇక్రిశాట్ హైదరాబాద్, ఇండియా



